2007 పుస్తకాల రీకాప్

2007 లో చదివిన పుస్తకాల్లో నాకు ఆసక్తి కలిగించిన పుస్తకాలను గురించి చెప్పడం ఈ టపా ఉద్దేశ్యం. (అంటే, పన్లోపనిగా పింగ్ బ్యాక్లు పెట్టి పాత వ్యాసాలను చదివేలా ప్రేరేపించడం పైకి చెప్పకూడని బహిరంగ రహస్యం.) కొత్త సంవత్స్రరం లోకి వచ్చి పదిహేను రోజులైతే ఇప్పుడు ఈ టపా ఏమిటీ? అనకండి… ఇప్పటికి కుదిరింది మరి! నాకీమధ్య పుస్తకపరిచయం కంటే, నెల నెలా పుస్తకావలోకనమే వర్కవుట్ ఔతుందేమో అనిపిస్తోంది 😦 విషయానికొస్తే, ఈ ఏడాది చదివిన పుస్తకాలలో నాకు ఆసక్తికరంగా అనిపించినవి, నన్ను నిరాశ పరిచినవి అని రెండు రకాలుగా క్లాసిఫై చేసుకుంటే, ఆ జాబితా ఇది. ఇవి కాక మిగితావి అంటే పెద్దగా లేవు కానీ, మిగితా పుస్తకాలను వదిలేశాను అంటే, అవి బాలేనివని కాదు… వాటిలోనూ బాగున్నవి ఉన్నాయి. జాబితా మరీ పెద్దదైపోతూ ఉంటేనూ…తగ్గించేసా.  మరిక చదవండి…. (తర్వాత ఎవరెవరి కర్మను అనుసరించి వారికి ఫలితాలు దక్కుతాయి.)

అసక్తికరమైనవి:
1. ఇండియా విన్స్ ఫ్రీడం – మౌలానా అబుల్ కలాం అజాద్:
చరిత్ర ప్రియులు తప్పక చదవవలసిన పుస్తకం. ఈ పుస్తకం గురించి ఇదివరలో ఓ సారి బ్లాగాను కూడా. కనుక మళ్ళీ ప్రత్యేకం రాయను. ప్రతి ఇంటి గ్రంథాలయం లోనూ ఉండాల్సిన పుస్తకం అని నా అభిప్రాయం.


2. టిప్పింగ్ పాయింట్ – మాల్కం గ్లాడ్వెల్:

ఈ పుస్తకం ఉన్నట్లుండి జరిగే కొన్ని సామాజిక మార్పులను అర్థంచేసుకోడానికి ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు ఉన్నట్లుండి ఏదో ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చేయడమూ, ఉన్నట్లుండి ఏదో సంచలనం జరిగిపోవడమూ ఇలాంటివి. ఇందులో తీసుకున్న కేస్ స్టడీలు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. దీని గురించిన వికీ పేజీ మీకు ఆసక్తి కలిగించవచ్చు.ఇక్కడ చదవండి.

3. రాజ్మోహన్స్ వైఫ్ – బంకిం చంద్ర ఛటర్జీ:

ఈ పుస్తకానికున్న చారిత్రకవిలువ గొప్పది. కారణం ఇది బంకిం రాసిన మొదటి నవల కావడం ఒకటి, ఆయన రాసిన ఏకైక ఆంగ్ల నవల కావడం మరోటి. భారతీయ ఆంగ్లసాహిత్యంలో తొలితొలి రచనల్లో అదొకటి కావడం ఇంకో కారణం. దీని గురించి కూడా ఇదివరలో బ్లాగాను. ఇది ఒక గొప్ప నవల అని నాకు అనిపించలేదు కానీ, చారిత్రకవిలువ ను బట్టి చూస్తే, ఇది చదవడం నా అదృష్టమనే భావిస్తున్నాను.

4. బెస్ట్ ఆఫ్ సత్యజిత్ రాయ్:
ఇది సత్యజిత్ రాయ్ కథల సంకలనం. కొన్ని కథల్ని బెంగాలీ నుండి గోపా మజుందార్ అనువదిస్తే, కొన్నింటిని సత్యజిత్ రాయే ఆంగ్లానువాదం చేసారు. ఈ పుస్తకం గురించి ప్రత్యేకం బ్లాగి పొరపాటు చేసి మ్యూసిండియా లో పెట్టాను. వాళ్లేమో దానికి లంకె తొలగించేసినట్లున్నారు.. అది అక్కడ లేదు. 😦 అయినప్పటికీ, ఇది కూడా ఒక మంచి పుస్తకం. కొని పెట్టుకుని మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనిపించే పుస్తకం. కథకునిగా సత్యజిత్ రాయ్ అన్నది సాధారణంగా ఓ కొత్త కోణం. పాఠకులని ఆయన ఏ కోశానా నిరాశపరచరు. ఈ తరహా కథల్ని రాయ్ తప్ప వేరెవరూ రాయలేరు అనిపించేంత నచ్చింది నాకీ పుస్తకం. మొదటిసారి నుండి ఇప్పటిదాకా ఆ పుస్తకంలోని కథల్ని ఎన్నిసార్లు చదువుకున్నానో కూడా లెక్కలేదు.

5. బటర్ టీ అట్ సన్రైస్ – బ్రిట్టా దాస్:
ఇది భూటాన్ లో జీవితం పై రచయిత్రి సొంత అనుభవాల సంకలనం. ఫిజియోథెరపిస్టుగా ఓ సంవత్స్రరం పాటు భూటాన్ లో గడపడానికి వస్తుంది రచయిత్రి. అప్పుడు తనకు కలిగిన అనుభవాల గురించీ, భూటాన్ ప్రజల జీవితం గురించీ ఈ రచన. దీని గురించి ఇక్కడ బ్లాగాను. పుస్తకం ఆసక్తికరంగా, చదివించేలా ఉంది. ఈక్షణం భూటాన్ వెళ్ళిపోదామా అనుకునేంతగా ప్రభావితం చేసింది నన్ను ఈ పుస్తకం 🙂

6. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు – విశ్వనాథ సత్యనారాయణ:
వేయిపడగలు దెబ్బకి అల్లాడుతున్న నన్ను మళ్ళీ విశ్వనాథ రచనల వైపు లాగిన పుస్తకం. పుస్తకం చదివినంతసేపూ బాగా ఆసక్తికలిగించింది. ఎక్కడికక్కడ హాస్యం బాగుంది. అసలా ఊహే – విష్ణుశర్మకి, తిక్కనకీ ఇంగ్లీషు నేర్పాలన్న ఆలోచనే నవ్వు తెప్పించేదైతే, కథ నడిచిన విధానం ఇంకా నవ్వు తెప్పించింది. దీని గురించిన బ్లాగు టపా ఇక్కడ.

7. ఆర్గుమెంటేటివ్ ఇండియన్ – అమర్త్య సేన్:
నేను ఈ పుస్తకం చదివే ముందు భయపడ్డాను – అమర్త్యసేన్ అంత మనిషి రాస్తే మన తలకెక్కుతుందా? అని. కానీ, ఈ వ్యాస సంకలనం అందరూ తప్పక చదవాల్సినది. నేను అన్ని వ్యాసాలూ చదవలేదు. కానీ, చదివిన వ్యాసాలు నాకు ఎన్నో విషయాలను చెప్పాయి, ఎంతగానో ఆలోచింపజేసాయి. సాధారణ మానవులకి అర్థమయ్యేలా రాయబడిన పుస్తకమనే చెప్పాలి. వ్యాసాలు కూడా మరీ అకడమిక్ వ్యాసాల తరహాలోకాక చదివించేలా ఉన్నాయి. అందుకే కాబోలు, ఈ పుస్తకం నాకు నచ్చింది.

8. కంప్లీట్ అడ్వెంచర్స్ ఆఫ్ ఫెలూదా (1 &2)- సత్యజిత్ రే:
వెల్, రెండు సంకలనాలు కలిపి 35 చిన్న సైజు నవల్లు. 🙂 ఫెలూదా అన్నది సత్యజిత్ రాయ్ షెర్లాక్ హోమ్స్ ప్రభావం లో సృష్టించిన డిటెక్టివ్ పాత్ర. అరవైల నుండి మొదలై దాదాపు పాతికేళ్ళపాటు బెంగాలీ టీనేజ్ పిల్లల అభిమానపాత్ర గా ఉండింది.  ఫెలూదా పుట్టి ఇన్నాళ్ళూ గడిచాక నాక్కూడా అది అభిమాన పాత్రే అనిపించింది ఆ సంకలనాలు పూర్తిచేసేసరికి. నేను రాయ్ రచనల వ్యామోహంలో పడి ఈ సంవత్సరం ఆయన రాసిందేది కనబడితే అది చదివేసి, ఓ వ్యాసంకూడా రాసి, కాస్తంత వివాదాస్పదం కూడా అయ్యాను కొద్దికాలం. తరువాత…. కొత్తవి దొరకలేదు రాయ్ వి! 😦 ఫెలూదా హోమ్స్ ని మించినవాడు అని అనను కానీ, మంచి ఎంటర్టైనర్ అనే చెప్పాలి. కథాంశాల్లో పోయే కొద్దీ కొత్తదనం లోపించడం, ప్రిడిక్టబిలిటీ వంటి సమస్యలతో కూడా మొత్తం ఫెలూదా సీరీస్ అంతా పూర్తి చేసాను అంటే అర్థం చేసుకోండి…రాయ్ శైలిలో ఏదో ఉంది అని 🙂 బహుశా, నేను అభిమానిని కనుక లొసుగులు అర్థం కాలేదేమో, అది వేరే విషయం.

9. ఇట్స్ నాట్ అబౌట్ ది బైక్ – లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆత్మకథ
లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ ఒక సైక్లిస్టు. అతి కష్టతరమైన “టూర్ డి ఫ్రాన్స్” ని వరుసగా ఏడుసార్లు గెలిచాడు. అది కూడా కేన్సర్ బారిన పడి బయటపడ్డాక! ఇది అతని ఆత్మకథ. ఈ పుస్తకం గురించి ముందుగానే విని ఉన్నప్పటికీ చూడ్డం ఇదే మొదలు. చదవడం ఇది చివరమాత్రం కాదు అనుకుంటూన్నా. ఎంతో స్పూర్తిదాయకమైన పుస్తకం. కష్టాలని ధైర్యంగా ఎదుర్కుని అధిగమించడం ఎలాగో ఈ పుస్తకం చెబుతుంది మనకు. సైక్లింగ్ టోర్నమెంట్లు, సైక్లిస్టులకి ఉండాల్సిన లక్షణాలు – ఇలాంటి వాటి గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నా నేను ఈ పుస్తకం చదివి.

10. పరమేశ్వరశాస్త్రి వీలునామా – గోపీచంద్:
పరమేశ్వరశాస్త్రి వీలునామా గురించి ఓ సారి సవివరంగా ఇక్కడ బ్లాగాను. కనుక మళ్ళీ చెప్పను.

11. పడక్కుర్చీ కబుర్లు – ఎమ్బీఎస్ ప్రసాద్:
“పడక్కుర్చీ కబుర్లు” అన్నది ఏడు చిన్న చిన్న పుస్తకాల సంకలనం. ప్రత్యేకం సినిమాలని కాదుకానీ, రకరకాల విషయాల పై ఇవి నిజంగా లిటరల్ గా – పడక్కుర్చీ కబుర్లు. ఎవరో బాగా విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మనపక్కనే పడక్కుర్చీ లో కూర్చుని కబుర్లు చెబుతున్నట్లే ఉంటుంది. నేను మూడు భాగాలు చదివాను. ఆ మూడూ సినిమాలకి సంబంధించినవే – మొదటిభాగం – నలుగురు నటీమణులు (సావిత్రి, జమున, భానుమతి, కృష్ణకుమారి), రెండో భాగం – నలుగురు పాత్రధారులు (ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, గుమ్మడి ), ఐదోభాగం-నలుగురు గాయకులు (నాగయ్య, ఘంటశాల,పీ.బీ.శ్రీనివాస్, ఎస్పీబీ). మూడింటిలోనూ కబుర్లు ఆసక్తికరంగా ఉన్నాయి.  ఎన్నిసార్లైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరన్నా – అలా ఓ భాగం తెరిచి అలవోకగా చదువుకోగలిగేంత సాధారణభాష లో, ఆసక్తికరంగా రాయబడినవి. మిగితా భాగాల వివరాలు – మూడోభాగం :నాలుగు క్షేత్రకథానికలు(అమరావతికథలు, మిట్టూరోడికథలు, దర్గామిట్టకథలు, పసలపూడి కథలు), నాలుగోభాగం-నలుగురు రాజులు(అశోకుడు,రాయలవారు,శివాజీ,బహదూర్ షా జాఫర్), ఆరోభాగం:నలుగురు నాయకులు(నెహ్రూ,పటేల్,నేతాజీ,జిన్నా), ఏడోభాగం:నాలుగు విజయా కామెడీలు(పెళ్ళిచేసిచూడు,మిస్సమ్మ,అప్పుచేసిపప్పుకూడు,గుండమ్మకథ). ఇవి కాక మరో మూడుభాగాలు రాబోతున్నాయని నేను చదివిన ఓ పుస్తకం వెనుక భాగం లో వేసారు. “ఎదురుచూపుకు నిదరేది?” అనుకూంటూ అవెప్పుడొస్తాయా అని ఎదురుచూట్టమే.

12. సచ్ అ లాంగ్ జర్నీ – రోహింటన్ మిస్ట్రీ:
ఈ పుస్తకం గురించి కూడా ఇదివరలోనే బ్లాగాను. మిస్ట్రీ అంటే ఒక స్టీరియోటైప్ ఏర్పడిపోయింది నాకు ఇది చదివాక. అయినప్పటికీ కూడా, పుస్తకం ఆసక్తికరంగా, చదివించేలా ఉందనే చెప్పాలి. మిస్ట్రీ శైలి పాఠకులని చదివింపజేస్తుంది.  ఐనప్పటికీ కూడా మిస్ట్రీ ఆ స్టీరియోటైప్ కాక వేరేది రాస్తాడని నాకైతే నమ్మకం లేదు! బహుశా మళ్ళీ మిస్ట్రీ నవల రాస్తే చదూతానేమో, అది వేరే విషయం అనుకోండి… 🙂

13. ఫిడేలురాగాల డజను – పఠాభి:
సరదాగా చదూకోడానికి బాగుండే పుస్తకం. ఈ పుస్తకం గురించి ఓ సారి బ్లాగాను. రెండో బ్లాగు రాస్తూ ఉన్నా…. ఒకటి పుస్తకం గురించైతే మరోటి దాని విమర్శల గురించి 🙂

14. అనుభవాలూ-జ్ఞాపకాలూనూ (మొదటి భాగం) – శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి ఆత్మకథ:
శ్రీపాదవారి ఆత్మకథ గురించిన మొదటి ఇంట్రో స్కూల్లో ఉన్నప్పుడు జరిగింది. అష్టావధానం గురించిన పాఠం అది. ఈయన ఆత్మకథనుండి తీసిన ఓ భాగం. నేను చదివిన మొదటిభాగం లో అది లేదు కానీ, ఈ పుస్తకం ద్వారా అప్పట్లో మనుష్యుల జీవనశైలి ఎలా ఉందో కొంతవరకూ అర్థమైంది. ఈ పుస్తకం భాష కొంత అర్థంచేసుకోవడం కష్టమైంది, కానీ, నాలో ఆ తరహా భాష పై ఆసక్తైతే రేకెత్తించింది. నాకో పెద్ద జాబితా ఉంది ఈ పుస్తకం చదివాక తెలుసుకోవాల్సిన పదాల జాబితా. త్వరలో ఆ జాబితా తో ముందుకొస్తా 🙂

నిరాశకలిగించినవి:

1. వేయిపడగలు – విశ్వనాథ సత్యనారాయణ:
2. అనుక్షణికం – చండీదాస్:
3. కథాసరిత్సాగరం – సోమదేవుడు:
– ఇవి మూడూ నన్ను ఏఏ విధాలుగా నిరాశపరిచాయో మళ్ళీ చెప్పి మళ్ళీ గొడవ మొదలెట్టదలుచుకోలేదు. కనుక విషయం మటుకు చెప్పి వదిలేస్తున్నా.

4. జంధ్యామారుతం – పులగం చిన్నారాయణ: (రెండు భాగాలు)

ఇవి రెండూ జంధ్యాల తీసిన సినిమాలపై. నేను పేరు చూసి ఏదో ఊహించా – సినిమాని విశ్లేషించడం, ఆసక్తికరమైన కథలేమన్నా చెబుతారేమో అని. అవి చూస్తే, రికార్డు పుస్తకంలా అన్నీ డీటైల్స్ రాసి, అక్కడక్కడా కొన్ని డైలాగులూ అవీ మాత్రం రాసారు. సినిమా టైటిల్స్ ఇంకా స్టోరీలైన్ తెలుసుకోడానికి యాభైయ్యో అరవైయ్యో రూపాయలు పెట్టి ఒక్కో పుస్తకం కొననక్కరలేదు ఏమో అనిపించింది…

– ఇంక అయిపోయింది లెండి. ఆ అమృతాంజనాలూ జండూబాములూ ఇవన్నీ తెచ్చుకోండి సార్లూ,మేడమ్సూ. ఈ సుదీర్ఘ టపా చదివినందుకు ధన్యవాదాలతో
-ఇట్లు నేను అలియాస్ ఈబ్లాగుఓనర్.

Published in: on January 17, 2008 at 5:29 am  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/01/17/2007-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%95%e0%b0%be%e0%b0%b2-%e0%b0%b0%e0%b1%80%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

  1. కథాసరిత్సాగరం ?????????????????????!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  2. @Kiran:

    కథాసరిత్సాగరం


    -అంటే, ఇంగ్లీషులో చదివిన పుస్తకమే అనుకోండి..తెలుగులో బ్లాగాను. అది ఏ విధంగా నిరాశకు గురిచేసింది అన్నది ఆ టపాచూస్తే అర్థం ఔతుంది అనే అనుకుంటున్నా…

  3. అన్ని బుక్స్ ఎలా చదివేశారండి బాబు……….

  4. […] గురించి జాబులు వచ్చాయి. వాటిలో ఒకటి – సౌమ్య రైట్స్: పుస్తక సమీక్షలకు ఈ బ్లాగు ప్రసిద్ధి. […]

  5. సౌమ్యా,

    మిమ్మల్ని చూస్తే చాలా ఈర్ష్యగా ఉంది తెలుసా! బోలెడన్ని పుస్తకాలు చదివేస్తున్నారు! సంతోషంగా ఉంది తెలుసా…అవన్నీ అందరితో పంచుకుంటున్నారు!

    పడక్కుర్చీ కబుర్లు ఎంబీయెస్ ప్రసాద్ గారు ఇదివరలో రాసిన అచలపతి కథల కంటే బాగా వచ్చిందనిపించింది. (ఎంబీయెస్ ప్రసాద్ గారు బారిష్టర్ పార్వతీశం(మొక్కపాటి నరసిమ్హ శాస్త్రి) గారి మనవడు).

    వడ్డెర చండీ దాస్ గారి అనుక్షణికమే కాదు, హిమజ్వాల కూడా నన్ను నిరాశ పరిచిన పుస్తకాల జాబితాలో ఉంది.

  6. “ఎంబీయెస్ ప్రసాద్ గారు బారిష్టర్ పార్వతీశం(మొక్కపాటి నరసిమ్హ శాస్త్రి) గారి మనవడు)” – కొత్త సంగతి తెలిసింది. నెనరులు సుజాత గారూ!

    ఆ మధ్య బ్లాగుల్లో ఒక పుస్తకాల పురుగును వదిలిపెట్టారు. అది కుట్టిన కొందరు ఆ దురద తగ్గేదాకా పుస్తకాల గురించి రాసారు. (కాస్త తోలుమందం గల) నా బోటి వాళ్ళు అసలే రాయలేదు.

    సౌమ్య గారి లాంటి వారికి ఆ పురుగుతో అవసరమే లేదు.

  7. @Sujatha garu:
    మీరు చెప్పిన సంగతి… ఎంబీయస్ గురించి.. – కొత్త సంగతి తెలిసింది… ధన్యవాదాలు…

  8. […] గురించి జాబులు వచ్చాయి. వాటిలో ఒకటి – సౌమ్య రైట్స్: పుస్తక సమీక్షలకు ఈ బ్లాగు ప్రసిద్ధి. […]


Leave a comment