(ఈ వ్యాసం మొదట కెనడా నుండి వచ్చే “తెలుగు తల్లి” వెబ్ పత్రిక సెప్టెంబర్ 2018 సంచికలో వచ్చింది. ఇవ్వాళ ఒక సోషల్ మీడియా చర్చ నాకు ఈ పర్యటనని గుర్తు చేసింది. ఈ వ్యాసం యూనికోడ్ లో లేనందువల్ల గూగుల్ లో కనబడదు కనుక ఇపుడు మళ్ళీ బ్లాగులో పెట్టుకుంటున్నాను. ఇది నేను పంపిన వర్షన్. పత్రికలో వచ్చిన దానిలో అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు ఉన్నాయని గుర్తు).
********************
ఆంటారియో పార్క్స్ వారి వెబ్సైటు చూస్తూండగా “Petroglyphs provincial park” అన్న పేరు కనబడింది. “Petroglyphs” ఎక్కడో విన్నట్లు ఉందే అని ఆ పార్కు పేజీ బ్రౌజ్ చేస్తూ ఉండగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. “Largest known concentration of Indigenous rock carvings (petroglyphs) in Canada, depicting turtles, snakes, birds, humans and more; this sacred site is known as “The Teaching Rocks””
అని ముఖ్య వర్ణన. “టీచింగ్ రాక్స్” అన్న పదం చూశాక గుర్తు వచ్చింది ఎక్కడ విన్నానో. Drew Hayden Taylor అని ఒక కెనెడియన్ రచయిత ఉన్నాడు. కెనడియన్ ఆదివాసీ తెగ ఒకదానికి చెందినవాడు (ఆయన ఈ పార్కు ప్రాంతం వాడే అని నాకు ఇక్కడికి వెళ్ళొచ్చాక తెలిసింది). మొట్టమొదటి ఆదివాసీ సైన్స్ ఫిక్షన్ కథా సంకలనాన్ని వెలువరించింది ఆయనే. ఆ పుస్తకాన్ని పోయిన ఏడాది చదివాను. ఒక కథలో ఈ పెట్రోగ్లిఫ్స్ ప్రస్తావన ఉంది. ప్రస్తావన ఏమిటి, ఒక పాత్రకి ఇవి మార్గదర్శనం చేస్తాయి. కథే వీటిగురించి!
ఇంతకీ ఏమిటవి? సమానార్థక తెలుగు పదం ఉందో లేదో తెలియదు కానీ, రాతిచిత్రాలు. రాళ్ళపైన చెక్కిన బొమ్మలు. ఒక పెద్ద రాయి మీద చెక్కిన వెయ్యికి పైగా బొమ్మలు. మనుషులు, జంతువులు, వస్తువులు, వాళ్ళ జానపదాల్లో ఉండే పాత్రలు, దేవుళ్ళు, దయ్యాలు … ఇలా ఆ సంస్కృతిలో, వారి కథల్లో భాగమైన అందరి బొమ్మలూ ఉన్నాయి. అమెరికా ఖండాలలోకి తెల్లవారు రాకముందు, 900-1100 AD మధ్య కాలంలో చెక్కినవివి. అప్పటికి ఎప్పట్నుంచో ఇక్కడి జాతుల వాళ్ళలో ఉన్న నమ్మకాలు, ఆధ్యాత్మిక సంపదను ప్రతిబింబిస్తాయివి. అలా వందల ఏళ్ళు వాళ్ళ మధ్య ఒక పవిత్ర స్థలంగా ఉన్నా, 1950లలో బయటి ప్రపంచానికి తెలిసింది. తరువాత కెనడా ప్రభుత్వం దానిని National historic site గా గుర్తించింది. అదీ వీటి వెనుక కథ.
ఆ మొత్తం ప్రాంతమంతా హిస్టారిక్ సైటు అన్నా, అసలు పవిత్ర స్థలం చిన్న ప్రాంతమే. చుట్టూ అడవిలా ఉంటుంది. మెయిన్ రోడ్డు నుండి కొంచెం గుబురుగా అడవిలా ఉన్న చెట్ల మధ్య, ఒకే కారు పట్టే వెడల్పు ఉన్న రోడ్డులో ఓ నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి. దారిలో జింకలూ అవీ దర్శనమిస్తాయి. లోపలికెళ్ళాక విజిటర్ సెంటర్ – పార్కింగ్ ఉన్నాయి. విజిటర్ సెంటర్ లో ఒక చిన్న ప్రదర్శన లాంటిది ఉంది, ఇక్కడి సంస్కృతి గురించి అవగాహన కలిగించడానికి. అక్కడ ఉన్న ఒక పోస్టర్ ఇది:
“A culture is a living thing.
It lives through the people
Who keep its tradition alive.
We have been given clan systems.
We have songs and dances.
We have our language.
All of these things are very important.
That’s our way of life.
The very core of us”
ఇదే ఈ పార్కులోకి వాళ్ళ జాతులనే కాక, బాహ్య ప్రపంచానికి కూడా అనుమతించడానికి కారణం అయ్యుండొచ్చు.
ఈ ప్రాంతపు ఆదివాసీ జాతుల “ఆధ్యాత్మిక శిక్షణ”లో ఇక్కడికి రావడం ఒక భాగం. ఆ బొమ్మలన్నీ ఉన్న రాయి వీళ్ళకి పవిత్ర స్థలం (హిందూ గుళ్ళకి మల్లే అక్కడ రాగి గిన్నెల్లో నీళ్ళూ, అవీ ఇవీ ఆకులూ వగైరాలు ఒక ప్లేటులో పెట్టి “offering on the altar” అని పరిచయం చేస్తున్నారు పర్యాటకులకు). రాతికింద ప్రవహించే నీళ్ళ శబ్దమూ, ఆ బొమ్మల మధ్య ఉన్న రంధ్రాలూ, అన్నింటిలోనూ ఆత్మలు ఉన్నాయని, అవి మార్గదర్శనం కావాలని వచ్చిన భక్తులతో సంభాషిస్తాయని వాళ్ళు నమ్ముతారు. ఇప్పటికీ ఈ భక్త పరంపర, వీళ్ళకి దోవ చూపే గురువుల పరంపర అక్కడ కొనసాగుతూనే ఉంది. ఆ స్థలం మీద హక్కులు వాళ్ళవే. ప్రభుత్వానికి ఇతరులని రానిచ్చి పర్యాటక స్థలంగా చేయవచ్చని చెప్పినది ఎప్పుడన్నా వెనక్కి తీసుకోవచ్చంట.
ఇదంతా నీకెట్ల తెలుసనుకోకండి. ఏడాదిలో నాలుగు రోజులు రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది దాక ఒక గైడుతో టూర్ ఉంటుంది (ఉచితం). ఆయనతో వెళ్తే ఇదంతా చెప్పి, పగటిపూట వెలుగులో కనబడని పెట్రోగ్లిఫ్ లను చూపి వాటి కథ కూడా చెబుతాడు. ఏమాటకామాటే, గైడు వాళ్ళ జాతుల మనిషి కాడు. మామూలు తెల్లాయన. కానీ, ఏళ్ళ తరబడి ఆ జాతుల పెద్దలకు శుశ్రూష చేసి, వాళ్ళ సంప్రదాయాలను, పురాణాలను క్షుణ్ణంగా తెలుసుకున్న వాడు. ఈయన ఇచ్చే వివరణలు సరైనవని వాళ్ళ పెద్దలే సర్టిఫై చేశారంట. వందల ఏళ్ళ తరబడి వాళ్ళకీ, తెల్లవాళ్ళకి మధ్య జరిగిన ఘర్షణలను దాటుకుని, ఇప్పుడిప్పుడే ఇక్కడి ప్రభుత్వం వాళ్ళని కలుపుకువెళ్ళే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో వాళ్ళు తనలాంటి వాళ్ళని నమ్మి ఈ బాధ్యత అప్పజెప్పడం విశేషమని అతను అన్నాడు మధ్యలో. అందువల్ల మమ్మల్ని కూడా పిచ్చివేషాలు వేయకుండా మర్యాదగా ఉండమని సభక్తికంగా చాలాసార్లు చెప్పాడతను.
కెనడా దేశానికి 150ఏళ్ళు పూర్తైన సందర్భంగా గత ఏడాది వచ్చిన పుస్తకం – “The Promise of Canada: Building a country, one idea at a time” చదువుతున్నప్పుడు ఇక్కడి ఆదివాసీ జాతులైన వివిధ First Nations వారిపైన కొంత కుతూహలం, కొంత గౌరవం ఏర్పడింది. వాళ్ళ నాయకుల గురించి, ప్రస్తుత కాలంలో వాళ్ళ సంప్రదాయాల పునరుజ్జీవనం గురించి, రాశారు. అలాగే, హరోల్డ్ ఇనెస్ (20వ శతాబ్దపు కెనడాకు చెందిన ఆర్థిక వేత్త. దేశ ఆర్థిక చరిత్రను, అందులో ఆదివాసీ జాతుల పాత్రను గురించి “The Fur Trade in Canada: An Introduction to Canadian Economic History “ అన్న ఉద్గ్రంథం రాశాడు) గురించిన వ్యాసంలో కూడా ఆదివాసీ జాతుల వాళ్ళ నదీ మార్గాల వల్ల తొలితరం తెల్లజాతివారు, తరువాత కూడా కెనడా దేశస్థులు ఎలా బాగుపడ్డారు అన్నది చదివి, నాకు వాళ్ళ గురించి కుతూహలం కలిగింది. నాకు వృత్తిపరంగా ఉన్న ఆసక్తి వల్ల ఇనుయిట్ జాతి వారు తమ భాషకి టెక్నాలజీని అభివృద్ధి చేయడం గురించీ, నేషనల్ రిసర్చి కౌంసిల్ వారి Indigenous Languages Technologies ప్రాజెక్టు గురించి కూడా ఇదే సమయంలో చదవడం జరిగింది- వీటన్నింటి వల్లా నాకు ఈ ఆదివాసీ జాతుల గురించి ఓ కుతూహలం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ పెట్రోగ్లిఫ్స్ చూసి, వాళ్ళ కథలన్నీ విని, భారతదేశంలో ఒకప్పటి జీవన విధానంతో పోల్చుకోవడం నాకు కొత్త అనుభవం.
“ఆ, అన్ని పర్యాటక స్థలాల్లాగే ఇదీ ఒకటి” అని అనిపించవచ్చు. నిజమే. నేనూ వెళ్ళేముందు ఏదన్నా ప్రత్యేకంగా కనిపించే “పర్యాటక” స్థలానికే వెళ్ళాలనుకున్నాను. అయితే, భారతదేశం మొట్టమొదటిసారి దాటి ఏడున్నరేళ్ళు అవుతోంది. ఇందులో కెనడా నేను నివసిస్తున్న (నివాసం అంటే ఉద్యోగం, పన్నులు కట్టడం వగైరాలు చేయడం) మూడో దేశం. మధ్యలో ఐరోపా ఖండంలో సుమారు ఐదేళ్ళు ఉన్నాను – ఆ సమయంలో ఎక్కే గడపా, దిగే గడపా అన్న పద్ధతిలో ఆర్థిక వనరులను బట్టి తిరగగలిగినన్ని దేశాలు తిరిగాను. కనుక, ఇతర జాతుల సంప్రదాయాలను ఎప్పుడూ చూడలేదు అనలేము. ఇన్ని తిరుగుళ్ళ తరువాత కూడా ఈ పెట్రోగ్లిఫ్స్ ప్రత్యేకంగా, వినూత్నంగా అనిపించాయి. అదే సమయంలో భారతదేశంలో కనబడే సంప్రదాయాలనీ, వినే జానపద, పురాణ కథలనీ గుర్తు తెచ్చినందువల్ల బాగా తెలిసిన నాగరికతలా కూడా అనిపించింది. వందల ఏళ్ళ చరిత్ర ఉన్న విశేషాలు గ్లోబులో ఇటువైపు కొంచెం తక్కువే (ఇదివరలో యూఎస్ లో ఉండే రోజుల్లో వందేళ్ళ ఇళ్ళకి మ్యూజియం కట్టడం కూడా చూశాను!). అందువల్ల, కెనడా వాసులు తాము చూసి, తమ ఇంటికి వచ్చే టొరొంటో సందర్శకులను తప్పకుండా తీసుకెళ్ళాల్సిన స్థలం ఇది అని నా అభిప్రాయం.
విజిటర్ సెంటర్ లో ఉన్న చిన్న ఎగ్జిబిషన్ పోస్టర్లలో నాకు నచ్చినవి కొన్ని రాసి ముగిస్తాను.
“If the very old remember, the very young will listen. The wisdom and eloquence of my father, I pass on to my children. So they too acquire faith, courage, generosity, understanding and knowledge in the proper way of living.”
“What we are told as children is that people,
When they walk on the land,
Leave their breath wherever they go.
So whenever we walk,
that particular spot on the Earth
never forgets us.
When we go back to these places, we know
that the people who lived there
are in some way still there,
and that we can partake
of their breath and
of their spirit. “
“Of all teachings we receive, this one is the most important. Nothing belongs to you. Of what there is, of what you take, you must share.”
“All life is related
Life is the process of learning, of seeking harmony and balance of the four aspects of life, the physical, mental, emotional and spiritual. We are an integral part of the whole creation.”
“The ways of our people are ancient, but they are not rigid. They bend and turn to reflect changes in our culture. We expect out young people to have a different interpretation of their culture and different ways of expressing it. This is how the culture grows, and how we grow as people.”
“Elders are keepers of knowledge and culture, and youth are seekers of knowledge.”
“If the legends fall silent, who will teach the children of our ways?”
పార్కు వెబ్సైటు