తొలి రక్తరసదానం అనుభవం

రక్తదానం తెలుసు, ఈ రక్తరసం ఏమిటో?

ప్లాస్మా. టీవీ కాదు. బ్లడ్ ప్లాస్మా.

ఇవ్వాళ నేను కెనడియన్ బ్లడ్ సర్వీసెస్ వారి సెంటర్ ఒకదానిలో (మొదటిసారి) ప్లాస్మా దానం చేసొచ్చాక ఆ అనుభవం రాసి, ప్లాస్మా దానం అవసరం గురించి కూడా చెబుదామనుకున్నాను. అందుకే ఈ బ్లాగు పోస్టు.

తెలుగులో ప్లాస్మా ని ఏమంటారో?‌ అని వెదికితే రక్తరసం, రక్తజీవద్రవ్యం, నెత్తురు సొన అన్న పదాలు కనబడ్డాయి. రక్తదానం మనలో చాలా మందికి పరిచయం ఉన్న పదమే. తరుచుగా బ్లడ్ డొనేషన్ కాంపులు అవీ చూస్తూ ఉంటాము, కొంచెం పరిసరాలు గమనించే అలవాటు ఉంటే. నేను నాకు ఇరవై ఏళ్ళ వయసప్పటి నుండి సగటున ఏడాదికీ, రెండేళ్ళకీ ఒకసారి రక్తదానం చేశాను (దీని గురించి గతంలో రాశాను). ఇన్నిసార్లలో ఎప్పుడూ నాకు ఇలా ప్లాస్మా సపరేటుగా తీసుకుని మళ్ళీ మన రక్తం మనకి తిరిగి ఎక్కించేసే పద్ధతి ఒకటుందని తెలియదు (ఇలాంటిది బాలకృష్ణ సినిమాలో జరుగుతుందని చెబితే నమ్మి ఉందును). ప్లాస్మా, ప్లేట్లెట్ డొనేషన్ సపరేటు అని విన్నా కానీ వివరాలు తెలుసుకోలేదు. ఒక ఆర్నెల్ల క్రితం అనుకుంటా, మా ఇంటి నుండి ఒక కిలోమీటరు దూరంలో కొత్త ప్లాస్మా సెంటర్ తెరిచారు. అప్పట్నుంచి వాళ్ళ రక్తదాతల డేటాబేస్ లో ఈ ఏరియాలో ఉన్న అందరికీ వరసగా మెసేజిలు, ఫోన్ లు వీటిద్వారా కాంపైన్ మొదలుపెట్టారు. అప్పుడే నాకు మొదట ఎందుకు ఇంతలా చెబుతున్నారు? అన్న ప్రశ్న కలిగింది.

అసలేమిటీ ప్లాస్మా డొనేషన్?

మన రక్తం లో 55% ఉంటుందంట ఈ ప్లాస్మా అనబడు పాలిపోయిన పసుపు రంగులో ఉండే పదార్థం. మామూలుగా రక్తదానం చేస్తే అందులో ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ – ఈ మూడు సెపరేట్ చేసి వాడొచ్చంట (అంతా అలాగే కలిపి ఉంచేసి కూడా వాడతారు అనుకుంటా). ప్లాస్మా డొనేషన్ అంటే రక్తంలోంచి ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు అనమాట. తీసుకుని మిగితా రక్తం తిరిగిచ్చేస్తారు (ఇదే నాకు బాలకృష్ణ సినిమాలా అనిపించిన అంశం). ఈ ప్లాస్మా ని ప్రాణాలు కాపాడేంత ప్రభావం గల వివిధ రకాల మందుల్లో వాడతారంట. అలాగే, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో నేరుగా పేషంట్లకి కూడా ఇస్తారంట రక్తం ఇచ్చినట్లు (ఈ పేజిలో ప్లాస్మా తో ఏంచేస్తారన్న విషయం క్లుప్తంగా తెలియజేస్తూ రెండు చిన్న విడియోలు ఉన్నాయి). మరి నేను కెనడాలో చేశాను కనుక ఇక్కడి విషయం తెలుసు – ప్లాస్మా డొనేషన్ ద్వారా వచ్చే దానితో పోలిస్తే దాని అవసరం ఇంకా ఎక్కువ ఉందంట. అందువల్ల యూఎస్ నుంచి కొంటూ ఉంటారంట ఇక్కడ. కొన్ని ప్రాంతాల్లో ప్లాస్మా ఇచ్చిన వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారంట (నేను వెళ్ళింది మామూలు రక్తదానం/ప్లాస్మాదానం చేసే ప్రదేశం. నీళ్ళు, జూస్ లాంటివి ఇస్తారు దాతలకి).

ఎందుకీ ప్లాస్మా డొనేషన్? రక్తదానం చాలదా? ప్లాస్మా అవసరం విపరీతంగా ఉంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా. కోవిడ్ కొంత కారణం సప్లై తగ్గిపోడానికి అని ఇక్కడ అన్నారు. పూర్తి రక్తదానం తో పోలిస్తే ప్లాస్మా ఎక్కువసార్లు ఇవ్వొచ్చంట. పైగా పైన రాసినట్లు ప్రాణాంతకమైన వ్యాధులు కొన్నింటి ట్రీట్మెంట్లో ప్లాస్మా చాలా విలువైనది. కోవిడ్ పేషంట్లకి కూడా ప్లాస్మా ఉపయోగం ఉంది. కనుక పూర్తి రక్తదానం ఎంత ముఖ్యమో, ప్లాస్మా దానం కూడా అంతే విలువైనది అని వీళ్ళ కాంపైన్ లో చెబుతున్నారు ఇక్కడ.

ఇదంతా కొంచెం తెలుసుకున్నాక కూడా నేను వెంటనే ఈ కాల్ కి స్పందించలేదు. మార్చి చివర్లో ఒకసారి రక్తదానానికి పోతే అక్కడ హిమోగ్లోబిన్ లెవెల్ చూసి, చాలా తక్కువుంది, తీసుకోము అన్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. మూడు నెలలక్రితం చాలా మైల్డ్ గా కోవిడ్ పలకరించి పోయింది. దాని ప్రభావమో ఏమిటో? అంటే కావొచ్చు అన్నారు. కానీ, మరీ తక్కువగా ఉంది. ఒకసారి డాక్టర్ తో మాట్లాడు. ఫలానా ఫలానా బాగా తిను. ఐరన్ సప్లిమెంట్ తీసుకో, ఇలా జాగ్రత్తలు చెప్పి పంపేశారు. అసలు నా జీవితంలో ఇలా హిమోగ్లోబిన్ తక్కువ అవడం ఇదే మొదటిసారి. ఖంగారుతో కూడిన డిప్రెషన్ కొంతా, ఇలా ఇంట్లో వాళ్ళని చూస్కోడం‌కాదు, మనల్ని మనం కూడా చూసుకోవాలి అన్న జ్ఞానం వల్ల కొంతా… ఇక కొన్నాళ్ళు నేను ధైర్యం చేయలేదు. తరవాత జులై లోనో ఎప్పుడో‌ మళ్ళీ వెళ్ళా, ఈ సారి ప్లాస్మా దానం ప్రయత్నిద్దాం అని.

అప్పటికి రక్తం మళ్ళీ సర్దుకున్నట్లు ఉంది. కానీ, సరిగ్గా వాళ్ళకి ఒక కటాఫ్ ఉంటుంది దాతల నుండి ప్లాస్మా తీసుకోవడానికి. అంతే ఉంది. అందుకని కొన్నాళ్ళాగమన్నారు. కానీ, ఫోనులు, ఈమెయిల్ కాంపైన్ మాత్రం ఆగలేదు. సరే, ఈమధ్య ఆరోగ్యం బానే ఉంది కదా, ఈ వారం కాస్త పని తక్కువగా ఉందని మళ్ళీ ధైర్యం చేసి చూశా. లాస్టుకి ఇవ్వాళ ఈ‌ ప్రొసీజర్ అయింది. వాళ్ళకి ఏవో కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని మందులు వాడే వాళ్ళవి తీసుకోరు. రక్తహీనత ఉంటే ఎలాగో తీసుకోరు. ఇంకా పెద్ద లిస్టు ఉంది. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వారు ఒకసారి వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే మనం వాళ్ళకి సరిపోతామో లేదో చెబుతారు. సీనియర్ సిటిజెంస్ కూడా కనిపిస్తూ ఉంటారు వెళ్ళిన ప్రతిసారీ. వీలు/అర్హత ఉన్న అందరం భయపడకుండా, అపోహలు పెట్టుకోకుండా, చేయాల్సిన పని ఇది అనిపించింది వెళ్ళొచ్చాక.

విధానం: మన బరువు, ఎత్తు బట్టి ఎంత తీసుకోవాలో నిర్ణయిస్తారంట. అది అయాక ఒక అరగంట-ముప్పావు గంట పడుతుంది అన్నారు. మామూలు రక్త దానం లాగే సూది గుచ్చి తీసుకున్నారు గానీ, మళ్ళీ ప్లాస్మా తీసుకుని రక్తం వెనక్కి పంపించేస్తారంట. ఆ కాస్త దానిలో అంతా ఎర్రగా ఉంటుంది కనుక పోతోందో వస్తుందో కనబడదు అనుకోండి, స్క్రీన్ మీద మాత్రం ఎప్పుడు ఏం జరుగుతోందో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకున్న కోడ్ ప్రకారం (ఒక సింబల్ కి రక్తం బైటకి పోతుందని, ఒక సింబల్ కి లోపలికొస్తోందని అర్థం). నాకు ఈ ప్రొసీజర్ ఇరవై నిముషాలకే ముగిసింది. నేను ఇలాంటివి చేసే ముందు నీళ్ళు బాగా తాగుతా, కాఫీ ఒక నాలుగైదారు గంటల ముందే మానేస్తా (అందుకే మధ్యాహ్నం అపాయింట్మెంట్లు తీసుకుంటా) – రెండూ‌ మంచి ప్రాక్టీస్ అని, తొందరగా ఐపోవడానికి దోహదం చేసేవే అని అక్కడున్న నర్సు చెప్పింది ఒకసారి బ్లడ్ డొనేషన్ లో. ఆరోజు రక్తదానం కూడా ఆరు నిముషాలలో ముగిసింది.

ఆ సొంత సుత్తి అటు పెడితే, మొత్తానికి నేను చెప్పేది – నాకు అర్థమైనది ఏమిటంటే:

  • ప్లాస్మా అవసరం పూర్తి రక్తం కంటే కూడా ఒకోసారి ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ వల్ల డిమాండు ఇంకా ఎక్కువైంది (ఇది వేరే దేశాల్లో కూడా జరిగింది)
  • కొన్ని రోగాల ట్రీట్మెంట్ కి ప్లాస్మా తోనే పని
  • ప్లాస్మా ఉపయోగించి కొన్ని మందులు కూడా తయారుచేస్తారు
  • ప్లాస్మా దానం ప్రతి పదిహేనురోజులకోసారి చేసినా కూడా మామూలుగా ఆరోగ్యవంతులుగా ఉండేవారికి వచ్చే నష్టం లేదు.
  • మామూలుగా రక్తదానం చేశాక నీరసం లాంటివి అనుభవించకపోతే ప్లాస్మా దానం తర్వాత కూడా ఏం అవ్వదు.

వెరసి మామూలు మనుషులు అతి సులభంగా, అదీ మళ్ళీ మళ్ళీ తరుచుగా చేయగలిగే గొప్ప పని ప్లాస్మా దానం. వాళ్ళన్నారని రెండు వారాలకోసారి వెళ్ళిపోయే ఉద్దేశ్యం, టైము నాకు లేవు. అయితే, రక్తదానం ఏడాదికోమాటు చేస్తే చాలు అనుకునేదాన్ని నేను (వాళ్ళు మూణ్ణెల్లు, ఆర్నెల్లు అంటారు కానీ, ఆడమనిషిగా, తల్లిగా, ఉద్యోగినిగా, గృహిణిగా అంత తరుచుగా చేసి నిభాయించుకోలేను అనుకుంటున్నా). ప్లాస్మా కి వీలు ఉండి, రక్తహీనత లాంటివి, ఇతరత్రా అనారోగ్యాలేవీ పట్టుకోకపోతే మూడు, నాలుగు నెలలకొకసారైనా చేయాలి అనుకుంటున్నా. పైగా, అట్లా ఓ ఐదునిముషాలు పోతే ఆ సెంటర్ వచ్చేస్తుంది. చేయననడానికి నాకు కారణాల్లేవు. నా స్నేహితురాలు ఒకామె బిడ్డకి జన్మనిచ్చి ఆర్నెల్లు కూడా కాకుండానే వెళ్ళి ప్లాస్మా ఇచ్చొచ్చింది ఈమధ్యనే. ఆమే నాకు స్పూర్తి ప్రస్తుతానికి.

ఇకపోతే, ఈ పోస్టు రాయబోతూ రక్తం బదులు ప్లాస్మా ఎందుకు దానం చేయాలి? అన్న సందేహం కలిగి కాసేపు అవీ ఇవీ చదివా. కొన్ని బ్లడ్ బాంక్ వెబ్సైట్లలో ఫలానా బ్లడ్ గ్రూపు వారు ప్లాస్మా, ఫలానా వాళ్ళు ప్లేట్లెట్, ఫలానా వాళ్ళు రక్తం/ప్లాస్మా/ప్లేట్లెట్ చేస్తే అందరికీ మోస్ట్ బెనెఫిట్ కలుగుతుంది అని రాశారు. ఇది మరి ఆయా దేశాలలో ఉన్న జనాల బ్లడ్ గ్రూపుల డిస్ట్రిబ్యూషన్ బట్టి ఉంటుందో ఏమో అర్థం కాలేదు. ఒక డాక్టర్ మిత్రుడిని వాకబు చేస్తే ఇదే వినడం ఈ మాట, చదివి చెబుతానన్నారు. ఆ విషయం ఆయన చెప్పేది నాకు అర్థమైతే తర్వాత రాస్తా.

Published in: on October 22, 2022 at 1:11 am  Comments (1)  

రక్తదానం – వివిధ దేశాలలో నా అనుభవాలు

ఇవ్వాళ ఇక్కడ రక్తదానానికి వెళ్ళొచ్చాను. చివరిసారిగా రక్తం ఇచ్చి పదేళ్లు దాటింది. కానీ అప్పట్లో తరుచుగా ఇచ్చేదాన్ని. అందుకని ఓసారి గతం గుర్తు తెచ్చుకుందామని పోస్టు.

నాకు చిన్నప్పట్నుంచీ రక్తదానం అంటే చాలా గొప్ప అన్న భావన ఉండేది.  నాకు ఊహ తెలిసేనాటికి పత్రికల్లో టీవీల్లో రక్తదానం ప్రకటనలవీ చూసీ మనం కూడా ఇయ్యాలి… తగిన వయసు టక్కుమని రావాలి అని ఎదురుచూస్తూ ఉన్నా. మొదటిసారి రక్తదానం ఇంజనీరింగ్ లో ఉండగా కాలేజి లోనే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడితే అక్కడ ఇచ్చా. ఇండియా లో ఉన్నపుడు దాదాపు ప్రతి ఆర్నెల్లకూ ఇచ్చేదాన్ని – ఆఫీసులోనో, ఫ్రెండు వాళ్ళ సేవా సంస్థలోనో, ఎక్కడో ఓ చోట క్యాంపులు పెట్టేవాళ్ళు. వాటిలో ఇచ్చేదాన్ని. ఓసారి 2006 లో  అనుకుంటాను – పేపర్లో నా గ్రూపు రక్తం కావాలన్న ప్రకటన చూసి కదిలిపోయి, మా అమ్మ పర్మిషన్ తీసుకుని NIMS ఆసుపత్రికి పరిగెత్తి ఇచ్చొచ్చా. ఎవరో ఒక నా ఈడు మనిషికే ఇచ్చా, ఆ మనిషి వెంట చాలా పెద్దామె ఎవరో మాత్రమే ఉంది. వాళ్ళు జూసిచ్చారు, ఆమె దండం‌ పెట్టింది. నేను మొహమాటపడి తిరిగి దండం పెట్టి గబగబా బైటకొచ్చేశా. 

అప్పట్లో ఒక బ్లడ్ డోనర్ కార్డు (రెడ్ క్రాస్ అనుకుంటా), ఒక ఐ డోనర్ కార్డు (ఎల్ వీ ప్రసాద్ వారి దగ్గర రిజిస్టర్ అయితే ఇచ్చారు), ఒక ఆర్గన్ డోనర్ కార్డు (మోహన్ ఫౌండేషన్ అనుకుంటాను, గుర్తులేదు)  ఇన్ని పెట్టుకు తిరిగేదాన్ని పర్సులో. మనమసలే విచ్చలవిడి టూ వీలర్ డ్రైవర్లం… ఏదన్నా అయితే కనీసం ఇంకోళ్ళకి ఉపయోగపడతాం అని (ఇంట్లో వాళ్ళకి తెలుసు లెండి. ఏదీ రహస్యంగా చేయలేదు). కానీ, అదంతా అక్కడితోనే పోయిందని తెలియలేదు నాకప్పుడు. 

దేశం దాటాక అదేమిటో ఇలాంటి రక్తదాన శిబిరాలు ఇప్పటిదాకా చూడలేదు. జర్మనీ వెళ్ళిన కొత్తల్లో ఓ స్నేహితురాలిని అడిగాను – ఇక్కడ రక్తదానం చెయ్యాలంటే ఏం‌చెయ్యాలి? అని. ఆమె ఆశ్చర్యంగా చూసి ఎందుకన్నది. “ఎందుకేమిటి? మామూలుగా బ్లడ్ బ్యాంకులకి రక్తం అవసరం ఉంటుంది కదా. అందుకని ఇద్దామనుకుంటున్నా” అన్నా. “ఇక్కడ అలా ఊరికే పోతే తీసుకోరు అనుకుంటాను, మీ ఇండియాలో ఎవరి బ్లడ్డన్నా అలా తీసేసుకుంటారా?‌” అని ఆశ్చర్యపోయింది. ఊరికే తీస్కోర్లేవమ్మా, ప్రశ్నలన్నీ వేసే తీసుకుంటారని చెప్పా కానీ, జర్మనీ లో ఎలా ఇవ్వాలన్నది మాత్రం అర్థం కాలేదు మొత్తం ఐదేళ్ళలో. భాష సమస్య ఒకటి కూడా కారణం అయుండొచ్చు నాకు.

కట్ చేస్తే యూఎస్ లో అసలు ఊపిరి సలపని ఉద్యోగం. దానికి తోడు కొంత వ్యక్తిగత ఇబ్బందులు. ఎక్కడా శిబిరాలు కానీ, ఇవ్వమని పిలుస్తూ ప్రకటనలు కానీ కనబడలేదు యూనివర్సిటీలో ఉన్నా కూడా – దానితో నేనూ ఎక్కడా ప్రయత్నించలేదు. 

కెనడా వచ్చాక కూడా చాలా రోజులు ఇలాగే కొనసాగింది… పైగా రాంగానే కొన్ని నెలల్లోనే ప్రెగ్నంసీ, పాప పుట్టడం, ఆ తరువాత కొన్ని నెలలకి మాయదారి కోవిడ్ – వీటితోనే సరిపోయింది. కానీ గత ఏడాది కాలంలో ఇక్కడ తరుచుగా బ్లడ్.సీయే వెబ్సైటు వారి ప్రకటనలు రోడ్డు మీదా, ఇంటర్నెట్ ఆడ్స్ లో కూడా కనిపించేవి. “రక్తదానం నిరంతర అవసరం. ఈ మహమ్మారి కాలంలో మరింత అవసరం”  అని ముఖ్యంగా కోవిడ్ సమయంలో మీ రక్తదానం మరింత అవసరం అని వారు చేసిన కాంపైన్ నన్ను బాగా కదిలించింది (స్వేచ్ఛానువాదం లెండి!).  సరే, కొంచెం ఇక పిల్ల కొంచెం పెద్దవుతోంది కదా అని ఇంటి దగ్గర ఏవైనా శిబిరాలున్నాయా అని చూడ్డం మొదలుపెట్టా. ఇంటి అడ్రస్ బట్టి వెదుకుతూ ఉంటే ఒకటి కనబడ్డది (మళ్ళీ దూరమంటే పిల్లని ఎక్కువ సేపు వదిలి పోవడం ఇష్టం లేక!).  మా పాప రెండో‌ పుట్టిన రోజు లోపు ఇవ్వాలనుకున్నా మా ఇంటి పుట్టినరోజు వేడుకలో భాగం అని. 

అపాయింట్మెంటు తీసుకున్నాక మనసు పీకడం మొదలుపెట్టింది. రెండు మూడు వారాల ముందు నుంచే ఇండియా/యూఎస్ లో ఉన్న డాక్టర్ స్నేహితుల తల తిన్నా – కోవిడ్ పరిస్థితిలో రక్తం ఇచ్చొచ్చాక నాకేమన్నా అవుతుందా? అని. నా బాల్య స్నేహితురాలేమో టెస్ట్ చేయించుకుని వెళ్ళి ఇవ్వు. పొరపాట్న నువ్వు పాజిటివ్ అయితే అదో ఇబ్బంది కదా బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి? అన్నది (పాయింటే, నేనాలోచించలేదు). ఇంకో స్నేహితులేమో సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవ్వు – కేసులు తగ్గుముఖం పడుతూంటే వెళ్ళు అన్నారు. ఆఫీసు వాళ్ళని కూడా తిన్నా – ఈమధ్య మీరేవన్నా రక్తం ఇచ్చారా? అని. ఒకరేమో – నువ్వు డెంటిస్టు దగ్గరికెళ్ళావా ఈ ఏడాది కాలంలో?‌ డెంటిస్ట్ కంటే రక్తదానం వల్ల ఏం ఎక్స్పోజ్ అవ్వవు నువ్వు అన్నారు (ఇది కూడా నిజమే కదా… అనుకున్నా). ఇంతలో ఓ కొలీగ్ – నాకన్నా పెద్దామే – “నేనిచ్చొచ్చాను ఈమధ్యే. ఏం కాదు, చాలా జాగ్రత్తలు తీసుకుంటూన్నారు.. ఖంగారు పడకు” అని భరోసా ఇచ్చింది. దానితో ముందడుగేశా. గతంలో రక్తం ఇచ్చేటపుడు రక్తం చూస్తే భయపడే వాళ్ళని, దాని వల్ల రక్తదానం చేయలేకో, చేసాక కళ్ళు తిరిగో పడిపోయే చాలామందిని చూశాను. ఇప్పటి కాలం లో వైరస్ భయమే ఎక్కువ. 

రెండు వారాలకోసారి, వారం ముందు ఓసారి, నాలుగు రోజుల ముందో సారి రిమైండర్లు – కోవిడ్ జాగ్రత్తల గురించి, వెళ్ళాక ఏమవుతుంది?‌ (కోవిడ్ ప్రశ్నలు, డోనర్ ఆరోగ్యం గురించి ప్రశ్నల చిట్టా, రక్తంలో హిమోగ్లోబిన్ టెస్టు) ఎంతసేపు పడుతుంది? ఇలాంటివన్నీ వివరిస్తూ ఈమెయిల్స్ పంపారు. మధ్యలో ఒకరోజు మళ్ళీ కోవిడ్ anxiety వల్ల వాళ్ళ వెబ్సైటులో ప్రశ్నోత్తరాలన్నీ చదివి, ఉన్నవి చాలక చాట్ బాక్స్ లో రక్తం, ప్లాస్మా, ప్లేట్లెంట్స్ ఇన్ని రకాల దానాలలో తేడా ఏమిటి? నేనేదైనా ఇవ్వొచ్చా? ఇలాంటివన్నీ అడిగి తలకాయ తింటే ఒక రిజిస్టర్ర్డ్ నర్సు నాకు ఓపిగ్గా జవాబులు కూడా ఇచ్చింది. అంతా చూశాక సాహసించానిక – పర్లేదు, నాకేం కాదు అక్కడికి వెళ్ళొస్తే అని. ఇందాక రాసినట్లు, రక్తం గురించి కాదు నా భయం – కోవిడ్ గురించి! ఇంట్లో నాతో పాటు ఉన్న కుటుంబం గురించి!)

అయితే, అసలు వెళ్ళినప్పటి నుండి ఇల్లు చేరేదాకా ఇదే ఇప్పటి దాకా నా బెస్ట్ రక్తదానం అనుభవం. వెళ్ళగానే టెంపరేచర్ చూసి, ప్రశ్నలూ అవీ వేసీ ఇంకో గదికి పంపారు. కెనడాలో ఇదే మొదటిసారి కనుక అక్కడ వాళ్ళ డేటాబేస్ లో నానా రకాల ప్రశ్నోత్తరాలకి జవాబులు రిజిస్టర్ చేశారు. తరువాత ఒకామె వచ్చి హీమోగ్లోబిన్ లెవెల్ చూడ్డానికి ఓ చుక్క రక్తం తీసుకుంది. చివరికి మళ్ళీ ఓసారి అంతా వివరంగా చెప్పాక, రక్తదానం మొదలైంది. ఐదు నిముషాల ఒక సెకను పట్టింది అంతే సాధారణ మొత్తంలో రక్తం తీయడానికి. అంతేనా? ఇంతకుముందు ఇంకాసేపు పట్టేదే అనుకున్నా. కానీ ఆమె మొదటే అనింది – if you are hydrated, it is very quick అని. అంతే ఇంక. మరో ఐదునిముషాలు కూర్చున్నాక ఇంక పొమ్మన్నారు జ్యూసు, నీళ్ళు, బిస్కట్లు గట్రా కొన్ని వాయినం కూడా ఇచ్చి పంపారు… ఇస్తినమ్మా రక్తం, పుచ్చుకుంటినమ్మా వాయినం. 

ఇన్ని దేశాల్లో కెనడా వారి రక్తదాన శిబిరాల పద్ధతి అన్నింటికంటే సులభంగా అనిపించింది. ఆ తరువాత ఇండియా – నిజానికి ఈ వెబ్సైటులూ అవీ ఉన్నాయో లేదో నాకు తెలీదు కానీ, పది-పదిహేనేళ్ళ క్రితం ఆ శిబిరాలు తరుచుగానే కనబడేవి ఇండియాలో. అక్కడెప్పుడూ‌ నాకు రక్తం ఇవ్వడానికి ఇబ్బందులు కానీ, ఎక్కడివ్వాలి? అన్న ప్రశ్న కానీ ఎదురవలేదు. అయితే నేను అక్కడే పుట్టీ పెరిగిన దాన్ని, స్వచ్ఛంద సంస్థలలో మధ్య మధ్య వాలంటీర్ గా వెళ్ళేదాన్ని .. ఒకసారి ఇలాగే రక్తదాన శిబిరంలో కూడా వాలంటీరు గా చేశాను (అప్పట్లో ఆపనులు చేసే స్నేహితులు పట్టుకుపోయేవారు ఖాళీగా కనిపిస్తే – స్వతహాగా అంత సేవా దృక్పథం లేదు నాకు). కనుక కొంచెం ఎక్కువ తెలిసేవి ఇలాంటి శిబిరాల గురించి.  కెనడాలో అయితే కొత్త వాళ్ళకి కూడా తేలిక అనిపించింది. డ్రైవర్స్ లైసెన్స్ దగ్గరే అవయవ దానం గురించి అడిగి, కార్డు మీద డోనర్ అని వేసేశారు. ఐ/టిశ్యూ డోనర్ గా కూడా రిజిస్టర్ అవడం తేలిక ప్రభుత్వం వారి ఆరోగ్య భీమా వివరాలకి అనుసంధానం చేశారు కనుక.  ఇలా  ఒక్క అదనపు కార్డు కూడా పెట్టుకోకుండానే నేను నేత్ర/అవయవ/టిస్యూ దాతగా రిజిస్టర్ అయిపోయా కెనడాలో.  ఇపుడు బ్లడ్ డోనర్ గా కూడా రిజిస్టర్ అయిపోయా కనుక ఇంకోసారి ఇవ్వాలనుకుంటే‌ మరింత తేలిక – ఆల్రెడీ వాళ్ళ లిస్టులో ఉన్నా కనుక. బ్లడ్.సిఏ వారిది ఒక ఆప్ కూడా ఉంది. నాకు ఆప్ లు గిట్టవు కానీ దీన్ని మాత్రం దిగుమతి చేసుకున్నా భవిష్యత్ స్పూర్తి కోసం. 

మొత్తానికి  “రక్తదానం నిరంతర అవసరం. ఈ మహమ్మారి కాలంలో మరింత అవసరం” అన్నది నేనిచ్చే సందేశమనమాట. నేత్ర దానం చెయ్యండి, మరణంలో జీవించండి, మరణించీ జీవించండి అన్న ప్రకటనకి ఊగిపోయి ఆవేశపడిపోయే చిన్నపుడు ఐ డోనర్ గా సైనప్ అయ్యా. అంత క్యాచీగా రాయడం నాకు రాదు – కనుక ఇలా రాసుకుంటున్నా. మనం శ్రమలేకుండా చేయగలిగే ఏకైక గొప్ప పుణ్యకారం ఇదే అని నా అభిప్రాయం.  ఇక ఇక్కడ పద్ధతి తెలిసింది కనుక ఇకపై ఏడాదికి ఒకట్రెండు సార్లన్నా ఇవ్వాలి అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో!

మా పాప పుట్టిన రోజు లోపు చెయ్యాలనుకుని వెళ్ళా. ఈ వారంలో మా తాతయ్య మరణం తో – ఇది ఆయన జ్ఞాపకంగా కూడా నేను చేసుకుంటున్నట్లు అయ్యింది. పుట్టినరోజుకీ, చావులకీ రక్తదానం ఏమిటి? అంటారా – కేకులు కూడా కోస్తామండి తర్వాత పుట్టినరోజుకి. కన్నీళ్ళు కూడా కారుస్తాం తాతకోసం- ఒక్కోళ్ళకీ ఒక్కో పద్ధతి ఉంటుంది కష్టానికీ, సుఖానికీ స్పందించడానికి. అందువల్ల ఏమనుకోకండి నా గురించి 🙂

స్వస్తి.  

Published in: on May 16, 2021 at 2:00 am  Comments (2)  

Sumangali Seva Ashram – లో కాసేపు

బెంగళూరొచ్చాక చుట్టుపక్కల విషయాల్ని పట్టించుకోడం మానేసినట్లైంది నాకు. అలాంటిది, శనివారం “సుమంగళి సేవా ఆశ్రమం” కి వెళ్ళిరావడం – కొత్త ప్రపంచం చూసిన అనుభూతి కలిగింది. నా కొలీగ్ అక్కడేదో ప్రాజెక్టు చేస్తున్నానని చెప్పడంతో మొదలైంది నాకు దీని గురించిన తొలి పరిచయం. అలా అపుడప్పుడు దీని గురించి తెలుసుకుంటూ ఉండగా – ఓ సందర్భంలో వీళ్ళ ఆశ్రమం కి అనుబంధ పాఠశాల గురించి చర్చకు వచ్చింది. ఇక్కడ ఏమన్నా టీచింగ్ వాలంటీర్ల అవసరం ఉందా? అని సందేహం కలిగింది నాకు. పాత “ఆషాకిరణ్” రోజులు గుర్తొచ్చి. ఉందనుకుంటాను అని అనడంతో, ఓ సారి వస్తానన్నాను నేను కూడా. అలా అనుకున్న దాదాపు నెలన్నర తర్వాత ఇన్నాళ్ళకి వెళ్ళాను.

1975 లో సుశీలమ్మ అనే ఆవిడ స్థాపించారట ఈ ఆశ్రమాన్ని. ఇప్పటికీ ఆమె అక్కడే ఉంటున్నారు. నేను వెళ్ళినప్పుడు బైటకి వెళ్ళారు – దాంతో కలవడం కుదర్లేదు. త్వరలో మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నా.

నేనేదో చిన్న స్కూల్-ఒక హాస్టల్ వంటి సెటప్ ఊహించుకుని వెళ్ళానా? అదో మినీ సామ్రాజ్యం. స్కూల్ ఉంది. పెద్ద హాస్టల్ ఉంది. ఒక అమ్మాయిల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ తరహా ది ఏదో ఉంది. ఇతర ఎన్జీవోలు వగైరాతో కలిసి ప్రదర్శనలు అవీ ఇచ్చే స్టేజీ ఉంది. వీటన్నింటి మధ్యలో చిన్న కుటీరం లాంటిది ఒకటి ఉండింది. చూడ్డానికి చాలా హాయిగొల్పేదిగా ఉంది. ఇక ఉండేందుకు ఎంత బాగుంటుందో అనుకున్నా – అది వాళ్ళ ఆఫీసట!! లోపల కాసేపు తిరిగాము – వీళ్ళ కిచెన్ – రోజూ దాదాపు నూటయాభై మందికి వండి పెట్టే ఎన్జీవో కిచెన్ ఎలా ఉంటుందో? అనుకున్నా – అక్కడ ఎక్విప్మెంట్ అంతా ఆధునికంగానే ఉన్నాయి. కాస్త వెనక్కి వెళ్తే, పిల్లలు బట్టలు ఉతుక్కుంటూ, కట్టెలని మండించి దానిపై ఓ పెద్ద గంగాళంలో వేణ్ణీళ్ళు పెట్టుకుంటూ, తయారౌతూ, కనిపించారు. అన్ని వయసుల వాళ్ళూ ఉన్నారు. ఇంతమంది కనుక నీటి సమస్య ఉంటుంది కదా – వీళ్ళు తలస్నానం చేసే పద్ధతి చూస్తే, అర్థమైంది అది. అలాగే, చాలా మంది చిన్న పిల్లలకి కురచ జుట్టు – నీటి సమస్య ప్రభావం అని నా కొలీగ్ చెప్తే వెలిగింది.

పిల్లలు తమంతట తాముగా బ్రతకడం క్రమంగా తెలుసుకుంటారు ఇక్కడికొచ్చాక అంటూ ఓ పిల్లని చూపిస్తూ నా కొలీగ్ చెప్పుకొచ్చింది – మూణ్ణెల్ల క్రితం ఈ పిల్ల (చిన్నమ్మాయే… ఆరేడేళ్ళు ఉండొచ్చు) ఇక్కడకి వచ్చినప్పుడు ఏం తెలీకుండా ఉండేది. ఇప్పుడు తనంతట తాను చాలా పనులు చేస్తుంది అని. అలాగే, కాస్త పెద్ద పిల్లలు చిన్న పిల్లల బాగోగులు చూస్కోడం వగైరా – హాస్టల్ లో బ్రతకడానికి అలవాటు పడిపోతారన్నమాట. ఆదివారం పేరెంట్స్ మీటింగ్ అట. ఇక్కడి రెసిడెంట్స్ లో, అనాథ బాలికలతో పాటు, ఊర్లు తిరుగుతూ ఉండే రోజుకూలీల పిల్లలు కూడా ఉంటారట – ఈ మీటింగ్ గురించి తెలిసినప్పుడు ఈ సంగతి తెలిసింది. మామూలుగా చూస్తే, వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది ఇక్కడ నాకు. బక్రీద్ అని స్కూల్ కి సెలవట. కనుక, పిల్లలు అటూ ఇటూ ఊరికే తిరుగుతూ ఉన్నారు. హాస్టల్ అమ్మాయిలకి మాత్రమేనట. ఒకటి నుండీ ఏడు తరగతుల దాకా స్కూల్ లో అబ్బాయిలు కూడా ఉంటారట. హాస్టల్ అమ్మాయిలకి మాత్రమే. ఎనిమిది-పది తరగతుల వరకు స్కూల్ కూడా అమ్మాయిలు మాత్రమే. చుట్టుపక్కల ఇతర ఎన్జీవోలు వాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయట. లోగుట్టు నాకు తెలీదు కానీ, నేను చూసినంతలో నాకు ఈ సంస్థ గురించి మంచి అభిప్రాయమే కలిగింది.

నేనక్కడున్నప్పుడే, ఓ స్కూల్ పిల్లలని ఇక్కడికి విజిట్ కి తెచ్చారు వాళ్ళ టీచర్లు. టిపికల్ కాన్వెంట్ స్కూల్ పిల్లలు. చూడగానే – తేడా స్పష్టంగా తెలిసొచ్చింది నాకైతే. తమ కమ్ఫర్ట్ జోన్ కి ఆవల కూడా జీవితం ఉంది అని చిన్నవయసులో వాళ్ళకి ఎంత మాత్రం అర్థమౌతుందో కానీ, ఒక విధంగా ఇదీ మంచికే.

ssa వాళ్ళ స్కూల్ సంగతి – నేను వచ్చిందే దానిపై ఆసక్తితో – నాకు మహా అనుమానంగా ఉండింది మొదట్నుంచీ – ఈ స్కుల్లో టీచర్లెవరు? అని. ప్రభుత్వ టీచర్లట – అయితే, ఏడో తరగతి దాకా ప్రభుత్వం సాలరీ. మిగితా వారికి సంస్థ సాలరీ ఇస్తుందట. స్కూల్ అయ్యాక హోమ్వర్క్ గట్రా ఎవరు చేయిస్తారు? అంటే, నాకర్థమైనంతలో ఇక్కడ పెద్ద సాయం ఏం ఉండదనుకుంటాను పిల్లలకి. వార్డెన్లు వారూ చెప్పగలిగినా, పెద్ద తరగతుల పిల్లలకి సాయం దొరకడం కష్టంగా ఉందట. దీనికి వాలంటీర్ల కోసం చూస్తున్నారట. కన్నడం నాకు రాకున్నా, పిల్లలకి తెలుగు అర్థమౌతుంది కనుక, ఒకళ్ళిద్దరితో మాటలు కలిపాను. ఓ నాలుగో తరగతి పిల్లని మీకే సబ్జెక్టులు ఉంటాయంటే – కన్నడ, పరిసర విజ్ఞాన, గణిత, ఇంగ్లీషు అన్నది. సోషల్? అంటే లేదు అన్నది. ఇంగ్లీషు లో ఏం చెప్తారు? అన్నా. కన్నడ అన్నది. ఏం చెప్పేది? కొంతమంది తెలుగును ఇంగ్లీషులో మాట్లాడతారే… అలా…ఇక్కడ ఇంగ్లీషుని కన్నడలో చెబుతారట! పెద్ద క్లాసు పిల్లలకి గణితం-సైన్సు చెప్పడానికే కాదు. మొదట్నుంచీ చివర్దాకా ఈ పిల్లలకి ఇంగ్లీషు నేర్పడానికి కూడా మనుషులు అవసరం ఏమో అనిపించింది.

ప్రభుత్వ పాఠశాలల టీచర్ల గురించి కాసేపు అనుకున్నాము. అలాగే, ఏవిటో, మనదేశంలో ఈ సైడ్ రావడానికి మోటివేషనే ఉండదు – బాగా చదువ్కున్న వారు ఎపుడైతే ఇలా పాఠాలు చెప్పేందుకొస్తారో, అప్పుడు గానీ, ఇలాంటి పాఠశాలల పరిస్థితి బాగుపడదు అనిపించింది నాకైతే. ఈ విషయాల గురించి అక్కడ ఆఫీసులో మాట్లాడాలనుకున్నాను. వాలంటీర్లు కావాలంటే – ఏం చేసేందుకు? పాఠాలు చెప్పేందుకు మీకు మనుష్యులు అవసరం అనిపిస్తోంది, అలాగే… ఈ పిల్లలకి కాస్త exposure- అవసరం వంటి సంగతులు… కానీ, మేము కలవాలనుకున్న మనిషి లెకపోడంతో వెనక్కొచ్చేశాము. మళ్ళీ వెళ్ళాలి.

వీళ్ళకి ఫండ్స్ అవీ పర్లేదు – మనుషులే అవసరం ఏమో అని నా అభిప్రాయం. అలాగే, ఈ పిల్లలకి కాస్త బైట ప్రపంచం తెలీడం కూడా చాలా అవసరం అనిపిస్తోంది. ఈ ప్రాంగణం నుండి వీళ్ళు బైటకి వెళ్ళేది చాలా తక్కువట. ఈ కాలంలో ఇలా ఉంటే, చివర్లో స్కూల్ జీవితం ముగిశాక చాలా కష్టమవొచ్చు – అసలే ఆడపిల్లలు మాత్రమే ఉంటారు తమ స్కూల్లో, తమ చుట్టుపక్కల కూడానూ.

వీళ్ళ వివరాలు:
Sumangali Seva Ashrama
Cholanayakanahalli
R.T.Nagar Post
Bangalore-560032
Phone: 65301393/65301388

ఎలా వెళ్ళాలి: బళ్ళారీ రోడ్డుపై కనిపించే హెబ్బాళ్ బస్టాపు వద్ద ఎవర్నడినా చెప్తారు. అసలు బస్టాపు పక్కనే ఓ రోడ్డులో తిరిగాము…రోడ్డు పేరే SSA Road.

Published in: on November 30, 2009 at 9:00 am  Comments (7)  

విద్యావ్యవస్థలో విప్లవం తేగల “ఈపాడ్ లు”

సాంకేతికాభివృద్ధి ఎందుకు? అన్న ప్రశ్న నాకు కలిగినప్పుడల్లా నాకు నేను చెప్పుకునే సమాధానం, నేను బలంగా నమ్మే సమాధానం – మనిషి మేధస్సును అర్థం చేసుకునేందుకు కాదు, మనిషి బ్రతుకు సులభతరం చేయడానికి – అని. ఇది సరైన అభిప్రాయమా? కాదా? అన్న చర్చ పక్కన పెడితే, ఇటీవలి MIT Technology Review వారి ఇండియన్ ఎడిషన్ జులైనెల సంచికలో ఒక వ్యాసం చదివాను. “సాంకేతికాభివృద్ధి ఇందుకు” అనిపించింది. ఇదొక్కటే ఉదంతం అని నా ఉద్దేశ్యం కాదు. కానీ, ఇలాంటి ఉదంతాలకి నా వంతు ప్రచారం నేను కల్పిస్తే, మీ వంతు ప్రచారం మీరు చేస్తే, వారికి ప్రోత్సాహంగా ఉండటమే కాదు. ఏదో చేయాలనుకుని, చేయలేక, నిస్పృహతో పరిస్థితుల్ని నిందించే వారికి మేలుకొలుపుగానూ, సాంకేతికతను జన బాహుళ్యానికి మేలు చేకూర్చడానికి ఎలా ఉపయోగించాలి? అని ఆలోచించే వారికీ ప్రోత్సాహకరంగా ఉంటుందనిపించింది.

విషయానికొస్తే – పాఠశాలలో చెప్పే పాఠాలను ఈ-పాడ్ అనబడు ఐపాడ్ తరహా పరికరం సహాయంతో విద్యార్థులకి అందించడం. ఇది మొదట అమెరికాలో అమెరికన్ విద్యార్థులకే మొదలైనా కూడా, ఈ వార్తాంశం ఇది భారద్దేశంలోని ఓ మారుమూల పల్లెకి దీన్ని ఎలా చేర్చారు, దాని వల్ల పిల్లలకి కలిగిన లాభమేమిటి? అన్న విషయం గురించి చెప్పింది. ఇది సోలార్ పవర్ తో నడుస్తుందట. వివరాలు ఆ వ్యాసంలో ఉన్నాయి.

“ePod is set to bring about a renaissance in the way education is administered and managed, especially in rural and government schools with inadequate infrastructure.”
“The impact of this technological innovation will be felt few years from now when millions of Nagarajs get to take home their ePODs. “

-ఈ ప్రయత్నం విజయవంతంగా మన దేశంలోని పాఠశాలల్లో – ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆచరింపబడితే, మన విద్యావ్యవస్థలో మార్పు రాగలదేమో. అలాగే, ఎక్కువ మందిని చదువుకునే దిశగా లాగగలదేమో.

Published in: on July 28, 2009 at 10:30 am  Comments (7)  

“మాలపల్లి” నవలలోని ఒక సంభాషణ

నేను ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి “మాలపల్లి” చదువుతూ ఉంటే, ఒక సంభాషణ నన్ను బాగా ఆకర్షించింది. దాన్ని యధాతథంగా ఇక్కడ టైప్ చేస్తున్నాను:

జోతి: అమ్మా! రేపెక్కడికే అయ్యా, నీవు పోవడం
వెంకటదాసు: ఎక్కడకా? దేవుడి దగ్గరకు
జో: దేవుడు తన దగ్గరకి మిమ్ములని రానిస్తాడా?
మాలక్ష్మి: ఆ,ఆ. దేవుడు రానిస్తాడు.
జో: ఇక్కడి దేవుడి గుడిలోకి మనలను రానీయరేమి?
మా: రానీయకపోతే వాళ్ళే చెడ్డారులే! మీ అన్న మనకు దేవుడి గుడి కట్టిస్తున్నాడుగా
జో: మన గుడిలోకి వస్తాడా దేవుడు?
మా: ఆహా! ఎవరు కట్టించుకున్నా వస్తాడు. ఆయనకంటు లేదు.
రామదాసు:పెద్దదేవుడు మనలోనే ఉంటే ఈ రాతి దేవుళ్ళెందుకు? రాళ్ళు దేవుళ్ళైతే రాసులు మింగవా? అన్నారు.
వెం: నీదంతా అద్వయితం. అంతా నీవంత వాండ్లయితే దేవుడి గుళ్ళక్కరలేదు. మేమంతా ముక్కులు మూసుకుని కూర్చుంటామా ఏమి?

– ఈ ఒక్క సంభాషణలోనే నాకు “దేవుడు” గురించిన రకరకాల కోణాలను స్పృశించినట్లు అనిపించింది. జోతిది అమాయకత్వం, రామదాసుది “సత్యమే శివం” లో కమల హాసన్ పక్షం తరహాది. మాలక్ష్మిది దేవుడికి అందరూ సమానమే అన్న భావం, వెంకటదాసుది దేవుడికి, తనవారు దేవుణ్ణి చూడటం కోసం గుడి కట్టించాలన్న తాపత్రేయం. నాకెందుకో ఈ సంభాషణ చూడ్డానికి సింపుల్గా ఉన్నా కూడా, చాలా చాలా ప్రభావితం చేసేదిగా అనిపిస్తోంది.

ఇదే మూసలో ఉన్న మరో డైలాగు : “పస్తులుంటే దేవుడు మీకు పుణ్యమిస్తాడట. ఆ దేవుడు దినపస్తులుండే మాకెందుకియ్యడో!”

Published in: on November 17, 2008 at 11:00 am  Comments (9)  

రెండు వార్తలు

మొన్నాదివారం నాటి ఈనాడులో వచ్చిన వార్తల్లో రెండు వార్తలు చూసాక ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నా. మొదటి వార్త కాస్త నవ్వు తెప్పించింది. రెండవది కాస్త ఆలోచింపజేసింది. రెండు వార్తలూ పేజీలో చూడొచ్చు.

మొదటిది: “ద్విచక్ర వాహనం వెనుక సీటుపై చీరకట్టుతో ప్రయాణం వద్దు! ఒకవైపు కూర్చోవడం వల్లే ప్రమాదాలు: కేరళ హైకోర్టు”
ఇది కాస్త నవ్వు తెప్పించింది. అంటే, చీర కట్టుకుంటే ద్విచక్రవాహనాలు ఎక్కకూడదు అనమాట. అసలుకైతే, కేరళ హైకోర్టు అన్నది – ఒకవైపుకి కూర్చుని ప్రయాణం చేయకూడదని. దానికి అర్థం ఇదే కనుక ఈనాడు ఇదే హెడ్‍లైన్ చేసేసింది :)) కనీసం దక్షిణ భారద్దేశం లో చీర అన్నది చాలా కామన్ గా కనిపిస్తుంది. యువతులను, పిల్లలను పక్కన పెడితే, తక్కినవారందరూ చాలావరకూ చీరే వేసుకుంటు ఉంటారు. కార్లవాళ్ళని వదిలేస్తే, చాలా వరకు మధ్యతరగతి జీవులకు ద్విచక్ర వాహనాలే ఉంటాయి. భార్యా-భర్తా స్కూటర్ మీద వెళ్ళడం, ఒక్కోసారి పిల్లలతో వెళ్ళడం – ఇదంతా చిన్నప్పట్నుంచీ చూస్తున్న విషయమే. ఇలా కూర్చోడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి? మొత్తం యాక్సిడెంట్లలో అది ఎంత శాతం? జరిగినవి కూడా ఒక వైపుకి కూర్చోడం అన్న ఏకైక కారణం వల్ల జరిగాయా? అన్న వివరాలు కూడా తెలిపి ఉంటే, చూసి తెలుసుకుని తరించి ఉండేవాళ్ళం. నిజానికి ఒకవైపుకి కూర్చుంటే దూకేయడం ఈజీకదా… ఆ లెక్కన, వాళ్ళు బతికిపోవాలి కదా! 😉 లేదంటే, ఇదంతా విధి ఆడిస్తున్న వింత నాటకమేమో. ఆటోవారి బాగు కోసం కోర్టు తాపత్రేయమేమో. లేకుంటే, కారు డీలర్ల కోసమో! లేకుంటే, చీరని మరుగున తోయడానికేమో! ఆడవారిని బండి నడపడానికి ప్రోత్సహించడానికేమో. టూవీలర్ల సేల్స్ డబల్ చేయడానికేమో! లేదంటే, ఇవన్నీ కాకుండా ఆడవాళ్ళని రాతియుగంలోకి, వంటింట్లోకి మళ్ళీ తరిమేయడానికేమో!! లోగుట్టు కేరళ హైకోర్టుకే ఎరుక.

రెండవది: “కల్యాణ మండపం నిబంధనే అమ్మాయిని కాపాడింది!”
ఒక కల్యాణమండపంలో నిబంధన ఏమిటీ అంటే, అక్కడ పెళ్ళి చేసుకోబోయే వధూవరులు తప్పనిసరిగా హెచ్‍ఐవీ పరీక్షలు చేసుకోవాలని. దీని కారణంగా పీటల దాకా వచ్చిన ఓ పెళ్ళి నుండి ఓ అమ్మాయి బయటపడింది, వరుడికి హెచ్‍ఐవీ పాజిటివ్ అని తేలడంతో. ఈ వార్త చదివాక అన్ని కల్యాణ మండపాల్లోనూ ఇలాంటి నిబంధన ఉండాలా? అన్న ఆలోచన వచ్చింది. హెచ్‍ఐవీ ఉందన్న సంగతి ఆ వరుడికి తెలిసే పెళ్ళికి సిద్ధమయ్యాడో లేక తెలీక చేసాడో అన్నది అనుమానంగానే ఉంది కానీ, తెలిసి సిద్ధమైన కేసుల్లో ఇలాంటి స్కీము బాగా పనికొస్తుంది. కానీ, ఇంతదాకా వచ్చాక (ఈ పెళ్ళి ముహుర్తానికి కొన్ని గంటల ముందే ఫలితం తెలిసింది) పెళ్ళి చెడితే కలిగే ఎమోషనల్ స్ట్రెస్ కంటే ముందే ఈ టెస్టులేవో చేసుకోడానికి ముందుకు వచ్చి ఉండొచ్చు కదా అనిపించింది. కానైతే కల్యాణ మండపం వారి ఆలోచన మాత్రం మెచ్చుకోదగ్గదిగా అనిపించింది.

Published in: on August 27, 2008 at 9:10 am  Comments (6)  

Motivation for the day :)

ఏదో ఓ చిన్న మంచి పని(అదే…మనం మంచి అనుకున్నది..) చేస్తాము. అది ఎవరికో ఎక్కడో ఓ చోట మేలు కలిగిస్తుంది. మనం ఆనందిస్తాం. వాళ్ళూ ఆనందిస్తారు. అది ఈ వ్యవహారాన్ని చూసే ఒక కోణం.
మరో కోణం, కాస్త సినికల్ కోణం – “నువ్వొక్కదానివి ఏదో చిన్న పనిచేస్తే? ఏమౌతుంది? ఏమన్నా తేడా ఉంటుందా వాళ్ళ జీవితాల్లో?”.
ఇంకో కోణం – “ఇలా చిన్న చిన్న పనులు చేయడం కాదు. ఏదో చేయాలి…. అది నిజమైన పెద్ద మార్పు తీసుకురావాలి.” (దీన్నే enterpreneurship కోణం అంటాను నేను.)
ఇక, రెండో కోణం ని చూస్తే, ప్రతి ఒక్కరూ అంత నిరాశగా ఉండరు. మూడో కోణం చూస్తే, ప్రతి ఒక్కరూ అంత పనిమంతులై కూడా ఉండరు. ఎవరికి చేతనైన విధంగా వారు చేద్దామని అనుకుంటారు. (అసలు నాకెందుకు? నేను బాగున్నా కదా! అనేసుకుంటే అసలీ టపా మీక్కాదు…:) సమస్యే లేదు అలా అనుకుంటే మీకు…)
మొదటి రకం వాళ్ళని ప్రోత్సహిస్తే మూడోరకం లోకి మారినా మారొచ్చు. చెప్పలేం. అసలీ సుత్తంతా ఎందుకు చెబుతున్నా అంటే, ఇందాకే ఓ కొటేషన్ చదివాను…చదివాక… కొండంత ఉత్సాహం వచ్చింది. అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది..సినిక్స్ వ్యాఖ్యలు విని – “ఔను.. ఇప్పుడు నేనేదో ఓ చిన్న పని చేస్తే మాత్రం తేడా ఏముంటుంది ఈ ప్రపంచానికి?” అని. ఈ కొటేషన్ నాకు జవాబిచ్చింది.


Act as if what you do makes a difference. It does.  -William James,psychologist (1842-1910)

Published in: on March 18, 2008 at 6:56 am  Comments (3)  

నాలుగోరోజు + నా భావాలు…

నాలుగోరోజు…నిన్న నలుగురొస్తే…ఈరోజు ఏడుగురు. రోజు రోజుకీ సంఖ్య పెరగడం కాస్త ఆనందాన్ని కలిగించిందనే చెప్పాలి… ఈరోజు ఎందుకో గానీ… గత సంవత్సర కాలం లో ఈ పిల్లల తో గడపడం లో ముఖ్యమైన “గమనింపులు” ఏమన్నా ఉన్నాయా? అని ఆలోచించాను… బాగా striking గా కనబడ్డది ఏమిటంటే –

1. మునుపటి కంటే పిల్లలు బాగా తెలుగు చదువుతున్నారు

2. రెలేటివ్ గా లెక్కలు కూడా వేగంగానే చెబుతున్నారు

3. మునుపంత అల్లరి అల్లరి గా అనిపించడం లేదు

4. మునుపటి కంటే ఇప్పుడు దగ్గరైనట్లు అనిపిస్తోంది వారు నాకు

5. అప్పట్లా కొట్టుకోడం లేదు

– ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నాయంటే చెప్పలేను. వాళ్ళే మారారో…. వాళ్ళకి నేనే అలవాటు పడిపోయానో… లేక వాళ్ళు మారకపోయినా, ఇంకా ఫాం లోకి రాక అలా అల్లరి చేయకుండా ఉంటున్నారో… లేక నాబోటి వాళ్ళను చూసి జాలి పడ్డారో… నాకే సహనం,ఆప్టిమిజం పెరిగాయో….. నాకు మాత్రం ప్రస్తుతానికి అర్థం కావడం లేదు…. ఏదో ఒకటి వాళ్ళు మునుపటికంటే చురుగ్గా ఉన్నారు…. అది చాలు నాకు…. దానికి ఆషాకిరణ్ కారణం కాకపోయినా పర్వాలేదు. 🙂 అయి ఉంటే మాత్రం అది మేము సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం 🙂

ఒకానొకప్పుడు పోయినేడు ఈ టైం కి ఈ పిల్లల్నే చూసి పిల్ల రాక్షసుల్లా ఉన్నారు బాబోఇ అని నీరసించిన ఓ సాయంత్రం గుర్తు వచ్చి ఈ క్షణం లో కాస్త ఆశ్చర్యం – “ఈ పిల్లలేనా వాళ్ళు!” అని…. కాస్త చిర్నవ్వు…”ఆ నేనేనా నేను” అని….. “నిలువద్దము నిను ఎపుడైనా…నువు ఎవ్వరు అని అడిగేనా? ఆ చిత్రమె గమనిస్తున్నా కొత్తగా….” అని పాడుకోవాలనుంది 🙂

Published in: on September 20, 2007 at 3:04 pm  Comments (3)  

Ill-manners??

             మనుష్యులు ఇంత కేర్‌లెస్ గా ఉంటారు అన్నది మాత్రం నాకు అసలు అర్థం కాలేదు. ఈరోజు నేను బండి నడుపుతూ రోడ్డు పై వెళుతున్నాను. వెనక మా అమ్మ కూర్చుని ఉంది. రోడ్డేమో చిన్నది. అవతలవైపు నుంచి ఓ కారు వస్తోంది…నా బండి పక్కగా వెళ్ళింది ఆ కారు. అసలే రోడ్డు పై స్ట్రీట్ లైటు కూడా లేదు. కారు వాడేమో సగం తాగిన కాలుతున్న చిగెరెట్టు కిటికీ లోంచి విసిరేసాడు!!! కాస్తుంటే అది నా బండి మీద పడాల్సింది… ఏదో నా టైం బాగుండి పక్కన పడ్డది. ఎవర్నని అనగలం? ఆ చిన్న రోడ్డు లో మనం ఆపి గొడవ మొదలెడితే వేరే రకం గొడవ మొదలౌతుంది అక్కడ… ట్రాఫిక్ జాం గొడవ! మనసులో తిట్టుకుని ముందుకు కదిలాము. 😦

     ఇంత కేర్‌లెస్ గా ఎందుకు ప్రవర్తిస్తారో మనుషులు. పొగ తాగడం మంచి అలవాటా? కాదా? అన్న విషయం పక్కన పెడితే … బహిరంగ ప్రదేశాల్లో ఈ ప్రవర్తన ఎంత వరకు సమర్థనీయం? బస్సుల్లో తాగిన పీకలు అక్కడే పడేయడం.. లేదా…కిటికీల్లోంచి కిందకు ఉమ్మడం … తాగి బస్సెక్కి పక్క వాళ్ళ మీదకి తూలడం … ఇవి అన్నీ తలుచుకుంటేనే ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయి..? “అసలు అవతలివైపు నేనుంటే?” అని ఆలోచించరా ఈ పనులు చేసేవాళ్ళు??

Published in: on July 21, 2007 at 5:38 pm  Comments (5)  

ఏదో ఉండబట్టలేక….రాస్తున్నా!

మొన్న ఆ మధ్య మా మెడికల్ క్యాంప్ కోసం పోస్టర్లు అంటించడానికి వెళ్ళాము నేనూ, నా స్నేహితురాలూనూ. మళ్ళీ నా బ్రెయిన్ లో ఓ మూల నక్కి, అప్పుడప్పుడూ గోల చేసే నిస్సహాయత కాసేపు గోల మొదలెట్టింది.

అవి రోడ్డు లో ఖాళీ గా ఉన్న చోట ఏర్పరుచుకున్న స్లం ఏరియా లు. ఈరోజు ఉన్నాయి..రేపు ఉంటాయో లేదో తెలీదు. వర్షకాలం లో ఎలా బ్రతుకుతారో అర్థం కాదు. ఒక చిన్న టెంటేసుకుని అందులో ఐదారుమంది ఎలా ఉంటారో అర్థం కాదు. ఓ మోస్తరు మధ్యతరగతి ఇండిపెండెంట్ ఇల్లు పట్టే స్థలం లో అక్కడ కనీసం లో కనీసం ఓ 5,6 కుటుంబాల “ఇళ్ళు” ఉంటాయి. సమస్తం అక్కడే… … మరి… చూస్తూ చూస్తూ చలించకుండా ఉండలేను… చలించినా చేయగలిగేదేమీ ఉండదు. ఆదివారం క్యాంపు కి రండమ్మా, మీ వాళ్ళకి కూడా చెప్పండి అనడం తప్ప. మహా అంటే పిల్లలతో చదువుకొమ్మని చెప్పడం… వాళ్ళు కాస్త స్నేహంగా స్పందిస్తే సరదాగా ఓ పది నిముషాలు కబుర్లాడటమో.. అవకాశముంటే ఆటాడడమో…అంతే!

నాకు అన్నింటికంటే ఆశ్చర్యం కలిగించేది ఏమిటి అంటే – మాకున్న వాలంటీర్ల కొరత. ఇది విద్యార్థుల్లో ఉన్న indifference అనుకోవాలా? కాంపిటీషన్ లో పడి మానవత్వం మరుస్తున్నారా? క్యాంపు పెట్టిన ప్రతి సారీ ఇదే తంతు… తెలుగు తెలిసిన వాలంటీర్లు దొరకరు! ఉన్నది ఇద్దరో ముగ్గురో… వాళ్ళలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను ప్రీ-క్యాంపు కార్యకలాపాలకి తప్ప క్యాంప్ కి వెళ్ళి డాక్టర్ కి సహాయపడ్డం కుదరదు చాలా సార్లు. తోటి విద్యార్థులకి చెప్పడమైతే చెప్పగలను గాని, campaign చేసే తెలివితేటలు ఏడవలేదు నాకు! 😦

ఆ మధ్య లింగ్డో గారు మా కాలేజీ కి వచ్చినప్పుడు విధ్యార్థులతో ఓ సెషన్ ఏర్పాటు చేసారు. నేను ప్రశ్నలేమీ అడక్కపోయినా అక్కడే కూర్చుని అందరి అభిప్రాయాలు విన్నాను. అప్పుడో లింగ్డో అన్న మాటలు గుర్తు వస్తున్నాయి. టెక్నికల్ యూనివర్సిటీల్లో పిల్లల మధ్య సామాజిక సమస్యల గురించీ, రాజకీయాల ఇతర యూనివర్సిటీల్లో జరిగే వాడి-వేడి చర్చలు జరగవనీ, అలా జరగడం చాలా అవసరమనీ అన్నారు. బహుశా అలాంటి చర్చలు జరక్క పోవడానికీ, మా జనాల్లో (అనగా టెక్నికల్ యూనివర్సిటీల జనాలకి) ఉండే indifference కీ ఏమన్న సంబంధం ఉంటే ఉండొచ్చు అనిపిస్తుంది. వీళ్ళకి వాస్తవం అంటే పెద్ద పెద్ద కంపెనీల్లో లషలకు లక్షలు గుమ్మరించే ఉద్యొగం మాత్రమేనా? సమాజం లో ఇంకో తరగతి వారి జీవితాలు తమతో పోలిస్తే ఎంత దుర్భరంగా ఉన్నాయో పట్టదా? అనిపించింది. నాకేమీ ఎదగాలన్న కోరిక లేక కాదు. లక్షలు జీతాలొచ్చే ఉద్యోగం కోరుకోవడం తప్పనీ కాదు… నాకూ ఉంది చదువవగానే మంచి ఉద్యోగం లో చేరాలి అన్న కోరిక… ఎవరికుండదు? కానీ…. మనకున్న ఖాళీ సమయం లో…. ఓ కాస్త సమయం… ఐదు సినిమాలు చూసే సమయం లో నాలుగు మాత్రం చూసి ఓ సినిమా సమయం దీనికి కేటాయించొచ్చు.

అసలైనా, నేనెవరి కోసం ఈ టపా రాస్తున్నానో వారు ఇది చూసే అవకాశం లేదు అనుకోండి… అయినా…ఏదో నా గోల నాది….. మనీ సాయం చేయాలని విద్యార్థుల్నుంచి ఎవరూ ఆశించరు. మాట సాయం, కాస్త చేత సాయం…. వెరసి..కాస్త సమయానికి ఓ చెయ్యేస్తే  అంతకంటే కావాల్సిందేముంది…. ??

Published in: on July 15, 2007 at 3:25 pm  Comments (21)