(ఇది నేను 2007 నవంబర్ లో “ప్రజాకళ” తెలుగు వెబ్ పత్రికకి చేసిన అనువాదం. ఈ పత్రిక ఇప్పుడు లేదు. కనుక ఈ కథా అంతర్జాలంలో కనబడ్దం లేదు. ఆమధ్య పాతవన్నీ తవ్వుతూ ఉంటే ఇవి కూడా కనబడ్డాయి. సరే, ఎపుడైనా బ్లాగులో పెడదాం అనుకున్నాను. వీటికి అనుమతులు తీసుకోలేదు కనుక ఇపుడు కొత్తగా ఎవరికీ పంపకుండా, అప్పట్లో అలాంటి విషయాలు ఆలోచించకుండా చేసిన పనికి నేనే బాధ్యత తీసుకుంటున్నా బ్లాగులో పెట్టుకుని. అన్నట్లు ఇవాళ్టితో పదిహేనేళ్ళు నిండాయి ఈ బ్లాగుకి!).
“The Stranger” ఈ కథ పేరు. సత్యజిత్ రాయ్ “అతిథి” గా దీన్ని బెంగాలీ భాషలో రాయగా గోపా మజుందార్ ఆంగ్లంలోకి అనువదించారు. నేను ఆ ఆంగ్ల కథని తెలుగులోకి అనువదించాను. ఈ కథనే రాయ్ Agantuk పేరిట బెంగాలీ సినిమా గా, ఉత్పల్ దత్ ప్రధాన పాత్రగా తీశారు.
*******************
మొంటూ కొన్నాళ్ళుగా తన తల్లిదండ్రులు ఒక తాతగారి రాక గురించి చర్చించుకుంటూ ఉండటం వింటూ ఉన్నాడు. చిన్న తాత అట. ఆయన అమ్మ వాళ్ళ చిన్న మామయ్య అట. అతని వద్ద నుండి ఉత్తరం వచ్చినప్పుడు మొంటూ ఇంట్లోనే ఉన్నాడు. అతని అమ్మ ఆ ఉత్తరాన్ని ఓ సారి చదివి కాస్త సున్నితంగా ఆశ్చర్యపడ్డది – “ఊహించనేలేదు!” అంటూ. తరువాత కాస్త గొంతు పెంచి నాన్నగారిని పిలిచింది. ఆయనేమో బయట వరండా లో తన బూట్లు రిపేరు చేయించుకుంటూన్నారు. తల ఎత్తకుండానే – “ఏమిటీ?” అన్నారు.
“మామయ్య ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాడట.” ఉత్తరం తో బయటకు వచ్చిన అమ్మ అన్నది.
“మావయ్యా?”
“మా చిన్న మావయ్య. గుర్తుందా?”
ఈసారి నాన్న గారు తల తిప్పి, కనుబొమలెగరేస్తూ – “నిజంగా? అంటే…ఆయనింకా బ్రతికే ఉన్నాడంటావా?” అన్నారు.
“ఇదిగో, ఆయన రాసిన ఉత్తరం. నిజానికి నాకాయనకి రాయడం వచ్చని కూడా తెలీదు.”
నాన్నగారు కుర్చీ చేతి పై పెట్టి ఉన్న కళ్ళజోడు తీసుకుని – “ఏదీ, ఇటివ్వు. ఓ సారి చూద్దాం.” అన్నారు.
ఆ పేపర్ లో రాసి ఉన్నది చదివాక ఆయన కూడా – “ఊహించనే లేదు!” అన్నారు. అమ్మ అక్కడే ఓ స్టూలు పై కూర్చుంది. ఎక్కడో ఏదో తేడాగా ఉందని అర్థమైంది మొంటు కి. నాన్నగారే మొదట మాట్లాడి, తన సందేహాలను బయటపెట్టారు. “ఆయనకి మన అడ్రస్ ఎలా తెలిసిందంటావ్? ఇంకా, ఆయన మేనకోడలు ఓ సురేశ్ బోస్ అనేవాడిని పెళ్ళిచేసుకుని ఈ మహ్మద్‍పూర్ లో ఉంటోందని ఎవరు చెప్పారు?”
అమ్మ కనుబొమలు ముడిపడ్డాయి. “శేతల్ మామ చెప్పి ఉండొచ్చు ఆయనకి.”
“శేతల్ మామ ఎవరు?”
“అయ్యో దేవుడా! అసలు మీకు ఒక్కటీ గుర్తుండదూ? శేతల్ మామ అంటే, ఆయన మా మావయ్యల పక్కింట్లో ఉండేవారు నీలకంఠపురం లో. మా కుటుంబానికి బాగా సన్నిహితుడు. మీరు ఆయన్ని చూసారు. మన పెళ్ళప్పుడు ఎవరితోనో పందెం కాశారు – యాభై ఆరు మిఠాయిలు తింటాను అని. అప్పుడు ఎంత నవ్వుకున్నాం అది తలుచుకుని!”
“ఓహ్! అవునవును! గుర్తొచ్చింది!”
“చిన్న మావయ్య కి ఆయన చాలా సన్నిహితుడు. నాకు తెలిసీ మొదట్లో చిన్న మావయ్య ఆయనకి మాత్రమే ఉత్తరాలు రాసేవాడు.”
“శేతల్ బాబు ఇక్కడికి ఓసారి వచ్చారు కదూ?”
“వచ్చారు కదా. ఎప్పుడబ్బా?..మన రానూ పెళ్ళికి వచ్చారు కదా! రాలేదూ?”
“అవునవును. సరే కానీ, మీ చిన మావయ్య ఇల్లొదలి వెళ్ళిపోయి సన్యాసుల్లో కలవలేదూ?”
“అనే నేను కూడా అనుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఉన్నట్లుండి మన ఇంటికి ఎందుకు వద్దామనుకుంటున్నాడో మరి, అర్థం కావడం లేదు.”
నాన్నగారు ఓ నిముషం ఆలోచించి – “ఇంకెవరింటికి వెళ్ళగలడు ఆయన? ఎవరూ లేరు కద. మీ అత్తలూ, మావయ్యలు ఇప్పుడు లేరు. నీకున్న ఇద్దరు బంధువులూ ఒకరు కెనడాలోనూ, ఒకరు సింగపూర్లోనూ ఉన్నారు. ఇక ఇక్కడ మిగిలిందెవరు? నువ్వు తప్ప?”
“నిజమే. కానీ, అసలు నేను సరిగా చూడనైనా చూడని వ్యక్తి ని ఎలా గుర్తుపట్టేది? ఆయన వెళ్ళిపోయినప్పుడు నాకు రెండేళ్ళు. ఆయనకి పదిహేడు.”
“నీ పాత ఆల్బం లో ఫొటో లేదా ఆయనది?”
“ఏం లాభం దాని వల్ల? ఆయనో పదిహేనేళ్ళవాడు ఆ ఫొటో లో. ఇప్పుడు సుమారు అరవై ఏళ్ళు ఉంటాయి ఆయనకి.”
“నిజమే…ఇదో సమస్య గా మారనుందనిపిస్తోంది.”
“బీనూ గది ఖాళీగానే ఉంది అనుకోండి ఆయనకివ్వడానికి…కానీ, ఆయనెలాంటి ఆహారం తింటాడో…ఎవరికి తెలుసు?”
“నాకు ఆ విషయం లో దిగుల్లేదు. మనం తినే ఆహారాన్నే తినొచ్చేమో?”
“అలా అని ఏముంది? నిజంగా సన్యాసి అయిపోయి ఉంటే ఆయన శాకాహారమే తింటాడు. అప్పుడు ఇక మనం రోజుకి అయిదు రకాల వంటలు చేయాలి.”
“ఈ ఉత్తరం లో రాసిన భాష మామూలుగానే ఉంది. అంటే నా ఉద్దేశ్యం….సాధువులు మాట్లాడే తరహా లో లేదు అని. పైగా, తేదీ వివరాలు ఇంగ్లీషు లో రాసాడు. అక్కడక్కడా ఇంగ్లీషు పదాలు వాడాడు. ఇక్కడ చూడు… ’అనవసరం’ అని ఇంగ్లీషు లోనే రాసాడు.”
“కానీ, తన చిరునామా ఇవ్వలేదు కదా?”
“నిజమే”
“సోమవారానికి ఇక్కడికి వస్తా అంటున్నాడు.”
తన తల్లిదండ్రులిద్దరూ ఈ విషయం లో కాస్త దిగులుగా ఉన్నారని మొంటూ కి అర్థమైంది. ఇది ఖచ్చితంగా ఓ వింత పరిస్థితే. ఒక పూర్తి కొత్తమనిషి ని మామయ్యగా ఎలా ఒప్పుకోగలరు ఎవరన్నా? మొంటూ ఈ తాత గురించి ఓ సారో,రెండుసార్లో విని ఉన్నాడు అంతే. స్కూలన్నా పూర్తిచేయకుండానే ఆయన ఇల్లు వదిలిపెట్టేసాడని మాత్రం తెలుసు. మొదట్లో కొంతమందికి అప్పుడప్పుడూ ఉత్తరాలు రాసేవాడు. కానీ, తరువాత అతని గురించి సమాచారం లేదు. మొంటూ అప్పుడప్పుడూ అతని గురించి ఆలోచించేవాడు. ఆయన వెనక్కొస్తే బాగుండు అని కూడా అనుకున్నాడు. కానీ, అలాంటివన్నీ కథల్లోనే జరుగుతాయని అతనికి తెలుసు. కథల్లో అయితే సాధారణంగా ఎవరో ఒకరు ఉంటారు, ఇలా వచ్చిన మనుష్యుల్ని గుర్తించేందుకు. ఇక్కడ ఎవరూ లేరు. ఎవరైనా సరే, వచ్చి “నేనే మీ తాతను” అనవచ్చు. నిర్థారించుకునే మార్గమేదీ లేదు. తాతగారు పదిరోజులకంటే ఎక్కువ ఉండరు.
తన చిన్నతనం అంతా బంగ్లాదేశ్ లోని ఓ చిన్న ఊరిలో గడిచింది. అందువల్ల ఆయనకి అలాంటి ఓ చిన్న ఊరుని ఓసారి చూడాలనిపించింది. నీలకంఠపురం లోని సొంతింటికి వెళ్ళడం లో అర్థం లేదు. ఎందుకంటే ఇప్పుడక్కడ ఎవరూ ఉండటం లేదు. అందుకని ఆయన మహ్మద్ పూర్ వద్దాం అనుకున్నారు. కనీసం ఇక్కడో మేనకోడలు ఉంటోంది. మొంటూ వాళ్ళ నాన్నగారు ఓ వకీలు. మొంటూ కి ఓ అన్న, ఓ అక్క ఉన్నారు. అక్కకి పెళ్ళి అయిపోయింది. అన్న కాన్పూర్ ఐఐటీ లో చదువుకుంటున్నాడు.
మొంటూ వాళ్ళమ్మ ఆదివారానికల్లా ఏర్పాట్లన్నీ చేసేసింది. మొదటి అంతస్థులో ఓ గది సిధ్దం అయింది. మంచం పై కొత్త దుప్పటి కప్పారు, దిండ్లకు కొత్త కవర్లు వేసారు. కొత్త సబ్బులూ,టవళ్ళూ కూడా పెట్టారు. తాతగారు తనంతట తానే స్టేషన్ నుండి ఇంటికి వస్తారు అన్నది వీళ్ళ ఆలోచన. తరువాతేం జరుగుతుందో ఇక వేచి చూడాల్సిందే. ఈరోజు ఉదయమే నాన్నగారు అన్నారు –
“అతను మీ మావయ్యో కాదో కానీ, కనీసం కాస్త నాగరికంగా ఉంటాడని, సభ్యత తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. లేకుంటే రాబోయే పదిరోజులు కాస్త కష్టకాలమే”
“నాకిదంతా నచ్చడం లేదు. అసలు ఆ మనిషెవరో మనకు తెలీదు. కానీ, అతనితో సహజీవనం చేయాలి కొన్నాళ్ళు. కనీసం తన చిరునామా కూడా పంపలేదు. పంపుంటే ఏదో ఓ కారణం చెప్పి రావద్దని చెప్పి ఉండొచ్చు…”
కానీ, మొంటూ ఆలోచనలు మరోలా ఉన్నాయి. వాళ్ళింటికి ఓ అతిథి వచ్చి చాలా రోజులైంది. తనకేమో వేసవి సెలవులు. రోజంతా ఇంట్లోనే ఉంటాడు. సిద్ధు,రమేశ్,అనీశ్,రతిన్,ఛోట్కా – ఇలా స్నేహితులెందరో ఉన్నారు కానీ, ఇంట్లోనే ఎవరన్నా ఉంటే సరదా గా ఉంటుంది. రోజంతా అమ్మా నాన్నలతోనే గడపాలని ఎవరికనిపిస్తుంది? పైగా, ఈ “అతను నిజమైన మావయ్యా కాదా?” అన్న తతంగం అంతా ఆసక్తికరంగానూ, అనుమానాస్పదంగానూ ఉంది. పొరపాట్న అతను నిజం మావయ్య కాకుండా ఎవరో ఆగంతకుడై, తాను ఆ విషయాన్ని కనిపెట్టాడంటే ఎంత అధ్భుతంగా ఉంటుంది? అతన్ని బయటపెట్టి తానో హీరో అవ్వొచ్చు.
సోమవారం ఉదయం పదిన్నర నుండీ మొంటూ ఇంటి గుమ్మం బయట తచ్చాడటం మొదలుపెట్టాడు. పదకొండుంపావు కి ఒక రిక్షా తమ ఇంటివైపు రావడం గమనించాడు. దానిలో ఉన్న వ్యక్తి దగ్గర ఓ మిఠాయిల డబ్బా, ఓ చర్మపు సూట్‍కేసు ఉన్నాయి. ఒక కాలు ఆ సూట్‍కేసు పైన పెట్టుకుని కూర్చున్నాడు అతను. అతనేమీ సాధువులా లేడు. కనీసం, ఆ దుస్తులు అలా లేవు. ప్యాంటూ,షర్టూ తొడుక్కున్నాడు. అమ్మ అరవై ఏళ్ళుండొచ్చు అన్నది కానీ, ఇతను అంతకంటే చిన్నగా అనిపించాడు. జుట్టు దాదాపు నల్లగానే ఉంది. కళ్ళజోడు ఉంది కానీ, మరీ అంత మందంగా ఏం లేదు. అతను రిక్షావాడికి డబ్బులిచ్చి, సూట్‍కేసు కింద పెట్టాడు. మొంటూ వైపు కి తిరిగి – “ఎవరు నువ్వు?” అని అడిగాడు. అతని గడ్డం నున్నగా గీయించుకున్నాడు. సూటిగా ఉన్న ముక్కు, చురుకైన కళ్ళు, వాటిలో ఓ చిన్న మెరుపు.
మొంటూ సూట్‍కేసు తీసుకుంటూ జవాబిచ్చాడు – “నా పేరు సాత్యకీ బోస్.”
“ఏ సాత్యకివి నువ్వు? కృష్ణుడి శిష్యుడివా లేక సురేశ్ బోస్ సుపుత్రుడివా? ఆ బరువైన సూట్‍కేస్ ఎత్తగలవా? దాన్నిండా పుస్తకాలు ఉన్నాయి.”
“ఎత్తగలను.”
“అయితే, లోపలికి వెళదాం పద.”
వాళ్ళు వరండా లోకి అడుగుపెట్టేసరికి అమ్మ ఎదురొచ్చి ఆయన కాళ్ళకి నమస్కరించింది. ఆయన మిఠాయిల డబ్బా ఆమెకి అందిస్తూ –
“నువ్వు సుహాసినివి అనుకుంటాను?” అన్నాడు.
“అవును.”
“మీ ఆయన వకీలు కదూ? పనికెళ్ళాడనుకుంటాను?”
“అవును.”
“నిజానికి, నేనిలా వచ్చి ఉండాల్సింది కాదేమో. నాకు కాస్త మొహమాటంగానే ఉండింది. కానీ, మళ్ళీ ఓ వృద్ధుడ్ని కొన్నాళ్ళు మీరు భరించగలరులే అనుకున్నాను. ఎంతైనా పది రోజులే కదా. పైగా శేతల్ నిన్ను ఒకటే పొగిడాడు. కానీ, మీ సమస్య నాకు తెలుసు…నేనే మీ మావయ్యనని చెప్పుకోగల సాక్షమేదీ లేదు నావద్ద. కనుక నేనేమీ ప్రత్యేకమైన ఆతిథ్యం కోసం ఎదురుచూట్టంలేదు. ఏదో, ఈ కప్పు కింద ఓ వృద్ధుడికి ఓ పదిరోజులపాటు ఆశ్రయం ఇవ్వండి. అంతే.”
అమ్మ ఆ తాతగారిని ఓరగా చూస్తూ ఉండటం మొంటూ గమనించాడు. ఇప్పుడు ఆమె –
“స్నానం చేస్తారా?” అని అడిగింది.
“మీకు ఏమీ ఇబ్బంది లేదంటేనే..”
“లేదులేదు..మాకేం ఇబ్బంది లేదు. మొంటూ, వెళ్ళి పైన స్నానాలగది చూపించు. ఇంకా.. హుమ్..మీకు… ఎటువంటి ఆహారం ఇష్టమో..నాకు పెద్దగా తెలీదు..”
“నేను ఏదైనా తింటాను. మీరు ఏది తినిపించాలనుకుంటే అది తింటాను. ఇది నిజం.”
తరువాత – “స్కూలుకెళతావా నువ్వు?” మెట్లెక్కుతూ అతను మొంటూ ని అడిగాడు.
“వెళ్తాను. సత్యభామా హైస్కూల్. ఏడవ తరగతి.”
ఈ క్షణం లో మొంటూ ఓ ప్రశ్న అడక్కుండా ఉండలేకపోయాడు.
“మీరు సాధువు కాదా?”
“సాధువా?”
“అమ్మ మీరు సాధువు అయ్యారని చెప్పింది.”
“ఓ! అదా! అది ఎప్పుడో చాలా కాలం క్రితం. నేను ఇంటినుండి సరాసరి హరిద్వార్ వెళ్ళాను. నాకు ఇంట్లో ఉండటం నచ్చలేదు..అందుకని వెళ్ళిపోయాను. కొన్నాళ్ళు నిజంగానే రిషీకేశ్ లో ఓ సాధువు వద్ద ఉన్నాను. కానీ, స్థిరంగా అక్కడ ఉండలేక మళ్ళీ కదిలాను. తరువాత నేనే సాధువు దగ్గరికీ వెళ్ళలేదు.”
మధ్యాహ్నం భోజనం అతను బాగా ఆస్వాదిస్తూ తిన్నాడు. అతనికి మాంసాహారం తినడానికి మొహమాటమేమీ లేదని అతను చేపల్ని, కోడి గుడ్లను వద్దనకపోవడంలోనే అర్థమైంది. అమ్మ ఇది చూసి ఊపిరి పీల్చుకోవడం మొంటూ గమనించాడు. కానీ, ఆవిడ ఒక్కసారి కూడా ఆయన్ను “మావయ్యా” అని పిలవలేదు. మొంటూ మాత్రం “చింతాతయ్య” అని పిలవాలని చాలా ఆరాటపడ్డాడు. అతను భోజనం ముగించి ఓ కప్పులో పెరుగు తీసుకుంటూ ఉండగా ఏదో ఒకటి మాట్లాడాలని కాబోలు, మొంటూ వాళ్ళమ్మ అతనితో – “బెంగాలీ వంట తినకుండా చాలాకాలం గడపాల్సి వచ్చిందేమో కదూ మీరు?” అన్నది.
అతను నవ్వి – “కలకత్తా లో కొంతవరకూ రుచి చూసాను, ఈ రెండు రోజుల్లో. కానీ, దానికి ముందు….మీరంతా ఎన్నాళ్ళుగా నేను దానికి దూరంగా ఉన్నానో తెలిస్తే ఆశ్చర్యపోతారు.” అన్నాడు.
ఆవిడ మరిక మాట్లాడలేదు. మొంటూ – “ఎందుకలా? అసలు మీరెక్కడుంటారు?” అని అడగలనుకున్నా కూడా తనను తాను నియంత్రించుకున్నాడు. ఒకవేళ అతను ఎవరో దొంగైతే అతనికి ఇలా కట్టు కథలు చెప్పే అవకాశం ఇవ్వకూడదు. తనంతటతానుగా ఏదన్నా చెప్పేవరకూ ఆగుదాం అనుకున్నాడు. కానీ, అతనేమీ మాట్లాడలేదు. ఆయన నిజంగా నలభై ఏళ్ళు ఇలా దేశాటనల్లోనే గడిపి ఉంటే మాట్లాడ్డానికి బోలెడు విషయాలు ఉండి ఉండాలి. కానీ, మరి ఎందుకు అతను మౌనంగా ఉన్నాడు?
తన తండ్రి కారు చప్పుడు వినవచ్చేసరికి మొంటూ పైన ఉన్నాడు. వాళ్ళ అతిథి ఒక పుస్తక సహితంగా నడుంవాల్చాడు. అంతకుముందే మొంటూ అతనితో ఓ అరగంట గడిపాడు. మొంటూ ఆ గది ముంది తచ్చాడుతుంటే ఆయన లోపలికి పిలిచాడు.
“ఓ కృష్ణుని శిష్యుడా! లోపలికి రావచ్చు. నేన్నీకోటి చూపిస్తాను.”
మొంటూ వెళ్ళి మంచం పక్కనే నిలబడ్డాడు.
“ఇదేమిటో నీకు తెలుసా?” – అడిగాడు అతను.
“రాగి నాణెం.”
“ఎక్కడిది?”
మొంటూ ఆ నాణెం మీద రాసినది ఏమిటో చదవలేకపోయాడు.
“దీన్ని లెప్టా అంటారు. ఇది గ్రీకు దేశం లో ఉపయోగిస్తారు. ఇంకా…ఇదేమిటి?”
మొంటూ దీన్ని కూడా గుర్తు పట్టలేకపోయాడు.
“ఇది ఒక కురు. టర్కీ దేశానిది. ఇది రొమేనియాది – బాని అంటారు. ఇదిగో..ఈ నాణెం ఇరాక్ ది-ఫిల్ అంటారు.”
అలా అతను దాదాపు పది దేశాల నాణేలను చూపించాడు మొంటూ కి. మొంటూ ఆ దేశాల పేర్లు విననుకూడా లేదు.
“ఇవన్నీ నీకే.”
మొంటూ ఆశ్చర్యపోయాడు. ఏమంటున్నాడు ఆయన? అనీశ్ వాళ్ళ అంకుల్ కూడా నాణేలు సేకరిస్తాడు. ఆయన ఓ సారి మొంటూ కి అలా నాణేలు సేకరించేవారికి న్యుమిస్మటిస్ట్స్ అంటారని చెప్పాడు. కానీ, ఆయన వద్ద కూడా ఇన్ని రకాల నాణేలు లేవు. మొంటూ ఈ విషయం లో చాలా నమ్మకంగా ఉన్నాడు.
“నేను వచ్చేచోట నాకో మనవడు ఉంటాడని తెలుసు. అందుకనే ఈ నాణేలు నా వెంట తేవాలని నిశ్చయించుకున్నాను.”
గొప్ప ఉత్సాహం లో మొంటూ పరుగెత్తుతూ మెట్లు దిగి ఈ నాణేలు అమ్మకి చూపడానికి వెళ్ళాడు. కానీ, నాన్న గొంతు విని ఆగిపోయాడు. ఆ తాతగారి గురించి ఏదో అంటున్నాడు నాన్న.
“…పది రోజులు! ఇది కాస్త ఎక్కువే. మనమంత తేలిగ్గా మోసపోమని ఆయనకి చెప్పాలి. ఆయనకి ప్రత్యేకమైన ఆతిథ్యం ఏం ఇవ్వనక్కరలేదు. మనం ఈ మర్యాదలూ అవీ చేయకపోతే ఆయన బహుశా తొందరగానే వెళ్ళిపోవచ్చు. మన జాగ్రత్తల్లో మనముండాలి. ఈరోజు సుధీర్ తో మాట్లాడాను ఈ విషయం. అతనో సలహా ఇచ్చాడు. అల్మారాలు, కప్‍బోర్డులూ అన్నీ తాళం వేసేయి. మొంటూ రోజంతా ఆయనకి కాపలా కాయలేడు కదా. వాడిక్కూడా స్నేహితులున్నారు, వాడు వాళ్ళతో ఆడుకోడానికి వెళ్తాడు. నేను పనికి వెళ్తాను. అంటే ఇంట్లో నువ్వూ, సదాశివ్ మాత్రమే ఉంటారు. సదాశివ్ ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు, నాకు తెలుసు. నువ్వు కూడా మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చాలనుకుంటావ్ కదూ?”
“మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను.” – మొంటూ తల్లి అన్నది.
“ఏమిటి?”
“ఈ మనిషి లో కాస్త మా అమ్మ పోలికలు ఉన్నాయి.”
“నిజమా?”
“అవును. ఆ ముక్కు, ఆ చూపు అలాగే ఉన్నాయి.”
“సరే,సరే. ఆయన మీ మామయ్య కాదు అనడం లేదు నేను. కానీ, మీ మామయ్య ఎలాంటివాడో తెలీదు కదా మనకు. పెద్దగా చదువుకోలేదు, ఓ క్రమశిక్షణా పాడూ లేకుండా వీథులవెంట తిరిగాడు… చెప్తున్నా కదా…నాకీ వ్యవహారం ఏ మాత్రం నచ్చడం లేదు.”
మొంటూ తండ్రి మాట్లాడ్డం ఆపగానే ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అతనికి తండ్రి మాటలు నచ్చలేదు. ఆ కొన్ని గంటల్లోనే అతనికి ఆ కొత్తవ్యక్తి అంటే ఆసక్తి ఏర్పడింది. బహుశా ఈ నాణేలను చూసి నాన్నగారు మనసు మార్చుకుంటారేమో, అనుకున్నాడు.
“నిజంగా ఆయనే ఇచ్చాడా నీకు ఇవన్నీ?”
మొంటూ తల ఊపాడు.
“తను ఈ దేశాలన్నింటికీ వెళ్ళానని చెప్పాడా నీతో?”
“లేదు. అతనా మాట అనలేదు.”
“అయితే సమస్య లేదు. ఇలాంటి నాణేలు కలకత్తా లో దొరుకుతాయి. అక్కడ ఇలాంటివి అమ్మేవాళ్ళు ఉన్నారు.”
నాలుగున్నర అవుతూ ఉండగా ఆ మనిషి నాన్నగారిని కలవడానికి కిందకి వచ్చాడు.
“మీ అబ్బాయి, నేను అప్పుడే స్నేహితులం అయిపోయాం.” అన్నాడు
“అవును, వాడు చెప్పాడు.”
నాన్నగారు అతన్ని ఇందాక అమ్మ చూసినట్లే కొన్ని సార్లు అతన్ని ఓరగా గమనించారు.
“నాకు పిల్లలతో స్నేహం చాలా త్వరగా కుదిరిపోతుంది. బహుశా పెద్దవాళ్ళకంటే వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకుంటారేమో.”
“మీరు జీవితాంతం ఊరూరూ తిరుగుతూనే ఉన్నారా?”
“అవును. నేను ఎప్పుడూ ఒక చోట కూడా స్థిరంగా ఉండలేదు.”
“మేము అలా కాదు. ఓ లక్ష్యం అంటూ లేకుండా అలా తిరగలేము. నాకు కొన్ని బాధ్యతలున్నాయి – కుటుంబం పట్ల, పిల్లల్ని చూసుకోవాలి, ఉద్యోగం చేయాలి. మీరు పెళ్ళి చేసుకోలేదు కదూ?”
“లేదు.”
కొన్ని నిముషాల మౌనం తరువాత అతను – “సుహాసిని కి గుర్తు లేకపోవచ్చు కానీ, తన ముత్తాతల్లో ఒకరు – అదే, మా తాత-ఆయన కూడా ఇలాగే చేసారు. పదమూడేళ్ళ వయసులో ఇల్లు వదిలి వెళ్ళారు. నేను అప్పుడప్పుడూ కొద్దిరోజుల కోసం వచ్చేవాణ్ణి. ఆయనైతే మళ్ళీ రానే లేదు.”
మొంటూ తన తండ్రి తల్లి వైపు చూట్టం గమనించాడు.
“నీకు తెలుసా ఈ విషయం?”
“ఒకప్పుడు గుర్తుండేది అనుకుంటా…కానీ, ఇప్పుడేం గుర్తురావడం లేదు.” అన్నది అమ్మ.
టీ తరువాత ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. మొంటూ స్నేహితులకి ఈ వింత బంధువు గురించి తెలిసింది. ఇతను అసలు బంధువే కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయని అర్థమయ్యాక ఆయన్ని చూడాలన్ని ఉబలాటం కొద్దీ వాళ్ళందరూ మొంటూ ఇంటికి వచ్చారు. తాతగారికి ఇంతమంది పదేళ్ళ లోపు పిల్లల్ని కలవడం ఆనందం కలిగించినట్లు అనిపించింది. తన చేతికర్రను తీసుకుని వాళ్ళందరిని బయటకు తీసుకెళ్ళాడు. అక్కడికి కాస్త దూరం లో మైదానం లో ఉన్న ఓ చెట్టుకింద ఆగారు. అక్కడ నేలపై కూర్చున్నారు, కబుర్లు చెప్పుకునేందుకు.
“తువరేగ్స్ అంటే ఏమిటో తెలుసా?”
అందరూ తల అడ్డంగా ఊపారు.
“సహారా ఎడారి లో ఒక సంచార తెగ ఉంది -తువరెగ్స్ అని. వాళ్ళు బాగా సాహసులు. దేనికీ వెనుకాడరు – దొంగతనమైనా సరే, హత్యలైనా సరే. వాళ్ళనుండి తప్పించుకున్న ఓ తెలివైన వాడి కథ చెబుతాను, వినండి.”
పిల్లలందరూ ఈ కథని అమితాసక్తితో విన్నారు. మొంటూ తన తల్లితో తరువాత చెప్పాడు –
“ఆయన కథ ఎంత బాగా చెప్పాడంటే – మాకు అదంతా నిజంగా చూస్తున్నట్లే అనిపించింది.”
అతని తండ్రి ఆ మాటలు అప్రయత్నంగా విని – “ఇతను చాలా విరివిగా చదివినట్లు అనిపిస్తోంది. నాకు ఇలాంటి కథే ఓ ఇంగ్లీషు పత్రిక లో చదివినట్లు గుర్తు.” అన్నాడు.
తాత గారి పెట్టెనిండా పుస్తకాలున్నాయని తనకి తెలుసని, కానీ అవి అన్నీ కథల పుస్తకాలో కావో తెలీదని మొంటూ తన తల్లిదండ్రులతో అన్నాడు.
మూడురోజులు గడిచాయి. ఏ దొంగతనమూ జరగలేదు, ఆ అతిథి ఎలాంటి సమస్యనూ తేలేదు. పెట్టిందేదో ఆనందంగా తిన్నాడు. ఏ కోరికలూ కోరలేదు. దేనిగురించీ పేచీ పెట్టలేదు. మొంటూ వాళ్ళ నాన్న ఆఫీసు వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు. ఇది ఎప్పుడో అరుదుగా కానీ జరగదు. మొంటూ ఆంచనా ప్రకారం వాళ్ళు అందరూ ఈ అసలో-నకిలీనో తెలీని మనిషి చూడడానికే వచ్చారు. తాతగారు అక్కడ ఉండటాన్ని మొంటూ తల్లిదండ్రులు ఒప్పుకునట్లే కనిపించారు. మొంటూ తన తండ్రి – “అతను చాలా సామాన్యంగా జీవించే వ్యక్తి అని ఒప్పుకోవాల్సిందే. పైగా, అతను మరీ అతిస్నేహంగా ఉండటానికి ప్రయత్నించడం లేదు. కానీ, ఎవరన్నా ఇలా ఎలా బ్రతుకుతారో అర్థం కావడం లేదు. అతను బాధ్యతల నుండి తప్పించుకోవడానికే ఇంటి నుండి పారిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఉత్త పరాన్నజీవులు. ఇలాగే జీవితాంతం ఇంకోళ్ళ పై ఆధారపడి ఉంటాడు.” – ఇలా ఎవరితోనో చెబుతూఉండటం విన్నాడు ఓ రోజు.
మొంటూ ఓ రోజు ఆయన్ని “చిన తాతా” అని పిలిచాడు. ఆయన మొంటూ వైపు ఓ సారి తిరిగి, చిన్నగా నవ్వాడు. అంతకు మించి ఏమీ అనలేదు. మొంటూ తల్లి ఒక్క సారి కూడా “మావయ్యా” అని పిలవలేదు. మొంటూ ఈ సందేహం తల్లి ముందు వెలిబుచ్చితే, ఆమె – “ఆయన ఆ విషయం ఎక్కువ పట్టించుకుంటున్నట్లు లేడు. ఒకవేళ ఆయన ఎవరో ఆగంతకుడు అయితే? అప్పుడెంత ఇబ్బందిగా ఉంటుంది?”
నాలుగోరోజు ఆ అతిథి బయటకు వెళ్ళి వస్తానని అన్నాడు. “నీలకంఠపూర్ కి బస్సు ఉంది కదా?” – అడిగాడు.
“అవును, ఉంది. మెయిన్ మార్కెట్ నుండి ప్రతి గంటకూ ఓ బస్ వెళుతుంది అక్కడికి.” – నాన్న జవాబు.
“భోజనం ఇక్కడే చేస్తారు కదూ?” – మొంటూ తల్లి అడిగింది.
“లేదు. ఎంత త్వరగా వెళితే అంత మంచిది. నేనెక్కడ దార్లో భోంచేస్తాను. నా గురించి పెద్దగా ఆలోచించకండి.”
తొమ్మిది కాకముందే బయలుదెరాడు ఆయన. మధ్యాహ్నం మొంటూ ఇక ఉత్సుకత ఆపుకోలేక పోయాడు. తాతగారి గది ఖాళీగా ఉంది. మొంటూ కి చాలా కుతూహలంగా ఉంది ఆ సూట్‍కేస్ లో ఉన్న పుస్తకాలు ఎలాంటివో అని. నాన్న ఇంట్లో లేడు. అమ్మ కింద విశ్రాంతి తీసుకుంటోంది. దాంతో మొంటూ తాతగారి గదిలోకి వెళ్ళాడు. ఆ సూట్‍కేస్ కి తాళం లేదు. అంటే, ఆ మనిషి కి దొంగతనం గురించిన బాధ లేదల్లే ఉంది. మొంటూ ఆ సూట్‍కేసు తెరిచాడు. కానీ, లోపల పుస్తకాలు లేవు. ఉన్నవి కూడా సరైనవిగా లేవు. అవి నోటు పుస్తకాలు..సుమారు ముప్ఫై రకాలున్నాయి. వీటిలో దాదాపు పది పుస్తకాలు బైండింగ్ చేసి ఉన్నాయి. మొంటూ ఒకటి తెరిచాడు. బెంగాలీ లో రాసి ఉంది. చేతిరాత అందంగా, స్పష్టంగా ఉంది. ఒక పుస్తకం తీసుకుని మంచం పైకి ఎక్కాడు మొంటూ. కానీ, వెంటనే దిగేయాల్సి వచ్చింది. చప్పుడు చేయకుండా మొంటూ తల్లి పైకి వచ్చింది.
“ఏం చేస్తున్నావ్ మొంటూ? ఆయన వస్తువులు పాడు చేస్తున్నావా?”
మొంటూ మంచి పిల్లాడిలా ఆ పుస్తకం ఆయన పెట్టెలో పెట్టేసి బయటకి వచ్చాడు.
“నీ గదికి నువ్వు వెళ్ళు. వేరే వాళ్ళ వస్తువులతో నువ్వు అలా ఆడుకోకూడదు. వెళ్ళి నీ పుస్తకాలు నువ్వు చదువుకో.”
ఆ అతిథి సాయంత్రం ఆరు దాటాక ఇంటికి తిరిగివచ్చాడు. అదే రోజు రాత్రి భోజనాలప్పుడు అతను చెప్పిన విషయం వీళ్ళందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
“నేను రేపు వెళ్ళిపోతాననుకుంటా, బహుశా. మీ ఆతిథ్యం లో తప్పు పట్టడానికేం లేదు కానీ, నాకే ఓ చోట ఎక్కువకాలం స్థిరంగా ఉండటం చేత కాదు. “
ఈ విషయం విని తన తల్లిదండ్రులేం పెద్దగా బాధపడలేదు అని మొంటూ కి తెలుసు. కానీ, తనకే బాధగా అనిపించింది.
“ఇక్కడ నుండి మీరు కలకత్తా వెళతారా?” – నాన్న అడిగాడు.
“అవును. కానీ, ఎక్కువకాలం ఏమీ ఉండను. త్వరలోనే ఇంకెక్కడికో వెళతాను. నేనెప్పుడూ ఇంకోళ్ళకి భారం కాకూడదనే ప్రయత్నించాను. ఇల్లు వదిలి వచ్చినప్పటినుండీ నేను పూరి స్వతంత్రంగానే జీవించాను.”
ఈ సమయం లో మొంటూ తల్లి అతని మాటలకి అడ్డుకట్ట వేస్తూ-
“ఎందుకు మిమ్మల్ని మీరు భారం అనుకుంటారు? మాకే విధమైన ఇబ్బందీ కలుగలేదు.” అన్నది.
కానీ, మొంటూ కి తెలుసు, అది నిజం కాదని. ఎందుకంటే అతను ఓ రోజు తండ్రి పెరిగిపోయిన ధరల గురించీ, ఇంకో మనిషి వస్తే అతనికి పెట్టడం కూడా ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో చెప్పడం విన్నాడు.
ఆ అతిథి ని స్టేషన్ లో దిగబెట్టడానికి మొంటూ, అతని తండ్రి – ఇద్దరూ వెళ్ళారు. మొంటూ కి తన తండ్రి ఇంకా కాస్త ఇబ్బంది పడుతూనే ఉన్నట్లు తోచింది. అతనికి తెలుసు, ట్రైన్ వెళ్ళిపోయాక కూడా నాన్న గారు ఇంకా తమతో ఇన్నాళ్ళు గడిపి వెళ్ళిన మనిషి అసలు అతనన్నట్లు తమ బంధువేనా? అని ఆశ్చర్యపోతూనే ఉన్నారని.
ఓ వారం తరువాత మరో పెద్దాయన వచ్చాడు వాళ్ళ ఇంటికి. మొంటూ వాళ్ళమ్మ వాళ్ళ శేతల్ మామ. మొంటూ అతన్ని ఒకే ఒకసారి చూసాడు – తన అక్క పెళ్ళప్పుడు.
“ఓహ్! శేతల్ మామా! మీరా…ఏమిటి, ఇలా వచ్చారు?”
“బాధ్యత. నిజానికి రెండు బాధ్యతలు, ఒకటి కాదు. కాకపోతే నా వయసులో ఉన్న వృద్ధుడు పాసెంజర్ రైలెక్కి మరీ ఇలా ఎందుకు ప్రయాణం చేసి వస్తాడనుకున్నావు? నేనీరోజు మీతో భోంచేస్తున్నాను – ఇదే నా హెచ్చరిక.”
“మీరిక్కడే భోజనం చేసి తీరాలి. ఏం తింటారు? ఇక్కడ కలకత్తా లాగ కాదు. ఏదైనా దొరుకుతుంది.”
“ఆగు,ఆగు. నేనేం చేయాలని వచ్చానో నన్ను పూర్తి చేయనీ.” అంటూ ఆయన తన భుజానికున్న సంచీలోంచి ఓ పుస్తకం తీసాడు.
“మీరీ పుస్తకం గురించి విని ఉండరు కదూ?”
మొంటూ వాళ్ళమ్మ ఆ పుస్తకం తీసుకుని చూసి – “లేదు. ఏం?”
“పులిన్ మీకు చెప్పలేదని నాకు తెలుసు.”
“పులినా?”
“మీ చిన మావయ్య! మీతో ఇక్కడ ఐదు రోజులు గడిపిన మనిషి. అసలు అతని పేరు కూడా కనుక్కోవాలి అనుకోలేదు కదూ? ఈ పుస్తకం పులిన్ రాసిందే.”
“ఆయన రాసాడా?”
“మీరు పేపర్లు చదవరా? ఈమధ్యే అతని పేరు వచ్చింది. ఈ కోవకు చెందిన ఆత్మకథలు ఎన్నున్నాయి చెప్పండి మన సాహిత్యం లో?”
“కానీ..కానీ…ఈ పేరు వేరేలా ఉంది..”
“అదొక మారుపేరు. అతను ప్రపంచమంతా చుట్టి వచ్చాడు. అయినా, ఎంత నిగర్విగా ఉన్నాడు!”
“ప్రపంచమంతానా?”
“మన దేశం పులీన్ రే వంటి సంచారిని ఎప్పుడూ చూసి ఉండలేదు అని నేను నమ్ముతున్నాను. ఇదంతా అతను తన సొంత డబ్బుల్తో చేసాడు. ఓడపై పని చేశాడు, కూలీ గా, చెక్క వ్యాపారం లో కార్మికుడిగా, వార్తాపత్రికలు అమ్మేవాడిగా, చిన్న దుకాణదారుగా, లారీ డ్రైవరు గా – ఓ పని అంటూ లేకుండా అన్ని పనులూ చేసాడు. ఏ పనినీ చిన్నదిగా చూడలేదు. అతని అనుభవాలు కల్పనకన్నా వింతగా అనిపిస్తాయి. ఓ సారి పులి బారిన పడ్డాడు, ఓ సారి పాము కాటుకు గురయ్యాడు, ఓ సారి సహారా ఏడారి లోని ఓ ప్రమాదకరమైన సంచార తెగవారి నుండి తప్పించుకున్నాడు. ఓ ఓడ ప్రమాదం లో మడగాస్కర్ తీరం దాకా ఈదాడు. అతను భారతదేశాన్ని 1939 లో వదిలిపెట్టి ఆఫ్గనిస్తాన్ వెళ్ళాడు. మన ఇంటి సరిహద్దులు దాటి బయటకు వస్తే ప్రపంచమంతా మన ఇల్లే అని అతని అభిప్రాయం. అప్పుడిక తెల్లవాళ్ళు-నల్లవాళ్ళని, పెద్దా-చిన్నా అని, నాగరికులు-అనాగరికులు అన్న తేడాలేం ఉండవు.”
“కానీ..ఆయన ఇదంతా మాకు చెప్పలేదే?”
“మీ సంకుచిత మైన మనస్తత్వం తో మీరు ఆయన చెప్పేవి విని నమ్మగలిగేవారా? అసలతను అసలా? నకిలీనా? అన్నదే మీరు నిర్ణయించుకోలేకపోయారు. ఒక్కసారన్నా నువ్వు అతన్ని “మావయ్యా!” అని పిలిచావా? మళ్ళీ మీరేమో అతనే అన్నీ చెప్పాలని ఆశిస్తున్నారు!”
“ఓ! ఎంత బాధాకరం! మేము ఆయన్ని తిరిగి రమ్మని అడగలేమా?”
“లేదు. పక్షి ఎగిరి పోయింది. తను బాలి కి ఎప్పుడూ వెళ్ళలేదని చెప్పాడు. బహుశా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ పుస్తకం మీకిమ్మని..అదే మీ అబ్బాయికి ఇమ్మని ఇచ్చాడు. వాడింకా పిల్లవాడు. ఈ పుస్తకం వాడి మీద కొంత ప్రభావం చూపవచ్చు అని అన్నాడు.” అన్నాడు శేతల్ మామ.
“కానీ, వాడెంత పిచ్చిగా ప్రవర్తించాడో మీకింకా చెప్పలేదు. నేను వాణ్ణి ఇంకొణ్ణాళ్ళు ఉండమని బ్రతిమాలాను. ఆ పుస్తకానికి అకాడెమీ పురస్కారం వస్తుందని నాకు తెలుసు. ఈ మధ్య అకాడెమీ వాళ్ళు పదివేలు ఇస్తున్నారు. కానీ, వాడు నా మాట వినలేదు. ఏమన్నాడో తెలుసా? – ’ఒక వేళ ఏదన్నా నాకు డబ్బు వస్తే, మహ్మద్ పూర్ లో ఉన్న నా మేనకోడలికి ఇవ్వు. నన్ను బాగా చూసుకుంది.’ అని చెప్పి దాన్నే కాగితం పై పెట్టాడు. ఇదిగో డబ్బు – తీసుకో.”
అమ్మ శేతల్ మామ నుండి ఆ కవరు తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ ఉద్వేగం నిండిన గొంతుతో అన్నది – “ఊహించనే లేదు!” అని.
Excerpt from “Semantic Universals …”-last
(These are some final notes on the book Semantic Universals in Indian Languages by Anvita Abbi, which includes Chapter 4 and Conclusions chapter. All previous articles in this series can be seen here.)
*****
Soliloquy: Now, I had big time troubles with chapter 4 – so I could not take much notes as I did not understand much. But, I will still try to write down what I understood. Reg my troubles, first, the examples were unclear about the phenomenon they are supposed to explain. Second, in each language, a different sentence was taken. So, I could not see what actually is being shown through those examples. Thirdly, the language used was way too academic for me (may be I should not complain about this part at least, but may be I can, because I am not a linguist!). Finally, in general, it appeared to me that the goals of this chapter were fuzzy.
(Disclaimer: All the above opinions are mine and only mine. As a reader, I have the right to say I had trouble understanding certain things in someone’s book!)
Enter the dragon:
Idea: “Languages of the South-Asian subcontinent do make a distinction between ‘subjects’ who act, do, or perform an action from ‘subjects’ who undergo, experience, have, become or any such phenomenon which is ‘out of control’ of the subject nominal”. The ‘non-performative’ kind of actions are mostly feelings like like/dislike, hunger, pain, etc., Now, as far as I understood, this chapter is a discussion on this aspect.
(Actually, they call even “thinking” non-performative but I am still wondering why!)
“… further points out an interesting paradox that these languages describe such subjective experience (which are a kind of internalized states and experiences) from an ‘external point of view’ that is by putting the experiencing subject in oblique case and either making the experience itself the grammatical subject or, less commonly, using an impersonal (and generally deleted) grammatical subject.”
I guess this means saying: “నాకు ఆకలేస్తోంది” for “I am hungry” instead of “నేను ఆకలితో ఉన్నాను”.
******
There are four sections in this chapter:
1. Non experiential constructions
2. Experiential constructions
3. Semantic Typology
4. Linguistic Encoding
5. Discussions on what is dative? what is subject etc.
(With some difficulty I managed to understand the first 3 sections.)
******
Section-1
“A nominal element can be in possession of alienable or inalienable entities .. .. many of the South Asian languages mark the possessor NP distinctly from the non-possessor or agnetive NP”
The examples here were not so clear to me, but here is what I understood after a discussion through examples, with a friend who is not a linguist but the native speaker of a different language. (We just took the sentences mentioned here and checked how they look in our respective languages to understand what the author is suggesting)
So, if I say “I have two hands”, I say: “నాకు రెండు చేతులు ఉన్నాయి”/मुझे दो हाथ है (someone might also say: “मेरे को दो हाथ है”) ; But if I say – I have two umbrellas, I say – “నా దగ్గర రెండు గొడుగులు ఉన్నాయి/मेरे पास दो छाते है; (because hands are my inalienable possession unless I meet with a horrible accident.) Although its not mentioned here, there are fuzzy cases like: “వాడికి బోలెడు డబ్బుంది” vs “వాడి దగ్గర బోలెడు డబ్బుంది”. But the point is: “All the possessive constructions are translatable by “have” in English.”
******
I did not understand the rest of this chapter much, at least not as much that I could write my own notes. So skipping it. I am in urgent need of a refresher course on parts of speech and basic grammar 🙂
*******
An excerpt from the conclusion chapter of the book:
I started reading Dr Peri Bhaskara Rao’s “Reduplication and Onomatopoeia in Telugu”, which on one hand is very interesting and on the other hand raises too many questions within me. Perhaps because its zooms in more into one language, which happens to be my language (with a different dialect), i am getting to notice things I did not notice while reading the chapter on same stuff in “Semantic Universals..”.
Anyway, end of story for this book. Interesting book which perhaps would have been better with some editing and proof reading.
Tags: Running Commentary, Semantic Universals in Indian Languages