(మొదటి, రెండవ, మూడవ, నాల్గవ భాగాలు)
******
సాంటోరినీ నుండి విమానప్రయాణంలో ఏథెంస్ చేరుకున్నాము. ఆ విమానం వర్షం కారణంగా గంటన్నర ఆలస్యంగా బయలుదేరింది. మేము ఏథెంస్ సెంటర్లోని ప్లాకా ప్రాంతంలో ఒక అపార్ట్మెంటు అద్దెకు తీసుకున్నాము. ఇదివరలో సాంటోరినీ వెళ్ళేముందు వచ్చిన ప్రాంతమే కనుక అపార్ట్మెంట్ కనుక్కోడం అంత కష్టం కాలేదు. సరే, సామానులు అవీ పెట్టేసి కిటికీ తెరిస్తే, కనుచూపు మేరలోనే Acropolis కనబడ్డది! ఏమి లొకేషన్ అసలు ఈ ఇంటిది! అనుకున్నాము 🙂
ఇక ఆవేళ్టికి కాసేపు బయట నడిచి, అక్కడికి పదినిముషాల దూరంలోనే ఉన్న Archaeological sites ని బయటనుండి చూస్తూ కాసేపు తిరిగాము. మేము వెళ్ళేసరికి మరి అవన్నీ మూసేసారు. అన్నట్లు, ఈ ప్రాంతాల్లో ఎన్ని ప్రాచీన కట్టడాలు ఉన్నాయంటే – ఈ ప్లాకా ప్రాంతాన్ని Neighbourhood of the Gods అంటారట!
ముందు ఒక పోస్టులో చెప్పినట్లు, చీజ్ తినడానికి కమిట్ అవుతే, ఇక్కడ శాకాహారులకి బాగానే వెరైటీలు దొరుకుతాయి. అయితే, ఈ ప్రాంతంలో బాగా నాకు చిరాకు పుట్టించిన అంశం ఏమిటంటే – ఎక్కడికి వెళ్ళినా కూడా, గదుల్లోపల కూడా పొగబోతులు గుప్పు గుప్పుమని వదుల్తూనే ఉంటారు. ఈ లెక్కలో బయట కూర్చుని తినడమే శ్రేయస్కరం అన్న నిర్ణయానికి వచ్చాను నేను. కనీసం గాలి అన్నా ఆడుతుంది!
తరువాతి రోజు ఆదివారం. Sundays in Athens అని ఇదివరలో చూసిన బ్లాగు పోస్టులో లాగ చేద్దామనుకున్నాము.
మొదట పొద్దున్నే ఒక Greek Orthodox Church లో ప్రార్థనలు వినడానికి వెళ్ళాము. మేము వెళ్ళిన చర్చి ఏథెంస్ లోని అతి పురాతనమైన చర్చిలలో ఒకటి. సాధారణంగా నేనిక్కడ జర్మనీలో టూరిస్టులలో పేరున్న చర్చిలకి వెళ్తే, అక్కడ టూరిస్టులే ఎక్కువుంటారు. అందునా, ఏదో ప్రార్థన చేసేవాళ్ళు చేస్తారు కానీ, తీవ్రంగా అందులో నిమగ్నమయ్యే వాళ్ళు ఎక్కువ కనబడరు. కానీ, ఇక్కడ ఈ చర్చిలో మాత్రం చిన్న చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధులదాక దాదాపు నాకు కనబడ్డ అందరూ చాలా నిష్టగా ఆ పూజారి చెప్పేదంతా వింటూ, ఏవో ఉచ్ఛరిస్తూ, కొందరైతే అక్కడున్న పటాలను తడిమి ఆ చేతుల్ని గుండెకి ఆన్చుకుని ప్రార్థిస్తూ – ఇలా ఉన్నారు. నాకంత మతవిశ్వాసాలు లేకపోవడం వల్ల ఊరికే వీళ్ళందరినీ చూస్తూ గడిపాను నేను. కానీ, ఇంతటి భక్తి కొంచెం ఆశ్చర్యం కలిగించిందనే చెప్పాలి. ఆదివారాలు మా ఊరి చర్చిలోపల ఏమవుతుందో నాకు తెలియదు కాని, సాంటోరినీలో కూడా వారం మధ్యలో ఓరోజు అక్కడి చర్చి పక్క నుండి నడుస్తూంటే గుంపులు గుంపులుగా జనం బైటకి వస్తూ కనబడ్డారు. ఈతరహాలో ఇంత భక్తి ఇంకోచోట చూశా ఈ మూడేళ్ళలో. బల్గేరియా దేశ రాజధాని సోఫియాకి వెళ్ళినపుడు అక్కడి కొన్ని చర్చిలలో చూశాను. విగ్రహాలకి మొక్కడమూ, చర్చి బయట తాయెత్తుల టైపులో ఏవో అమ్ముతున్న స్టాల్సు ఇలా 🙂
మా తరువాతి మజిలీ గ్రీస్ పార్లమెంటు. బయట నుండి చూస్తే చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. పెద్దగా ఆకట్టుకునే అంశాలేవీ కనబడవు, బయట కాపలా కాసే ఇద్దరు భటులు తప్ప. వీళ్ళు గంటకోసారి పొజిషంస్ మారతారు. అయితే, ఆదివారం రోజు పొద్దున్న పదిన్నరకి వెళ్తే మట్టుకు ఆ ప్రహసనంతో పాటు, ఓ మిలట్రీ బాండు, వాళ్ళ మార్చ్, ఇవన్నీ చూడొచ్చు. బాగా హడావుడి హడావుడి చేశారు పోలీసులు, ఈ మార్చిలో పాల్గొనే భటులు, టూరిస్టులు, అక్కడ ఉన్న పావురాలు, వాటికి గింజలేసేవాళ్ళూ, అందరూ కలిసి.
ఇక్కడ నుండి మొనాస్తిరాకి స్టేషన్ పక్కనే ఉన్న Folk Arts మ్యూజియంకి వెళ్ళాము. అది ఒకప్పుడు మసీదంట. దాని పక్కనే ఒక ప్రాచీన స్థలం – Hadrian’s Library ఉంది. చిన్నదే అయినా ఈ మ్యూజియం నాకు చాలా నచ్చింది. తమ దేశపు కళాకారుల గురించి అంత వివరంగా బోర్డులు పెట్టి మరీ ప్రదర్శించడం బాగుంది. కళాకారులంటే ప్రాచీనులనుకునేరు. ఇప్పటివారు! గత మూడు నాలుగు వందల ఏళ్ళలోని వారే అంతానూ. కొంతమంది ఇంకా జీవించి ఉన్నవారు కూడా ఉన్నారు ఇక్కడ పేర్కొన్న కళాకారుల్లో! స్థానిక జానపదుల గురించి అనమాట. అన్నట్లు, ఇక్కడ మ్యూజియంలలో ఈయూ లో చదువుకునే స్టూడెంట్లకి ఉచిత ప్రవేశం! మొత్తానికి చిన్నదే అయినా నాకు ఈ మ్యూజియం చాలా నచ్చింది.
అక్కడ నుండి బయటకొస్తూ చూస్తే, మోనాస్తిరాకి కిటకిటలాడుతోంది!
భోజన విరామం, మార్కెట్లో ఓ చిన్న వాక్ అయ్యాక, మా తదుపరి మజిలీ – Greece National Archaeological Museum. అసలే అది Greece. పదినిముషాలు నడిస్తే ఓ కొత్త monument కనిపిస్తుంది అన్నట్లు ఉంటుంది అక్కడ 😉 ఇంక అలాంటి దేశం వాళ్ళ జాతీయ పురావస్తు ప్రదర్శన అంటే ఎలాగుండాలి? అలాగే ఉంది. మొత్తం చూడలేకపోయాము మేము – రెండు గంటలేమో ఉన్నట్లు ఉన్నాము – సగం కూడా పూర్తికాలేదు 😦 ఆ మ్యూజియంని చూడ్డానికి కనీసం నాలుగైదు గంటలు – ఎక్కువరోజులు అక్కడ గడిపేట్టు అయితే ఒక పూర్తి రోజు కావాలని తీర్మానించుకున్నాము.
విచిత్రం ఏమిటంటే – దీనికి దారి కనుక్కోడానికి మట్టుకు చాలా కష్టపడ్డాము. దీన్ని గ్రీకులో ఏమంటారో తెలుసుకోకపోడం మా తప్పే అయినా, దేశరాజధానిలో ఒక ప్రముఖ పర్యాటక స్థలమైన ఆ మ్యూజియం తాలూకా ఆంగ్ల నామధేయం అందరికీ తెలిసుంటుందనుకున్నాము! ఒకావిడైతే మరీనూ. ప్రాణనాథుడు వెళ్ళి ఫలానా మ్యూజియం ఎక్కడండీ? అని అడిగితే – ఎవరో దొంగ దగ్గరికొస్తున్నాడనుకుని వెనక్కి వెనక్కి నడుస్తూ, “నా దగ్గరేం లేదు” అన్నట్లు చెయ్యి ఆడిస్తూ వెళ్ళిపోయింది :)))
ఆవేల్టికి అలా ముగిసిపోయింది అనమాట. తరువాతి రోజు Acropolis, దాని చుట్టుపక్కల ప్రాంతాలు సందర్శించాలని నిర్ణయించుకున్నాము. ఇది ఎన్నో ప్రముఖ ప్రాచీన కట్టడాలకి నిలయమైన ప్రాంతం. UNESCO వారి World Heritage Siteలలో ఒకటి. అంతంత ఎత్తు ఉన్న స్తంభాలు, విశాలమైన నాటక ప్రదర్శన స్థలం, ప్రాచీన గుళ్ళూ – చూట్టానికి రెండు కళ్ళూ చాలకపోవడం ఇక్కడ అనుభవంలోకి వచ్చింది. ఒకపక్కన ఆ బ్రహ్మాండమైన కట్టడాలు, మరొక పక్క ఆ ఎత్తు నుండి, చెట్టూ చేమల మధ్యనుండి ఏథెంస్ నగరం – అదొక అనుభవం. అంతే. మాటల్లేవ్!
హైక్ లకు కూడా అది చాలా మంచి లొకేషన్. చుట్టుపక్కలంతా ప్రకృతి అందాలు – వాతావరణం కూడా బాగుంది. ఆహా, నా రాజా! అనుకుంటూ అక్కడ చాలాసేపే గడిపాము. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న తక్కిన ప్రాచీన కట్టడాలు- Ancient Agora, దాని తాలుకా మ్యూజియం, Roman Agora – ఆ చుట్టుపక్కల ఉన్న ఇతర చిన్న చిన్న కట్టడాలు – ఇవన్నీ చూసుకుని, సాయంత్రానికి ఇల్లు చేరుకున్నాము. గొప్ప అనుభవం. నాకాట్టే వీళ్ళ చరిత్ర గురించి తెలియదు కానీ, ఆ మ్యూజియంలోను, అలాగే, ఈ కట్టడాల వద్దా మట్టుకు చాలా విషయాలు వివరంగా రాశారు.
మరుసటి రోజు – డిసెంబర్ ౩౧. మా పర్యటనకు ఆఖరురోజు. ఈరోజు చుట్టుపక్కలి మరి కొన్ని ప్రాచీన కట్టడాలను చూడాలని నిర్ణయించుకున్నాము. మొదట Kerameikos కి వెళ్ళాము. అదొక నగరంలోపలి నగరం. నాకాట్టే వివరాలు అర్థం కాకపోయినా, ఏదో ఆ ruins మధ్య నేను మట్టుకు ఇంకా ruin కాలేదు అన్న ఎరుకతో నడుస్తూ తిరిగాను 😉 పక్కనే ఉన్న మ్యూజియం కి వెళ్ళి చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇంతకీ ఇన్ని చోట్లా నాకు ఎంట్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ కావడం నన్ను ఆశ్చర్యానందాలకు లోను చేసింది 🙂
ఇక్కడ నుండి Hadrian’s Library కి మళ్ళీ వెళ్ళాము. ఈసారి అది తెరిచి ఉంది కనుక లోపల కూడా తిరిగాము. ఇంతింత పాత కట్టడాలను తవ్వి బైటకి తీయడం కాక, అంత వివరంగా విషయాలు ఎలా సేకరిస్తారో! అని ఆశ్చర్యం కలిగింది నాకైతే. నాకెవరూ archeologist స్నేహితులు లేకపోవడం వల్ల ఈ ఆశ్చర్యం ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు.
మా చివ్వరి మజిలీ Temple of Olympian Zeus. మళ్ళీ అంతంత ఎత్తున్న స్తంభాలు. ఒకప్పుడు గుళ్ళంటే వాళ్ళకి అలా పిల్లర్సేనా? అని నాకు సందేహం. అంతంత ఎత్తువి ఎలా నిలబెట్టేవారో! అని ఇంకోటి. ఏమైనా వాటి నిర్మాణకాలంలో అక్కడెలా ఉండేదో ఊహించుకోడానికి ప్రయత్నిస్తే ఒళ్ళు గగుర్పొడిచింది.
ఇక్కడ నుండి మళ్ళీ షరామామూలు వాకింగులు చేసుకుంటూ అపార్ట్మెంటు గది చేరుకున్నాము. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సాంటోరిని నుండి వచ్చాక దాదాపుగా మేము అసలు ఇవన్నీ నడుచుకుంటూ వెళ్ళినవే. ఒక్కసారో రెండుసార్లో మధ్యలో మెట్రో ఎక్కాము – పక్క స్టేషంలో దిగేయడానికి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే బోలెడు చూడదగ్గ స్థలాలు ఉన్నాయనమాట. ఇక ఎన్ని రోజులుంటే దానికి తగినట్లు చుట్టుపక్కల ఉన్న Temple of Poseidon, ఒలింపియా వంటి చోట్లకి వెళ్ళొచ్చు.
ఆరోజు మేము ఇల్లు చేరుకునే వేళకే నగరంలో కొత్త సంవత్సరం వేడుకలు మొదలైనాయి. జనవరి ఒకటి, ఉదయం ఆరుగంటలకి మా ఫ్లయిటు జర్మనీకి. కనుక పొద్దున్నే మూడింటికో ఏమో అక్కడ ఖాళీచేసి బయలుదేరాము. మొత్తానికైతే ఈ పర్యటన ఒక గొప్ప అనుభవం మాకిద్దరికీ. ఏదో, మూడు నెలలకి ఇప్పుడైనా బ్లాగులో రాసుకున్నానని ఆనందిస్తూ ఇక్కడికి ముగిస్తున్నాను 🙂
(సమాప్తం)