గజేంద్ర మోక్షము – చదివితిన్!

చాగంటి కోటేశ్వరరావు గారి సైటు గురించి పరిచయమై, దాన్ని బ్రౌజ్ చేస్తూంటే ‘గజేంద్ర మోక్షం’ పద్యాలు కనబడ్డాయి. (పోతన భాగవతంలోవి). పదమూడే ఉన్నాయి అన్న కారణం వల్లనూ, పక్కనే తాత్పర్యం‌(అసలది తాత్పర్యం అనడం కంటే, చాగంటి వారి భావం అనడం‌నయమేమో) కనబడ్డంతో కాస్త సాహసించి చదివాను. పఠనానుభవం, రవ్వంత నిప్పురవ్వల లాంటి తారాజువ్వల్లాంటి కంప్లైంట్లు కలిస్తే ఈ టపా….

నీరాట వనాటములకు
బోరాటం బెట్లుగల్గెఁ పురుషోత్తముచే
నారాట మెట్లు మానెను?
ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్?

-నీరాటము, వనాటము, పోరాటము, ఆరాటము, ఘోరాటవి : బాగుంది ప్రాస 🙂
ఇంతకీ, భద్రకుంజరముకున్ :అంటే ఏమిటి? కుంజరము అంటే ఏనుగు కదా.భద్ర అంటే కూడా ఆంధ్ర భారతిలో చూసిన రకరకాల అర్థాల్లో, ఏనుగు ఒకటి… మొసలి ఏదీ మరి??

కలడందురు దీనుల యెడ
కలడందురు పరమయోగి గణములపాలం,
గలడందు రన్ని దిశలను,
గలడు గలం డనెడివాడు గలడో? లేడో?

– భక్తులు వేస్కునే ప్రశ్నే ఏమో కానీ, అందరికీ వర్తిస్తుంది కనుక, నాకు బా నచ్చింది. భక్తప్రహ్లాద గుర్తు వచ్చిందెందుకో!!

ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై,
యెవ్వనియందు డిందు, బరమేశ్వరుఁడెవ్వఁడు, మూలకారణం
బెవ్వఁ, డనాది మధ్యలయుఁ డెవ్వఁడు, సర్వము దానయైన వాఁ
డెవ్వఁడు, వాని నాత్మభవు, నీశ్వరు,నే శరణంబు వేఁడెదన్.

-ఓహో, ఇది గజేంద్ర మోక్షము పద్యమన్నమాట. బాగా చిన్నప్పుడు మా నాన్న నేర్పిన పద్యం ఇది. ఇటీవలే, మరొకరు దీన్ని అందంగా చదివి వినిపించారు కూడానూ.

ఒకపరి జగముల వెలి నిడి,
యొకపరి లోపలికిఁ గొనుచు, నుభయముఁ దానై
సకలార్థ సాక్షియగు న
య్యకలంకుని, నాత్మమూలు, నర్థింతు మదిన్.

-నయ్యకలంకుని ఏమిటో? అని కాసేపు బుర్ర బద్దలుకొట్టుకుని – ‘ఆ అకలంకుని’ అన్న మాట అని అర్థం చేస్కునే సరికి రెణ్ణిమిషాలు పట్టింది. అసలు మొదట్నుంచీ , బోరాటం, నారాటం,గలడు గలండు, డెవ్వడు… ఇలా ఇలా చదివి మహా చిరాకొస్తూ ఉండింది. అలాంటివి చూస్తూంటేనే పఠాభి గుర్తొస్తాడు నాకు. 🙂 చంధస్సుల వల్లో చిక్కిన తెలుగు భాష, అర్థం కాని సౌమ్య ఘోష – అన్న టైటిల్ నా ముందు స్క్రీను మీద, ప్రణవ్ మిస్ట్రీ సిక్స్త్ సెంస్ సాయంతో సాక్షాత్కరించింది 🙂

లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం
జీకఁటి కవ్వల నెవ్వఁడు –
నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

-లోకంబులు, లోకేశులు, లోకస్థులు : :)‌బాగుంది. ‘నేకాకృతి’ :)) కాంటెక్స్ట్ చూస్కోకుండా నేకాకృతి అని చదవగానే నవ్వాగట్లేదు ఎందుకో!!

నర్తకునిభంగిఁ బెక్కగు –
మూర్తులతో నెవ్వఁడాడు, మునులున్ దివిజుల్
కీర్తింప నేర, రెవ్వని –
వర్తన మొరు లెఱుఁగ రట్టి వాని నుతింతున్.

-‘నెవ్వఁడాడు’ అంటే , ‘ఎవరు ఆడునో’ అన్న అర్థం లాగుంది కానీ, మొదటిసారి చదివినప్పుడు – ‘ఎవడాడు?’ అని అరిచినట్లు అనిపించి, కాస్త ఉలిక్కిపడ్డా.

విశ్వకరు, విశ్వదూరుని
విశ్వాత్మకు, విశ్వవేద్యు, విశ్వు, నవిశ్వున్
శాశ్వతు, నజు, బ్రహ్మ ప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్.

-విశ్వకరు, విశ్వదూరుని, విశ్వాత్మకు, విశ్వవేద్యు, విశ్వు, నవిశ్వున్ : ఈ పదాల కూర్పు మళ్ళీ‌నాకు తెగనచ్చింది. పక్కనే ఉన్న తాత్పర్యాన్ని బట్టి భావం అర్థమైంది కానీ, ‘విశ్వదూరుడు’ అంటే అర్థం ఏమిటో తెలీలేదు.
విశ్వవేద్యుడు‌: విశ్వమంతా తెలిసిన వాడు అన్నట్లా? ఏదేమైనా, భలే ఉన్నాయ్ ఆ రెండు లైంలు మాత్రం.

ఓకమలాప్త! యో వరద! యో ప్రతిపక్ష విపక్ష విదూర! కు
య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వర మనోహర! యో విపుల ప్రభావ! రా
వే! కరణింపవే! తలఁపవే! శరణార్థిని నన్నుఁ గావవే!

-హమ్మయ్య, ఒక్కసారికి మొదటి చూపులోనే సారాంశం అర్థమైపోయింది.

అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి! పాహి” యన గుయ్యాలించి సంరంభియై”

-ఇక్కడ్నుంచి మిగితా పద్యాల అర్థాలు నేను ఇదివరలో విన్నాను. పద్యం చదవకపోయినా. ‘విహ్వల నాగేంద్రము…’ అని చదువుతున్నప్పుడు, మధ్యన నాగేంద్రమెక్కడిది? కింద ఏనుగు ప్రార్థిస్తూ ఉంటే నాగేంద్రము అంటే ఆదిశేషుడు అనుకుంటే, ఆయనెందుకు పాహి పాహి అంటాడూ? అని సందేహం కలిగింది. ఆపై, మాలతిగారు నాగేంద్రం అంటే ఏనుగు అన్న అర్థం ఉందని చెప్పారు. బాగుంది 🙂 నాగేంద్రమే పాము, నాగేంద్రమే ఏనుగు … హీహీ…

లా వొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్చ్హ వచ్చె, దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
“నీవే తప్ప యితః పరంబెరుగ, మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వరా! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!”

– ‘భద్రాత్మకా’ మళ్ళీ భద్ర! ఈ భద్రం తో జర్రంత భద్రంగా ఉండాలి. రకరకాల అర్థాలు కనబడుతున్నాయ్ ఆంధ్రభారతిలో!!

సిరికిం జెప్పడు శంఖ చక్రయుగముం జేదోయి సంధింప డే
పరివారంబు జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణి కాం
తర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోధ్ధత శ్రీకుచో
పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై

-కాస్త భాష నన్ను భయపెట్టేసింది … సిరికిం జెప్పడు…. అన్న భాగం మాత్రం చాలా ఫేమస్ కనుక, పద్యం అర్థమైపోతుందిలే, అనుకున్నా. అక్కడే దెబ్బతిన్నా 🙂

తనవెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దాని వె
న్కను బక్షీంద్రుడు, వానిపొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజనీకాంతుడు దావచ్చి రొ
య్యన వైకుంఠపురమునంగలుగు వా రాబాలగోపాలమున్

-దృశ్యం మొత్తం‌కళ్ళ ముందు కదలాడుతోంది. మన పౌరాణిక సినిమాల పుణ్యమా అని, దేవతలు అనగానే, మన నటులు గుర్తొచ్చేస్తారుగా. ‘బక్షీంద్రుడు’ అన్నప్పుడు మాత్రం ఆనంద్ బక్షీ గుర్తు వచ్చాడు 🙂

తన వేంశేయు పదంబు బేర్కొనడనాధ స్త్రీ జనాలాపముల్
వినెనో, మ్రుచ్చులు మ్రుచ్చిలించిరొ, బొలువ వేద ప్రపంచంబులన్
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులం
గని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్.

-లక్ష్మీదేవి ఆలోచనలట. ఇది కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంది. మొత్తానికి, నా బోటి వాళ్ళు కూడా, తాత్పర్యం ఒకటి పక్కన ఉంచుకుంటే, భాగవతం చదివి, ప్రతి పదార్థం తెలుసుకోడానికి ప్రయత్నించవచ్చని అర్థమైంది ఇవాళ.

అన్నట్లు, ఈ పద్యాలు, తాత్పర్యాలు ఇక్కడ చూశాను. ఇంత ఓపిగ్గా ఇదంతా చేస్తున్నందుకు సైటు అడ్మిన్ వారికి ధన్యవాదాలు!! పద్యాలు అక్కణ్ణుంచి కట్ పేస్టు చేశాను.

అంతా అయ్యాక, కాస్త స్వంత పైత్యం. ఇవ్వాళ ఈ పద్యాల గురించి చెబుతూ, ఆ నారాటాలు, నెవ్వండు లూ విసుగు పుట్టిస్తే, ఇలా చెప్పాను నా ఫ్రెండుతో:

నారాటమనగా నారాటము…
అదే, ఆరాటము.
నన్నేమనకండి, నా మెదడో మరకాటము.
నా రాశి కాదు కరకాటకము.
అయిననూ, ఉండేది మాత్రం కర్ణాటకము.
అనేసి,
ఇదంతయూ లావొక్కింతయూ లేని జగన్నాటకము
విధి లీలలు ఒక్కోమారు కర్కోటకము

– అని కూడా అనేసి, భయమేసి, ఆపేసి, ఈసంగతెవర్కీ చెప్పకని అడిగేసి, అయిననూ,నేనే ఇప్పుడు చెప్పేసి… షూ వేసి, వెరసి …. అదండీ‌కథ!!

Published in: on November 22, 2010 at 5:32 pm  Comments (30)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/11/22/gajendra-moksham/trackback/

RSS feed for comments on this post.

30 CommentsLeave a comment

  1. మొసలి ఉంది కదండి, మొదట్లోనే.
    నీరాటమంటే మొసలి. వనాటము అంటే ఏనుగు.

    సిరికింజెప్పడు పద్యం అర్థం కాలేదా? ఇక్కడ ఓ మారు చూడండి. ఏమైనా అర్థమవుతుందేమో?

    “అడిగెదనని కడువడి జని”…ఈ పద్యం చదవలేదా?

  2. హహ్హహ్హ… బాగా రాశారు.
    చాగంటి కోటేశ్వర్రావు గారు చెప్తుంటే వినాలండీ, మంత్రముగ్ధుల్ని చేసేస్తారనుకోండి. భారతం, భాగవతం, రామాయణం, షట్పదీ, భజగోవిందం, కాళహస్తీశ్వర శతకం అబ్బో… ఎన్నేసి ఉన్నాయనుకున్నారు? అన్నీ డౌన్లోడ్ చేసేశాంగా! వెతకటం ఎందుకూ ? వారి సైటే ఉందిగా !
    షట్పది అంటే ఆరు కాళ్లుండే భ్రమరం (మనసు) , దేవదేవుని పాద”పద్మాల”పై అనురక్తులై ఉండాలని శంకరాచార్యులవారి కృతం.
    ఇక మీ సందేహం – నీరాటం-మొసలి, వనాటం-ఏనుగు; ఆరాటం కలిగింది ఏనుగుకే కదూ, అందుకే “నారాట మెట్లు మానెను
    భద్ర కుంజరమునకున్? “

  3. sorry, this is the right link.

  4. >> ఆ నారాటాలు, నెవ్వండు లూ విసుగు పుట్టిస్తే,

    That is unfortunate. And yeah, Potana may not match Akira Kurosawa in entertaining.

  5. సౌమ్యా,
    మొదటి ప్రశ్నార్థకం తీసేసి చివరి రెండు పంక్తులూ కలిపి చదివి చూస్తే,
    ఆరాట మెట్లు మానెను
    ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్?

    ఆ అడవిలోని ఏనుగుకు కలిగిన ఆరాటం ఎలా తీరిందని ఏమో కదా?

    మొత్తానికి తెలుసనుకున్నా ఎంత తెలియదో తెలియ చేశావు, మెదడుకు బోలెడంత మేత.
    నాకు తెలిసిందెంతో పట్టి చూసుకోవాలి ఇప్పుడు 🙂

    Thanks!

  6. సౌమ్యా,
    పోతన కవిత్వం నాకెంత ఇష్టమంటే-
    మా వూళ్ళో పిల్లలకందరికీ గంజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్రం లోని పద్యాలు (ఇంగ్లీషు Translations తో సహా)నేర్పించేంత!
    “ఆరాటమెట్లు మెట్లు మానే..”
    “భద్ర” అంటే స్రేష్టమైన అని కాదా అర్ధం?
    అన్నిటి కంటే నాకు నచ్చిన లైను
    “ఆకర్ణికాంత ధమ్మిల్లమ్ము చక్క నొత్తడు.” 🙂
    Thanks for sharing.
    శారద

  7. @Ravi:
    “మొసలి ఉంది కదండి, మొదట్లోనే.
    నీరాటమంటే మొసలి. వనాటము అంటే ఏనుగు. ”
    -భద్రకుంజరమునకున్ అన్నప్పుడు మరి ఉత్త ఏనుగు కథే చెప్పారే…అనిపించింది లెండి. నీరాటము, వనాటమూ – అర్థమయ్యాయి నాకు .

    @Mandakini:
    ఇలా చాగంటి వారి గురించి వినే ఈ సైటును చేరాను. అయితే, ప్రవచనాలూ అవీ వినే‌టైము లేక, ప్రస్తుతానికి ఆగాను.

    @Witreal:
    That’s a wierd comparison! 🙂
    I saw Kurosawa but did not read Pothana. so, no comments.

    @Lalitha:
    అవును, ప్రశ్నార్థకం తీస్తే సరిగ్గానే ఉంది కానీ, అప్పుడు ప్రశ్నార్థకం ఎందుకు?

    @Sarada:
    ‘భద్ర’ – అన్న పదానికి నిఘంటువులో బోలెడు అర్థాలు కనబడ్డంతో, నేను తికమకపడ్డాను. 🙂

  8. ఈ టపా గూర్చి నేనేమీ మాట్లాడనక్కరలేదు 🙂

    వీలు కుదిరినప్పుడు పాలగుమ్మి రాజగోపాల్ గళంలో
    గజేంద్రమోక్షం వినగలరని ఓ చిన్న సూచన మాత్రమే..

  9. @Ravi: “అడిగెదనని కడువడి జని” – స్కూల్లో ఉన్నప్పుడు ఎవరో చదివి వినిపించి, అర్థం చెప్పారు. కానీ, చాగంటి సైటులోని పదమూడు గజేంద్ర మోక్షం పద్యాల్లో అది లేదు.

  10. మీ తెలుగు పంతులు (పంతులమ్మ) “నెవ్వఁడాడు” లో అరసున్నాని ఎలా పలకాలో ఎప్పుడూ చెప్పినట్టు లేదు..!!

  11. సౌమ్యా, ప్రశ్నార్థకం తప్పుగా ముద్రించి ఉండవచ్చు కదా?

  12. @Sahithi: మా పంతుళ్ళనూ, పంతులమ్మలనూ ఇప్పుడు బ్లేం చేస్కోడం దేనికి? తప్పు నాదైతేనూ!

    @లలిత: ముద్రణా దోషమో..టైపింగు దోషమో..ఉండొచ్చు లెండి.

  13. Btw, meeru ee madhya nisineesh ni kalisinattu leru ?

  14. Chaganti gaari bhaagavatam, raamayanam ikkada download chesukovacchu
    http: //surasa. net /music/purana/

  15. Why I am not able to paste a URL here ?
    or those comments marked as spam ?

    • Badri garu: they were somehow marked as spam by wordpress. De-spammed the comment now.

  16. ఒక పదమూడు పద్యాలు చదివి గజేంద్రమోక్షము చదివితిన్ అనేస్తే ఎలా? నేనొప్పుకోన్ 🙂 ఇక్కడ పూర్తి గజేంద్రమోక్షం ఉంది.
    http://andhrabharati.com/itihAsamulu/bhAgavatamu/08/smb0801.html

    చదివి ఈ క్రింది రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలిస్తే అప్పుడు మిమ్మల్ని పాస్ చేస్తా. 🙂

    1. మీరిచ్చిన పద్యాలలోని టైపాటులను సరిచేయుడు
    2. పవిట చెంగుని వదలకుండా పరిగెట్టినందుకు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఏమైనా సంజాయిషీ ఇచ్చుకున్నాడా? ఇస్తే ఏమిటది?

    విశ్వదూరుడు – విశ్వానికి దూరంగా ఉండేవాడు (అంటే ఏమిటని అడక్కండి, అదంతా వేదాంతం! 🙂
    విశ్వవేద్యుడు – విశ్వంచేత తెలియబడినవాడు (సేం ఏస్ ఎబవ్)

  17. @Kameswara Rao: వాళ్ళ సైటులో అదే గజేంద్ర మోక్షం అన్నారు. నాకెలా తెలుస్తుంది చెప్పండి.. ఎపుడన్నా భాగవతం చదివిన నోరు కాదే నాది!!

  18. | అదే గజేంద్ర మోక్షం అన్నారు…

    ^ అందుకనే ఒకసారి పద్యములు వినమని చెప్పితిన్ 🙂

    @ కామేశ్వరరావుగారూ : మీరూ , మీ మిత్రులూ కలిసి గజేంద్రమోక్షాన్ని
    వివరించి & వినిపిస్తే నాబోటి వారికి ఉపయోగపడుతుంది కదా!!

  19. >> వాళ్ళ సైటులో అదే గజేంద్ర మోక్షం అన్నారు.
    >> నాకెలా తెలుస్తుంది చెప్పండి..
    >> ఎపుడన్నా భాగవతం చదివిన నోరు కాదే నాది

    ఆ విషయం, మీరు నాకిచ్చిన రిప్లై లోనే తెలిసింది 😉

    >> I saw Kurosawa but did not read Pothana.

    గజేంద్ర మోక్షం చదివి, పోతన అంటే ఎవరో తెలీదన్నార్ట 😉

  20. @Witreal: బాగుంది వరస. గజేంద్ర మోక్షం లో పదమూడు పద్యాలు చదివితే పోతనని చదివేసినట్లా???

    కురొసవా సినిమాలు దాదాపు పదిహేను సినిమాలు చూసాను. మరి తేడా లేదూ? 🙂

  21. >>ఎపుడన్నా భాగవతం చదివిన నోరు కాదే నాది!!
    ఈ మాత్రం చదివే నోళ్ళు మాత్రం ఎక్కడున్నాయి చెప్పండి! పళ్ళ చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టు చదవగలిగే/చదివే వాళ్ళకే పరీక్షలు. 🙂

    @రంజనిగారు,
    ప్రతి పద్యాన్నీ వివరించాలంటే కొద్దిగా సమయం పడుతుంది కదా. ఇప్పటికే వివరణలతో పుస్తకాలున్నాయి. ఏవైనా కాపీరైటు సమస్య లేనివి ఇంటర్నెట్లోకి ఎక్కించగలనేమో ప్రయత్నం చేస్తాను.

  22. సరి. మీరు రాసిన “బాగుంది ప్రాస, చంధస్సుల వల్లో చిక్కిన తెలుగు భాష…” ఇట్టాంటివి చూసి, బాగా చదివారనుకున్నాను 😉

    ఇంకో సారి చదవే ఉద్దేస్యమున్నట్లైటే, ఆ ప్రాస, పద కూర్పు అక్కడ జరిగే దృశ్యాన్ని ఆవిష్కరిస్తుందేమో గమనించండి

    ఉదా:
    కరి దిగుచు మకరి సరసికి, కరి దరికిన్ మకరి దిగుచుం గరకరి బెరయన్, కరికి మకరి మకరికి గరి……pranav mistry sixth sense tech లో కనిపించినట్టు మొసలి ఏనుగు ఒక దాన్ని ఒకటి గుంజుతున్నట్లనిపించట్లా? 😉

    అట్టాగే, “అడిగెదనని కడువడి జను”

    ఇక మీరు గమనించారోలేదో గానీ, ఆ ఏనుగు చాలా పద్యాలలో విష్ణువుని పేరుతో పిలిచి రక్షించమని అడగదు. ఎవడైతే అది చేసాడో, ఇది చేసాడో…వాన్ని రక్షించమని అడుగుతుంది. మూలంలో ఎట్టా వుందో నాకు తెల్వదు గానీ, ఇట్టా రాయటం వెనుక పోతన వుద్దేశ్యమేమై వుంటుందో?

    నా 7వ తరగతి లో అనుకుంటా “ఎవ్వనిచే జనించు జగం” అనే పద్యాన్ని మా స్కూల్లో మార్నింగ్ ప్రేయర్ లో కలిపారు. మా తెలుగు మాస్టారు అంటూండేవారు, ఈ పద్యం నాస్తికులకు కూడా అంగీకారమయ్యే ప్రేయర్ అని.

    ఇక “లోకంబులు లోకేశులు” means that, there is darkness beyond what is visible to us in the universe. There may be light beyond that darkness (did stephen hawking proposed that 😉 ). The person who created the universe is there beyond that పెన్ చీకటి.

    yawn… more later.

  23. పోతన భాగవతమునందలి గజేంద్రమోక్షమునకు ఉత్పల సత్యనారాయణాచార్యులవారి టీకాతాత్పర్య విపులవ్యాఖ్యతోనూ సంస్కృతమూలశ్లోక తాత్పర్యములతోనూ కలిపి శ్రీపావనిసేవాసమితివారు ప్రచురించారు దీని రెండవ ముద్రణ 2005 ఏప్రియల్‍ వెల రూ 100

    రుక్మిణీకల్యాణమునకు కె వి రాఘావాచార్యులవారిచే వ్యాఖ్యవ్రాయించి ప్రచురించారు దీని ప్రథమ ముద్రణ 2006 అక్టోబరు వెల రూ 100

  24. @సౌమ్య, నీటపా, దానిమీద వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. చిన్న disclaimer. కామేశ్వరరావుగారి చెప్తేనే నాకు తెలిసింది నాగము అంటే ఏనుగు అని కూడా అర్థం ఉందని.
    @కామేశ్వరరావుగారు, *పళ్ళున్నచెట్టుకే రాళ్ళు తగులుతాయి* 🙂 బాగా చెప్పేరండీ. రాళ్ళు తగిలినప్పుడు రాటు తేల్తారేమో సౌమ్యలాటివారు :p.

  25. నానమ్మ గుర్తుగా నాన్న పెట్టుకున్న భాగవతం రెండో భాగంలోని ఈ గజేంద్ర మొక్షంతో కుస్తీ పట్టాను ఒక నెల ఈ మధ్యనే. గజేంద్రుడు మొర పెట్టుకునే పద్యాలు కొరుకుడు పడలేదు.బ్రౌణ్యం దగ్గర పెట్టుకుని ప్రతి పదార్ధం వెతుక్కునే ఓపిక లేక ఆపేసాను
    😦

    హైదరాబాద్లో పుట్టి పెరిగిన నాకు సిరికిం చెప్పడు, అల వైకుంఠ…తప్ప మిగితావి ఏవీ తెలీవు కాని చదవగానే ప్రతీ పద్యంలోని ఏదో ఒక్క పాదమైనా ఎక్కడో ఒక చోట పరిచయమైనవే అని తెలిసింది, చదివిన పుస్తకాల చలవా అని. కనీసం అలా అన్నా పోతన గారిని పరిచయం చేసిన ఆ సాహితీవేత్తలందరికీ నిజంగా కృతఙ్ఞతలు.

    శ్రీమద్భాగవతానికి మొత్తానికి ప్రతిపదార్థాలు ఎక్కడన్నా దొరికితే చెప్పగలరా ఎవరన్నా?అలాగే బ్రౌన్ డిక్షనరీ సీడీ కాని ఇంకేదైనా కానీ (పుస్తకాలు కావండీ)ఆఫ్ లైన్ వెర్షన్ ఉంటె చెప్పండి ప్లీస్.

  26. Potana Bhagavatam nunchi empika chesina konni ani mutyallanti padyalaku C. Narayana Reddy gari vyakhyanam to TTD varu ” Mandara Makarandalu ” ane oka pustakam publish chesaru.

    Excellent book, nenu chala sarlu chadivanu…veelayithe adi chadavandi..

  27. @Pavan
    మీరు ప్రస్తావించిన పుస్తకాన్ని మొదట యువభారతి సంస్థ వారు ప్రచురించారు
    http://www.archive.org/details/MandaraMakarandalu

  28. నీరాట వనాటములకుఁ
    బోరాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే
    నారాట మెట్లు మానెను?
    ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్.

    టీకా:
    నీరాట = మొసలి {నీరాటము — నీటిలో చరించునది, మొసలి}; వనాటముల = ఏనుగుల {వనాటము -అడవిలో చరించునది, ఏనుగు}; కున్ = కు; పోరాటంబు = కలహము; ఎట్లు = ఏ విధముగ; కలిగెన్ = కలిగినది; పురుషోత్తముని = విష్ణుమూర్తి; చేన్ = చేత; ఆరాటమున్ = సంకటమును; ఎట్లు = ఏ విధముగ; మానెను = తీరినది; ఘోర = భయంకరమైన; అటవి = అడవి; లోని = అందలి; భద్రకుంజరమున్ = గజరాజున ; కున్ = కు.

    భావము:
    ‘‘నీటిలో బతుకుతుంది మొసలి. అడవిలో తిరుగుతుంది ఏనుగు. వాటిలో అది భద్రగజం. అయితే ఆ రెంటికి అసలు పోరాటం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అలా జరిగిన ఆ పోరాటంలో పురుషోత్తముడైన శ్రీహరి ఆ గజేంద్రుడి ఆరాటాన్ని ఎలా పోగొట్టి కాపాడాడు?

  29. విశ్వకరు విశ్వదూరుని
    విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
    శాశ్వతు నజు బ్రహ్మప్రభు
    నీశ్వరునిం బరమపురుషు నేభజియింతున్.”
    టీక:- విశ్వ = జగత్తుని; కరున్ = సృష్టించెడివానిని; విశ్వ = జగత్తుకి; దూరునిన్ = అతీతముగ నుండువానిని; విశ్వ = జగత్తు; ఆత్మునిన్ = తన స్వరూపమైన వానిని; విశ్వ = లోక మంతటికి; వేద్యున్ = తెలుసుకొనదగ్గ వానిని; విశ్వున్ = లోకమే తానైన వానిని; అవిశ్వున్ = లోకముకంటె భిన్నమైనవాని; శాశ్వతున్ = శాశ్వతముగ నుండు వానిని; అజున్ = పుట్టుక లేనివానిని; బ్రహ్మ = బ్రహ్మదేవునికి; ప్రభున్ = ప్రభువైన వానిని; ఈశ్వరునిన్ = లోకము నడిపించువానిని; పరమ = సర్వశ్రేష్ఠమైన; పురుషున్ = పురుషుని; నేన్ = నేను; భజియింతున్ = స్తుతించెదను.
    భావము:- ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు. లోకులు అందుకోలేని వాడు. లోకానికి అంతరాత్మ అయిన వాడు. లోకంలో బాగా తెలుసుకోదగిన వాడు లోకమే తానైన వాడు. లోకాతీతుడు. ఎల్లప్పుడు ఉండేవాడు. పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవునికి అధి నాయకుడు. లోకాన్ని నడిపించేవాడు. పరమాత్మ. అట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: