(నండూరి రామమోహనరావు సంపాదకీయాల సంకలనం “వ్యాఖ్యావళి” లోని వ్యాసం ఇది. సత్యజిత్ రాయ్ మరణించినపుడు వచ్చింది. ఇవ్వాళ రాయ్ శతజయంతి సందర్భంగా టైపు చేసి పెడుతున్నాను. కాపీరైట్ సమస్యలు ఉంటే ఇక్కడో వ్యాఖ్య పెట్టండి, వ్యాసాన్ని తొలగిస్తాను. గతంలో ఈ వ్యాసాన్ని నా బ్లాగులో ప్రస్తావించాను. అప్పటికి ఈ పుస్తకం ఆర్కైవ్ లో ఉన్నదని తెలీదు. )
పథేర్ పాంచాలి 1955నాటి చిత్రం. అది కలకత్తాలో విడుదల అయినప్పుడు డిల్లీ, బొంబాయి, మద్రాసు వంటి నగరాలలో ఆదివారాల మార్నింగ్ షోగానో, ప్రత్యేకాహూతులైన కొద్దిమంది చలనచిత్ర కళాభిమానులకో ప్రదర్శించబడినప్పుడు దేశవ్యాప్తంగా అది కలిగించిన అపూర్వ సంచలనం ఈరోజు ఎందరికి జ్ఞాపకం వున్నదో మాకు తెలియదు. బహుశా ఈ తరం వారు అది ఊహించనైనా ఊహించలేరు.
సత్యజిత్ రాయ్ తీసిన మొట్టమొదటి చిత్రం పథేర్ పాంచాలి ఎలా విడుదల అయింది? మండువేసవి మధ్యాహ్నవేల మల్లెల పరిమళాన్ని మోసుకు వచ్చిన మలయానిలవీచికలా, వెచ్చని నుదుటిపై చల్లని కరస్పర్శలా, మనస్సులోని మాలిన్యమంతా క్షాళనం చేసే మానవతా గంగాజలంలా, నడివయస్సు నుంచి బాల్య స్మృతులలోనికి రివ్వున తీసుకుపోయే “టైం మెషీన్” లా విడుదల అయింది.
భారతదేశంలో అటువంటి చిత్రం తీయడం సాధ్యమా? పాటలు, నృత్యాలు, సెట్టింగులు, అందాల హీరో, హీరోయిన్లు లేని భారతీయ చిత్రాన్ని ఊహించడం కూడా కష్టమైన ఆ రోజులలో పథేర్ పాంచాలి ఒక కఠోర వాస్తవికతతో, వ్యథార్త జీవిత యదార్థ దృశ్యాన్ని ఆవిష్కరించింది. అందులో పాటలు లేవు – రవిశంకర్ మనోజ్ఞ నేపథ్య సంగీతం తప్ప. నృత్యాలు లేవు – పది పన్నెండేళ్ళ దుర్గ వర్షాగమనంతో పురివిప్పిన నెమలిలా పరవశించి జడివానలో తడుస్తూ గిరగరా తిరగడం తప్ప. అందాల హీరో, హీరోయింలు లేరు – ఒక నిరుపేద పురోహితుడు, అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, తొంభై ఏళ్ళ ఒక ముదివగ్గు తప్ప.
కానీ ఆ చిత్రంలో భారతదేశపు అమాయిక గ్రామీణ వాతావరణం ఉంది. దుర్భర దారిద్ర్యం ఉంది. కష్టాలు, కడగండ్లు, కన్నీళ్ళు, విధి వెక్కిరింతలు, ఒక శిశువు జననం, ఒక వృద్ధురాలి నిశబ్ద మరణం, మొగ్గగానే రాలిపోయిన ఒక బాలిక అర్థం లేని మృతి వున్నాయి. అదే సమయంలో చల్లగాలికి తలలెగరేసే రెల్లుపూల మొక్కలు, దూరంగా గుప్ గుప్ మంటూ నాగరిక ప్రపంచానికి ప్రతీక లాంటి రైలు, గుయ్య్ మని శబ్దం చేస్తూ సందేశ సంకేతాలను మోసుకుపోయే టెలిగ్రాఫ్ స్తంభాలు, గతుకుల కాలిబాట, వర్షారంభవేళ కొలను అలలపై తూనీగల నాట్యం; చిన్నపిల్లల గుజ్జన గూళ్ళాటలు, వీథి భాగవతం, తుఫానుకు పడిపోయిన శిథిల గృహం, చనిపోయి వెల్లకిల పడిన కప్ప, ఖాళీచేసిన పాడింటిలోకి విధి వికృతపు నవ్వులా జరజరపాకిపోయే తాచుపాము, ఎన్నో వున్నాయి. అన్నీ వున్నాయి కాని, సాంప్రదాయికార్థం లో “కథ” లేదు. జీవితం వున్నది. కఠోర జీవితం వున్నది. ఇంతకంటే మంచి రోజుల కోసం ఆ జీవితం చూసే ఎదురుచూపులున్నాయి.
పథేర్ పాంచాలి తర్వాత ఆయన సుమారు 30 కథా చిత్రాలు, ఇతర చిత్రాలు తీశారు. అయినా ‘సాంకేతికా నైపుణిలో తప్ప అన్ని విషయాల్లోనూ అదే మేటి. ఆయన ప్రతిచిత్రం దేనికదే సాటి. ఒక చిత్రం నుంచి మరొక చిత్రానికి సినిమా టెక్నిక్ లో, కథా కథనంలో ఆయన ఎదుగుతూ పోయారు. మేరు శిఖరం ఎత్తున ఎదిగారు. గ్రిఫిత్, ఐజెన్ స్టయిన్, చాప్లిన్, బెర్గ్మెన్, కురోసావా ల ఎత్తుకు ఎదిగారు.
రాయ్ చిత్రాలలో ఒక చిత్రం: చిత్రాన్ని పోలిన చిత్రం వుండదు. నూతనత్వాన్వేషణ మార్గంలో రాయ్ నిత్య పథికుడు. అపూ ట్రైలజీ అనబడే పథేర్ పాంచాలీ, అపరాజిత, అపూర్ సంసార్ చిత్రాలు మూడింటిలోను చావులున్నాయి. సుఖానుభూతులన్నీ ఒక రకంగానే వుంటాయి గాని, దుఃఖానుభూతులు దేనికదేనని టాల్ స్టాయ్ చెప్పినట్లు ఒక మృతిలాంటిది మరొకటి వుండదు.
జల్సాఘర్ చిత్రంలో అవసానదశలో వున్న ఫ్యూడల్ సంస్కృతి తన ఉనికిని నిలబెట్టుకొనడానికి ఎలా పాకులాడుతుందో చూస్తాము. టాగోర్ కథ ఆధారంగా తీసిన చారులత ఒక అసంపూర్ణ మనోహర కావ్యం లాంటిది. మహానగర్, ప్రతిద్వంది, సీమబద్ధ, జనారణ్య చిత్రాలలో దేని ప్రత్యేకత దానిదైనా, ఆధునిక జీవన సమ్మర్దపు కాళ్ళ కింద పడి నలిగిపోయే మానవత్వపు విలువలను చూస్తాము. తీన్ కన్య మూడు చిత్రాలూ టాగోర్ కు శత జయంతి నివాళులు. ఆశని సంకేత్ 1942నాటి బెంగాల్ క్షామ రాక్షసి కోరలలో చిక్కి విలవిలలాడిపోయిన నైతిక మూల్యాలను నిర్దయగా చూపిస్తుంది. అరణ్యేర్ దిన్ రాత్రి కొన్ని అసాధారణ సన్నివేశాలలో మానవుల నిజస్వరూపాలెలా బయట పడిపోతాయో హాస్యభరితంగా చూపిస్తుంది.
ఇవీ, తన ఇతర చిత్రాలలో సత్యజిత్ రాయ్ మనలను పోలిన మానవులనే తీసుకుని, ఎవరు ఏ సన్నివేశంలో ఎందుకు ఎలా ప్రవర్తిసారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా ప్రతిస్పందిస్తారో ఒకసారి ఒక తత్వవేత్తలా, ఒకసారి మనస్తత్వ వేత్తలా, ఒకసారి సాంఘిక శాస్త్రవేత్తలా విశ్లేషిస్తూనే, అన్నిటిలోను మానవుల దౌర్బల్యాల పట్ల ఆర్షమైన, ఆర్ద్రమైన సానుభూతిని కనబరుస్తారు. ఆయన మొత్తం జీవిత కృషిని ఆంచనా వేస్తే పూర్వసూక్తిని కొంచెం మారి “నా నృషిః కురుతే చిత్రం” అనాలనిపిస్తుంది.
సత్యజిత్ రాయ్ ది బహుముఖ ప్రతిభ. రవిశంకర్, విలాయత్ ఖాన్ వంటి వారి సహాయం పొందిన తొలి చిత్రాలను మినహాయిస్తే తన అన్న చిత్రాలకు తానే సంగీత దర్శకుడు. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం పట్ల ఆయన అభిరుచి, బెంగాలీ జానపద బాణీలలో అభినివేశం జగత్ప్రసిద్ధం. “గోపీ గాయ్ నే బాఘా బాయ్ నే” చిత్రంలో ఆయన కట్టిన బాణీలు శ్రోతలను ఉర్రూతలూగిస్తాయి. అదికాక రాయ్ తన చిత్రాలకు తానే ఆర్ట్ డైరెక్టర్ (టాగోర్, నందలాల్ బోస్ ల సాన్నిధ్యంలో చిత్రకారుడుగానే ఆయన జీవితం ప్రారంభమైంది). స్క్రీన్ ప్లే రైటర్, స్క్రిప్టు రైటర్, కథా రచయిత, ఎడిటర్, పెక్కు సందర్భాలలో తానే ఛాయా గ్రాహకుడు. స్వయంగా రచయిత కూడా అయిన రాయ్ వ్రాసిన డిటెక్టివ్ కథలు, పిల్లల కథలు, సైంస్ ఫిక్షన్ భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ఆయన చిత్రాలలో పెక్కింటికి స్వర్ణకమలం వంటి అవార్డులు లభించినప్పటికీ, అవసానదశలో భారతరత్న అవార్డు లభించినప్పటికీ, స్వదేశంలో కంటే విదేశాలలోనే రాయ్ ప్రతిభా విశేషాలకు ఎక్కువ గుర్తింపు వచ్చిందన్న ప్రతీతిలో కొంత నిజం లేకపోలేదు. కాంస్, వెనిస్, బెర్లిన్ మొదలైన చోట్ల ఆయన చిత్రాలకు వచ్చిన అవార్డులు, ఫిలిప్పీన్స్ ఇచ్చిన మెగ్సేసే అవార్డు, బ్రిటిష్ ఫిలిం విమర్శకులు ఒక అర్థశతాబ్దపు (1925-1975) అత్యుత్తమ చిత్ర దర్శకుడుగా ఆయనకిచ్చిన గుర్తింపు, ఫ్రాన్సు అధ్యకుడు స్వయంగా అందించిన లీజియన్ ఆఫ్ ఆనర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి అరుదుగా విదేశీయులకిచ్చే ఆనరరీ డాక్టరేట్. అంతే అరుదుగా అమెరికన్ మోషన్ పిక్చర్ అకాడమీ విదేశీయులకిచ్చే స్పెషల్ ఆస్కార్, ఇవన్నీ ఇందుకు నిదర్శనాలు. నోబెల్ బహుమతి గ్రహీత సాల్ బెల్లో తన “హెర్జోగ్” నవలలో ఒకచోట సత్యజిత్ రాయ్ ప్రశంస తీసుకురావడం సృజనాత్మక సాహిత్యంలోకి కూడా ఆయన పేరు వెళ్ళిందనడానికి గుర్తు.
చివరగా ఒక మాట. ప్రపంచమంతా జేజేలు పలికింది గాని భారతీయ చలనచిత్ర ప్రముఖులు మాత్రం ఆయనను సరిగా అర్థం చేసుకొనకపోవడం దురదృష్టం. భారతీయ దారిద్ర్యాన్ని తన చిత్రాలలో ప్రదర్శించి పాశ్చాత్యుల ప్రశంసలు సంపాదించుకున్నవాడుగా ఆయనను కొందరు పరిగణించడం వారి మేధా దారిద్ర్యానికి చిహ్నం. తాను కళాఖండాలు తీస్తున్నానని ఆయన ఎన్నడూ అనుకోలేదు. అందరూ చూచి ఆనందించే చిత్రాలు తీయడమే తన ధ్యాయమని, వ్యాపార విజయ దృక్పథం వున్నంత మాత్రాన కళామూల్యాలు లోపించనక్కరలేదని ఆయన విశ్వాసం. ఆమాటకు వస్తే తనకు స్పూర్తి ఇచ్చినవారిలో అమెరికన్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత రాబర్ట్ ఫ్లాహర్టీ, సోవియెట్ దర్శకుడు అలెగ్జాండర్ డోవ్జెంకో లతో పాటు ఎందరో హాలీవుడ్ దర్శకులు కూడా ఉన్నారనే వాడు రాయ్. సత్యజిత్ రాయ్ భారతీయ సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పిన మహామహుడు. నేడు ఆయన లేడు. ఆయన చిత్రాలున్నాయి. ఆయన ప్రతిభ ఉంది.
(ఏప్రిల్ 25, 1992)
మహిళావరణం-13 (ముగింపు)
(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********
118 మంది గురించీ చదివేశాక, మొదటికి వచ్చాను నేను. మరొకసారి రచయిత్రులు రాసిన ముందుమాటా, తరువాత (మొదలుపెట్టినప్పుడు ఆట్టే దృష్టి పెట్టి చదవని) “నిరుడు కురిసిన హిమసమూహాలు” పేరిట కొంత చారిత్రక నేపథ్యం తెలిపే వ్యాసమూ మళ్ళీ చదివాను. ఒక రెండు ముక్కలు మళ్ళీ ఈ పుస్తకంలోని విశేషాల గురించి బ్లాగాలి అనిపించింది… నిజం చెప్పాలంటే ఆ వ్యాసం మొత్తంగా నాకు కాస్త బోరు కొట్టింది కానీ, అందులో ప్రస్తావించిన కొన్ని కథలు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి.
“ఆంధ్రదేశంలో మొదటగా క్రైస్తవ మతం తీసుకున్నది ఒక స్త్రీ. చిత్తూరు జిల్లాలో పుంగనూరులో 1701వ సంవత్సరంలో ఒక వితంతువు తన నలుగురు పిల్లలతో క్రైస్తవ మతంలోకి మారింది. 1805లో లండన్ మిషనరీ సొసైటీ విశాఖపట్నంలో తన కేంద్రాన్ని స్థాపించి ఒక బాలికల పాఠశాలని నెలకొల్పింది..” ఇలా సాగిన పేరాలో ఆ “మొదట మతం పుచ్చుకున్నది ఒక స్త్రీ” అన్న సంగతి చాలా ఆసక్తికరంగా అనిపించింది. విచిత్రంగా కూడా అనిపించింది – ఆ విషయం ఇన్ని సంవత్సరాల తరువాత ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డం.
ఇక, వితంతు వివాహాల గురించి చెప్పిన కథ: ఒక బ్రాహ్మణ యువకుడు వితంతువైన తన చెల్లికి జుట్టు తీయించి ముతక బట్టలు కట్టించాలని, బట్టలు తెచ్చి ఆవిడకిచ్చాడట. ఆవిడ తనకు చాలినన్ని చీరలు ఉన్నాయనీ, కావలిస్తే వదినెకి ఇచ్చుకొమ్మనీ చెప్పిందట. విధవలు కట్టుకోవాల్సినవి నా భార్య కట్టుకోవడమేమిటి? అని అతను కోప్పడితే, రేపో మాపో పెళ్ళి చేసుకోబోతున్నాను, నాకూ అవి అక్కర్లేదు అన్నదట 🙂 (అఫ్కోర్సు, కాస్త అతివాదిలా ఆలోచిస్తే, “విధవలు కట్టుకునే బట్టలేవిటి నీ మొహం!” అని దాడి చేయాలి. కానీ, బహుశా ఆ కాలానికి ఈవిడ స్పందనే విప్లవాత్మకం అనుకుంటాను!). ఈ సంఘటన తరువాత జరిగింది మాత్రం అత్యంత ఆశ్చర్యం, దిగ్భ్రాంతి కలిగించే సన్నివేశం – ఈ అమ్మాయి పెళ్ళిని వీళ్ళ అన్న బంధువుల సాయంతో ఆపేశాడట. కానీ, తనకి నచ్చిన వ్యక్తితో వివాహ ప్రస్తావన లేకుండా సంబంధం పెట్టుకోవడానికి మొత్తం బంధువర్గమూ అనుమతించిందట!!!!!!
ఆ కాలంలో వితంతువులు ఎవరితోనూ వెళ్ళిపోవడమూ [(అ)సభ్యసమాజపు భాషలో లేచిపోవడం], లేదా అలా వెళ్ళాక మోసపోయి తిరిగిరావడమూ – వీటిల్లో “తిరుగుబాటు”ను చూడమని రచయిత్రులు ఉద్భోదించేవరకూ ఆ కోణం నాకు తట్టలేదు. అఫ్కోర్సు, అలాంటివి అన్నీ గానీ, మామూలుగా జనాలు ఇంట్లోవాళ్ళకి తెలీకుండా ఎవరితోనో వెళ్ళిపోయే అన్ని సంఘటన్లూ తిరుగుబాటే అని మనం అనుకోనక్కర్లేదు. కానీ, ఇపుడు ఆలోచిస్తే అనిపిస్తుంది – మన చుట్టూ వినబడే అభిప్రాయాలు మనల్ని ఎంత ప్రభావితం చేస్తాయో కదా! అని. నిన్ననే Chimamanda Ngozi Adichie అన్న నైజీరియా రచయిత్రి ఇచ్చిన TED Talk – “The Danger of a Single Story” విన్నాను. ఒకే దృక్కోణంలో కథలు వింటూ ఉంటే మనం ఎలా ఆ ఆలోచనావిధానానికి అలవాటు పడిపోతామో చెప్పే ఇరవై నిముషాల ప్రసంగం అది. తప్పకుండా వినాల్సినది.
….ఇక, స్త్రీవిద్య, సంఘ సంస్కరణ, వైద్యం, స్వతంత్ర పోరాటం, హక్కుల కోసం పోరాటాలు, సాంస్కృతిక సాహిత్య కృషీ – ఇలాగ ఈ వ్యాసంలో అన్ని కోణాల నుండీ స్త్రీ చైతన్యం గురించీ ఒక విహంగ వీక్షణం ఉంది. భద్రంగా పెట్టుకుని మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గ వ్యాసం.
పుస్తకం లో నాకు నచ్చని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి కానీ, ఈ పుస్తకం గురించి వివరంగా మరొకసారి చర్చిద్దామనే అనుకుంటున్నా కనుక, అక్కడ చెప్పుకుంటాను. మరొక్కసారి నాకు ఇంతమంది గురించి పరిచయం చేసిన – వోల్గా, వసంత కన్నాబిరాన్, కల్పన కన్నాబిరాన్ గార్లకి, ఫొటొగ్రఫర్ గుడిమెల్ల భరత్ భూశణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ…ఇతి వార్తాహ.
PS: వీళ్ళు రాసిన ముందు మాటలో తమకి స్పూర్తి కలిగించిన అంశాల్లో “Daughters of Maharastra” అన్న పుస్తకం ప్రస్తావన ఉంది. మా అద్భుతశక్తులు గల గ్రంథాలయంలో అది కూడా దర్శనమిచ్చేసింది కనుక, బహుశా నెక్స్ట్ సిరీస్ దానిలోని వారిపైనే ఏమో! (ఈ లెక్కలో నేనే ఫెమినిస్టు ఉద్యమాల్లోనూ చేరిపోకుండా ఉండాలని కోరుకోండి! ):-)
Tags: Mahilavaranam, Running Commentary