పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

“పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా” అన్న నవల కొన్నాళ్ళ క్రితం దూరదర్శన్ లో సీరియల్ గా వచ్చింది. రెండు మూడు సార్లు టెలికాస్ట్ అయింది. మొట్టమొదటి సారి వచ్చింది నేను స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటా. కానీ, గత నాలుగైదేళ్ళలో ఓ సారి వచ్చింది. అప్పుడు అది ఆద్యంతమూ చూసి, అందులోని సంభాషణలకు ఆకర్షితురాలినై, అప్పట్నుంచి ఆ పుస్తకం చదవాలి అనుకుంటూ ఉన్నా. పట్టుబట్టి ఎప్పుడూ దీని కోసం వెదకలేదు కానీ, నాకు ఎక్కడా కనబళ్ళేదు. గత శనివారం పట్టుబట్టి వెదికితే, దొరికింది. సరే, తరువాతి రోజు మధ్యాహ్నం ఇది చదువుతూ పడుకుందాం అన్నట్లు మొదలుపెట్టాను. పడుకోడం సంగతి దేవుడెరుగు…. నేను ఏకబిగిని ఆ పుస్తకం చదువుతూనే ఉన్నాను… చివరి పేజీ దాకా. మొదలుపెట్టినప్పుడు ఆ గదిలో ముగ్గురున్నారు, నాతో సహా. ముగిసేటప్పటికి నేనొక్కదాన్నే. వాళ్ళెప్పుడు వెళ్ళారో కూడా తెలీదు. అక్కడ ఓ పక్క ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. నేను కనీసం స్కోరు తెలుసుకోవాలన్న కుతూహలం అయినా కనబరచనంతగా మునిగిపోయాను దీనిలో.

వివరాలకి వస్తే, నవల రచయిత గోపీచంద్. ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన మొదటి తెలుగు నవల. కథాంశం – పరమేశ్వర శాస్త్రి పెంపుడు కూతురు కేశవమూర్తి ని ప్రేమిస్తుంది. పరమేశ్వర శాస్త్రి దీన్ని అంగీకరించకపోవడంతో వారిద్దరూ వివాహం చేసుకుని వేరుగా ఉండటం మొదలుపెడతారు. శాస్త్రి వారిని క్షమించడు. కేశవమూర్తి రచయిత గా పేరు తెచ్చుకుంటూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఆ ఊరు వదిలి వెళ్ళిపోతారు. తరువాత చాలారోజులకి శాస్త్రిగారి ఆరోగ్యం పాడు అయిందన్న టెలిగ్రాం తో మళ్ళీ ఆ ఊరికి వస్తారు ఆ దంపతులు, తమ కొడుకు పరమేశ్వర్ తో కలిసి. శాస్త్రి గారి చివరి క్షణాల్లో కూడా తన కూతుర్నిగానీ, అల్లుణ్ణి గానీ ఆప్యాయంగా పలకరించడు. మనవడికి మాత్రం చేరువౌతాడు. ఆయన మరణం తరువాత ఆయన వీలునామా ని విప్పి చదువుతాడు ప్లీడరు. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అది. స్థూలంగా ఇదీ కథ.

కథ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నా ఉద్దేశ్యం లో – కేశవమూర్తి మనోభావాలని వర్ణించిన తీరు, మూర్తి – సుజాత ల జీవిత చిత్రణ. పాత్రల మధ్య చర్చల్లో ఎన్నో విషయాలు దొర్లాయి. చర్చల్లో సహజత్వం ఉంది. అవి చర్చల కోసం రాసిన చర్చల్లా లేవు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఇలాంటి చర్చలు ఏ ఇద్దరి మధ్యనీ జరిగాయి అనిపించేలా ఉన్నాయి. అంటే, రచయిత నిజజీవితం లోని పాత్రలను తీసుకునే రాయాలని లేదు. కానీ, ఆ సహజత్వం ఆ సంభాషణల్లోకి వచ్చిందీ అనడంలోనే రచయిత తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎంతగా పరిశీలించాడో అర్థమౌతోంది. తన చుట్టూ ఉన్న సమాజాన్నే కాదు…తనలోని మనిషి ని కూడా అంతే సూక్ష్మంగా పరిశీలించాడు అన్న విషయం కేశవమూర్తి – సుజాత లు తమ తమ అంతర్గత భావాలను గురించి తమలో తాము తర్కించుకున్నప్పుడు, పాఠకుడికి తమ వైపు కథ వినిపించేటపుడు అర్థమౌతుంది. రాజకీయం, సాహిత్యం వంటి విషయాల నుంచి ఆధ్యాత్మిక విషయాల దాకా సందర్భాన్ని బట్టి వచ్చిన ప్రతి విషయం గురించి కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉన్నట్లు అనిపించింది రచయిత కి. “గోపీచంద్ గొప్పమేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి” అన్న నార్ల వారి మాటల్ని పుస్తకం మొదలుపెట్టే ముందు చూసాను. వాటి లోని నిజం అర్థమవ్వడానికి నాకు ఎంతో సమయం పట్టలేదు. పుస్తకం ఆఖరుకి వచ్చేసరికి నాకు బ్యాక్ కవర్ పై గోపీచంద్ పై రాసున్న ప్రతి పదమూ నిజం అనిపించింది. లోతైన చర్చలు ఉన్న కొన్ని చోట్ల నేను చర్చ పూర్తిగా చదవలేకపోయాను…ఆ విషయం లో నాకు సరిపడా జ్ఞానం లేక. బహుశా త్వరలో మరోసారి ఈ పుస్తకం చదివినప్పుడు అవి కూడా చదువుతానేమో.

ఎటొచ్చీ అర్థం కానిది ఏమిటి అంటే – పరమేశ్వర శాస్త్రి పాత్ర తక్కువే ఈ నవల్లో. నా ఉద్దేశ్యం లో ఈ కథ కి మూలం ఆ వీలునామా కాదు. అయినా, పేరు అది ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. చివరి సీను(ఇది సీరియల్ ప్రభావం లో వచ్చిన పదం) చాలా హడావుడిగా ముగించేసినట్లు అనిపించింది. ఆ పేరుకి తగ్గట్టుగా ఉండాలంటే పరమేశ్వర శాస్త్రి ని ఇంకాసేపు బ్రతికించి ఉండాలేమో అనిపించింది. అంటే, చదివేవైపు ఉండి మనం ఎన్ని కహానీలన్నా చెప్పొచ్చు అనుకోండి…రాసేవాడికి తెలుసు అక్షరం బరువు అని. కానీ, నచ్చినవి చెప్పినప్పుడు, కాస్త వింతగా అనిపించినవి కూడా చెప్పాలి కదా… నచ్చనివి అంటూ ప్రత్యేకంగా ఏమీ లేనప్పుడు? 🙂

Published in: on November 15, 2007 at 2:08 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/11/15/parameswara-sastri-veelunama/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. Ee pusthakam ekkada dorukuthundi? Entha dhara?
  E-Book dorike aaskaram emanna undA?
  DD1 lo vesarante kacchitham gaa vishyam unna pusthakame ayyi untundhi ani nammakam

 2. OOps…వివరాలు ఇవ్వలేదు కదూ…
  వెల – 100 రూపాయలు
  విశాలాంధ్ర లో కొన్నాను నేను. అలకనంద ప్రచురణలు
  ఈ-బుక్ – దొరికే అవకాసాలు లేవు అనుకుంటా.

 3. గ్రేట్ మీరు ఒక్క రోజులో ఆ నవల పూర్తి చేసేసారంటే! నాకూ చెప్పండి ఆ విద్యెలాగో.

 4. ఏడ్చినట్టుంది కదూ నా ఇంగ్లీష్ కామెంటు,తెలుగు కూడా దాదాపు అంతే వుంటుంది
  యోజింబో మీడ మంచి వ్యాసం రాశారు.థ్యాంక్సు

  రాజేంద్ర
  http://visakhateeraana.blogspot.com/

 5. చాలా చక్కగా వుంది సమీక్ష. చివరివాక్యం నచ్చనివంటూ ఏం లేనప్పుడూ, కాస్త వింతగా అనివించినవి … అన్నమాట మరీ బాగుంది. నాకు మరోకథ జ్ఞాపకం వచ్చింది, వేరే రాస్తా :p/

  మాలతి

 6. సౌమ్య గారికి,

  వందనాలు … నేను ఈ బ్లాగులకి కొంచెం కొత్త … నాకు మీ articles అన్నీ చాలా బాగా నచ్చాయండి … చాలా బాగా రాసారు … ఒక్క విషయం అర్థం కాలేదు … మీరు ఇన్ని పుస్తకాలు ఎప్పుడు చదివారండి? మిమ్ములను చూసి నేను కూడా చదవడం మొదలుపెడుతున్నా … చూద్దాం ఇది ఎలా వెళ్తుందో …

  చంద్రం.

 7. intakii aa veelunama lo emundoo ceppaledu???

 8. సౌమ్య గారు,
  మీరు రాసిన సమీక్ష బాగుంది.
  నేను ఈ మధ్యనే ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’ చదివాను. అది చదివాక నాకు నవలలోని ‘కేశవమూర్తి ‘ గోపీచంద్ గారే అనిపించింది. ఇందులో కేశవమూర్తి స్నేహితులు సీమంతం ,రాధా రమణ మొదలైన వారు, కేశవమూర్తి రచనా ప్రతిభకు, అతని పేరు ప్రఖ్యాతులకు అసూయతో, ద్వేషంతో కేశవమూర్తిని హింసిస్తూ ఉంటారు. కేశవమూర్తి భార్య అందించిన సహకారంతో , ప్రేమతో ఈ అసూయా ద్వేషాలను జయిస్తూ ఉంటాడు.
  ఇక ఇందులో కేశవమూర్తి సినిమాలకు రచయితగా పనిచేస్తుంటాడు. సినిమా పరిశ్రమలో కూడా ఎన్నో నిందలు ఎదుర్కుంటాడు. చివరకు అరవిందుని భావాలవైపు ఆసక్తిని పెంచుకుంటాడు.
  నిజజీవితంలో కూడా గోపీచంద్ గారు సినిమాలలో దర్శకుడిగా , మాటల రచయితగా పని చేశారు.
  వారు రాసిన ‘పోష్టు చెయ్యని ఉత్తరాలు ‘ లో ఆయన హేతువాదం నుంచి ఆధ్యాత్మిక వాదం వైపు ఎలా మొగ్గు చూపారో వివరిస్తారు.
  ఆర్.యస్.సుదర్శనం గారు, తన విమర్శక వ్యాసాలలో పండిత పరమేశ్వర శాస్త్రి నవలను గూర్చి చెబుతూ, ‘కేశవమూర్తి ‘ గోపీచంద్ గారే అని చెప్పారు. గోపీచంద్ తన స్నేహితుల కపటత్వాన్ని , అసూయా ద్వేషాలను క్షమించలేకపోయారని అంటారు.
  గోపీచంద్ తెలుగులో ఉన్న గొప్ప రచయితలలో ఒకరని , ఆయన రాసిన అసమర్ధుని జీవయాత్ర, మాకూ ఉన్నాయి స్వగతాలు, మెరుపుల మరకలు, ఇంకా చిన్న కధలు చదివితే ఒప్పుకోక తప్పదు.

 9. thanks for posting on a good book and admittedly true to life .i have learnt why people change their behaviour all in sudden after reading this book and started take things in a easier way.sorry a very delayed comment


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: