అక్కిరాజు వారి “ఎదుగని బిడ్డ”

edaganibiddaఆ మధ్య అమెరికా దేశంలో కొన్ని రోజులు గడిపినప్పుడు మనసు పాత పత్రికల మీదకి మళ్ళింది (కె.కె.రంగనాథాచార్యులు గారి తొలినాటి తెలుగు కథానికలు: మొదటినుంచి 1930 వరకూ అన్న పుస్తకం చదివిన ప్రభావంలో!). అపుడు చదివిన/చదవాలని పేర్చుకున్న వాటిల్లో నన్ను అమితంగా ఆకర్షించినది “ఎదుగని బిడ్డ” అన్న అక్కిరాజు ఉమాకాంతం గారి కథ. రచనా కాలం – 1914. ఎందుకు నన్ను ఆకట్టుకుందీ అంటే, ప్రధానంగా కథా వస్తువు వల్ల – తెలుగుతల్లి తన బిడ్డ (తెలుగు భాష) కి వచ్చిన రోగం గురించి వాపోవడం ఈ కథలో ముఖ్యాంశం.

*****
“రాజులు విడువగా మంత్రులు, మంత్రులు విడువగా రాజులు బిడ్డను కాలు క్రిందబెట్టనిచ్చినారనుకున్నావా? ఏమి బిడ్డరా, ఏమి బిడ్డరా అని నెత్తినబెట్టుకొననివారు లేరు.” ఇలాగ, తన బిడ్డ పుట్టుకతోనే రాజభోగాలు అనుభవించినప్పటీకీ, “ఏండ్లు పైనబడ్డవి, ఆకారము మారినది. కాని, బిడ్డ ఎదిగినట్లగుపడదు.” …. “ఎవరి ముచ్చట వారు తీర్చుకున్నారే కానీ, బిడ్డ ఎదుగుచున్నదా లేదాయని విచారించినవారు లేరు” – ఇదీ తన బిడ్డ రోగం. ఎదుగక పోవడం! ఎవరూ పట్టించుకోవడం లేదు అని ఆ తల్లి ఆక్రోశం. “నీవేచెప్పు, ఏండ్లేమో పైనిబడె. ముదిరినదన్న ముదరదు. అన్ని ఎదిగితేనె మొగము తగ్గట్లుండి ఇంపూ, సొంపూ …. బిడ్డను చూసుకున్నప్పుడెల్ల నాకడుపు కుమ్మరావమువలె కుమిలిపోవుచున్నది నాయనా! ఏమనుకున్నావో!” అని మనతో వాపోతుంది ఆ తల్లి. ఏమనిచెబుతాము? మనకిమల్లే అప్పటి రాజులకి కూడా వాళ్ళ డెడ్లైన్ల నడుమ పైపైని చూడ్డం కంటే ఎక్కువ సమయం చిక్కలేదేమో! ఎవరొచ్చి ఎవర్ని విమర్శించగలరు!

సరే, ఆ రాజులు పోయారు. ఈ భోగాలు పోయాయి. తురక రాజులొచ్చారు. ఇంత భోగం లేదు. “ఇదేమి బిడ్డరా” అన్నాడట ఒకరాజు. కనుక, బిడ్డని ఇంటికి తెచ్చేసుకుందట ఆ తల్లి, రాజాశ్రయాలు మానిపించేసి. “బిడ్డ వేలుడు కూడ పెరగలేదు. మొహము పెద్దయినది, బట్టతల పడ్డది. కాళ్ళు చెడిపోయినవి. చేతులు మొద్దులైనవి. బిడ్డను చూసిన కొలది గుండె నీరైపోవునే కాని ధైర్యము కలుగదు” – ఆ తల్లిబాధ వింటూంటే, మరి మనకూ ధైర్యము సన్నగిల్లదూ? అంత జీవితం చూసిన ఆ తల్లే తన బిడ్డ గురించి అలాగంటే, బ్రతికినన్నాళ్ళూ ఆ ఎదుగని బిడ్డ తప్ప దాని భోగమేదో ఎరుగని నా బోటి వాళ్ళకి ఏమనిపించాలి! 😦

ఆ తరువాత తెల్లరాజులొచ్చారు. వాళ్ళు మంచిరాజులని అందరూ చెబితే, ఆ తల్లి తన బిడ్డ రోగానికి చికిత్స చేయిస్తారని ఆశించింది. మరేం జరిగింది? “పూర్వపు రాసి విని తలయూచినవారొకరు. దూరముగా జూసి బిడ్డపై యొక కాసు, రెండు కాసులు పడవేసినవారొకరు. పాపము దలచినవారొకరు. మొహము చిట్లించుకున్నవారొకరు. ఎత్తుకున్నవారు లేరు. చంకనుబెట్టుకున్న వారు లేరు. ఎందుకు నాయనా భ్రమ? బిడ్డకు వెనుకటి రోజులు తిరిగి రావు. … నిజమున కేమి? బిడ్డ ఏమంత శృంగారముగా ఉన్నదని నెత్తిన బెట్టుకుందురు నాయనా ఇతరులు, నా యేడుపే కాని!” – ఏమి చెప్పాలో తోచింది కాదు నాకు ఇలా వాపోతూంటే. బిడ్డని నేను చూసినప్పటి నుండి అట్లే ఉంది. మరో బిడ్డ ఎలా ఉంటదో నాకు తెలియదు మరి. ఏదో అందం? ఏది అనాకరం? నాకెలా తెలుస్తుందండీ? అందుకని మౌనంగా ఉండిపోయాను. పైగా, ఈ బిడ్డ తరువాత పుట్టిన బిడ్డలందరూ వాళ్ళ తల్లుల కడుపు చల్లగా, కళకళలాడుతున్నారట. పేరు, ప్రతిష్ట, సిరిసంపదలు – అన్నీ సంపాదిస్తున్నారట. వీరి మధ్య, ఆ తల్లి depression ని అర్థం చేసుకొనువారెవరు? care for the care-giver అన్న అంశం గురించిన ఎరుక ఉన్నవారెవరు? (అ తల్లి కి ఇతరత్రా బాధలు కూడా ఉన్నవి కదా అసలుకే ఇప్పుడు!)

“భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు లేకపోగా, అన్నమునకే అగచాట్లు పడుచున్నది. అనగూడదు గాని నాయనా! చచ్చినదానిలోను, బ్రతికినదానిలోను జమకాకున్నది” అని ఏడుస్తూనే, వైద్యులేమన్నారో చెప్పిందావిడ – “రాజుల ఇండ్లలో చిన్నతనమునే తినరానిదెల్ల తినుటవలన బిడ్డకు పొట్టపాడైనది. ఇక పెరుగదు గాని బ్రతుకును. అని కొందరోదార్చిరి.” అన్నారట. తెల్లవైద్యము నేర్చిన మనవారేమో – “ఈతల, ఈకాళ్ళు, ఈ చేతులు, ఈ పొట్ట తీసివేసి” కొత్తవి వేయాలని అన్నారట. ఒక పక్కన ఇవన్నీ చేస్తే, ఈ మాత్రమన్నా బిడ్డ మిగలడేమో అన్న బెంగ, ఒక పక్క ఏమో, బిడ్డ బాగుపడతాడేమో అన్న ఆశ! ఏమి చేయాలి? అని ఆ తల్లి బాధ.

*****
ఏమి చెప్పాలి? ఉన్నట్లుండి ఆక్సిడెంటులో కుటుంబపెద్ద పోతే, “మాకే ఎందుకిలా జరగాలి” అని ఆ కుటుంబ సభ్యులడిగితే సమాధానం చెప్పగలమా? లేకలేక పుట్టిన పిల్లకి చిన్నప్పటినుంచే ఏదో రోగం ఉన్నదనీ తెలిస్తే ఆ తల్లిదండ్రులు “ఎందుకిలా జరిగింది?” అని అడిగితే సమాధానం ఇవ్వగలమా? ఆ తల్లి హిందూ ధర్మానుయాయి అయిన పక్షంలో “కర్మ” అనుకొనాలి. కాని పక్షంలో ఏమి చేసుకోవాలో? కొంచెం ఫ్యాషనుగా, “లక్” అనుకొనాలి కాబోలు. లేకపోతే, – “lack of vision” అనుకోవాలి. మరి ఎందుకు అది లేదంటే మళ్ళీ ఏమనుకోవాలి? ఎందుకు ఉండాలంటేనో? ఒకదాని వెంబడి ఒక ప్రశ్న ఇలాగ వస్తూనే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకీ వీటి నుండి ఒక్కో జవాబు ఎంచుకుంటూ, చక్రభ్రమణం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి కాబోలు, భూమి తనచుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నట్లు! భూమి ఎందుకు తిరగాలి అసలు? – మళ్ళీ ప్రశ్న!

(ఉమాకాంతం గారు భాష రాసే పద్ధతి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది నాకు. నాకు అలా టైపు చేయడం కొంచెం కష్టంగా ఉంది. అందువల్ల, సమయాభావం వల్ల, మామూలుగా టైపు చేశాను ఆ కథలోని వాక్యాలని.)

కథను చదవాలి అనుకుంటే, ప్రెస్ అకాడెమీ ఆర్కైవులలో (త్రిలింగ మాసపత్రిక, మే 1914 సంచిక, 14-18 పేజీలు) వెదుక్కోవచ్చు, లేదంటే, ఫేస్బుక్ “కథ” గ్రూపులో ఇక్కడ చదువవచ్చు.

Advertisements
Published in: on July 21, 2013 at 9:58 am  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2013/07/21/eduganibidda/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. Thanks a lot for sharing this valuable information.

  2. […] తా.క. సౌమ్య టపా రాయడం పూర్తయింది. లింకు ఇక్కడ […]

  3. మంచి,మంచి బ్లాగులను అందించాలనే లక్ష్యంతో ఈ బ్లాగ్ వేదిక {తెలుగు బ్లాగుల వేదిక}ను ప్రారంభించాను.ఈ వేదికలో 100 బ్లాగులకు తప్ప మిగతా వాటికి చోటు లేదు.మీ బ్లాగును కూడా దీనిలో అనుసంధానం చేయాలనుకుంటే బ్లాగ్ వేదిక నియమాలు పాటించవలసి ఉంటుంది.వివరాలకు క్లిక్ చేయండి.
    http://blogvedika.blogspot.in/

  4. […] ఆకథని మనముందు పెట్టింది సౌమ్య (లింకు ఇక్కడ), అనేక ప్రశ్నలతో. బ్లాగుల్లోనూ, […]

  5. […] మెదిలింది. ఈకథమీద వి.బి. సౌమ్య వ్యాసం ఇక్కడ […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: