సాధారణంగా మనకి పెద్దవాళ్ళకి ప్రతిఏటా తద్దినాలు పెట్టడం వాళ్ళ పెద్ద కొడుకో, ఆ రోల్ కి దగ్గరగా ఉండే ఇంకోరో చేస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు మా తాత (నాన్నకి నాన్న) తద్దినానికి వీలైనంత వరకు ఆయన పిల్లలందరూ వాళ్ళ కుటుంబాలతో సహా కలిసేవారు. ఇది ఇలా మా నాన్న పోయాక నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు కూడా కొనసాగడం నాకు గుర్తు ఉంది. ఇందులో వంట చేయడం కాకుండా ఆడవాళ్ళకి వేరే ఏమన్నా రోల్ ఉందో లేదో నాకు తెలియదు. అందునా మనకి మరి పెళ్ళి చేసుకుంటే కూతురి గోత్రం మారిపోతుంది కనుక అసలు ఆ ఆఫిషియల్ ప్రాసెస్ లో ఏం పాత్ర లేదనుకుంటాను (పెళ్ళి కానివాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇపుడు టక్కుమని అలాంటి సందర్భాలు గుర్తు రావడం లేదు నా ఎరుకలోని కుటుంబాల మధ్య). అట్లాంటప్పుడు ఆయొక్క దినాలలో ఆయొక్క మహిళామణులు చేయదగ్గది ఏమిటి? అన్న ప్రశ్న వచ్చింది. ఇదేదో ఇపుడు హిందూ మత ద్వేషి ఈమె అని మొదలెట్టకండి. మీకు అలా అనిపిస్తే మీ ఖర్మ. నేనూ ఏ టైపు మనిషినైనా మాకూ ఆత్మలుంటై, మాకూ ఆత్మకథలుంటై.
నా చిన్నప్పుడు సంక్రాంతి తరువాత కనుమ రోజు మా అమ్మ ఒకటి చేస్తూండేది. అన్నం ముద్దలు పసుపు, కుంకుమ కలిపి చేసి, మిద్దెపైన కాకులకి పెట్టి ఒక శ్లోకం చదివేది. పిల్లలం అక్కడే కూడా ఉండి రిపీట్ చేసేవాళ్ళం. ఇది సంక్రాంతికి ఒకసారి మా మేనత్త వాళ్ళింట్లో ఉంటే అక్కడ కూడా ఈ పద్ధతి ఆవిడ ఆధ్వర్యంలో చేశాను. 2020లో ఆఖరుసారి చేశాను ఇండియా ట్రిప్ లో. ఇప్పటిదాక నా అంత నేను చేయలేదు. పైగా జనవరిలో ఈ చలిలో ఇక్కడ కాకుల్ని ఎక్కడ వెదుకుతాం కెనడాలో? దీని గురించి ఎపుడన్నా లోకల్ గుడిలో పూజారిని అడగాలి అని చాలాసార్లు అనుకున్నా కానీ నాకు మతపరమైన ఆచారాల పట్ల మరీ అంత ప్యాషన్ లేనందువల్ల పట్టించుకోలేదు. ప్రతిఏడాదీ నాకూ మా ఇంటాయనకీ ఆ సమాయానికి ఆ సంభాషణ అయితే అవుతుంది. కానీ ఆడవాళ్ళు పూర్వికులని తల్చుకునే ఒక ట్రెడిషనల్ రిచ్యువల్ సందర్భం ఇదొక్కటే నాకు తెలిసిన జీవితంలో. అది మా వాళ్ళ పద్ధతి – అంతా చేస్తారో లేదో నాకు తెలియదు. ఇలాంటిది ఒకరిద్దరు కథల్లో రాయగా చూశాను తప్ప స్నేహితుల మధ్య అయితే ఎప్పుడూ వినలేదు. ఇది జనరిక్ – ఫరాల్ డెడ్ ఏంసెస్టర్స్ అన్నట్లు.
పాయింటెడ్ గా ఒక మనిషి మరణించిన తిథో/తేదీ నో… అప్పుడు ఏం చేస్తాము? ఏం చేయొచ్చు? అన్నది ఇందాక ఫ్రెండుతో చర్చకి వచ్చింది (ఇలాంటి చర్చలు ఇంట్లో వాళ్ళతో పెట్టలేకపోయినా ఫ్రెండు తో పెట్టగలగడం అదృష్టమనే చెప్పాలి. నా ఫ్రెండ్సులకి ఓపిక ఎక్కువ). “పూజారిని అడక్కపోయావా? వాళ్ళే ఏదో చెబుతారు శాస్త్రం ప్రకారం” – అని ఒక ఫ్రెండు అన్నది. “ఎబ్బే… అట్టాంటివి కాదు… మనం రిచ్యువల్స్ అవీ అంత పాటించం కదా… అందునా నా బోంట్లు అలాంటి ప్రశ్నలేస్తే మొదట ఇంట్లో వాళ్ళే నవ్వేయరూ?” అనుకున్నా.
విషయం ఏమిటంటే, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ దినాలకి మనం చేయగల అప్రాప్రియేట్ పనులు ఏమిటన్నది. నాకు తట్టినవి ఇవీ:
- ఆ వ్యక్తి పేరుతో ఏదన్నా నచ్చిన చోట అన్నదానమో ఏదో అరేంజి చేయడం. ఓపికుంటే స్వయంగా ఎక్కడికో పోయి ఆ పనులేవో మనమే చేయడం.
- కాసేపు కూర్చుని ఆ వ్యక్తితో మన జ్ఞాపకాలు నెమరువేసుకోవడం. మన వద్ద ఫొటోలో ఏవో ఉంటే అవోసారి తిరగేయడం
- ఆ వ్యక్తి వస్తువులేవన్నా ఉంటే మరి వాటిని ఓసారి చూసి మనవద్ద ఎందుకున్నాయి? అన్నది గుర్తు తెచ్చుకోవడం
- మన తరవాతి తరానికి వాళ్ళ గురించి మనకి తెల్సినదేదో చెప్పడం.
- వాళ్ళకి తగ్గ వారసులమా? అనేసి మనల్ని మనం తిట్టుకోకుండా వాళ్ళ అంశ మనలో ఏముందో చూసుకుని గర్వపడ్డం. ప్రతివాళ్ళలోనూ లోపం ఉంటుంది. పోయినోళ్ళందరూ మంచోళ్ళే కానీ బ్రతికున్న అందరూ చెడ్డోళ్ళనేం లేదు కదా? మనకీ ఏదో ఓ మంచి విషయం కూడా వంటబట్టి ఉంటుంది వాళ్ళ నుంచి. అది కొంచెం ఆలోచించి హైలైట్ చేసుకుని గుర్తు చేసుకోవచ్చు వాళ్ళని.
- మీకోపికుంటే కోకో సినిమా చూడండి. అసలా సినిమా ఈ టాపిక్ మీద నా మీద బాగా లోతైన ప్రభావం చూపించి అట్లా ఇన్నేళ్ళ బట్టి ఊపుతూనే ఉంది తల్చుకున్న ప్రతిసారీ. అదో పద్ధతి ఈ విధమైన తల్చుకోడానికి.
- ఇందాకే కృష్ణ గుబిలి “వీరయ్య” పుస్తకం పూర్తిచేశాను. అదీ ఓ పద్ధతే.
ఇంకా ఏవన్నా తడితే మళ్ళీ అప్డేట్ చేస్తా. పాతికేళ్ళ డైరెక్ట్ ఎక్స్పీరియంస్ ఇక్కడ.
అట్లగాదు, ఓన్లీ మన మతంలో పాటించేవి మాత్రమే చెయ్యాలి.. మిగితావన్నీ నీలాంటి భ్రష్టులకి, మాక్కాదు, అనుకుంటే, మరీ మంచిది… ఎవడ్రమ్మన్ నాడండీ అడ్డమైన బ్లాగ్ పోస్టులు చదవడానికి? వెళ్ళండి మరీ!
సిక్కెంటిక – అనువాదం, అనుభవం
జిల్లేళ్ళ బాలాజీ గారి తెలుగు కథ “సిక్కెంటిక” కి నా ఆంగ్లానువాదం అవుట్‌లుక్ పత్రిక వీకెండర్ పేజీలలో ఈ ఆదివారం నాడు వచ్చింది. ఆ కథ, అనువాదం గురించి ఏవో నా నాలుగు ముక్కలు రాస్కుందామని ఈ పోస్టు. ఇదే పేరు గల కథాసంకలనంలో ఉంది ఇది. పుస్తకం ఈబుక్ కినిగె.కాం లో కొనుగోలుకి లభ్యం.
నేను ఈ కథని ఏప్రిల్ లో చదివినట్లు ఉన్నా. అంతకుముందు ఈ రచయిత పేరు విన్నాను కానీ అనువాదకుడిగా. ఆయన కథలు కూడా రాశారని నాకు తెలియదు. ఏదో వందలోపు ఉన్న పుస్తకాలు ఉంటే కొందామని బ్రౌజు చేస్తూ ఉంటే కనబడి కొన్నానంతే. మొదటి నాలుగైదు కథలు చదవగానే ఆకట్టుకున్నాయి. తర్వాతివి మళ్ళీ అంత నచ్చలేదు. ఈ నచ్చినవాటిల్లో ఈ కథ ఎక్కువ నచ్చింది. అందుకు ప్రధాన కారణం ముగించిన పద్ధతి. సాధారణంగా కొంచెం పాజిటివ్ ముగింపు చూపే వాటిని అంత సీరియస్ గా తీసుకోరేమో మన వాళ్ళు అని నా అనుమానం. కానీ నాకు వ్యక్తిగతంగా అలాంటివి ఇష్టం. సరే, ఈ కథ నచ్చింది కానీ నేను మధ్యలో ఇండియా ప్రయాణం వగైరా పనుల్లో బిజీగా ఉండి పట్టించుకోలేదు. మధ్యలో కథ గురించి చాలాసార్లు అనుకున్నా. దానితో మళ్ళీ జూన్‌లో ఈ కథ ఇంకోసారి చదివా – అనువాదం చేయడానికి ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో. అపుడు ఇంక ప్రయత్నిద్దాం అనుకుని బాలాజీ గారి అనుమతి తీసుకుని మొదలుపెట్టా.
ఆంగ్ల ఎడిటర్ల సూచనలు ఎలా ఉంటాయి? మనం ఏం చూసుకోవాలి? ఇలాంటివి ఆంగ్లంలో రాయాలనుకుంటున్న తెలుగు వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈమధ్య మాటల సందర్భంలో అర్థమైంది. అందుకని అనువాదం ప్రాసెస్ గురించి కొన్ని మాటలు రాసుకుంటున్నా:
ఇదే సమస్య నేను ఈ కథ అనువాదం చేస్తున్నపుడు గమనించాను. గతంలో అనువాదం చేసిన కథల్లో ఇన్నిసార్లు గతానికి, వర్తమానానికి, దూరపు గతానికి, మొన్నటి గతానికి ఇట్లా మారడం లేదు. చదవడానికి ఇబ్బంది పడలేదు కానీ అనువాదం చేయడంలో ఇది నాకు అంత పట్టుబడలేదు. ఆ విషయం ఆ ఎడిటర్లు కూడా ఎత్తారు. “we would ask you to give more thought to the way tense is handled. We feel there are ways to deftly handle tense in translation from languages where tense is mutable, but we’re not sure that is being achieved here” వర్తమానం, వర్తమానం కానిది అన్న తరహాలో ఆలోచించి టెన్స్ గురించి మరోసారి చూడమని సలహా ఇచ్చారు. అది చదివి కొంచెం అది అటూ ఇటూ మార్చాను నేను వాక్యాల్లో రెండో వర్షన్ సిద్ధం చేసే ముందు.
ప్రధానంగా ఇవే ఈ అనువాదంలో ప్రత్యేకంగా చూసినవి. ఇలా మొదటి వర్షన్ కి వచ్చిన ఫీడ్‌బ్యాక్ బట్టి రెండో వర్షన్ సిద్ధం చేసి అవుట్‌లుక్ కి పంపాను (నేను మొత్తం ఫీడ్బాక్ పెట్టడం లేదు. నిజంగా ఎవరికన్నా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే చెప్పండి – ఈమెయిల్ చేస్తాను). వీళ్ళు భలే తొందరగా స్పందించారు. వెంటనే వేసేసారు కానీ ఎడిటోరియల్ కామెంట్స్ అంటూ ఏం పంపలేదు. బహుశా సుమారుగా ఉంది అనుకుంటే వాళ్ళు మార్పులు చెప్పరేమో మరి. నాకు చెప్పకుండా ఏం మార్పులు చేసినట్లు లేరు, నేను గమనించినంతలో.
నా కథకి మరొకరు బొమ్మ వేయడం నేను చూశాను (2011 లో, “రచన” మాసపత్రికలో). నా పేరిట వచ్చిన పుస్తకాలకి (రెండు అనువాదకురాలిగా, ఒకటి రచయితగా టెక్నికల్ పుస్తకం) కవర్ డిజైన్లు గొప్పగా చేయడం చూశాను. అయితే, గత ఏడాదిగా చేస్తున్న ఈ అనువాదాలలో కథకి బొమ్మ వేయడం ఇదే మొదటిసారి. అనువాదానికి వేసిన బొమ్మ, ఒరిజినల్ లోని బొమ్మ పక్క పక్కనే కింద ఉన్నాయి.
ఒరిజినల్ బొమ్మ నాకు సూటిగా, సింపుల్ గా నచ్చింది. చాలా నచ్చింది కథ చదువుతున్నపుడు. అనువాదానికి వేసిన బొమ్మ బాగా సృజనాత్మకంగా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది. ఆర్టిస్టు పేరు ఆర్తి వర్మ. మూలకథలో చిత్రకారులు ఎవరో తెలియదు. అట్లా ఈ కథ నేను అనువాదం చేసిన వాటిల్లో మొదటి ఇలస్ట్రేటెడ్ కథగా నాకు ప్రత్యేకం అనమాట.
నేనొక పొరబాటు చేశాను. రచయిత ఫేస్బుక్ పేజిలో జిల్లేళ్ళ అన్న పదం జె అక్షరంతో మొదలవుతోంది. కానీ కినిగె వెబ్సైటులో, ఆయన ఈమెయిల్ లో జి అక్షరంతో మొదలవుతోంది. అది నేను ఇప్పుడు ఈ పోస్టు రాస్తున్నపుడు గమనించాను. అవుట్‌లుక్ పత్రిక లో జి తో మొదలయ్యే స్పెల్లింగే వచ్చింది. ఆయన చూశాకే కదా నేను పంపింది అన్న విషయం గుర్తువచ్చింది కానీ బహుశా ఆయన్ని ఒకసారి అడిగి ఉండాల్సింది ఏమో అనిపించింది.
ఇక నాకు ప్రతి అనువాదం ఏదన్నా పత్రిక్కి పంపుతున్నపుడు ఒక విధమైన జంకు ఉంటుంది – నాకు నచ్చిన కథ తెలుగేతరులకి నచ్చుతుందా? లేకపోతే మామూలుగా అనిపించి చప్పరించేస్తారా? అని. ఈసారి కూడా అది ఉండింది. అది కూడా సినిమాలు, ఓటీటీ, అవార్డులొచ్చే కథలూ పుస్తకాలూ ఇలాంటివన్నీ చూశాక నాకు హింసా, రొమాన్సు, ఆవేదన, ఆవేశం, సంక్లిష్టమైన మానసిక సంఘర్షణ అన్నీ సమపాళ్ళలో నూరితే తప్ప దాన్ని గొప్ప వస్తువుగా అంగీకరించరేమో అన్న అనుమానం పీకుతోంది. కామెడీ అయితే అసలు దాని దిక్కుక్కూడా చూడరేమో అని ఒక అనుమానం కూడా ఉంది కానీ అలాంటిదెపుడైనా అనువాదం చేస్తే అపుడు తెలుస్తుంది. ఇన్ని అనుమానాల మధ్య వాళ్ళు వేసుకోవడంతో మనకథల్లో వేరే భాషల వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి అన్న నమ్మకం పెరిగింది.
అనువాదానికి అంగీకరించి, నా ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెప్పి, చివర్లో అనువాదం మొదటి ప్రతి చూసి ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు బాలాజీ గారికి ధన్యవాదాలు. ఇక నేను మధ్యమధ్యలో మెసెంజర్ లో ఈ టాపిక్స్ మీద కెలుకుతూ ఉంటా అనిల్ అట్లూరి గారిని, కొత్తపాళీ గారిని. విసుక్కోకుండా నన్ను ఎంగేజ్ చేస్తారు. ఆ చర్చలు నాకు ఉపయోగకరంగా అనిపిస్తాయి అనువాదాలు చేసేటప్పుడు. వాళ్ళకి కూడా మరోసారి ధన్యవాదాలు.
Tags: My Translation, Running Commentary