గత రెండు వారాలుగా నేను ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ లింగ్విస్టిక్స్ విద్యార్థుల మధ్య స్టూడెంటుగా Field Linguistics అన్న క్లాసు కి వెళ్తున్నాను. అధికారికంగా విద్యార్థిని కాకపోయినా, లెక్చరర్ తో ఉన్న స్నేహం వల్ల ఈ అవకాశం లభించింది. దీన్ని తెలుగులో ఏమంటారో తెలియక సురేశ్ కొలిచాల గారిని అడిగితే “క్షేత్రశీల భాషాశాస్త్రం” అన్న ఈ పదం సూచించారు. సరే, జరిగింది రెండు వారాలే అయినా, ఇంకా పన్నెండు వారాలు మిగిలి ఉన్నా, ఇప్పటికే ఈ క్లాసు నాలో అనేక ఆలోచనలు రేకెత్తించింది. అవి రాసుకోవడానికే ఈ టపా.
ఇంతకీ ఏమిటిది?: క్లుప్తంగా చెప్పాలంటే ఒక భాషని అది మాట్లాడే ప్రాంతంలో అధ్యయనం చేసి, ఆ భాష నిర్మాణాన్ని గురించి పరిశోధించడం. పురావస్తు (archaeologist), పురాజీవ (paleontologist) శాస్త్రవేత్తల్లా ఈ క్షేత్రశీల భాషావేత్తలు కూడా లొకేషన్ కి వెళ్ళి అధ్యయనం చేస్తారు. కాకపోతే, వీళ్ళు జీవించి ఉన్న మనుషుల్తో ఉంటూ, వాళ్ళ జీవితం లో వాడే భాషని, పలుకుబడులని ఇతరత్రా భాషకు సంబంధించిన విషయాలు గ్రంథస్తం చేస్తారు. కనుక, బహుశా మానవ పరిణామ శాస్త్రవేత్తలతో (anthropologists) తో పోలిక కొంచెం దగ్గరగా ఉంటుందేమో.
ఎందుకు?: సరే, ఇదంతా ఎందుకు చేస్తారు? అని అడిగితే – పలు కారణాలు. నాకు తోచినవి చెబుతాను. అంతరించి పోతున్న భాషలని గురించి గ్రంథస్తం చేయడం ఒక కారణం. అది ఎందుకంటే, ఒక భాష అంటే ఒక సంస్కృతి. ప్రతి భాషకీ ఏదో ఓ ప్రత్యేకత ఉంటుంది, మానవజాతి గురించి ఏదో ఒక కొత్త విషయం చెబుతుందన్న నమ్మకం. మరో కారణం – అసలు భాష ఎలా పుట్టిందన్న కుతూహలం – ప్రపంచ భాషల మధ్య పోలికలు, భేదాలను గురించి తెలుసుకుని, భాష పుట్టుకని, మానవజాతి ఎదుగుదలని reconstruct చేయొచ్చు అన్న ఆశ. మూడో కారణం – ఆ భాష మాట్లాడే వాళ్ళకి సామాజికంగానో, రాజకీయంగానో గుర్తింపు తీసుకురావడం. నాలుగో కారణం – ఆ భాష పైన ఉన్న ప్రేమ, “నా భాషకోసం నేనేదన్నా చేయాలన్న తాపత్రేయం” (ఇది ఆ భాష మాట్లాడే వారికి!). ఇలా చాలా కారణాలు ఉండొచ్చు. మతప్రచారం కోసం పూర్వం చాలమంది మిషనరీలు ఇలాగే మారుమూల ప్రాంతాలకి వెళ్ళి ఆయా భాషల గురించి పుస్తకాలు రాశారు (మారుమూలని ఏముంది, తెలుగుకి కూడా ఇలాంటివి కనిపిస్తాయి గూగుల్ బుక్స్ లో వెదికితే, 1800ల నాటివనుకుంటాను). వీళ్ళు కాక, పూర్తిగా భాషని అధ్యయనం చేయడం కోసమే ఆ ప్రాంతాల్లో చాలారోజులు నివసించి పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు (అలాంటి ఒకరి గురించి ఈమాట వెబ్ పత్రికలో ఇంటర్వ్యూ).
పద్ధతి: సాధారణంగా నిజజీవితంలో అయితే, ఈ క్షేత్రస్థాయి పరిశోధన చేసే భాషావేత్తలు ఆ అధ్యయనం చేసే ప్రాంతానికి వెళ్ళి కొన్నాళ్ళు మకాం వేసి, స్థానికులతో తిరిగి, వాళ్ళ భాష నిజజీవితంలో ఎలా వాడతారు? అన్నది తెలుసుకుని, రకరకాల ప్రశ్నల ద్వారా ఆ భాష తాలూకా స్వరూపాన్ని అర్థం చేసుకుంటారు. ఇదంతా ఆడియో/విడీయో రికార్డింగులు, వివరమైన నోట్సుల ద్వారా సేకరించి, తరువాత తమ పరిశోధనా ఫలితాలతో ఆ భాష తాలూకా వ్యాకరణం, ఆ భాష వారి సంస్కృతి గురించి, వాళ్ళ సాహిత్యం గురించి ఇతరత్రా అంశాల గురించి పుస్తకాలు, పరిశోధనాపత్రాలు వంటివి ప్రచురిస్తారు. కొంతమంది లాస్టుకి ఆ భాష ధారాళంగా మాట్లాడతారు కూడా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం: సాధారణంగా వీళ్ళు వెళ్ళి అధ్యయనం చేసి పుస్తకాలు రాసేముందు ఆ భాష గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్ ఉందిగా! అంటే చెల్లదు.
మేమేం చేస్తున్నాం?: క్లాసులో ఇదంతా చేయడం అసాధ్యం కనుక మాకు పద్ధతి కొంచెం వేరు. క్లాసు సోమ, బుధ, శుక్రవారాలు చెరో గంట నడుస్తుంది. మా క్లాసుకి ఒక అతిథి వారానికి ఒకసారి వస్తుంది. ఆ అమ్మాయి ఏదో గుర్తు తెలియని భాష మాట్లాడుతుంది (ఆ భాషేమిటో మాకు ప్రస్తుతానికి చెప్పరన్నమాట – నేరుగా ఇంటర్నెట్ ని ఆశ్రయించకుండా, అసలు పనెలా చేయాలో తెల్సుకోవాలి కనుక). సో, ఈ అమ్మాయి ని ప్రశ్నలు అడగడం ద్వారా ఆ భాష నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి. సోమ శుక్రవారాలు ఆ అమ్మాయి జవాబులని బట్టి ఆ భాష స్వరూపాన్ని అర్థం చేసుకోవడం, బుధవారం నాడు మళ్ళీ మేము అనుకున్నది కరెక్టా కాదా అని తనతో నిర్థారించుకోవడం. ఇదీ మా పని ప్రస్తుతానికి. ఉదాహరణకి – గుడ్ మార్ణింగ్, గుడ్ నైట్, గుడ్ ఈవెనింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ – ఇలా కొన్ని పదాలు అడిగాము అనుకోండి, అన్నింటికి ఆవిడ జవాబులు పోల్చుకుని, ఏదన్నా నాల్గింటి లోనూ ఉంటే – అది “గుడ్” కి అర్థమా? అని అడిగి, నిర్థారించుకోవడం. ఇలా నెమ్మదిగా ప్రశ్నలడుగుతూ, ఆ భాష తాలూకా పదజాలం, పదనిర్మాణం (ఉదా: tense, gender, plural వంటివి ఎలా సూచిస్తాము?), వాక్య నిర్మాణం, పలుకుబడి (pronunciation), ఇలాంటివి గ్రహించాలి.
కొత్తదనం: సాధారణంగా సైన్సు, ఇంజనీరింగ్ నేపథ్యం నుండి వచ్చిన నాకు ఈ పద్ధతే చాలా కొత్తగా ఉంది. ఏదన్నా ఒకటి చేస్తే – దాన్ని evaluate చేయడానికి ఒక పద్ధతి అంటూ మొదట స్థిర పరుచుకుంటే కాని పరిశోధన మొదలవదు నాకు తెలిసిన విషయాల్లో (Natural Language Processing, Machine Learning). పరిశోధన పక్కనపెట్టి, ఏదన్నా అప్లికేషన్ కోసం ప్రోగ్రాం రాస్తున్నాం అనుకున్నా, మన ప్రోగ్రాం కరెక్టా కాదా? అన్నది తేల్చడానికి మనకి ఒక reference point ఉంటుంది (ఉదా: test cases). ఇక్కడ అది లేదు. ఆ అమ్మయి ఫలానా “what is your name” అన్నదానికి మా భాషలో “ఎక్స్ వై జెడ్” అంటారు అన్నదనుకోండి, అది మనం సరిగ్గా విన్నామా? ఆమె “ప” అన్నదా, “బ” అన్నదా? “డ”, “ద” మధ్య భేదం ఉందా (కొన్ని మాతృభాషల వాళ్ళకి కొన్ని శబ్దాలు ఉండవు – కనుక వాళ్ళు ఒక్కోసారి భేదాన్ని చూడలేరు)? ఎన్నిసార్లు రికార్డింగ్ ని రిప్లే చేసినా ఈ విషయమై మా మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. International Phonetic Alphabet అని ఒకటుంది. స్పెల్లింగ్ ని ఎలా పలుకుతామో అలా రాసే స్క్రిప్టు. నాకు ఇంకా రాదు కానీ, మన తెలుగులో అనేక శబ్దాలుండటం మూలాన క్లాసంతా IPA వాడుతూంటే నేను తెలుగు లో రాస్తున్న pronunciation ని. మరి వాళ్ళంతా టీనేజి పిల్లలు – వాళ్ళ దృష్టిలో నేను వయసు మళ్ళిన దాన్ని కనుక వాళ్ళు నా మానాన నన్ను వదిలేశారు ఈ విషయంలో, కొన్ని వారాల్లో నేర్చుకుంటానని ప్రామిస్ చేశాక.
అలా నాకిప్పటిదాకా పరిచయం ఉన్న తరహా చదువు, పద్ధతులు కాకుండా మొత్తానికే కొత్తగా ఉన్న పరిశోధనాత్మకంగా ఉన్న క్లాసు ఇది. ఏది సరి, ఏది కాదు – ఎలా నిర్ణయిస్తారు? అసలు ఈ నిజం field linguists ఆ రకరకాల భాషల గురించి ఎలా రాస్తారు? ఒకే ఒక స్పీకర్తో, క్లాసులో మనకే ఇన్ని భేదాభిప్రాయలుంటే, వాళ్ళు ఫీల్డులో, బహుశా ఆ భాష మాట్లాడే అనేకుల మధ్య ఇవన్నీ ఎలా అధ్యయనం చేస్తారు? ఎలా evaluate చేసుకుంటారు తాము చేస్తున్నది కరెక్టా? కాదా? అని? అసలు వీళ్ళ మోటివేషన్ సరే, ఆ స్థానికులెందుకు సపోర్టు చేస్తారు?- అని ఇలా ఎన్నో ప్రశ్నలు నాకు.
ఈ శబ్దాల విషయం లో భేదాభిప్రాయాల గురించి ఆలోచించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న స్పీచ్, సిగ్నల్ ప్రాసెసింగ్ విషయాలతో గత వారమే ఒక చిన్న ప్రోగ్రాం రాయడం మొదలుపెట్టాను – స్పీకర్ మాట్లాడే శబ్దాలు ఆ IPA లో దేనికి దగ్గరగా ఉన్నాయో పోల్చి చెప్పడానికి. ఇంకా కొంచెం టైం పడుతుంది క్లాసులో స్టూడెంట్లకి ఉపయోగపడే స్థాయికి రావాలంటే (ఒకవేళ వర్కవుతే). ఇలా ఈ క్లాసుకి వెళ్ళడం, దాని గురించి చాలాసేపు ఆలోచించడం అవుతోంది కనుక, ఈ ఆలోచనలు, క్లాసు ద్వారా నేను తెలుసుకుంటున్న విషయాలు ఎక్కడో ఓ చోట నోట్సు రాసుకుందామని అనుకుంటూన్నాను. క్లాసులో అసైన్మెంట్లు, ఎక్సర్సైజులు నాకు మాండేటరీ కాదు – అధికారికంగా స్టూడెంటును కాను కనుక. అందువల్ల ఎంచక్కా తెలుగులో రాస్కోవచ్చని, చర్చల్లో మట్టుకు ఆంగ్లం లో పాల్గొంటే చాలని అనిపించింది. ఇది ఆరంభం.