గత రెండు రోజుల్లో ఇద్దరు మహిళలకి నోబెల్ బహుమతి రావడం, తరువాత వరుసగా సీబీసీ (కెనడా వారి బీబీసీ అనమాట) రేడియోలో పలు చర్చలు వినడం అయ్యాక ఏదో ఈ విషయమై నాకు తోచిన నాలుగు ముక్కలు రాసుకోవాలని ఈ టపా. వ్యక్తిగత అభిప్రాయాలు – జనాంతికంగా రాసినవి కావు. కొంచెం కడుపుమంటతో, కొంచెం అసహనంతో రాసినది – ఆపై మీ ఇష్టం. (నువ్వు అయ్యప్ప గుళ్ళోకి ఎంట్రీ గురించి రాయలేదే? అనీ, మీ ఊళ్ళో ఒక చర్చి బయట సైన్ బోర్డు లో పాపం వాళ్ళు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయబోతే, సైన్ బోర్డ్ కంపెనీ వాళ్ళు ఇది మా మతానికి విరుద్ధం అని రాత్రికి రాత్రి బోర్డే ఎత్తేస్తే, చర్చి వాళ్ళు మానవ హక్కుల కేసు వేశారు.- దాని గురించి రాయలేదే? అని అడిగేవాళ్ళకి – మీకు పనీపాటా లేదా ఇలా అందరినీ అడుక్కోవడం తప్ప? అని నా ప్రశ్న).
విషయానికొస్తే, మొన్న భౌతిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న ముగ్గురిలో ఒకరు కెనడాకు చెందిన (నేను ఉండే ఊరికి దగ్గర్లోనే ఉన్న వాటర్లూ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న) మహిళా ప్రొఫెసర్ డొనా స్ట్రిక్లాండ్ ఒకరు. ఆవిడ ఇక్కడే దగ్గర్లోనే ఉన్న మరొక విశ్వవిద్యాలయం – మెక్ మాస్టర్ లో చదివి, తరువాత అమెరికాలో పీహెచ్డీ చేసి, తరువాత కెనడాలో ప్రొఫెసర్ గా చేరారు. సరే, మామూలుగా ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మొదలుపెట్టి, ఆరేడేళ్ళకి అసోసియేట్ అయ్యి, ఆపైన మరో ఐదారేళ్ళకి ఫుల్ ఫ్రొఫెసర్ అవుతారు. ప్రతి ప్రొమోషన్ కి ఒక తతంగం ఉంటుంది. పలు విధాలైన డాక్యుమెంట్లు, ఆ రంగంలోనే, ఈ వ్యక్తికి సంబంధంలేని (అంటే కలిసి పనిచేయని) మేధావుల నుండి రికమెండేషన్ లెటర్లు, ఇలాంటివన్నీ సబ్మిట్ చేస్తే, ఒక ఆరేడు నెలల రివ్యూ ప్రాసెస్ ఉంటుంది – యూనివర్సిటీలో వివిధ స్థాయుల్లో ఈ మొత్తం ఫైలుని పరిశీలించి, ఈ మనిషి ప్రపంచ స్థాయిలో పరిశోధనలు అవీ చేసి, గ్రాంట్లు గట్రా సంపాదించి, యూనివర్సిటీ స్థాయిని పెంచేలా పని చేశారా లేదా అని బేరీజు వేసి, చివర్లో నిర్ణయం తీసుకుంటారు ప్రొమోషన్ ఇవ్వాలా వద్దా అని (అందువల్ల, ప్రొఫెసర్ ఉద్యోగం అంటే హాయి, పనేం ఉండదు అనుకునేవాళ్ళు – మీరు నెక్స్టు మంచినీళ్ళు తాగుతారు కదా – ఆ గ్లాసులోకి దూకండి). నేను చెప్పింది అమెరికాలో జరిగే పద్ధతి. కెనడా లో కూడా ఇంచుమించు ఇంతే, నాకు తెల్సినంత వరకు.
విషయం ఏమిటంటే, డొనా స్ట్రిక్లండ్ గురించి చదువుతున్నప్పుడు నేను గమనించిన మొదటివిషయం – ఆవిడ అసోసియేట్ ప్రొఫెసర్ అని. దగ్గర దగ్గర అరవై ఏళ్ళావిడ. నోబెల్ ప్రైజు వచ్చిందంటే (నిజానికి వచ్చింది ఆవిడ ముప్పై ఏళ్ళ క్రితం పీహెచ్డీ విద్యార్థినిగా రాసిన మొదటి పరిశోధనాపత్రానికి!) ఎంతో గొప్ప పరిశోధనలు చేసి ఉండాలి ఇన్నేళ్ళ కెరీర్ లో. అలాంటిది ఆవిడకి ప్రొఫెసర్ పదవి ఇవ్వలేదా వాటర్లూ వాళ్ళు అని. వీర ఫెమినిస్టులు కొందరు వెంటనే ఇది వివక్ష, ఆడ ప్రొఫెసర్ అని ఆవిడకలా చేశారు, అని పోస్టుల మీద పోస్టులు రాశారు. కాసేపటికి ఆవిడని ఎవరో అడగనే అడిగారు ఇదే ప్రశ్న. ఆవిడ “నేను అసలు అప్లై చేయలేదు” అనేసింది. “ఎందుకు అప్లై చేయలేదు” అన్న విషయం మీద సోషల్ నెట్వర్క్ లో చాలా చర్చ నడించింది గాని, ఒక పాయింటు మట్టుకు నాకు “నిజమే” అనిపించింది. ప్రొమోషన్ కి మనం అప్ప్లై చేసుకుని ఆ డాక్యుమెంట్లు అవీ అరేంజ్ చేస్తేనే ఇస్తారన్నది కరెక్టే గాని, సాధారణంగా యూనివర్సిటీ లో చేరగానే ఎవరో ఒక మెంటర్ ని కుదురుస్తారు. వీళ్ళు కొంచెం సీనియర్ ప్రొఫెసర్లు. మనకి కొత్తగా నిలదొక్కుకుంటున్నప్పుడూ, ఇలా ప్రొమోషన్ కి అప్ప్లై చేస్తున్నప్పుడు, ఇతర వృత్తి కి సంబంధించిన సందేహాలేవన్నా ఎవరన్నా పెద్దలతో మాట్లాడాలి అనిపించినపుడూ – గోడు వెళ్ళబోసుకోడానికి, గైడెంసు పొందడానికి. ఇలా ఫుల్ ఫ్రొఫెసర్ కి అప్లై చేయమని సలహా ఇవ్వడం కూడా వాళ్ళ పనే అని నా అభిప్రాయం.
ఇక్కడొక పక్కదోవ కథ: ఇదివరలో నా క్లాసులో జరిగిన విషయం ఒకటి రాసినప్పుడు – ఇక్కడొక మహామేధావి – టీఏ ల మాటలు స్టూడెంట్లు పట్టించుకోరని పేలారు. నేను టీఏ ని నేను ఎక్కడా అనలేదు. ఆ మేధావి గారి డిడక్షన్ అనమాట. అప్పుడు నేను పీహెచ్డీ కి పని చేస్తున్నా, ఆ కోర్సుకి నేను అధికారిక అధ్యాపకురాలినే. జర్మనీలో అది సర్వసాధారణం – మాకు కోర్సులు గట్రా చేయాలని లేదు అమెరికాలోలా. కానీ, దాదాపు నాకు తెల్సిన అందరూ పాఠాలు చెప్పారు. మేధావిగారు తమ అజ్ఞానంలోనో, అహంకారంలోనో పేలారు. అది నేను అమ్మాయి కాకపోతే , మేధావి గారు అబ్బాయి కాకపోతే ఆలా పరిచయం లేని మనిషితో పేలేవారు కాదు అన్నది కూడా అప్పుడు అనిపించిన విషయం. అలాంటి మేధావులు ఈ పోస్టు చదువుతూంటే – మీ ఖర్మ కాలి, నేను అమెరికాలో ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేశాను కొన్నాళ్ళు. అందుకని పైన రాసినదంతా నాకు తెల్సిన విషయమే. “అబ్బ చా, నీకెవరు చెప్పారు?” అని మాన్ స్ప్లెయినింగ్ మొదలెట్టేముందు ఆ ముక్క బుర్రకి ఎక్కించుకొండి ముందు. నేను కొంతకాలం ప్రొఫెసర్ గిరి వెలగబెట్టా కనుక, ఒక మెంటర్ కాదు, ఇద్దరు ముగ్గురు మెంటర్లు (ఒకరిని యూనివర్సిటీ పెట్టింది, ఒకరిని నేను వెంటబడి పెట్టుకున్నా, ఒకరు నా మీద అభిమానంతో నా ప్రొఫెషనల్ బాగోగుల బాధ్యత తీసుకున్నారు – ఇలా) ఉన్నారు కనుక – మెంటర్ అన్న మనిషి ఖచ్చితంగా ఇది చెప్పాలనే నేను అనుకుంటున్నాను. మరి ఈవిడకి చెప్పలేదా? చెప్పినా ఈవిడ చెయ్యలేదా?అన్నది మనకి తెలియదు. కానీ, ఈవిడ మగవాడైతే ఇలా ఉండిపోయే అవకాశం చాలా తక్కువ అని మట్టుకు చెప్పగలను.
ఏందీ మగా, ఆడా గోల? ఎవరైతే ఏమిటి? అసలయినా ఆవిడ ప్రొఫెసర్ అవడం కాకపోడం ఆమె యిష్టం. మధ్య నీ ఏడుపేమిటీ?అనిపించొచ్చు. నిజమే. కానీ, ఇవ్వాళ పొద్దున రేడియోలో అన్నట్లు – భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేయాలి అనుకునే ఆడవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు – ఆ సంఖ్య గత పదిహేనళ్ళలో తగ్గుతూ పోయిందట. గత యాభై ఐదేళ్ళలో ఆ రంగంలో నోబెల్ వచ్చిన మొదటి మహిళ ఈవిడే. రసాయన శాస్త్రం లో నోబెల్ వచ్చిన వాళ్ళలో ఒకరు ఫ్రాంసెస్ అనే అమెరికన్ ప్రొఫెసర్. ఆవిడ కూడా ఆ రంగంలో నోబెల్ పొందిన ఐదో మహిళే (వందకు పైగా ఏళ్ళ చరిత్ర ఉంది నోబెల్ బహుమతులకి!). ఏమన్నా అంటే రాయలేదంటారు – ఏ నోబెల్ బహుమతైనా పొందిన మొదటి మహిళ, భౌతిక, రసాయన శాస్త్రాల నోబెల్ బహుమతుకు పొందిన మొదటి మహిళా కూడా మేడం క్యూరీనే. ఇలా, అక్కడ మొత్తం నోబెల్ చరిత్రలో పట్టుమంది యాభై మంది కూడా లేరు మహిళలు. అందులో సైంసు లో వచ్చినది ఎంతమందికి? వీళ్ళిద్దరితో కలిసి పద్దెనిమిది మందికి వచ్చినట్లు ఉంది (భౌతిక, రసాయన శాస్త్రాలు, వైద్యశాస్త్రం కలిపితే). అంటే, ఇప్పుడిప్పుడే స్కూళ్ళకి పోతూ, సైంసు మీద ఆసక్తి చూపుతున్న అమ్మాయిలకి ఇదెంత స్పూర్తివంతంగా ఉంటుంది? ఆడపిల్లలు పెద్ద చదువులు చదవడం అన్నది ఇప్పటికీ అంత సాధారణం కాదు. వీళ్ళకి స్పూర్తిదాతల అవసరం ఎంతో ఉంది. అలాంటి స్ఫూర్తిదాత గత మే దాకా వికీపీడియాకి famous enough అనిపించలేదంట. అనామక సైంటిస్టులు చాలామందికి వికీ పేజీలున్నాయి (మగ సైంటిస్టులు లెండి!). నోబెల్ రాకముందు కూడా ఆవిడ శాస్త్రపరిశోధనలకి పేరుంది. అందుకే నోబెల్ వచ్చింది. రేడియోలో ఈ ముక్కే అంటూ – వికీపీడియా క్యురేటర్లలో కూడా తొంభై శాతం మంది తెల్లజాతి మగవాళ్ళు. వీళ్ళు తెలీయకుండానే ఇలా స్త్రీ ప్రముఖులు, లేదా ఇతరు (తెల్లజాతి కాని వాళ్ళు, మైనారిటీలు వగైరా)ల గురించి ఇలాగే చేస్తూ ఉండొచ్చని ఆంకరమ్మ వాపోయింది ఇందాకే. ఈ విషయం గురించే మాట్లాడుతూ బ్రిటన్ కు చెందిన మరొక మహిళా భౌతికశాస్త్ర ప్రొఫెసర్ – ‘women in physics’, ‘women in computer science’ తరహా గుంపుల అవసరం పోయే రోజు రావాలని కోరుకుంటున్నాను, అన్నది. ఆవిడ ఉద్దేశ్యం – బాగా కామన్ గా కనబడుతూ ఉంటే ప్రత్యేక గ్రూపుల అవసరం ఉండదని (black in engineering తరహా గ్రూపులు కూడా అటువంటివే).
సాధారణంగా నేను చూసినంతలో మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ assertive గా ఉంటారు తమ గురించి తాము ప్రొజెక్ట్ చేసుకోడంలో. అలాగే ఉన్న మహిళలని డామినేటింగ్ అంటూ ఉంటారు. ఇళ్ళలో అయితే గయ్యాళులంటారు. నిన్న నేను రేడియో ఇంటర్వ్యూలో విన్నదాన్ని బట్టి డోనా గారు బాగా నిగర్విలా, మామూలుగా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి టైపులో అనిపించారు. ఆవిడ ఫుల్ ప్రొఫెసర్ కి ఎందుకు అప్లై చేయలేదో కానీ, ఇంటర్వ్యూ విన్నాక ఆ విషయం అంత ఆశ్చర్యంగా అనిపించలేదు. అయితే, మెంటర్ అన్నవాళ్ళు ఆవిడ ప్రొఫెసర్ కావడం అన్నది ఇతర మహిళా విద్యార్థులకి ఎంత విలువైనదో గుర్తించి ఆవిడని ప్రోత్సహించి ఉండాల్సింది అనిపించింది.
బాగా చదువుకున్న, సో కాల్డ్ మేధావుల్లో స్త్రీల పట్ల ఉన్న చులకన భావం గురించి ఎందరో చెప్పగా విన్నాను, కొన్ని నేనూ ప్రత్యక్షంగా చూశాను. ఇది ఎక్కువగా సాహితీ మేధావుల్లో గమనించినా, శాస్త్రాలూ వెనుక బడలేదు. యూనివర్సిటీల్లోనూ, కాంఫరెంసులలోనూ, అమ్మాయిలతో వేసే జోకులు అబ్బాయిలతో వేసే జోకులతో పోలిస్తే వేరుగా ఉండడమూ, బాగా గౌరవప్రదంగా కనిపించే పెద్ద ప్రొఫెసర్లు తాగేసి తిక్కగా ప్రవర్తించి, పొద్దున్నే మళ్ళీ ఏం జరగనట్లు ప్రవర్తించడమూ, ఆడపిల్లల రిసర్చిని చులకన చేయడమూ, ఇలాంటివన్నీ చూశాను నేను యూనివర్సిటీల్లో. కొన్ని చదివాను. ఒక జావా క్లాసులో లెక్చరర్ (హైదరాబాదులో) అబ్బాయిల వైపుకి తిరిగి – బాగా చదువుకోండి, కట్నాలు వస్తాయని, అమ్మాయిల వైపుకి తిరిగ్ – మీరెలాగో పెళ్ళిళ్ళు చేసుకునేదాకే కదా అన్నాడు దాదాపు పదిహేనేళ్ళ క్రితం. ఇలా తెలిసో తెలియకో ఆడ పిల్లల పట్ల, ముఖ్యంగా సైంసు, ఇంజనీరింగ్ రంగాలలో ఉన్న ఆడపిల్లల పట్ల పనికిమాలిన వివక్ష చూపుతున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక నేనెప్పుడూ వివక్ష ఎదుర్కున్నట్లు అనిపించకపోయినా, చుట్టుపక్కల బీసీల నాటి భావజాలం గల మేధావులు కోకొల్లలు అని చెప్పగలను. ఇట్లా ఉండే స్త్రీలు లేరా? అనొచ్చు – ఉండొచ్చేమో గానీ, చాలా చాలా తక్కువుంటారు. ఇలా కాకుండా, తమకి కావాల్సిన వాటి గురించి బాగా అసర్టివ్ గా ఉండే స్త్రీలని స్త్రీల లెవెల్ కి అదే harassment తో సమానం అనుకుని వాళ్ళకి ఇలాంటి మగవారితో పోల్చడం మట్టుకు మహా పాపం. అలా మనసులో పోల్చిన వాళ్ళు నీళ్ళలో కాదు, బాగా మరుగుతున్న నీళ్ళలోకి దూకండి.
అయ్యప్ప గుళ్ళోకి అమ్మాయిలని పంపడంకంటే ఇది ముఖ్యమైన విషయమని నా అభిప్రాయం. అందువల్ల దీని గురించి నా గోడు ఇలా బహిరంగంగా వెళ్ళబోసుకుంటున్నాను. ఏమైనా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకి ఒకే ఏడాదిలో నోబెల్ రావడం నా జీవిత కాలం జరిగిన గుర్తులేదు, జరుగుతుందన్న ఆశా కలుగలేదు. అందుకని ఏమిటో పండుగలా ఉంది మనసులో! ఈ గోడు వెళ్ళబోసుకోవడం పండక్కి దిష్టి చుక్క లెండి.