నేను జైపాల్ సింగ్ ముండా అన్న ఆయన జీవిత చరిత్ర ఒకటి చదివాను. నిన్న పూర్తయింది పుస్తకం. చివరి అధ్యాయంలో 1953 లో ఆయన భారత దేశపు పార్లమెంటు సభ్యుల మధ్య నిర్వహించిన ప్రెసిడెంట్స్ 11 వర్సస్ వైస్ ప్రెసిడెంట్స్ 11 క్రికెట్ మ్యాచ్ గురించి వివరంగా రాశారు. ఈ పోస్టు ఆ మ్యాచ్ విశేషాల గురించి. మ్యాచ్ గురించిన చిన్న విడియో బిట్ ఇక్కడ చూడవచ్చు.
జైపాల్ కి పార్లమెంటు సభ్యుల మధ్య క్రికెట్ మ్యాచ్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అయితే ఇదేమంత వింత విషయం కాదు. అప్పటి సభ్యులలో దుర్గాపూర్ మహారాజా, సర్దార్ సుర్జిత్ సింగ్ మజితియా వంటి గతంలో క్రికెట్ ఆడిన వారు ఉన్నారు. పార్లమెంటు సభ్యులలో క్రీడాసక్తి కూడా తక్కువేం కాదు. పార్లమెంట్ స్పోర్ట్స్ క్లబ్ సాక్షాత్ ప్రధాని నెహ్రూ నే చైర్మన్ గా, ప్రెసిడేంటు బాబూ రాజెంద్ర ప్రసాద్ పాట్రన్ గా, జైపాల్ సింగ్ మేనేజర్ గా మొదలైంది. రాజకుమారి అమ్రిత్ కౌర్ కూడా దీని కమిటీలో సభ్యురాలు. జైపాల్ ఈ మ్యాచ్ కోసం ఎంపీల సొంత ఖర్చులతో బ్లేజర్లు, క్యాపులు కూడా సిద్ధం చేయించి, ప్రెసిడెంట్స్ ఎలెవెన్, వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవెన్ అని రెండు జట్ల పేర్లు నిర్ణయించాడు (డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అప్పటి ఉపరాష్ట్రపతి).
మొదటే కొన్ని ఇబ్బందులొచ్చాయి. కాకా గాడ్గిల్ తను ధోతీలోనే ఆడతా అన్నాడు. కమ్యూనిస్టు నాయకుడు గోపాలన్ బూట్లు ఎప్పుడు వేసుకోలేదు, వేసుకోనన్నాడు. రాజకుమారి, బేగం ఐజాజ్ రసూల్ -ఇద్దరూ మగవారేనా, మమ్మల్నీ జట్లలో చేర్చమన్నారు. నెహ్రూ అభిమానుల గుంపొకటి ఆయన ఆడ్డానికి వీల్లేదనింది. కానీ నెహ్రూ ఆడతానన్నాడు. చివరికి ధోతి కుదరదు అని, గోపాలన్ కి బాటా షూ కొనిచ్చి, నెహ్రూ ని ఆడనిచ్చి, మహిళా సభ్యులిద్దరికీ 22 మంది మగ పార్లమెంటేరియన్ లు దొరక్కపోతే మిమ్మల్ని చేరుస్తా, కావాలంటే అంపైరింగ్ చేయండని చెప్పి, మ్యాచ్ సన్నాహాలు మొదలుపెట్టారు.
మామూలు జనం కోసం ఒక్కరూపాయి వి పాతికవేల టికెట్లు అమ్మారు. పెవిలియన్ కి దగ్గరగా ఐదు రూపాయల టికెట్ పెట్టారు. పది రూపాయల టికెట్టు పెట్టారు. ఒక వరుసకి వెయ్యి రూపాయల టికెట్ పెట్టారు. అన్నీ అమ్ముడుపోయాయి. మహారాజా లు అందరూ ప్రధాని పక్కనే కూర్చోడానికి ఉబలాటపడ్డారు. టికెట్లు అన్నింటి మీదా జైపాల్ సంతకం ఉంది. టికెట్ కొనని ఎవరికీ లోనికి అనుమతి ఉండదన్న మాట! ప్రెసిడెంటు బాబు కొన్ని పది రూపాయల టికెట్లు కొన్నారు. ఇది చారిటీ మ్యాచ్ కనుక ప్లేయర్లు కూడా వాళ్ళకోసం వాళ్ళు టికెట్లు కొనుక్కున్నారు.
రాధాక్రిష్ణన్ కూడా క్రికెట్ క్యాపుతో గ్రౌండులోకి వచ్చాడు. నెహ్రూ టాస్ గెలిచాడు. బ్యాటింగ్ కి దిగిన మజితియా, ఎం.కె. క్రిష్ణ వెళ్ళగానే బౌలింగ్ ని చితకబాదారు. చివర్లో నెహ్రూ బ్యాటింగ్ కి దిగగానే షా నవాజ్ మొదటి బంతి వేశాడు. రెండో బంతికి నెహ్రూ రెండు పరుగులు తీశాడు. మూడో బంతికి నెహ్రూ రన్ కోసం ప్రయత్నించాడు కానీ అవతల వైపు ఉన్న బ్యాట్స్మన్ గోపాలన్ కదల్లేదు (అయనకి జీవితంలో ఇదే మొదటి క్రికెట్ మ్యాచ్). రనవుట్ చేయడానికి బాల్ ని వికెట్ కీపర్ వైపుకి విసిరేస్తే అతను నెహ్రూని అవుట్ చేయలేక బాల్ ని బౌండరీ వైపుకి విసిరేశాడు. విసుగేసి ఆ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడట జైపాల్.
దుంగార్పూర్ మహరాజా అవతలి జట్టుకి కెప్టెన్. మహరాజా అజిత్ సింగ్ బౌలర్. మొదటి బంతే జైపాల్ సింగ్ క్యాచ్ మిస్ చేశాడు. తరువాత మూడో బ్యాట్స్మన్ గా వచ్చిన కేశవ్ మాలవ్యా ని నెహ్రూ తన క్యాచ్ తో అవుట్ చేశాడు. ఆ క్యాచ్ గురించి ఆయన నెలల తరబడి గొప్పగా తలుచుకునేవాడు.
బేగం ఐజాజ్ రసూల్, రాజకుమారి అమృత్ కౌర్, రేణు చక్రవర్తి ఆడడానికి ముందుకొచ్చారు కానీ జైపాల్ వద్దన్నాడు.
ఆకాశవాణి వారు ఈ మ్యాచ్ ని ఆడియో ప్రసారం చేశారు. స్పీకర్ అనంతశయనం అయ్యంగార్, విజయనగరం రాజకుమారుడు, నెహ్రూ, అంతా మాట్లాడారు. హరీంద్రనాథ్ చటోపాధ్యాయ తన హాస్య కవితలతో అలరించాడు. అంపైర్లు గా జనరల్ రాజేంద్ర సింగ్, బీసీసీఐ స్థాపకుడైన అంతోనీ డె మెల్లో ఉన్నారు. హోం మినిస్టర్ డాక్టర్ కట్జు టికెట్ లేకుండా లోపలికి రాబోతే సెక్యూరిటీ వాళ్ళొచ్చి జైపాల్ కి చెబితే, ఈయన ఆయన చేత టికెట్టు కొనిపించాడు.
ఇదంతా అయ్యాక ప్రధాని అందరు సభ్యులతో కలిసి లంచ్ చేసాడు. అందరూ ఆయన క్యాచ్ గురించి మాట్లాడుకున్నారు. ఇంకేం జరిగినా జరగకపోయినా ఈ మ్యాచ్, ఆ భోజనం అంతా కలిసి అన్ని పార్టీల సభ్యుల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని కలుగజేశాయని జైపాల్ రాసుకున్నాడు.
ఇక చివరగా, జైపాల్ సింగ్ గురించి:
ఈయన 1928లో భారతదేశానికి మొట్టమొదటి ఒలింపిక్ స్వర్ణం గెలిచిన హాకీ జట్టు కెప్టెన్. తరువాత కాలంలో “ఆదివాసీ మహాసభ” ని స్థాపించి ఆదివాసీ ల హక్కుల కోసం, జార్ఖండ్ రాష్ట్రావతరణం కోసం జీవితాంతం కృషి చేశారు. చాలా కాలం పాటు పార్లమెంటు, బీహారు రాష్ట్ర శాసనసభ ల మధ్య రాజకీయంగా కూడా చురుగ్గా ఉన్నారు. ఇది ముండా తన ఆత్మకథ “Lo Bir Sendra” లో రాసాడట. ఆ పుస్తకం ఇపుడు దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ, అందులోంచి తీసుకుని ఈ రచయిత ఈ జీవితచరిత్రలో పెట్టాడు ఈ ఉదంతాన్ని.
పుస్తకం వివరాలు:
The life and times of Jaipal Singh Munda
Santosh Kiro
Prabhat Prakasan, 2020
Available on Amazon as Kindle ebook and in print.