ఫిడేలు రాగాల డజను

“ఫిడేలు రాగాల డజన్” అన్నది “పఠాభి” గా పేరొందిన తిక్కవరపు పఠాభిరామరెడ్డి రచించిన పన్నెండు వచన కవితల సంపుటం. 1939 లో మొదటిసారి వెలువడింది. ఈరోజు పొద్దున్న ఏవో ఇంట్లో ఉన్న పాత పుస్తకాలు చూస్తూ ఉంటే కనబడ్డది. ఈమధ్య కాలంలోనే కొన్నాళ్ళ క్రితం ఆయన మరణించినప్పుడు పేపర్లో ఈ పుస్తకం గురించి విన్నాను కనుక, సహజంగానే ఈ పుస్తకం కనబడగానే తీసాను. చిన్నది కనుక తొందరగానే అయిపోయింది. ఈయన గురించిన ఎన్వికీ పేజీ  ఇక్కడ. అందులోనే ఆబిట్యువరీ వ్యాసానికి లంకె ఉంది. అన్నట్లు కన్నడ “సంస్కార” నవలని దర్శకత్వంచేసి సినిమాగా తీసి కన్నడ సినిమాకి మొదటిసారి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు తెచ్చిపెట్టింది ఈయనే.

“భావకవిన్మాత్రము కాన్నే, నే
నహంభావ కవిని”
– “ఆత్మకథ” అన్న మొదటి కవితలోనే చెప్పేశాడు విషయాన్ని.

“నా ఈ వచనపద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరగదంతాను
చిన్నయసూరి వ్యాకరణాన్ని
చాల దండిస్తాను”
– అదే కవితలో అన్నాడు. అలా అనడం లో ఆయన ఉద్దేశ్యమేమిటో గానీ, నేను మాత్రం గమనించింది ఒకటి – పదాలు రాసే విధానమే కొత్తగా ఉంది ఇందులో. ఉదాహరణకి – ఇన్‍గ్‍లీష్దానిని, మయ్డియరాగ్రా, నన్‍ను న్జేపట్‍ట వద్‍దని – ఇలా రాయడం – అఫ్కోర్స్, అది అంతర్లీనంగా చంధోబద్ధంగా రాయడం కోసం పదాలను విడగొట్టే విధానం మీద సెటైర్ కూడా కావొచ్చు. చెప్పలేను. మరో చోట – “వసంతం” కవిత లో –

“నవ్వొస్తున్నది నాకీ పండితుడు
అమరమ్ములోని వనౌషధి వర్గాన్నంతా
– ఒక వృక్షాన్ని కూడా స్వయంగా చూచిన పాపాన పోడు
గుప్పించి విడిచినందులకు”
– అని మళ్ళీ సెటైర్! వసంతాన్ని “తాలాశ్వత్థ ఇంతాల నారికేళన్యగ్రోధ జంబీర పున్నాగ పలాశరసాల సాలాది వృక్షాలు చిగిర్చినా…” అని వర్ణించిన పండితుడిపై.

“గుప్పుగుప్పుమని ధూమం విడుస్తున్నది రయిల్,
మరోపనిలేక మహోత్సాహంతో స్కాండల్సు
మాట్లాడే మద్రాసు పబ్లిక్ లాగా;”
– ఇక్కడ కూడా వ్యంగ్యం మళ్ళీ. అలాగని మొత్తానికి ఇది సెటైర్లతో నిండింది కాదు. కొన్ని చోట్ల పోలికలు చాలా బాగున్నాయి, కొన్ని చోట్ల నవ్వొచ్చింది…. మళ్ళీ మళ్ళీ చదివాను ఆ లైన్లను. వాటిలో కొన్ని-

“ప్రాచీదిశ సూర్యచక్రం రక్తవర్ణంతో
కన్బట్టింది; ప్రభాత రేజరు
నిసినల్లని చీకట్ల గడ్డంబును షేవ్
జేయన్ పడిన కత్తిగాటట్టుల..”

“మహానగరము మీద మబ్బు గుమి
గర్జిస్తున్నది :-
దేవుని ఏరోప్లేనుల్ భువికి దిగిచున్నటుల…”

“మిలియను జనములు మిణుగురుబువ్వుల
కొరుకుచున్నటులున్నది మేఘధ్వని…”

“పాడుబడినటువంటి
బస్సుల లాగా బడబడయనుచున్నవి నల్లమబ్బుల గుంపు
దడదడ పడుతున్నది వాన..”

చంద్రుడంటే ఈ కవికి మహా చిరాకల్లే ఉంది. “జాబిల్లి” కవిత ఆద్యంతమూ ఓ పక్క చంద్రుడిపై జాలి పడ్డమూ, ఓ పక్క వెక్కిరించడమూ ఇలానే సాగింది. “కామాక్షి కోక” కవితలో కూడా –
“సూర్యుని నుండి కాంతిం దించేసుకునే
ఒరిజినాలిటీ లేని ఉత్త డన్సీ శశి”
– అని అనిపిస్తాడు.

మొత్తానికి ఈ పుస్తకం చాలా ఎంటర్‍టైనింగ్ పుస్తకం అని చెప్పాలి. నేను చదివింది – 1973 లో Progressive Union, Vardhamana Samajam, Nellore వారు వేసిన Reprinted with Critical remarks ఎడిషన్. నేను మొదట పుస్తకం చదివి వ్యాఖ్యానాల వద్దకి వచ్చాను – వాటి ప్రభావం పడకూడదని చదివేటప్పుడు. ఈ విమర్శలు కూడ ఆసక్తికరం. దాని పై రెండో భాగం టపాలో రాస్తాను. ఒక్క ముక్కలో  మీకు బోరు కొట్టినప్పుడు ఓ పేజీ తిప్పి చదువుకోడానికి అనువుగా ఉన్న పుస్తకం 🙂

Published in: on December 16, 2007 at 8:04 am  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/12/16/fidel-ragala-dozen-1/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

  1. పఠాబి (బి కి ఒత్తులేదనుకుంటా) తన పేరుని రాసుకునే విధం నించీ ఓలుమొత్తంగా అప్పటికి ప్రబలిఉన్న తెలుగు కవిత్వం మీద దండెత్తాడు. ఈమాట లో 2001 ప్రాంతంలో ఆచార్య వెల్చేరు రాసిన ఒక వ్యాసం ఉంది. కామాక్షి కోక నా ఫేవరెట్ పద్యం!

  2. @కొ.పా. గారు: భి కి ఒత్తు ఉంది అండి… ఇప్పుడే పుస్తకం లో చూసాను.

  3. “స్వతైరుకు రెడి,రెడి
    సటైరుకు ఫెడి,ఫెడి..”
    మాచిరాజు దేవిప్రసాద్ పేరడిలూ కూడా చాలా బాగుంటాయి. ప్రస్తుతం అలభ్యం అన్నారు.వారికి రావాలిసిన గుర్తింపు ఎందుకనో రాలేదు. సాహిత్యభిమానులకు, పేరడి ప్రేమికులకు ఆయన పరిచయమే! కాని నేడు అంత మంచి పేరడి వ్రాసేవారెవరున్నారు? ఏవైన పేర్లు చెప్పగలరా?

  4. మాచిరాజు దేవీప్రసాద్ పేరడీలను కూడా బూదరాజు రాధాకృష్ణ గారు ప్రచురించినట్లు చదివాను. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో రాసే మంగు రాజగోపాల్ కూడా పేరడీ బాగానే రాస్తున్నారు.

  5. 1]సమీక్ష చక్కగా ఉంది.
    2]’పన్నులలో సంపన్నుడు’ ఫిడేలు రాగాల “పఠాభి” puns కొరకు చూడండి:
    http://wowmusings.blogspot.com/2006/05/blog-post.html

    3]శ్రీ రమణ పేరడిలూ కూడా చాలా బాగుంటాయి.

  6. […] ఉండింది. అలాంటివి చూస్తూంటేనే పఠాభి గుర్తొస్తాడు నాకు. చంధస్సుల వల్లో […]


Leave a comment