“కవిసమ్రాట్” సినిమా

(ఇది నేను ఫేస్బుక్లో రాసిన పోస్టు. సాధారణంగా అక్కడ రాసినవి కొన్ని నెలల తరువాత డిలీట్ చేస్తూ ఉంటాను. కానీ ఇది ముఖ్యమైన సినిమా అనిపించి ఇలా ఇక్కడ సేవ్ చేస్తున్నా పోస్టుని).

ఎల్బీశ్రీరాం కవిసమ్రాట్ సినిమా చూశాము.

నా ఉద్దేశ్యంలో ట్రైలర్ వరస్ట్ గా ఉంది. అది చూసి సినిమా చూడబుద్ధేయలేదు నాకు. కానీ ఒక తెలుగు రైటర్ గురించి సినిమా తీసారంటే చూడొద్దా అని ఆ తెలుగు రైటర్ రచనలు ఏవీ చదవని మా ఇంటాయన పోరు పెట్టడంతో చూశాను ఆహా టీవీ సబ్స్క్రిప్షన్ తీసుకుని. విశ్వనాథ రచనలు ఎంతో కొంత గత పదిహేనేళ్ళలో చదివిన నాకూ, ఆయనకి జ్ఞానపీఠం వచ్చిందన్న విషయం సినిమాలో చూసి తెలుసుకున్న శ్రీరాం కూ..ఇద్దరికీ సినిమా బాగుందనిపించింది. ఈ శ్రీరాం గారికి మరి విశ్వనాథ రచనల గురించి కుతూహలం కూడా కలిగింది కనుక ఆ శ్రీరాం గారి ప్రయత్నం ఫలించినట్లే.

ఎల్బీ కొంచెం పెద్దవాడైపోయాడు… అందువల్ల కథలో, టైం లైన్ లో బాగా లిబర్టీలు తీసుకున్నారు. ఉదాహరణకి: వేయిపడగలు రాసేవేళకి విశ్వనాథ చిన్నాయనే… ఏ నలభై ఏళ్ళో‌ ఉండి ఉంటాయి. కానీ కథలో మాత్రం డెబ్భై ఏళ్ళాయనలా ఉంటాడు. అలాగే, ఆ పద్మనాభం అనే ఆయన పాత్ర అనవసరం. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. మధ్యలో ఒకటి రెండు చోట్ల ఈ విశ్వనాథాష్టకం శ్లోకాలలోని వాక్యాలు వాడినట్లు ఉన్నారు..నాకస్సలు నచ్చలేదు, కానీ భక్తిలో ఆయన్ని దైవాంశసంభూతుడిగా, ఇంకా ముందుకుపోయి దైవంగానే భావించిన వాళ్ళలో ఎల్బీ మొదటివాడేం కాడు కనుకా, మన సినిమాలలో హీరో ఎలివేషన్ కి దేవుడి పాటలూ, స్తుతులూ అవీ వాడుకోడం కొత్తేం కాదు కనుకా, ఈయన్నే ప్రత్యేకించి అనలేం.

చివర్లో విశ్వనాథ రచనలన్నీ తిరిగి వేసినపుడు పావనిశాస్త్రి గారు వాటి ఒరిజినల్ ప్రచురణ గురించి రాసినవి స్లైడ్స్ లాగ చాలాసేపు వేశారు. అలాగే విశ్వనాథవి ఫొటోలు కూడా. బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్నా కూడా నాకు నచ్చింది. గూస్ బంప్స్ భావన వచ్చింది చివరికొచ్చేసరికి. బాలకృష్ణ చేసిన ఇంటర్వ్యూ లాంటి దానిలో ఎల్బీ అన్నట్లు, ఇది చూసి ఎంతో కొంత కుతూహలం కలుగవచ్చు కొత్తతరానికి ఈయనెవరు అని (చూస్తే!). అంతవరకూ ఇది ఒక విజయవంతమైన ప్రయోగం అనే చెప్పాలి. టీ ఎన్ ఆర్ ని సినిమాలో చూసాక ఈ సినిమా మరి చాలా రోజుల నుంచి తీసినట్లు ఉన్నారు అనిపించింది.

ఇంతకీ ఈయన రచనలు చదవాలంటే మరి ఆ భాషా అదీ అందరికీ పట్టుబడకపోవచ్చు. అలాగే అందరికీ సెట్టు సెట్టు కొనేసి చదివే ఆసక్తి లేకపోవచ్చు. అనువాదాలంటే ఏవో కొన్ని వచ్చాయని తెలుసు. నేను చదివింది ఒక్కటే: హాహాహూహూ నవలిక కి వెల్చేరు నారాయణరావు అనువాదం ఈ జర్నల్ లో వచ్చింది. ఎవరికైనా పీడీఎఫ్ కావాలంటే నాకు మెసేజి పెట్టండి.

వేయిపడగలు ఆంగ్లానువాదంలో వచ్చింది అని తెలుసు. కాపీలు ఉన్నాయో లేదో కనుక్కోవాలి. అసలు నా ఉద్దేశ్యంలో చిన్న కథలు చదవడం బెస్టు అసలేం చదవని వాళ్ళకి. కానీ దాని ఆంగ్లానువాదం ఒకటి చూశాను…మొదటి రెండు పేజీలకే ఏం బాలేదు, నేను రికమెండ్ చేయలేను అనిపించింది. అందువల్ల ఆ వివరాలు ఇవ్వను.

మొత్తానికి దురభిమానుల పాల బడి ఈయన ని వాళ్ళ లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరూ చదవకుండా చేసేస్తారేమో అనిపించింది నాకు పోయినేడాది కిరణ్ ప్రభ గారి పాతిక ఎపిసోడ్ల సిరీస్ వినేదాక. ఇప్పుడు ఈ సినిమా కూడా వచ్చింది కనుక, నిజంగా విశ్వనాథ సాహిత్యం నిలబడాలి అనుకునే వాళ్లు ఉన్నారు మామూలు మనుషుల్లో అనిపించింది నాకు.

చివరగా ఓ మాట: విశ్వనాథ గురించి నీకేం తెలుసు? నీకు ఆయన భావజాలం నచ్చకుండా ఆయన రచనలు ఎలా ఇష్టపడతావు? ఇట్లాంటి ఫేక్ మేధావితనం చూపిస్తూ ఏమన్నా అనాలనుకుంటే ఇక్కడే అనండి. ఒరిజినాలిటీ లేకుండా ఇంకేం‌ టాపిక్స్ లేనట్లు దీన్ని ఇంకెక్కడో రిఫర్ చేసుకుని పోస్ట్ పెట్టి చీప్ కాలక్షేపం చేస్కోకండి. దానికంటే పొయ్యి ఆ 80 నిముషాల సినిమా చూసి ఆ పెద్దాయన గురించి ఓ నాలుగు ముక్కలు తెల్సుకోండి.

Published in: on November 13, 2022 at 5:17 am  Leave a Comment  

శ్రీనివాస కళ్యాణం అను ఇటీవలి చిత్రరాజం

శ్రీనివాస కళ్యాణం అని ఒక సినిమా. పేరు చూసి, ట్రైలర్ చూసి అందులో హీరో (నితిన్) ని చూడగానే గుండెళ్ళో రైళ్ళు పరిగెత్తాయి. సినిమా అంతా ఏయొక్క పుణ్యకార్యం అతగాడితో సహా ఇప్పుడు చాలా మందికి పలకనలవి కాని పదమో, ఆయొక్క పుణ్యకార్యం గురించి. కానీ, ఓ సగటు తెలుగు సినీ అభిమానిగా తప్పదు కదా… చూశాను.

మొదటి పది నిముషాలు ఓ పెళ్ళి దృశ్యం. పెళ్ళంటే‌ పెద్ద పండగ, పెళ్ళైతే ఇంటికి ఓ కొత్త తరం వస్తుంది, పెళ్ళి ఇది, పెళ్ళి అది. అని ఊదరగొట్టేశారు (ఇక్కడ బ్రహ్మోత్సవం గుర్తు వచ్చింది). కొంచముంటే సడెన్ గా స్క్రీను మీద ప్రశ్నలు ప్రత్యక్షమై, ఇవి పాసైతేనే మిగితా సినిమా చూడ్డానికి అర్హులంటారేమో అని ఒక పక్క హడలి చచ్చి, ఓ పక్క అపుడు ఎస్కేప్ అయిపోవచ్చులే అనుకుంటూ‌ ఆశగా బతికాను. అలాంటిదేం జరగలేదు. సీను ఇంకో ఊరికి మారింది. ఈ పెళ్ళి చిన్నప్పుడు చూసిన నితిన్ బాబు పెద్దయ్యాక వేరే ఊర్లో ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ టైపులో (ఇక్కడ నాకు రవితేజ “టచ్ చేసి చూడు” గుర్తువచ్చింది) అందరికీ ఉపదేశాలు ఇస్తూ, మధ్య మధ్య ఉద్యోగం చేస్తూ, ఓ బాగు అడ్డంగా వేసుకుని సైకిల్ తొక్కుకుంటూ ఒక పాట కూడా పాడాడు – అవతలి వాళ్ళ కోణం అర్థం చేసుకోవాలని (ఇక్కడ శ్రీమంతుడు గుర్తు వచ్చింది). మామూలుగానే హీరో హీరోయిన్ కలిసారు, ప్రేమించుకున్నారు. కట్ చేస్తే మళ్ళీ పల్లెటూరు – ఓ మరదలు, ఒక పెద్ద కుటుంబం, వాళ్ళ తాలూక అభిమానాలు, ఆప్యాయతలు (ఇక్కడా సీ.వా.సి.చెట్టు, శతమానం భవతి వంటివి గుర్తువచ్చాయ్) వగైరా. అందరూ మంచోళ్ళే. ఇవతలకి కట్ చేస్తే, ఒకాయనుంటాడు – హీరోయిన్ నాన్న. పెద్ద బిజీ బిజినెస్ మాన్. ఇంక బాగా సక్సెస్ఫుల్ ఫెలో, రిచ్ ఫెలో అంటే వాడు చెడ్డోడే అయి ఉండాలి. తప్పదు. అదే మన తెలుగు సినిమా ఆత్మ అంటే. తక్కిన సినిమా అంతా
అ) హీరో ఆయనకి పలకడం చేతకాకపోయినా చెప్పేసే గొప్ప గొప్ప కొటేషన్ లతో
ఆ) హీరో కుటుంబం షుగర్ పేషంట్లు కూడా సిగ్గుపడేంత తియ్యటి అభిమానాలతో
ఈ చెడ్డాయనని మంచాయనగా మార్చేయడం. అది షరా మామూలు. గత ౨౦౨౦౨౦౦౦౧ సినిమాల్లో చూసినదే.

ఇకపోతే, సంప్రదాయాలు ఆద్యంత రహితాలు, వాటిల్లో మార్పు రాదు. నువ్వు మారొచ్చు, నీ లైఫ్ స్టైల్ మారొచ్చు, నువ్వు రకరకాల సుఖాలకి అలవాటు పడొచ్చు, రకరకాల కష్టాలు పడొచ్చు. కానీ, పెళ్ళిళ్ళలో చేసే పనులు మాత్రం అజరామరంగా అలాగే, మార్పుల్లేకుండా జరుగుతూ ఉండాలి. ఎన్ని మారినా అవి మారకూడదు. కానీ మార్పు మాత్రం మానవ సహజం. సంప్రదాయాలు కాలానుగుణంగా‌ మార్చకూడదు. అవతలి వాళ్ళకి ఎట్లున్నా డామినెంట్ కుటుంబం (అంటే పెళ్ళిళ్ళలో మగపెళ్ళివారు) వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చేసి తీరాలి. అదే సంప్రదాయం. సంప్రదాయమంటే అజరామరం. మీకు అర్థమౌతోందా నేను చెప్పేది?‌ (బిగ్బాస్ చూసినవాళ్ళు ఇక్కడ గీతామాధురి వాయిస్ మార్ఫ్ చేసుకొండి). రిజిస్టర్ పెళ్ళిళ్ళు చేసుకోడాన్ని చూపలేదు కానీ, డెస్టినేషన్ పెళ్ళిళ్ళని బాగా వెటకరించారు. షరామామూలుగా అందరూ మహా రిచ్చి. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అందరూ‌ అభిమానాలు ఆప్యాయతలతో పడి చచ్చిపోతూంటారు. అందరికీ ఊర్నిండా స్నేహితులు, శేయోభిలాషులుంటారు. అయితే, బ్రహ్మోత్సవంలో రావు రమేశ్ లాగ ఇందులో కూడా ఒకళ్ళు ఉండాల్సింది. మిస్సయ్యారు. మొత్తానికి తిన్నగా తెలుగు మాట్లాడ్డం‌, తెలుగు భోజన వర్ణన – ఈరెంటిని మాత్రం వదిలేస్తే తెలుగు లోగిళ్ళు, తెలుగు సంప్రదాయాలు, తెలుగు తనం, తెలుగు అభిమానాలు, తెలుగు ఆప్యాయతలు, తెలుగు తిక్కా, తెలుగు పైత్యం – అన్నీ సమపాళ్ళలో కలిపి ఎదుట నిలబెట్టిన సినిమా.

సినిమా నుండి ఇంటికి తీస్కెళ్ళాల్సిన ముఖ్యమైన పాయింటేమిటంటే – ఇక్కడ ఆధునిక ఇరవై ఒకటి ఆ పైన శతాబ్దాల తెలుగు భాషాభివృద్ధికి తొలి అడుగులు పడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నాలుక మందం పోను పోనూ ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి కనుక ఆయొక్క “అందరూ తప్పక చేసుకోవాల్సిన పుణ్యకార్యానికి” ళ లేని పదం ఒక్కటి కనిపెట్టాలి. వీళ్ళు దాన్ని గురించి చెప్పే కబుర్లని బట్టి నాకు తోచిన ఒక పదం – ఇహిప్పోకరసియా. మీకు తోచినవి మీరు కూడా చెప్పండి. పదానికి కావాల్సిన అర్హతలు:
– నాలుక ఎంత మందంగా ఉన్నా పలుకగలిగే పదమై ఉండాలి.
– ణ/ళ వంటి కాంప్లికేటెడ్ అక్షరాలు లేకుండా, చూడ్డానికి అందంగా కనబడే అక్షరాల కూర్పు కావాలి.
– వినగానే మనలో భక్తిభావం కలగాలి. వీథిలో ఏ‌ దంపతులని చూసిన చేతులెత్తి నమస్కరించాలి అనిపించాలి (హిందూ, ఆడా-మగా సంబంధాలు, అవీ కులాంతరం మతాంతరం కానివి, వీలైనంత ధనిక దంపతులైతేనే సుమా!).
– వినగానే కలిగిన సైకిక్ వైబ్రేషన్ వల్ల అర్జెంటుగా ఒక్క ఇహిప్పోకరసియా (దాని సమానార్థకం ఏదో) అన్నా చేసుకోవాలి అనిపించాలి.
– ఆల్రెడీ అయిన వాళ్ళైతే వాళ్ళావిడకి పట్టుచీర నగలు, వాళ్ళాయనకైతే పంచే-ఉత్తరీయం వంటి సంప్రదాయక దుస్తులు ఇవ్వాలనిపించాలి. అత్తమామలకి, తల్లిదండ్రులకి వారి వారి వయసుకి, గౌరవానికి తగిన కానుకలు, పసుపు కుంకుమలు పెట్టి అందించి ఆశీర్వాదాలు తీసుకోవాలి అనిపించాలి.
– ఇహిప్పోకరసియా గురించి అందరికీ అరగంటకి తగ్గకుండా చెప్పేంత సంస్కృత పద్యాలు-అర్థాలు చెప్పాలి అనిపించాలి (దీనికి ముందు మనం నేర్చుకోవాలి. అమీర్పేటలో సైటు రిసర్వ్ చేసుకుని కోచింగ్ సెంటర్ పెట్టాలి ఎవరన్నా మొదట).
(ఇంకా కొన్ని ఉన్నాయి. కానీ అంత స్పష్టంగా రాయడానికి రావట్లేదు. అందువల్ల ఇవి చాలు ఇప్పటికి.)

జలుబా? తలనొప్పా? ముక్కు దిబ్బడా? – చూడండి తెలుగు సినిమా! అన్న సలహా ఒక విధమైన స్వపీడనానందంగా (అదేనండి, masochism) అభివర్ణించవచ్చు. అయితే దానివల్ల ఉన్న మహ గొప్ప ఉపయోగం ఏమిటంటే – మన అసలు నొప్పి ఉన్నట్లుండి చిన్నదిగా కనిపించడం మొదలవుతుంది. నిన్న రాత్రి – ఇవాళ పొద్దున కలిపి నాకు జరిగింది అదే. ఎప్పుడో‌గాని ఇలా సత్వర స్పందనలతో వరుస టపాలు రాసేంత తీరిక దొరకదు. ముందు రెండ్రోజులు సెలవిచ్చిన ఆఫీసు వాళ్ళకి, లాంగ్ వీకెండుకూ ఈ టపా అంకితం. అందరికీ కెనెడియన్ థాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు!

Published in: on October 6, 2018 at 5:04 pm  Comments (12)  

మంటో – నందితా దాస్ చిత్రం‌ (2018)

నిన్న ప్రసిద్ధి చెందిన టొరొంటో ఫిల్ం ఫెస్టివల్ లో నందితా దాస్ దర్శకత్వంలో వచ్చిన “మంటో” సినిమా చూశాము. ఇండో-పాక్ రచయిత సాదత్ హసన్ మంటో జీవితం ఆధారంగా తీసిన చిత్రం ఇది. మంటోగా నవాజుద్ధీన్ సిద్ధిఖీ వేశాడు. కొన్ని అతిథి పాత్రల్లో చిత్ర పరిశ్రమ ప్రముఖులు (రిషి కపూర్, జావెద్ అఖ్తర్, పరేశ్ రావల్, రణవీర్ షోరె, గుర్దాస్ మాన్ వంటి వారు) నటించారు. తక్కిన నటులని బహుశా నేను ఇదే మొదటిసారి చూడ్డం. సినిమా నాకు చాలా నచ్చింది. నిన్ననే ఫేస్బుక్ లో చిన్న పోస్టు కూడా రాశాను. కానీ, సినిమాలో కొన్ని దృశ్యాలు నందితా దాస్ చిత్రీకరించిన తీరు ఇవాళంతా చాలా గుర్తు వచ్చింది. ఇదివరలో చదివిన కథలే ఆవిడ చిత్రీకరణలో కొత్తగా అనిపించాయి. దీన్ని గురించి నేనూ, మా‌ ఇంటాయనా చాలా మాట్లాడుకున్నాము. దానితో ఈ సినిమా గురించి ఓ నాలుగు ముక్కలు ఎక్కువ రాసుకోవాలనిపించి, ఓ నాలుగైదు నెలల తరువాత నా బ్లాగు వైపుకి వచ్చాను.

కథ, నేపథ్యం: మంటో దేశ విభజన కాలంనాటి ప్రముఖ రచయిత. మొదట ముంబయి లో ఉండేవాడు, స్వతంత్ర్యం వచ్చాక పాకిస్తాన్ కి వలస వెళ్ళాడు. ఈ విభజన, సామాన్య జనాల మధ్య దాని ప్రభావం కథాంశంగా అనేక రచనలు చేశాడు. వీటిల్లో కొన్ని రచనల గురించి అవి అసభ్యంగా ఉన్నాయన్న ఆరోపణలతో కోర్టుల చుట్టు తిరిగాడు. కానీ, ఆయన చనిపోయి అరవై ఏళ్ళవుతున్నా కూడా ఇంకా ఆయన రచనలు చదువుతూనే ఉన్నారు, చర్చిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జీవితాన్ని సినిమా తీశారు. కథ విషయానికొస్తే, నలభైలలో మొదలవుతుంది. మంటో అప్పటికి రచయిత గా కొంత పేరు గలవాడే. సినిమాల్లో కూడా పనిచేస్తూంటాడు. దేశ విభజన సమయంలో మొదట ఎక్కడికీ వెళ్ళకూడదు అనుకున్నా, మత కల్లోలాలు, హిందూ స్నేహితులు బాధలో కోపంలో అన్న కొన్ని మాటలతో చలించిపోయి పాకిస్తాన్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళాక మారిన జీవిత పరిస్థుతుల మధ్య తాగుడు ఎక్కువవుతుంది (అయినా గొప్ప రచనలు చేస్తూనే ఉంటాడు). ఏది నా ఊరు? అన్న ప్రశ్న, కుటుంబాన్ని పోషించడం ఎలా? అన్న ఆలోచన, విభజన సమయంలో, ఆ తరువాత మనుషుల ప్రవర్తన గురించి మంటో పడే ఆవేదన, రచయితగా కోర్టులతో పడే ఘర్షణా – ఇవన్నీ సినిమాలో చూపారు.

సినిమాలో బాగా నచ్చిన అంశాలు రెండు:
* మంటో సాహిత్యం సినిమాలో జొప్పించిన తీరు నాకు గొప్పగా అనిపించింది. కథలో భాగంగానే అలా మధ్యలో ఈ కథల దృశ్యాలు వస్తాయి. చూస్తూండగా అర్థమవుతుంది మనకి కథ అని. ఈ కథలు చాలా మటుకు ఇదివరలో నేను ఆంగ్లానువాదంలో చదివాను జర్మనీలో చదువుకునే రోజుల్లో. నందిత తాను ఎంచుకున్న కథలకి బహుశా అరనిముషమూ నిముషమూ స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటుంది. కానీ, కథలు చదివినప్పటికంటే ఎక్కువ ప్రభావవంతంగా అనిపించాయి నాకు. ‘Thanda Ghost‘కథ ని చూపిన తీరు అద్భుతమే. సాధారణంగా మరీ explicit గా ఉండే వర్ణనలు నేను చదవను సాహిత్యంలో. తిప్పేసి తర్వాతి పేజీకి పోతాను. అందునా కథని ఆంగ్లానువాదంలో చదివాను. బహుశా ఆల్రెడీ భావం డైల్యూట్ అయిపోయిందేమో. సినిమాలో ఆ కథ తీసిన పద్ధతికి దివ్య దత్త అద్భుతమైన నటన తోడై, ఈ కథ నన్ను సినిమాలోనే ఎక్కువగా ప్రభావితం చేసిందని చెప్పాలి. ‘ఖోల్ దో’ కథ కూడా గొప్పగా తీశారు.

* మంటో‌ వ్యక్తిగత జీవితాన్ని చాలా బాగా చూపారు. భార్యా-భర్తల మధ్య అనుబంధం, పిల్లల పట్ల మంటో‌ చూపే ప్రేమాభిమానాలు, స్నేహితులతో అనుబంధాలు – అన్నీ సున్నితంగా చూపించారు. ముఖ్యంగా ఇస్మత్ ఛుగ్తాయితో మంటో చర్చలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. ఈ సన్నివేశాలన్నీ అలా సహజంగా అమరిపోయాయి కథలో. ఎక్కడా ఏదో సంచలనం సృష్టించాలనో, షాక్ కలిగించాలనో తీయలేదు. మంటో ని కథకుడిగానే కాక ఒక మనిషిగా చూపారు. ఎంతో పట్టుదలతో పోరాడిన మనిషి, కోర్టుల చుట్టూ తిరుగుతూ కూడా conviction వదలని మనిషి -వీటి మధ్య చిన్న విషయాల్లా అనిపించే వాటి గురించి భయపడ్డం (స్పాయిలర్లు లేకుండా ఇంతకంటే రాయడం కష్టం ఈ విషయం గురించి)- వంటివి హృద్యంగా తీశారు. కోర్టు దృశ్యాలు – తోటి రచయితలు/పాత్రికేయ మిత్రుల స్పందనలు, అవి మంటోపై చూపిన ప్రభావం బాగా చూపించారు. నటీనటులంతా కూడా అతికినట్లు భలే సరిపోయారు. సిద్ధిఖీ సంగతి చెప్పేదేముంది? కామెడీ‌టచ్ ఉన్న పాత్రల మొదలుకుని నెగటివ్ పాత్రల దాకా వే పాత్ర చేస్తే ఆ పాత్రలో అతనే ఉన్నాడనిపిస్తాడు. అసలు ఈ స్క్రిప్ట్ రాసుకోవడం, ఈ పాత్రలకి నటుల్ని ఎంపిక చేయడంలోనే నందితాదాస్ తొలి విజయం సాధించింది.

నందితా దాస్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ‘ఫిరాక్’ నేను చూడలేదు. ఆమె నటించిన సినిమాలు కూడా – అమృత, రాక్ ఫర్డ్ తప్ప చూడలేదు. వీటిల్లో ఆమె ప్రధాన పాత్రధారిణి కాదు. అందువల్ల, అడపాదడపా పత్రికల్లో ఆమె గురించి చదవడం, “ఓహో, ఈవిడ సీరియస్ ఆలోచనలు గల నటి అనమాట” అనుకోవడం తప్ప ఆమె గురించి నాకు ఏ అంచనాలూ, అపోహలూ లేవనే చెప్పాలి. కానీ, సినిమా చూశాక నందితా దాస్ గొప్ప ప్రతిభావంతురాలిగా కనిపిస్తోంది. రెండో సినిమా కే ఇంత గొప్పగా తీసింది – భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు, ప్రేక్షకుల హృదయాలని తాకే సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. సినిమా ఐపోయాక తెర వద్దకు వచ్చి ప్రేక్షకులతో కాసేపు ముచ్చటించింది – అక్కడ ఆవిడ సమాధానాలు కూడా నన్ను చాలా ఆకట్టుకున్నాయి. మంచి సినిమా చూశాను, మంచి చర్చని విన్నానన్న భావనతో వెనక్కి వచ్చాను. మీకు మంటో తెలిసినా తెలియకపోయినా తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇది మన సినిమా. మన వాళ్ళని గురించిన సినిమా. ప్రపంచ స్థాయిలో తీసిన మన సినిమా.

Published in: on September 10, 2018 at 3:05 am  Comments (2)  

Zelig

Zelig అన్నది 1983లో వచ్చిన Woody Allen సినిమా. ఇదివరలో ఓ రెండేళ్ళ క్రితమేమో కొంచెం చూశా జర్మన్లో. కథ చాలా వెరైటీగా ఉందే అనుకున్నా, సబ్టైటిల్స్ కూడా లేకుండా జర్మన్ లో చూడ్డం కష్టమని ఆపేశా. ఈవారమే మళ్ళీ చూడగలిగాను. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి కథ, తీసిన పద్ధతీ. అందువల్ల సినిమా గురించి నాకు అనిపించిన నాలుగు ముక్కలూ రాసుకుందామని ఈ టపా.

కథ డాక్యుమెంటరీ పద్ధతిలో సాగుతుంది. 1920-30లలో జరిగిన Zelig ఉదంతం గురించి 1980ల నాటి నిపుణులు నెమరువేసుకుని విశ్లేషిస్తున్నట్లు చూపిస్తారు. ఈ “నిపుణులు”గా నిజ జీవితంలోని ప్రముఖులు (ఉదా: Susan Sontag, Saul Bellow వంటివారు) అతిథి పాత్రలు పోషించారు. మొత్తానికి Zelig కల్పిత పాత్ర, అతని కథా కల్పితం.  మొత్తానికి సినిమాలో కనబడే విశ్లేషకులూ, నిపుణులూ, అలాగే కథలో క్లిప్పింగ్స్ లో, ఫుటేజిలలో కనబడే ప్రముఖులు అసలు వ్యక్తులే కానీ మొత్తం కథ, సెటప్ మట్టుకు కల్పితం అనమాట.

కథ విషయానికొస్తే, Zelig అన్న మనిషి గురించి 1920-30 లలో రకరకాల కథనాలు వస్తాయి. మొదట Scott Fitzgerald ఒక పార్టీలో అతన్ని గమనించి అతని గురించి చెబుతాడు. విషయం ఏమిటంటే, Zelig పార్టీలోని గొప్పవారి దగ్గర వాళ్ళలో ఒకడిలా, వాళ్ళ యాసలో, వాళ్ళ భావాలకు అనుగుణంగా మాట్లాడుతూ, బాగా చదువుకున్న, డబ్బున్న వ్యక్తిలా ప్రవర్తిస్తే, అక్కడే వంటింట్లో పనివారితో వాళ్ళలా మాట్లాడుతూ వాళ్ళలో ఒకడిలా కనిపిస్తాడు. ఇలాగే ఇంకోళ్ళు ఇతన్ని గ్రీక్ గెటప్ లోనూ, ఇంకోళ్ళు చైనీస్ అతనిలాగానూ, ఇలా రకరకాలుగా చూసినట్లు చెబుతారు. ఎక్కడికక్కడ Zelig తన వేషభాషలు మార్చేసుకుని ఆ చైనీసు, గ్రీకు వాళ్ళలా మారిపోతాడు. దీన్ని గురించి పత్రికల్లో కథనాలు, జనాల కుతూహలం కాక మానసిక నిపుణుల విశ్లేషణలు కూడా మొదలవుతాయి. వీళ్ళలో ఒకరు అతన్ని “ultimate conformist” గా అభివర్ణిస్తారు. మొత్తానికి అతనిది మానసిక వ్యాధి అని, ఇతరుల approval పొందాలన్న బలమైన కోరికవల్ల ఇలా మారిపోతూ ఉంటాడు అని తేలుస్తారు. కొన్నాళ్ళకి ఇతను చేరిన ఆసుపత్రిలో Eugene Fletcher అనే సైకియాట్రిస్టు ఇతన్ని మామూలు మనిషిని చేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో అతనితో ప్రేమలో కూడా పడుతుంది. మొత్తానికి Zelig మామూలు మనిషి అయాడా లేడా? అసలు అతని జీవితం ఎలా గడిచింది అన్నది మిగితా కథ. సినిమా చూడండి. ఓపిక లేకపోతే ఏ వికీ పేజీనో చూడండి 🙂

Zelig గా నటించింది అలెన్. నాకు అతని దర్శకత్వం ఇష్టం (నేను చూసిన కాసినిలో) కానీ నటన మీద ఆట్టే సదభిప్రాయం లేదు కానీ, ఈ సినిమా కథ అతని గురించైనా అతనికంటూ పెద్ద డైలాగులు లేకపోవడం వల్ల పర్వాలేదు. కథ నాకైతే కొత్తగా ఉండింది. ముఖ్యంగా ఇతరుల మెప్పుకోసం ఆరాటపడే పాత్రని ప్రధానపాత్ర చేసి కథ నడపడం బాగా చేశారనిపించింది. “Ultimate conformist” ప్రయోగం కూడా చాలా నచ్చింది. సినిమా చిన్నదనవడం అన్నింటికంటే నచ్చిన అంశం. డాక్యుమెంటరీ తరహాలో తీసినా కూడా, ఎక్కడికక్కడ తరువాత ఏం జరుగుతుంది? అన్న ఉత్కంఠ చివరిదాకా ఉండింది.

ఇక సాంకేతికత మాటకొస్తే – Zelig ఈ సినిమాలో పలుచోట్ల పలు ప్రముఖుల మధ్య దర్శనమిస్తాడు. ఉదా: హిట్లర్ ప్రసంగిస్తూంటే వెనక ఉన్న నాజీల మధ్య ఒకడిగా కనిపిస్తాడోచోట. పోప్ వాటికన్ లో జనాన్ని ఉద్దేశించి బాల్కనీలోంచి చేతులూపుతూంటే అతని పక్కన కనిపిస్తాడోచోట. ఇలా చారిత్రక వ్యక్తుల నిజం ఫుటేజ్ లో అలెన్ కనబడ్డం గురించి వికీలో రాసింది ఇది:
“Allen used newsreel footage and inserted himself and other actors into the footage using bluescreen technology. To provide an authentic look to his scenes, Allen and cinematographer Gordon Willis used a variety of techniques, including locating some of the antique film cameras and lenses used during the eras depicted in the film, and even going so far as to simulate damage, such as crinkles and scratches, on the negatives to make the finished product look more like vintage footage. The virtually seamless blending of old and new footage was achieved almost a decade before digital filmmaking technology made such techniques in films like Forrest Gump (1994) and various television advertisements much easier to accomplish.”
ఆ విధంగా కథాపరంగానే కాదు, సాంకేతికంగా కూడా ఇది కొత్తగా ఉండి ఉండాలి ఆ కాలానికి. ముప్పై ఏళ్ళ తరువాత కూడా నేను అబ్బురంగా చూశాననుకోండి, అది వేరే విషయం.

మొత్తానికి మీకు సినిమాలంటే ఆసక్తి ఉండి ఇంకా చూడకపోతే తప్పక చూడాల్సిన సినిమా!

Published in: on December 18, 2016 at 1:20 am  Comments (1)  

విచారణ (Visaranai) – తమిళ చిత్రం

“విసారణై” అన్న తమిళ సినిమా గురించి పోయినేడాది చివర్లో మొదటిసారి విన్నాను. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏదో అవార్డు వచ్చిందని. తరువాత ఈ ఏడాది రిలీజు అయినపుడు మళ్ళీ విన్నాను. సీరియస్ సినిమాలూ అవీ చూసి తట్టుకోగలిగే మూడ్ ఉన్నప్పుడు చూద్దామని వాయిదా వేస్తూ ఇన్నాళ్ళకి ఇప్పుడు చూశాను. అంతే…సినిమా అయ్యాక కూడా అలా స్క్రీన్ వంక చూస్తూనే ఉన్నాను కాసేపు షాక్ లో. నాకు గొప్పగా అనిపించిన సినిమా కనుక ఏదో నాలుగు ముక్కలు రాసుకుందామని ఇలా వచ్చాను.

సినిమా కథ క్లుప్తంగా: తమిళనాటి నుండి వచ్చి గుంటూరులో ఓ పార్కులో ఉంటూ చిన్నా చితకా పనులు చేసుకుంటున్న నలుగురు యువకులని అనుకోకుండా ఓరోజు ఉదయాన్నే పోలీసులు పట్టుకెళ్ళడంతో కథ మొదలవుతుంది. అక్కడ వాళ్ళని ఏదో చేయని నేరం గురించి ఒప్పించాలి పోలీసులు…ఎందుకంటే ఆ కేసు మూసేయాలని పైన్నుంచి ఒత్తిడి, దొంగలు దొరకలేదు. దొంగలు తమిళులు అన్న క్లూ ఉంది కనుక వీళ్ళని వేసేసారు. భాష రానందువల్ల వీళ్ళూ ఏం అడిగేదీ అర్థం కాక ఏదో చెప్పి ఇరుక్కుపోయారు. పోలీసులు నానా హింసా పెట్టి లాస్టుకి వీళ్ళ చేత నేరం ఒప్పించి కోర్టుకి పట్టుకెళ్తారు. అయితే, కోర్టులో వీళ్ళు జరిగిందిదీ అని చెప్పేసరికి ఓ తమిళ పోలీసాయన సహాయంతో అర్థం చేసుకున్న జడ్జి వీళ్ళని విడిచిపెట్టేస్తాడు. అయితే, ఆంధ్ర పోలీసుల నుంచి అదృష్టవశాత్తూ తప్పించుకున్న వీళ్ళు తమిళనాడు పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఇరుక్కుంటారు. అక్కడ మతలబులు వేరే. చివ్వరికి వాళ్ళు పోలీసుల నుంచి బైటపడ్డారా లేదా? అన్నది మిగితా సగం సినిమా.

సినిమాలో చాలా హింస ఉంది. చాలా వేదన ఉంది. అయితే, చాలా ఇతర సినిమాల్లోలా అదేదో stylized violence కాదు. హీరోయిజం కోసమో, విలన్ కౄరత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకో, బడ్జెట్ ఉంది కదా అని చూపెట్టుకోడానికో ఉన్న హింస కాదు. దీనిలోని హింస కథలో భాగంగా , కథానుగుణంగా ఉన్నది. అసలు సాధారణంగా ఇతర సినిమాల్లో విపరీతం, అనవసరం అనిపించే తరహా హింసాత్మక సన్నివేశాలు ఈ సినిమాలోని పరిస్థితుల మధ్య out of place అనో, అనవసరం అనో అనిపించలేదు. నేపథ్య సంగీతం, ఆ పోలీస్ స్టేషన్, కోర్టు, సెట్ల డిజైన్, పోలీసుల దెబ్బలు, బాధితుల స్పందనలు, ఖైదీల సంభాషణలు – అన్నీ చాలా సహజంగా అనిపించాయి. అలాగని చూసి తట్టుకోగలమా? అంటే జవాబు చెప్పడం కష్టం. సినిమా చూసి తరువాత ప్రశాంతంగా పని చేసుకోవాలంటే కొంచెం గుండె ధైర్యం కావాలి అని నా అభిప్రాయం.

పోలీసు పాత్రలు కొన్ని, వాళ్ళ ఆలోచనావిధానం, నన్ను భయపెట్టేశాయి. పోలీసు పాత్రల్లో సముతిరఖని పాత్ర చిత్రణ గొప్పగా అనిపించింది నాకు. అయితే, అందరికంటే ఆకట్టుకున్నది ఆ నలుగురు తమిళ వర్కర్లలో పాండిగా వేసిన దినేశ్. నిజంగా అతను ఆ అరెస్టయిన మనిషే అనిపించేలా ఉండింది. సినిమాకి వీళ్ళంతా పెద్ద అసెట్. కథ చాలా ఉత్కంఠభరితంగా రాశారు. పొరలుపొరలుగా ఏదో ఒకటి కొత్త ట్విస్టు వస్తూనే ఉంటుంది చివరిదాకా. అందువల్లనే అవార్డు తరహా సినిమానే అయినప్పటికీ ఇతర కమర్షియల్ సినిమాల్లాగే థ్రిల్లర్ లా కూడా అనిపించింది నాకు. ముఖ్యంగా ఆ చివర్లో క్లైమాక్స్ సీన్లు – అసలేం చేస్తారో లాస్టుకి అని టెన్షన్తో చూశాను నేను. క్లైమాక్సు ఏ పోలీస్ స్టేషన్ లోనో, అడవిలోనో, మరే అటువంటి ప్రదేశంలో కాక, మామూలు మనుషులు తిరిగే రెసిడెన్షియల్ ఏరియాలో జరుగుతుంది. సీను అయాక చివ్వర్లో వచ్చే నేపథ్య సంభాషణ కూడా ఇంకా ఏదో కొత్త విషయం తెస్తూనే ఉండింది కథలోకి. బాధ, నిస్సహాయత, అధికారం, మోసం, అమాయకత్వం – ఇలా ఇన్ని విషయాలూ చాంతాడంత డైలాగులు లేకుండానే సినిమాలో వివరంగా చెప్పారు, చూపించారు. మొత్తానికి పోలీసుల సమక్షంలో అమాయక పేద ప్రజల (ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చినవారి) vulnerability ఈ సినిమా డాక్యుమెంటరీ లాగా కాక, సినిమాగానే ఉంటూ ఎత్తి చూపింది. ఆర్టు సినిమా మామూలు నాన్-మేధావి జనం కోసం తీయగలరా? అంటే, తీయగలరు – ఇలాగ – అనిపించింది నాకు.

ఇంతకీ సినిమా వెనుక కథ: ఇది నిజానికి కొయింబత్తూరుకు చెందిన చంద్రకుమార్ అనే ఒక ఆటోడ్రైవర్ రాసిన నవల ఆధారంగా అల్లిన కథ. చంద్రకుమార్ అంతకుముందు చాలా ఏళ్ళ క్రితం గుంటూరు జిల్లాకి ఏదో పనిచేసుకోడానికి వెళ్ళాడట. అప్పుడు ఏదో కారణం తెలియని కేసులో పోలీసులు అతన్ని, అతని స్నేహితులని ఇరికించి వేధించారట. ఆ అనుభవాల ఆధారంగా అతను రాసిన నవల అది. ఆటోడ్రైవర్ తను రాసిన నవలలని ప్రచురించగలగడం, అవి సినిమాగా రావడం – అంతా తెలుసుకుంటూంటే ఆశ్చర్యంగా అనిపించింది. చంద్రకుమార్ గురించి, అతని రచనల గురించి హిందూ పత్రిక వ్యాసం ఇక్కడ.

ఈ సినిమాని తీసిన దర్శకుడు వెట్రిమారన్, పధాన పాత్రలు ధరించిన నటీనటులు (నాకు తెలిసినది సముతిర ఖని ఒక్కడే, కానీ ప్రధాన పాత్రధారులు అందరూ), నిర్మాత ధనుష్ – అందరూ అభినందనీయులు. ఇప్పుడిక ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలన్న దుర్బుద్ధి ఎవ్వరికీ పుట్టకూడదని మనసారా (ఆందోళనతో) కోరుకుంటున్నాను.

సినిమా చూశాక అంతర్జాలంలో ఒకట్రెండు సమీక్షలు చూశాను. భరద్వాజ్ రంగన్ వ్యాసం నాకు నచ్చింది.

Published in: on July 4, 2016 at 1:05 am  Comments (13)  
Tags:

కిల్ బిల్ సినిమాలు

కొన్నేళ్ళ క్రితం కిల్బిల్ కథని సినిమా చూసి వచ్చి మురిసిపోయి ఎవరో చెప్పగా విన్నాను. దెబ్బకి ఇంత హింస మనకి పడదులే అనుకుని సినిమా చూడకూడదని నిర్ణయించుకున్నాను. ఇదే కారణంతో నేను చాలా సినిమాలు చూడలేదు కనుక అదేం పెద్ద విషయం అనిపించలేదు. “కిల్బిల్ చూడలేదా?” అనబోయే వాళ్ళకి నేనూ “ఫలానా సినిమా చూడలేదా?” అనే తరహా ప్రశ్నలు నేనూ వేసి నవ్వగలను – ఎవళ్ళు చూసే సినిమాలు వాళ్ళగ్గొప్ప గానీ, ఇప్పుడు సంగతి అది కాదు. కిల్బిల్ రెండు సినిమాలూ నాకు నచ్చాయి. మొదటిది వేగంగా సాగి, గోళ్ళు కొరుక్కునేంత ఉత్కంఠ కలిగిస్తే, రెండోది కొంచెం నెమ్మదిగా, విభిన్నంగా సాగి, గోళ్ళు కొరుక్కునేంత ఉత్కంఠ కలిగించింది. ఏదో ఎందుకు నచ్చాయో రాసుకుందామనిపించింది. అందువల్ల, ఆర్నెల్ల తరువాత బ్లాగు వైపుకు వచ్చాను. రివ్యూ ఇలా ఉండాలి, సినిమా ఇలాగే చూడాలి అనేవాళ్ళకి: ఈ కింద రాసిందంతా అలా చదవకూడదు. ఊరికే కాలక్షేపానికి చదవాలి. చదవలేకపోతే బలవంతంలేదు. పరీక్షలేం రాయట్లేదు కదా!

రివెంజ్ డ్రామా. స్టైలైజ్డ్ వయొలెన్స్. అందరికి మల్లే నాక్కూడా అదే అనిపించింది మొదట. అయితే, నాకు సినిమా(లు) నచ్చినవి అందుక్కాదు. ఆ విషయంలో మన తెలుగు హీరోల సినిమాలకి, దీనికి నాకాట్టే తేడా కనబడలేదు, కనుక ప్రత్యేకం ఈ సినిమాలు చూడక్కర్లా. అభిమానులు నన్ను క్షమించాలి – నాకు మీకున్నంత అభిరుచి లేదు హింస, దిక్కుమాలిన ఫైట్లు అవీ చూడ్డానికి. మొన్నా ఫుల్ హైదరాబాద్ వెబ్సైటులో ఏదో సినిమాకి రివ్యూ చదువుతూండగా (సరైనోడు సినిమాకి అనుకుంటా) ఏదో రాశారు – విలనో ఎవరో ఒకమ్మాయిని చంపేసి అయినా కూడా ఆవిడ్ని అనుభవించాలి అనుకుంటాడు, దానితో జుగుప్స కలిగింది అని. ఈ కిల్బిల్ మొదటిభాగంలో నాలుగేళ్ళ బట్టి కోమాలో ఉన్న హీరోయిన్ ని మేల్ నర్సు తను రేప్ చేయడం కాకుండా, ఆవిడ్ని గంటకింత అని అద్దెకి ఇస్తూ ఉంటాడు ఇతర మగవారికి! దాన్ని గురించి ఎవ్వరూ ఎక్కడా వాపోయినట్లు నాక్కనబడలేదు. ఇది బోయపాటి వంటి తెలుగు దర్శకుల పట్ల వివక్షే. నాకైతే ఆ సీనుకీ, ఈ తెలుగు సినిమా సీనుకీ ఆట్టే తేడా కూడా కనబడలేదు. అలాగే, ఎన్ని దెబ్బలు, బుల్లెట్లు తిన్నా పైకి లేచే సూపర్ హీరోయిన్…హీరో బదులు. నాకు అంత అభిరుచి లేదు కనుక – ఇదంతా తెలుగులో బాలకృష్ణ సీమ సినిమాల్లో కనబడే సూపర్ సీన్ల లాగానే అనిపించింది. మరైతే ఇది మన సినిమాల్లాగానే ఉంటే దీనికెందుకు కల్ట్ ఫాలోయింగ్? ఏమో నాకు తెలీదు.

సినిమాలలో నన్ను బాగా ఆకట్టుకున్న అంశాలు మట్టుకు చాలా ఉన్నాయి.
అ) ఉమా తుర్మన్. ఆ పాత్ర చేసే స్టంట్లకి ఆమె శరీరభాషా, ఆహార్యం బాగా నప్పాయి. ఆ ఫైట్ సీన్లలో ఆవిడ ప్రదర్శన నోరెళ్ళబట్టి చూసేలా చేసింది. కళ్ళలో కొన్ని దృశ్యాల్లో కనబడే మృదుత్వం, చాలా దృశ్యాల్లో కనబడే తీవ్రత, కాఠిన్యం – అలా మనసులో ఉండిపోయాయి. నిజానికి రెండో పార్టు వెంటనే చూడ్డానికి కారణం ఈవిడే. రెండో పార్టులో ఆమె పాత్ర తాలుకా భావోద్రేకాల్లో వైవిధ్యం ఉంది. నవ్వూ, ఏడుపూ కూడా తరుచుగా కనబడ్డాయి పగతో రగిలిపోవడం కాకుండా. రెండు భాగాల్లోనూ ఆ పాత్రను మలిచిన విధానం చాలా స్పూర్తిని కలిగించేలా ఉంది. స్ఫూర్తంటే ఇక్కడ నేను ఏడు జన్మల వైరాలని తవ్వితీసి hattori hanzo కత్తితో ఆడ పరశురాముడిలా కొన్ని తరాలు నరుక్కొస్తా అని కాదు. ఆమె ప్రతీకారం కోసం పరిస్థితులకి ఎదురొడ్డి ముందుకు సాగడం, భయంకర పరిస్థితుల్లో కూడా ముందుకు సాగడానికి ఏం చేయాలి? అని ఆలోచించి ఆ దిశగా వెళ్ళడం – ఇలాంటివి స్ఫూర్తి కలిగించిన అంశాలు. ఈవిడ కోసం “పల్ప్ ఫిక్షన్” కూడా చూడాలి అనుకుంటున్నాను ప్రస్తుతానికి. నన్ను ఆవిడ ఎంత ఆకట్టుకుందో చెప్పేందుకు మాటలు చాలవు నాకు. ఇలా ఇంకాసేపు రాసుకుంటూ పోవచ్చు కానీ ఈ అంశం ఇక్కడికి ఆపుతాను.

ఆ) నేపథ్య సంగీతం: రెండు సినిమాల్లోనూ అద్భుతంగా ఉంది. ఉమా తుర్మన్ తర్వాత ఈ సినిమాలు నచ్చడానికి రెండో ప్రధాన కారణం నేపథ్య సంగీతం. నన్ను నేను amusical అనుకుంటాను. ముఖ్యంగా Oliver Sacks రాసిన musicophilia చదివాక, సంగీతం జోలికి వెళ్ళకుండా నామానాన నేను ఉండడమే నయమేమో అని కూడా అనుకుంటూ వచ్చా కానీ, ఈ సినిమాల సంగీతం.. రెండ్రోజులుగా తలకాయలో మోటార్ బైకులో గేర్లు మార్చుకుంటూ స్పీడుగా తిరుగుతోంది. నా మట్టుకు నాకు అద్భుతమే.

ఇ) బలమైన స్త్రీ పాత్రలు. సినిమాలో “మంచి” అనబడు పాత్ర ఏదీ లేదు. కనీసం “పాపం మంచి మనిషి” అని అనిపించే పాత్ర కూడా ఒక్కటీ లేదు, హీరోయిన్ ని గురించి మనకి సాఫ్ట్ కార్నర్ ఏర్పడకపోతే. కానీ, స్త్రీ పాత్రలు ఎక్కువగా ఉండి, అంత శక్తివంతంగా ఉండే సినిమాలు మరీ అంత తరుచుగా రావు. ఒక్కో ప్రధాన స్త్రీ పాత్రా చాలా గొప్పగా మలిచారు. వాళ్ళ మధ్య స్టంట్ సీన్లు కూడా గొప్పగా ఉన్నాయి. ఆమధ్యన హేట్ఫుల్ ఎయిట్ (ఇదే దర్శకుడిది) రిలీజ్ అయినప్పుడు క్లైమాక్స్ లో ఆ సినిమాలోని ఏకైక ప్రధాన స్త్రీ పాత్రని ఉరితీసే సన్నివేశం గురించి కొంతమంది గగ్గోలు పెట్టారట misogynistic గా ఉంది అని. మరి అదే దర్శకుడు ఈ సినిమాల్లో ఇంత బలమైన స్త్రీ పాత్రలని సృష్టించాడని ఎవరూ అనలేదేమిటి? అనిపించింది. Equality పద్ధతిలో భాగంగా, అంత భయంకరమైన క్రిమినల్ పురుషుడు అయి ఉంటే సినిమాలో ఏం చేసి ఉండేవారో స్త్రీకి కూడా అదే చేశాడు అని ఫిక్స్ అయ్యా నేను మొత్తానికి, కిల్బిల్ చూశాక.

ఈ) పదునైన డైలాగులు. రెండు భాగాల్లోనూ.

ఉ) నటీనటుల ప్రదర్శన – అందరూ ఆ పాత్రలకి సరిగ్గా సరిపోయారు. తెలుగు సినిమాల పోలిక హింసకి మాత్రమే పరిమితం. ఇలాంటి విషయాల్లో అంతా పోల్చి దర్శకుడిని కించపరచడంలేదని గమనించగలరు. ఇక్కడంతా తెలుగు సినిమాలతో పోల్చడం నక్కకీ నాగలోకానికీ పోలిక తేవడమే. ఒప్పుకుంటాను.

ఇంకా కొంచెం రాయొచ్చు కానీ, ఇక్కడికి ఆపుతాను. మొత్తానికి దర్శకుడు గొప్పాయన. ఆ విషయం ఒప్పుకోవాలి. ఇన్ని చెప్పి ఆయన గురించి చెప్పలేదేం? అనుకుంటారేమో వ్యాసం చదివేవాళ్ళు. అతగాడు తెరవెనుక ఉండి ఇవన్నీ నడిపే మనిషి (నిర్మాతతో కలిసి) కనుక ఇవన్నీ చెబితే అతన్ని తల్చుకున్నట్లే. ఇకపోతే, మూడోభాగం కూడా వస్తే నేను చూడ్డం గ్యారంటీ.

Published in: on April 25, 2016 at 3:57 am  Comments (7)  

Unnal Mudiyum Thambi – నా వల్ల మట్టుకు కాదు బాబూ!

నిన్న అంతర్జాల విహారంలో ఉండగా, ఈ “ఉన్నాల్ ముడియుం తంబీ” అన్న సినిమా గురించి వ్యాసం కనబడ్డది. అప్పుడు తెలిసింది నాకు రుద్రవీణ సినిమాకి ఒక తమిళ రీమేక్ ఉందని. గత రెండు మూడేళ్ళలో నేను చూసిన చాలా తమిళ్ సినిమాలు నాకు నచ్చడం వల్లా, దర్శకుడు బాలచందర్ తమిళుడు కావడం వల్లా – తమిళ సినిమా తెలుగు కంటే ఇంకా బాగుంటుంది కాబోలు అనుకుని మొదలుపెట్టాను.

సినిమా తమిళ టైటిల్ కి అర్థం – “తమ్ముడూ, నువ్వు సాధించగలవు” అని… “నమ్మకు నమ్మకు ఈ రేయిని” పాట ఈ సినిమాలో “ఉన్నాల్ ముడియుం తంబీ తంబీ” అని టైటిల్ సాంగ్. అదొచ్చే వేళకి నేను తంబిని కాకపోయినా “ఎన్నాలె ముడియాదు అన్నా” ((ఈ సినిమాని భరించడం) నా వల్ల కాదు అన్నా!) అన్న స్టేజికి వస్తూ ఉన్నాను… వస్తున్నా, వచ్చేశా అనుకున్నా చివరికొచ్చేసరికి ఇంక. ఎందుకూ అంటే – సినిమా తీసిన పద్ధతి. అసలుకే అనవసర మార్పులు కొన్ని. ఆ హీరో అల్లరి చేష్టలు, వంటింట్లో పాట వగైరా అనవసరం అనిపించింది. పాట బాగుంది కానీ, చాలా అసందర్భంగా అనిపించింది. సరిగా establish చేయని సన్నివేశాలు (రమేశ్ అరవిందు ప్రేమ కథ వంటివి)… అంతా మహా చిరాగ్గా అనిపించింది నాకు తెలుగుతో పోల్చుకుంటే. తెలుగులో చూడకుండా చూసుంటే ఎలాగుండేదో! అన్నింటికంటే దారుణం – “లలిత ప్రియ కమలం” పాట తీసిన విధానం. బాబోయి..ఏమిటది? ఆ మంచులో జారుతూ డాన్సులేంది? ఆ ముద్దు మురిపాలేంది? దానితో పోలిస్తే, ఈ సినిమా మూడ్ కి అనుగుణంగా తెలుగులో పాట ఎంత బాగుందో! తెలుగులో కూడా మంచులో తీసిన దృశ్యాలున్నాయి కానీ – అవెలా తీశారు? ఇవెలా తీశారు!!

సినిమా మొత్తంలో కమల హాసన్ అక్కడక్కడా బాగున్నట్లు అనిపించగా, ప్రసాద్ బాబు, మనోరమ మట్టుకు నచ్చారు నాకు. జెమినీ గణేశన్ తెలుగులో చేసినంత గొప్పగా అనిపించలేదు నాకు – మేకప్ తో సహా. అలాగే, హీరోయిన్ నాన్నని కలవడానికి వెళ్ళిన సీను (మన తెలుగులో రండి రండి రండి పాట ఉన్న చోట) కూడా నచ్చింది నాకు, తెలుగు అంత క్రియేటివ్ గా లేకపోయినా. సీత శోభనని ఇమిటేట్ చేసినట్లు అనిపించింది కొన్ని చోట్ల.

రుద్రవీణ సినిమా నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటి. ఇపుడు పాప ప్రక్షాళనగా ఆ సినిమా మూడు గంటలైనా సరే కూర్చుని చూడాలి ఇక! దాదాపుగా ఒకే వయసు నుండి తమిళ-తెలుగు సినిమాలు రెండూ చూస్తున్నా. సాధారణంగా నాకు తమిళ పక్షపాతం ఉందనిపిస్తుంది సినిమాల విషయంలో. ఇదే మొదటిసారి అనుకుంటా పోల్చుకుని తెలుగు సినిమా వందరెట్లు నయం అనిపించిన ఉదంతం. ఇదే ముక్క ఒకరితో చెప్పుకుని వాపోతూ ఉంటే, “వాళ్ళు తెలుగు సినిమా లాగ తీయాలి అనుకుని అలా తీసుంటారులే” అన్న ఓదార్పు వాక్యం లభించింది, లలిత ప్రియ కమలం పాట గురించి.

అంత అందమైన మొహమేమిటి? ఆ పేరేమిటీ? అని చిరంజీవి తెలుగు సినిమాలో చాలాసేపు వాపోతాడు హీరోయిన్ పేరు గురించి. నేనూ సినిమా అయ్యాక 24 గంటలవుతున్నా, ఆ రుద్రవీణేమిటి…దాన్ని ఇలా తీయడమేమిటి? అని ఇంకా వాపోతూనే ఉన్నాను. ఒకే దర్శకుడు తన సినిమాని తానే రీమేక్ చేస్తూ ఇంత దారుణంగా చేయగలడా? అదెలా సాధ్యం? అన్నది నాకిప్పుడున్న భేతాళ ప్రశ్న.

….ఆ విధంగా ఎన్నో నెలల విరామం తరువాత ఈ బ్లాగు రాయాల్సి వస్తోంది నా హృదయ ఘోష వెళ్ళగక్కుకోవడానికి.

Published in: on April 4, 2015 at 7:26 pm  Comments (7)  
Tags:

వంశవృక్ష (1972)

రెండేళ్ళ క్రితం అనుకుంటాను – కన్నడ రచయిత భైరప్ప గారు రాసిన “వంశవృక్ష” నవలను ఆంగ్లానువాదంలో చదివాను. అది నన్ను కొన్నాళ్ళు వదలకుండా వెంటాడింది. సరే, తెలుగులో బాపు-రమణల వంశవృక్షం సినిమాలో పాటలు ఒకటీ అరా గుర్తున్నాయి కానీ, సినిమా ఏదో లీలగా గుర్తు ఉందంతే. పరుచూరి శ్రీనివాస్ గారి పుణ్యమా అని జర్మనీలో వంశవృక్షం తెలుగు వర్షన్ వెండితెర నవల దొరికింది. అది కొన్ని చోట్ల నచ్చింది. కొన్ని చోట్ల – “ఏమిటీ, ఇలా డైల్యూట్ చేసేసారు ఫలానా దృశ్యాన్ని?” అనిపించింది. వెరసి సినిమా చూడాలన్న కుతూహలాన్ని కలిగించినా, మొత్తానికి ఇప్పటిదాకా ఆ తెలుగు సినిమా మట్టుకు చూడలేకపోయాను. దొరక్క!. ఇటీవలి కాలంలో ముక్కోతికొమ్మచ్చి ఆడియో పుస్తకం రోజూ వింటూండడం వల్ల – అందులోని వంశవృక్షం సినిమా కాలం నాటి విశేషాలతో కూడిన భాగం ఒక రోజు కాకుంటే ఒక రోజన్నా వినిపించేది. అలా అన్నిసార్లు వింటున్నందుకో, నా స్నేహితురాలు ఇటీవలే ఈ సినిమా చూసి నాకు చెప్పినందుకో మరి – మొత్తానికి కన్నడ సినిమా (ఉపశీర్షికలతో) ఇవ్వాళ చూశాను.

కథ వివరాలు తెలుసుకోగోరేవారు వికీ పేజీ చూడండి.

సినిమా గురించి చెప్పాలంటే – చాలా నెమ్మదిగా సాగింది కానీ, చాలా తీవ్రత ఉంది ఆ దృశ్యాల్లో. నేపథ్య సంగీతం కూడా ఆ దృశ్యాలకి సరిగ్గా సరిపోయింది. నటీనటవర్గం ఆ పాత్రలకి బాగా సూటయ్యారు. ముఖ్యంగా శ్రీనివాస శ్రోత్రి పాత్ర వేసిన పెద్దాయన అయితే – ఆ పాత్రకి అతికినట్లు సరిపోయాడు. విష్ణువర్ధన్ ని ఆ టీనేజి అబ్బాయి పాత్రలో చూడ్డం మహా సరదాగా ఉండింది. మొత్తానికి సినిమా నాకు చాలా నచ్చిందనే చెప్పాలి. కొన్ని కొన్ని చోట్ల మరీ అతి నెమ్మదిగానూ, ఒకట్రెండు చోట్ల – “ఇదంతా ఇంత సేపు చూపారెందుకు?” అనీ అనిపించింది కానీ – మరి వాళ్ళ సినిమా, వాళ్ళిష్టం వచ్చినట్లు కాక నా ఇష్టం వచ్చినట్లు తీస్తారా? తెలుగు స్క్రీన్ ప్లే లో లాగానే, ఇందులో కూడా నాకు హీరోయిన్ తన మామగారి వద్దకు వెళ్ళి తన బాబుని తనతో పంపేయమని అడిగే దృశ్యమే నన్ను అన్నింటికంటే ఎక్కువగా ఆకట్టుకున్న దృశ్యం. తెలుగు సినిమాలో ఉన్నన్ని పాటలు ఇందులో లేవనుకుంటాను. కొంతవరకూ ఆర్టు మార్కనే చెప్పాలి సినిమా తీసిన పద్ధతి. 1920ల నాటి ఆ ప్రాంతపు సంపన్న బ్రాహ్మణ కుటుంబాల జీవనశైలిని బాగా చూపినట్లు అనిపించింది నాకు.

ఇది చూశాక, వెంటనే నాకు కలిగిన ఆలోచన: ఇక భైరప్ప గారి పుస్తకాన్ని తిరిగి చదవక తప్పదు! ఆ ఆడియో పుస్తకం తెచ్చిన రమణ గారి పిల్లలకి అనేకానేక ధన్యవాదాలు!

Published in: on November 5, 2014 at 8:00 pm  Leave a Comment  
Tags:

హృదయ కాలేయం

ఈ సినిమా పోస్టర్ మొదట ఫేస్బుక్ లో చూసినప్పుడు “రాష్ట్ర సంపూర్ణేష్ యువత” అన్న క్యాప్షన్ చూసి చిర్రెత్తుకొచ్చింది, ఇంకా అతనెవరో ఒక్క సినిమా అయినా రాకముందే ఈ అభిమాన సంఘాలేమిటి అని. ఆ తరువాత, ఫేస్బుక్ లో ఎక్కడ పడితే అక్కడ ఇదే సినిమా గురించి మాట్లాడుతూండటంతో నిజం చెప్పాలంటే విసుగేసింది. కుల మత జాతీయ ప్రాంతీయ వృత్తి పరమైన భేదాలు లేకుండా. ప్రతి దాన్ని “ఆహా, ఓహో! ” అని పొగిడేయడమే ఆధునిక వేదమనుకోండి, ఈ సినిమా విషయంలో అది నామట్టుకైతే శృతి మించినట్లే అనిపించింది. వీటన్నింటివల్లా ఆ సినిమా రిలీజవడాన్ని నేనంత పట్టించుకోలేదు. అయితే ఆ సమయంలో కొన్ని రివ్యూలు ఆడిపోసుకోవడమూ, కొన్ని మెచ్చుకోవడమూ చూశాక కొంచెం ఆసక్తి కలిగిందన్న మాట వాస్తవం. ఇన్నాళ్ళ తరువాత మాటీవీ చానెల్లో యూట్యూబులో కనబడ్డంతో చూశాను మొత్తానికి.

ఇప్పుడు కథ గురించి, సంపూర్ణేష్ బాబు గురించీ చెప్పను కానీ, ఒక్క ముక్కలో చెప్పాలంటే – బాగుంది సినిమా. తెలుగు సినిమా పరువు తీశారు అని దీని గురించి కొందరు అంతర్జాలంలో ఆడిపోసుకోగా చూశాను. హహహ – తెలుగు సినిమా పరువుని వారసత్వంగా ఫీల్డులోకి ప్రవేశించి దున్నుతున్న వాళ్ళూ, తెలుగు మాట్లాడ్డం రాకున్నా మాట్లాడి తెగులు పుట్టిస్తున్న వాళ్ళూ అంతా హీరోలైపోయి, అసభ్యత కూడా హీరోయిజం చేసేసి; ఆడవాళ్ళని కించపరిచే డైలాగులు చెప్పడాన్ని “మగతనం” అని ఊదరగొట్టి, తొడలు గొట్టి – ఆల్రెడీ తెలుగు సినిమా పరువుని తీశేసారు ఇప్పటికే. వాళ్ళందరిని వదిలేసి హృదయకాలేయం బృందాన్ని ఆడిపోసుకోవడం దారుణం అని నా అభిప్రాయం. సరిగ్గా ఈ సినిమా కూడా అదే మూసలో, అవే పంచి డైలాగులతో, అవే నమ్మశక్యం కాని సన్నివేశాలతో, అవే హీరోయిజాలు, విలనిజాలతో ఉంది. ఇది నిఖార్సైన “తెలుగు” స్పూఫు. నిజానికి ఇది నాకు “తమిళ్ పడం”, దాని తెలుగు రీమేక్ “సుడిగాడు” కంటే కూడా చాలా నచ్చింది. ఇంకా ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ పరువు తీసింది అని భావించేవారు ఎవరన్నా ఎప్పుడన్నా ఈ టపా చదవడం సంభవిస్తే, వాళ్ళకి ఈ పేజి చదవమని తప్ప ఇంకేం సూచించలేను. ఇది తెలుగు సినిమా పరువు తీసిందంటే – పరువు ఆల్రెడీ పోయినట్లే. ఎందుకంటే ఇందులో కొత్తగా చెప్పిందేం లేదు – మెజారిటీ తెలుగు సినిమాలు ఎలా ఉంటున్నాయో సరిగ్గా అలాగే ఉంది సినిమా నా దృష్టిలో.

డైలాగులు చాలా బాగా రాశారు. నటీనటవర్గం అనుభవం లేనివారైనా ఎవళ్ళ ప్రయత్నం వారు చేశారు. వీళ్ళలో మహేశ్ గారు ఆకట్టుకున్నారు అందర్లోకీ. ఆయన తరువాత నాకు మెయిన్ విలన్ చాలా నచ్చాడు 🙂 పంచ్ డైలాగులు కొన్నైతే అసలు టూ గుడ్. కొంచెం అనుభవం ఉన్న నటులు చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో సినిమా. చాలా చోట్ల టీవీ సీరియల్ ఫీల్ వచ్చింది – బడ్జెట్ పరిమితులేమో మరి. మొత్తానికైతే, ఈ ప్రయత్నం అభినందనీయం. ఏదో జరిగి మన సినిమాల్లోనూ మార్పులు సంభవించి పెద్ద హీరోల సినిమాలు మూసల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. ఇతర భాషల్లో అన్ని రకాల సినిమాలూ సహజివనం చేస్తున్నట్లే తెలుగులో కూడా ఉండాలని ఆశిస్తున్నాను.

Published in: on September 18, 2014 at 2:58 pm  Leave a Comment  
Tags:

పెణ్, ఇందిర, సుహాసిని, నేను!

సాధారణంగా మేధావులు ఆడిపోసుకుంటూంటారు కాని, ఈ ఫేస్‌బుక్ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. వాటిలో ఒకటేమిటంటే కొన్ని గొప్ప entertainment మార్గాలు తెలుస్తాయి. సినిమాలు, పుస్తకాలు వంటివన్నమాట. అలాగే నాకు “పెణ్” అన్న తమిళ టీవీ సీరియల్ గురించి తెలిసింది.

ఈ “పెణ్” అన్నది నటి-దర్శకురాలు సుహాసిని రాసి, దర్శకత్వం వహించిన కథల సంకలనం. యూట్యూబులో ఎనిమిది విడియో ఎపిసోడ్లు కనబడ్డాయి. రేవతి, శోభన, అమల, రాధిక వంటి ప్రముఖ నటీ నటులు అందరూ చెరో ఎపిసోడ్ లో ప్రధాన పాత్రలు ధరించారు. నాకైతే గొప్పగా నచ్చాయి కథలన్నీ. ప్రత్యేకం నన్ను ఆకట్టుకున్నవేమిటి? అని అడిగితే –

1. కథాంశాలు, కథల్లోని పాత్రలు – రోజు వారి జీవితంలో కనబడేవే. పాత్రలైతే నగరాల్లోని మధ్యతరగతి తమిళ కుటుంబాలు ఎలాగుంటాయో అలాగే ఉంటాయి, ప్రవర్తిస్తాయి. మామూలుగా అందరిళ్ళలో కనబడే తగాదాలు, సరదాలు, కష్టాలు, నష్టాలు – ఇవే కనబ్డ్డాయి కథల్లో.

2. కథలన్నింటిలో స్త్రీ పాత్రలు ప్రధాన పాత్రలు. కథలన్నీ స్త్రీల చుట్టే తిరుగుతాయి. మన సినిమాలు, మన సీరియళ్ళూ చిన్నప్పట్నుంచి చూస్తున్నా – ఇలాంటి కథాంశాలు అరుదనే చెప్పాలి. స్త్రీలు ప్రధాన పాత్రలుగా ఉండే ప్రస్తుత టీవీ సీరియళ్ళను చూసి సంతోష పడాల్సిన అంశాలేవి లేవు. వీటన్నింటి మధ్య, నన్ను కథాంశాల ఎంపికలోనే సుహాసిని చాలా ఆకట్టుకుంది.

3. నటీనటులు అందరూ ఎంతో ప్రతిభావంతులైన వారు. నటనారంగంలో పేరున్న వారు. వీరందరూ కలిస్తే ఇంక ఇంత మంచి కథలకి లోటేమిటి?

4. నేపథ్య సంగీతం (ఇళయరాజా) ది ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మట్టుకే మెరిస్తే, ఆ మొదట్లో టైటిల్ విడియో అయితే అద్భుతమైన ఆలోచన!

“పెణ్” కథలు చూడాలన్న ఆసక్తి ఉంటే యూట్యూబులో Tamil serial penn అని వెదికితే కనిపిస్తాయి. సబ్-టైటిల్స్ లేవు కానీ, చాలా వరకు విషయం అర్థం కావొచ్చు – విషయాలు దైనందిన జీవితంలోనివి కనుక. అదీ వాటి కథ. ఆ విధంగా, చూసిన ఎనిమిది ఎపిసోడ్లలో మూడు తెగ నచ్చగా, మూడింటిలో పలు అంశాలు నచ్చాయి. దానితో ఇక సుహాసిని దర్శకత్వం వహించిన ఏకైక చలన చిత్రం “ఇందిర” చూడక తప్పింది కాదు.

ఆ సినిమా సుహాసిని గురించి నాకు “పెణ్” చూసాక కలిగిన అభిమానాన్ని గౌరవం దాకా తీసుకెళ్ళిపోయింది. ఏం సినిమా అండి అసలు! మొదటి సినిమా లా ఉందా దర్శకురాలికి? చాలా అనుభవం ఉన్న వాళ్ళలా ఉంది! నటీనటులు కూడా బాగా సరిపోయారు పాత్రలకి. అనూ హాసన్ కి తొలిసినిమా అయినా, ఇంత భారీ పాత్రని బానే నిభాయించింది. ఆవిడ పాత్రకి రాసిన డైలాగులు కొన్ని గొప్పగా ఉన్నాయి అసలు!

ఈ సినిమా పాటలు చిన్నప్పుడు విన్నాను. Nila Kagiradhu పాట ని తరువాత కూడా చాలాసార్లే విన్నాను. ఎప్పుడూ సినిమా చూసే బుద్ధి పుట్టలేదు. అలా ఎలా మిస్సయ్యాను! అని కొన్ని క్షణాలు దిగులు చెందాను కూడా ఇప్పుడు సినిమా చూశాక! సరే, సినిమా పాటలు చాలా బాగున్నాయని ఇప్పుడు మళ్ళీ కొత్తగా కనుక్కున్నాను. ముఖ్యంగా నాకు నచ్చిన పాట Ini Accham Accham Illai. గొప్ప పాట! కొరత ఏమిటంటే – సినిమా తెలుగులో చూడగలిగుంటే ఇంకా బాగుండేది. నా అమోఘమైన భాషా ప్రావిణ్యం వల్ల నాక్కొన్ని చోట్ల డైలాగులు, పాటల్లోని వాక్యాలు అర్థం కాలేదు 😦 మొత్తానికైతే మంచి దేశీవాళీ సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా!

మొత్తానికి సుహాసిని అంటే నాకు విపరీతమైన గౌరవ భావం, భక్తి భావం ఏర్పడిపోయింది ఇంక! సాధారణంగా నేను “అబ్బ! ఎలాగైనా వీరిని కలవాలి” అనుకున్న మనుషుల్లో నేను అలా అనుకునే నాటికింకా జీవించి ఉన్నవారు చాలా తక్కువ. వాళ్ళలోకి సుహాసిని ని కూడా చేర్చుకున్నాను దెబ్బకి! 🙂

చివరగా, ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకి సుహాసిని ఇచ్చిన సమాధానంతో ఇంక ముగిస్తాను.

****
Question: You write for Mani, you dub for his films… what do you think of his cinema?

Answer: “Can we leave Mani out of this discussion? In none of Mani’s interviews is my work ever discussed. We are not a couple who feels one person is superior to the other; ours is a relationship of equals. Mani is as proud of my work as he is of his own. I’m not getting angry but I do not feel the need to go on and on about Mani.

I am a curator for a couple of big international film festivals. I recommend South Indian cinema to them. But I don’t recommend any of Mani’s movies because they recommend themselves. Whether I am acting, judging films or doing my show, nobody asks Mani how involved he is with those aspects of my career. So why should I be constantly asked questions about him”

Source: Times of India
****

Published in: on August 23, 2014 at 8:41 pm  Comments (1)