ఎన్నో రంగుల తెల్ల కిరణం

ఈ వ్యాసాన్ని తెలుగుపీపుల్ సైటు లో Feb 19 2006 నాడు పోస్టడం జరిగింది. కానీ పుస్తకాల గురించిన నా వ్యాసాలన్నీ ఈ బ్లాగులో పెట్టుకోవాలి అన్న ఉద్దేశ్యం తో ఇక్కడ పోస్టుతున్నా :

‘ ఎన్నో రంగుల తెల్ల కిరణం ’ అన్నది సినీ గేయ రచయిత ‘ సిరివెన్నెల ’ సీతారామ శాస్త్రి గారి కథల సంకలనం. ఇందులో ఏడు కథలు ఉన్నాయి. అలా చదువుతూ సాగిపోయేలా స్మూత్‌ గా ఉన్నాయి అన్నీ. కథలు అన్నీ ఓ సంఘటనను లేదా ఓ విషయాన్ని ఉద్ధేశిస్తూ రాసినవే.

‘ మరో సింద్‌ బాద్‌ కథ ’ అన్న కథ – తగినంత వ్యంగ్యం ఉంది ఈ కథ లో. పదాల ప్రయోగం చాలా బాగుంది. నిజానికి చూస్తే ఆ కథలో పెద్ద కథేం లేదు. కట్టె , కొట్టె , తెచ్చె అన్నట్లు మూడు ముక్కల్లో చెప్పేయొచ్చు ఆ విషయాన్ని. దాన్నే హాస్యం మేళవించి కాస్త సరదాగా , ఆసక్తి కరంగా చెప్పారు రచయిత. ‘ అద్రుష్టం తన్నిన గుడ్డి గుర్రం తాపు కి నాకు కళ్ళంట నీరు జల జలా రాలాయి ’ వంటి వాక్యాలు నవ్వు పుట్టిస్తాయి. లాటరీ టికెట్లు కొనేవారికి ఇంత లాజిక్‌ ఉంటుందని నాకు ఇన్నాళ్ళు తెలీదు 🙂

‘ ఎన్నో రంగుల తెల్ల కిరణం ’ – ఇది కాస్త సీరియస్‌ టైపు కథ. ‘ ప్రతి మనిషీ ఒకే గుండెలో ఒక ముక్క. కాలం ఎక్కడెక్కడో విసిరేస్తుంది , ఈ ముక్కల్ని. జీవితం తరుముకు వస్తూ ఉంతే జీవనాన్ని తరుముకుంటూ , ఎవరికి వారు ఒకరికొకరు దూరంగా …. ’ అంటూ తత్వం లోకి వెళ్ళి పొయారు చాలా చోట్ల. అఫ్కోర్స్‌ , కథ కూడా అలాంటిదే. కథలో కవితా భావాలు చాలా ఉన్నాయి. భౌతిక శాస్త్ర సిద్ధాంతాన్ని ఉటంకిస్తూ దాన్ని జీవితానికి అంవయించిన తీరు బాగుంది.

‘ చరిత్ర చోరులు ’ – మొదటి పేజీ చదువుతున్నప్పుడు ఆపేయాలనిపించింది. అది కథలో సమస్యో , నేను అర్థం చేసుకోవడం కష్టం అయిందో కాని ఏమాత్రం నచ్చలేదు ఈ కథ మొదటి భాగం. అయినా …. చూద్దాం అని చివరికంటా చదివాను. ఒక ఈవెంట్‌ కి సంబంధం వున్న రకరకాల మనుష్యుల ఆలోచనలను , వారి ప్రవర్తనకు గల కారణాలను బాగా చెప్పారు. సామాన్యుడు ఎప్పటికీ సామాన్యుడే అన్న అర్థం లో చెప్పిన – ‘ నిజమైన మనుష్యులకు అసలు చరిత్రే లేదు వారికి గతమూ లేదు , అనాగతమూ లేదు ’ అన్న వాక్యం ఆలోచింపజేసేది గా ఉంది.

‘ ఇదో తిరుగుబాటు కథ’ – మళ్ళీ హాస్యం , వ్యంగ్యం టచ్‌ ఉన్న కథ. ‘ నిప్పు పట్టుకోనీ పసివాణ్ణి … ఆ తర్వాత పట్టుకోవడం మానేస్తాడు. వాణ్ణి వదలకుండా గట్టి గా పట్టుకుని చూడు . చెయ్యి కొరికి బయట పడతాడు ’ . ఇది కూడా చాలా సాధారణ మైన కథా వస్తువు. నిజానికి ఏమీ లేదు చెప్పడానికి. కానీ రచయిత నైపుణ్యం వల్ల బానే వచ్చింది. ‘ పోస్టు మార్టెం ’ – మరీ ప్రయోగాలు ఎక్కువ గా వాడేసినట్లు అనిపించింది. కథలో అక్కడక్కడా పదాలతో ఆడుకుంటే కథకు ఓ అందం వస్తుంది కానీ కథ అంతా వాటితో నింపేస్తే నాకు చదవడానికి ఏదో లా ఉండింది. తీసుకున్న వస్తువు నిజానికి ఆలొచింపజేసేది. కాని ఈ ‘ ఆట’ ఎక్కువవడం ఒక రకంగా ఈ కథ లో ఉన్న పంచ్‌ ని తగ్గించింది. లేక పెంచిందా ? ఏమో ??

‘ కార్తికేయుని కీర్తికాయం ’ – మళ్ళీ కొంచెం వ్యంగ్యం , కొంచెం హాస్యం కలగలిసిన సీరియస్‌ వస్తువు ఉన్న కథ. కథ లో అన్న ఆ విశ్వపతి నిజంగానే ఉన్నాడో లేదో తెలీదు కాని అతని పాత్ర డైలాగులు నాకు నచ్చాయి. ఇందులోనూ ప్రయోగాలు ఎక్కువ గానే ఉన్నట్లు అనిపించినా ఈ కథ చదివించేలా ఉంది.

‘ మహాశాంతి ’ – నిజానికి ఇది మొదటి కథ. కానీ నేను చివరగా చదివిన కథ . అందుకని చివర్లో చెబుతున్నా. ఇది ఒక ఊరి కథ. ఈ కథ చదువుతూంటే ఆయన గురించి తెలీని వారికి కూడా అర్థం అయిపోతుంది ఆయన కవి అని ….. కథలో వాక్యాలే కవిత్వం లా ఉన్నాయి. ‘ ఊళ్ళో ఏ కొంపలోనూ అగ్గి రాజడం లేదు. కానీ కొంపలన్నీ అగ్గిలా రాజుతున్నాయి ’ అని ఒక్క మాట లోనే ఊళ్ళో పరిస్థితి ని మనకు అర్థం అయ్యేలా చెప్పారు. ఇందులోనూ మళ్ళీ అంతర్లీనంగా వేదాంతం చెప్పారు … సాధారణంగా ఆయన శైలే అంత అనుకుంటా.

మొత్తానికి కథలు అన్నీ బానే ఉన్నాయి. మళ్ళీ కూడా చదవొచ్చు కాని 7 కథలను మాత్రం ఓ పుస్తకం గా వేసి దానికి 60 రూపాయలు ధర పెట్టడం దారుణం అనిపించింది. రచయిత కి ఉన్న విలువ అలాంటిది కావొచ్చు. ఈ మధ్య పుస్తకాలన్నీ ( ఏ కమ్యూనిస్టు పుస్తకాలో తప్ప ) ఆకాశాన్నంటే ధరలకే వస్తున్నాయి అనుకోండి. అయినా కనీసం ఓ పది కథలు అన్నా ఉండి ఉండవలసింది అనిపించింది. సుమారు 50 కథలు ఉన్న రష్యన్‌ రచయిత చెకోవ్‌ పుస్తకం ఒకటి రష్యా వారి చలవ వల్ల 40 రూపాయలకే వచ్చింది పోయిన సంవత్సరం. అలాగ మన వాళ్ళు కూడా ఎవరైనా పుస్తకాలను పూర్తి వ్యాపార ద్రుష్టి తో చూడకుండా కాస్త చదివే వారి వైపు నుండి కూడా ఆలోచిస్తే బాగుండు.

Published in: on October 14, 2006 at 6:07 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/10/14/%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b1%8b-%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b1%81%e0%b0%b2-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%95%e0%b0%bf%e0%b0%b0%e0%b0%a3%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

  1. సౌమ్య గారూ,
    మీ ఈ సమీక్షలు చదివి ఉత్తేజం చెంది ఆ పుస్తకాలు తెప్పించుకొని వాటిని చదివేలోగా మీరు పదుల పుస్తకాలకు సమీక్షలు రాసేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు చదవను తల్లీ!!
    మీ నవీన్ నవలల సమీక్షలు చదివాక వాటితో మొదలెట్టాను. ఇప్పటికి “కాల రేఖలు”, “బాందవ్యాలు” అయ్యాయి. “చెదిరిన స్వప్నాలు” సగమయ్యింది. అవును. పొరపాటున ముందు బాందవ్యాలు చదివేశాను.
    సిరివెన్నెల గారు కథలు కూడా రాస్తారా?

    –ప్రసాద్
    http://charasala.com/blog/

  2. సౌమ్య గారు,

    మీ కధల, పుస్తక సమీక్షలు బాగున్నాయి.మీరు అనువాదాలు ఏమైనా చేస్తారా? కధలు రాస్తారా? కధలపైన మీ మనోభావాలు వ్యక్తం చేసారు.కొంచెం నిదానంగా ఒక రచయితవి ఒకటి,రెండు కధలు తీసుకొని లోతు విశ్లేషణ చేయండి.సామాజిక, చారిత్రాత్మక, ఆర్ధిక కోణాలలో విశ్లేషణ చేయండి.ఆ రచనలు అప్పటి సామాజి పరిస్ధితులను ప్రతిబింబిస్తాయా చూడాలి. ప్రజాకళ లో మీరొక ప్రశ్న పెట్టారు. మీరు సామాజిక వాస్తవాలను ప్రతిబించే రచనలు చేసివుంటే ప్రజాకళ సంపాదకవర్గానికి (Editorial board: Editor@prajakala.org) పంపించండి. కొ.కు రచనల పై మీకు ఆసక్తివుంది కాబట్టి ఆయన రాసిన సాహిత్యవ్యాసాల మీద ఒక చక్కటి వ్యాసం రాయడానికి ప్రయత్నించండి. కొ.కు. సాహిత్యం లో ఒక సముద్రం లాంటివాడు.కాబట్టి మీ విశ్లేషణ పరిధిని పరిమితం చేసుకోండి.
    sajeegopal@yahoo.com …..please send me a test email)

    సాజీ గోపాల్

  3. Hi!
    Can you please tell me where can i get these Telugu books in Hyderabad. Somehow my search for Telugu books brought me here. You posted some realy good reviews here.

  4. చాలా బాగున్నది. నా అభిమాన సినీ గీత రచయత సిరివెన్నల మంచి కథలు కూడా రాసారు అన్న విషయం చాలా ఆనందం కలిగించింది. విషయ పరిచయనికి నా థంక్స్.

  5. Hi Sowmya,

    try chalam (Maidanam, Stree, Musings and lot many), buchi babau (Chivaraku migiledi), Vaddera Chadi Das (Hina jwala, Anukshanikam), Volga (Swetcha), ranganayakamma(Jaanaki vimukthi), Roots (Alex haley telugu translation is also available), Spartacus (Howard Fast telugu translation by Ranganayakamma), Oka Dalaari Paschattapam (Confession of Economic hitman by John Perkins in English). these books will be inspiring thoght provoking. you can understand the contemporary issues and ideas.

  6. hi sowmya
    meeru inni navalalu eppudu chadivaaru ??
    kaanee mee blog chosi naaku koodaa ivanne chadiveyalanundi
    kanee ee books dorakadam ledu
    internet lo telugu novels dorikithey cheppagalaru

    k.ravichandareddy@gmail.com

  7. To all Telugu lit enthusiasts interested in purchasing Telugu books:
    In Hyderabad, inquire at Visalandhra on Kothi Road and Navodaya (near Kachiguda CHowrasta).

    In Vijaywada & Guntur – inquire at Navodaya.

    From abroad – email Navodaya (Atluri) Ramamohanarao

    A lot of classical and contemporary works (poems and novels) are being republished now. If you email Navodaya, they can arrange to gather what is available and send them to you in one package by airmail or seamail.
    Alternatively, you can contact dtlc at yahoogroups.com
    yet another alternative is
    http://www.avkf.org/BookLink/book_link_index.php

    happy reading.

  8. […] ఎన్నో రంగుల తెల్ల కిరణం అనే చిన్నిపుస్తకానికి ప్రచురణకర్తలు పెట్టిన ధర చాలా ఎక్కువని అభిప్రాయపడుతూ “మన వాళ్ళు కూడా ఎవరైనా పుస్తకాలను పూర్తి వ్యాపార దృష్టి తో చూడకుండా కాస్త చదివే వారి వైపు నుండి కూడా ఆలోచిస్తే బాగుండు”నని సౌమ్యగారు చేసిన సూచన అందఱికీ ఆమోదయోగ్యమే. […]

  9. How to get the Sirivennela gari books online?


Leave a comment