Readings: Amazon Mechanical Turk – Gold mine or Coal mine?

First things first:
Title of the article: Amazon Mechanical Turk: Gold Mine or Coal Mine?
Authors: Karen Fort, Gilles Adda, K.Bretonnel Cohen
In: Computational Linguistics Journal, June 2011, Vol. 37, No. 2, Pages 413-420

In the past 2 months or so, I guess I read this article 2-3 times. I still don’t understand why it was written 😦 Oh, the incomprehensibility was not the reason why I read it again, though. I found it multiple times, lying on my table..for various reasons (which include piling up of stuff you never read!)

Coming to the point:
1) I never used amazon mechanical turk – neither as a requester nor as a turker. But I don’t feel that there is something wrong with the approach. Its up to the turkers to do or not do a given task. So, I don’t think there should be question of ethics here. If there is anything, there should be a question on the quality.

2) If some turkers use it to meet their basic needs, (IMHO) its not the wrong-doing of amazon or the requesters.

So, if the concern in the article was about the quality of linguistic resources developed, perhaps, It might have sounded so abnormal to me. But, the issue was on the “working conditions” of the AMT “workers”. Whatever way people are using it (as a hobby, timepass, for some pocket money, to meet living expenses etc), its people who do that…and neither Amazon nor the task givers on AMT promise employment, right?

And hence the confusion… 🙂
Ofcourse, now, I won’t do a re-reading of the article! 😛

Published in: on July 1, 2011 at 1:58 pm  Leave a Comment  

“Social Entrepreneur” అని ఎవర్ననాలి?

“Social Entrepreneur” అని ఎవర్ననాలి?
David Bornstein రాసిన “How to change the world” పుస్తకం మొదలుపెట్టాక నాకు కలిగిన సందేహం ఇది.

అప్పటివరకూ – సాంఘిక ప్రయోజనాలతో ఉన్న వ్యాపారాలు చేసేవారు Social Entrepreneurs అన్న అభిప్రాయంతో ఉన్నాను నేను. ఉదాహరణకి – ఏదో ఒక ఎకో ఫ్రెండ్లీ వస్తువులు తయారు చేసే సంస్థ, ఏదో ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థ (!!! మైక్రో ఫైనాన్సులు సంఘానికి బాగు చేస్తున్నాయా, లేదా? అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం!), అలాగే, ఇప్పటికిప్పుడు పేరు గుర్తు రావడం లేదు కానీ, పూర్తిగా మానసిక సమస్యలున్నవారితోనే నడిచే ఒక కొరియర్ సర్వీస్ ఉంది (మహారాష్ట్రలో అనుకుంటా), ఏక్లవ్య ఫౌండేషన్, అరవింద్ గుప్తా టాయ్స్ – ఇటువంటివి. అసలుకి నా లెక్కలో -’కొత్తపల్లి’, ’మంచిపుస్తకం’ కూడా అలాంటివే! అంటే, సంఘానికి తమ వంతు సహకారం అందించడం “సేవ” లా కాక, ఒక చిన్న/పెద్ద సైజు బిజినెస్ లాగా చేయడం. అన్ని సంస్థలూ లాభాల్లో ఉన్నాయని కాదు కానీ, వీరిలో విజయవంతమైన వారు కూడా చాలామందే ఉన్నారు కదా! మొత్తానికి, business for business’ sake అన్నట్లు కాకుండా, business for society అన్న దారిలో వెళ్ళేవారు social entrepreneurs అని నేను ఇన్నాళ్ళూ అనుకుంటూ ఉన్నాను.

అయితే, ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టాక, entrepreneur అంటే, (కొత్తవో, పాతవో) సొంత ఆలోచనలు అమలుచేసేవాడా? లేక, సొంత ఆలోచనలతో వ్యాపారం చేసేవాడా? అని సందేహం కలిగింది. ఎందుకంటే, ఇప్పటికి ఈ పుస్తకంలోని ఇరవై పైచిలుకు కథల్లో ఇప్పటికి ఒక ఐదారు చదివానంతే. కానీ, దీనిలోనే, Szekerus అన్న హంగరీ మహిళ, అలాగే, ఆఫ్రికా ఖండం లో వ్యాధిగ్రస్థులను చూసుకునే కేర్ టేకర్ నెట్వర్క్ నడీపే మరో మహిళ – ఇలాంటి వారు entrepreneur అనిపిస్తే (వివరంగా మరెప్పుడైనా!) , మన దేశానికే చెందిన Javed Abidi మాత్రం activist అనిపించాడు. ఇద్దరూ తాము చేసిన పనుల ద్వారా ఒక మోస్తరు అద్భుతాలే సాధించారు. సందేహం లేదు. అయితే, జావేద్ ను entrepreneur అనొచ్చా? అన్నది నాకు అర్థం కావడం లేదు. ఏదన్నా ఆంగ్ల నిఘంటువు చూస్తే, “entrepreneur” అన్న పదాన్ని వ్యాపారస్థుడిగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది.

అయితే, దీని గురించే ఫోన్లో నేనూ, నా తమ్ముడూ మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని పాయింట్లు దొర్లాయి. సారాంశం గా నాకు అర్థమైనన్దిదీ: అబిది కేసునే తీసుకుని చూస్తే – అతనేమీ స్వచ్ఛంద సంస్థను నడపడం లేదు కదా. అంటే, దాతల నుండి విరాళం తీసుకుని దాన్ని వాడి, అవసరంలో ఉన్న వారికి ఏదన్నా ఇవ్వడం -అది “సర్వీస్”. అలా కాకుండా, ఒక ఆశయ సాధన కోసం పోరాడి దాన్ని సాధిస్తే – అది యాక్టివిజం. అక్కడితో ఆగక, ఆపై మెట్టు అంటే, అబిదీ కేసులో వికలాంగులకి ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్ అదీ అమలయ్యేలా, అలాగే, వికలాంగులకు వివిధ ప్రాంతాల్లో సదుపాయాలు సరిగా అమరేలా – ఇవన్నీ క్రియాశీలకంగా చేయడం ‘social entrepreneurship’ అని తేల్చాము. కానీ, ఆ తరువాత కూడా, అబిదీ చేసిన పని నాకు యాక్టివిజం లాగానే అనిపించింది. బహూశా, ఈ కేసు రెంటికీ బార్డర్ లైన్ కేసేమో! ’social entrepreneurship’ ని నేను అర్థం చేసుకున్న ప్రకారం చూస్తే, అబిది ఆక్టివిస్టే. ఇదేమాట తమ్ముడితో అంటే, వాడు ఒక మాటన్నాడు. కాసేపాగాక చూస్తే, పుస్తకం వెనుక అట్ట మీద కూడా అదే అర్థం వచ్చే మరో వాక్యం రాసి ఉంది. “What a business entrepreneur is to the economy, the social entrepreneur is to the society” అని. సరే, ఈ పుస్తకం ఉద్దేశ్యం ఇలా ఉందన్నమాట అనుకున్నాను. మరైతే, ఆక్టివిస్టులో?? 🙂

Published in: on February 1, 2011 at 6:08 am  Comments (7)  

ఒకే పుస్తకానికి రెండు అనువాదాలు అవసరమా?

ఒక పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించాలి. దానికి రెండు అనువాదాలెందుకు?

నిన్నటి హిందూ లిటరరీ రివ్యూ లో యు.ఆర్.అనంతమూర్తి నవల ‘భారతీపురా కు కొత్తగా రాబోతున్న/ఇటీవలే వచ్చిన సుశీల పునీత ఆంగ్లానువాదం నుండి కొన్ని పేజీలు ఒక వ్యాసంలా వేశారు. (దాన్ని ఇక్కడ చదవవచ్చు)

అయితే, ఆ పేరు వినగానే నాకు పరిచయం ఉన్నట్లు అనిపించింది. ఈ నవల ఆంగ్లానువాదం ఇదివరలో నేను చదివినట్లున్నా కదా..అనుకుంటూ ఉండగా, కథాంశం లీలగా గుర్తొచ్చింది. వెంటనే, అప్పట్లో బ్లాగులో రాసే ఉంటాననుకుని సర్చ్ చేస్తే, లంకె దొరికింది. (ఇదిగో!).

అదేమిటి ఇలా కూడా చేస్తున్నారా అని ఫ్లిప్కార్టు కి వెళ్ళాను. అక్కడ “భారతిపుర” పేరుతో శోధిస్తే, రెండు పుస్తకాలు కనబడ్డాయి. (మీరిక్కడ చూడండి). అక్కడ కనిపిస్తున్న రెండో పుస్తకమే నేను చదివిన పుస్తకం అనుకుంటాను. ఆ అట్ట చూస్తే అలాగే ఉంది. అనువాదకుడి పేరు కూడా అదే. నేను చదివిన పుస్తకం వెల – నూట పదిహేను. ఇప్పుడొచ్చిన పుస్తకం వెల నాలుగొందలా యాభై!

అసలు ఒకసారి అనువాదం అయిపోయిన పుస్తకాన్ని మళ్ళీ అనువాదం చేయడం ఎందుకు? అన్నది మాత్రం నాకు అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమయిందా? ఎంతైనా, అనువాదం చేసిన మనుషులకి ఇదివరలో ఒక అనువాదం ఆల్రెడీ వచ్చిన విషయం తెలీకుండా ఉండే అవకాశం లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే –
1) కనీసం అదేమన్నా స్థానిక భాషలోకి అనువదితమైతే, ఇలాంటి ‘తెలియకపోవడం’ జరిగి ఉండొచ్చు. కానీ, అనువదితమైంది ఆంగ్లం లోకి. అందునా, ప్రముఖ రచయిత పుస్తకమూ!
2)ఎక్కడో హైదరాబాదు లో కాలేజీలో చదువుతున్న నాకే ఆ అనువాదం దొరికింది అప్పట్లో. మరి, ఆల్రెడీ రచనా వ్యాసంగంలో ఉన్న కన్నడిగులకి దొరక్కుండా ఉంటుందా?

నిజానికి, లిటరరీ రివ్యూలో ఎక్కడన్నా రీడర్స్ కామెంట్స్ సెక్షన్ ఉందేమో చూశా, కనబళ్ళా. కనుక, నా అనుమానాలన్నీ ఇక్కడే వెళ్ళగక్కేసుకుంటున్నా!

Published in: on December 6, 2010 at 10:35 am  Comments (8)  

Frances Inglis కేసు

Frances Inglis – కేసు గురించి ఇవాళ హిందూ పేపర్ లో హసన్ సురూర్ వ్యాసం చదువుతూ ఉన్నాను – అప్పుడెప్పుడో పోయిన సంవత్సరం నాటి నికేతా మెహతా కేసు గుర్తొచ్చింది.  దీనికీ దానికీ బహుశా ఏ విధమైన సంబంధమూ లేదేమో – కోర్టు పరంగా. కానీ, రెంటినీ – కోర్టూ, సంఘమూ అంతగా హర్షించలేకపోతున్నందుకేమో – నాకు వెంటనే ఆ కేసు గుర్తొచ్చింది.

ఫ్రాన్సెస్ సంగతికొస్తే – మెదడు పూర్తిగా దెబ్బతిని, కోలుకుంటాడన్న ఆశకూడా లేని తన ఇరవై రెండేళ్ళ కొడుక్కి – విషపూరితమైన హెరాయిన్ ఇచ్చి – అతని చావుకి కారణమైంది. తన పరంగా – ఆమెకి కొడుకు ఇక లేడన్న దుఖం ఐతే ఉంది కానీ, తను చేసింది తప్పు అని అనుకోవట్లేదు. అయితే, బ్రిటన్ లో యుథనాషియా తరహా చట్టాలు కాస్త స్ట్రిక్ట్ కనుక, ఈమెని నేరస్థురాలిగానే లెక్కగట్టొచ్చు. అక్కడ నాకు వింతగా అనిపించిన విషయం ఏమిటీ అంటే – ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ఆమెని నిందించట్లేదు. వాళ్ళందరూ ఈ చర్యని అంగీకరించినట్లే ఉన్నారు. ఎటొచ్చీ కోర్టే… సమాజంలోనూ వివిధ పార్శ్వాల నుండి కూడా ఆమెకి సపోర్ట్ వెల్లువెత్తుతోంది – ఈ వార్తలు చూడబోతే – కోర్టు తప్ప అందరూ ఆమె బాధని అర్థం చేస్కుని సానుభూతితో ఉన్నట్లు ఉంది.

నాకర్థం కానిది ఏమిటి అంటే – ఇలాంటి విషయాలలో (Moral Questions) – కోర్టు న్యాయంగా అయితే ఇలా చేయకూడదు అని ఆమెని శిక్షించడం సబబా? అని. అంటే, ఆమె ఏ విధంగా అయినా ఒక శిక్ష అనుభవించాల్సిందేనా? కొడుకు బ్రతికి ఉంటే – అదొక విధమైన బాధ. కొడుకు చనిపోతే – కొడుకు పోయాడన్న బాధకి తోడు కోర్టు బాధ.

మెర్సీ కిల్లింగ్ – పేరుతో అమానుషంగా చంపేస్తే – అదెలా కనుక్కుంటాము? అన్న అనుమానంతో అక్కడ మెర్సీ కిల్లింగ్ లేదా? లేదంటే – అసలు మనం ఒకళ్ళని చంపరాదు..వాళ్ళే చావాలి… అన్న ప్రిన్సిపులా?
అయ్యా – నన్నడిగితే, ఒక్కోసారి – కొందరి బాధను తల్చుకుంటే – వీళ్ళు చనిపోవడమే నయమేమో అనిపిస్తుంది. కానీ, అనిపించాల్సింది నాక్కాదు. వాళ్ళకి. వాళ్ళకే అనిపిస్తే – అప్పుడన్నా వాళ్ళకా స్వేచ్ఛ ఉండాలి కదా. ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ ఎందుకొచ్చిన కాంప్లికేషనని ఇటు ఇంగ్లండ్ నుంచి స్విట్జర్లాండ్ వెళతారంట – అక్కడో సూసైడ్ క్లినిక్ కి!

నాకు నచ్చిన అంశం ఏమిటీ అంటే – ఆవిడకి సమాజంలో అంత సపోర్టు దొరకడం. అది చాలా అరుదుగా జరుగుతుందేమో కదా – మన సమాజం మోరల్స్ అంతగా సమర్థించని ఓ పని చేసినా కూడా మనకి సపోర్టు దొరకడం…

కోర్టు ఆమెని శిక్షించడం మాత్రం నాకేం నచ్చట్లేదు. ఇంతమంది సపోర్ట్ పొందుతున్నందుకైనా కోర్టోసారి ఆ నిర్ణయం పై పునరాలోచించాలేమో.

ఇక – మళ్ళీ సందేహం మొదలు – మెర్సీ కిల్లింగ్ ఎందుకు లీగల్ కాదు. అసలు ఎందుకు అది మోరల్ గా కరెక్ట్ అవకూడదు..ఇలా..
ఆ తర్వాత: If its a moral question – who should decide the right or wrong – public or court? Who is right? How to judge?
అని మళ్ళీ సందేహాలు.

ఆమె శిక్షని కోర్టు వెనక్కి తీసుకుంటే బాగుండు.

Published in: on January 29, 2010 at 8:19 am  Comments (3)  

Sumangali Seva Ashram – లో కాసేపు

బెంగళూరొచ్చాక చుట్టుపక్కల విషయాల్ని పట్టించుకోడం మానేసినట్లైంది నాకు. అలాంటిది, శనివారం “సుమంగళి సేవా ఆశ్రమం” కి వెళ్ళిరావడం – కొత్త ప్రపంచం చూసిన అనుభూతి కలిగింది. నా కొలీగ్ అక్కడేదో ప్రాజెక్టు చేస్తున్నానని చెప్పడంతో మొదలైంది నాకు దీని గురించిన తొలి పరిచయం. అలా అపుడప్పుడు దీని గురించి తెలుసుకుంటూ ఉండగా – ఓ సందర్భంలో వీళ్ళ ఆశ్రమం కి అనుబంధ పాఠశాల గురించి చర్చకు వచ్చింది. ఇక్కడ ఏమన్నా టీచింగ్ వాలంటీర్ల అవసరం ఉందా? అని సందేహం కలిగింది నాకు. పాత “ఆషాకిరణ్” రోజులు గుర్తొచ్చి. ఉందనుకుంటాను అని అనడంతో, ఓ సారి వస్తానన్నాను నేను కూడా. అలా అనుకున్న దాదాపు నెలన్నర తర్వాత ఇన్నాళ్ళకి వెళ్ళాను.

1975 లో సుశీలమ్మ అనే ఆవిడ స్థాపించారట ఈ ఆశ్రమాన్ని. ఇప్పటికీ ఆమె అక్కడే ఉంటున్నారు. నేను వెళ్ళినప్పుడు బైటకి వెళ్ళారు – దాంతో కలవడం కుదర్లేదు. త్వరలో మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నా.

నేనేదో చిన్న స్కూల్-ఒక హాస్టల్ వంటి సెటప్ ఊహించుకుని వెళ్ళానా? అదో మినీ సామ్రాజ్యం. స్కూల్ ఉంది. పెద్ద హాస్టల్ ఉంది. ఒక అమ్మాయిల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ తరహా ది ఏదో ఉంది. ఇతర ఎన్జీవోలు వగైరాతో కలిసి ప్రదర్శనలు అవీ ఇచ్చే స్టేజీ ఉంది. వీటన్నింటి మధ్యలో చిన్న కుటీరం లాంటిది ఒకటి ఉండింది. చూడ్డానికి చాలా హాయిగొల్పేదిగా ఉంది. ఇక ఉండేందుకు ఎంత బాగుంటుందో అనుకున్నా – అది వాళ్ళ ఆఫీసట!! లోపల కాసేపు తిరిగాము – వీళ్ళ కిచెన్ – రోజూ దాదాపు నూటయాభై మందికి వండి పెట్టే ఎన్జీవో కిచెన్ ఎలా ఉంటుందో? అనుకున్నా – అక్కడ ఎక్విప్మెంట్ అంతా ఆధునికంగానే ఉన్నాయి. కాస్త వెనక్కి వెళ్తే, పిల్లలు బట్టలు ఉతుక్కుంటూ, కట్టెలని మండించి దానిపై ఓ పెద్ద గంగాళంలో వేణ్ణీళ్ళు పెట్టుకుంటూ, తయారౌతూ, కనిపించారు. అన్ని వయసుల వాళ్ళూ ఉన్నారు. ఇంతమంది కనుక నీటి సమస్య ఉంటుంది కదా – వీళ్ళు తలస్నానం చేసే పద్ధతి చూస్తే, అర్థమైంది అది. అలాగే, చాలా మంది చిన్న పిల్లలకి కురచ జుట్టు – నీటి సమస్య ప్రభావం అని నా కొలీగ్ చెప్తే వెలిగింది.

పిల్లలు తమంతట తాముగా బ్రతకడం క్రమంగా తెలుసుకుంటారు ఇక్కడికొచ్చాక అంటూ ఓ పిల్లని చూపిస్తూ నా కొలీగ్ చెప్పుకొచ్చింది – మూణ్ణెల్ల క్రితం ఈ పిల్ల (చిన్నమ్మాయే… ఆరేడేళ్ళు ఉండొచ్చు) ఇక్కడకి వచ్చినప్పుడు ఏం తెలీకుండా ఉండేది. ఇప్పుడు తనంతట తాను చాలా పనులు చేస్తుంది అని. అలాగే, కాస్త పెద్ద పిల్లలు చిన్న పిల్లల బాగోగులు చూస్కోడం వగైరా – హాస్టల్ లో బ్రతకడానికి అలవాటు పడిపోతారన్నమాట. ఆదివారం పేరెంట్స్ మీటింగ్ అట. ఇక్కడి రెసిడెంట్స్ లో, అనాథ బాలికలతో పాటు, ఊర్లు తిరుగుతూ ఉండే రోజుకూలీల పిల్లలు కూడా ఉంటారట – ఈ మీటింగ్ గురించి తెలిసినప్పుడు ఈ సంగతి తెలిసింది. మామూలుగా చూస్తే, వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది ఇక్కడ నాకు. బక్రీద్ అని స్కూల్ కి సెలవట. కనుక, పిల్లలు అటూ ఇటూ ఊరికే తిరుగుతూ ఉన్నారు. హాస్టల్ అమ్మాయిలకి మాత్రమేనట. ఒకటి నుండీ ఏడు తరగతుల దాకా స్కూల్ లో అబ్బాయిలు కూడా ఉంటారట. హాస్టల్ అమ్మాయిలకి మాత్రమే. ఎనిమిది-పది తరగతుల వరకు స్కూల్ కూడా అమ్మాయిలు మాత్రమే. చుట్టుపక్కల ఇతర ఎన్జీవోలు వాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయట. లోగుట్టు నాకు తెలీదు కానీ, నేను చూసినంతలో నాకు ఈ సంస్థ గురించి మంచి అభిప్రాయమే కలిగింది.

నేనక్కడున్నప్పుడే, ఓ స్కూల్ పిల్లలని ఇక్కడికి విజిట్ కి తెచ్చారు వాళ్ళ టీచర్లు. టిపికల్ కాన్వెంట్ స్కూల్ పిల్లలు. చూడగానే – తేడా స్పష్టంగా తెలిసొచ్చింది నాకైతే. తమ కమ్ఫర్ట్ జోన్ కి ఆవల కూడా జీవితం ఉంది అని చిన్నవయసులో వాళ్ళకి ఎంత మాత్రం అర్థమౌతుందో కానీ, ఒక విధంగా ఇదీ మంచికే.

ssa వాళ్ళ స్కూల్ సంగతి – నేను వచ్చిందే దానిపై ఆసక్తితో – నాకు మహా అనుమానంగా ఉండింది మొదట్నుంచీ – ఈ స్కుల్లో టీచర్లెవరు? అని. ప్రభుత్వ టీచర్లట – అయితే, ఏడో తరగతి దాకా ప్రభుత్వం సాలరీ. మిగితా వారికి సంస్థ సాలరీ ఇస్తుందట. స్కూల్ అయ్యాక హోమ్వర్క్ గట్రా ఎవరు చేయిస్తారు? అంటే, నాకర్థమైనంతలో ఇక్కడ పెద్ద సాయం ఏం ఉండదనుకుంటాను పిల్లలకి. వార్డెన్లు వారూ చెప్పగలిగినా, పెద్ద తరగతుల పిల్లలకి సాయం దొరకడం కష్టంగా ఉందట. దీనికి వాలంటీర్ల కోసం చూస్తున్నారట. కన్నడం నాకు రాకున్నా, పిల్లలకి తెలుగు అర్థమౌతుంది కనుక, ఒకళ్ళిద్దరితో మాటలు కలిపాను. ఓ నాలుగో తరగతి పిల్లని మీకే సబ్జెక్టులు ఉంటాయంటే – కన్నడ, పరిసర విజ్ఞాన, గణిత, ఇంగ్లీషు అన్నది. సోషల్? అంటే లేదు అన్నది. ఇంగ్లీషు లో ఏం చెప్తారు? అన్నా. కన్నడ అన్నది. ఏం చెప్పేది? కొంతమంది తెలుగును ఇంగ్లీషులో మాట్లాడతారే… అలా…ఇక్కడ ఇంగ్లీషుని కన్నడలో చెబుతారట! పెద్ద క్లాసు పిల్లలకి గణితం-సైన్సు చెప్పడానికే కాదు. మొదట్నుంచీ చివర్దాకా ఈ పిల్లలకి ఇంగ్లీషు నేర్పడానికి కూడా మనుషులు అవసరం ఏమో అనిపించింది.

ప్రభుత్వ పాఠశాలల టీచర్ల గురించి కాసేపు అనుకున్నాము. అలాగే, ఏవిటో, మనదేశంలో ఈ సైడ్ రావడానికి మోటివేషనే ఉండదు – బాగా చదువ్కున్న వారు ఎపుడైతే ఇలా పాఠాలు చెప్పేందుకొస్తారో, అప్పుడు గానీ, ఇలాంటి పాఠశాలల పరిస్థితి బాగుపడదు అనిపించింది నాకైతే. ఈ విషయాల గురించి అక్కడ ఆఫీసులో మాట్లాడాలనుకున్నాను. వాలంటీర్లు కావాలంటే – ఏం చేసేందుకు? పాఠాలు చెప్పేందుకు మీకు మనుష్యులు అవసరం అనిపిస్తోంది, అలాగే… ఈ పిల్లలకి కాస్త exposure- అవసరం వంటి సంగతులు… కానీ, మేము కలవాలనుకున్న మనిషి లెకపోడంతో వెనక్కొచ్చేశాము. మళ్ళీ వెళ్ళాలి.

వీళ్ళకి ఫండ్స్ అవీ పర్లేదు – మనుషులే అవసరం ఏమో అని నా అభిప్రాయం. అలాగే, ఈ పిల్లలకి కాస్త బైట ప్రపంచం తెలీడం కూడా చాలా అవసరం అనిపిస్తోంది. ఈ ప్రాంగణం నుండి వీళ్ళు బైటకి వెళ్ళేది చాలా తక్కువట. ఈ కాలంలో ఇలా ఉంటే, చివర్లో స్కూల్ జీవితం ముగిశాక చాలా కష్టమవొచ్చు – అసలే ఆడపిల్లలు మాత్రమే ఉంటారు తమ స్కూల్లో, తమ చుట్టుపక్కల కూడానూ.

వీళ్ళ వివరాలు:
Sumangali Seva Ashrama
Cholanayakanahalli
R.T.Nagar Post
Bangalore-560032
Phone: 65301393/65301388

ఎలా వెళ్ళాలి: బళ్ళారీ రోడ్డుపై కనిపించే హెబ్బాళ్ బస్టాపు వద్ద ఎవర్నడినా చెప్తారు. అసలు బస్టాపు పక్కనే ఓ రోడ్డులో తిరిగాము…రోడ్డు పేరే SSA Road.

Published in: on November 30, 2009 at 9:00 am  Comments (7)  

Confusion …Confusion!

ఇవాళ ఈనాడు పేపర్లో ఒక చిన్న వార్త ఉండింది. హైదరాబాద్ లోకల్ ఎడిషన్లో చూసినట్లు గుర్తు. ఈనాడు సైటులో నుండి ఈ వ్యాసానికి లంకె ఇద్దామని చూసాను కానీ, వ్యాసం పేరు గుర్తు లేక..వెదకలేకపోయాను. ఈపేపర్ నుండి దిగుమతి చేసిన పీడీఎఫ్ ఇక్కడ. ఇంతకీ విషయం ఏమిటంటే :

పాత కాలం నాటి తెలుగు పత్రికలన్నీ (ఆంధ్రపత్రిక పేరైతే గుర్తుంది. మిగితావి గుర్తు లేవు. నేను ఆ వ్యాసాం చాలా క్యాజువల్ గా చూసి వదిలేశా నిజానికి) డిజిటైజ్ చేస్తున్నామనీ, త్వరలో ప్రెస్ అకాడెమీ వారి వెబ్సైటులో అవన్నీ పెడతామనీ ఆ వార్తలో అన్నారు. అక్కడ ఇది ప్రారంభిస్తున్న దృశ్యం కూడా ఉంది. చదివి, ఓ…మంచి ఆలోచనే..అనుకున్నా. ఇప్పుడు ప్రెస్ అకాడెమీ వెబ్సైటు కోసం వెదుకుతూ ఉంటే, నాకు 2004 నాటి మరో వార్త – హిందూ పత్రిక పేజీల్లో కనబడ్డది. (అది ఇక్కడ.)

అంటే…ఐదేళ్ళ బట్టీ వీళ్ళు… చేద్దాం అనుకుంటూనే ఉన్నారనా? లేక…మధ్యలో ఏమన్నా ఐందా? పైగా, అప్పటి న్యూసైటెం లో “The academy had already taken up digitisation of old newspapers on a small scale and so far about 16 lakh pages had been digitised. A sum of Rs. 18 lakhs had been spent so far and the academy intended to take up a massive digitisation project covering all major newspapers and weeklies published from the State. A grant of Rs. 30 lakhs had been made to the academy, he said. ” అన్నారు. “He said all newspapers which would be digitised would be preserved and compact discs would be made. This would involve about Rs. 1 crore, he said adding the academy was serious about going ahead with the project.” అని కూడా అన్నారు.

ఇప్పుడేమో మళ్ళీ అరవై లక్షల నిధులు మంజూరు చేసారంట! వీళ్ళ పనే బాగుందే! అనుకున్నా.

ఇంతకీ, నాది ఇంకో సందేహం…ఇవన్నీ చేసి, నిజంగానే ఈ బాలారిష్టాలన్నీ దాటుకుని, ఆ కోట్లన్నీ తగలేసి దానిలో ఎంతో కొంత నిజంగా దీనిపై ఖర్చుపెట్టి మన వాళ్ళు దాన్ని ఆ ప్రెస్ అకాడెమీ వెబ్సైటేదో (నాకు కనబళ్ళేదు ఇంకా)..అందులో పెట్టారనుకుందాం…మనమెలా చదువుకోవాలన్నట్లు? ఏదో 1940 మార్చి ఐదున ఏం జరిగిందో మనకి అవసరమంటారా? లేక, ఫలానా సభలో ఫలానా వారేమన్నారో? అన్న విషయం కోసం వెదుకుతామా? – అంటే, నా ఉద్దేశ్యం – Search సౌలభ్యం ఉండాలి కదా అని. వీటన్నింటికీ సర్చి సౌకర్యం ఎప్పటికొస్తుందో లెండి, అది వేరే విషయం. కౌముది వారు ఇదివరలో వాళ్ళ పీడీఎఫ్ ఫైళ్ళలో keywords index చేయడం ద్వారా శోధన కొంతవరకూ పెట్టారు. (ఇది సెప్టెంబర్ 2007 ప్రాంతంలో వారి సైటులో ఉన్న ప్రకటన. అప్పట్లో వారిని ఏం చేస్తున్నారని సంప్రదిస్తే, yuyam వెబ్సైటు వారి ద్వారా ఇది చేస్తున్నామని చెప్పారు.

ఏమిటో… ముందు 2004 లో లక్షలు పోసిన వాటికి కాళ్ళొచ్చి ఎటుపోయాయి? అని అడిగితే చెబుతారంటారా?

Published in: on May 19, 2009 at 10:52 am  Comments (1)  

ఇది నాస్తికత్వమెలా ఔతుంది?

ఈ ప్రపంచికం లో మతాలకేం కొదువ? హిందూ మతం…క్రిష్టియన్ మతం, ఇస్లాం, బుద్ధిజం, సిక్కిజం, జైనిజం, Zorastrianism, బహాయ్ మతం, కంఫ్యూజియనిజం, Judaism, Shintoism…వగైరా వగైరా బోలెడు మతాలున్నాయి….  నా వరకు నేను అర్థం చేసుకున్న మతం – అదొక జీవన విధానం అన్న అర్థం లో. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి మతాలు వాళ్ళవి అన్నట్లు ఉన్నా ఇన్ని రోజులూ. ఈరోజు ఈ బ్లాగు రాస్తా అనుకోలేదు కానీ… ఇక ఉండబట్టలేక బహిరంగంగా గోడు వెళ్ళబోసుకుంటున్నా 🙂

ఏం చెప్పమంటారు? ఏమిటో… నాకీ మధ్య “మానవ సేవే మాధవ సేవ” అన్న మాటలు మునుపెన్నడూ లేనంత నిజం అనిపిస్తున్నాయి. “దేవుడెక్కడో లేడు… నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు… మనందరిలో ఉన్నాడు” అన్న భావన ఎక్కువైంది… ఈ ప్రభావం లో ఈ పూజలూ, పునస్కారాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది.  మామూలుగానే ఎప్పుడో మా నాన్న ఉన్నప్పుడు తప్ప నేనెప్పుడూ పెద్దగా రిలీజియస్ కాదు…నాకు గుర్తున్నంత వరకూ. చిన్నప్పుడు అయితే, ఆయన నేర్పేవాళ్ళు కనుక ఏదో ఆ శ్లోకాలు అవీ చదవడం వంటివి చేసేదాన్ని. కానీ, ఇటీవలి కాలం లో గుళ్ళకు వెళ్ళడం కూడా ఏదో ఓ ఔటింగ్ లాగా, కాస్త రిలాక్సేషన్ కోసం ఆ వెళదాం అన్న వాళ్ళతో వెళ్తున్నా కానీ… మరింకే కారణానికీ కాదు…. ఈ విషయం పైనే రెండు రోజులుగా నా స్నేహితురాలితో చర్చలు. నువ్వు నాస్తికురాలివి అంటుంది ఆమె. నేనెట్ల నాస్తికురాలినౌతాను? (అసలెవరైనా నాస్తికులు కాలేరని నా నమ్మకం. ఏదో ఓ దాన్ని వాళ్ళు విశ్వసిస్తారు కదా…ఆ సిద్ధాంతమే దైవం మరి!) అని నేనంటాను.  మా చర్చ ఇలా ఉంది… యధాతథంగా కాదు కానీ… ఈ విధంగా-

“నేను నాస్తికురాలిని అని ఎవరన్నారు?”

“మరి నువ్వు దేవుణ్ణి నమ్మవు కద?”

“అసలు నేను నమ్మను అని ఎవరన్నారు?”

“మరి పూజలు అవీ ఇష్టం లేదు అన్నావు కదా?”

“అయితే? దేవుణ్ణి నమ్మనా?”

“మొన్నోరోజు విగ్రహారాధన కూడా నచ్చట్లేదు అన్నావు కదా?”

“అవును, అయితే? నాస్తికురాలినా?”

“దేవుణ్ణి నమ్మకపోతే నాస్తికులనే అంటారు!”

“మొదటగా ఒక విషయం – నాకు పూజల మీద ఆసక్తి లేదు అని మాత్రమే అన్నాను. విగ్రహారాధన కూడా అంతే. నాస్తికత్వానికి, వాటికీ తేడా ఉంది.”

“సరే. ఇప్పుడేమిటంటావ్?”

” అంటే నువ్వు నమ్మే దేవుడికి నేను పూజ చేయకపోతే నేను నాస్తికురాలినా? ఈ లెక్కన నీకు క్రిశ్టియన్లు, ముస్లింలు వీళ్ళందరూ నాస్తికుల్లానే కనబడాలే?”

“అలా ఎలా అంటాను? వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ కున్నారు…”

“మరి నా దేవుళ్ళు నాకూ ఉన్నారు.”

“ఎవరు?”

“మీరే…”

“??”

“మానవత్వం ఏ కాస్త ఉన్న మనిషైనా దేవుడే. ఇంకో ప్రాణికి ఉపయోగపడే ఏ ప్రాణైనా దేవుడే. మనుష్యులకు ఉపయోగపడే వస్తువులు కూడా దేవుళ్ళే మరి (దేవుడు చేసిన దేవుళ్ళు అనాలేమో వీటిని…హీహీ)”

“అది వేరు…”

“అదే మరి. నాకు అది వేరు కాదు.”

“ఇంత మంది నమ్ముతున్నారు కదా….”

“నేను వాళ్ళనేమన్నా అన్నానా? నేను ఈ దేవుళ్ళను నమ్ముతా అంటున్నా. ఎవరి మతం వారిది..ఎవరి జీవితం వారిదీ”

– ఇక్కడ ఆగింది ఈరోజుకి.

నా మీద “సత్యమే శివం” ప్రభావం బాగా ఉంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు అనిపించింది ఈ చర్చ ను బట్టి. ఏమైనా, నేను ఒక దాన్ని నమ్ముతున్నాను. ఆ నమ్మకం ప్రకారమే జీవిస్తున్నాను. ఆ నమ్మకం తోనే జీవిస్తాను, ఏదో జరిగి నన్ను బలంగా కదిలించి నా మతం తప్పు అని నిరూపిస్తే చెప్పలేం కానీ. నా మతం వల్ల నా తోటి వారికి జరిగేది మేలే. నా మతం ఆచారాలు(??) నేను పాటిస్తూనే ఉన్నాను. మరి అలాంటప్పుడు నేను నాస్తికురాలినెట్లవుతా? అది కూడా నాకెక్కడా ఏ మతం మీదా ద్వేషం లేనప్పుడు….నాకు దేవుడు ఉన్నాడు అన్న దృఢమైన  విశ్వాసం ఉన్నప్పుడు?

నాకు తెలిసిన సత్యమే నా శివం.  అప్పుడు నాస్తికత్వానికి తావేదీ?

Published in: on September 21, 2007 at 10:55 am  Comments (20)  

మళ్ళీ బడికి!

మా ఆషాకిరణ్ స్కూల్ మళ్ళీ తెరుచుకుంది ఎట్టకేలకు బాలారిష్టాలన్నీ దాటుకుని. నిన్న మూడో రోజు. ఈ వానొకటి తగలడి వరుసగా – సున్నా,రెండు,నాలుగు మంది పిల్లలు ఈ మూడు రోజుల్లో. మళ్ళీ పిల్లల మధ్యకు… “మళ్ళీ బడికి” వెళ్ళడం ఆనందంగా ఉంది. ఈ టపా తో ఓ గేమ్ ని గురించి కొంచెం కారంగా, కొంచెం గారంగా చెప్పడం, మీనుంచి మీకు తెలిసిఉన్నచో పంచుకోవాల్సిన ఓ విషయం తెలుసుకోడం నా ముఖ్య ఉద్దేశ్యం.

నల్గురు పిల్లలు…ఇద్దరు జూనియర్ బ్యాచ్, మిగితా ఇద్దరు సీనియర్ బ్యాచ్. రెండు బ్యాచ్ లకీ రీడింగ్ సెషన్ ఈరోజు. కథలు. ఇదివరకటి కంటే వీళ్ళ Reading skills చాలానే అభివృద్ధి చెందాయి. మంచిదే. దీని ఆషాకిరణ్ కారణం అనేమీ చెప్పలేము. వాళ్ళు ఒక ఏడు పెద్దవారవడం కావొచ్చు, లేకుంటే వాళ్ళ సర్కారీ బళ్ళో నిజంగానే బాగా చెప్పారేమో ఈ మధ్య. ఏదైనా, నాకైతే ఆనందం కలిగింది వాళ్ళ performance కి. సరే, ఓ గంట అలా ఈ పుస్తక పఠనం అయ్యాక “అబాకస్” అని ఒక ఆట మొదలుపెట్టాం… నల్గురు పిల్లలు ఆట. మేము పక్కన చూడ్డం. ఇదేమో snakes & ladders తరహా ఆట. కాకుంటే ప్రతి డబ్బా లోనూ ఏదో లెక్కల సమస్యలు ఉంటాయి… నీ డైస్ పై ఉన్న సంఖ్యల మధ్య తేడాని రెండు తో గుణించి అన్ని గళ్ళు ముందుకు వెళ్ళు అనో, లేకుంటే.. నీ డైస్ పై ఉన్న సంఖ్య ల కూడిక పదైతే ఒక గడి ముందుకు, లేకుంటే మూడు గళ్ళు వెనక్కో..అలా ఏదో. ఒక విధంగా ఈ ఆట పిల్లలలు చాలా ఉపయోగకరం…mental math కోసం. అయితే, సమస్యల్లా ఏమిటీ అంటే – ఇది పూర్తి చేయాలంటే ఓ రోజు పడుతుంది కాబోలు. ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి వెళ్ళడం ఖాయం. ఆటన్నాక మరీ ఇంత పెస్సిమిస్టిక్ గా ఉంటే ఎలా? ప్రతి చోటా – “else move backward…” అన్న కండీషన్ వర్తించే అవకాశాలే ఎక్కువ. మొదట్లో కాసేపు ఇది కాస్త విసుగు పుట్టించింది కానీ, కాసేపయ్యేసరికి మునిగిపోయారు పిల్లలు అందులో. మళ్ళీ రేపు కూడా ఆడదాం అని చెప్పి దుకాణం కట్టేయాల్సి వచ్చింది. 🙂

ఈ ఆట ఆడించే క్రమం లో ఓ పెద్ద సమస్య భాష. ఆ ఆట లో గళ్ళపై అంతా ఆంగ్లం లో రాసి ఉండటం వల్ల పిల్లలు అర్థం చేసుకోలేకపోయారు. మేము పక్కనే కూర్చుని వాళ్ళకి ప్రతిసారీ వివరించాల్సి వచ్చింది. ఎటొచ్చీ వాళ్ళకి దీని వల్ల కూడా కొత్త పదాలు తెలిసాయి…అది వేరే విషయం. కానీ, నాకు తెలియాల్సింది ఏమిటీ అంటే – ఇలాంటి ఆటలు తెలుగు లో రాసి దొరుకుతాయా? అంటే గళ్ళలో అంగ్లం కాక తెలుగు. ఎక్కడా దొరక్కపోతే మేమే తయారు చేస్తాం ఏమో..చెప్పలేను కానీ, ఎంతైనా ఆ కంపెనీల బోర్డుల లుక్ రాదు కదా మేము తయారు చేసిన బోర్డు కి? అందుకని, తెలుగు లో రాసి ఉండేవి దొరికే అవకాశాలుంటే చెప్పండి… కొనుక్కుని ఆషాకిరణ్ కి ఉపయోగిస్తాం. పిల్లలకే ఇంగ్లీషు నేర్పుకోవచ్చు గానీ, వాళ్ళకి తెలుగే కాస్త ఇప్పుడిప్పుడు సరిగ్గా చదవడం, రాయడం వస్తోంది… కనుక కొన్నాళ్ళాగుదాం అని.

మీకు ఈ తెలుగు లో ఇంగ్లీషు ఆటలు (హాహా) ఎక్కడన్నా దొరికే చోటు తెలిస్తే ఇక్కడో కామెంటు రాయండి…

Published in: on September 20, 2007 at 3:24 am  Comments (7)  

ఈ విషయం లో మీ మాట ఏమిటి?

ఈరోజు మళ్ళీ ఆ మూడో ప్రాజెక్టు మీద రెండో ఫీల్డ్ ట్రిప్. అర్థం కాలేదా? ఆషాకిరణ్ వి రెండు ప్రాజెక్టులు గా చూస్తాను నేను. (ఇది నాకు సంబంధించిన AK Activities మాత్రమే. మిగితా విషయాలున్నా నేను పట్టించుకోను) – స్కూల్, మెడికల్ క్యాంప్ లు. మూడోది మొన్న వెళ్ళిన ఫీల్డ్ ట్రిప్ కథ. కొందరు వ్యక్తులు పిల్లల చదువు కి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చారు అని చెప్పిన ట్రిప్ కి ఇది రెండో భాగం. ఇందులో ఓ చిన్న సందేహం ఉదయించింది నాలో. అది ఇక్కడ –

ఒక argument ఏమిటి అంటే – పనిలోకి వచ్చిన పిల్లల్ని మనం మళ్ళీ ఫుల్ టైం చదువులోకి దింపుతున్నప్పుడు ఆ చదువుకయ్యే డబ్బేకాక వాళ్ళ పని ద్వారా వచ్చే డబ్బు ను పోగొట్టుకుంటున్నారు కనుక అది కూడా మనమే ఇవ్వాలి అన్నది. నేనో పట్టాన దీన్ని ఒప్పుకోలేకపోతున్నా. అన్నీ మనమే ఇస్తే ఇక వాళ్ళు చేసేదేముంది అన్నది నా వాదన. వాదన కాదు లెండి…ఆలోచన. నేనేమీ మాట్లాడలేదు ఈ విషయం పై చర్చ జరుగుతున్నంత సేపు. ఊరికే వింటూ ఉన్నా. వాళ్ళకి మనం సాయం చేయాలి కానీ, ప్రతీదీ మనమే చేయడం అంత సబబు కాదేమో అనుకుంటున్నా. అంటే, వాళ్ళు చదువు మానేయడం లో మొదటి కారణం ఆ డబ్బే కానీ, మనం చదువుకే కాక జీవితావసరాలకు కూడా ఇవ్వాలా? అన్నది ప్రశ్న. మీరు ఏమంటారు? ఓ పక్క చదివిస్తున్నాం కదా, వాళ్ళ జీతం కూడా మనమే ఇచ్చుకోవడం అవసరమా? ఒక వేళ ఇచ్చామే అనుకోండి – అలా ఎంతమందికని ఇవ్వగలం? అసలది నాకైతే పర్సనల్ గా అంత మంచి ఆలోచనగా అనిపించడం లేదు. వాళ్ళ బాగు కోసం ఆలోచించినా కూడా వికటించే లా ఉంది ఈ ఆలోచన. మీ అభిప్రాయం ఏమిటి?

Published in: on September 8, 2007 at 6:00 pm  Comments (6)  

మాటసాయం తరువాత?

మా ఆషాకిరణ్ కు చెందిన ఒకానొక మెడికల్ క్యాంఫ్ లో వాలంటీర్ గా నేను ఉన్నప్పుడు …. ఒకానొక అని ఏముంది కానీ .. ఏ మెడికల్ క్యాంప్ అయినా కూడా …. జరిగిన సంఘటన – ఈ రోజు Britta Das అన్న physiotherapist భూటాన్ లో తన అనుభవాల గురించి రాసిన Buttertea at sun rise పుస్తకం చదువుతుంటే గుర్తు వచ్చింది.

మెడికల్ క్యాంప్ కి వచ్చే వారిలో ఆడవారు ఎక్కువే. ఇలా వచ్చేవారు దాదాపు 90 శాతం కూలి పనికి వెళ్ళేవారే అయి ఉంటారు. తక్కిన వారు ముసలి వారు, చిన్నపిల్లలూ నూ. ఈ ఆడవాళ్ళలో చాలా మంది సమస్యలకు మూలం – సరైన ఆహారం లేకపోవడం లేదా, వారి శక్తి కి మించిన బరువులు ఎత్తడమే. దీనికి పరిష్కారమంటూ బలానికి ఏవో మాత్రలు ఇచ్చినా కూడా వారికి చివరగా “సరిగా తినండి, మరీ శక్తికి మించిన పని చేయకండి” అని చెబుతూ ఉంటారు వాలంటీర్లు, డక్టరూ.

అలా చెప్పడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వినరు. వినరు అనే కంటే పరిస్థితులు వారిని విననివ్వవు అని చెప్పొచ్చు అనుకుంటా. ఇబ్బందిగా నవ్వి వెళ్ళిపోతారు. కానీ, అంతకంటే ఏమీ చెప్పాలో కూడా అర్థం కాదు నాకైతే. ఒక విధమైన నిస్సహాయత ఆవరిస్తుంది అది చూస్తూ ఉంటే. మాట సాయం మినహా చేయగలిగేదేమీ ఉండదు. కానీ, ఏమన్నా చేయలేమా వీరికోసం అన్న ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది.

ఈ రోజు Britta Das అనుభవాలు చదువుతూ ఉంటే ఎందుకో గానీ ఆ నిస్సహాయతే గుర్తు వచ్చింది నాకు.ఎప్పటికన్నా ఈ పరిస్థితి మెరుగుపడాలి అని ఆశావహ దృక్పథం తో ఎదురుచూట్టం కన్నా చేయగలిగేది ఏమన్నా ఉందా?

Published in: on May 26, 2007 at 1:53 pm  Comments (4)