గత భాగం ఇక్కడ.
దుక్కలాంటి గాడిద సైజులో భయం, బక్కచిక్కిన కప్ప సైజులో ధైర్యం నాకు తోడుగా ఉండేందుకు వచ్చారన్నమాట. ఇదేదో అంతరిక్ష గూడుబుఠాణీలా (cosmic conspiracy అనమాట) ఉందనిపించింది. …
సాయం కోసం నోరు విప్పాలా, కళ్ళు మూసుకుని తప్పించుకున్నాననుకోవాలా? అన్నది అర్థం కాలేదు నాకు. భయం ముందుకొచ్చేసి నా పక్కనే నిలబడింది. ఎండ వల్ల ఆ నిలబడ్డమే నాకు గొడుగులాగ నీడనిచ్చింది. పైగా ఆ కప్పని కాలితో తన్ని నీళ్ళలోకి తోసేసింది.. కప్పలు సముద్రంలో ఉండగలవా? అన్న అనుమానం ఓ పక్క…కావాలనే ధైర్యాన్ని భయం చంపేస్తోందా? అన్న అనుమానం మరోపక్కా ఉన్నా, కిక్కురుమనకుండా ఏం జరుగుతోందో అని చూస్తూ ఉన్నా. భయం నీడలో నేను, నా తోడుగా భయం, నీళ్ళలో కా.పు, నిశి, ధైర్యం. ఇదీ సీను.
కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. నోరు విప్పినా వినేవాళ్ళు లేరు కనుక, కళ్ళు మూసుకుని తప్పించుకున్నానన్న భ్రమలో పడితే కాలక్షేపం అవుతుందని తీర్మానించుకున్నాను. కళ్ళు మూయగానే, చిన్నప్పుడు అలా కళ్ళు మూయగానే మీదకి పొడుచుకువచ్చేవి..ఆ పిల్ల భూతాలు కనబడ్డాయి. ఉలిక్కిపడి కళ్ళు తెరిస్తే, ప్రశాంతంగా నవ్వుతున్న భయం.
“చాలా రోజుల బట్టీ చూస్తున్నా, నన్ను తప్పుకు తిరుగుతున్నావు” – ప్రసన్న వదంతోనే అన్నది భయం.
“ఊ” అన్నాను నేను సంభాషించడం ఇష్టం లేక.
“రోజూ నేను ముసుగు తన్నేదాకా నువ్వు ముసుగేసుకుని పడుకోవడం, నా కంటపడకూడదని గడియ వేసుకుని గదిలో కూర్చోవడం చూళ్ళేదనుకున్నావా?”
“అబ్బెబ్బే..” అన్నాన్నేను మొహమాటపడుతూనే దీనికెలా తెలిసిపోయిందా? అని ఆశ్చర్యపడుతూ.
“ఏమైనా నువ్వు విచిత్రమైన మనిషివి. ఓ పక్క నాతో సహజీవనం చేస్తూనే నన్ను తప్పుకు తిరుగుతావు. ఎందుకు?”
“నాకు ఎండ కావాలి”
“నీ తింగరివేషాలొకటి ఉన్నదానికితోడు” అని విసుక్కుంది భయం.
“నాకు ఎండ కావాలి”
“అంటే నన్నెళ్ళిపొమ్మనే కదా?” అంటూ పక్కకి జరిగిందది.
నేను ఒక్క ఉదుటున పైకి లేచి ఒళ్ళు దులుపుకున్నా. నిజం చెప్పేయడం నయం అనుకున్నా. గాఢంగా ఊపిరి పీల్చుకుని –
“సరే, నిజం చెబుతాను. నేను రోజంతా నిన్ను తల్చుకోవడం నిజమే. నీకోసమే కుదిరినప్పుడల్లా చీకటిని కౌగిలించుకోవడమూ నిజమే. కానీ, నీతో మాట్లాడ్డం మట్టుకు ఇష్టం లేదు.”
“ఎందుకు? ఎవరూ నాతో కలిసి ఉండేందుకు ఇష్టపడరు, నా గురించి మాట్లాడుకుంటూంటారు గానీ. నువ్వేమో కలిసి ఉండాలంటావు. మాట్లాడకూడదంటావు. నా గురించి ఎక్కడా ఎవరికీ చెప్పవు”
“నేనంతే”
రెండడుగులు ముందుకేసాక మళ్ళీ ఇసుకలో కూర్చోవాలి అనిపించింది. కూర్చుని ఇసుక వైపు చూస్తూంటే గవ్వలు కనబడ్డాయి.ఏవో రెండు గవ్వలు ఏరాను. మట్టి అంటుకుని ఉండటంతో ఉఫ్- మని ఊదాను.
“గవ్వలు! నాకవంటే ఎంతో ఇష్టం” అన్నది భయం తన్మయత్వంతో.
మరి నాలుగేరాను ఈ పాటికి. “ఏ రంగువి ఇష్టం?” అన్నాను
“అన్నీ ఇష్టమే. చిన్నవి ఎక్కువ ఇష్టం. వాటిలో నల్లటివి మరీ ఇష్టం” ఆశగా చెప్పింది.
“నేను ఏరిన నాలుగులో రెండు నల్లవి. వెనక్కి తిరిగి మాట్లాడకుండా దోసిలి చూపించాను”
ఇలా చూడగానే అలా నాలుగూ తీసేసుకుంది. వెంటనే మళ్ళీ ముందుకు వంగి, “నాకు ఇస్తావా?” అని అడిగింది నా చేతిలో పెట్టేస్తూ.
“నీకోసమే. ఇంకా కావాలా?”
“వద్దులే… నీకెందుకూ శ్రమ.. నేను ఏరుకుంటా తరువాత” అంది భయం మొహమాటపడుతూ.
“మొహమాటం ఎందుకు?” అంటూ మరిన్ని ఏరడం మొదలుపెట్టా. పైకి ఏం అనకపోయినా భయం ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో నన్ను ఇక ఆపదు అని క్రీగంట చూశాక అర్థమైంది.
కొంచెం కొంచెంగా ఎండ తగ్గుతోంది. దానితో సరిగ్గా కనబడ్డం లేదు నల్లటి గవ్వలు. నేను కొంచెం దీక్షగా చూడాల్సి వస్తోంది. ఇసుకలో పాకుతూ ఒకటీ అరా కనబడ్డప్పుడు ఏరుతూ ముందుకీ వెనక్కీ తిరుగుతూ ఉన్నాను. గుప్పెడు నిండితే వెళ్ళి దానికి ఇచ్చేద్దాం అనుకున్నాను.
“తెల్లటివి కూడా ఏరేదా?” అన్నాను, తెలుసుకుందామని.
“ఎందుకూ నువ్వు ఇంత కష్టపడ్డం? నాక్కావాలంటే నేను ఏరుకుంటా కదా”
“తెల్లటివి కూడా ఏరేదా?”
కొన్ని క్షణాల మౌనం తరువాత – “సరే ఏరుకో. పిల్లలకి పంచుతా ఇంట్లో” అంది నిర్లిప్తంగా.
తెల్లవి కూడా ఏరడం మొదలుపెట్టాక కొంచెం సక్సెస్ రేట్ పెరిగింది ఇసుక రేణువుల్లో చిన్ని గవ్వల్ని వెదుక్కోడంలో. దానితో వేగం పెరిగింది.
అయినా, గుప్పెడంత గవ్వలు రావడానికి చాలా సమయం పట్టింది. అంతసేపు అలా ఆ ఫోజులో కూర్చున్నందుకు ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. నెమ్మదిగా లేచి ఒళ్ళు విరుచుకుంటూ అక్కడే కూర్చుని చోద్యం చేస్తున్న భయం ముందు నా జేబురూమాలు పరచి దాని మీద గవ్వల్ని రాసిలా పోశాను. దాని కళ్ళలో మెరుపు. “థాంక్స్. చాలా థాంక్స్” – నిజాయితీగానే అన్నట్లు అనిపించింది నాకు. నేను కొంచెం బలం పుంజుకున్నట్లు అనిపించింది. నాకు భయానికీ మధ్య ఉన్న అసమానత కొంచెం తగ్గినట్లు అనిపించింది. దానితో నాకో ఆలోచన వచ్చింది. పట్టిన చెమట్లు తుడుచుకుంటూ, ఇంకొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఏరడం మొదలుపెట్టాను. ఇలా కాసేపు సాగింది. నేను ఏరడం, వీలైనప్పుడు వెళ్ళి దాని ముందు గవ్వలు పోయడం…మళ్ళీ రావడం. కొంచెం సేపయాక అలసట. అసలుకైతే అలాగే ఇసుకలో పడిపోయి కాసేపు పడుకుంటే బాగుండు అనిపించింది. కానీ, నేను ఊహించినట్లు జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నన్ను తిన్నగా నిలువనీయలేదు.
కళ్ళు బైర్లు కమ్మడం మొదలైంపుడు ఒకసారి ఆపి వెనక్కి తిరిగి చూశాను. ఆ గవ్వల సంఖ్య పెరిగే కొద్దీ భయం సైజు తగ్గుతూ ఉండడం నేను గమనించాను, అది గమనించకపోయినా. ఇపుడు అది నన్ను అటాక్ చేసే స్థితిలో లేదేమో అనిపించింది. అది కూడా గవ్వల్ని చూసుకుని మురిసిపోవడంలో నన్ను పట్టించుకోలేదు. దానితో, ఏదైతే అది అయిందని, పైకి లేచి మసకబారిన కళ్ళతోనే సముద్రం వైపుకి తూలుతూ నడవడం మొదలుపెట్టాను. కళ్ళు మూతలు పడుతున్నాయి. అడుగులు తడబడుతున్నాయి. అసలీ స్థితిలో నీళ్ళలోకెళ్ళి ఏం చేయలని? అని నన్ను అడగడానికి అక్కడ ఎవరూ లేరు కదా. పైగా నాకు ఈత కూడా రాదు. భయం నన్ను మింగేసేలోపు ఎక్కడికైన మాయం కావాలి – కానీ అసలెక్కడున్నానో తెలీదు కనుక ఎక్కడికీ పోలేను. వెనకున్న గొయ్యికన్నా ముందున్న నుయ్యి నయం అనిపించిందో ఏమిటో… చివరికి నీళ్ళ దగ్గరికి వచ్చేశా. కాలికేదో తగిలింది.
మూసుకుంటున్న కనురెప్పల్ని బలవంతంగా తెరుస్తూ కిందకి చూడబోతూండగా కనబడ్డాడు ఎదురుగ్గా ఆరడుగుల యువకుడు! రెండడులైనా దూరం లేదు మా మధ్య. ఇంతలో అంత దగ్గరగా ఎలా వచ్చాడు? ఎవరితను? అసలు ఇప్పటిదాకా మనుషులెవరూ కనబడలేదు కదా! అతను నా వైపుకి ఆరాధనాభావంతో చూస్తున్నాడు. “వామ్మో, ఆ చూపేంటి? వీడికేం అర్థమైందో నా అవస్థ చూసి” అనుకుంటూ ఉండగా నా అలసట కాసేపు ఎగిరిపోయి నాకు ఆలోచించే శక్తిని ఇచ్చింది. కళ్ళు కూడా నాక్కలిగిన ఉలికిపాటు వల్ల కునుకు తీయడం ఆపాయి.
“మీరు…నువ్వు…ఎలా వచ్చావు??” అన్నాను ఏమనాలో తోచక.
“నీ వల్లే!” అన్నాడు అతను అదే ఆరాధనాభావంతో.
నేను అయోమయంగా చూస్తూండతం తో అతను “frog prince” కథ ఎప్పుడూ చదవలేదా? అన్నాడు.
“చదివాను కానీ…నేనసలు ఇందాక ధైర్యాన్ని ముద్దుపెట్టుకోలేదు కదా..”
అతను నిండుగా నవ్వేసి “అదా… ఇందాక భయం నన్ను తన్నాక నేను ఆ నీళ్ళు మరీ ఉప్పగా ఉండటంతో అక్కడ ఉండలేక అవస్థ పడుతూ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నా అప్పట్నుంచీ. నువ్విలా నడుస్తూ వచ్చి నీ కాలు నాకు తగిలేసరికి, నా పూర్వ రూపం వచ్చేసింది. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీడం లేదు” అన్నాడు.
“అంటే నువ్వు ధైర్యానివా?”
“అవును”
“అయితే, కథలో లాగ నన్ను పెళ్ళాడి శాశ్వతంగా నాతో ఉండిపోతావా?” అని ఆశగా అడిగాను. అతగాడు అందగాడే కానీ, నేనడిగింది అందుక్కాదు. ఎక్కడ అడుగేయాలన్నా ధైర్యం నాకు అవసరం కనుక!
“చ చ… నిన్నా? నో నో!” అని వికారంగా మొహం పెట్టి అనేసి మళ్ళీ “సారీ, నా ఉద్దేశ్యం అది కాదు” అన్నాడతను మళ్ళీ కొంచెం బాధపెడుతూ.
“మరి ఏది నీ ఉద్దేశ్యం” అన్నా చిరాగ్గా, నా నిరాశను కప్పి పెట్టుకుంటూ.
“భయాన్ని తాత్కాలికంగా ఏమార్చగలిగిన ఓ భయస్తురాలు నన్ను తాకితే శాపవిమోచనం అవుతుందంటేనూ… అది నువ్వే అని తెలిసి నువ్వు ఇక్కడికి ఎప్పుడొస్తావా? అని అప్పట్నుంచి ఎదురు చూస్తూ ఉన్నా…చాలా ఏళ్ళ బట్టీ” అన్నాడతను.
“అసలు నేనని నీకెవరు చెప్పారు?”
“నా స్నేహితులు ఉన్నార్లే…” అన్నాడతను నసుగుతూ.
అప్పటికి నాకు అనుమానం మొదలైంది. ఇక్కడికి నేను ఎలా వచ్చానో గుర్తు తెచ్చుకుంటూ అడిగాను –
“ఎవరు నీ స్నేహితులు?”
“నిశి, కా.పు.”
ఇంతలో కెవ్వుమన్న కేక వినబడింది. గవ్వల మాయ లోంచి బయటపడ్డా సైజు తగ్గిపోయిన భయం ఏదో ఒకటి చేయాలని నా మీదకు రాబోతూ, ఈ రహస్యం గురించి వినగానే విరుచుకుపడిపోయింది.
ఇదంతా వీళ్ళ కుట్రా!! అని నేను ఆశ్చర్యపోయి, ఆవేశంతో ధైర్యం కాలరు పట్టుకోబోతూ ఉండగా నీళ్ళలో చలనం మొదలైంది.
ఇద్దరం అటు తిరిగాము. నీళ్ళలోంచి ఒక పెద్దాయన, చెరో పక్క నిశి, కా.పు. నడుచుకు వస్తున్నారు! ఆయన ఒడ్డు దాకా వాళ్ళతో నడిచి, ఇంక వెళ్ళండి అంటూ ధైర్యం వైపు ఆశ్చర్యంగా చూసి పలకరింపుగా నవ్వాడు. సముద్రుడు అనుకుంటాను – ఆయనెవరన్నది అడిగి కనుక్కునే లోపు నా వైపు చూసి మొహం చిట్లించుకుని, డుబుంగుమని నీళ్ళలోకి దూకి మాయమైపోయాడు.
(సశేషం)
****
(దాదాపు ఏడాది తరువాత ఈ నిశ్యాలోచనాపథంలోకి రావడానికి స్పూర్తి అమెరికన్ రచయిత Raymond Carver రాసిన Kindling అన్న కథ.)