నిశ్యాలోచనాపథం-9

రాయకుండా ఉంటే నిద్రపోతున్నట్లు కాదు. ఆ మధ్య నాకు నాలాంటి ఓ నిశాచరితో పరిచయమైంది. సూర్యుడి మొహం కూడా చూడదట! ఎండకన్నెరుగని సుకుమారి అనుకునేరు! వెలుగు అన్నదొకటుందని కూడా ఒప్పుకోడం ఇష్టం లేనంత పెసిమిస్టు. అందుకే, చీకట్లోనే తిరుగుతుందంట ఎప్పుడూ. ఇంతకీ, మాకు పరిచయం ఎలా ఐందంటే, ఆ మధ్యోరోజు పంచరైన సైకిల్ని కూడా తొక్కుకుంటూ తిరిగే వెర్రిమొహంలాగా తిరుగుతున్నా చీకట్లలో. ఇంతలో ఎందుకో అనుమానమొచ్చింది ఎవరో వెంబడిస్తున్నారని. డిటెక్టివ్ బుర్ర ఉపయోగించలేదు కానీ, చెవులు కాస్త రిక్కించాను. అంతే.

సరే, కాసేపు అలా గమనిస్తూ ముందుకెళ్ళాక కొంత వీథి దీపం వెలుగు కనబడ్డది. వెలుగుంటే దయ్యాలు పారిపోతాయన్న సూత్రం ప్రకారం అది మనకి సేఫ్ ప్లేస్ అని, వెనక్కి తిరిగా (అయినా, యముణ్ణే భయపెట్టాం మనం! ఇవెంత?) చూస్తే ఏముందీ, నాలాగే ఇంకో అమ్మాయి. దాదాపు నా వయసే ఉండొచ్చేమో. కాకుంటే, నాలా కాక, కాస్త పద్ధతిగా ఉంది. నా కళ్ళు నిద్ర లేక ఎర్రగా ఉంటే, ఆమె ఇప్పుడే లేచినట్లు ఉంది. నా దారుల్లో నాకు మనుషులు ఇప్పటివరకూ తారసపళ్ళా. మీకూ తెలుసుకదా ఆ సంగతి.. (కాళ్ళు చూస్కున్నా లెండి. మనిషే ఇక్కడున్నది.)

“హలో, అయాం సో అండ్ సో” అని పరిచయం చేస్కున్నా.
“హలో, అయాం నిశీనిశ్” అని జవాబిచ్చి ఊరుకూందామే. అదేం పేరు? అనుకున్నాగానీ,
“ఏమిటండీ, మీరు ఈ సమయంలో…ఇలా… మీరూ ఇన్సోమ్నియా బాధితులా?” మరియాదగా అడిగాను.
“పీడకలలతో స్నేహం చేసి వాటి వెంటే నడుస్తూ పిచ్చిగా నవ్వాలనిపించింది. అందుకే ఇలా వచ్చాను” అంది.
“కెవ్వ్!” అనబోయి, ఆగాను. “ఏంటీ? ఏమైందీ? మనసు బాలేదా?” – ఈసారి ఏకవచనంలోకి దిగబోతున్నా అన్న హింట్ ఇస్తూ, కాస్త అనునయంగా అడిగాను.
“నా మెదడు తీసి ఎదుట పెట్టుకుని దానిలోని అలజడంతా కళ్ళారా చూసి, చెవులారా మనసు ఆర్తనాదాలు వినేసి, నోరార నవ్వుకుని – తరువాత పడుకోవాలనుంది.” అంది.
ఎర్రగడ్డ బాపతో ఏంటో! అనుకున్నా. వైజాగన్నా కావొచ్చేమో, రాత్రి కదా, సాధారణంగా ఏ దారన్నది నేను పట్టించుకోను. అయినా, ఏదో, సాటి మనిషి ఇలా మాట్లాడుతూ ఉంటే, మన మూడెలా ఉన్నా, కొంచెం ధైర్యం చెప్పాలని –

“అమ్మాయ్! కష్టాలు, నష్టాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం కూడా శ్రీశ్రీ లాగా రానీ రానీ అని ముందూ, పోనీ పోనీ అని తరువాతా – అనుకుని వదిలేయాలి. అలా ఉంటేనే అవి మనముందు ఓడిపోతాయి” అన్నా – మనసులో నేనేవో కష్టాలనుకుని ఏడ్చుకున్న రోజులు జ్ఞాపకాలై నన్ను వెక్కిరిస్తున్నా కూడా. దానికి ఆమె –
“మనుష్యుల్ని, మనసుల్నీ, కష్టాల్నీ, కోపాల్నీ కాదు. జీవితాన్ని జయించాలనుంది నాకు.” అంది.
ఓహో… అలా కూడా అనిపించేసిందా? మనల్ని మించినట్లుంది, అనుకున్నా. ఎందుకోగానీ, అలా వదిలేసి పోబుద్ధి కాలేదు. అంటే, నేను మనుషుల్ని చంపేసే ఆలోచనలు మానేసా లెండి ఆ మధ్య. మామూలుగా మానవజాతికి శాంతియుతంగా మరమ్మత్తు చేద్దాం అనుకుంటున్నా.

ఏమో, ఏవో విషాదగాథలున్నాయేమో, అవి గుర్తొచ్చి నిద్రపట్టక ఇలా తిరుగుతోందేమో అని అనుమానమొచ్చింది. అంటే, ఉన్నా లేకున్నా నేను తిరుగుతూనే ఉంటాననుకోండి. కానీ, నేను స్పెషలన్నమాట. నాబోటి డేంజరస్ మనిషి ఇంకోళ్ళు ఉండరు అని నా ప్రగాఢ నమ్మకం.
“ఏదన్నా… గుర్తుకొస్తోందా?” అడిగాను.
“దిక్కులన్నిటా ఊడలు పెంచిన నా జ్ఞాపకాల ఉచ్చుల్లో బిగిసి ఊపిరాడక గిలగిలలాడాలనిపించింది. అడుతున్నాను.” అంది.
ఎంతైనా కూడా, ఇంత ఫిలోని భరించడం కష్టంగా ఉండింది నాకు. టాపిక్ మారుద్దామని… “ఏవమ్మా నిశీనిశ్, ఎవరు నువ్వసలు? ఈ తిరుగుళ్ళేంటి? ఆ మాటలేంటి?” అనేశా, ఉండబట్టలేక.

“నాకు చీకటంటే ఇష్టం. చిక్కగా, నల్లగా, ఎంత చక్కగా ఉంటుందో… ఎదురుచూపులు టాళలేక కరిగినీరౌతున్న నా కలల చిరునామా చీకటి. నిట్టూర్పుల నిరాశల నిశ్శహాయతల నిస్పృహల చితిని పేర్చి మండిస్తే మిగిలిన బూడిద నా చీకటి. ఈ బూడిదని పేర్చుకుని ఆడుకోడం, ఆ కన్నీరైన కలల్లో మునిగిపోడం -నిరంతరం చేయాలంటే, చీకట్లను వెదుక్కుంటూ తిరుగుతూనే ఉండాలి కదా…”
-ఆమె చెప్పుకుంటూ పోతోంది. పైన ఓ విమానం పోతూ ఉండింది. ఇక్కడంతా కూడా నా తలపైన్నుంచే వెళ్తోంది. వామ్మో టాపిక్ మారిస్తే ఇదో హింసా! అనుకున్నా. ఏం మాట్లాడాలో తోచక భయం భయంగా చూస్తూ ఉన్నా – దయ్యమే మనిషి రూపంలో వచ్చే పాజిబులిటీలు ఎంతున్నాయో రేప్పొద్దున్న గూగుల్ (సారీ, బింగ్) చేయాలి అని.

ఇంతలో, ఆమె ఏమిటో హడావుడిగా వాచి చూస్కుని, ఆకాశాన్ని చూస్తూ కంగారు పడడం మొదలెట్టింది. మనకా అలాంటోళ్ళని చూస్తే మహాసరదాకదా – “పద, అలా నడుస్తూ మాట్లాడుకుందాం” అంటూ, ఇహిహి అని ఓ సాడిస్టు నవ్వు నవ్వాను. “నేను వెళ్ళాలి” అంది మళ్ళీ ఆకాశం వంక చూస్తూ. “వెళుదువు గానీ. ఇప్పుడేగా పరిచయమైంది. కాసేపు కబుర్లు చెప్పుకుందాం” అన్నా…అప్పటిదాకా కలిగిన భయమంతా సాడిజం ఐంది ఇప్పుడు.

“ఉండవమ్మా! నువ్వూ నీ కబుర్లూ, నడకానూ… గుండు పాండురంగాన్ని మించేలా ఉన్నావ్!” విసుక్కుందామె.
“ఎందుకూ ఇంతకోపం? ఇంతసేపు ప్రవాహంగా చెప్పావ్ గా మాతలు?” అన్నా.
“చూడూ, నాకు వెలుగంటే అలర్జీ. నాకు వెలుగులన్నా, ఆశన్నా పరమ పరమ చిరాకు. అందుకే రెంటికీ దూరంగా ఉంటాను.” అంది. “అయితే?” అన్నా. “టైమైంది. వెళ్ళాలి.” అనేసి, జవాబు కోసమన్నా చూడకుండా వెళ్ళిపోయింది. కాసేపటికే మా ఇంట్లో శ్రీముఖాలతో నన్ను లేపడంతో నాకు అర్థమైంది ఆమె ఎందుకు వెళ్ళిపోయిందో.

అలా పరిచయమైందా… తర్వాత ఈ మధ్య నాలుగైదుసార్లు తగిలింది. ఫ్రెండ్సైపోయాం లెండి. ఆమె ఇంకా వెలుతురు చూడదు. అందుకే, నేనూ చీకటికి అలవాటుపడ్డా, తన స్నేహం కోసం. ఇదంతా రాయాలంటే వెలుతుర్లలో మెలుకువగా ఉండాలి కదా. అందుకని ఇంత టైం పట్టిందన్నమాట. మొత్తానికి interesting personality లెండి.

Published in: on June 5, 2009 at 10:37 pm  Comments (18)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/06/05/nisyalochanapatham-9/trackback/

RSS feed for comments on this post.

18 CommentsLeave a comment

  1. బాగుంది.

  2. దిక్కులన్నిటా ఊడలు పెంచిన నా జ్ఞాపకాల ఉచ్చుల్లో బిగిసి ఊపిరాడక – హీహీహీ
    నీకెప్పుడూ చెప్పలేదేమో నాక్కూడా చీకటంటే ఇష్టం కానీ నాచీకటిలో కన్నీళ్లూ గట్రా వుండవు. ఉత్త చీకటి అంతే!:P

  3. “అంధెరె సె జీ భర్ కె కర్నీ హై బాతేన్ ఆజ్..” అని పర్ణీతాలో ఒక “రతియా..”పాటలో లైన్..

    ఆ లైన్ కి మాటల ఊపిరి పోస్తే.. ఈ టపా! 🙂

  4. hi…..

    chala baagundi me neshinish chepina kaburluuu…..

  5. Night personified. very well done 🙂

  6. ఈ పోస్టు చదవగానే ఈ కృష్ణశాస్త్రి కవిత గుర్తొచ్చింది. కొంచెం పెద్దదని నా బ్లాగులో పెడదామనుకున్నాను కాని అది ఇక్కడుంటే నే బావుంటుందనిపించి ఇక్కడే రాస్తున్నాను:

    రెక్కలం దాల్చి వరతెంచు రే లతాంగి, కారు కాటుక చీర సింగార మొదవ
    చీకటి చెరంగు విసరున చెదరి యొక్క యుడుమణి విషాదపూరిత ద్యుతులు రాల్చు;
    పాడుకొను చేగు జాలిగా పవన మెటకొ రజని గర్భాన వింత విలాపగీతి
    ఎద కరగునట్లు సన్నని యెలుగుతోడ, నట్టె తలలెత్తి పాట కూఁ కొట్టు చేడ్చు
    గౌతమీ వీచికాళి సగంబు నిదుర; నేను నా దుఃఖమే తోడు నీడ గాగ
    గడపికొనుచుందు నిశ యెల్ల కనులు తెరచి; ఇదియె అదనని తలచి, నా హృదయపేటి
    ముంచుకొని వచ్చు భావ జీమూతచయము కలిపివేతు తమస్వినీ గర్భమందు!

    అన్నట్టు ఈ కవిత పేరేంటో తెలుసా?

    “నిశాలోచనము”!

  7. హమ్మయ్య వచ్చేశారా! మాది బైకు నడకా, మీది కాలి నడాకా.

    బాగుంది.

    “నువ్వూ నీ కబుర్లూ, నడకానూ… గుండు పాండురంగాన్ని మించేలా ఉన్నావ్!” విసుక్కుందామె.”

    ఇంతకీ ఎవరండీ ఆ గుండు పాండురంగం?

  8. @kiran, deepthi,mohana: Thanks.
    @malathi garu, purnima: 🙂
    @dhanraj manmadha: 🙂 వచ్చేసా. గుండు పాండురంగం “చూపులు కలిసిన శుభవేళ” లో సుత్తి వీరభద్రరావు. “అలా నడుస్తూ మాట్లాడుకుందాం రా…” డైలాగు గుర్తులేదా?
    @kameswara rao garu: Oh! Interesting. నాక సాధారణంగా కృష్ణ సాస్త్రంతే భయం…ఈ భాష మనకర్థం కాదు అని… ఆయనా నిశాలోచనము చేసారంటే, చదవాలనిపిస్తోంది.. ధన్యవాదాలు.

  9. Bavundi

  10. చాలా బావుంది . కానీ నాకు ఒక్క ముక్కాఅర్ధం కాలేదు. అంటే మనం కొంచెం (కాదు బాగానే) అజ్ఞానులం. మనకి సాధారణం గా ఇలాంటివి అంటే భావుకతతో నిండిన వాక్యాలు గట్రా అన్నమాట, అసలు అర్ధం కావు.

    కానీ మీ టపా లో కామెడి మాత్రం నవ్వించింది.

  11. ettulu, pallalu ane teda undadu… tanavallu parayivallu ane bhedam undadu..srushti modatinundi maarpulenidi, dharmam tappanidi…maanvulaku pakshulaku jantuvulaku prtirooju pranam posedi…andaanni andaviheenaanni pattinchkonidi okavella devuduite….aadevudu manaku kanipiche cheekate maatrame.manaku unna ee kastalanni velugu valle.. rangulu, hangulu, vijayalu,apajayalu,kastalu,korikalu anni veluguvalla veluguloki vachinave…anduke chekatiki jaikodadam.

  12. “నా మెదడు తీసి ఎదుట పెట్టుకుని దానిలోని అలజడంతా కళ్ళారా చూసి, చెవులారా మనసు ఆర్తనాదాలు వినేసి, నోరార నవ్వుకుని – తరువాత పడుకోవాలనుంది.” అంది.
    *** *** ***

    ఎంత చక్కని కోరిక! Antonioni సినిమా చూడమని చెప్పండి. నాకిప్పుడు ఎవరి మీదన్నా కోపం వస్తే అదే చెప్తాను. 😀 😀 😀

  13. “నా మెదడు తీసి ఎదుట పెట్టుకుని దానిలోని అలజడంతా కళ్ళారా చూసి, చెవులారా మనసు ఆర్తనాదాలు వినేసి, నోరార నవ్వుకుని – తరువాత పడుకోవాలనుంది.”

    ఎంత భావుకత!!! మంచి రచన.

  14. […] నిశీనిశ్ పరిచయమయ్యాక, మాకిద్దరికీ కబుర్లలో […]

  15. […] హాయ్ సౌమ్యా! ఏమిటో నిశ్యాలోచనా పథంలో దీర్ఘంగా […]

  16. […] ’మేన్ ఫ్రం ఎర్త్’ తెగ నచ్చాడు కానీ, నిశి నాకు పరిచయమైన మొదటిరోజు నాకు బాగా గుర్తుంది. నన్ను నేను అంత […]

  17. […] సరిగ్గా నిశి పరిచయమైనప్పటి తొలినాళ్ళు గుర్తొచ్చాయి. మన జాగ్రత్తలో […]

  18. […] హాయ్ సౌమ్యా! ఏమిటో నిశ్యాలోచనా పథంలో దీర్ఘంగా […]


Leave a comment