నిశ్యాలోచనాపథం-33

గత భాగం ఇక్కడ.

దుక్కలాంటి గాడిద సైజులో భయం, బక్కచిక్కిన కప్ప సైజులో ధైర్యం నాకు తోడుగా ఉండేందుకు వచ్చారన్నమాట. ఇదేదో అంతరిక్ష గూడుబుఠాణీలా (cosmic conspiracy అనమాట) ఉందనిపించింది. …

సాయం కోసం నోరు విప్పాలా, కళ్ళు మూసుకుని తప్పించుకున్నాననుకోవాలా? అన్నది అర్థం కాలేదు నాకు. భయం ముందుకొచ్చేసి నా పక్కనే నిలబడింది. ఎండ వల్ల ఆ నిలబడ్డమే నాకు గొడుగులాగ నీడనిచ్చింది. పైగా ఆ కప్పని కాలితో తన్ని నీళ్ళలోకి తోసేసింది.. కప్పలు సముద్రంలో ఉండగలవా? అన్న అనుమానం ఓ పక్క…కావాలనే ధైర్యాన్ని భయం చంపేస్తోందా? అన్న అనుమానం మరోపక్కా ఉన్నా, కిక్కురుమనకుండా ఏం జరుగుతోందో అని చూస్తూ ఉన్నా. భయం నీడలో నేను, నా తోడుగా భయం, నీళ్ళలో కా.పు, నిశి, ధైర్యం. ఇదీ సీను.

కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. నోరు విప్పినా వినేవాళ్ళు లేరు కనుక, కళ్ళు మూసుకుని తప్పించుకున్నానన్న భ్రమలో పడితే కాలక్షేపం అవుతుందని తీర్మానించుకున్నాను. కళ్ళు మూయగానే, చిన్నప్పుడు అలా కళ్ళు మూయగానే మీదకి పొడుచుకువచ్చేవి..ఆ పిల్ల భూతాలు కనబడ్డాయి. ఉలిక్కిపడి కళ్ళు తెరిస్తే, ప్రశాంతంగా నవ్వుతున్న భయం.
“చాలా రోజుల బట్టీ చూస్తున్నా, నన్ను తప్పుకు తిరుగుతున్నావు” – ప్రసన్న వదంతోనే అన్నది భయం.
“ఊ” అన్నాను నేను సంభాషించడం ఇష్టం లేక.
“రోజూ నేను ముసుగు తన్నేదాకా నువ్వు ముసుగేసుకుని పడుకోవడం, నా కంటపడకూడదని గడియ వేసుకుని గదిలో కూర్చోవడం చూళ్ళేదనుకున్నావా?”
“అబ్బెబ్బే..” అన్నాన్నేను మొహమాటపడుతూనే దీనికెలా తెలిసిపోయిందా? అని ఆశ్చర్యపడుతూ.
“ఏమైనా నువ్వు విచిత్రమైన మనిషివి. ఓ పక్క నాతో సహజీవనం చేస్తూనే నన్ను తప్పుకు తిరుగుతావు. ఎందుకు?”
“నాకు ఎండ కావాలి”
“నీ తింగరివేషాలొకటి ఉన్నదానికితోడు” అని విసుక్కుంది భయం.
“నాకు ఎండ కావాలి”
“అంటే నన్నెళ్ళిపొమ్మనే కదా?” అంటూ పక్కకి జరిగిందది.
నేను ఒక్క ఉదుటున పైకి లేచి ఒళ్ళు దులుపుకున్నా. నిజం చెప్పేయడం నయం అనుకున్నా. గాఢంగా ఊపిరి పీల్చుకుని –
“సరే, నిజం చెబుతాను. నేను రోజంతా నిన్ను తల్చుకోవడం నిజమే. నీకోసమే కుదిరినప్పుడల్లా చీకటిని కౌగిలించుకోవడమూ నిజమే. కానీ, నీతో మాట్లాడ్డం మట్టుకు ఇష్టం లేదు.”
“ఎందుకు? ఎవరూ నాతో కలిసి ఉండేందుకు ఇష్టపడరు, నా గురించి మాట్లాడుకుంటూంటారు గానీ. నువ్వేమో కలిసి ఉండాలంటావు. మాట్లాడకూడదంటావు. నా గురించి ఎక్కడా ఎవరికీ చెప్పవు”
“నేనంతే”

రెండడుగులు ముందుకేసాక మళ్ళీ ఇసుకలో కూర్చోవాలి అనిపించింది. కూర్చుని ఇసుక వైపు చూస్తూంటే గవ్వలు కనబడ్డాయి.ఏవో రెండు గవ్వలు ఏరాను. మట్టి అంటుకుని ఉండటంతో ఉఫ్- మని ఊదాను.
“గవ్వలు! నాకవంటే ఎంతో ఇష్టం” అన్నది భయం తన్మయత్వంతో.
మరి నాలుగేరాను ఈ పాటికి. “ఏ రంగువి ఇష్టం?” అన్నాను
“అన్నీ ఇష్టమే. చిన్నవి ఎక్కువ ఇష్టం. వాటిలో నల్లటివి మరీ ఇష్టం” ఆశగా చెప్పింది.
“నేను ఏరిన నాలుగులో రెండు నల్లవి. వెనక్కి తిరిగి మాట్లాడకుండా దోసిలి చూపించాను”
ఇలా చూడగానే అలా నాలుగూ తీసేసుకుంది. వెంటనే మళ్ళీ ముందుకు వంగి, “నాకు ఇస్తావా?” అని అడిగింది నా చేతిలో పెట్టేస్తూ.
“నీకోసమే. ఇంకా కావాలా?”
“వద్దులే… నీకెందుకూ శ్రమ.. నేను ఏరుకుంటా తరువాత” అంది భయం మొహమాటపడుతూ.
“మొహమాటం ఎందుకు?” అంటూ మరిన్ని ఏరడం మొదలుపెట్టా. పైకి ఏం అనకపోయినా భయం ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో నన్ను ఇక ఆపదు అని క్రీగంట చూశాక అర్థమైంది.

కొంచెం కొంచెంగా ఎండ తగ్గుతోంది. దానితో సరిగ్గా కనబడ్డం లేదు నల్లటి గవ్వలు. నేను కొంచెం దీక్షగా చూడాల్సి వస్తోంది. ఇసుకలో పాకుతూ ఒకటీ అరా కనబడ్డప్పుడు ఏరుతూ ముందుకీ వెనక్కీ తిరుగుతూ ఉన్నాను. గుప్పెడు నిండితే వెళ్ళి దానికి ఇచ్చేద్దాం అనుకున్నాను.
“తెల్లటివి కూడా ఏరేదా?” అన్నాను, తెలుసుకుందామని.
“ఎందుకూ నువ్వు ఇంత కష్టపడ్డం? నాక్కావాలంటే నేను ఏరుకుంటా కదా”
“తెల్లటివి కూడా ఏరేదా?”
కొన్ని క్షణాల మౌనం తరువాత – “సరే ఏరుకో. పిల్లలకి పంచుతా ఇంట్లో” అంది నిర్లిప్తంగా.
తెల్లవి కూడా ఏరడం మొదలుపెట్టాక కొంచెం సక్సెస్ రేట్ పెరిగింది ఇసుక రేణువుల్లో చిన్ని గవ్వల్ని వెదుక్కోడంలో. దానితో వేగం పెరిగింది.

అయినా, గుప్పెడంత గవ్వలు రావడానికి చాలా సమయం పట్టింది. అంతసేపు అలా ఆ ఫోజులో కూర్చున్నందుకు ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. నెమ్మదిగా లేచి ఒళ్ళు విరుచుకుంటూ అక్కడే కూర్చుని చోద్యం చేస్తున్న భయం ముందు నా జేబురూమాలు పరచి దాని మీద గవ్వల్ని రాసిలా పోశాను. దాని కళ్ళలో మెరుపు. “థాంక్స్. చాలా థాంక్స్” – నిజాయితీగానే అన్నట్లు అనిపించింది నాకు. నేను కొంచెం బలం పుంజుకున్నట్లు అనిపించింది. నాకు భయానికీ మధ్య ఉన్న అసమానత కొంచెం తగ్గినట్లు అనిపించింది. దానితో నాకో ఆలోచన వచ్చింది. పట్టిన చెమట్లు తుడుచుకుంటూ, ఇంకొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఏరడం మొదలుపెట్టాను. ఇలా కాసేపు సాగింది. నేను ఏరడం, వీలైనప్పుడు వెళ్ళి దాని ముందు గవ్వలు పోయడం…మళ్ళీ రావడం. కొంచెం సేపయాక అలసట. అసలుకైతే అలాగే ఇసుకలో పడిపోయి కాసేపు పడుకుంటే బాగుండు అనిపించింది. కానీ, నేను ఊహించినట్లు జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నన్ను తిన్నగా నిలువనీయలేదు.

కళ్ళు బైర్లు కమ్మడం మొదలైంపుడు ఒకసారి ఆపి వెనక్కి తిరిగి చూశాను. ఆ గవ్వల సంఖ్య పెరిగే కొద్దీ భయం సైజు తగ్గుతూ ఉండడం నేను గమనించాను, అది గమనించకపోయినా. ఇపుడు అది నన్ను అటాక్ చేసే స్థితిలో లేదేమో అనిపించింది. అది కూడా గవ్వల్ని చూసుకుని మురిసిపోవడంలో నన్ను పట్టించుకోలేదు. దానితో, ఏదైతే అది అయిందని, పైకి లేచి మసకబారిన కళ్ళతోనే సముద్రం వైపుకి తూలుతూ నడవడం మొదలుపెట్టాను. కళ్ళు మూతలు పడుతున్నాయి. అడుగులు తడబడుతున్నాయి. అసలీ స్థితిలో నీళ్ళలోకెళ్ళి ఏం చేయలని? అని నన్ను అడగడానికి అక్కడ ఎవరూ లేరు కదా. పైగా నాకు ఈత కూడా రాదు. భయం నన్ను మింగేసేలోపు ఎక్కడికైన మాయం కావాలి – కానీ అసలెక్కడున్నానో తెలీదు కనుక ఎక్కడికీ పోలేను. వెనకున్న గొయ్యికన్నా ముందున్న నుయ్యి నయం అనిపించిందో ఏమిటో… చివరికి నీళ్ళ దగ్గరికి వచ్చేశా. కాలికేదో తగిలింది.

మూసుకుంటున్న కనురెప్పల్ని బలవంతంగా తెరుస్తూ కిందకి చూడబోతూండగా కనబడ్డాడు ఎదురుగ్గా ఆరడుగుల యువకుడు! రెండడులైనా దూరం లేదు మా మధ్య. ఇంతలో అంత దగ్గరగా ఎలా వచ్చాడు? ఎవరితను? అసలు ఇప్పటిదాకా మనుషులెవరూ కనబడలేదు కదా! అతను నా వైపుకి ఆరాధనాభావంతో చూస్తున్నాడు. “వామ్మో, ఆ చూపేంటి? వీడికేం అర్థమైందో నా అవస్థ చూసి” అనుకుంటూ ఉండగా నా అలసట కాసేపు ఎగిరిపోయి నాకు ఆలోచించే శక్తిని ఇచ్చింది. కళ్ళు కూడా నాక్కలిగిన ఉలికిపాటు వల్ల కునుకు తీయడం ఆపాయి.
“మీరు…నువ్వు…ఎలా వచ్చావు??” అన్నాను ఏమనాలో తోచక.
“నీ వల్లే!” అన్నాడు అతను అదే ఆరాధనాభావంతో.
నేను అయోమయంగా చూస్తూండతం తో అతను “frog prince” కథ ఎప్పుడూ చదవలేదా? అన్నాడు.
“చదివాను కానీ…నేనసలు ఇందాక ధైర్యాన్ని ముద్దుపెట్టుకోలేదు కదా..”
అతను నిండుగా నవ్వేసి “అదా… ఇందాక భయం నన్ను తన్నాక నేను ఆ నీళ్ళు మరీ ఉప్పగా ఉండటంతో అక్కడ ఉండలేక అవస్థ పడుతూ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నా అప్పట్నుంచీ. నువ్విలా నడుస్తూ వచ్చి నీ కాలు నాకు తగిలేసరికి, నా పూర్వ రూపం వచ్చేసింది. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీడం లేదు” అన్నాడు.
“అంటే నువ్వు ధైర్యానివా?”
“అవును”
“అయితే, కథలో లాగ నన్ను పెళ్ళాడి శాశ్వతంగా నాతో ఉండిపోతావా?” అని ఆశగా అడిగాను. అతగాడు అందగాడే కానీ, నేనడిగింది అందుక్కాదు. ఎక్కడ అడుగేయాలన్నా ధైర్యం నాకు అవసరం కనుక!

“చ చ… నిన్నా? నో నో!” అని వికారంగా మొహం పెట్టి అనేసి మళ్ళీ “సారీ, నా ఉద్దేశ్యం అది కాదు” అన్నాడతను మళ్ళీ కొంచెం బాధపెడుతూ.
“మరి ఏది నీ ఉద్దేశ్యం” అన్నా చిరాగ్గా, నా నిరాశను కప్పి పెట్టుకుంటూ.
“భయాన్ని తాత్కాలికంగా ఏమార్చగలిగిన ఓ భయస్తురాలు నన్ను తాకితే శాపవిమోచనం అవుతుందంటేనూ… అది నువ్వే అని తెలిసి నువ్వు ఇక్కడికి ఎప్పుడొస్తావా? అని అప్పట్నుంచి ఎదురు చూస్తూ ఉన్నా…చాలా ఏళ్ళ బట్టీ” అన్నాడతను.
“అసలు నేనని నీకెవరు చెప్పారు?”
“నా స్నేహితులు ఉన్నార్లే…” అన్నాడతను నసుగుతూ.

అప్పటికి నాకు అనుమానం మొదలైంది. ఇక్కడికి నేను ఎలా వచ్చానో గుర్తు తెచ్చుకుంటూ అడిగాను –
“ఎవరు నీ స్నేహితులు?”
“నిశి, కా.పు.”
ఇంతలో కెవ్వుమన్న కేక వినబడింది. గవ్వల మాయ లోంచి బయటపడ్డా సైజు తగ్గిపోయిన భయం ఏదో ఒకటి చేయాలని నా మీదకు రాబోతూ, ఈ రహస్యం గురించి వినగానే విరుచుకుపడిపోయింది.
ఇదంతా వీళ్ళ కుట్రా!! అని నేను ఆశ్చర్యపోయి, ఆవేశంతో ధైర్యం కాలరు పట్టుకోబోతూ ఉండగా నీళ్ళలో చలనం మొదలైంది.

ఇద్దరం అటు తిరిగాము. నీళ్ళలోంచి ఒక పెద్దాయన, చెరో పక్క నిశి, కా.పు. నడుచుకు వస్తున్నారు! ఆయన ఒడ్డు దాకా వాళ్ళతో నడిచి, ఇంక వెళ్ళండి అంటూ ధైర్యం వైపు ఆశ్చర్యంగా చూసి పలకరింపుగా నవ్వాడు. సముద్రుడు అనుకుంటాను – ఆయనెవరన్నది అడిగి కనుక్కునే లోపు నా వైపు చూసి మొహం చిట్లించుకుని, డుబుంగుమని నీళ్ళలోకి దూకి మాయమైపోయాడు.

(సశేషం)
****
(దాదాపు ఏడాది తరువాత ఈ నిశ్యాలోచనాపథంలోకి రావడానికి స్పూర్తి అమెరికన్ రచయిత Raymond Carver రాసిన Kindling అన్న కథ.)

Advertisements
Published in: on May 24, 2015 at 12:26 pm  Leave a Comment  
Tags:

నిశ్యాలోచనాపథం-32

(31వ భాగం ఇక్కడ)
*******
ఎండ కాస్తుండడంతో కళ్ళు బైర్లు కమ్మి మొబైల్ తళుక్కుమన్నదని భ్రమిశాను కాని, నిజానికి తళుక్కుమన్నవి నిశి కళ్ళు. ఆ తళుకులే మొబైల్ తెరమీద ప్రతిబింబించాయి అనమాట. ఈ ముక్క అర్థమై, నిశి కళ్ళను అనుసరించి నేనూ ఆ వైపుకి తిరిగాను.

ఎదురుగ్గా బండి కి స్టాండేసి రాజసంగా దిగి నిలబడ్డ కా.పు. దిగ్గున లేచి స్లో-మోషనులో నిశి ఇటువైపు నుండి అడుగులో అడుగేసుకుంటూ కా.పు. వైపుకి వెళ్ళింది. ఆయన చేతులు దూరంగా చాచి “రారమ్మని” పిలుస్తున్నట్లు నిలబడ్డాడు. ఈవిడ స్లో-మోషనే అయినా ఆట్టే దూరంలేదు కనుక రెప్పపాటులో ఆ చేతుల మధ్య ఉన్న గ్యాపులోకి జొరబడ్డం, ఆయన ఆవిడ్ని ఆ కౌగిలిలో బంధించడం జరిగిపోయాయి. వాళ్ళు అలా ఆ‌మత్తులో మునిగి తేలుతూండగా, వాళ్ళకి గొంతు సవరించుకుంటున్న శబ్దం వినబడి తేరుకుని ఆ కౌగిలి విదుల్చుకున్నారు. ఆ శబ్దం చేసింది నేనే. ఆ పైన ఏం చూడాల్సి వస్తుందో అని నా‌ టెన్షన్ నాది.

“ఎలా ఉన్నావు? చాలారోజులైంది కదూ మనం కలిసి?” అని పలకరించబోయాడు కా.పు.
ఒక పక్క ఎక్కడున్నానో… ఎందుకుండాలో….ఎన్నాళ్ళుండాలో…ఏమీ తెలియక అసహనం నషాళానికంటుతూంది నాకు. వీళ్ళేమో వీళ్ళ ప్రేమలూ దోమలూ అంటారూ…నన్నేమో అందరికీ దూరంగా ఇక్కడ పడేస్తారూ? అని పళ్ళు కొరుక్కుంటూ ఉండగా కా.పు. ఇలా అడిగే సరికి ఇంక కోపం అదుపుచేసుకోలేకపోయాను.
“మీతో కలిసిన వాళ్ళు బాగుపడ్డ దాఖలాలేవైనా ఉన్నాయా? ఎంతమంది కలిశారు? ఎంతమంది బాగుపడ్డారు? కలిసిన వాళ్ళకి, బాగుపడ్డ వాళ్ళకి మధ్య సంఖ్యలో తేడా ఎంత? ఈతేడాకి సాంఖ్యక ప్రాబల్యం ఉందా?‌ (నోట్: “సాంఖ్యక ప్రాబల్యం” – statistical significance కి నేను సృష్టించిన పదం). అసలు బాగుపడ్డానికి ప్రమాణం ఏమిటి?” – ఇలా నోటికొచ్చిందంతా అడగడం మొదలుపెట్టేసరికి కా.పు. బిత్తరపోయాడు.
నిశి అతని భుజాన్ని అదుముతూ – “అది అభిజ్ఞా వైరుధ్యం వల్ల వస్తున్న సంధి ప్రేలాపనలే” అని అతన్ని సాంత్వన పరచింది (నోట్: Cognitive Dissonance కి అభిజ్ఞా వైరుధ్యం అన్నది నిఘంటువులో దొరికిన తెలుగు అనువాదం).

నా ఆవేశం పొంగి పొర్లి చివరికి నిశబ్దంగా మారాక, నిశి కా.పు. తరపున మాట్లాడుతూ – “నువ్వు పిచ్చికోపంలో అడిగినా, మంచి ప్రశ్న వేశావు. ఇక ఈ విషయం ప్రాణికోటికి తెలియాల్సిన వేళ వచ్చింది.” అని దీర్ఘంగా నిట్టూర్చింది. నేను అయోమయంగా ఇద్దరి వంకా చూశాను. కా.పు. నావైపు భయంగా, నిశి వైపు ప్రేమగా, ఆ తరువాత ఇద్దరివైపుకీ అభావంగా చూశాడు.
“నిజానికి వీళ్ళు ఏది చేసినా పరమ శాస్త్రీయంగా చేస్తారు. శాస్త్రీయ పద్ధతులే వాడతారు. బాగుపడ్డం గురించి కొన్ని సాంఖ్యక ప్రాబల్య పరీక్షలు కూడా చేశారు కొన్ని వందలఏళ్ళ క్రితమే. అప్పటికింకా మీలోకంలో అసలు ఆ కాంసెప్టే లేదు కూడానూ” అంది.
“ఆహా, ఏం చేశారు? ఏం‌కనుక్కున్నారు?”
“అప్పుడు పరీక్షలు చేసిన వాళ్ళు ఇప్పుడు వేరే శాఖల్లోకి మారిపోయారు. డెస్క్ జాబ్స్. బాగుపడాల్సిన వాళ్ళెవారూ వాళ్ళ కంటబడరు”
“ఆహా, వాళ్ళ పరిశోధనా ఫలితాలు ఎవళ్ళో ఒకళ్ళకి తెలిసే ఉంటాయి కదా”
“హుం… అక్కడే ఓ చిన్న సమస్య”
“ఏమిటో…”
“వాళ్ళు కనుక్కున్నవన్నీ వాళ్ళు డాక్యుమెంట్ చేసేవాళ్ళు కానీ, మేకలు తినేశాయి అన్ని పరిశోధనాపత్రాలని”
“వాట్??”
“ఆ సమయంలో వీళ్ళ జాతి వాళ్ళకీ, మేకలకి మధ్య యుద్ధం నడిచేదిలే. వీళ్ళు మేకల్ని మేపడం మానేశారు మేకలు కోపమొచ్చి వీళ్ళ పరిశోధనలని సమాధి చేశాయి.”
“అంత post-modern జాతి కదా, కంప్యూటర్లు అవీ లేవా?”
“మేకలు నివసించేది కంప్యూటర్లోనే కదా. అవి తిన్నవి కంప్యూటర్ ఫైళ్ళే” – నిశి తాపీగా అన్నది.
“నీకివన్నీ ఎలా తెలుసు?” మరీ మాటమాటకీ ఎక్కడ అవాక్కవుతాంలే! అని నిట్టూర్చుకుంటూ‌ అడిగాను.
“వాళ్ళ జాతివాళ్ళు మీరు రామాయణ భారతాలు విన్నట్లు ఇవన్నీ వింటూ పెరిగి పెద్దవుతారు. కా.పు. (అన్న పేరెత్తగానే సిగ్గుపడుతూ) నాకు తన గురించి ఇదంతా చెప్పాడు… అని మళ్ళీ సిగ్గుపడింది.
తన కథంతా తన ప్రమేయం లేకుండా చెప్పినందుకు కా.పు. మొహంలో నిశి పట్ల గర్వం కనబడ్డది.
“అయితే ఇప్పుడేమిటంటావు? వాళ్ళు పరిశోధనలు చేశారు కానీ దానికి ప్రూఫు లేదంటావు?”
“అంతే”
“ఏడ్చినట్లుందిలే” అన్నాను నేను, ఇక ఆ అంశంపై మాట్లాడ్డం ఇష్టంలేక.

ఇంతలో అసలు సంగతి గుర్తొచ్చింది.
“అవును బాబు, అసలు ఈ చంపడం, రక్షించడం గోల ఏమిటి?” అని అడిగాను కా.పు. ని, మేమిక్కడికి వచ్చిపడ్డానికి కారణం గుర్తు తెచ్చుకుంటూ.
“చంపాలనుకోడం మా జాతి నిర్ణయం. బ్రతికించాలనుకోడం మా ప్రేమ నిర్ణయం” సినిమా ఫక్కీలో జవాబిచ్చాడు కా.పు.
“బ్రతకాలి అనుకోడం ఎవరి నిర్ణయం?” అని అడిగాను ఉండబట్టలేక.
“ఎవరైనా నిర్ణయించుకోవచ్చు కానీ, తమని తాము బ్రతికించుకోగలగడం ఎలాగైనా వాళ్ళ చేతిలో ఉండదు.” అన్నాడు కా.పు. నిర్లిప్తంగా.
“ఇప్పుడేం జరగబోతోంది?” నాకింక భయమేయడం మొదలైంది. ఏం చెప్పదల్చుకుంటున్నాడు? ఇక్కడ నాకేమైనా జరగబోతోందా? అన్నది అర్థం కాలేదు.

ఇదిలా జరుగుతూండగా వాళ్ళ వెనుక నాకు ఏదో ఆకారం ఈవైపుకి వస్తూ కనబడ్డది. దగ్గరికి వచ్చాక అర్థమైంది అది గాడదని. బాగా దిట్టంగా ఉంది. దాన్ని ఎదుర్కొని నెగ్గడం కష్టం అనిపించేలా ఉంది. నెమ్మదిగా అది మమ్మల్ని సమీపించింది. కాసేపట్లోనే కాపు వెనగ్గా నిలబడ్డది. అప్పుడే, ఆ క్షణంలోనే, నాకు ఏం జరుగుతూందో అర్థమయ్యేలోపు ఆ గాడిద కా.పు. ని ఎగిరి తన్నడం, కా.పు. నీళ్ళలో పడిపోవడం, కా.పు.కి ఈతరాదు మొర్రో అని లబలబలాడుతూ నిశీ గాడిదని కోపంతో ఒక్క తోపుతోసి నీళ్ళలోకి దూకడం జరిగిపోయాయి. షాక్ లో నేనేమీ మాట్లాడలేకపోయాను. ఆ గాడిదవైపుకి భయంభయంగా చూశాను. నాకూ ఈతరాదు కదా మరి! నన్నెవరు కాపాడతారు? ఆ సీనులో నాకంటూ ఎవరూ మిగల్లేదు కద!

“నన్ను గుర్తుపట్టావా?” అన్నది ఆ గాడిద, పైకి లేచి దుమ్ము దులుపుకుంటూ.
మనిషి రూపంలో వచ్చి మాట్లాడేవాళ్ళు ఐపోయారు, జంతువులు కూడానా! అని నిట్టూర్చాను.
“నేను, భయాన్ని. నీ భయాన్ని… అంటూ దగ్గరికొచ్చింది. ఎక్కి కూర్చోమనడానికో, ఎగిరి తన్నడానికో అర్థం కాక రెండడులు వెనక్కివేశాను, కొండవైపుకి. అప్పుడు గమనించాను – కొండ అంచులో ఉన్న ఓ మడుగు ఒడ్డున ఓ బక్కచిక్కిన కప్ప కూర్చుని గెడ్డంకింద చేయి పెట్టుకుని మరీ మా సంభాషణ ఫాలో అవుతోందని. రెప్పపాటులో కలిగిన ఉలికిపాటు వల్ల దిగ్గున లేచాను. ఆ కప్ప కూడా భయపడ్డట్లుంది నా ఆకస్మిక కదలికకి. నాకు భూతదయ కన్నా భూతభయం ఎక్కువ కనుక కెవ్వున కేకేసి రెండడుగులు పక్కకి జరిగాను. ముందు గాడిద, వెనుక కప్ప. పక్కకి జరగడం మినహా మార్గం లేదు.
ఆ కప్ప నాకన్నా ముందు తేరుకుని, “అర్రెర్రే, భయపడకు. నేను ధైర్యాన్ని. నీకోసమే వచ్చాను” అంది.
దుక్కలాంటి గాడిద సైజులో భయం, బక్కచిక్కిన కప్ప సైజులో ధైర్యం నాకు తోడుగా ఉండేందుకు వచ్చారన్నమాట. ఇదేదో అంతరిక్ష గూడుబుఠాణీలా (cosmic conspiracy అనమాట) ఉందనిపించింది.

(సశేషం)

Published in: on July 20, 2014 at 10:03 am  Comments (1)  
Tags:

నిశ్యాలోచనాపథం-31

(30వ భాగం ఇక్కడ)
***
జీవితం, కాలం, మరణం, ప్రేమా – నలుగురూ ఒక నాలుగు రోడ్ల కూడలిలో కలిసి వాళ్ళవాళ్ళ చేతుల్లో ఉన్న శక్తి వల్ల వాళ్ళు మనుషుల జీవితాల్తో ఎలా ఆడుకుంటున్నారో చర్చించుకుంటూ – ట్రేడ్ సీక్రెట్లు పంచుకుంటూ ఉండగా, నేను, నిశి కూడలిలోని విగ్రహంలోపల ఉన్న రహస్య గదిలో కూర్చుని వినడం మొదలుపెట్టాము. అది జరిగి ఏడాదైంది. ఇన్నాళ్ళైనా ఆనాడు అంతా కలిసి నన్ను మోసం చేసిన వైనం ఇంకా కళ్ళకు కట్టినట్లు ఉంది.

నేనేదో మనుషుల పాలిటి సాడిస్టులైన వీళ్ళ రహస్యాలన్నీ వినేసి గుర్తు పెట్టేసుకుని ఈ పీడకలలాంటి సగం నిజం లాంటి అబద్దపు అనుభవం నుండి బయటపడ్డాక యావత్ మానవకోటికి జ్ఞానోదయం గావించి ఆ తరువాత ఏదో ఒక -మయి అమ్మ గా స్థిరపడిపోదామనుకున్నాను. దాని వల్ల నా తోటి మానవులకి ఏదన్నా చేసానన్న తృప్తి, నాకు జీవన భృతి – రెండూ కలుగుతాయని ఆశించాను. ప్రస్తుతపు అస్తిత్వ విచికిత్సలను దాటుకుని తరువాతి స్థాయిలో కొత్త సమస్యలను కౌగిలించుకోవచ్చనీ, మాస్లో పిరమిడ్ లో ఓ మెట్టు ఎగబాకవచ్చనీ… ఇలా ఎన్నో కలలు కన్నాను. అయితే, అక్కడ జరిగినది ఇంకొకటి. అవమానభారంతో ఇన్నాళ్ళు పెదవి విప్పలేదు కానీ, ఆలోచించగా, వీళ్ళకి జాలీ, దయా వంటివి ఉంటాయని నమ్మే నా లాంటి అమాయకులకి ఒక గుణపాఠం అవుతుందని ఈ అనుభవాన్ని అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నాను.

ఆవేళ వాళ్ళేం మాట్లాడుకున్నారో, అక్కడేం జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు స్టేటస్ రిపోర్ట్ అయిపోయి ట్రేడ్ సీక్రెట్ ఎక్స్చేంగ్ ప్రోగ్రాం మొదలుపెట్టే వేళకి నా మది గతి తప్పడం మొదలైంది. కొన్ని క్షణాలలోనే బ్లాక్ అవుట్. నేను కాసేపటికి తల పట్టుకు లేచేసరికి నేనేదో చెట్టుకింద ఉన్నాను. నా పక్కనే నిశి కూర్చుని మొక్కజొన్న కంకి మీద ఉన్న గింజలని గిల్లుతూ ఎదురుగ్గా ఉన్న కొండవైపుకు చూస్తూ ఉంది. నేను లేస్తూ ఉండగా చేతులూ కాళ్ళు నొప్పెట్టి సన్నగా మూలిగాను. ఆ అలికిడి విని నా వైపుకి తిరిగింది. నిశి బట్టలన్నీ దుమ్ము పట్టి ఉన్నాయి. చేతులు గీసుకుపోయి ఉన్నాయి. నేను నిశి ని ఏదో అడగబోయి నా బట్టలు కూడా అలాగే ఉన్నాయని, నేనూ దెబ్బలతో ఉన్నానని గమనించాను.

నేను నోరు విప్పి “ఏం జరిగింది?” అనేలోగా నిశే నోరు విప్పింది – “ఏదో, కాలం కనికరించబట్టి బ్రతికి బట్టకట్టాము” అంది “కాలం” అన్న పదాన్ని వత్తి పలికి, కొండ పైని శూన్యం వైపుకి తలతిప్పుతూ. అప్పుడే గమనించాను – మా వెనుక సముద్రం ఉందని. “మనం అసలు ఎక్కడున్నాము? ఏం జరిగింది?” అన్నాను నాలుగు దిక్కులా కలయజూస్తూ. దిఙ్మండలములో పేద్ద కొండా, సముద్రము తప్ప ఏం కనబడ్డం లేదు. మేము కొండ పాదాల వద్ద, సముద్రుడి దయమీద ఆధారపడి ఉన్నామని అర్థమైంది.
“మధ్యమధ్యలో ఆపి నసపెట్టకుండా ఉంటానంటే చెబుతాను. నోర్మూసుకుని విను.”
“సరే, కానీ …” అని నిట్టూర్చాను.
“”నిన్న మనం దాక్కున్న విగ్రహం బద్దలైంది. దానితో మనం ఎగిరి బయటకు పడ్డాము. బద్దలైన శబ్దానికే నీకు తెలివి తప్పింది. మరణం మనల్ని చూసి ఉత్సాహంతో ముందుకు రాబోతూ ఉండగా జీవితం అడ్డుపడ్డాడు. ప్రేమ కాలం వైపుకు చూసి సైగ చేయగా, కా.పు. మనిద్దరినీ కాపాడాడు. నాకేమో ఆ ప్రమాదంలో కొంచెం దెబ్బలు తగిలాయి. నీకు దెబ్బలూ తగిలాయి, తెలివీ తప్పింది. దానితో, కా.పు. మనల్ని తన బండి మీద ఎక్కించుకున్నాడు – ఇంటి దగ్గర దిగబెడతానని…”
“ఇల్లా? ఎవరిల్లు?? ఎవరికుంది ఇల్లు?” అన్నాన్నేను ఆశ్చర్యంగా. వీళ్ళకంతా ఇళ్ళూ, సంసారాలు ఉంటాయన్న ఆలోచనే ఎప్పుడూ రాలేదు నాకు.
“వెధవ ప్రశ్నలు వేయొద్దని చెప్పానా? ఇదా మనకి ముఖ్యం ఇపుడు?
“సారీ…. కానివ్వు. తర్వాతేమైంది?”
“బాగా వివరంగా చెప్పాలంటే అవ్వదు – లవర్స్ అన్నాక లక్ష ప్రైవేటు సంభాషణలుంటాయి. నీకు స్పృహ లేదు కనుక మేము బైక్ మీద దూసుకెళ్తూ ముచ్చటించుకున్నాము.”
“నాకు స్పృహ ఉంటే మట్టుకు మీరాగుతారా ఏమిటి?” అనుకున్నాను నేను గతంలో చూసిన సీన్లు గుర్తు తెచ్చుకుంటూ. పైకి అంటే ఎక్కడ కథ ఆపేస్తుందో అని పెదవి విప్పలేదు.
“ముచ్చట్లలో మాటా మాటా వచ్చింది. నాక్కోపం వచ్చి కిందకి దూకేశా…”
“దూకేశావా?????” అన్నాన్నేను… షాక్ ని అణుచుకోలేక.
“ఆ..అందుకే ఈ దెబ్బలూ, దుమ్మూ మనిద్దరికి”
“వాట్….నువు దూకడం కాక నన్నూ లాగేశావా?”
“ఈ నిశి నేస్తాలని కష్టకాలంలో ఒంటరిగా వదిలిపెట్టదు.” – గంభీరంగా అన్నది.
“నీ మొహం కాదూ??” అని అరిచాను నేను.
“కాలంతో కొట్టుకుపోకుండా నిన్ను కాపాడాను. ఊరికే అరవకు.” అనింది ఎటో చూస్తూ.
“నన్నో, కా.పు. నో అనుమానించి నన్ను కూడా తనతో లాగేసిందా?” అని సందేహం కలిగింది కానీ, పైకి అనే సాహసం చేయలేకపోయాను. నాకు ఈతరాదు. పక్కనే సముద్రం ఉంది మరి. అంత వేగంగా దూసుకుపోతున్న బైకు నుండి దూకిన మనిషి ఇంకో మనిషిని సముద్రంలోకి తోయడానికి ఆలోచిస్తుందా ఏమిటి?
నేనేమీ మాట్లాడకపోవడంతో మళ్ళీ తనే – “అలా దూకాక పడ్డం పడ్డం ఈ కొండ కిందకి పడ్డాము. ఆకలేసి కా.పు. బ్యాగు నుండి నొక్కేసిన మొక్కజొన్న తింటున్నా” ఏదో అదో పెద్ద విషయం కాదన్నంత తాపీగా అన్నది.

“అసలా విగ్రహం ఎందుకు బద్దలైంది?” ఇంకా తదేకంగా కొండపైకే చూస్తున్న నిశిని అడిగాను.
“బద్దలు కొట్టారు”
“ఎవరు? ఎలా?”
“జీవితం మనకి కాలం చెల్లించాలని కంకణం కట్టాడు. కా.పు వైపుకి జాలిగా చూసి ప్రేమ తల తిప్పుకున్నాడు. మరణం జేబులోంచి బాంబులు తీసి విగ్రహం మొహాన కొట్టాడు” – మళ్ళీ ఎక్కడో ఏ ఇరాక్ లోనో, ఇస్టోనియాలోనో ఎవరికో జరిగిన కథ అన్నట్లు చెప్పింది నిశి.
“ఇదంతా నేను విగ్రహంలోపల స్క్రీన్ లోంచి చూశాను” అన్నది మళ్ళీ తనే.
“అసలు వాళ్ళకెందుకు ఆ బుద్ధి పుట్టింది?”
“ఆ సృష్టి రహస్యాలు నీకు తెలియడం వాళ్ళకి ఇష్టం లేదు.”
“అసలు మనం ఇక్కడ ఉన్నట్లు వాళ్ళకి తెలియదు కదా?”
“తెలుసు కదా…” అని నిశి తలవంచుకుంది.
“ఎలా?”
“నేనే ఎస్సెమ్మెస్ చేశాను జీవితానికి” -నిశి ఆర్య-2 లో ఆర్య కి అమ్మమ్మ అని అర్థమైంది నాకు.
“నువ్వా? నీకేమైనా పిచ్చా? నా సంగతి సరే, నీక్కూడా ప్రమాదమే కదా!”
“మా రహస్యాలు మాలోనే ఉండడం కోసం నేను సమిధనవ్వాలనుకున్నాను.”
ఈవిడొక జిహాదీ మరి! అనుకుంటూ “మరెందుకు నన్ను అక్కడికి తీసుకెళ్ళావసలు?” అని అడిగాను.
“ముందు నిన్ను మాలో కలుపుకుందామనే తీసుకెళ్ళా కానీ, మనసు మార్చుకున్నా తరువాత”
“మరి వాళ్ళు విగ్రహం బద్దలు కొట్టాలనుకోడం ఇదంతా నాకెందుకు తెలియలేదు?”
“అప్పటికే నీ తలపైన కొట్టి నీ స్పృహ పోగొట్టాను”
“ఆహ, ఎంత గొప్ప స్నేహం!” అన్నాను. అంతకంటే ఏమనగలను ఇదంతా విన్నాక?
“మొత్తానికైతే అందరూ కలిసి నాతో ఆడుకున్నారనమాట. నువ్వైతే నయవంచన చేసేందుకు కూడా వెనుకాడలేదు” అని కసిగా మనసులో అనుకున్నాను, పైకి అనే ధైర్యం లేక. చెప్పా కదా – నాకీత రాదు.
నిశి ఏం మాట్లాడలేదు.

అలా కొండవైపుకి చూస్తూ ఉంది.
“ఏమిటి అస్తమానం కొండపైకి చూస్తున్నావు? ఏముందక్కడ?”
“కా.పు. వస్తాడేమో నని…” నసిగింది నిశి.
“అంత మిస్సవుతూంటే ఎందుకు దూకేశావు?” నిశి తలదించుకుంది.
“అయినా, విగ్రహం బద్దలు కొట్టి మనల్ని లేపేద్దాం అనుకున్నాక మళ్ళీ ఎందుకు రక్షించారు?” మళ్ళీ అడిగాను.
“కా.పు. మనసులో …” అని నిశి ఏదో చెప్పబోతూండగా ఆమె మొబైల్ తళుక్కుమనింది.
(సశేషం)
***
(ఈసారి ఏడాది తరువాత మళ్ళీ ఇది కొనసాగించడానికి ప్రేరణ – స్వీడిష్ రచయిత Jonas Jonasson రాసిన నవలలు.)

Published in: on July 6, 2014 at 1:09 pm  Comments (1)  
Tags:

నిశ్యాలోచనాపథం-30

(29వ భాగం ఇక్కడ)
***

“మీరిద్దరూ ఒకరి ప్రాణం ఒకరిలో ఉంచుకుని బతికిపోతారా? మమ్మల్ని మాత్రం చంపుకు తింటారా?” – కసిగా అనుకున్నాను మనసులో, నిశి మాటలు విని. అయితే, నిశికి నా మొహాన్ని చూసి మనసులోని భావాల్ని చదవడం తెలుసు కనుక, ఈ విషయం గ్రహించినట్లుంది.

“నీకెందుకో మా ఇద్దరి ప్రేమ మీద అంత సదభిప్రాయం లేదు” అని నిట్టూర్చింది.
“నేనెవర్ని మీ ప్రేమని గురించి చెప్పడానికి?” అన్నా ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ. ఈ మనుషులు కాని మనుషులతో బహు జాగ్రత్తగా ఉండాలి. మనమింకా ఆలోచించేముందే మన ఆలోచనలన్నీ లెక్కెట్టేస్తారు!
“ఏమో, నిన్ను చూస్తే ఎప్పుడూ నాకు అనుమానమే”
“ఊ… బాగుందమ్మా. నాకు మీ మాటలూ, చేతలే అర్థం కావు. ఇంక మీ స్థాయిలో ప్రేమలూ, స్నేహాలూ, అనుబంధాలూ, ఆప్యాయతలు, విరహాలూ, విషాదాలు – ఇవన్నీ నాకెక్కడ అర్థమవుతాయి? ఏదో, అర్భకురాలిని”
– ఈ మాట అనేసి, తన మొహం చూడకుండా, ముందుకు చూస్తూ నడవడం మొదలుపెట్టాను.
“అవును, అదీ నిజమే. నాకున్నంత బాధ నీకు లేదు రకరకాల ప్రేమల్లో. అందుకే కాబోలు నీకు నేను మామూలు మనిషిలా కనబడను.” తానూ వెంట నడుస్తూ అన్నది.
“మరే. నాకే బాధలూ లేవుగా. ప్రపంచంలోని సుఖమంతా నా వద్దే లేదూ?” –
“మరదే, ఆ వ్యంగ్యమే వద్దనేది. నీకున్న బాధలు ఎంత నాతో పోలిస్తే? అంటున్నా.”
“అవున్నిజమే. నీకేం బాధలో. ఎన్ని బాధలో. మేమేదో, మాకొచ్చే చిన్న చిన్న కష్టాలకే బాధపడిపోతూ ఉంటాము… కానీ, మరి మాకు చేతకాదు కదా. అందుకని పెద్దగా అనిపిస్తాయి అవే. మీరు బలశాలులు కదా. మీరెక్కువ భరించగలరు. మేము బలహీనం. మా ప్రేమలు బలహీనం. మా కోపాలు బలహీనం. మా ద్వేషాలు బలహీనం. మా విరహాలూ బలహీనం. ఇట్టే ప్రేమిస్తాం. ఇట్టే ద్వేషిస్తాం. ఇట్టే నవ్వుతాం. ఇట్టే ఏడుస్తాం. ఏడుస్తూనే ఉంటాము ప్రేమలకోసం, పగలకోసం. అందుకే మేము మనుషులమయ్యాము. మీరు… మీరయ్యారు.”

నిశి నుండి ఏమీ స్పందన రాలేదు. ఊరికే మౌనంగా నా వైపుకి చూసి, ముందుకు నడవడం మొదలుపెట్టింది. Triumph of the underdogs అనుకుని మురిసిపోయాను నేను…ఎట్టకేలకి నేనూ తనకో ఉపన్యాసం ఇచ్చానని!
“నీకేమో, నిజం చెబితే ఉడుకుమోత్తనం…” అంది నెమ్మదిగా కొన్ని క్షణాలాగి.
“మరే, ఎవరికి వాళ్ళు ఇదే అనుకుంటూటార్లే” అన్నా నేను.
నిశి నాకేసి ఆశ్చర్యంగా చూసింది. “ఈ మధ్య తెలివిమీరిపోతున్నావ్” అన్నది.
“తప్పుతుందా?” అన్నాన్నేను.

తను మళ్ళీ మాట్లాడకుండా ముందుకు నడవడం మొదలుపెట్టింది. ఇంతలో, ఒక రెండొందల మీటర్ల దూరంలో, ఒక నాలుగు రోడ్ల కూడలి కనబడ్డది. నిశి ఆ కూడలి చూడగానే, నాకేసి తిరిగి – “హేయ్, మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎక్కడికొచ్చామో తెలుసా? నీకు భలే అవకాశం లే ఇప్పుడు. దా నాతోపాటు! అంటూ చేయి పుచ్చుకుని అటువైపుకి లాక్కుపోయింది. నాకేదో వేరే ఏదన్నా చేయగల అవకాశం ఉందని కాదు కానీ, ఏమిటో, నాకు ఇప్పుడీ “భలే అవకాశం” అందుకోకపోతేనేం? అనిపించింది. కూడలిని చేరుకుంటూ ఉండగా, బర్రు మని శబ్దాలు నాలుగు దిక్కుల నుండి. నిశి నన్ను చటుక్కున లాగి, ఈ కూడల్లో statue of liberty కి మల్లే ఉన్న ఒక విగ్రహం వెనుక నాక్కనబడని తలుపుని, నాకర్థంకాని వేగంతో తెరిచి, నాతో సహా దానిలోకి దూరి, తలుపేసేసింది. ఆ బర్రుమనే శబ్దాలు మరింత చేరువవుతూండగా, “కాసేపు ఏమీ అడక్కుండా, బయటేం మాట్లాడుకుంటున్నారో విను” అన్నది. “ఎలా వినిపిస్తుంది?” అన్నాన్నేను ఠక్కుమని. “ష్! అది నీకనవసరం. వినిపిస్తుందంతే. ఇంక నోరు మూస్కో!” అన్నది తీవ్రంగా.

నెమ్మదిగా ఆ శబ్దాలు ఆగిపోయాయి. ఏదో, ముగ్గురో నలుగురో మనుషులు పైన చేరినట్లు తెలుస్తోంది. ఏం జరుగుతోందో, ఏం కథో…అని నేను ఖంగారు పడుతూ ఉండగా, నా కుడివైపునున్న నిశి నన్ను ఎడం చేత్తో పొడవడం మొదలుపెట్టింది. నేను ఏమిటా అని విసుగ్గా తన వైపుకు చూసేసరికి, అక్కడ ఒక టీవీ తెర లాంటిది ఉంది. దాని మీద మోటర్ సైకిళ్ళు దిగుతున్న నాలుగు ఆకారాలు! ఒక్కోరూ ఒక్కోరికి హలోలు చెప్పుకోవడం మాత్రం బయటనుండి బాగానే వినిపిస్తోంది. audio visual aids సాయంతో విషయాలు తెలుసుకోవడం అంటే ఇదే కాబోలనుకున్నాను. ఇంతకీ, అసలు వీళ్ళెవరో అనుకుంటూ ఉండగా, అందరూ వారి వారి హెల్మెట్స్ తీశారు. ఒకరు కా.పు. మరొకరు… నిశి ఆమధ్య చీల్చి చెండాడిన “జీవితం“! తక్కిన ఎవరూ ఇద్దరో నాకు అర్థం కాలేదు కానీ, వాళ్ళ మాటలు వింటే అర్థమవుతుందేమో అని ఆ దిశలో చెవులు రిక్కించాను, కళ్ళు తెరపై ఉంచి.

అలార్మ్ బెల్ వంటి శబ్దం క్రీ-మని వచ్చాక, మొదటాయన, అదే, “జీవితం” మొదలుపెట్టాడు. “సోదర సోదరీమణులారా, మన హింస-అనానిమస్ ఈ నెల సమావేశానికి స్వాగతం. ఇవ్వళ్టి అంశం – పాప ప్రక్షాళన అనుకున్నాం కదా. తమ తమ వృత్తుల గురించి ఎవరి మనసులోని మాట వారు ఫ్రీగా చెప్పుకోవచ్చు. ఇక confessions మొదలుపెడదామా? అని ఒక క్షణం ఆగాడు. అందరూ అంగీకార సూచకంగా తలూపారు. అక్కడ సోదరీమణులెవరు?? అందరూ సోదరులేగా? అంటే వీళ్ళకి మేము ఇక్కడున్నట్లు తెలుసా? ఈ నిశి కావాలని నన్ను జోకర్ని చేసి ఆడుకుంటోందా? అనుకుంటూ ఉండగా, గుండ్రంగా చేరిన ఆ నలుగురినుండి జీవితం రెండడుగులు ముందుకు వచ్చి pledge తరహాలో చేయి చాపి, “నేను, జీవితాన్ని. నా మనసులోని మాటలు చెబుతానని ప్రమాణం చేస్తున్నాను” అని చేయి వెనక్కి తీసేసి, మొదలుపెట్టాడు.

“నాకు మనుషులకి నన్ను వాళ్ళిష్టమొచ్చినట్లు మలుచుకోవచ్చు అన్న భ్రాంతి కలిగించి, వాళ్ళ ప్లానులు వేసుకోగానే, వాటిని కుప్పకూల్చడం అంటే సరదా. ఇది ఎంత ప్రయత్నించినా మానుకోలేకపోతున్న వ్యసనం. అయితే, ఒక్కోసారి అసలెందుకు మానేయడానికి ప్రయత్నం చేయాలి? అనిపిస్తుంది. ఒక్కళ్ళో ఇద్దరో నన్ను ధిక్కరించగల ధీరులు తగుల్తారు. అప్పుడు నేర్పుగా వాళ్ళని కాలానికి అంటగడతాను. ఇవ్వాళా ఒకడిని అలాగే అంటగట్టాను.” అని ఆగాడు. అందరూ పక్కనే ఉన్న కా.పు. వైపు చూశారు. అతనూ రెండడుగులు వచ్చి, ఆ pledge చేసి, మొదలుపెట్టాడు.

“నాకు మనుషులకి నన్ను అందుకోగలరు అన్న భ్రాంతి కలిగించి, వాళ్ళు చేరువవుతూండగా నేను దూరమైపోవడం సరదా. వాళ్ళకి అందనంత వేగంతో, ఎవ్వరికోసం, దేనికోసం ఆగకుండా నేను పరిగెత్తేస్తూ ఉంటే, ఒగురుస్తూ ఒగురుస్తూ ఎక్కడో కుప్పకూలిపోయే మానవులని చూస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటాను. కానీ, ఇప్పుడు బోరు కొడుతోంది. అలాగని నెమ్మదవుదామా అంటే నన్నెక్కి స్వారీ చేస్తారు ఈ మనుషులు. ఉన్న దానికి తోడు జీవితం నుండి బదిలీ అయ్యే కస్టమర్లు కూడా తోడై విరక్తి వచ్చేస్తోంది. కాల చక్రాల కింద వీళ్ళందర్నీ నలిపేస్తే, నాకు తీరిక చిక్కుతుందేమో అనిపిస్తోంది” అని ఆగి పక్కనున్న వ్యక్తి వైపుకి తిరిగాడు.

ఆ వ్యక్తి మొదట కాలాన్ని కొరకొరా చూసి, “తర్వాచ్చూస్తా నీ సంగతి” అని..ఆ తర్వాత ఆ షరామాములు రెండడుగులు-ప్లెడ్జి చేసి, మొదలుపెట్టాడు.

“నేను, మరణాన్ని. సాధారణంగా నేనుగా పూనుకుని ఎక్కడికీ వెళ్ళకపోయినా కూడా, నాకు మీ అందరినుంచి ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయి. చేతి నిండా పని. పైగా, ఒక్కోరికీ customized solutions. ఒక్కోరిని ఠక్కుమని పీక నొక్కేస్తా. ఒక్కోరిని ఆఖరి రక్తం బొట్టు కారేదాకా ఉండనిచ్చి, తాపీగా చంపుతా. ఒక్కోరిని వాళ్ళలోనే ఇంకోరికి అప్పజెప్పి ఒకే దెబ్బకి రెండు పిట్టల్ని కొడతా. ఇలా సాగడం బానే ఉంది కానీ, ఒక్కోసారి మరీ నేను టర్గెట్ చేసిన వాళ్ళు, ఇతరుల రిఫరెన్స్ ద్వారా నా వద్దకు వచ్చిన వారు, త్వరగా పనైపోయే రిఫరెన్స్ గా కాక, long term clients గా వచ్చిన వారు : ఇందర్నీ తట్టుకోవడం కష్టంగా ఉంటుంది నాకు. ఏం చేయాలో తోచదు.” అని నిరాశగా తలపట్టుకున్నాడు ఈయన.

“అందుకే కదా నేనున్నది. project pipelineలో మరణం అన్న స్టేజీ కొంతమందికైనా ఆలస్యంగా వచ్చేలా చూడ్డానికి!” అని ఓదారుస్తూ, నాలుగో మనిషి ముందుకొచ్చాడు. ప్లెడ్జి చేశాడు. మొదలుపెట్టాడు.

“నేను ప్రేమను. నాదొక విచిత్రమైన సమస్య. నేనేమిటో నాకే అర్థం కాదు. అయినా సరే, అందరి దగ్గరికీ వెళ్ళిపోయి వాళ్ళలో భాగాన్నయిపోతూ ఉంటాను. నాకే అర్థం కాని నేను వాళ్ళకేం అర్థమవుతాను? పాపం – నన్నర్థం చేసుకోలేక, ఉంచుకోలేక, వదులుకోలేక, ఆనందం-బాధ, అసహ్యం-అభిమానం ఇలా పరస్పర విరుద్ధ భావాలనూ వాళ్ళలో సహజీవనం చేయనిస్తూ కొట్టుమిట్టాడే ప్రేమికుల్ని చూస్తూంటే నాకు కడుపు నిండిపోతుంది…” అని చెప్పుకుపోతూ ఉన్నాడు.

నేనింకా ప్రేమంటే అమ్మాయేమో అనుకున్నా! ఇదంతా confess చేస్తున్నప్పుడు ఇతగాడి కళ్ళలో మెరుపు చూడాలీ – మంచి భోజనం చేశాక నరమాంస భక్షకులకు కలిగే ఆనందంలా ఉండసలు!!

జీవితం, కాలం, మరణం, ప్రేమా – నలుగురూ మనుషుల్ని హింసించడమే మా పని అని ఇన్నిరకాలుగా చెప్పుకోవడం చూసి, “ఉల్లిపాయ తొక్క తీటానికి బ్లేడు కావాలా? కత్తి కావాలా?” – అన్న “దొంగకోళ్ళు” సినిమా సీను గుర్తొచ్చింది నాకు, అసలుకే హైపర్ ఇమాజినేషన్ కనుక!

ఈ నాలుగు కంఫెషన్లు అయ్యాక, “ఓకే, ఇప్పుడు మనం ఈ మనుషుల్ని హింసించడంలో ఉన్న ట్రేడ్ సీక్రెట్స్ పంచుకుందాం.” అని ప్రకటించాడు “జీవితం”. ఇక చూడాలీ, నాకు seventh seal సినిమాలో ఆ knight వచ్చి కంఫెషన్ బాక్స్ లో మరణం ఉందని తెలీక, మరణాన్ని చదరంగంలో ఓడించడానికి తాను వాడబోయే ఎత్తును అక్కడ వెల్లడించేసిన సీను గుర్తొచ్చింది!

(సశేషం)

******
(ఈటపా రాయడానికి స్పూర్తి Art Buchwald రాసిన “Power Anonymous” వ్యాసం, “Beating Around the Bush” కాలం వ్యాసాల సంపుటి నుండి.)

Published in: on May 26, 2013 at 2:07 pm  Comments (4)  
Tags:

నిశ్యాలోచనాపథం-29

చాన్నాళ్ళక్రితం రాసిన 28వ భాగం ఇక్కడ.

*********
అదేమి చిత్రమో కానీ, నేను వదిలినా నన్ను వదలరు కొంతమంది. అంత వల్లమాలిన అభిమానం నా మీద, ఎందుకో గానీ. నిండా మునగబోతున్న జీవితాన్ని అప్పట్లో నిశి ఒడ్డుకు చేర్చి బ్రతికించిందా…ఆ రాత్రి గడిచాక, నాకేమిటో భయం వేసింది. వీళ్ళలో చేరి, నేను కూడా చివరికి వాళ్ళలా అయిపోతానేమో..ఇలా జీవితాన్నీ, ప్రేమనీ సతాయిస్తూ, వాటిచే సతాయింపబడుతూ, మనుషుల్తో సంబంధం లేకుండా ఉండిపోతా ఏమో అని. నిజానికి వాళ్ళలో వాళ్ళకి బోరు కొట్టి, ఎలాగోలా మనుషుల్ని కెలికి వాళ్ళలో చేర్చుకోవాలి అనేసి నన్ను మాయ చేస్తున్నారేమో అనిపించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా అసహ్యం, జుగుప్స, విరక్తి, భక్తి, భయం, గౌరవం, అభిమానం, ఆనందం, ఆశ్చర్యం, సుఖం – వీళ్ళంతా కూడా వచ్చారంటే ఇన్ని భావోద్వేగాల వెల్లువలో పడి కొట్టుకుపోయి, అలాగ వాటిమధ్యే ఉండిపోతానేమో, తేలనేమో…అసలుకే అవి Danube నది తరహాలో ఇంత పొడవుంటాయి కదా, బోలెడంత సేపు వెంటాడతాయి మనల్ని – అని భయం కూడా వేసింది. దానితో, నిశితో కనెక్షన్లు బంద్ చేసాను. కానీ….. కొంతమంది ఎందుకో జిడ్డులా పట్టుకుంటారు కదా. నాకు మీకు జవాబిచ్చే ఆసక్తి లేదు మొర్రో అన్నా వినరు కదా…అలాగ…

అనుకోకుండా వచ్చి పడుతున్న మంచునీ, నా అనుకోళ్ళతో సంబంధంలేకుండా దెబ్బతింటున్న పరిశోధనా ఫలితాలనీ తిట్టుకుంటూ గూడుకట్టుకున్న కసి మొత్తం చేసేదేం లేక మసిగా మారగా, అది చూసి తెల్లగా నవ్వుకుంటున్న మా ఊరి వీథుల్లో నడుస్తూ ఉండగా, నిశి గుర్తొచ్చింది ఎందుకో. ఇలా నిశ్యాలోచనల్లో అడుగు పెట్టానో లేదో – “భౌ” అని పక్క సందులోంచి ఒక ఆకారం ముందుకు దూకింది. నేను కెవ్వుమనే లోగా, అదెవరో అర్థమై, కేకని వెనక్కి పంపేశాను గొంతులోకి.

“ఏమిటే పిల్లా, ఇన్నాళ్ళూ ఏమైపోయావ్?” – అంటూ నిశి పలకరించింది. ఈ పిలుపేమిటీ కొత్తగా ఉందీ! అనుకుంటూనే-
“నిశీ…నువ్వా…నువ్వే! ఇన్నాళ్ళూ కనబడలేదేం?” అన్నా, వీలైనంత మహానటన ప్రదర్శిస్తూ.
“అబ్బా, చా. నిజం చెప్పు? నన్ను తప్పించుకు తిరిగావ్ కదూ? ఎందుకు? నేన్నీకు ఏం అపకారం చేసాను? అన్యాయంగా తోచట్లేదా నీకు …ఇలా ప్రవర్తించడం?”
“అయ్యో, లేదు నిశీ… నాకు చాలాసార్లు అసలు రావడమే కుదరలేదు. ఎక్కడా, పనీ, రిసర్చీ…చలీ…గిలీ…నిజానికి అప్పుడప్పుడూ వచ్చా కానీ, ఎక్కడికో వచ్చా… దారులు కొత్తగా అనిపించాయి. కనబడ్డ వారు మాట్లాడుకునే భాష అర్థమయ్యేది కాదు…ఈ ప్రపంచానికి నాతో పనిలేదేమో అనిపించేది…దానితో నా ప్రపంచానికి వెళ్ళిపోయేదాన్ని….” -అంటూ నా ధోరణిలో నిజాలా? కాదా? అని ఆలోచించకుండా నేను నోటికొచ్చింది చెప్పుకుపోతూ ఉంటే…
“పోనీలే, ఇన్నాళ్ళకి అయినా కనిపించావు. పద అలా నడుస్తూ మాట్లాడుకుందాం” అంటూ ముందడుగు వేసింది నిశి. ఇంత తేలిగ్గా నమ్మెసిందేమిటా అనుకుంటూ నేనూ కదిలాను.

“ఆ చెప్పు నిశీ, ఏమిటీ విశేషాలు? జీవితం ఎలా ఉంది? కా.పు. మళ్ళీ కలిసాడా? మీ ప్రేమ ఎందాకా వచ్చింది?” అంటూండగానే… ఎదురుగ్గా ఒక ఆకారం…

దుమ్ముపట్టిన బట్టల్లో కూడా తళతళలాడ్డం, వృద్ధ శరీరంతోనైనా మొహం మాత్రం నిత్యనూతనంగా కనబడడం: ఆ ఆకారాన్ని చూడగానే, నాకు ఒక విధమైన నోస్టాల్జియా ఆవరించింది. దాని వెనుక ఏదో ముంచుకొచ్చే వెల్లువలా లీలగా కనబడింది. ఆ ఆకారం చేరువవుతున్న కొద్దీ…ఏవో తరంగాలు ఆ వైపు నుండి నాలోకి వెళ్ళడం కొంచెం కొంచెంగా తెలియడం మొదలైంది. విచిత్రంగా, ఆ తరంగాల వాళ్ళ నాకు హాని ఏమీ కాలేదు కానీ, అది చేరువయ్యేకొద్దీ, ఏవో నా గతాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేయడం, కళ్ళ ముందు మసగ్గా మరచిపోయిన వ్యక్తుల ఆత్మలు కదలాడుతున్న భావన కలగడం గట్రా ఎక్కువైనట్లు అనుమానం కలిగింది. నిశి, తనతో స్నేహం… మాత్రమే కాక, మరేవో కూడా జ్ఞప్తికి రావడం మొదలుపెట్టాయి. ఆ ఆకారం చివరికి మా ఎదురుగ్గా వచ్చి నిలుచుంది.

నిశి – “హలో, ఎలా ఉన్నారూ? మీరిక్కడ చాలా అవసరం”….అంటూ పలకరించడం మొదలుపెట్టింది.
ఈ కొన్ని సెకన్లలోనే, ఏమిటో చెప్పలేనన్ని భ్రాంతులు నాకు కలిగినట్లు నాకు తోచింది. వాటిని లిపీకరించడం నాకు చేత కాదు అనుకోండి, అది వేరే సంగతి..

“ఎవరు నిశీ…” అని నేను అంటూండగానే ఆవిడ చేతులు చాస్తూ –
“హలో, మీరు నాకు తెలుసు… కానీ, నేను మీకు తెలిసి ఉండకపోవచ్చు. నన్ను ‘జ్ఞాపకం’ అంటారు”
“….”
“బహుసా నా నుండి మీకు వెళ్ళిన తరంగాలను బట్టి మీకు ఆ విషయం అర్థం అయ్యి ఉండొచ్చు…”

అప్రయత్నంగా నేను చేతులెత్తి నమస్కరించాను. పెద్దావిడే. మామూలు మనుషుల లెక్కలో అయితే ఒక డెబ్భై-ఎనభై ఏళ్ల మధ్య ఉండొచ్చు. మరి వీళ్ళ లెక్కలు నాకు తెలియవు కదా. ఎంచక్కా, మన అమ్మమ్మో, నాన్నమ్మో, ఇంకెవరైనా ఆ తరం వారినో చూసినట్లు ఉండింది నాకైతే. ఉన్న దానికి తోడూ, కళ్ళలో ఆ ఉత్సాహం అదీ చూడగానే, నాకు భలే గౌరవ భావం కలిగింది ఈ వయసులోనూ భలే చురుగ్గా ఉన్నారే అని.

“మీరు, ఇక్కడ… ఇలా… “… నాకేం మాట్లాడాలో తోచక పిచ్చి చూపులు చూస్తూ ఆశ్చర్యార్థకాల్లో వాగడం మొదలుపెట్టా.
“పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని అంటారు కదమ్మా, అలాగే నేనూ మరచిపోయిన చోటే గుర్తుకు వస్తూంటా.” – ఆవిడ చిద్విలాసంగా నవ్వారు.
“అంటే ఏమిటనుకున్నావు? నిన్ను చుట్టుముట్టిన నా జ్ఞాపకాలే ఆవిడయ్యారు. ఆవిడే నేను. నేనే జ్ఞాపకం. జ్ఞాపకమే సత్యం. సత్యమే శివం.” – నా ఆశ్చర్యాలని ఛేదించి కొత్త ఆశ్చర్యాన్ని పుట్టిస్తూ నిశి అడిగింది.
“ఎందుకు నిశీ నాకు ఉన్న సందేహాలు చాలక ఈ కొత్త అయోమయాలన్నీ పుట్టిస్తావు?” నన్ను నేనే జాలిగా తల్చుకుంటూ అడిగాను.
“నువ్వంత ఓ… బాధపడిపోనక్కరలేదు…. నా గురించి నీలో పేరుకున్న బెంగలన్నీ ఇలా వచ్చి పడ్డాయంతే” – నిశి జాలీగా చేతులూపుతూ అంది.
చుట్టూ కమ్ముకుంటున్న చీకట్లలో అంత పట్టించుకోలేదు కానీ, అక్కడ మేమిద్దరమే ఉన్నాము! “మరి ఆవిడేరీ?” అన్నాను నిశి తో.
“చెప్పా కదా, గూడు కట్టిన నా జ్ఞాపకాలే ఆమె. నవ్వుతూ పలకరించిందంటే పైకి ఇలా ఉంటావు కానీ, నా స్నేహం నీకిష్టమే అన్నమాట!”
అబ్బో! ఈమెని వదిలించుకోవడం చాలా కష్టం రా బాబూ! అనుకున్నా, ఈ నాలుగేళ్ళలో ఎన్నోసారో!

మాట మార్చాలని – “ఇంతకీ, ఇన్నాళ్ళూ ఏమైపోయావు నిశీ?” అనడిగా.
“ఒకానొక రోజుటి మంచువర్షంలో నన్ను నేను కప్పేసుకున్నా. మంచుతో స్నేహమైంది. అప్పుడే దాని తాలూకా పొజెసివ్ నెస్ అర్థమైంది. గట్టిగా దాని కౌగిల్లో నన్ను బంధించి వేసింది. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు అన్నది తన సిద్ధాంతం లాగుంది. మంచు సంకెళ్ళు ఎంతకీ తెగనంత ధృడమైనవి. మొత్తానికి ఆ రిలేషన్ షిప్ నుండి బయటపడాలి, మళ్ళీ నీతో స్నేహం చేయాలన్న నా బలమైన సంకల్పం వల్ల ఇప్పటికి బయటపడగలిగాను. పడీ పడగానే, నువ్వు కనబడ్డావు మరి.” – అందాకా విన్నాను కానీ, ఆ చివరి ముక్క వినగానే తను నాతో ఎప్పట్లాగే ఆటలు ఆడుతున్నదని అర్థమైంది.

నా మొహం చూసి నా భావాల్ని చదివింది కాబోలు – “నిజం. చెబితే నమ్మవు. అయినా, నీకూ నాకూ ఉన్న అనుబంధం ఎంత గొప్పదో నీకింకా అర్థం కావడం లేదు.”…అంది. హతోస్మి, అనుకున్నాను.

“అయితే, పాపం నువ్వూ గడ్డ కట్టుకుపోయావా? ఇన్నాళ్ళూ ప్రపంచంతో సంబంధం లేకుండా బ్రతికావా?”
“అయ్యో, సంబంధం లేకేం? ఉండేదే అదే. స్పందన ఇచ్చే వీలు లేదంతే.”
వెధవ పంచి డైలాగులొకటి మళ్ళీ! అని మనసులో అనుకుంటూ, పైకి మాత్రం – “అసలు నిజంగా ఏం చేశావమ్మా ఇన్నాళ్ళూ?” అని అడిగాను.

“అసలేం జరిగిందంటే, అతనున్నాడు కదా…” అంటూ సగంలో ఆగిపోయింది నిశి.
తన లవ్ స్టోరీ గురించి గుర్తొచ్చింది. కాలపురుషుడితో ప్రేమ వ్యవహారంలో మునిగి తేలి, ముంచి, తేల్చీ తేల్చకుండా మిగుల్చుకున్న విచిత్ర వ్యవహారం కనుక, వెంటనీ గతమంతా కళ్ళముందు కదలాడింది.
“ఉంటాడు, ఎందుకుండడు? అతనెక్కడికి పోతాడు చెప్పు ఎంతైనా… మనిషి కూడా కాదు ఏకంగా పోవడానికి” ఈసడింపుగా అన్నాను.
“అతనితోనే ఉన్నా..” నెమ్మదిగా అంది నిశి.
“ఏమిటి?? నువ్వు…అతనితో…కలిసి…ఒక సమ్మచ్చరం పైన… నువ్వు..ఇంకొకరితో…ఇన్నాళ్ళు…” – ఇలా నేను ఆశ్చర్యంలో incoherentగా మాట్లాడుతూ ఉండగా, నన్నడ్డుకుని –
“ఇష్టపడి వెళ్ళలేదు….”
అనడంతో ఇంకా అవాక్కయ్యా. అందర్నీ ఓ ఆటాడించే నిశిని అతను ఆటాడిస్తాడని నాకు తెల్సు కానీ, ఇంతా???

“మంచు కౌగిల్లో ఇరుక్కుపోయానా. అలా ఓ పక్షులు లేని పక్షిగూటిలో చాలా రోజులు ఉండిపోయా. ఆఖరుకి బంధిఖానా కి అలవాటు పడిపోతున్న సమయంలో, ఒక భూకంపం. పెళ్ళలు పెళ్ళలుగా విరిగి పడిపోతున్న మంచు. అందులో ఒకదానిలో నా బంధిఖానా కొనసాగుతొంది… వెళ్ళడం వెళ్ళడం కింద వెళుతున్న ఒక వ్యక్తి కోటు జేబులో పడ్డాము”
“కోటు జేబులోనా???”
“తీరా చూస్తే అది ఫ్రీజింగ్ కోటు”
“ఫ్రీజింగ్ కోటా? అంటే?
“లోపలివైపు వెచ్చగా ఉంటుంది…వేసుకునే వాళ్ళకి. బయటికి మాత్రం ఫ్రీజర్ లా ఉంటుంది.”
“అదెలా సాధ్యం?”
“సృష్టిలో అన్నింటికీ అందరికీ అర్థమయ్యే సమాధానాలు ఉండవు. ఇది నీకర్థం కాదులే.”
“మరదే, అక్కడే నాకు కాలేది. నువ్వేదో ఇంకో లోకం నుండి వచ్చినట్లు ఈ బిల్డప్పేమిటి?”
“పోనీ, చెప్పన్లే…”
“అయ్యో, చెప్పు చెప్పు. సరే, అలాంటీ కోటోటుంది… తర్వాత?”
“కోటు కిటికీ లోంచి ప్రపంచాన్ని చూసాను. ఎందరో ఇహ పరలోక వాసులని కళ్ళారా చూశాను…అలాగే కోటు బంధిఖానాలోని మంచు బంధిఖానాలో ఉంటూనే”
“సరే, అతనెక్కడినుంచొచ్చాడు?”
“కోటు అతనిదే” తాపీగా అంది నిశి.
పక్కలో మంచు బాంబులు పడ్డట్లైంది నాకు. కానీ తేరుకుని,
“మరి ఇప్పుడు ఇక్కడ…”
“…ఆ… టూకీగా చెప్పాలంటే, అతని బైక్ 2013లోకి దూసుకుపోతున్న సమయంలో మేము ఎగిరి రోడ్డున పడ్డాము. అప్పట్నుంచి తొక్కుకుంటూ, తోసుకుంటూ, పెనుగులాడుకుంటూ, ఇప్పటికి ఇక్కడకి చేరాను”
“ఇప్పుడతను నిన్ను వెదుక్కుంటూ వస్తాడు కాబోలు… మళ్ళీ నా ముందు మీ నాటకం మొదలుపెడతారా?” అన్నాను అనుమానంగా.
“అతనికి తెలిస్తే….” అంది నిశి ఎటో చూస్తూ.
“ఎందుకు తెలియదూ, ఒకరి ప్రాణం ఒకర్లో ఉంటుంది కదా మీకు” అన్నాన్నేను వెటకారంగా.
“అది ఎవరి ప్రాణాలు వారు తీసుకోకుండా ఉండేదందుకు…” అంది నిశి వెంటనే.

(సశేషం)
***
(ఇన్నాళ్ళ తరువాత మళ్ళీ ఇది రాయడానికి ప్రేరణ రచయిత్రి గాబ్రియెల్ బెల్ తన వెబ్సైటులో మొదలుపెట్టిన The prince గ్రాఫిక్ కథ)

Published in: on February 26, 2013 at 10:20 pm  Comments (1)  
Tags:

నిశ్యాలోచనాపథం – 28

(ప్రాచీనులకు -మకాం మార్చక ముందు, మార్చిలో వచ్చిన ఇరవై ఏడో భాగం ఇక్కడ చదవండి. నవీనులు – ఇక్కడికెళ్ళి, చివరి నుంచి మొదలుపెట్టండి, ఓపికుంటే!!)

******************
“అంతర్మథన పర్యంకంపై తిరుగుతున్న పంకాని నొక్కిందెవరు, దాని మీట చెక్కిందెవరు?” (‘మో’ నిషాదం) – అన్నట్లు, తాను తాడు తెగినా బొంగరమైనా, మనల్ని బొంగరంలా తిప్పేసే ప్రేమను వెంటాడేదెవరు? దాని పీక నొక్కేదెవరు?”
– నేనూ, నిశీ నదీ తీరంలో వెన్నెల నీడల్ని చూస్తూ ఉండగా, హఠాత్తుగా తానంది. నాకు మొదలు అసలు “మో” గారి కవిత్వమే అర్థం కాక గిలగిల్లాడుతున్నా. ఇక ఈవిడ ఆయన స్పూర్తితో మొదలుపెడితే, గిలగిలలతో పాటు, విలవిలలు కూడా కలిసి, అక్కడ నా అయోమయ భావోద్వేగాల శివతాండవం ఖాయం! కానీ, ఈవిడ ఆగేలా లేదు.

అసలు జరిగిందేమిటంటే, అతగాడు ఆరోజు వస్తూ ఉంటే, నాకు ఆగ్రహం, నిశి కళ్ళలో ఆరాటం ఒకేసారి కలిగాయని చెప్పా కదా (27వ భాగంలో!). అతగాడు దగ్గరికి రాగానే, నేను తనని కడిగిపారేద్దాం అనుకుని, షర్టు చేతులు మడత పెట్టుకునేంతలో, అతను వచ్చి “నిశీ….” అన్నాడు. ఆ దిక్కుమాలిన పిలుపులో ఏం ప్రేమ కనిపించిందో కానీ, ఈవిడ మహా పరవశంగా, “ఎలా ఉన్నావు?” అంది. “నేను బాగున్నాను. నువ్వెలా…” అంటూడగానే,
“నువ్వు చేసిన మోసం మాకు అర్థమైపోయింది. ఇంక ఈ నాటకాలు ఆపు” అన్నాన్నేను కోపంగా.
“ఆ…అదీ…అది కాదు. ఏదంటే…. ఎందుకంటే… అసలు నేను…. నిజానికి… నిశి అంటే నాకిష్టం. తన్ని మోసం చేయాలి అనుకోలేదు. తనకి దగ్గరవ్వాలనీ…”
“ఇదిగో చూడూ, వెధవ వివరణలివ్వక, దయచేయిక.”
“కొన్ని వందల సంవత్సరాల నా ప్రేమ….”
“వందా లేదూ బొందా లేదు….వెళ్ళిక” అన్నాన్నేను కటువుగా, ఇక వెళ్దాం అని వెనక్కి తిరుగుతూ.
“నిశీ, ప్లీజ్…” అన్నాడతను నన్ను పట్టించుకోకుండా.
“అరే! చెప్తున్నానా!” అంటూ నేను కోపంగా వెనక్కి తిరుగుతూ, దారిలో నిశి వంక చూశాను. ప్రమాదం శంకిస్తూ అతని వంక చూశాను. నేను కలుగజేసుకునేంతలో ఇద్దరూ కౌగిలింతలో ఉన్నారు!!

ముందెలా ఉన్నా, ఈమెతో తిరుగుడు మొదలయ్యాక, నాకు చిర్రెత్తడం మొదలైంది ఇలాంటివి చూస్తే. “నిశీ!” అని అరిచాను. నా ఊహా జగత్తులో “శారదా!” అని అరుస్తున్న శంకరశాస్త్రి గారు కనిపించారు. “శుద్ధ ఏకాకితనంలో ఈ జంట-తనం ఏమిటీ??” అని అరిచాను. “నిజమే, ఏకాకితనంలో జంట తనం ఏమిటి….అసలా పద ప్రయోగం ఏమిటి?” అని మధ్యలో జీ..అలియాస్ కా.పు. కలుగజేసుకుని, సర్దిచెప్పబోయాడు. “ఆహా! నువ్వు చెప్పు అసలు పదం ఏమిటో. హూ…చెప్పు!” అని హుంకరించాను. “అదీ….. ఏకాకితనంలో …. జంటతనం ఏమిటి… అహ…కాదు కాదు. కొంటెతనం… అహ కాదు… పెంకితనం!” అంటూ ఏదో వాగడం మొదలుపెట్టాడు కాపు. “చాలాపు!” అని అరిచి…”నిశీ, ఇతనితో తిరగడం నీ వెర్రితనం.” అన్నాను.

నిశి నిస్సహాయంగా నన్ను చూసింది. నెమ్మదిగా తలవంచుకుంది. అప్పుడే గమనించా, కౌగిలి వీడినా, ఇంకా చేతులు కలిసే ఉన్నాయని. ఇన్నాళ్ళూ నేను అజేయురాలనుకున్న నిశి..అందర్నీ అదుపుచేయగల నిశి…కా.పు. కి లొంగిందా! నేనింకా ఆశ్చర్యంలోంచి తేరుకోకముందే “బీప్..బీప్..” అంటూ ఫోను. కా.పు. ది. అతను హడావుడిగా “ఆ..సరే, ఇప్పుడే వచ్చేస్తున్నా!” అని ఫోను పెట్టేసి, “నేను మళ్ళీ కలుస్తా నిశీ…అప్పుడు అంతా వివరంగా చెబుతాను.” అనేసి, మరి మాట్లాడకుండా, మాకూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, వెళ్ళిపోయాడు. అదిగో, అప్పుడే నేనూ, నిశీ మౌనంగా నడవడం మొదలుపెట్టి, మౌనంతో పాటు నడిచి…ఈ నది దగ్గర తేలాము. “కాసేపిలాగే కూర్చున్నాక, “ఏమిటి నిశీ….ఇంత జరిగాక కూడా ఇంకా అతన్ని ప్రేమిస్తున్నావా?” అని అడిగా, కాస్త విసుగ్గానే.

“నా…నా… పరుగుతీసినా… నా…నా… వదిలిపెడుతునా…” అంటూ కూనిరాగం తీసింది నిశి.
“ఎవరు పరుగుతీస్తూంటే ఎవరు వెంటప్డుతున్నారు? నువ్వు పరుగుతీస్తూంటే కాలపురుషుడా? అతను పరుగుతీస్తూంటే నువ్వా? మీ ఇద్దరి వెంటా ప్రేమా? నువ్వు అతనివైపుకి వెళ్తూంటే అడ్డు పడుతూ నేనా?”
“జీవితం” వెన్నెల్లో మెరిసే నీటిని చూస్తూ చెప్పింది నిశి.
“మళ్ళీ నా!” అని నేనేదో అనబోతూ ఉండగా, నీటిలో ఓ నీడ.
“వెనుకకు తిరిగి నువ్వు చూడకున్నా, ఎదుటకు వచ్చి నిన్ను చుట్టుకోనా….షై నననన షై నననన షై నననన…” అన్న పాట హమ్ముతూ, వెనుక ఒక నిలువెత్తు ఆకారం.
ముందు చూసిన ఆకారమే కనుక, పోల్చుకోవడం పెద్ద కష్టం కాలేదు. చూడగానే విరక్తి పుట్టించే ఆ జగన్మోహనాకారుడే జీవితం. (అతనెలా ఉంటాడో తెల్సుకోవాలంటే ఇరవైమూడో ఎపిసోడ్ చూడుడు). అయితే, పోయిన్సారిలా, నిశి అతని మీద పడి, కాలరుచ్చుకుని ఎడా పెడా వాయించలేదు. మొదట నిర్లిప్తంగా చూశింది. అతను నవ్వుతూ చూశాడు. తరువాత నిశి వెన్నెల నీడల వైపు చూసింది. నిశి విరుచుకుపడుతుందనో, ఏడుస్తుందనో ఊహించిన అతడు ఏమైందన్నట్లు అయోమయంగా నా వంక చూశాడు. వీళ్ళిద్దర్నీ చూడ్డంలో బిజీగా ఉన్న నాకు ఎలా చూడాలో తట్టలేదు. చివరకి అభావంగా చూడగలిగాను.

“ఏమిటమ్మాయ్ నీ గోల? ఇదివరలో కోరి నీ దగ్గరికి వస్తే, వెంటపడి తరిమి కొట్టావు. ఈ మధ్య నేనెక్కడో తప్పుకు తిరుగుతూ ఉంటే, “సోకాల్డ్ సోలుమేటు కోసమేల ఈ వేటా..” అని మంచి చెప్పినా వినలేదు. “మసక మసక ఎండలో, మంచులాగ కరగక, శాశ్వత బంధం మనకెందుకూ?” అని బ్రతిమాలాను. “అనుభవాల కొలనులో, చేపలాగ ఈదక, పసిఫిక్ సంద్రం గొడవెందుకు?” అని మొత్తుకున్నాను.అయినా, వినకుండా వెంటపడ్డావు. సరేలే, పాపం అనుకుని, ఇంత దూరమూ నడిచొచ్చాను, నీకోసం!.” అంటూ ఆవేశంగా జీవితం జీవన విద్య సెషన్ పెట్టబోతూ ఉండగా,

“బస్సుల్లేవా? మీ ఊళ్ళో కూడా ఎప్పుడూ స్ట్రైకులా?” అన్నది నిశి, అందాకా నిర్లిప్తంగా ఉన్నదల్లా.
ఆ ప్రశ్నకు జీవితమే అవాక్కైందంటే, నేనెంత!
“నీకోసం ఇంత దూరం వస్తే, నువ్వడిగేది ఇదా?”
“నాకు నువ్వంటే బోరు కొట్టేసిందోయ్. నేను వెంటపడగానే నువ్వు తోకాడించుకుంటూ వచ్చేయడం నాకు నచ్చలేదు. చలే జావ్ యహాసే!” అని నిశి లేచి, నడవడం మొదలుపెట్టింది. అదే క్షణంలో, నేను లేవబోవడం, నా వెనుక నుండి జీవితం నిశి వెంటపడ్డానికి ప్రయత్నిస్తూ, నేను అడ్డం తగిలి, ముందుకు పడి, నీళ్ళలో పడిపోవడం… లిప్తపాటులో జరిగిపోయాయి.
“వాడిని ఈదేందుకు మనకి ఈతరావాలి కానీ, అసలు వాడికి ఈతొచ్చో లేదో!” అంది నిశి, నిర్వికారంగా.
ఇంతలో నీట్లో బుడగలు. నిండా మునగబోతున్న జివితం. నాకు ఈతరాదు. నిశికి వచ్చినా ఏం చేస్తుందో తెలీదు. ఏం జరుగుతుందో! అనుకుంటూ ఉండగా, జీవితం చెయ్యి మాత్రం పైకి కనిపించడం మొదలైంది. వెంటనే, నిశి, చేయి పట్టుకు లాగి అతన్ని ఒడ్డుకు చేర్చి బ్రతికించింది. అతను ఉప్ఫూ ఉప్ఫూ అని ఆయాసపడుతూ ఊపిరి పీలుస్తూ ఉండగా,
“చెంచాడు భవసాగరం కూడా ఈదలేని నువ్వు, మమ్మల్ని తిప్పలు పెడతావా? అని అడుగుతున్న నిశి పకపకలు నెమ్మదిగా సన్నబడుతూ ఉండగా, సూర్యుడు మొహం మీద కొట్టడంతో మెలుకువొచ్చింది.

*************
కొత్తపాళీ గారి ఎంక్వైరీ వల్లే మళ్ళీ నిశ్యాలోచనాలు మొదలుపెట్టా కనుక, వారికి థాంక్స్!

Published in: on August 12, 2011 at 1:16 pm  Comments (3)  
Tags: ,

నిశ్యాలోచనాపథం-27

(నిశ్యాలోచనాపథం 26 తరువాత)
అనుకున్నట్లే నేను వెళ్ళి నిశి కి ఇదంతా చెప్పాను. తను ఏం మాట్లాడకుండా వినింది. తరువాత, కాసేపు ఏమీ మాట్లాడకుండా నేలని చూస్తూ కూర్చుంది. దానితో, నాకేం చెప్పాలో తోచలేదు. ఒక క్షణం భయమేసింది. తరువాత బాధేసింది. ఆపై దిగులు కలిగింది నిశి గురించి. జాలి కూడా రాబోయింది కానీ అవతలున్నది నిశి అని తెలిసి జాలి కాస్తా పావురమై గాల్లో ఎగిరి, పారిపోయింది. అలా రెండు నిముషాలు గడిచాయి. చివరికి కొంత ధైర్యం చేసి నేనే నోరు విప్పాను

“ఏమిటి నిశి…ఏం ఆలోచిస్తున్నావ్? నేను చెప్పింది నమ్మశక్యంగా లేదా?”
“కాదు. నిజం అయ్యుండొచ్చు. నాకు కూడా కొంతకాలం క్రితం ఇదే అనుమానం వచ్చింది”
“అవునా!” నమ్మలేకపోయాన్నేను.
“అవును. ఎంత కామరూపుడు అనుకున్నా, నా జీ ని చూసిన ప్రతిసారీ నాకెందుకో కా.పు. మొహమే కనబడేది. నా ఇంట్యూషన్ ని నేను నమ్మి ఉంటే పరిస్థితి ఇందాకా వచ్చేది కాదు”
“నీ జీ నీపాలిటి నాజీ అయ్యేలా ఉన్నాడు” అని మనసులో అనుకుని పైకి మాత్రం –
“ఏమైంది నిశీ ఇప్పుడు?? అసలు అనుమానం ఉన్నదానివి మరెందుకు అతన్ని నిలదీయలేదు?” అన్నాను.
“ఏమో! అతనితో గడిపే కాస్త సమయాన్నీ ఇలాంటి ప్రశ్నలతో, అనుమానాలతో గడపడం ఇష్టం లేకపోయింది”
“నీ మొహం! ఇది నీ జీవితం నిశీ!” అన్నాన్నేను ఆవేశంగా.
“తెలుసు” అంది నిశి నిర్లిప్తంగా.

“నిశీ…అసలేమైంది నీకు. ఎందుకిలా మాట్లాడుతున్నావ్? అతను నిన్ను మోసం చేస్తున్నాడో అని తెలిసాక ఎందుకు అతనితో బంధం కొనసాగించావు?”
“నీకు అర్థం అయ్యేలా ఎలా చెప్పేది? అసలు నాకే అర్థమైందో లేదో అర్థం కావట్లేదు.”
“నిజంగానే నాకు చిర్రెత్తుకొస్తోంది. ఇంత తెలివైన దానివి ఇలా చేశావేంటి నిశీ!”
“తెలివిని మించేవి, తెలివిని ముంచేవీ కొన్నుంటాయ్”
“ఈ చావు తెలివిటెటలకేం తక్కువలేదు!” విసుక్కున్నాన్నేను.
“తెలివితేటలకేనా చావు? మనసులకి ఉండదా?”
మళ్ళీ మొదటికొచ్చేలా ఉందే ఈ పిల్ల! అనుకున్నాను. సరిగ్గా నిశి పరిచయమైనప్పటి తొలినాళ్ళు గుర్తొచ్చాయి. మన జాగ్రత్తలో మనముండాలి కనుక,
“ఇప్పుడు ఈ అనుమానం దేనికి నిశీ. మనిషికి చావుంటే, మనసుకి ఉన్నట్లే గా” అన్నాను…వీలైనంత వైరాగ్యం ధ్వనింపజేస్తూ.
“ఏమో! మనిషి చావు ఒక్కోసారి మనిషి చేతుల్లోకి వస్తుంది. మనసు చావు సంగతి? మనసుకి ఆత్మహత్య చేసుకునే హక్కు కూడా లేదా?”
“అంటే? మనసు ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? తమ వదనం!”

ఉన్నట్లుండి నిశి కళ్ళలో నీళ్ళు తిరగడం మొదలైంది. నాకు కంగారు పుట్టింది.
“ఏమైంది నిశీ. పర్వాలేదు. అలా నీరుగారిపోకు. ఇంకా బోలెడు జీవితముంది. ఇన్నాళ్టి ఈ దారి ఎంత చిన్నదంటే, వందల వేళ్ళ మైళ్ళ ప్రయాణం చేసాక నీకు బహుశా ఇది గుర్తు కూడా ఉండదేమో”
“వందల మైళ్ళ తరువాత కదా!”
నాకేం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళీ తనే అంది.
“అంటే, ఆ వందలో వేలో …అంత సమయం గడిచే దాకా ఇలా గడపాల్సిందేనా?”
“కాలం ఏ గాయాలనైనా మాన్పుతుంది.” అన్నాను గంభీరంగా. ఒక కన్నాంబనీ, ఒక నాగయ్యనీ ఊహించుకుంటూ.
“హు! కాలం!” అని విరక్తిగా నవ్వింది నిశి.
అప్పటిగ్గానీ నాకు నేను చేసిన పొరపాటు అర్థం కాలేదు. అసలు గాయాలు చేసిందే కాలం కదా!
“ఓహ్…సారీ… ఏదో ఆలోచిస్తూ…” సిగ్గుపడుతూ అన్నాన్నేను.
“పర్లేదు లే” నిర్లిప్తంగా అంది నిశి.

“పోనీ, నా అంచనా పొరపాటేమో. మనకింకా నిర్ధారణగా తెలీదుగా. అతను మంచివాడే ఏమో.”
“మోసగాళ్లకు మోసగాడైతే అర్థం ఉంది. మోసపోయేవాళ్ళని మోసపుచ్చేవాడు మోసంచేయని వాళ్ళని కూడా మోసం చేస్తున్నపుడు మంచివాడు అని ఎలా నమ్మేది?”
“నీ మీద ఉన్న ఇష్టం కొద్దీ…”
“గాల్లో మేడలు కడుతూ, కట్టిస్తూ…” అని ఒక వెర్రి నవ్వు నవ్వింది నిశి.
“నిశీ! నీకు ఈ సంగతి ముందు నుంచే అనుమానం ఉందంటున్నావ్. మరి ఎందుకు ఇంతదాకా తీసుకొచ్చావు?”
“ఏమో!”
“ఏమో ఏమిటి? ఆ మాత్రం బుర్ర పెట్టి ఆలోచించలేకపోయావా? అప్పట్లో నేను అనుమానం వ్యక్తం చేస్తే కూడా నమ్మలేదు”
“మనసు మాట మనం వినాలే తప్ప మనసు ఎవరి మాటా వినదు”
“సూటిగా, ప్రేమలో పడి గుడ్డి దాన్ని అయ్యాను అని ఒప్పుకోవచ్చుగా”
“అలా కూడా అనుకోవచ్చు”
“నీ మొహం లే. అసలంత సూటిగా అతను నాటకం ఆడుతున్నాడు అని తెలిసాక కూడా ఎలా కొనసాగించావో. ఇంత తెలివైన దానివి ఇలా ఎలా నమ్మావో. మనిషి బాగున్నాడనుకుని ఇష్టపడిపోయావా? అతని శుష్క వాగ్దానాలు విని మునిగిపోయావా? నీ తెలివంతా ఓ ముసుగేనా? లోనంతా లొసుగేనా?” అంటూ నేనేదో ఆవేశంలో చెప్పుకు పోతూ ఉండగా –
“ఏహె, ఆపు. చిరాకేస్తోంది” అంది నిశి అసహనంగా.
“సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటూన్నావ్?”
“ఏమో!”
“ఏమిటి నిశీ ఇదీ!” అన్నాన్నేను విసుగుపుట్టి.

“నువ్వు ఒకే రోడ్డు పై పదేళ్లుగా వెళ్తున్నావు అనుకో. ఆ సంఘటనకి ముందూ… దాని తరువాతా కూడా ఆ రోడ్డులో తిరిగావు. కానీ… నువ్వు ఎన్ని సార్లు వెళ్ళినా, ఆ షాపు చూడగానే నీకు ఆ సంఘటనే ఎందుకు గుర్తు రావాలి?” అంది నిశి ఉన్నట్లుండి.
“ఏం రోడ్లు నిశీ? ఏం సంఘటన?” అన్నాన్నేను ఏమీ అర్థం కాక.
“రోడ్డు – జీవితం అనుకో. సంఘటన ప్రేమ అనుకో”- అన్నది నిశీ ఈ సారి స్పష్టంగా.
నిశీ బాధ ఇప్పటిదాకా చూచాయగా అర్థమైనది కాస్తా వచ్చి తానెలా నిశిలో తిష్టవేసుక్కూర్చున్నానో స్వయంగా నాకు చెప్పినట్లైంది. కానీ, ఏం జవాబివ్వాలో తోచలేదు.

“ఏమిటి నిశీ?”
“నేను కలల సౌధాలు కడతాను. అతను వచ్చి కూల్చి పోతాడు. నేను కడతాను. అతను వచ్చి కూల్చి వెళతాడు. నేను మళ్ళీ కడుతున్నా…అతను…”

అని నిశి అంతరంతరంతరంతరాళాల కథ చెబుతూ ఉండగా, దూరంగా అతను రావడం కనబడ్డది. నా దవడలు బిగుసుకున్నాయి. పిడికిలి కూడా బిగిసింది. నిశి మనసుతో బంతాట ఆడుతున్న వీడి సంగత్తేల్చాలని కోపంగా అనుకుంటూ, నిశి వైపు చూశానా – అంతే, ఆ కళ్ళలోని వెలుగు చూసి కొయ్యబారిపోయాను.

Published in: on March 17, 2011 at 8:51 am  Comments (2)  
Tags: ,

నిశ్యాలోచనాపథం-26 (Season-2 Begins :P)

ఆర్నెల్ల నాటి ఇరవై ఐదో భాగం ఇక్కడ చదవండి.
సీజన్ టూ

నిజానికి నాకు వెళ్ళే ఉద్దేశ్యం లేదు సుమండీ! ఏదో, కాలం కలిసిరాక, రాయలేకపోయానంతే! రాయడానికి సరుకులేదేమో అని గొణక్కండి. నిశి పక్కనుండగా సరుక్కు కొదవేమి? ఎటొచ్చీ, రాసే వీలుంటే కదా రాయడానికి. ఎందుకంటే, రాత్రంతా నిశితో సరిపోతోంది. పగలంతా నిశి ప్రియుడు, సదరు జీ గురించి ఆరాలు తీసేందుకు సరిపోతోంది. జీ ఎవరంటారా? లాభంలేదు. మీరోసారి వెనక్కి తిరిగి, అంతరంగాలూ…టిన్ టిన్ టిన్ టిన్..టిన్ టిన్ టిన్ టిన్..అనుకుంటూ పాత ఎపిసోడ్లు ఒక నాలుగన్నా (అంటే ఇరవై ఐదు నుంచి వెనక్కి వెళ్ళాలి) చదివి రండి.

వచ్చారా… ఇంతకీ, ఆ జీ కోసం ‘వస్తాడు నా రాజు..’ అని పాటలు పాడుకుంటూ నిశి ఎదురుచూస్తోందా. ఇప్పుడాఖరుకి ‘వస్తాడు నా రాజు’ సినిమా కూడా వచ్చేస్తోంది మన ప్రియతమ మంచు విష్ణుబాబుది. ఇంకనూ చూపులూ్,ఎదురుచూపులు,గిల్లి కజ్జాలూ,చిలికిన గాలివానలూ,తుఫానులూ,గ్రహ శాంతులూ నడుస్తూనే ఉన్నాయి. నడిస్తే నడిచాయి కానీండీ, నాకు బోలెడు పనై పోయింది. వీళ్ళిద్దరు తుఫానులో చిక్కుకున్నప్పుడు శాంతుల వైపుకు తీసుకురావాలా? శాంతి చేస్కుంటున్నప్పుడు పూజా గట్రా చేయించాలా? అంతా ముగిసి, వాళ్ళ ఏకాంత కబుర్లలో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కలకి ఏ రొమాంటిక్ మహాకవి ఆత్మో, ఏ సినిక్ ఆత్మో రాకుండా బయట కాపలా కాయాలా? వాళ్ళొస్తే, వీళ్ళకి డిస్టర్బెన్సు కదా మరి! ఇదంతా చేసేందుకు నా నిద్ర అంతా బలి ఇచ్చేస్తూ ఉన్నా దాదాపు ఆర్నెల్లుగా. అది చాలనట్లు, పగలంతా అతని పై నిఘా! నిఘా ఎందుకూ అంటే, నాకు మొదట్నుంచీ అతని వాలకం అనుమానాస్పదంగా ఉంది. పురుగు మనిషి అన్న కహానీ అంత నమ్మించేలా లేదు. అందుకని. అలా తిరిగి తిరిగి రెస్టు లేక, గత మూణ్ణాలుగు వారాలుగా రెస్టు తీసుకున్నా. అసలు కారణం వేరే ఉంది కానీ, ఆ సమయంలో షెర్లాక్ హోంస్ లా, బ్యోంకేశ్ బక్షీ లా, థింకింగ్ డిటెక్టివ్ లా ఆలోచించగా చించగా, అసలు మర్మం అర్థమైంది. దానితో, అర్జెంటుగా నా పరిశోధనా ఫలితాలను పంచుకోవాలని చాన్నాళ్ళ తరువాత నిశి కోసం వెళ్దామని ఇల్లొదిలాను. కానీ, తన్ని కలిసేలోపు అసలు జరిగినదేంటో చెప్పాలి కదా!

జీ గురించి నాకున్న సందేహాలనూ నిశికి చెప్పినప్పుడల్లా కొట్టి పారేస్తూ ఉండేది. ఒకానొకరోజు నా కళ్ళారా చూసిన నిజాన్ని ఒక దాన్ని తనకి చెబితే నమ్మలేదు. ఆరోజు గొడవపడి, అలిగి, చివరికి నేను నిద్రలేచేశాను. ఆ తర్వాత నుండీ రోజూ గుర్రుపెట్టి నిద్రపోడం అలవాటు చేసుకుని నిశిని కలవడం మానేశాను. అరె, మంచి కోరి చెబితే కూడా నమ్మకపోతే ఏలాగు? గొర్రెప్పుడూ కసాయీ వాణ్ణే నమ్ముతుందో లేదో తెలీదు కానీ, తోటి అమాయకపు గొర్రె ని మాత్రం నమ్మదు! ఎందుకంటే, ఏ గొర్రెకాగొర్రె పక్క గొర్రె తనకంటే అమాయకం, దానికేమీ ప్రపంచం తెలీదు అనుకుంటూ ఉంటుంది కనుక!

ఇంతకీ, అసలు సంగతేమిటంటే, నేను జీ గురించి నిఘా వేశా అని చెప్పా కదా. అతనికి తెలీకుండా అతన్ని వెంబడించడం కష్టమైపోయింది. సరేలే ఊరి చివర స్మశానం దగ్గర మాంత్రికులుంటారు కదా, వాళ్ళేమన్నా ఈ విషయమై సాయం చేస్తారేమో, సినిమాల్లోలా, అనుకుని, వెదుకుదామా అంటే, మా ఊళ్ళో స్మశానం ఊరి మధ్యలోనే ఉందే! అక్కడ చూస్తే ఏమో, ఆ రోడ్లో జన ఘోష బానే ఉంది. ఒక్కదాన్నే లోనకెళ్తే సందేహాలకి తావిచ్చినట్లౌతుంది రాతృళ్ళా మనకి కుదరదు! ఇప్పుడెలా? అనుకుంటూ, అక్కడికీ ఒకట్రెండు సార్లు నిశి వాడు టాటా చెప్పుకోగానే అనుసరించేదాన్ని, నిశి కి అనుమానం రాకుండా. వాడెప్పుడూ గూగుల్ ఆఫీసులోకి పోగా చూడలేదు. గూగుల్ ఆఫీసు ఉండే వీథిలోకి వెళ్ళడం తెలిసేది కానీ, అక్కడికెళ్ళి చూస్తే కనిపించేవాడు కాదు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. నా పగళ్ళన్నీ రాత్రుళ్ళోకి మారిపోయి ఆవిర్లైపోతున్నాయి కానీ, ‘జీ’ అనబడు జీజాజీ మూలాలు తెలిసాయి కాదు.

పోనీ, ఒక్కొక్కప్పుడు ముగ్గురం కలిసి కబుర్లు చెబుతున్నప్పుడు కూపీ లాగుదామా అంటే, ఎక్కడా? మహా తెలివైన వాడు. వీడిలో ఏదో తేడా ఉంది అన్నట్లే ఉండడు. మామూలు మనుషుల్లాగే మాట్లాడి, మామూలు విలన్ల లాగే బురిడీ కొట్టించేసి, మామూలుగానే మన ముందు హీరో లాగే ఉంటూ ఉంటాడాయె. ఒక పక్క నిశి ఏమో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇలా ఏదన్నా అనుమానం వ్యక్తం చేస్తే కొట్టిపారేశేది. అతగాడూ జగజ్జంత్రీనే. అసలు వాళ్ళ సంబంధాలెలాగున్నా కూడా, రోజుకి వందసార్లు ‘మై స్వీట్ హార్ట్’ అనో, మరేదో దిక్కుమాలిన పేరో పెట్టి పిల్చేసి ప్రేమ ఒలకబోసేసేవాడు. నిశితో అతనిగురించి నేనేదన్నా వాగానన్న అనుమానం వస్తే, ఆరోజు మనం ఎంత బా ఎంజాయ్ చేసామో గుర్తుందా? మొన్నోరోజు నువ్వు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చావు గుర్తుందా? (ఇది నాకూ సర్ప్రైజేనండోయ్! నిశిలో ఇంత రొమాంటిక్ మనిషుందని అనుకోలేదు!!) అదీ ఇదీ అని మాటల్లో ముంచెత్తి, అసలు విషయం కప్పెట్టేసేవాడు. సర్లెద్దూ, నిజంగానే అతను పురుగు మనిషేమో, అనుకుందామన్నా కూడా, ఏమిటో, నా మనసు స్థిమిత పడి దాన్ని ఒప్పుకోలేకపోతోంది.

ఇలా సందిగ్ధంలో పడి కొట్టుకుంటున్న రోజుల్లో ఒకరాత్రి నిశిని కలిసేందుకు వెళ్తున్నప్పుడు దారిలో ఒకడు బైకు పై కూర్చుని కనబడ్డాడు. బైకు దిగి, ఏదో మంత్రం చదవడమో ఏదో చేసాడు. అది గబుక్కున గోళీ సైజుకి మారితే, దాన్ని పాకెట్లో వేసుకున్నాడు. ఆర్రె! మన కా.పు. ఏమైపోయాడిన్నాళ్ళూ! అనుకుని హాయ్! అన్నాను. ఈల వేస్కుంటూ వెళ్ళిపోబోతున్నవాడల్లా వెనక్కి తిరిగి చూశాడు. నన్ను చూడగానే కాస్త తత్తరపడ్డాడు. మళ్ళీ తమాయించుకుని – ‘హాయ్’ అన్నాడు.
‘ఏమండీ, ఎలా ఉన్నారు?’ అని అడిగాడు, నా చుట్టుపక్కల చూస్తూ.
‘నిశి ని కలిసేందుకే వెళ్తున్నా. వస్తారా?’ అన్నాను.
‘అబ్బెబ్బే, వద్దులెండి. ఎందుకూ…’ అన్నాడు మొహమాటపడిపోతూ.
‘పర్లేదు, రండి. ఇంతకీ, మీరేమైపోయారసలు? ఆమధ్య ఆ జీవితాన్ని నిశి వాయించినప్పటి నుంచీ కనబడలేదూ?’
‘పగిలిన గుండె నాది. చిరిగిన చొక్కా జీవితానిదీ అన్నాడతను దీర్ఘంగా నిట్టూర్చి.
‘మీ గుండెందుకు పగిలింది? నిశి మీరంటే ఇష్టం లేదని ముందే చెప్పేసిందిగా’ అన్నాన్నేను. అనేసి నాలిక్కరుచుకున్నా. ఎంతైనా కూడా, అలా మొహమ్మీదే – ‘నీది ఫెయిల్యూర్ స్టోరీ బే!’ అంటే ఎవరికన్నా బాధేస్తుంది కదా అని. కానీ, అతను అదేదీ పట్టించుకున్నట్లు లేదు. ఆ, ఇలాంటివన్నీ పట్టించుకుంటే కాలపురుషుడి డ్యూటీ చేయలేడుగా!
‘ఆ వేళ కాదు లెండి. నిశికి నేను నచ్చలేదు అని తెలిసినప్పటి నుంచి నాది బ్రోకెన్ హార్ట్ అయింది.’ అన్నాడు నెమ్మదిగా.
‘మరి ఇప్పుడలా కనబడ్డం లేదే. ఎంచక్కా ఈల కూడా వేస్తున్నారు?’ అన్నాన్నేను. నిశి నన్ను పూనినట్లు, ఏమిటీ వెధవ క్రాస్ ఎగ్జామినేషన్? అనుకున్నా నాలోనేనే.
‘నిశి కి నచ్చేలా నేను మారగలనేమో అనిపిస్తోంది ఈ మధ్య. అందుకనీ..’
‘ఎలా?’ అన్నాన్నేను.
‘ఎలాగంటే…’ అని ఏదో చెప్పబోయి ఆగాడతను. ‘ఏదో ఒకటి. నీకెందుకమ్మాయ్ అదంతా?’ అన్నాడూ చిరాగ్గా.
‘మీరు ఏం చేసినా వర్కవుట్ అవదు. తనకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు’ అని అన్నాను.
అతను నవ్వాడు. మరేం మాట్లాడలేదు. ‘వస్తాను, కొంచెం పనుందీ అని చెప్పి వెళ్ళిపోయాడు.

-ఇలా రెండు మూడు సార్లైంది. కరెక్టుగా నిశి ని కలిసేందుకు వెళ్ళే సమయంలోనే ఇతనెందుకు కనిపిస్తున్నాడు? నిశి లవ్ అఫైర్ సంగతి చెప్పా కనుక, చెడగొట్టేందుకే ఇలా అనుసరిస్త్రున్నాడేమో? అని అనుమానం కలిగింది. కానీ, ఒకరోజు నేను వీళ్ళకి టాటా చెప్పి వెనక్కెళ్ళిపోతున్నప్పుడు చూసిన దృశ్యం నేను అవాక్కయ్యేలా చేసింది. నేనేదో దారి తప్పి, మళ్ళీ ఐదునిముషాల క్రితం నడిచిన వీథిలోకే రావడం తటస్థించింది. అక్కడ ఎవరో ఇద్దరు నిలబడి మాట్లాడుకుంటున్నారు. దూరం నుంచి ఎవరో తెలీలేదు. కానీ, వాళ్ళెవరో పోల్చుకున్నాను. బైకుని బట్టి కా.పు. ని, షర్టును బట్టి జీ నీ పోల్చుకున్నా. అక్కడే ఆగి వాళ్ళని గమనిస్తూ ఉండగా, కాసేపటికి జీ కా.పు. నుండి కీస్ తీసుకుని, బైక్ లో ముందు ఎక్కాడు. కా.పు. వెనక కూర్చున్నాడు. తరువాత ఇద్దరూ ఆ బైక్ ఎక్కి వెళ్ళిపోయారు. ఆ విషయమే నిశి కి చెబ్దామని తనకోసం వెదికితే దొరకలేదు. మరుసటి రోజు అతనొచ్చేలోగా వెళ్ళాలని హడావుడిగా పరుగులాంటి నడకతో వెళ్ళాను. నిశి ఆ వైపు నుంచి – ఏదో ఇళయరాజ రొమాంటిక్ పాటను హమ్ముకుంటూ వస్తోంది.

తన్ని చూస్తే జాలేసింది కానీ, తప్పదు. నిజాలు ఎప్పుడూ ఇంతే!
నిశి దగ్గరకెళ్ళి నిన్న నేను చూసిన దృశ్యం చెప్పాను. ఒక క్షణం మాట్లాడలేదు. తరువాత, ’వాళ్ళిద్దరూ మనిద్దర్లా ఫ్రెండ్సేమోలే…’ అనేసి మళ్ళీ హమ్మడం మొదలుపెట్టింది.
ఇంత తెలివైన నిశి ఈమధ్య ఇలా తయారవుతోంది ఏమిటి? అనుకున్నా. ఉంటే ప్రేమా, లేకుంటే బుద్ధి – రెంటికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆమాత్రం తెలియదూ – మనసు అవకాశవాణిగా మారి సెలవిచ్చింది, సందు దొరికింది కదా! అదిగో, అక్కడే మాటా మాటా పెరిగి, మాట్లాడ్డం మానేశా.

“ఇష్క్ పర్ జోర్ నహీ, యే వో ఆతిష్ హై గాలిబ్
కి లగాయే న లగే, ఔర్ బుఝాయె న బుఝే”

(ప్రేమ మీద బలాత్కారము సాగదు. అది ఏ అగ్నిహోత్రమో తెలుసా గాలిబ్! అంటిస్తే అంటుకునేది కాదు, ఆర్పితే ఆరేది కాదు)
-అని ’గజల్ ఒక అగ్ని’ అంటూ శేషేంద్రుడు చెప్పిన గాలిబ్ ఉదాహరణ గుర్తొచ్చింది.

కానీ, నా పీతబుర్రకి ఒక పాయింటు తట్టేందుకు ఇన్నాళ్ళు పట్టింది. అదేమిటంటే, కా.పు.,జీ ఒకరే అని. ఆవేళ కాపు, జీ వెళ్తూంటే కా.పు. బైకును జీ నడిపాడు అన్నా కదా. నిజానికి కా.పు. ల బైకులు వాళ్ళు మినహా ఇంకోళ్ళు నడపలేరు. అంటే, జీ కూడా కా.పు. నే అయ్యుండాలి కదా. ఆ బైకు వాడు ప్రస్తుతం డ్యూటీలో ఉన్న కా.పు.నో, లేదంటే వాళ్ళ బ్యాచ్ లో ఇంకోడో అయ్యుంటాడు. నిశి నీకు దక్కదు అన్నపుడు కా.పు. ఎందుకలా నవ్వాడో ఇప్పుడు అర్థమైంది. అందుకే నిశిని కలిసేందుకు ఈ పరుగు!

Published in: on January 4, 2011 at 6:20 pm  Comments (4)  
Tags: ,

నిశ్యాలోచనాపథం-25

ఇరవై నాలుగో భాగం తరువాత…..

“అతను ఒకప్పుడు పురుగు”
“పురుగేమిటీ? ఏం పురుగూ?” అన్నాన్నేను అయోమయంగా
“అతను ఒకప్పుడు పురుగు. ఒకానొక గదిలో, కొంచెం ఎత్తుకి ఉండే ఒక అల్మారాలో ఆ కుటుంబం నివాసం”
“ఆహా…”

“అతనికి పాతపేపర్ల వాసనంటే ఇష్టం. రెండు కాగితాల వెచ్చని బిగి కౌగిలిలోకి దూరిపోయి ఇరుపక్షాల ముద్దుల్నీ తానే పొందడం మరీ ఇష్టం. ఆపై, రాత్రుళ్ళు అవే కాగితాల దుప్పట్లలో సువాసనను ఆగ్రాణిస్తూ నిద్రలోకి జారుకుంటూ ఉంటాడు. ఒక్కోసారి పగలూ రాత్రీ తేడా తెలీదు, ఆ అలమారా ఎక్కువరోజులు తెరవబడకపోతే. అలా ఓసారి అయింది. ఇతను ఎప్పట్లాగే ముసుగు తన్ని పడుకుని ఉన్నాడు.”

“ఏదీ..ఇతనంటే, పురుగే?” – ఆసరికే కాగితాల మధ్య ముసుగు తన్నే జీవిని ఊహించుకుంటున్న నేను మధ్యలో అడ్డుకున్నాను.
“అవును, ఇతనే. నువ్వు మొదట విను. ప్రశ్నలెయ్యక.”
“సరే, చెప్పు”

“అలా పడుకుని ఉండగా, ఉన్నట్లుండి భూమి కదిలిపోతున్న అనుభూతి కలిగింది. గాల్లో తేలిపోతున్నట్లనిపించింది. తను పడుకున్న కాగితాల మంచం మెలికలు తిరుగుతూ తలక్రిందులైంది. దానితో అతనికి పట్టు తప్పింది. కిందకి చూశేసరికి కళ్ళు బైర్లు కమ్మాయి. అంతే – అదే అతని కుటుంబానికి శాశ్వత వీడ్కోలిచ్చిన రోజని అప్పటికి అతనికి తెలీదు.”

“ఎందుకో?”
“అతను అప్పటికి ముక్కుపచ్చలారని పసి పురుగు. అందునా, అతనికేం తెలుస్తుంది, తాను వేరే ప్రపంచంలోకి వెళ్తున్నాడనీ, తన కుటుంబసభ్యులు ఇక అక్కడ ఉండరనీ!”
’పసి పురుగా…మసి.. గసి..నిశి…మూసీ!’ అని కసిగా అనుకున్నా మనసులో. పైకి మాత్రం – ’తరువాతేమైంది?’ అన్నాను.

“అలా పడ్డం పడ్డం ఏదో నగరంలో పడ్డాడు. అంతా అద్భుత ప్రపంచంలా ఉంది. ఎవరికి వారు తమకు నియమిత ప్రదేశాల్లోనే తిరుగుతూ, పక్కా ఆర్గనైజ్డ్ గా పనులు చేస్కుంటున్నట్లు అనిపించింది ఇతనికి. ’

’ఏదీ…అంత చిన్నప్పుడే అంత స్పృహ ఉండేదా?’
’ఏమో..పెద్దయ్యాక గుర్తు తెచ్చుకుంటే అతనికి గుర్తున్న దృశ్యం అదే.’
’ఓహో…సర్లే, కానీ’ అన్నాన్నేను మళ్ళీ.

’ఆపై అక్కడో పెద్ద ఆఫీసు కనబడ్డది. పైన పెద్దగా – వాళ్ళ సైజుకి తాటికాయంత అక్షరాల్తో – ’మదర్ బోర్డ్’ అని రాసి ఉంది.’
’అబ్బో… ఐతే, పడ్డం పడ్డం గురుడు సీపీయూ లో పడ్డాడా?’
’అవును. భలే పడ్డాడు కదూ…’
’మరే! నీకేంలే… ఎన్నైనా చెప్తావు’ అని మనసులో అనుకుని, పైకి మాత్రం – ’అవునుస్మీ! విడ్డూరం కాకుంటే, సరిగ్గా ఆ అలమారా కింద కంప్యూటర్ ఉండటం ఏమిటో, దానిలోపలే ఇతను పడ్డం ఏమిటో – విష్ణుమాయ!’ అన్నాను.

’అతని తల్లిని ఇంకా చిన్నతనంలో ఇలాగే అలమారా ప్రమాదంలో పోగొట్టుకున్నాడు. అందుకే మదర్ బోర్డని బోర్డు చూడగానే, కొంత ఉద్వేగానికి లోనై, లోపలికెళ్తే వాళ్ళమ్మ దొరుకుతుందేమో అని, ఆ గేటు వద్ద దూరి లోపలికెళ్ళిపోయాడు. ఇక కాంపౌండులో అయోమయంగా తచ్చాడుతూంటే ఒక బస్సు కనబడ్డది. అందులోకి వెళ్తున్న ఎవరో జీవి ప్యాంటుకి తగులుకున్నాడు ఇతను. ఇంతలో బస్సు కదిలి లోపలికెళిపోయింది.’

’ఆ జీవి – ప్యాంటు వేసుకున్నాడు. ఇతనెళ్ళి అతనికి తగులుకున్నాడా?’
’ఆ జీవి ఆడో, మగో, అసలాజీవుల్లో అలాంటి భేదాలున్నాయో లేదో – ఇదంతా చెప్పలేదు ఇతను. చిన్నవాడు కదా అప్పటికి. పైగా పురుగాయె. మనలాగా ఆలోచించి విశ్లేషించలేడు కదా’ అంది నిశి.
’అబ్బో! ఈవిడకి కవరింగ్ కూడా ఎక్కువైపోయింది…’ అనుకున్నా మనసులో.
’సరే, చెప్పేది విను. ఆ జీవితో ఆ ఆఫీసులోకి వెళ్ళాడా…లోపల అతగాడు డోర్ మాట్ వద్ద ఓసారి కాళ్ళు దులుపుకోగానే, ఇతను ఎగిరి పక్కనే ఉన్న రెండు గోడల్లా కనిపిస్తున్న వాటి మధ్య ఇరుక్కుపోయాడు.’
’గోడలా?’

’నాకాట్టే తెలీదు కానీ, ఏ ఐసీలో, వేరేదో చిప్పులో ఐ ఉంటాయి అనుకుంటూన్నా.’
“ఓహో…అంతేలే..పురుగు, అందునా పసి పురుగు…. గోడల్లాగే కనిపించి ఉండొచ్చు’ అన్నాను నేను కూడా సమాధానపడి.
’సరే…అలా ఇరుక్కుపోయాడా…విద్యుత్ ప్రవాహం ఒకానొక సందర్భంలో అతన్ని ఆపాదమస్తకం ముంచేసింది…’ అని నిశి ఏదో చెప్పబోతున్నంతలో

’అరెరె..పాపం! ఏమైంది తర్వాత?’ అన్నాన్నేను ఖంగారులో. నిజంగానే భయం పుట్టింది మరి. అంత విద్యుత్ ముంపుకి గురైతే ఎలా? అని.
’మొదటైతే స్పృహ కోల్పోయాడు.’

’తరువాత?’
’కాసేపటికి కోలుకున్నాడు – బైటకి వెళ్ళేందుకు చిన్న దారి కనిపిస్తే, బైట పడ్డాడు. మామూలు లోకంలోకి వచ్చాడు. వచ్చి చుట్టుపక్కల చూస్తూంటే అంతా ఇలాంటి ఇళ్ళే.’
’అంటే?’ అన్నాన్నేను అర్థం కాక.
’అతనేదో బోలెడు సీపీయూలు ఉన్న గదిలో ఉన్నాడు. ఏదో కంపెనీ సర్వర్ రూమ్ కాబోలు.’ అంది నిశి.
’అదేమిటి? అతను ఏదో అలమారాలో ఉండేవాడు కదా.’
’నాకూ అదే అనుమానం వచ్చింది కానీ – రెండు జరిగుండొచ్చు. ఒకటి – ఆ అలమారా సర్వర్ రూమ్ ది అయి ఉండొచ్చు. రెండు – ఆ తరువాత అక్కడ సర్వర్ రూమ్ ఏర్పడి ఉండొచ్చు.’ అంది నిశి సాలోచనగా.
’సర్లే, ఏదో ఒకటి. అసలు కథ వదిలేసి ఈ ఈకల్లాగడం ఎందుగ్గానీ.. తర్వాతేమైందో చెప్పు’ అన్నాన్నేను ’మనకెందుకు పోనిస్తూ’ అనుకుంటూ.

’అతను బైటకొచ్చి చూస్తే, అంతా ఇలాంటి ఇళ్ళే. ఏం చేయాలో తోచక…నెమ్మదిగా ఎగురుకుంటూ అన్నీ దాటుకుంటూ వచ్చాడు. ఇంతలో ఎక్కడో ఏవో గంటలు వినబడ్డాయి (అవి గడియారం గంటలని తర్వాత అర్థమైంది). ఆ దిక్కు వెళ్దాం అని ఇతను అనుకునేంతలో అతనిలో ఏవో ప్రకంపనలు గమనించాడు. అరనిముషం పాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి. ఆపై చుట్టూ చూస్తే ఏముందీ – ఇందాకటి ఇళ్ళన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. పైగా…ఇందాక ఎగిరి ఎగిరి తిరిగిన చోటంతా ఇప్పుడు తన ఎత్తే ఉంది.’

’భూకంపం గానీ వచ్చి అవన్నీ కూలిపోయాయా ఏం?’ అన్నాన్నేను.
’కాదు. విద్యుత్ ప్రకంపనలు అతని శరీరంలోకి వెళ్ళి – ఏం జరిగిందో తెలీదు కానీ, అతనికి మానవ రూపం వచ్చింది.’
’వాట్! అలా కూడా జరుగుతుందా? సై-ఫై కూడా ఇంత ఎదగలేదే. నువ్వెంత ఎదిగిపోయావ్ నిశీ…’ అన్నాన్నేను.
’నోర్ముయ్! ఇదంతా నిజం. కావాలంటే అతనొస్తాడు, చూస్కో.’
’నమ్మలేకపోతున్నాను. ఇట్స్ అబ్సర్డ్’
’బట్ ట్రూ..’ అని పూర్తి చేసింది నిశి.

’అయితే, అతను మనిషైపోయాడా – పురుగు విద్యుత్ లో మునకేస్తే మనిషౌతుందా అయితే?’
’అది నాకు తెలీదు అమ్మాయ్. అతను నాకు చెప్పిన కథ ఇది. నమ్మక తప్పట్లేదు.’
’నువ్వు చూశావా అతను పురుగుగా మారడం?’
’లేదు. రాత్రి పగలయ్యేవేళకి అతని రూపం మారుతుంది. నాదీ అదే కేసు కదా. అదే సమయంలో నా ఉనికి మారుతుంది.. కనుక ఆ సమయంలో మేము కలుసుకోలేము. కానీ, అది నిజమే అని మాత్రం అర్థమైంది.’
’ఎలా?’
’సరిగ్గా – ఈ కారణాలు అని చెప్పలేను కానీ, అతను కలిసేదీ, విడిపోయేదీ చాలా మటుకు ఒకే ఆఫీసు ప్రాంతాల్లో.’
’ఎక్కడ?’
’ఆ ప్రాంతాల్లో నాకు తెల్సిన ఏకైక కంపెనీ గూగుల్. కనుక అతను గూగుల్ లోనే నివసిస్తాడు అని నేననుకుంటున్నాను’
“ఓహో… సరే, గూగుల్ అనే ఫిక్సవుదాంలే ప్రస్తుతానికి’

’అదీ కథ.’
“ఓహో – పాపం. పిచ్చి జనాలు. ఒక ’నాని’, ఒక ’కీలుగుర్రం’, ఒక పురుగు – అనమాట. ఇంతకీ, ఇతని పేరేమిటో?’
’గూగుల్ నుంచి వచ్చాడని అనుకుంటూన్నాం కనుక, జీ అందాం.’
’పేరు చెప్పేందుకు కూడా రహస్యమే?’
’వస్తాడు గా…అప్పుడు అడుగు.’
నాకైతే, నేపథ్యంలో ’వస్తాడు నా రాజు ఈ రోజు..’ అన్న పాట వినబడ్డట్లైంది!
ఇంతలో ’వచ్చేస్తున్నాడు నా రాజు…’ అని నిశి పాడినట్లై ఇహలోకంలో పడ్డా. నిశి సెల్లు చూస్కుంటూ కళ్ళలో మెరుపుల్తో మురిసిపోతోంది.
’ఏమిటీ కథ? అతగాడు ఏతెంచుచున్నాడా?’ అన్నాన్నేను.
సిగ్గు పడ్డట్లుంది – నవ్వింది.
అబ్బో! నిశి సిగ్గుపడ్డం అంటే ఏమిటో తెలుసా? జన్మానికి ఒకే శివరాత్రి అన్నంత అరుదు!
’సిగ్గే!’ అని, మనసులో ’నీ సిగ్గు బొగ్గవ్వా’ అనుకుని, ’చా! పాపం! నీ సిగ్గు చిరు మొగ్గవ్వా’ అని మళ్ళీ లెంపలేస్కుంటూ అనుకుని, ’ఏమిటి నిశీ సంగతి?’ అన్నాను.
’…..’
’తనొస్తున్నాడు. విషయం చెప్పేశాక ఫేస్ టు ఫేస్ చూస్కోడం ఇదే తొలిసారి’
’మరైతే నేనెళ్ళొస్తా నిశీ…’ అన్నాన్నేను.
పర్లేదు ఉండు, అంటుందేమో అనుకున్నాగానీ – ’సరే, రేపు కలుద్దాం లే.’ అంది!!

Published in: on July 24, 2010 at 9:27 pm  Comments (3)  
Tags: ,

నిశ్యాలోచనాపథం-24

(ఇరవై మూడో భాగం తరువాత)

నిజం చెప్పొద్దూ నాకు ఆవేళ విడిపోయిన క్షణం నుండీ మళ్ళీ రాత్రెప్పుడౌతుందా..ఎప్పుడు నేను పడకేస్తానా….అని మహా ఉబలాటంగా ఉండింది. అయితే, ఇక్కడో చిక్కుంది – నాకు ఏ దారుల్లో నడుస్తూంటానో తెలీదు. సాధారణంగా – నిశి గానీ, కా.పు. గానీ – వాళ్ళే నేను ఎక్కడున్నానో కనుక్కుని నన్ను చేరుకుంటూ ఉంటారు. లేదంటే, యాధృచ్ఛికంగా మేము ఒకళ్ళకొకళ్ళం తగులుకుంటూ ఉంటాము. ఇప్పుడీ జీవన్ గారు (అతగాడి పేరేమిటో కానీ, నేనే జీవన్ అని పెట్టేశా – జీవితానికి మానుష రూపం కదా!) ఉన్నారే, ఆయన్ని కలవాలంటే ఎలా?

సరే, పగలంతా ఆఫీసు పనితో పాటు ఇది కూడా ఓపనిగా – అసలీ నిశాచరజీవులపై ఏమన్నా లిటరేచర్ ఉందేమో అని సర్వే చేశాను. ఉండొచ్చేమో కానీ నాకు తగల్లేదు. కుదిరితే నిశిని అడగాలి అని అనుకున్నాను. ఎందుకన్నా మంచిదని తనకో ఈమెయిల్ చేశాను – చూసినప్పుడు చూస్తుందిలే అని – ’నీతో కాసేపు ఏకాంతంగా మాట్లాడాలి…వీలౌతుందా..?’ అని. అన్నట్లు చెప్పలేదు కదూ – తనకో ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది. జీమెయిల్లో. భూమి మొత్తానికి ఈమెయిల్ – అన్న స్కీములో తాను కూడా ఈమెయిల్ వాడాల్సి వస్తోందట. ఆమధ్య విసుక్కుంటూ చెప్పింది. సరే, ఎలాగో మెయిల్ చేసేసా కనుక, తానది చూస్కుని నాకు కనిపిస్తుందని ఆశించాను. ఇప్పటిదాకా నేను గమనించిందేమిటంటే, నిశి లేకుండా తక్కిన పాత్రలు – కృష్ణశాస్త్రి గారిని మొదలుకుని జీవన్ దాకా – నేనెప్పుడూ ఒంటరిగా కలవలేదు. అప్పుడెప్పుడో నిశి పరిచయం కాక ముందు శ్రీశ్రీ గారిని పలకరించాను అనుకోండి, అది వేరే కథ. తను పరిచయమయ్యాక, తానే నాకు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్.

సర్లెండి, ఆమాటలకేం గానీ, రాత్రైంది…పుస్తకం కాసేపు చదివి ముసుగేశేశాను. కాసేపటికి – రోడ్డున పడ్డాను. రాత్రి రోడ్ల సొగసు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నిజానికి. అసలుకైతే, నేను ఏ ఊరి రోడ్లలో సంచరిస్తూ ఉంటానో నాకంతగా అర్థం కాదు. అయితే, రోడ్ల స్వభావాన్ని బట్టి ఏ చిక్కబల్లాపూరు దగ్గరో ఉండి ఉండొచ్చని ఊహిస్తున్నా. ఎలా? అని అడక్కండి – అక్కడికి రాగానే ఎందుకో నాకు చిక్కబల్లాపురం అనాలనిపించిందంతే! ఆమధ్యోసారి ఆప్రాంతాల్లోనే స్కందగిరి కి వెళ్ళాలని అర్థరాత్రి ఒంటిగంటకి కష్టపడి వెళ్తే, అక్కడేదో మర్డరయ్యిందని, కొండపైకి వెళ్ళేందుకు అనుమతి లేదనీ తరిమేశారు. తీరని కోర్కెలతో చస్తే దయ్యాలౌతారు అంటారు కదా. తీరని కోర్కెలతో బ్రతుకుతూ ఉంటే, కలల దయ్యాలౌతారు. కలల దయ్యాలంటే – కలలలో మాత్రమే కల్లోలాలను సృష్టిస్తారు. నిజాల్లో కల్లోలాలు అనుభవిస్తారు అనమాట. నిశి లాంటోళ్ళు. నేను కూడా స్కందగిరికి వెళ్ళాలన్న తీరని కోర్కెతో ఉన్నా కనుక, జూనియర్ కలల దయ్యాన్నే అనుకుందాం కాసేపటికి.

అవతల వైపు నుంచి గలగలమని నవ్వులు వినబడ్డాయి. ’ఒహ్…అయామ్ సో ఈగర్ టు సీ యూ….స్వీట్ హార్ట్…’ అని ఇంకా ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో ప్రేమికుల్లే అనుకుందామనుకున్నాకూడా, అరక్షణంలో ఆ మాట్లాడుతున్న గొంతు నిశిది అని అర్థమై కొయ్యబారిపోయాను. “అసలు – ఈవిడకి ప్రియుడెక్కడ్నుంచి వచ్చాడిప్పుడు? ఈవిడకో పాత లవ్ స్టోరీ ఏదో ఉండాలి అని అప్పుడెప్పుడో అన్నట్లే గుర్తు. మరి జీవన్ కథో? అసలైనా స్వీట్ హార్ట్ అంటే లవర్ అని ఎందుకనుకోవాలి? మంచి ఫ్రెండుకావొచ్చుగా… మన సినిమాలు చూసి చూసి ఇలా చాదస్తంగా తయారౌతున్నానేమిటి?” – ఇలా రకరకాలుగా అనుకుంటూ ఆ దిక్కుకి వెళ్ళాను. చూస్తే నిశి నే! నన్ను చూడగానే, ’హేయ్! వాస్సప్?’ అంటూ ఎదురొచ్చింది. ఇదేమి ఆవేశమో, ఇదేమి ఉత్సాహమో…ఎందుకో…ఏమిటో… -మనసు పరిపరివిధాల పోతోంది.

’ఇవాళ నీకో ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను’ – నిశి కళ్ళలో వెలుగు.
’అది కాదు నిశీ…నీతో కాస్త ప్రైవేటుగా మాట్లాడాలి.’
’అతనొచ్చేసరికి టైమౌతుందిలే..అప్పటిదాకా మనం మనమే, ఎంచక్కా.’
’అది కాదు…ఆ జీవితం గారూ, కా.పూ. వీళ్ళంతా కూడా ఉన్నారు కదా..’
’వచ్చినప్పుడు చూద్దాంలే. ఇవాళ నాకు పనుంది. వాళ్ళతో వాదించే ఓపిక లేదు. అయినా, జీవితాన్ని క్షమించేద్దాం అని నిర్ణయించుకున్నాను.’
’ఏమిటీ?????’ అరిచాను నేను అవాక్కై.
’అవును, ఇప్పుడు వాడి డొక్క చించి నేను సాధించేదేముందీ? జిందగీ ఈజ్ ఎనీవే ఏక్ కుత్తీ చీజ్. దాని బుద్ధి అంతే!’
’అదేమిటి నిశి – నువ్వు…నువ్వు….ఇంత తాపీగా…’
’నిన్న బాగా ఆలోచించాను. జీవితాన్ని నిలదీసి, పిడిగుద్దులు గుద్ది, ఆఖర్న పొడిచినా కూడా, నాకు ఒరిగేదేమిటి చెప్పు? నేనప్పట్లాగే ఏకాంకికలో ఏకైక పాత్రనే.’
’ఓహో..అలా అలోచించావా…బాగుంది. నిజమే లే… – “నువ్వెందుకు నా జీవితం నాశనం చేశావ్..చెప్పూ చెప్పూ..” అని మొత్తుకున్నా, అవతల శాల్తీ చెప్పినా – ఆ తరువాతేమౌతుంది? మనకి మంచి జరిగేదేమీ ఉండదు కద…’ నేను కూడా అదే విధంగా ఆలోచించి అన్నాను.
’ఎజ్గాక్ట్లీ…’ అన్నది నిశి.
’అయితే, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడికొచ్చినా కూడా నువ్వేమీ చేయవా జీవితాన్ని?’
’ఇగ్నోర్ చేస్తాను’ – ఆ జవాబుకి ఒళ్ళు జల్లుమంది.
’అయినా, అసలు నేను పరిచయం చేస్తా అన్న వ్యక్తి గురించి అడగవేం?’ – మళ్ళీ తనే అంది.
’ఓహ్…అవును కదూ…ఈసారెవరు? కాలం అయింది….జీవితం అయింది….. ఇక ఎవరు? ప్రేమా? ప్రేమ వస్తే, దాన్ని కూడా నరుకుతా అని మీద పడు. అదొక్కటి అయితే, పిక్చర్ పర్ఫెక్ట్’ అన్నాను నేను. ఈ నిశీ, ఈమె వల్ల నాకు పరిచయమయ్యే శాల్తీలూ – ఒక్కరు కూడా మామూలు మనుష్యుల్లా మాట్లాడ్డం లేదు. ఇప్పుడొచ్చే వాడెవడో….. అనుకుంటూ.

’నేను – అతన్ని ఇష్టపడుతున్నాను…’
’ఇష్టమా? అంటే?’
’అది…. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం…’
’ప్రేమా…నువ్వా…?’ అరిచాను మళ్ళీ. ప్రేమ కి మానుష రూపం అంటే – ఇలా వస్తాడనుకోలేదు…నిజంగా!!!
’హుమ్….అవును.’
’ఇదెప్పట్నుంచి??’
’కొన్నాళ్ళుగా జరుగుతోంది కానీ…. అది ఒకరికొకరు చెప్పుకోలేదు. నిన్న జీవితంతో గొడవ అయ్యాక, అతనికి కాల్ చేసాను, ఆపై ఈ నిర్ణయం తీసుకున్నాను.’
’నువ్వు తీసుకుంటే చాలా?’
’అతను ఎప్పుడో తీసుకున్నాడు. అతని ఒంటరి జీవితానికి నేను తోడు కావాలని కవిత్వాలు కూడా ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు కొన్ని నెలలుగా’
’నిశీ… ఇదేనా స్నేహమంటే? ఎందుకిలా మోసం చేశావు నన్ను?’ అందామనుకున్నాను. కానీ, మరీ అక్కడికి ఆమేదో నన్ను ప్రేమించి మోసం చేసినట్లు ఉందనిపించి.. ’నాకిన్నాళ్ళూ చెప్పనేలేదేం?’ అన్నాను కాస్త కోపంగా.
’ఏమి చెప్పేది అమ్మాయ్…నేనే ఎటూ తేల్చుకోలేక ఉన్నాను. ఆ జీవితం నిన్న ఎదుటపడేదాకా నాకేం చేయాలో తోచింది కాదు. వాడ్ని కాసేపు వాయించాక, అమ్మోరులో విలన్ని చంపిన అమ్మోరు శాంతిస్తుందే…అలా కోపం చల్లారింది. దానితో, మైండు పనిచేసి, ఈ నిర్ణయం చేసుకున్నాను.’
’ఓహో….అయితే, ఏమిటీ మీ తదుపరి కార్యక్రమం?’
’ముందు నిన్ను అతనికి పరిచయం చేస్తాను. ఈ భూమ్మీద నన్ను కాస్తో కూస్తో అర్థం చేస్కున్నది మీరిద్దరేగా.’
నిజం చెప్పొద్దూ తను అలా అనగానే నేను కరిగిపోయాను. కోపం పోయింది.
’సరే, అసలు మీ కథ చెప్పరాదు? ఎప్పుడు కలిసావు? అప్పటికి నేనెక్కడున్నా?’

’అప్పటికి నీతో పరిచయం కాలేదు. ఇలాగే రోడ్లలో సంచారం చేస్తూ ఉంటే కలిసాడు.’
’అయితే, నిశీ, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా?’
’అంటే నీ ఉద్దేశ్యం?’
’మొదట్లో నేను నువ్వే అనుకున్నా. తరువాత కా.పు. కనిపించాడు. తరువాత ఇతను..’
’అబ్బెబ్బే! ఇతను మా బాపతు కాదులే. కీలు గుర్రం బాపతు.’
’అంటే??’ అన్నాన్నేను.
’కీలుగుర్రం సినిమా చుడలేదేమిటి?’
’ఏదీ…అంజలీదేవి పగలొకలా, రాత్రొకలా వేషాల్లో ఉంటుందే…అదేనా?’
’అదే అదే…ఇతనూ అలాగే..’
’ఏమే నిశీ… మనుషులు చాలట్లేదూ?? రాక్షసులు కావాల్సొచ్చారా?’ – భయంగా అడిగాను.
’ఛ! పాపం అలా అనకు. అతను రాక్షసుడేం కాదు. చాలా మంచివాడు. అమాయకుడు కూడానూ. అందుకే అలా ఐపోయాడు.’ నిశి జాలిగా అంది.
’చాల్లే ఆపు.’ అన్నాన్నేను విసుగ్గా.
’అరే, నిజం. అతను రాక్షసుడు కాదు.’
’మరేమిటో’
’పురుగు’
’వ్వాట్? పురుగా?’ అన్నాన్నేను మళ్ళీ అరిచి
’అవును.’
’అది మెటామార్ఫసిస్…అతను కాఫ్కానా?’
’కాదు…అతను గూగుల్ సర్వర్ల చెరలో చిరకాలంగా మగ్గుతున్న వార్మ్. చెరలో ఉన్నందుకు ఇప్పుడు కంప్యూటర్ వార్మ్ అయ్యాడు.
’అబ్బో! ఏమీ అర్థం కావట్లేదు..’ అన్నాను. నిజంగానే మైండు గిర్రున తిరుగుతోంది.
’హుమ్….చెబుతా విను’ అని నిశి అతని కథ చెప్పడం మొదలుపెట్టింది.

Published in: on July 21, 2010 at 2:01 pm  Comments (3)  
Tags: ,