నిశ్యాలోచనాపథం-10

నిశీనిశ్ పరిచయమయ్యాక, మాకిద్దరికీ కబుర్లలో అసలు టైమే తెలియట్లేదు. జోగీ జోగీ రాస్కుంటే బూడిద రాలుతుందేమో కానీ, ఫ్రస్టూ ఫ్రస్టూ రాసుకుంటే ఇన్ని మాటలు రాలతాయని నాకు ఇన్నాళ్ళకి తెలిసింది. ఆ మాటల ప్రవాహంలో కొట్టుకుంటూ పోయి, అసలు నేనిలా నా రాత్రి అడ్వెంచర్ల గురించి రాస్తున్నాననీ, పోయిన్సారి నిశీనిశ్ ను పరిచయం చేసి ఏదో చెప్తానని చెప్పనేలేదనీ గుర్తురాలేదు.

పైగా ఆ మధ్యన ఆమె ఏమో సూసైడ్ జపం మొదలెట్టింది. మాకిద్దరికీ ఆ వాదనల్లోనే సరిపోయింది. అంతా అయ్యాక వితండవాదం అని నన్ను ఆమె, ఆమెనీ నేనూ అనుకుని, రెండ్రోజులుగా అలిగాము ఒకరిమీదొకరం. దానితో కాస్త తీరిక దొరికింది. దీన్నిబట్టి ఏం అర్థం చేసుకోవాలంటే అధ్యక్షా – జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది. ఫ్రస్టూ ఫ్రస్టూ రాస్కుంటే మాటలు రాలతాయి. ఫ్రస్టూ ఫ్రస్టూ రాసుకుపూసుకు తిరగలేదంటే, బ్లాగుటపాలు రాలతాయి అని. 🙂 సరే, మా డిస్కషన్ గురించి చెబుతాను. అంటే, ఇలా ఇద్దరి వ్యక్తిగత సంభాషణను బహిర్గతం చేయకూడదనుకోండి. కానీ, నిశీనిశ్ కి సమస్యేమీ లేదంది. ఆమె శ్రేయోభిలాషులు ఇది చదివి “స్ట్రెస్ ఔట్” అయిపోయి, ఆమెకి కబురు మోసేద్దామన్నా కూడా ఆమె మనుషుల్తో కలవదు, చీకట్లోంచి చీకట్లోకి వెళ్ళేదాన్ని -నాకెందుకీ స్నేహాలూ, మోహాలూ? అంటుంది పైగా.

ఎక్కడ మొదలైందంటే – ఆ మధ్యోరోజు చీకట్లో నడుస్తున్నానా… ఉన్నట్లుండి ఓ చోట – నేనెప్పుడూ నిశీనిశ్ ని కలిసే చోటకు వచ్చాక కూడా తను నన్ను పలకరించలేదు. అంటే, నేను ఫుల్‌టైం నిశాచరిని కాను కదా, నా కళ్ళు పూర్తిగా ట్రైన్ అవలేదు చీకటి చూపులకి. సాధారణంగా తనే నన్ను చూసి పలకరిస్తూ ఉంటుంది. అక్కడ మనిషి ఉండనే ఉన్నట్లు నాకు ఇంట్యూటివ్ గా అనిపించింది కానీ, “కంట్-యూటివ్” గా కనిపించలేదు. కొన్ని సెకన్ల తరువాత మనిషి ఊపిరి శబ్దం వినిపించింది. మొదట అనుమానమొచ్చింది – నిశీ అయితే పిలిచేది కదా అని. కానీ, చీకట్లలో పారిపోడాలంటూ ఉండవు-దొరికిపోయి బలవడాలే. అందుకే తెగించేసి నిశీ! అని పిలిచా. “ఓహ్! నువ్వా! వచ్చేసావా…” అన్నది. అప్పుడు తను ఎటుందో అర్థమైంది. గొంతు డల్ గా అనిపించడంతో – “ఏమైంది?” అని అడిగా.

“చీకట్లలోకి వెళ్ళిపోవాలనుంది” అన్నది. “అబ్బా! మళ్ళీ మొదలు!” అని మనసులో విసుక్కున్నా కూడా, ఈ మనిషెందుకు ఎప్పుడూ ఏదో ఓ బాధలో ఉన్నట్లే ఉంటుంది అని… ఇప్పుడేం కొత్త సమస్యో అనుకుని, నిత్యఏడ్పు మొహాలవారి సమస్యలు భూదేవంత ఓపికతో విని,ఈ ప్రయత్నంలో నా సమస్యల్ని మర్చిపోడం నేనెప్పుడూ చేసే ప్రయత్నమే కనుక, “అసలేమైందో చెప్పు” అన్నా. “నేను చచ్చిపోదాం అనుకుంటున్నా” అన్నది. “కెవ్వ్!” అనబోయి తమాయించుకున్నా. అంటే, ఈమె మనిషే అన్నమాట-అని ఓ పక్క ఆనందించాను కూడా. “ఈ ప్రపంచానికీ నాకు సరిపడదేమో అనిపిస్తోంది.” అన్నది నా జవాబు కోసం ఎదురుచూడకుండానే. “ఎందుకలా అనిపిస్తోంది? ప్రపంచానికే నిన్ను పొందే అర్హత లేదేమో?” అనేసా నేను వెంటనే, చాంస్ దొరగ్గానే మాట్లాడకుంటే మళ్ళీ మాట్లాడలేము అని. “పోనీ, ఏదో ఒకటి, ఈ ప్రపంచమున్న చోట నేను ఉండలేను” అన్నది. “అదికాదమ్మాయ్… ఆత్మహత్య గురించి ఆలోచించేంత సమస్యలేమున్నాయి నీకసలు?” అన్నా (సమస్య తీవ్రత అన్నది రిలేటివ్ అని మర్చిపోయి.)

“ఈ ప్రపంచం నన్ను భరించలేకపోతోంది. అది చేసిన తప్పులకి కూడా నన్నే అనేస్తోంది. నేను దాన్ని అనేలోపు అదే అనేసి – రివర్స్ ఇంజినీరింగ్ చేసేస్తోంది.” – నీశీ ఆవేదన వ్యక్తం చేసింది. “ఆజ్ పురానీ రాహోం సే..కోయి ముఝే ఆవాజ్ న దే” పాట వినిపించింది ఇంతలో. నేను అవాక్కయ్యా. ఇంతలో నిశి – “ఊప్స్! మళ్ళీ ఫోన్. నేను బ్రతికేదే రాత్రుళ్ళు. ఇప్పుడు కూడా బ్రతకనిచ్చేలాలేరుగా..” అనుకుంటూ “మళ్ళీ కలుస్తానోయ్!” అన్నది. తరువాత కనబళ్ళేదు. వినబళ్ళేదు. ఈవిడకేదో మంత్రం తెలుసులాగుంది. ఠక్కున మాయమౌతుంది. ఓ పక్క గుండె పీకుతూనే ఉంది మళ్ళీ కనిపిస్తుందో లేదో అని. కానీ, కనిపించింది కనుకే మా మధ్య వాదన జరిగిందీ, మేము అలుగుకున్నామూ, నేను ఇది రాస్తున్నానూ. తర్వాతేమైందో మళ్ళీ చెప్తా. ఇప్పటికిదే పెద్దదైపోయింది.

Advertisements
Published in: on July 6, 2009 at 10:06 am  Comments (11)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/07/06/nisyalochanapatha-10/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. అలా అని మీకు అనిపించిందా? అలా ఎప్పటి ను<డీ అనిపిస్తున్నది?

 2. ““కెవ్వ్!” అనబోయి తమాయించుకున్నా.” – Kevvvvvv! 😛

 3. ఎన్నాళ్ళో వేచిన నిశీధి, ఈనాటికి తిరిగొచ్చిందా?

  “అక్కడ మనిషి ఉండనే ఉన్నట్లు నాకు ఇంట్యూటివ్ గా అనిపించింది కానీ, “కంట్-యూటివ్” గా కనిపించలేదు.”

  😀

  అవునండీ, కొన్నిసార్లు ఫోన్లు చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. పాపం అనిపిస్తుంది

 4. మీ రచనా శైలి బాగుంది. అభినందనలు.
  ఈ ‘నిశ్యాలోచనాపధం’ రచనల్లో అస్తిత్వవాద ఛాయలు ఉన్నాయనిపిస్తోంది.
  మళ్ళీ పుస్తకాల గురించి సమీక్ష ఎప్పుడు ఉంటుందంటారు?
  పుస్తక సమీక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటాము.

 5. @dhanaraj: ఎలా అని? :p
  @గీతాచార్య, పూర్ణిమ: 🙂
  @రమణ: ధన్యవాదాలు. పుస్తకాల గురించి.. పుస్తకం.నెట్ ను చూడండి… నా సమీక్షలు ఇక అక్కడే 🙂

 6. నిస్సందేహంగా అస్తిత్వవాదమే! బాగుంది.

 7. ఈ ప్రపంచం నన్ను భరించలేకపోతోంది. … రివర్స్ ఇంజినీరింగ్ చేసేస్తోంది. – 🙂
  పొద్దులో స్వాతి అడిగిన ప్రశ్న -నీ ఫిలాసఫీ ఏమిటి-కి ఇక్కడ సమాధానం కనిపిస్తోంది.:)
  పోను పోను నీరచనలో స్పష్టత, సున్నితమైన, సునిశితమైన శైలీ ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి. బహుశా, నువ్వు వెనక్కి ఒకసారి చూసుకుని, ఈవ్యాసాలన్నీ దగ్గరపెట్టుకుని, కాస్త తీర్చి దిద్దితే, ఒక నిర్దుష్టమయిన కథల లేదా వ్యాసధార కాగలదు. ఒక్కమాటలో, beautiful!
  నీతరవాతి భాగంకోసం ఎదురుచూస్తూ …
  మాలతి

 8. “నేను దాన్ని అనేలోపు అదే అనేసి –”
  అందుకనే, అప్పుడెప్పుడో శ్రీవిద్య (బ్లాగరి) చెప్పినట్టు, ఇంకోళ్ళెవరన్నా మనల్ని అనే ముందు మనమే అనెయ్యడం బెటరు. 🙂
  good show

 9. ఎప్పుడో B.Tech లో మరిచిపోయిన పాత నేస్తాన్ని గుర్తుచేశారండి..
  మళ్ళీ వారాంతాల్లో నిశాచరుడిగా మారి పాత స్నేహాన్ని పునరిద్దరించుకుంటున్నా ..

  ధన్యవాదములు.

 10. 🙂

 11. […] నిశ్యాలోచనాపథం-11 నిశీనిశ్ ఆత్మహత్య అన్నది. ఎందుకూ అని విషయం తెలుసుకునేలోపు ఫోనొచ్చి ఆమె ఎగిరిపోయింది. దానితో ఆపేసాను మొన్నామధ్య (ఇక్కడ.) […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: