సంపాదకులు, రచయితలూ

ఈమధ్య కాలంలో ఒక యువరచయిత ద్వారా ఒక వింత అనుభవం విన్నాను. ఒక వెబ్ పత్రికకి తమ ఆంగ్ల కథని పంపారు. ఆ పత్రిక వారు ఈ కథని స్వీకరిస్తాము అని జవాబు ఇస్తూ, “మేము మైనర్ ఎడిట్స్ చేస్తాము, కథాంశం బాగుంది కానీ  రైటింగ్ క్వాలిటీ బాలేదు, ఇంకోసారి ఇలాంటి నాసిరకం కథలు పంపకు” అన్నారంట. నేను అది విని నోరెళ్ళబెట్టాను. అంత బాలేకపోతే ఎందుకూ వేసుకోవడం? మైనర్ ఎడిట్స్ మాత్రం చేసి వేసుకుని వారి దృష్టిలో “క్వాలిటీ లేని” రచనలని వారి వెబ్సైటులో పెట్టుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది? అనిపించింది. ఈ రచయితకి కూడా వారి తీరు నచ్చక “అలాగైతే నా కథ వేసుకోవద్దు లెండి, వెనక్కి తీసుకుంటాను, కానీ కొంచెం మర్యాదగా రాయొచ్చు కదా మీరు ఆ విషయం” అని ఇమెయిల్ చేశారు. దానికి మళ్ళీ వారు “మేము తియ్యటి  వాక్యాలు చెప్పము. ఏదైనా కొట్టినట్లు చెబుతాం. అదే నయం రచయితలకి కూడా” అని స్పందించారు. అక్కడికి అది ముగిసింది. రచయిత తో కొంత స్నేహం వల్ల ఈ ఎపిసోడ్, ఆ ఈమెయిల్స్ ధోరణి అవీ వివరంగా తెలిసింది. ఈ పత్రిక జోలికి నేను పోకూడదు అని నిర్ణయించుకున్నా. 

పై ఉదంతం లో గమనించాల్సిన  ముఖ్యమైన విషయం: రచయితకి సంపాదకులు ఇచ్చిన “గౌరవం”. సంపాదకుల/పబ్లిషర్ల దృష్టిలో “స్థాయి” లేదు అనుకున్న రచయితలని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు? అన్నది. ఇలాంటివి నేను విన్నదాన్ని, అనుభవించిన దాన్ని బట్టి వాళ్ళ మీద నాకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతోంది? అన్న  సబ్జెక్టివ్ ఆలోచనల సమాహారం ఈ పోస్టు. ఈ ఉదంతం తెలిసిన రోజునుంచి ఈ బ్లాగు పోస్ట్ రాయాలన్న దురద ఉంది నాకు. ఇవ్వాళ మళ్ళీ మరొక సంఘటన ప్రేరేపించింది మొత్తానికి రాయడానికి. 

ఇవాళ్టి సంఘటన ఔట్లుక్ పత్రిక వారితో. నంబూరి పరిపూర్ణ గారి కథ “శీను గాడి తత్వ మీమాంస” కి నేను చేసిన అనువాదం మొదట రెండు వారాల క్రితం వారి వెబ్సైటులో వచ్చింది. అది కూడా నాలుగు నెలల క్రితం పంపాను, రెండు నెలల క్రితం ఎడిటింగ్ ఫీడ్బాక్ అన్నారు, తరవాత ఏమీ చెప్పలేదు, ఈమెయిల్ చేసినా జవాబు ఇవ్వలేదు. చూసి చూసి మీకిష్టం లేకపోతే తిరిగి తీసేసుకుని నేనే ఇంకేదో చేస్కుంటా అన్నాక వరసగా మూడు సారీ ఈమెయిల్స్ వచ్చాయి… ఎదో మా మధ్య కమ్యూనికేషన్ గాప్, ఏప్రిల్ 21 కి వస్తుంది అని. రాలేదు. వీళ్ళతో ఎందుకులే, ఏవన్నా వేరే వెబ్ పత్రిక వెదుకుదాం అనుకునేశాక మామూలుగా రెండ్రోజుల తరవాత వెబ్సైట్ చూస్తూ ఉంటె ఏప్రిల్ 19న అది వెబ్సైటులో వచ్చేసింది. వాళ్ళు నాకు చెప్పలేదు. నాకు తెలియలేదు. కానీ ఏప్రిల్ 21 ప్రింటు సంచిక ఒకటి వచ్చింది. ఇవి ప్రింటులో వెయ్యరు మామూలుగా.. అయినా చూద్దాం అని ఆన్లైన్ సంచికలో చూస్తే కనబడలేదు. అక్కడికి వదిలేస్తే ఇవ్వాళ ఒక తెలిసినాయన మెసేజి చేసాడు. ఎక్కడో జార్ఖండ్ లో ఆయన ఏదో బ్యాంకు పనిమీద పోతే అక్కడ లాబీ లో ఈ మే 1 నాటి ఔట్లుక్ ప్రింట్ సంచిక తిరగేస్తూ ఉంటె నీ అనువాదం కనబడింది, కథ చాలా బాగుంది అని. నాకొక రకం ఆశ్చర్యం…ఏంటి నిజమా? అని. కనీసం ఓ ఈమెయిల్ చేయలేకపోయారా! అనుకున్నా. 

నేను మొట్టమొదట “రచయిత” గా నా పేరు చూసుకున్నది నాకు 12-13 సంవత్సరాల వయసులో. “చెకుముకి” పిల్లల పత్రికకి నేను ఏదో  వ్యాసం రాసి పంపాను (మా నాన్న బాగా ప్రోత్సహించేవారు లెండి నన్ను ఆయన బతికి ఉన్నప్పుడు! ఇలాగ ఆ పత్రికలో మూడో నాలుగో వ్యాసాలు వచ్చాయి 1996-97 మధ్య). వాళ్ళు అది వేసుకుని, ఐదో పదో రూపాయల పారితోషికం, పత్రిక కాంప్లిమెంటరీ కాపీ, ఇలా మీ వ్యాసం వచ్చిందన్న ఒక లెటర్ కూడా పంపారు. స్కూల్ లో మా టీచర్ కూడా తరవాత ఆ పత్రిక పట్టుకొచ్చి చూపించారు మా క్లాసులో. “చెకుముకి” చాలా చిన్న పత్రిక. ఇపుడు అసలు ఉందో లేదో! అయినా కూడా వారి కాంట్రిబ్యూటర్ కి వారిచ్చిన గౌరవం అది – కాంట్రిబ్యూటర్ ఒక పన్నెండేళ్ల పిల్లే అయినా! ఇది ఒక 1996/97 ప్రాంతంలో జరిగింది. పత్రిక బహుశా వరంగల్ నుండి వచ్చేది, మేము కర్నూలు లో ఉండేవాళ్ళం. ఇంటర్నెట్ అవీ లేవు.    

నేను ఈ ఔట్లుక్ విషయం చెప్పినాయనకి ఈ చిన్నప్పటి అనుభవం చెప్పాను. “చిన్న పత్రికా పెద్ద పత్రికా, ఆన్లైన్, ఆఫ్లైన్   కాదు..  ఆ చెకుముకి వారికి  ప్రయారిటీస్ ఏమిటో వాళ్లకి తెలుసు. వాళ్ళు అలా నీతో మర్యాదగా ఉన్నారు కనుకే ఇన్నేళ్ళైనా తల్చుకుంటున్నావు” అన్నాడు. నిజమే అనిపించింది. 

నాకు ఇలా ఎడిటర్లతో అనుభవం అంటే ఆ చిన్నప్పటివి వదిలేస్తే తరువాత చాలా రోజులకి నేను ఇంజనీరింగ్ అయిపోతున్నపుడు తెలుగు ఇంటర్నెట్ ప్రపంచాన్ని కనుగొన్నాకే  (తెలుగుపీపుల్.కామ్, పొద్దు.నెట్, ఈమాట, వగైరా). కొన్ని అనుభవాలని పక్కకి పెడితే, చాలామటుకు తెలుగు ప్రింటు/వెబ్జీన్స్ తో మంచి అనుభవాలే ఉన్నాయి చాలా వరకు.  ఇక్కడ మనం అంతా ఖాళీ సమయంలో ఇలాంటి రచనలు చేస్తున్నాం, ఎవరికీ ఆర్థికంగా ఒరిగేది ఏమీ లేదు అన్న ఎరుక ఉంది. మధ్యలో నా వృత్తి/చదువులో బిజీ గా ఉండడం వల్ల చాలా సంవత్సరాలు మానేసి ఈమధ్యనే “సంచిక”, “సారంగ” – ఈ వెబ్ పత్రికలకి గత రెండేళ్ల కాలంలో కొన్ని రాసాను/చేసాను. ఈ పత్రికల సంపాదకుల పట్ల నాకు గౌరవం ఉంది (అలాగని వాళ్ళు ఏది మాట్లాడినా సపోర్టు చేస్తా అని కాదు. వారి సాహిత్య కృషి విషయం లో గౌరవం ఉంది. మిగితావి వేరే విషయాలు). వాళ్ళు కూడా నాతో మర్యాదగానే ప్రవర్తించారు. నాకు చెప్పకుండా నా వ్యాసానికి ఇంకొకరి ఉపోద్ఘాతం చేర్చేసి వాళ్ళని ఫస్ట్ ఆథర్ గా పెట్టడం వంటివి చేయలేదు (ఇది కూడా ఒక ప్రముఖ వెబ్ పత్రికతో నాకు పాతికేళ్ళు కూడా నిండకముందే జరిగిపోయింది! అందుకే నాకు పెద్ద అపోహలు, అంచనాలు లేవు తెలుగులో రాస్తున్నప్పుడు). 

ఆంగ్ల పత్రికల్లో చాలావరకు హుందాగానే ఉంటున్నారు గానీ కొంతమంది సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యరు. వేసుకుంటారా? వేసుకోరా? వేసుకుంటే ఎప్పటికి? ఇలాంటివి సరిగా చెప్పడం అంత క్లిష్టమైన విషయం కాదు. సబ్మిషన్ గైడ్ లైన్స్ లో మేము నెలో, ఆర్నెల్లో, సంవత్సరంలోపో స్పందిస్తాము, సలహాలు సూచనలు ఇస్తాము/ఇయ్యము, పారితోషికం ఉంటుంది/ఉండదు, స్వీకరిస్తే ఇంతలోపు వేసుకుంటాం/వేస్కొము, కాపీరైట్స్ విషయం ఏంటి? ఇవి ఒక లిస్టు రాసి పెట్టొచ్చు. ఆటో రెస్పాండర్ గా ఇవన్నీ వస్తాయి చాలా ఆంగ్ల పత్రికలకి. ఇలా చేయని వారితోనే ఇబ్బంది. అంతగా ఎడిటింగ్ సపోర్టు వంటివి చేయకపోయినా ఈ పేరాలో ప్రస్తావించిన తక్కిన విషయాలలో తెలుగు వెబ్జిన్ లు ఆంగ్ల వెబ్జిన్ ల కంటే చాలా రేట్లు నయం. ప్రింటు తో నాకు అనుభవం తక్కువ కనుక వాటిని వదిలేస్తున్నా.   

ఈ పోస్ట్ మొదట్లో చెప్పిన అనుభవానికి తిరిగి వస్తే, ఆ పత్రిక ప్రవర్తన నా దృష్టిలో అమర్యాదకరం. దగ్గర దగ్గర నాకు అసహ్యం కలిగించింది. వేసుకుంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. నిజంగా రైటింగ్ క్వాలిటీ అధ్వాన్నం అనుకున్నపుడు కూడా అసలే పత్రికా అలా అసహ్యంగా అనడం నేను వినలేదు/అనుభవించలేదు. వాళ్ళకి వద్దు అనుకుంటే “మాకు వద్దు” అని రాసి ఊరుకుంటారు. అట్లా గాదు, ఎలాగయినా ఇది మన పత్రికలో రావాలి అనుకుంటే వాళ్ళ వాళ్ళ ఓపికని బట్టి వాళ్లకి సంతృప్తికరంగా అనిపించేదాకా ఎడిట్ చేసి గానీ వదలరు. ఆ టైము మాకు లేదు, అంత టైం పెట్టి ఎడిటింగ్ చేయనిదే ఈ కథ బాగుపడదు అనుకుంటే “మీ కథకి మేము ఎడిటింగ్ సపోర్టు ఇవ్వలేము. ఇలాగే వేసుకోలేము. కనుక మీరు తిరగరాసి తిరిగిపంపండి” అని ఏదో  మర్యాదగా చెప్పి వదిలేయాలి. అంతే కానీ “నీ కథ బాలేదు కానీ ఏదో జాలి తలిచి ఈసారికి వేసుకుంటాము, ఇంకెప్పుడూ ఇలాంటివి పంపకు” – ఇదేం స్పందనండి అసహ్యంగా? ఎందుకు అంత లోకువ రచయితలంటే?  వాళ్లలాగే రచయితలూ ఉచితంగానే పనిచేస్తున్నారు కదా ఈ కేస్ లో. రచయితలకి పత్రికలూ ఎంతో పత్రికలకి రచయితలూ అంతేగా? ఖాళీ వెబ్సైట్ పెట్టి నడుపుకోలెం కదా? దానికీ కంటెంట్ కావాలి, ఎవరో రాయాలి. వాళ్ళతో ఇలాగేనా మాట్లాడ్డం? నేనూ ఒక వెబ్సైట్ నిర్వహణలో దాదాపు పదిహేనేళ్ల బట్టి పాలుపంచుకుంటున్నా. ఎప్పుడూ ఇలా అసహ్యంగా ప్రవర్తించినట్లు నాకు అయితే జ్ఞాపకం లేదు. 

ఇక పారితోషికం విషయం: వెబ్ పత్రికలకి పంపుతున్నపుడు నేను “వీళ్ళకి డబ్బులరావు, చదివే వాళ్ళు డబ్బులిచ్చి చదవరు, రాసేవాళ్ళు కూడా ఆసక్తి ఉంటే, టైము ఉంటే ఉచితంగా రాస్తారు. లేకపోతే రాయరు అంతే” అన్న అవగాహన తో రాస్తాను. అదే ఒక పుస్తకంగానో, పుస్తకం లో భాగంగా నో, ప్రింటు పత్రికలోనో వచ్చినపుడు మాత్రం అది చదువరులు కొని చదువుతారు కనుక రచయితకి (అనువాదం విషయంలో బహుశా సగం అనువాదకులకి, సగం రచయితలకి అనుకోవచ్చు ఏమో) కూడా కొంత పారితోషికం లభించాలని నమ్ముతాను. ఇదేదో ఉన్నట్లుండి నన్ను లక్షాధికారిని చేస్తుందని కాదు. అలా చేయడమే సరైన పద్ధతి అని నేను నమ్ముతాను! అనువాదం విషయంలో బహుశా మరి అనువాదకులు/రచయిత మధ్య సగంసగం స్ప్లిట్ చేస్కోవచ్చు, అదొక పద్ధతి. అది వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు.  ఒకటి రెండు సార్లు “సాక్షి” లో, “రచన” పత్రికలో నేను రాసినవి ప్రింట్ లో వచ్చినపుడు వాళ్ళు నాకు ఏదో పారితోషికం చెక్ పంపారు (రాసే ముందు, వాళ్ళు స్వీకరించినపుడు  కూడా ఆ పేమెంట్ ప్రస్తావన రాలేదు. నేను అడగలేదు. వాళ్లు రచయితలకి పారితోషికం ఇస్తారు కనుక పంపారు). కొన్ని సందర్భాల్లో పైసా ఇవ్వలేదు, నాకు ఈ విషయంలో అంత పట్టింపు లేదు కనుక నేనూ అక్కడికి వదిలేసా. ఇపుడు ఔట్లుక్ వారితో తాజా అనుభవం అంత రుచించలేదు నాకు. పెద్ద పత్రిక, అందమైన బొమ్మేసారు, మంచి ఎడిట్లు సూచించారు. అక్కడిదాకా ఓకే కానీ రచయితలకి పారితోషికం ఇచ్చే స్థాయి మార్కెట్ ఉన్న పత్రికే అది. పారితోషికం ఇవ్వడం అటుంచి, కనీసం ఫలానా ప్రింటు పత్రికలో వస్తుంది అని కాపీ పంపించడం అయినా చేయాలి కనీసం. ఇలా చేస్తారా పెద్ద రచయితలైతే? పెద్ద రచయితల రచన పక్కన నీది వేస్తాము కనుక నోర్మూసుకో అన్నట్లుంది ఇది.  నాలుగు అనువాదాలు వేసుకున్నారు నేను చేసినవి. ఐదోది ఇంక రాదు అని నా ప్రస్తుతపు అనుకోలు.  ఏ పాటి రచయితకైనా ఒక ఆత్మాభిమానం అంటూ ఉంటుంది. ఈ ఉదంతంలో అది దెబ్బతినింది నాకు. ఆ మొదటి ఉదంతంలో తోటి రచయితకి అవమానం జరిగింది కనుక కడుపు మండింది. 

ఇంకా రాయొచ్చు గానీ, రచయిత స్థాయి తమ దృష్టిలో ఏపాటిదైనా కామన్ మర్యాద ఒకటి పాటించవచ్చు ఇలాంటి సంపాదకులు అని చెప్పడానికి ఇదంతా రాసాను. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది – కాపీరైట్స్. దాని గురించి మళ్ళీ రాస్తా… ఆ అనుభవాలు కూడా ఉన్నాయి. 

అన్నట్లు ఇదంతా సాహిత్య పత్రికలూ, ప్రచురణతోనే సుమా. టెక్నీకల్ ప్రచురణలో ఆంగ్ల ఆన్లైన్/ప్రింటు పబ్లిషర్లతో నా అనుభవం చాలా డీసెంట్ గా ఉంది. వృత్తి పరంగా కాకుండా అదనంగా చేసిన రచనల విషయంలో ఆర్థికంగా కూడా సంతృప్తికరంగా ఉంది (దీనితోనే బతికేసే ఉద్దేశం నాకు లేదు కనుక!). పూర్తి స్థాయి రచయితగా బతకడం సాహితీ లోకంలోనే కాదు, టెక్నీకల్ లోకం లో కూడా దాదాపు అసాధ్యం మామూలు మనుషులకి. 

Published in: on May 6, 2023 at 6:20 pm  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2023/05/06/writers-editors/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: