ఉపమ Vs Symbolism

కొన్ని నెలల క్రితం “రక్తరేఖ” (గుంటూరు శేషేంద్ర శర్మ గారి ‘డైరీ’) చదువుతున్నప్పుడు చదివిన ఓ చర్చ ఇది. ఈ చర్చ నాకు ఆసక్తి కరంగా అనిపించటమే కాక – కొన్ని సందేహాలను కూడా పుట్టించింది. అందుకే ఆ పేజీలలోని ఒకట్రెండు డైలాగులలోని కొన్ని భాగాల్ని ఇక్కడ పెడుతున్నాను. ఎక్కువ పెడితే కాపీరైట్ ఉల్లంఘన ఔతుందేమో మళ్ళీ!

ప్ర: ఉపమాలంకారంలోని ఉపమేయాల్ని తీసివేసి కేవలం ఉపమానాలతోటే వాక్యవ్యవహారం నడుపుతామనుకో, అది సింబాలిజం ఔతుందా? ….. (ప్రశ్న ఇంకా ఉంది…)
జ: కాదు. ఉపమాలంకారంలో రెండు వస్తువులుంటాయి. ఆ రెంటికీ కొన్ని లక్షణాలుంటాయి. ఆ పోలికల మూలంగా ఒకదానితో ఒకటి పోల్చబడతాయి. కానీ, సింబాలిజంలో ఒకటే వస్తువు ఉంటుంది. దానిలోనే రెండవ వస్తువు ఉంటుంది. బయటికి కనిపించేది భౌతిక వస్తువు., మామూలు కళ్ళకి కనొపించకుండా లోపల ఉండేది రెండ్వ వస్తువు… (and it goes on.)

సింబాలిజం : అన్న దానికి తెలుగు పదమేమిటి ఇంతకీ? అన్నది నాకొచ్చిన అనుమానం 🙂

ప్ర: “ముఖ చంద్రుణ్ణి కష్టాల మేఘాలు ఆవరించాయి” అంటే రూపకం అయింది (రూపకాలంకారం). ఇక్కడ ముఖమూ, చంద్రుడూ అనే రెండు వస్తువులకూ అభేధం చెప్పడమే కదా ఈ అలంకార లక్షణం?”
జ: రెండు వస్తువులకు అభేదం చెప్తున్నాడు నిజమే. కానీ, అవి నిజంగా ఒకే వస్తువు కాదు కదా; రెండు వస్తువులే కదా. కానీ, లారెన్సు చెప్పిన వాక్యం చూడు – “ఎర్రగులాబీ పువ్వు అగ్నిజ్వాల”. ఇక్కడ ఎర్రగులాబి, అగ్ని జ్వాల రెండు వస్తువులు కావు. భౌతిక ప్రపంచంలో రెండైనా ఇక్కడ కవి ద్రష్ట అయిన సన్నివేశంలో ఎర్రగులాబీలోనే ఆ అగ్నిజ్వాలను చూశాడు.

……………………..
……………………….
“ఇలా ఒక స్థూల దృశ్యం ఐన ఒక భౌతిక దృశ్యంలోంచి దాని తాత్విక దృశ్యాన్ని చూడటం, అంటే ఒక వస్తువులోంచి దాని వాస్తవికతను పిండుకోవడం సింబాలిజం”

– ఇదీ ఆ చర్చ. చాలా ఆసక్తికరంగా ఉండింది. ఆఖరుకి నాక్కూడా ఎప్పుడో స్కూల్లో వదిలేసిన గ్రామరూ, అలంకారాలు, ఛందస్సు మీద ఆసక్తి పుట్టింది ఇది చదివాక 🙂

Advertisements
Published in: on August 2, 2009 at 2:06 pm  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/08/02/upama-symbolism/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. symbolism అంటే ప్రతీత్మకం.

 2. ఉపమ అంటే simile (పోలికని తీసుకొచ్చి తులన చెయ్యడం. ఉదా: యాపిల్ పళ్ళలాంటి బుగ్గలు)

  symbolism అంటే ప్రతీకాత్మకత (భౌతిక/స్థూల వస్తువుని వర్ణిస్తూ దానిద్వారా తాత్విక లేక భావగర్భిత సూచనని చెయ్యడం. ఉదా: ఉగాదిపచ్చడి జీవితం)

 3. 🙂

 4. perhaps symbolism synonyms with ” narma gharbham”

 5. ఒక పోలిక ఉపమ అవ్వాలి అంటే మూడు లక్షణాలుండాలి. ఎదుట ఉన్న వస్తువు, దాన్ని దేంతో పోలుస్తున్నామో ఆ వస్తువు, ఈ రెంటికీ మధ్య ఉన్న సమాన ధర్మం. ఈ సమానధర్మాన్ని స్పష్టంగా చెప్పొచ్చు, చెప్పకుండా వొదిలెయ్యొచ్చు, లేక సూచనతో వొదిలెయ్యొచ్చు.

  పాపులర్ వాడుకలో సింబలిజం ని తెలుగులో ప్రతీకాత్మకత అంటున్నారు. ఉపమ కంటే సింబలిజం చాలా సంక్లిష్టమైనది. ఉపమ కేవలం ఒక్క వస్తువులోని ఒక్క విషయం గురించే మాట్లాడుతుంది. సింబలిజం అలాక్కాదు. రచయిత/దర్శకుని ప్రతిభని బట్టి రచన/సినిమా మొత్తం ప్రతీకాత్మకం కావచ్చు. ఉపమ ఒక చిన్న పరికరం. ప్రతీకాత్మకత ఒక కళాదృష్టి.

  మీరు ఉదహరించిన ఎర్రగులాబి అగ్నిజ్వాల, ముఖ చంద్రుడు సింబలిజం కాదు.
  శ్రీశ్రీ గేయం జగన్నాథ రథచక్రాలు సింబలిజం.
  కారామాష్టారి యజ్ఞం కథలో చివర్లో జరిగే దృశ్యం సింబలిజం.
  శంకరాభరణం సినిమాలో మంజుభార్గవి రేప్ కి గురయ్యే సమయంలో చూపించిన దృశ్యం సింబలిజం.

 6. ఉపమ ఒక అలంకారం. కొత్తపాళీగారు అన్నట్టు ప్రతీకాత్మకత ఇంకా విస్తృతమైనది. అది ఒక సాహిత్య ధోరణి. ఈ రెండిటినీ పోల్చడం అంత సరికాదు.
  మన అలంకారశాస్త్ర పరంగా ఆలోచించినప్పుడు దీనికి దగ్గరగా వచ్చేది ఆనందవర్ధనుడు చెప్పిన “ధ్వని”. ప్రతీకని ఒక రకమైన ధ్వని భేదంగా అనుకోవచ్చని నాకు అనిపిస్తుంది.
  ప్రతీకాత్మకత గురించి వడలి మందేశ్వర రావుగారి “పాశ్చాత్య సాహిత్య విమర్శ. చరిత్ర – సిద్దాంతాలు” అనే పుస్తకంలో కొన్ని మాటలు:

  “ఉపమానం ప్రతీక అవదు. అలాగే రూపకం కూడా ప్రతీక అవదు. అది కేవలం అలంకారం, ఒకానొక వస్తు స్థితిని ఎరుక పరచడాని కొక సాధనం. గుప్తకథలో (allegory) వచ్చే పాత్రలు ప్రతీకలని భ్రమించే అవకాశం ఉంది. గుప్తకథలో గుణాలు, లక్షణాలే పాత్రలుగా కనపడవచ్చు. కథలో పాత్రలూ గుణాలూ అవిభక్తంగా ఉంటాయి. ప్రబోధ చంద్రోదయం ఇట్టి గుప్త కథే. కాని William Blake పద్యం “The Sick Rose”లో గులాబి పువ్వు దేనికీ ఉపమానం కాదు, దానికి ఉపమేయం పద్యంలో ఎక్కడా లేదు. ఈ గులాబి కథ మరొక కథకు సమాంతరంగా ఉంటూ రెండూ అవిభక్తంగా లేవు. ఇక్కడ గులాబి గులాబీ పువే. అది గులాబీగా ఉంటోనే మరొకటి కూడా అవుతోంది. అది అనేక ఇతర అంశాలను జ్ఞప్తికి తెస్తోంది… ప్రతీకలో ఉండే లక్షణ మేమంటే అది ఒకే అర్థానికి పరిమితం కాకుండా అనేక అర్థచ్ఛాయలకి అవకాశమిస్తుంది.
  W.B. Yeats రూపకం మనకు వస్తువును చూప గల్గినా, ప్రతీకగా మారినప్పుడే, అది మనల నన్ని విధాలా కదిలించ సమర్థ మవుతుందంటాడు.
  The white moon is setting behind the white wave,
  And Time is setting with me, O!

  అన్న Robert Burns కవితలోని పంక్తులను ఉదాహరిస్తూ ఇవి ప్రతీకాత్మకమైనవే అంటాడు Yeats. అందులో చంద్రుడూ, కెరటం, తెల్లదనం, అస్తమిస్తూన్న కాలం, రెండో పంక్తి చివరనున్న కెవ్వుమన్న కేక – ప్రేరేపించే భావోద్రేకం మరే విధమైన రంగులను కాని, నాదాలను కాని, ఆకృతులను కాని చేర్చినా కల్గ దంటాడు ఏట్స్.”

 7. Thanks all for ur interesting comments. I feel like reading the discussion throughout, again now 🙂

 8. చాలా ఆసక్తికరమయిన విషయాలు చెప్పారు కామేశ్వరరావుగారు. ఇంగ్లీషు సామ్యాలకి దీటుగా తెలుగులో కూడా ఏమయినా ఉదాహరణలు ఇవ్వగలరా. కేవలం కుతూహలంతోనే అడగుతున్నాను.

 9. మాలతిగారు,

  మీరడిగిన విషయం PhD చెయ్యాల్సినంత పెద్దది! 🙂 ఇపాటికే చాలామంది చేసే ఉంటారు. ఇంగ్లీషు సామ్యాలకి దీటుగా అవునో కాదో చెప్పలేను కాని, చప్పున గుర్తుకొస్తున్న కొన్ని ఉదాహరణలు.

  కవిత్వం:
  ఆధునిక తెలుగు కవిత్వంలో ప్రతీకలు చాలా విరివిగానే కనిపిస్తాయి. గురజాడ “గుత్తునా ముత్యాల సరములు” గేయంలో “ధూమకేతువు” నుంచి, కృష్ణశాస్త్రి ఊహా ప్రేయసి ఊర్వశి, శ్రీశ్రీ “పులి చంపిన లేడి నెత్తురూ”, “కలకత్తా కాళిక నాలిక”, “జగన్నాథ రథ చక్రాలు”, జయప్రభ “పైటని తగలెయ్యాలి” వరకూ అన్నీ ప్రతీకలే కదా. శేషేంద్ర కవిత్వం చాలావరకూ ప్రతీకాత్మకంగానే ఉంటుంది. ప్రతీకాత్మకతని సాంకేతిక స్థాయి తీసుకువెళ్ళిపోయిన కవి ఆరుద్ర.

  కథలు:
  కథల విషయంలో గుప్త కథలకీ(allegories), ప్రతీకాత్మక కథలకి నాకైతే తేడా పెద్దగా తెలీదు. కొత్తపాళిగారు చెప్పిన యజ్ఞం కథ ముగింపు ప్రతీకాత్మకమైనదే. రావిశాస్త్రి పిపీలకం గుప్తకథ కిందకి వస్తుందనుకుంటాను. విశ్వనాథవారు చాలా ప్రతీకాత్మక కథలు/కథా కావ్యాలు రాసారు. అతని కోకిలమ్మ పెళ్ళి, కిన్నెరసాని, మాక్లీ దుర్గంలో కుక్క అన్నీ ప్రతీకాత్మకమైన కథలే. కథ 2006 లో “వేట” కథలో మంచి ప్రతీకాత్మకత ఉంది. ఈ మధ్యనే పొద్దులో శారదగారి “అతిథి”కూడా ప్రతీకాత్మకమైన కథే కదా.

  నేను చదివిన నవలల్లో వేయిపడగలు పూర్తిగా ప్రతీకాత్మకమైన నవల.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: