సాధారణంగా మనకి పెద్దవాళ్ళకి ప్రతిఏటా తద్దినాలు పెట్టడం వాళ్ళ పెద్ద కొడుకో, ఆ రోల్ కి దగ్గరగా ఉండే ఇంకోరో చేస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు మా తాత (నాన్నకి నాన్న) తద్దినానికి వీలైనంత వరకు ఆయన పిల్లలందరూ వాళ్ళ కుటుంబాలతో సహా కలిసేవారు. ఇది ఇలా మా నాన్న పోయాక నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు కూడా కొనసాగడం నాకు గుర్తు ఉంది. ఇందులో వంట చేయడం కాకుండా ఆడవాళ్ళకి వేరే ఏమన్నా రోల్ ఉందో లేదో నాకు తెలియదు. అందునా మనకి మరి పెళ్ళి చేసుకుంటే కూతురి గోత్రం మారిపోతుంది కనుక అసలు ఆ ఆఫిషియల్ ప్రాసెస్ లో ఏం పాత్ర లేదనుకుంటాను (పెళ్ళి కానివాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇపుడు టక్కుమని అలాంటి సందర్భాలు గుర్తు రావడం లేదు నా ఎరుకలోని కుటుంబాల మధ్య). అట్లాంటప్పుడు ఆయొక్క దినాలలో ఆయొక్క మహిళామణులు చేయదగ్గది ఏమిటి? అన్న ప్రశ్న వచ్చింది. ఇదేదో ఇపుడు హిందూ మత ద్వేషి ఈమె అని మొదలెట్టకండి. మీకు అలా అనిపిస్తే మీ ఖర్మ. నేనూ ఏ టైపు మనిషినైనా మాకూ ఆత్మలుంటై, మాకూ ఆత్మకథలుంటై.
నా చిన్నప్పుడు సంక్రాంతి తరువాత కనుమ రోజు మా అమ్మ ఒకటి చేస్తూండేది. అన్నం ముద్దలు పసుపు, కుంకుమ కలిపి చేసి, మిద్దెపైన కాకులకి పెట్టి ఒక శ్లోకం చదివేది. పిల్లలం అక్కడే కూడా ఉండి రిపీట్ చేసేవాళ్ళం. ఇది సంక్రాంతికి ఒకసారి మా మేనత్త వాళ్ళింట్లో ఉంటే అక్కడ కూడా ఈ పద్ధతి ఆవిడ ఆధ్వర్యంలో చేశాను. 2020లో ఆఖరుసారి చేశాను ఇండియా ట్రిప్ లో. ఇప్పటిదాక నా అంత నేను చేయలేదు. పైగా జనవరిలో ఈ చలిలో ఇక్కడ కాకుల్ని ఎక్కడ వెదుకుతాం కెనడాలో? దీని గురించి ఎపుడన్నా లోకల్ గుడిలో పూజారిని అడగాలి అని చాలాసార్లు అనుకున్నా కానీ నాకు మతపరమైన ఆచారాల పట్ల మరీ అంత ప్యాషన్ లేనందువల్ల పట్టించుకోలేదు. ప్రతిఏడాదీ నాకూ మా ఇంటాయనకీ ఆ సమాయానికి ఆ సంభాషణ అయితే అవుతుంది. కానీ ఆడవాళ్ళు పూర్వికులని తల్చుకునే ఒక ట్రెడిషనల్ రిచ్యువల్ సందర్భం ఇదొక్కటే నాకు తెలిసిన జీవితంలో. అది మా వాళ్ళ పద్ధతి – అంతా చేస్తారో లేదో నాకు తెలియదు. ఇలాంటిది ఒకరిద్దరు కథల్లో రాయగా చూశాను తప్ప స్నేహితుల మధ్య అయితే ఎప్పుడూ వినలేదు. ఇది జనరిక్ – ఫరాల్ డెడ్ ఏంసెస్టర్స్ అన్నట్లు.
పాయింటెడ్ గా ఒక మనిషి మరణించిన తిథో/తేదీ నో… అప్పుడు ఏం చేస్తాము? ఏం చేయొచ్చు? అన్నది ఇందాక ఫ్రెండుతో చర్చకి వచ్చింది (ఇలాంటి చర్చలు ఇంట్లో వాళ్ళతో పెట్టలేకపోయినా ఫ్రెండు తో పెట్టగలగడం అదృష్టమనే చెప్పాలి. నా ఫ్రెండ్సులకి ఓపిక ఎక్కువ). “పూజారిని అడక్కపోయావా? వాళ్ళే ఏదో చెబుతారు శాస్త్రం ప్రకారం” – అని ఒక ఫ్రెండు అన్నది. “ఎబ్బే… అట్టాంటివి కాదు… మనం రిచ్యువల్స్ అవీ అంత పాటించం కదా… అందునా నా బోంట్లు అలాంటి ప్రశ్నలేస్తే మొదట ఇంట్లో వాళ్ళే నవ్వేయరూ?” అనుకున్నా.
విషయం ఏమిటంటే, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ దినాలకి మనం చేయగల అప్రాప్రియేట్ పనులు ఏమిటన్నది. నాకు తట్టినవి ఇవీ:
- ఆ వ్యక్తి పేరుతో ఏదన్నా నచ్చిన చోట అన్నదానమో ఏదో అరేంజి చేయడం. ఓపికుంటే స్వయంగా ఎక్కడికో పోయి ఆ పనులేవో మనమే చేయడం.
- కాసేపు కూర్చుని ఆ వ్యక్తితో మన జ్ఞాపకాలు నెమరువేసుకోవడం. మన వద్ద ఫొటోలో ఏవో ఉంటే అవోసారి తిరగేయడం
- ఆ వ్యక్తి వస్తువులేవన్నా ఉంటే మరి వాటిని ఓసారి చూసి మనవద్ద ఎందుకున్నాయి? అన్నది గుర్తు తెచ్చుకోవడం
- మన తరవాతి తరానికి వాళ్ళ గురించి మనకి తెల్సినదేదో చెప్పడం.
- వాళ్ళకి తగ్గ వారసులమా? అనేసి మనల్ని మనం తిట్టుకోకుండా వాళ్ళ అంశ మనలో ఏముందో చూసుకుని గర్వపడ్డం. ప్రతివాళ్ళలోనూ లోపం ఉంటుంది. పోయినోళ్ళందరూ మంచోళ్ళే కానీ బ్రతికున్న అందరూ చెడ్డోళ్ళనేం లేదు కదా? మనకీ ఏదో ఓ మంచి విషయం కూడా వంటబట్టి ఉంటుంది వాళ్ళ నుంచి. అది కొంచెం ఆలోచించి హైలైట్ చేసుకుని గుర్తు చేసుకోవచ్చు వాళ్ళని.
- మీకోపికుంటే కోకో సినిమా చూడండి. అసలా సినిమా ఈ టాపిక్ మీద నా మీద బాగా లోతైన ప్రభావం చూపించి అట్లా ఇన్నేళ్ళ బట్టి ఊపుతూనే ఉంది తల్చుకున్న ప్రతిసారీ. అదో పద్ధతి ఈ విధమైన తల్చుకోడానికి.
- ఇందాకే కృష్ణ గుబిలి “వీరయ్య” పుస్తకం పూర్తిచేశాను. అదీ ఓ పద్ధతే.
ఇంకా ఏవన్నా తడితే మళ్ళీ అప్డేట్ చేస్తా. పాతికేళ్ళ డైరెక్ట్ ఎక్స్పీరియంస్ ఇక్కడ.
అట్లగాదు, ఓన్లీ మన మతంలో పాటించేవి మాత్రమే చెయ్యాలి.. మిగితావన్నీ నీలాంటి భ్రష్టులకి, మాక్కాదు, అనుకుంటే, మరీ మంచిది… ఎవడ్రమ్మన్ నాడండీ అడ్డమైన బ్లాగ్ పోస్టులు చదవడానికి? వెళ్ళండి మరీ!
కోడలే మడి కట్టుకుని వంట చేయాలి, లేకపోతే పరలోకాల పెద్దలు ఆ భోజనం చేయరు మరి! పెళ్ళి అయిన/అవని కూతుర్లు కేవలం సహాయమే తప్ప, కోడలే ముఖ్యం అని అంటారు చాలామంది. ఇలా సంక్రాంతికి ఆడవాళ్ళు చేయడం రాయలసీమలోనే ఉందేమో.. నాకు తెలిసిన వాళ్ళలో ఇలాంటివి చేస్తున్న వాళ్ళు ఎక్కువ భాగం రాయలసీమ వాళ్ళే, కోస్తా లోకూడా కొంతమంది చేస్తున్నా, వాళ్ళకీ సీమ కనెక్షన్స్ ఉన్నాయి.