“We are all translators” అంటూ వారానికి ఒకసారి వచ్చే వార్తాలేఖ ఒకటి నేను తరుచుగా చదువుతూ ఉంటాను. ఇది పంపేది జెన్నీ భట్ అన్న రచయిత్రి, అనువాదకురాలు. ప్రతివారం అనువాదానికి సంబంధించి ఏదో ఒక అంశాన్ని స్పృశిస్తూ, దానికి సంబంధించిన ఇతర వ్యాసాలని జోడిస్తూ రాస్తారు. ఈ వారం వచ్చిన విషయం – అసలు అనువాదాలు ఎలా మొదలుపెట్టాలి? అని. అది చదివాక ఈమధ్య ఒకరిద్దరు నన్ను కూడా ఈ విషయం అడిగారని మళ్ళీ గుర్తు వచ్చి, ఇలా ఒక పోస్టు రాస్తున్నాను ఆ అంశం పై. మరి నాకు ఎంతో కొంత తెలిసిన మూడు భాషల్లో అనువాదం అన్న ఆలోచన కలిగినది తెలుగు, ఆంగ్లాలకే. వీటిల్లో తెలుగు నుండి ఆంగ్లంలోకి చేయడం అన్నది కొంచెం తక్కువ ప్రాచుర్యం ఉన్న అంశం కనుక దాన్ని ఎంచుకుంటున్నాను. ఈ విషయంలో నాకు జ్ఞానం, అనుభవం చాలా తక్కువ కానీ, అవి కూడా ఇంకా సంపాదించని వారికోసం అనుకోవచ్చు ఈ పోస్టు. విపరీతమైన అవగాహన ఉండి, అనువాదం ఇలా ఉండాలన్న నిశ్చితాభిప్రాయం ఉన్నవాళ్ళు ఇక్కడే ఆపేసి పోండి, ప్లీజు.
అన్నట్లు నేను కథల గురించి రాస్తున్నాను. వ్యాసాల గురించి, పూర్తి పుస్తకాల గురించి కూడా రాయదగ్గ అనుభవం ఒక పిసరు ఉంది కానీ రాయను. ఇక కవిత్వం – అది నాకసలు తెలుగులోనే గుబులు పుట్టించే వ్యవహారం కనుక దాని గురించి నాకు తెలియదు.
తెలుగు నుండి ఆంగ్లం లోకి కథల అనువాదం ఎలా మొదలుపెట్టాలి అంటే నా ఉ.బో.స (ఉచిత బోడి సలహాలండీ) లు ఇవీ:
- మొదట ఎందుకు అనువాదం చేయాలి అనుకుంటున్నారు? అది ఆలోచించి సమాధానం చెప్పుకోవాలి ఎవరికి వారు. ఊరికే కాలక్షేపానికి అన్నది కూడా మంచి సమాధానమే. నచ్చిన ప్రతి కథనీ అనువాదం చేయలేము. నా ఉద్దేశ్యంలో మొదట ఏదన్నా పబ్లిక్ డొమైన్ లో ఉండే తెలుగు టెక్స్ట్ – వార్తాపత్రిక వ్యాసమైనా, గూటెంబర్గ్ లాంటి వెబ్సైటులలో ఉండే తెలుగు పుస్తకాలైనా, ఇలాంటివేవో తీసుకుని ఓ నాలుగు పేజీలు అనువాదం ప్రయత్నించండి. నాలుగు పేజీలా? అనకూడదు మరి. ఆ మాత్రం లేని కథలు చాలా తక్కువ. ఇది చేసి ఒకసారి మనకి మనం చదువుకుంటే, వీలైతే ఏ ఉదారహృదయులైన మిత్రులకో ఇచ్చి చదివిస్తే (ఔదార్యం ముఖ్యం), వచ్చే వ్యాఖ్యలను బట్టి తరవాత మనం ఇప్పుడు అనువాదం లోకి దిగొచ్చా? కొన్నాళ్ళాగి మళ్ళీ ప్రయత్నిద్దామా? అన్న అవగాహన వస్తుందని నా అభిప్రాయం.
- సరే, ఇది మనం చేయొచ్చూ, ట్రై చేద్దాం అనుకున్నాక ఏదో ఓ కథ ఎంచుకుంటాం కదా… అదే ఎందుకు? దాన్ని అనువాదం చేయడం వల్ల ఎవరికి లాభం? ఆంగ్ల పాఠకులకి ఏదన్నా కొత్తగా ఉంటుందా ఆ కథల్లో తరుచుగా ఆంగ్లంలో చదివే వాటితో పోలిస్తే? ఇలాంటివి కొంచెం ఆలోచిస్తే మంచిది. “మా పిల్లల నాటికి తెలుగు చదవడం రాదు. అందువల్ల ఈ కథ నాకిష్టం కనుక ఆంగ్లంలోకి చేస్తాను” – అన్నది కూడా ఇక్కడ మంచి సమాధానమే. నా ప్రపంచం చిన్నది, జ్ఞానం అంతకంటే పరిమితమైనది. అందువల్ల ఇంటెలెక్చువల్ అనాలసిస్ కంటే ఇలాంటి సమాధానాలే ఉంటాయి నావి కూడా.
- మొత్తానికి ఏదైనా సరే, ఫలానా కథ అనువాదం చేయాల్సిందే అనుకున్నాక అక్షరం మొదలుపెట్టే ముందు చేయాల్సినది –అనుమతి తీసుకోవడం. రచయిత ఉంటే వారిని వెదుక్కుని సంప్రదిస్తే హక్కులు వారివా, పబ్లిషర్ అనుమతి కూడా కావాలా? వంటివి చెబుతారు. లేకపోతే వాళ్ళ వారసులని వెదకొచ్చు. కాపీరైట్ చట్టం ప్రకారం రచయిత చనిపోయిన 60 ఏళ్ళకి రచన పై ఎవరికీ కాపీరైట్ ఉండదంట – ఇది అలాంటి రచనైతే సమస్యే లేదు. ఇవేం లేకపోతే మరి ఆ రచన మీకెంత నచ్చినా, అది ఆంగ్లంలోకి రావడం ఎంత అవసరం అనుకున్నా, దాన్ని అనువాదం చేయకపోతే అందరికీ మంచిది. ఆంగ్ల పత్రికలు కూడా రైట్స్ సమస్యలు ఉంటే వేసుకోరెలాగో.
- అనువాదం అంటూ మొదటి డ్రాఫ్టు అయ్యాక ఒకటికి పదిసార్లు చదువ్కుని, స్పెల్/గ్రామర్ చెకర్ల ద్వారా చూస్కుని, ఆ తర్వాత ఆంగ్లం లో సాహిత్యం బాగా చదివే తెల్సిన వాళ్ళని కూడా కొంతమందిని రివ్యూ చేసి సలహాలు చెప్పమని అడగడం నా దృష్టిలో తప్పనిసరి. వీలైతే అస్సలు తెలుగు చదవని సాహిత్యాభిమానులైన మిత్రులుంటే వారినడగండి. నేనైతే ఒకోసారి మా ఆఫీసులోని తెల్లజాతీయులని కూడా అడుగుతా సిగ్గుపడకుండా. మరీ హార్ష్ క్రిటిక్స్ ని అడగొద్దు. వీళ్ళకి హార్ష్ నెస్ మీద ఉన్న ఆసక్తి అసలు ఉపయోగకరంగా, ప్రోత్సాహకరంగా చెబుతున్నామా? అన్న దానిమీద ఉండదు. ఇందువల్ల మనలో ఒక సెల్ఫ్ డౌట్ మొదలవుతుంది. సహృదయులు కొందరైనా ఉండాలి రివ్యువర్లలో. కనీసం బాగా అనుభవం వచ్చేసి పండిపోయాం అనుకునేంత వరకైనా ఇది ప్రతి కథకీ చేయాలి అని నా అభిప్రాయం. ప్రతొక్కరు ఇచ్చిన ప్రతి సూచన పాటించి తీరాలనేం లేదు కానీ పర్సనల్ గా తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి అనువాద సమస్యలు ఉంటాయి, వాటిని ఎలా అధిగమించాలి అన్నది నేను కొన్ని వ్యాసాలు చదివి కొంచెం అవగాహన పెంచుకున్నాను. వీటి గురించి వీలువెంబడి రాస్తాను. తూలిక.నెట్ వెబ్సైట్ లో ఇచ్చిన గైడ్ లైన్స్ మంచి స్టార్టింగ్ పాయింట్. చివర్లో మూల రచయితకి లేదా ఎవరికి రైట్స్ ఉంటే వాళ్ళకి ఒకసారి పంపి, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవడం కూడా నా దృష్టిలో బెస్ట్ ప్రాక్టీసే. మనం ఏం చేసినా అది వాళ్ళ కథే కనుక ఇది అసలు తప్పనిసరి నా దృష్టిలో. వాళ్ళకి అనువాదం నచ్చకపోతే మనం పత్రికలకి ఎలా పంపుతాం? అన్నది నా ఆలోచన ఈ విషయమై.
- ఇదంతా అయ్యాక అప్పుడు ఇంక ఎక్కడికి పంపాలి? అన్న విషయం ఆలోచించొచ్చు. నేను పోయిన సంవత్సరం మొదటి అనువాదం చేసినపుడు ఇది చాలా రోజులు వెదుక్కున్నాను. “హిమాలయన్ రైటింగ్ రిట్రీట్” వారిదొకటీ, “బాంబే రివ్యూ” వారిదొకటీ రెండు వెబ్ పత్రికల జాబితాలు కనబడ్డాయి. తరవాత గూగుల్ సర్చిలో “సబ్మిట్ ట్రాన్స్లేషన్” , “లిటరీ ట్రాన్స్లేషన్” ఇలా కొన్ని పదబంధాలు కొడుతూ మరికొన్ని అంతర్జాతీయ పత్రికల గురించి తెలుసుకున్నాను. చాలా వెబ్ పత్రికలు సబ్మిటబుల్ అన్న వెబ్సైటు వాడతాయి మన అనువాదాలు స్వీకరించడానికి. అందులో “డిస్కవర్” అన్న లంకె లో “ట్రాన్స్లేషన్” అని వెదికితే డెడ్లైన్ లని బట్టి అనువాదాలు స్వీకరిస్తున్న వెబ్ పత్రికలు కూడా కనిపిస్తాయి. ఇలాంటివి కొన్ని పోగేసి, లంకెలు పనిచేస్తూంటే వాటివి ఓ రెండు మూడు సంచికలు తిరగేసి, ఇలాంటి కథలు వేసుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నించుకుని, పంపడమే. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి, వాళ్ళ సూచనలు క్షుణ్ణంగా చదవాలి. “మీర్రాయండి, మేము స్పందించకపోతే నిరాశ పడకండి” అనేవాళ్ళకి పంపకండి. “మీర్రాయండి, నెలరోజుల్లో స్పందిస్తాము”. “మీర్రాయండి, కానీ మాకు వచ్చే వాల్యూం వల్ల ఆర్నెల్ల దాకా పట్టొచ్చు”, ఇలా ఏదో ఒకటి చెప్పిన చోట్లనే సబ్మిట్ చేయడం ఉత్తమం. వీళ్ళైతే మనం ఆ పీరియడ్ అయ్యాక వాకబు చేస్తే కనీస మర్యాదగా స్పందిస్తారు ఏమైందని.
- తర్వాతేమవుతుంది: తెలుగు పత్రికల్లో ఎడిటోరియల్ ఫీడ్బ్యాక్ అన్నది అంతగా లేదనిపిస్తుంది నాకు. దీని వల్ల నిర్ణయాలు తొందరగా వచ్చేస్తాయి. ఆంగ్ల పత్రికలు నెల నుండీ ఆర్నెల్ల దాకా… కొన్ని ఇంకా ఎక్కువ కూడా చేస్తారంట… ఎంత సమయమైనా తీసుకోవచ్చు. అయితే, ఇప్పటిదాకా నేను పంపిన వారందరూ వివరంగా సలహాలు, సూచనలు ఇచ్చారు. నాకేదైనా ఒక సూచన నచ్చలేదన్నా మర్యాదగా (నిజానికి దయతో) ఒప్పుకున్నారు. రిజెక్ట్ ఒకసారే ఎదురైంది ఇప్పటిదాక. అపుడు కూడా కొంత వివరంగా రాశారు ఎందుకు వాళ్ళకి కుదరదో. ఇవన్నీ అయ్యాక మన అనువాదం బైటి ప్రపంచానికి తెలుస్తుంది. తెలుగు కథని ఇతరులు చదువుతారు. రిజక్షన్ బాధాకరం. ఏదో మనమీద నేరం మోపినట్లు అనిపిస్తుంది. కానీ మన జీవితానుభవాల్లో అది తొలి రిజక్షన్ కాదు. ఆఖరుదీ కాదు. ప్రయత్నిస్తూ ఉంటే మన అనువాదమూ మెరుగుపడుతుంది, అలాగే, కథకి సెట్టయ్యే పత్రికా దొరుకుతుంది అనుకుని ముందుకు సాగడం ఉత్తమం..కుదిరితే. అక్కడికి పెట్టే బేడా సర్దేసి ఆపేసినా ప్రపంచం ఆగదు, మన జీవితం ఆగదనుకోండి, అది వేరే విషయం. ఇప్పటిదాకా నాకు నిర్ణయం రావడానికి పట్టిన అతి ఎక్కువ సమయం నాలుగు నెలలు. తక్కువ సమయం రెండ్రోజులు. ఒకరు అంగీకారం వారం రోజుల్లో తెలిపినా, ఎడిటోరియల్ ఫీడ్బ్యాక్ రావడానికి ఆర్నెల్లు పట్టింది. ఏడాదవుతున్నా ఇంకా కథ వెబ్సైటులో రాలేదు. అట్లుంటది ఆంగ్ల పత్రికలతోనీ. ఇలాంటి అన్నింటికీ సిద్ధపడాలి తెలుగు కథ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పాఠకులని చేరాలన్న కోరిక ఉంటే.
- పారితోషికం: ఇచ్చే వాళ్ళున్నారు. తక్కువ. అది తప్పనిసరి అంటే మాత్రం నిరాశ పడ్డానికి సిద్ధంగా ఉండండి.
పత్రికలకి రికమెండేషన్: నేను పంపిన పత్రికల్లో నాకు వీళ్ళకి మళ్ళీ పంపొచ్చు, మర్యాదగా ఉంటారనిపించినవి: అవుటాఫ్ ప్రింట్, కితాబ్, సారంగ (English section), తూలిక.నెట్, ఎక్స్చేంజెస్ (University of Iowa, USA). ఇంకా రివ్యూలో ఉన్న పత్రికలని ప్రస్తావించడం లేదు – వాళ్ళతో ఇంకా అనుభవం తెలియదు కనుక. ది బీకాన్, ఇండియన్ రివ్యూ – దయచేసి వీటికి పంపకండి. కనీసం వచ్చిందన్న అక్నాలెడ్జిమెంటు రాదు, అలాగని మనం అడిగితే రెండు నెలలైనా స్పందన ఉండదు. నేను చివరికీ ఇద్దరి విషయంలోనూ “బాబూ ఈ అనువాదం వెనక్కి తీసుకుని ఇంకో చోటికి పంపుకుంటాను..మీరు వచ్చే కల్పాంతరంలో అయినా ఇస్తారో లేదో తెలియని స్పందన కోసం నేను కాచుక్కూర్చోలేను” అని ఈమెయిలు పెట్టేశాను. అనుకున్నట్లే దానిక్కూడా స్పందన లేదు. అలాంటి పత్రికలకి మాత్రం పంపకండి – అనువాదం చేసిన పర్పస్ నెరవేరదు. అన్నట్లు ఈ రెండు వెబ్సైట్ల వాళ్ళు ఈ వ్యాసం చదువుతున్న వాళ్ళకి పరిచయం ఉంటే అసహ్యంగా పితూరీలు చెప్పకండి పొయ్యి. వాళ్ళ పద్ధతులు మార్చాలనడం నా ఉద్దేశ్యం కాదు. కొత్తగా అనువాదం చేస్తున్న వాళ్ళు నిరాశచెందకుండా సలహా ఇస్తున్నానంతే. వాళ్ళేం చేసుకుంటే నాకెండుకు చెప్పండి?
చివరగా: నా ఉద్దేశ్యంలో అనువాదం అన్నది ప్రత్యేకమైన కళే కానీ అభ్యాసంతో మెరుగు చేసుకోవచ్చు. అయితే, ఎడిటర్లు, రివ్యూవర్ల సూచనలు కొంచెం దగ్గరగా గమనించడం తప్ప నేను అంత శ్రద్ధ పెట్టడం లేదు ఆ విషయంలో. ఎవరి ఆసక్తి, ఓపిక, సమయాన్ని బట్టి వారు కావాలసినంత కృషి చేయొచ్చు. ఉదాహరణ: ఇతర అనువాదకుల వ్యాసాలు/పాఠాలు ఫాలో అవ్వడం, అనువాదం పై వచ్చిన పుస్తకాలు చదవడం, అనువాదాల పైన కోర్సులు చేయడం, డిగ్రీలు/సర్టిఫికేట్లు పొందడం వంటివి.
ఇకపోతే, పై వ్యాసంలో జెన్నీ భట్ అన్నట్లు, అనువాదం మొదలుపెట్టాక తెలుగు కథలు ఎప్పుడూ లేనంతగా చదవడం మొదలుపెట్టాను. నేను అనువాదం చేయడానికే కాదు. అసలు మన కథలు ఏమిటి? ఎలాంటివి? వీటిల్లో ప్రత్యేకత ఏమిటి? మనం చదివే ఆంగ్ల సాహిత్యం, ఇతర భాషల్లోంచి అనువాదమయ్యే సాహిత్యం – వీటితో పోలిస్తే తెలుగు కథలు ఎలా ఉన్నాయి? ఇలాంటివి అర్థం చేసుకోవడానికి చదవడం మొదలుపెట్టాను. సైడ్ ఎఫెక్టు లాగా ఒకటీ అరా నాకు అంతకుముందు తెలియని రచయితల కథలు కూడా దీని వల్ల నచ్చి అనువాదం చేయడం గురించి ఆలోచిస్తున్నాను.
ఈ టాపిక్ ఒక సుదీర్ఘ సుత్తిలా ఉంది… కనుక అడపాదడపా ఇంకొన్ని పోస్టులు పెడతాను ఏమో. మరి ఇంతలావు వ్యాసం రాశాను కనుక ఎవరైనా ఇక్కడిదాకా చదివితే ఆ ముక్క నాకు వ్యాఖ్య వదిలి పోండి 🙂
అనువాదకుల గురించి సాహిత్య లోకంలో కొద్దిమందికి కాస్త చిన్నచూపు ఉంటుంది. ఎందుకంటే అది వారి సొంత రచన కాదు అని. కానీ ఒక రచయిత ఏ ఉద్దేశ్యంతో ఆ రచన చేసాడు అన్నది అర్ధం చేసుకుని, అది చెడకుండా, మంచి భాష ఉపయోగించి, అదే ఒరిజినల్ రచన అనే భావన పాఠకులకు ఇస్తూ, మరోవైపు మనం అనువాదం చేస్తున్న పాఠకులకు కూడా ఒరిజినల్ కథలోని వాతావరణాన్ని అందివ్వగలిగడం చాలా కష్టమైన విషయం. మీ ఈ వ్యాసం ద్వారా ఔత్సాహికులే కాదు, చేయి తిరిగిన రచయితలు అయినా అనువాదం గురించి ఎంతో నేర్చుకోవచ్చు. చాలామంది తమ process ను బైటకి చెప్పరు. అవి తెలిస్తే తమపై గౌరవం తగ్గిపోతుందనో, అందరూ ఫాలో అయిపోయి తమను వెనక్కి నెట్టేస్తారనో భయపడతారు. కానీ మీరు చేస్తున్న ఈ పని ఎందరికో మంచి గైడ్ గా నిలుస్తోంది. Kudos soumya garu…
Thanks, Meena garu. చిన్నచూపు విషయం నాకు అంత అనుభవం లేదు (కొంత ఉంది). మన మానాన మనం పని చేసుకుపోతూ ఇలాంటి తాటాకు చప్పుళ్ళని వినీ విననట్లు ఉంటేనే ప్రొడక్టివ్ గా ఉంటామని నా అభిప్రాయం. ఎందుకంటే సాధారణంగా ఈ అనువాదాలపై నిర్ణయాలు తీసుకునే ఎడిటర్లకి ఈ చులకన భావం ఉండదు. పాఠకులక్కూడా ఉండదు. ఉంటే అనువాదం చదవరు కదా. అనువాదకులకి ఎడిటర్లు, పాఠకులు ఇచ్చే గుర్తింపు/గౌరవం కన్నా చుట్టుపక్కల ఉడుకుమోత్తనంతో విమర్శించే వాళ్ళ వల్ల గుర్తింపు ఎక్కువేమీ కాదు.
ఎడిటర్లు, రివ్యూవర్ల సూచనలు కొంచెం దగ్గరగా గమనించడం తప్ప నేను అంత శ్రద్ధ పెట్టడం లేదు ఆ విషయంలో.
ఎందుకని ?
ఎవరి ఓపికా, ఆసక్తి, సమయాలని బట్టి వారు రకరకాలవి చేసి మెరుగు పరుచుకోవచ్చని రాశాను కదండి. మరి నా ఓపిక/ఆసక్తి/సమయం బట్టి నేను చేయగలిగేవి నేను చేస్తున్నా. అది ఇతరుల సూచనలని బట్టి నేర్చుకోవడం, మెరుగుపడడం.