పాటల సందడి : జాబిల్లి కోసం ఆకాశమల్లే

టైటిల్ చెబుతున్నట్లు నేను ఎంచుకున్న పాట “మంచి మనసులు” సినిమాలో ఆత్రేయగారు రాయగా ఇళయరాజా స్వరపరచి ఎస్పీబీ, జానకి గార్లు విడివిడిగా పాడిన “జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై” పాట రెండు వర్షన్లు. ఇది నా అన్నింటికంటే ఫేవరెట్ కాదని ముందే విన్నవించుకుంటున్నాను. ఈ టపా రాయాలన్న తీర్మానం జరిగినప్పుడు ఈ పాట నన్ను తనలోకి స్వాహా చేసేస్కుంటూ ఉండింది. అందుకని నేను ఈ పాటనే ఎంచుకున్నాను. మనసు కవి అని ఆత్రేయను ఎందుకంటారో ఎన్నో పాటలు మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి అని నాకు బాగా నమ్మకం. ఒకటి విఫల ప్రేమ గీతంలా, ఒకటి కలల విహారం లా ఉన్నా కూడా రెంటినీ గురించీ ఒకే టైటిల్ కింద రాస్తున్న నన్నేమనాలో మీరే డిసైడ్ చేస్కోండి. 🙂 అయినా, ఈ పాటలు సినిమాలో ఏ సందర్భంలో వచ్చాయి అన్న విషయాన్ని పక్కన పెట్టి రాస్తున్నాను ఈ టపా.

మొదటగా male version – ఆన్లైన్ లో ఇదే ఎక్కువ ప్రచారంలో ఉంది, ఎందుకో గానీ. పాట సాహిత్యం ఇక్కడ చూడవచ్చు.
“నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైన” – వింటూ ఉంటేనే ఆ విరహం అనుభవిస్తున్న భావన కలుగుతుంది. అది ఆ పదాలవల్లని చెప్పి సంగీతాన్ని తక్కువ చేయనా? సంగీతమని చెప్పి పాడిన విధానాన్ని మరువనా? అందుకే ఏమీ చెప్పను.
అలాగే – “నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా” – అన్న వాక్యం కూడానూ.
“ఈ పువ్వులనే, నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ ఉర్రూతలూగీ మేఘాలతోటీ రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి”

-నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా – అన్న వర్ణన భలే ఉందసలు.
“ఉండీ లేకా ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే”

– ఒక్కో మూడ్ లో ఒక్కో అర్థం తోస్తోంది నాకు ఈ వాక్యాన్ని చూస్తూ ఉంటే. అందులో ఎంత ప్రేమా, విరహమూ ఉన్నాయో, అంత కోపం కూడా కనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఆ నేపథ్య సంగీతం కూడా ఇలా రెండు రకాలుగా అనిపిస్తుంది, ఎందుకోగానీ.
“నా రేపటి అడియాసల రూపం నువ్వే!”
-నిఖార్సైన తిట్టు. ఎటొచ్చీ, ఈ పాట సినిమాలో ఎలా ఉందో తెలీని పక్షంలో దీన్ని ఎలా అర్థం చేసుకోను? అన్నది నా సందేహం. నా interpretation ఇదీ : రేపు ఒకవేళ కలిసుంటే ఈ మనిషితో ఎలా వేగాలో అన్న అనుమానం కావొచ్చు 😉 లేదా, ప్రేమ విఫలమౌతోందన్న భయం కావొచ్చు. కానీ, ఆ వాక్యం మాత్రం అసలు ఎన్నెన్ని సార్లు నన్ను ఎన్నెన్ని సమయాల్లో వెంటాడిందో! నా నిన్నటి ఆశల రూపం నువ్వే అని కూడా పెట్టి ఉండాల్సింది. 😉

రెండో వర్షన్ – జానకి గారు పాడినది. వెల్, ఇది female version కనుక అని అన్నా కూడా, నాకు ఇదే చాలా చాలా ఇష్టం పై దాని కంటే. ఇదైతే పైదాన్లోని చివరి రెండు లైన్ల లా వెంటాడుతూనే ఉంది, ఉంటుంది. మొదటిసారి ఈ పాట పూర్తిగా విన్నది ఈ రెండేళ్ళలోనే. కానీ, ఈ పాటతో జీవిత కాలం అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక వయసులో ఉన్న అమ్మాయి తన ప్రియుడి కోసం ఎదురుచూస్తూ, కలలు కనడం – అనే మూడ్ ని ఈ పాట పట్టుకున్నంత బాగా ఏదీ పట్టుకోలేదేమో బహుశా.
“రామయ్య మెడలో, రాగాల మాలై పాడాను నేను పాటనై” (నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనై – అన్నది అతని భావన)
“నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైన” అని అతనంటే “నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా” – అన్నది ఆమె మాట. అంతే మరి, ఈవిడ మనసేమో ఆయన దగ్గరుంది. బహూశా ఆయనది ఈవిడకిస్తే, ఈమె తన మనసుతో కలిపి ఆయనకే పంపేసి తరువాత ఆయనే వస్తాడని ఎదురుచూస్తూ కూర్చున్నదేమో. ఆయన మనసులు కలిసాయి అని లైట్ తీస్కున్నాడో ఏంటో. నాకు మహా జాలేస్తుంది ఈ లైన్ విన్న ప్రతిసారీ హీరోయిన్ పై.. ఇంతకీ సినిమా నేనెప్పుడూ పావు భాగం కూడా పూర్తి చేయలేదు.
-ఈ రెండు లైన్లు అతనికి, ఆమెకీ రాసిన విధానం అసలు అద్భుతం.

నాకు ఈ వర్షన్ పాటలో పై వర్షన్ కంటే కూడా emotional bonding ఎక్కువగా తోస్తుంది. అలాగే, ఈ పాటలో ఊహాలోక విహారం కూడా పై వర్షన్ కంటే ఎక్కువలా తోస్తుంది. బహుశా రెండు పాటల మూడ్ వేరు కావడం వల్ల కావొచ్చు, లేదా మనిషే వేరు కావడం వల్లనేమో 🙂
“నీ ఊసులనే నా ఆశలుగా
నా ఊహలనే నీ బాసలుగా
అనుకుంటిని కలగంటిని నీ ఎదుటగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్ననాడు నేనే లేను”

– The typical Indian woman! కరెక్ట్ గా నాడి పట్టేసిన ఆ మనిషి మాత్రం ఆత్రేయగారు. ఈ వాక్యాల్ని జానకి గారి గొంతులో వింటూ ఉంటే, ప్రతి అమ్మాయికీ తన మనసులో మాటే పాటైంది అని అనిపించకపోతే ఇక నో కామెంట్స్.

“నా వయసొక వాగయినది
నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో”
– కంప్లైంటని కాదు కానీ, ఇదే ఇంకోళ్ళు రాసుంటే ఈజీగా అది ఎబ్బెట్టుగా అనిపించి ఉండేది.

“ఈ వెల్లువలో ఏమవుతానో
ఈ వేగంలో ఎటు పోతానో”

– The typical Indian woman again! ఎన్ని కలలు కంటూ ఉన్నా, మధ్యలో మళ్ళీ వాస్తవంలోకి వచ్చే ప్రయత్నం. O pakka

“ఈ నావకు నీ చేరువ తావున్నదో”
-అన్న భయం ఉంది. మరో పక్క
“తెరచాప నువ్వై నడిపించుతావో
దరి చేరి నన్ను ఒడి చేర్చుతావో
నట్టేట ముంచి నవ్వేస్తావో”
– అన్న భయమూ ఉంది.
ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా అనుకున్నానో ఈ పాట గురించి – ఒక అమ్మాయి మనసు ఇంత అందంగా ఎంత బాగా తెలిపారు ఆత్రేయ గారు అని.

ఈ పాటలు నిజానికి నా “వావ్” కాంబో పాటల్లో రెండు. ఇళయరాజా-ఎస్పీబీ,జానకి కాంబో. కానీ, ఈ టపాలో నేను వాళ్ళనొదిలేసి ఆత్రేయ గారి సాహిత్యాన్ని గురించే మాట్లాడుకున్నా అనుకోండి. అది ఎందుకంటే, ఈ పాటలు సాహిత్యం వల్లే నన్నిలా వెంటాడాయని నా నమ్మకం.

సరే, పాట తమిళ వర్షన్ సాహిత్యం వేరుగా ఉందనుకుంటా. అంత తమిళం నాకు రాదు కనుక వాటిపై రాయను 🙂
ఒక version ఇక్కడ.

Published in: on April 10, 2009 at 11:45 am  Comments (21)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/04/10/pramad-patalasandadi/trackback/

RSS feed for comments on this post.

21 CommentsLeave a comment

  1. వావ్!! ఎన్నోసార్లు విన్న పాటలు బాగా తెలిసిన పాటలు అయినా కొత్తగా పరిచయం చేసారు సౌమ్యా… good post. నిజం చెప్పాలంటే జానకి గారి పాట ఓ రెండేళ్ళ క్రితం వరకు పెద్దగా ఫాలో అయ్యే వాడిని కాదు కానీ ఓ చల్లని సాయంత్రం ఏకాంతం లో మొదటి సారి శ్రద్దగా వినే అవకాశం దొరికినప్పుడు ఔరా! అనుకున్నాను.

  2. తెలిసిన పాట అయినా పరిచయం బావుంది.

  3. భాష రాకపోయినా.. ఈ పాట వింటూనే ఉండచ్చు, అది ఇళయరాజా మాజిక్!
    ఖర్మ కాలి భాష వస్తే ఇదో ఇలా టపాల మీద టపాలు రాసుకుంటూ పోవాలి. 😛

    I miss you ని తెలుగులో ఏమంటారండీ? ఆత్రేయా గారూ! అని అడిగితే.. ఈ లైన్స్ చెప్పారేమో..
    “ఉండీ లేకా ఉన్నది నీవే
    ఉన్నా కూడా లేనిది నేనే”

    “అమ్మాయిలం మేం.. ఎవ్వరికీ అర్థంకాము” అని ఫోజు కొడదామంటే.. ఈ గేయరచయతలు “అంత లేదు!” అనిపించేలా రాసిన పాటల్లో ఇదొకటి. oscillating between hope and despair, dream and reality!

    అయినా నాకు అబ్బాయి వర్షెనే ఎక్కువ నచ్చుతుంది.. “నా రేపటి అడియాసల రూపం నువ్వు” – hits hard! lethal blow at times!

    Thanks for introducing these songs!

  4. Thanks for your introducing these songs, in your style! 😉

  5. వావ్! సౌమ్య .. అసలే ఆ పాట చాలా బావుంటుంది.. ఇక నీ వివరణ చదివాక అద్భుతం అని చెప్పక తప్పదు..

    అభినందనలు…

  6. mmmm baagundi enduku nachhaledo male version naku artham kaaledu……

    ilane eedivilo virisina paata kooda female version vuntundi(by janaki gaaru)
    try thatone also
    athreya garu ante iraga deestaru anni manaki telisina maatalato prasa pokunda raastaru…..

  7. వివరణ బాగుంది.
    psmlakshmi

  8. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. మామూలుగా తమిళ పాటలు తెలుగులో చాలా ఇబ్బందిగా ఉంటాయ్ వినటానికి. కానీ, ఈ పాట .. సాహిత్యం.. చాలా బావుంటాయ్. ఆత్రేయగారు రాసారని నాకు ముందు తెలియలేదు. ఆయనను మనసు కవి అని ఎందుకంటారో ఈ పాట చాలు వివరించటానికి. మీ వివరణ చాలా బావుంది. Thanks.

  9. సౌమ్య గారూ..
    ఈ పాటలు ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరేమో అసలు.
    కానీ.. మీరిచ్చిన వివరణ మాత్రం అద్భుతం.. 11/10 😉
    “నా రేపటి అడియాసల రూపం నువ్వే!” ఈ లైను మాత్రం ఎప్పుడు విన్నా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. దీనికి మీరిచ్చిన అర్ధం బాగుంది.
    మొత్తంగా చెప్పాలంటే చాలా చాలా లా లా.. బాగా రాశారోచ్ చ్ చ్.. :p

  10. అద్భుతమైన పాట. పాటకు తగ్గ వివరణ. మంచి పాటను గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు.

  11. అందరికీ నా ధన్యవాదాలు…. ఐడియా జ్యోతి గారిది కనుక, ఆవిడకి ఎక్కువ ధన్యవాదాలు 😉

  12. సౌమ్య గారు,
    నేను ఫిమెల్ వెర్సన్ విన్లెదు.మీ వివరణ బాగుంది

  13. దూరాన ఉన్నా నా తోడు నీవే
    నీ దగ్గరున్నా నీ నీడ నాదే
    నా దన్న దంతా నువ్వే నువ్వే.

    ఒక కవి ఇంత లోతుగా ఎలా ఆలోచిస్థాడబ్బా. ఇంత విరహం, ఇంత ప్రేమని నిజంగా అనుభవిస్తే కానీ రాయలేరు.
    ఇలాంటిదే ఈ పాట కూడ,
    నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
    నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
    నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
    నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
    ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది
    http://paatapaatalu.blogspot.com/2008/09/blog-post.html
    ఈ పాటని రాసిందెవరో నాకు సరిగ్గా గుర్తు లేదు.

    మంచిపాట అందించారు.
    శుభ శుక్రవార శుభాకంక్షలు.

  14. మంచి పాటను గుర్తు చేసినందుకు కృలు. ఈ పాట తమిళ్ లో జయచంద్రన్ , సుశీల గారు పాడారు. రాసాత్తి ఉన్నే కాణాద నెంజె కాత్తాడి పోలాడుదె. అన్నపాట. నాకైతే రాజా పాటల్లో సాహిత్యం మీదకు ఆయన ఇచ్చే సమ్మోహన సంగీతం మనసును వెళ్ళనివ్వదు

  15. ఈ పాట తమిళ్ లో కూడా చాలా బాగుంటుంది. మంచి వివరణ.

  16. its really good

  17. I think “నా రేపటి అడియాసల రూపం నువ్వే!” line interpretation is something like this.. “I can’t imagine my future with out you. I will be pinning all my hopes on you. unfortunately, they are vain(అడియాసల)”

  18. manchi song ni intro chesinanduku very very thankful to you. mee dagga female version unte, mana dc++ share chesi punyam kattukondi, and add to board or msg me, naa nick balachandra, chala rojulanundi waiting for this song….

  19. excellent, simply superb. katti to kaadu atom bomb tone chapeyachu mimmalni kavi kaadante.. 🙂

  20. sorry,I mistakenly wrote it, infact it s about http://muralidharnamala.wordpress.com/2009/04/29/mypoetry/

  21. Mee post kuudaa excellent, chaduvuthunte vennelalo unntte undi..


Leave a comment