(ఇది నేను ఫేస్బుక్లో రాసిన పోస్టు. సాధారణంగా అక్కడ రాసినవి కొన్ని నెలల తరువాత డిలీట్ చేస్తూ ఉంటాను. కానీ ఇది ముఖ్యమైన సినిమా అనిపించి ఇలా ఇక్కడ సేవ్ చేస్తున్నా పోస్టుని).
ఎల్బీశ్రీరాం కవిసమ్రాట్ సినిమా చూశాము.
నా ఉద్దేశ్యంలో ట్రైలర్ వరస్ట్ గా ఉంది. అది చూసి సినిమా చూడబుద్ధేయలేదు నాకు. కానీ ఒక తెలుగు రైటర్ గురించి సినిమా తీసారంటే చూడొద్దా అని ఆ తెలుగు రైటర్ రచనలు ఏవీ చదవని మా ఇంటాయన పోరు పెట్టడంతో చూశాను ఆహా టీవీ సబ్స్క్రిప్షన్ తీసుకుని. విశ్వనాథ రచనలు ఎంతో కొంత గత పదిహేనేళ్ళలో చదివిన నాకూ, ఆయనకి జ్ఞానపీఠం వచ్చిందన్న విషయం సినిమాలో చూసి తెలుసుకున్న శ్రీరాం కూ..ఇద్దరికీ సినిమా బాగుందనిపించింది. ఈ శ్రీరాం గారికి మరి విశ్వనాథ రచనల గురించి కుతూహలం కూడా కలిగింది కనుక ఆ శ్రీరాం గారి ప్రయత్నం ఫలించినట్లే.
ఎల్బీ కొంచెం పెద్దవాడైపోయాడు… అందువల్ల కథలో, టైం లైన్ లో బాగా లిబర్టీలు తీసుకున్నారు. ఉదాహరణకి: వేయిపడగలు రాసేవేళకి విశ్వనాథ చిన్నాయనే… ఏ నలభై ఏళ్ళో ఉండి ఉంటాయి. కానీ కథలో మాత్రం డెబ్భై ఏళ్ళాయనలా ఉంటాడు. అలాగే, ఆ పద్మనాభం అనే ఆయన పాత్ర అనవసరం. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. మధ్యలో ఒకటి రెండు చోట్ల ఈ విశ్వనాథాష్టకం శ్లోకాలలోని వాక్యాలు వాడినట్లు ఉన్నారు..నాకస్సలు నచ్చలేదు, కానీ భక్తిలో ఆయన్ని దైవాంశసంభూతుడిగా, ఇంకా ముందుకుపోయి దైవంగానే భావించిన వాళ్ళలో ఎల్బీ మొదటివాడేం కాడు కనుకా, మన సినిమాలలో హీరో ఎలివేషన్ కి దేవుడి పాటలూ, స్తుతులూ అవీ వాడుకోడం కొత్తేం కాదు కనుకా, ఈయన్నే ప్రత్యేకించి అనలేం.
చివర్లో విశ్వనాథ రచనలన్నీ తిరిగి వేసినపుడు పావనిశాస్త్రి గారు వాటి ఒరిజినల్ ప్రచురణ గురించి రాసినవి స్లైడ్స్ లాగ చాలాసేపు వేశారు. అలాగే విశ్వనాథవి ఫొటోలు కూడా. బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్నా కూడా నాకు నచ్చింది. గూస్ బంప్స్ భావన వచ్చింది చివరికొచ్చేసరికి. బాలకృష్ణ చేసిన ఇంటర్వ్యూ లాంటి దానిలో ఎల్బీ అన్నట్లు, ఇది చూసి ఎంతో కొంత కుతూహలం కలుగవచ్చు కొత్తతరానికి ఈయనెవరు అని (చూస్తే!). అంతవరకూ ఇది ఒక విజయవంతమైన ప్రయోగం అనే చెప్పాలి. టీ ఎన్ ఆర్ ని సినిమాలో చూసాక ఈ సినిమా మరి చాలా రోజుల నుంచి తీసినట్లు ఉన్నారు అనిపించింది.
ఇంతకీ ఈయన రచనలు చదవాలంటే మరి ఆ భాషా అదీ అందరికీ పట్టుబడకపోవచ్చు. అలాగే అందరికీ సెట్టు సెట్టు కొనేసి చదివే ఆసక్తి లేకపోవచ్చు. అనువాదాలంటే ఏవో కొన్ని వచ్చాయని తెలుసు. నేను చదివింది ఒక్కటే: హాహాహూహూ నవలిక కి వెల్చేరు నారాయణరావు అనువాదం ఈ జర్నల్ లో వచ్చింది. ఎవరికైనా పీడీఎఫ్ కావాలంటే నాకు మెసేజి పెట్టండి.
వేయిపడగలు ఆంగ్లానువాదంలో వచ్చింది అని తెలుసు. కాపీలు ఉన్నాయో లేదో కనుక్కోవాలి. అసలు నా ఉద్దేశ్యంలో చిన్న కథలు చదవడం బెస్టు అసలేం చదవని వాళ్ళకి. కానీ దాని ఆంగ్లానువాదం ఒకటి చూశాను…మొదటి రెండు పేజీలకే ఏం బాలేదు, నేను రికమెండ్ చేయలేను అనిపించింది. అందువల్ల ఆ వివరాలు ఇవ్వను.
మొత్తానికి దురభిమానుల పాల బడి ఈయన ని వాళ్ళ లాంటి వాళ్ళు తప్ప ఇంకెవరూ చదవకుండా చేసేస్తారేమో అనిపించింది నాకు పోయినేడాది కిరణ్ ప్రభ గారి పాతిక ఎపిసోడ్ల సిరీస్ వినేదాక. ఇప్పుడు ఈ సినిమా కూడా వచ్చింది కనుక, నిజంగా విశ్వనాథ సాహిత్యం నిలబడాలి అనుకునే వాళ్లు ఉన్నారు మామూలు మనుషుల్లో అనిపించింది నాకు.
చివరగా ఓ మాట: విశ్వనాథ గురించి నీకేం తెలుసు? నీకు ఆయన భావజాలం నచ్చకుండా ఆయన రచనలు ఎలా ఇష్టపడతావు? ఇట్లాంటి ఫేక్ మేధావితనం చూపిస్తూ ఏమన్నా అనాలనుకుంటే ఇక్కడే అనండి. ఒరిజినాలిటీ లేకుండా ఇంకేం టాపిక్స్ లేనట్లు దీన్ని ఇంకెక్కడో రిఫర్ చేసుకుని పోస్ట్ పెట్టి చీప్ కాలక్షేపం చేస్కోకండి. దానికంటే పొయ్యి ఆ 80 నిముషాల సినిమా చూసి ఆ పెద్దాయన గురించి ఓ నాలుగు ముక్కలు తెల్సుకోండి.
Leave a Reply