“ఇదిప్పుడు మనదేశమే” కథ, ఆంగ్లానువాదం

అట్లూరి పిచ్చేశ్వరరావు గారు ఎప్పుడో అరవై ఏళ్ళ నాడు రాసిన “ఇదిప్పుడు మన దేశమే” కథని నేను ఆంగ్లం లోకి అనువదించాను. అది అవుట్లుక్ పత్రిక వీకెండర్ విభాగంలో గత నెలలో వచ్చింది. అప్పుడు ఈ పోస్టు మొదలుపెట్టి మళ్ళీ తీరిక చిక్కక ఆపేశాను. ఒక రెండు మూడు రోజుల క్రితం ఫేస్బుక్లో ఏదో సాహితీ చర్చ చదువుతూ ఉండగా అనువాదకులు కథల ఎంపిక సరిగా చేయాలి, ఏ విధమైన ప్రత్యేకత లేని కథలు అనువాదం చేయక్కర్లేదు అన్న తరహా వ్యాఖ్య ఒకటి చదివాను. దానితో “ప్రత్యేకత” ఎవరికి కనబడాలి? అనుకున్నాను. ఈ కథ గుర్తు వచ్చింది. నాకు ఇది ప్రత్యేకమైన కథే. ఇది తెలుగు పాఠకులని దాటి కూడా చదవదగ్గ కథే. అనువాదకుల ఎంపిక ని వివరించే అవకాశం/అవసరం అన్నిసార్లూ ఉండదు/కుదరదు కానీ, నా రికార్డుకోసం నా బ్లాగులో అన్నా రాసుకోవాలని ఆపేసిన పోస్టుని మళ్ళీ రాస్తున్నా.

(మూలకథని “అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు” పుస్తకంలోనూ, నా అనువాదాన్ని అవుట్లుక్ వెబ్సైటులోనూ చదవొచ్చు. ఆర్కైవ్.ఆర్గ్ లో ఒక పాత “అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు” ఎడిషన్ ఉంది. ఈ కథ అందులో కూడా 176 పేజి వద్ద చదవొచ్చు.)

నన్నేం ఆకర్షించింది ఆ కథలో? ముఖ్యంగా రెండు అంశాలు.

  • ఆ కథావస్తువు దేశం, భాష వీటికి అతీతంగా ప్రతి చోటా ఉండే చర్చే అనిపించింది. 
  • నాకు సెంటిమెంటు పిండేవి, విషాదాంతాలు, ఇలాంటివి అంతగా నచ్చడం లేదు ఈ మధ్య. ఈ కథలో పాత్రని తీసుకుంటే ఒక టిపికల్ కథ లో అయన బహుశా పెన్షన్ కోసం ఎక్కే గడపా దిగే గడపా తిరుగుతుంటాడు…  ఎక్కడ చూసినా అవినీతి … ఎక్స్ సర్వీస్ మెన్ ని ఎవరూ గౌరవించరు … ఇలాంటివి ఉంటాయి. దానికి భిన్నంగా ఇందులో కథానాయకుడు స్పెషల్ గా అనిపించాడు నాకు.  నాకు ఆ పాత్ర, ఆ వాగ్ధాటి, ఆ వ్యంగ్యం నచ్చాయి.

ఇవి కాక మరొకటి: ఇలా నేవీ నేపథ్యంలో నేను ఇతర కథలు చదవలేదు తెలుగు/ఇంగ్లీషులలో (ఈ రచయితవే మరికొన్ని కథలు ఉన్నాయి ఈ పుస్తకంలో)

అప్చకోర్సు, ఇది నవల కాదు. చిన్న కథ. అందులోనూ మరీ చిన్న కథ. ఇట్లా ఆ ఉద్యోగం వద్దని పోయాక అతనికేమైంది? బానే బతికాడా? లేకపోతే ఇలా “పొగరు”తో వచ్చిన అవకాశాలు వదులుకుని దీనంగా బతికాడా? ఇలాంటి ప్రశ్నలకి మనకి సమాధానం ఉండదు. 

ఇక పోతే, కథలో నాకు అర్థం కానీ అంశం కూడా ఒకటి ఉంది – అదేం ఆఫీసు? పెన్షన్ ఇవ్వడం, ఇతర ఉద్యోగాల్లో చేరడం – రెండూ వాళ్ళే చూస్తారా? ఉద్యోగం ఒప్పుకుంటే పెన్షన్ వదిలేసుకోవాలా? వాళ్ళ ద్వారా కాక మన మానాన మనం ఏదో వెదుకున్నాము అనుకో, అప్పుడేమవుతుంది? – ఇలాంటివన్నీ ప్రశ్నలు మెదిలాయి. అనువాదానికి వీటికి సమాధానం తెలుసుకోవడం తప్పనిసరి అనిపించలేదు.  

ఈయనవి నేను చదివిన కథలన్నీ ఇటీవల వచ్చిన “అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు” అన్న పుస్తకం లోనివి. అంతకుముందు కూడా మా ఇంట్లో ఒక అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు పుస్తకం ఉండేది చిన్నది. నేను పద్దెనిమిదేళ్ళప్పుడు చదివాను. కానీ ఏమి కథలు ఉన్నాయో గుర్తులేదు.  ఇపుడు చదివిన కలెక్షన్ లో అయితే బహుశా ఒక ఏడెనిమిది కథలకి నేను ఇవి ఇప్పటికీ మంచి కథలే, పత్రికల్లో పాత కథల శీర్షికలతో వేస్తె ఎక్కువ మంది చదువుతారు అనుకున్నా. వాటిలో నాలుగైదు కథలకి ఈ కథలు ఆంగ్లానువాదంలో వస్తే బాగుంటుంది అనుకున్నా. ఇవే కథలు మళ్ళీ మా అమ్మకి నచ్చలేదు. లోకో భిన్న రుచి అనుకుని ఊరుకోవాలి అంతే.  ఏదో, మొత్తానికి, ఈ కథ అట్లా నన్ను ఆకట్టుకుని అనువాదం వైపుకి మళ్లించింది. ఇంకా రెండు మూడు కథలపై ఆసక్తి ఉంది. తీరిక, ఓపిక ఉన్నపుడు ప్రయత్నించాలి.

నాకు అనుమతి ఇచ్చినందుకు రచయిత కుమారుడు అనిల్ అట్లూరి గారికి, ముందర డ్రాఫ్ట్ ని రివ్యూ చేసిన నా కొలీగ్ గాబ్రియల్ బెర్నియర్-కొల్బర్న్ కి, గీతా రామస్వామి గారికి, అనిల్ గారి ద్వారా ఇది చూసిన కన్నెగంటి రామారావు, గొర్తి సాయి బ్రహ్మానందం గార్లకి (ఇంకెవరన్నా ఉంటే వాళ్లకి కూడా), ఔట్లుక్ పత్రిక వారికీ ధన్యవాదాలు.

Published in: on October 9, 2022 at 1:35 am  Comments (4)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2022/10/09/idippudu-mana-desame-translation/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. నీ కొన్ని సందేహాలకి నాకు తెలిసిన కొంత సమాచారం;
    * అదేం ఆఫీసు? పెన్షన్ ఇవ్వడం, ఇతర ఉద్యోగాల్లో చేరడం – రెండూ వాళ్ళే చూస్తారా?
    జ:నాలుగైదు దశాబ్దాల క్రితం వరకు ఈ Ex-Servicemen Board అని ప్రతి పెద్ద పట్టణంలో వుండేది. సర్వీస్ లోనుండి వెలికి వచ్చిన తరువాత వారు ఈ బోర్డ్ లో నమోదు చేసుకుంటే, వారికి లేదా వితంతువుకానీ వారి ఉద్యోగ అర్హతలను బట్టి కొన్ని వసతులు వుండేవి. పచారి సామానుల దగ్గిర నుండి, వారి పిల్ల ఉద్యోగాలవరకూ, వీరికి ఉద్యోగాల లో ప్రాధాన్యతలు కూడా వుండేవి. కార్లు, స్కూటర్లు, టీవీలు వగైరా వాటిల్లో తగ్గింపు ధరల వారకంటూ ప్రత్యేకంగా నడిపే Central Stores Deparment (CSD) కాంటీన్లలో వీరికీ లిక్కర్ కూడా దొరికేది. కొన్నింటిలో రేషనింగ్ వుండేది. ఉదా హారణకు రమ్ పానీయం నెలకు ఇన్ని యూనిట్లని. అలాగే ప్రభుత్వాలు కట్టే హౌజింగ్ ఫ్లాట్స్ అలాట్మెంట్ లో కూడా వీరికి ప్రాధాన్యతలు వుండేవి.

    * ఉద్యోగం ఒప్పుకుంటే పెన్షన్ వదిలేసుకోవాలా?
    జ:అంతేగా మరి. అవ్వ కావాలి బువ్వా కావాలి అంటే ఎలా మరి?

    * వాళ్ళ ద్వారా కాక మన మానాన మనం ఏదో వెదుకున్నాము అనుకో, అప్పుడేమవుతుంది?
    జ: నైతికత. వాళ్ళకి చెప్పాలి. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. నాకు మీ ద్వారా వచ్చిన ఉద్యోగావకాశం అక్కర్లేదు అని.

    1950 లలో కూడా ఈ కాంటీన్లు అవి వుండేవి. ప్రస్తుతం ఇదంతా ఆన్లైన్ లోనే జరుగుతున్నట్టుంది.

    • సీఎస్డీ కాంటీన్లు ఉన్నాయనుకుంటా ఇప్పుడు కూడా. నాకు తెల్సిన ఎక్స్ సర్వీస్ మెన్ ఇప్పుడు కూడా వాటికెళ్ళి తక్కువ ధరకి కొనడం చెబుతూంటారు (ఇప్పటికీ అంటే 2020 దాకా.. 2022కి ఏమైందో, ఏం చేస్తున్నారో తెలియదు).

  2. అనువాదాలు దొరికినై (అందులోనూ తేరగా వస్తే) చదవడం అలవాటు. నచ్చినవాటికి సంతోషపడ్డం, వీలున్నచోట మెచ్చుకోలూ, అంతే. ఇవన్నీ ఇతర భాషల నుండి తెలుగులోకి వచ్చిన వాటి గురించే. తెలుగులోకి వచ్చిన ఏ మంచి అనువాదం చూసినప్పుడైనా సంబరం. ఆయా భాషలు తెలియక పోయినా, ఇతర పెద్ద ప్రపంచంతో బాటూ, నేను కూడా ఆస్వాదించేశాను కదా అని.
    ఇతర భాషలు రానప్పుడు, మన దగ్గర నుండి ఇతర భాషల్లోకి వెళ్ళేవాటితో నాకేం పని? అని ఊరుకుంటే, ఈ కామెంటు రాయక్కర్లేదు. కానీ నాకు చాలా ప్రయోజనాలు కలిగాయి. చెబుతాను. ముందుగా సౌమ్యగారి, అభిరుచీ అందుకుగానూ ఈ అనువాదం చోటు చేసుకొని, ఈ కథకు విస్తృతి పెంచినందుకు వారికీ, అనుమతించిన అనిల్‌ అట్లూరి గారికీ కృతజ్ఞతలు. ఇక, ఇప్పటికిప్పుడు నాకు కలిగిన కొన్ని ప్రయోజనాలు.
    1. మంచి కధ, అదీ ఊరకే వచ్చిందాన్ని చదవగలగడం.
    2. కధా వస్తువు విశ్వవ్యాప్తమైనదే ఖచ్చితంగా. దాన్ని విస్తృతపరిచే ప్రయత్నాన్ని గమనించి ఆంగ్లానువాదం కూడా చదివే ఆసక్తి కలగడం. తద్వారా నా ఆంగ్ల భాష మెరుగుపరచుకునే అవకాశం.
    3. అనువాదానికి ఇది తగినదా కాదా అనే ప్రసక్తి సౌమ్య గారే ఎత్తినందువల్ల, చదివి వదిలేయకుండా, నిశితంగా పరిశీలించడం. బండ చాకిరి చేయించుకోడానికీ, మనకు కాపలా కాయించుకోడానికీ మాత్రమే కిసాన్నీ, జవాన్నీ నినాదాలతో హోరెత్తేలా పొగడ్డం, మళ్ళీ మళ్ళీ వారిని చాకిరీకి పునరంకితం కావించడం తేటతెల్లం, కధ నేపథ్యంలో.
    4. అనిల్‌ అట్లూరి గారు కొద్దిగా ముఖ పరిచయం, కధల విషయంగానే. కానీ వారు అట్లూరి పిచ్చేశ్వరరావు గారి కుమారుడు, అని తెలియడం దీనివల్లా. ఇప్పుడిక వారి, వీరి కధలూ, రచనలూ తోడొచ్చు.
    ఇంకా చాలా ఉన్నాయి ప్రయోజనాలు. ఇప్పటికివి చాలు.
    ప్రపంచవ్యాప్తమయిన ఓ దురవస్థ లోని, అవ్యవస్థను రెండు పేజీల్లో కళ్ళకు కట్టించి, ఒంటికాలితో లేచెళ్ళిపోడం.. నిరసనగా.
    ఇంతకంటే ఏంకావాలి ఓ కథకు, అనువాదం ద్వారా వ్యాపితం కావడానికి?

    • Raja garu, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. ఇన్నాళ్ళబట్టి నేను బ్లాగులో రాస్తున్నవి చదివి ప్రోత్సహిస్తున్న మీ అభిమానానికి కృతజ్ఞతలు.


Leave a comment