మహిళావరణం-6

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********

51) అబ్బూరి కమలాదేవి (1925 – ): నాటక రంగంలో పురుష పాత్రలు ధరించడానికి పేరు పడ్డ స్త్రీ ఈవిడ! నాటక రంగంలో వివిధ నాటక సమాజాల్లో దీర్ఘ కాలంపాటు నటించారు. ఎంతో పేరు తెచ్చుకున్నారు. 1952లో “కమలా నాట్యమండలి” స్థాపించి, అనేక సంవస్తరాల పాటు నాటక ప్రదర్శనలిచ్చారు. ఎన్నో అవార్డులు అందుకున్న కమలాదేవి ఏ ఆధారంలేని బాలబాలికలని చేరదీసి, వారికి నటనలో శిక్షణ ఇచ్చి వారి చేత ప్రదర్శనలు కూడా ఇప్పించేవారట.

52) వనజా అయ్యంగార్ (1926-1999): గణిత శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన వనజ కు సంగీత సాహిత్యాలు అభిమాన విషయాలు. కోఠీ మహిళా కళాశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం వీ.సీ గా అక్కడి అకడమిక్ ప్రోగ్రాంకు వీరే రూపకల్పన చేశారు. మహిళలకోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టారు. ఆంధ్ర మహిళా సభలోనూ దీర్ఘ కాలం పని చేశారు. కమ్యూనిస్టు మేధావి మోహిత్ సేన్ ఈవిడ భర్త.

53) అంజలి దేవి (1927-): నటిగా, “అంజలీ పిక్చర్స్” ద్వారా చిత్రాలు నిర్మించిన నిర్మాతగా సుప్రసిద్ధులు.

54) సరోజిని రేగాని (1927-): ఆంధ్రప్రదేశ్ లోని మహిళా చరిత్రకారులలో మొదట పేర్కొనదగినవారు. స్టేట్ ఆర్కైవ్స్ డైరెక్టర్గా ఆ సంస్థ అభివృద్ధికి కృషి చేశారు. అలాగే, ఎన్నో ఇతర ప్రభుత్వ సంస్థల్లో చరిత్ర పరిశోధనల్లో భాగస్థులుగా ఉన్నారు. విదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చారు. ఎన్నో చరిత్ర పుస్తకాలు వ్రాసారు, మరెన్నింటికో సంపాదకత్వం వహించారు. “ఉస్మానియా జర్నల్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్” కు వ్యవస్థాపక సంపాదకురాలు.

55) యెరువ ఇగ్నేషియస్ (1928-):గుంటూరు జీసస్ మేరీ జోసెఫ్ సొసైటీలో ఉపాధ్యాయిని గా మొదలుకుని వివిధ స్థాయుల్లో ఆ సంస్థకు చెందిన్ అనేక సంస్థల్లో పని చేశారు. విద్యావ్యాప్తికి, పీడిత వర్గాల అభివృద్ధికి కృషి చేశారు. బైబిల్ తెలుగు అనువాదం చేసే పనిలో కూడా పాలుపంచుకున్నారు.

56) టి.ఎస్. సదాలక్ష్మి (1928-2004) : బలహీన వర్గాల అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేసిన రాజకీయ నాయకురాలు తక్కెళ్ళ సదాలక్ష్మి. ఆవిడ గురించి వివరంగా గోగు శ్యామల “నేనే బలాన్ని” పేరిట ఒక జీవిత చరిత్ర రాశారు. దాని గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం చదివితే, సదాలక్ష్మి గారి స్పుర్తివంతమైన జీవితం గురించి తెలుస్తుంది.

57) స్నేహలత భూపాల్ (1928 – ): దక్షిణాసియాలో పశువుల పెంపకం చేపట్టిన మహిళలలో మొదటి వ్యక్తి ఈవిడేనట (బహుశా ఇక్కడ రచయిత్రుల ఉద్దేశ్యం పశువుల పెంపకాన్ని ఒక పరిశ్రమ స్థాయిలో చేపట్టిన…అనేమో!). ఫ్యూడల్ సంస్కృతి నుండి వచ్చిన స్నేహలత కొన్నాళ్ళ తరువాత ఆ సంస్కృతినీ; స్త్రీ అణిచివేతనూ ధిక్కరించి బయటపడి, అప్పట్నుంచీ తన దోవలో తాను ముందుకు సాగారు. రాష్ట్రంలోని మొదటి షటిల్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శిగా, భారతీయ సైన్యానికి వైజ్ఞానిక కార్యక్రమాల నిర్వహకురాలిగా, బాలల సంక్షేమ సంస్థ, జంతువుల సంక్షేమ సంఘాలకి ఉపాధ్యక్షురాలిగా – ఇలా ఎన్నో పదవుల్లో ఎన్నో పనులు చేశారు. ఇవి కాక, వ్యవసాయ రంగంలో డైరీ నిర్వహణ, ద్రాక్ష తోటల నిర్వహణ ఇలాగ పాడిపరిశ్రమలో విశేష కృషి చేశారు.

58) రావు బాలసరస్వతీదేవి (1929 – ): ప్రముఖ గాయని. జమిందారీ కుటుంబంలోకి కోడలిగా వెళ్ళాక క్రమంగా సినిమాల్లో పాటలు పాడటం మానేశారు. ఆవిడ గురించి ఈమాటలో కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు రాసిన వ్యాసం ఇదిగో.

59) కె. అమరేశ్వరి (1929-): ఆంధ్రప్రదేశ్ లోని మహిళా న్యాయమూర్తులలో మొదటి వ్యక్తి. ఆం.ప్ర. హైకోర్టు బార్ అసోసియేషన్ కు ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.

60) మాలతి చందూర్ (1930-): తెలుగు పత్రికలు చదివే వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రభలో ఐదు దశాబ్దాల పాటు “ప్రమదావనం” శీర్షిక నిర్వహించారు. అనేక పుస్తకాలు రాశారు. “పాత కెరటాలు” పేరిట స్వాతి పత్రికలో అనేక పుస్తకాలను పరిచయం చేశారు. కథలు, నవలలు కూడా రాశారు. సాహిత్య అకాడెమీ అవార్డులు కూడా పొందారు.

….. తక్కిన వారి గురించి తరువాతి టపాలలో!

Published in: on July 6, 2012 at 6:00 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/07/06/mahilavaranam-6/trackback/

RSS feed for comments on this post.

Leave a comment