ఝుమ్మంది నాదం-2, వెనక్కొచ్చిన వాచీ, ఓ వింత సీరియల్

అమ్మో అమ్మో…వారమౌతోంది నేను బ్లాగి! మరీ ఇలాగైపొయినాదేటి జీవితం? 🙂

శనివారం రాత్రి జానకి గారితో ఝుమ్మంది నాదం రెండో భాగం వచ్చింది. ఇది కూడా చాలా బాగా ఉండింది. జానకి గారి ఉత్సాహం, గలగలమంటూ నిండుగా ఆవిడ నవ్వే ఆ నవ్వు, వింటూ ఉంటే మాయ చేసి ఆవిడ పాటల లోకం తప్ప మరోలోకం లేదని నమ్మింపజేసే ఆ గాత్రం… ఇవన్నీ ఉండగా ఆ ప్రోగ్రాం బాగుండక ఎలా ఉంటుంది చెప్పండి? అయితే, మరీ ఆవిడ భర్త ని ఆవిడ ఎంతగా మిస్సవుతున్నారో… అవన్నీ చెప్పించడం కాస్త అనవసరమేమో అనిపించింది. ఓ పక్క ఆ తెర పై ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటే చూస్తున్న నా కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగాయి. అవన్నీ ఇప్పుడు గుర్తు చేయడం అవసరమా? అనిపించింది. సర్లెండీ… ఇంటర్వ్యూలు అంటే ఇక పర్సనల్, ప్రైవేట్ విషయాలు, సున్నితమైనవి… గట్రా అంతా మర్చిపోతారేమో!

ఇందులో జానకి గారు – “దండాలు సామీ” అని ఒక పాట పాడారు…. “అనితరసాధ్యము నా గాత్రము” అన్నట్లు పాడారు. నాలుగు తరాల గొంతుకల్లో పాడారు. ఓ చిన్న పిల్ల, ఒకా యువతి, కాస్త మధ్య వయసు గొంతు, ఓ ముదుసలి గొంతు…ఎక్కడా అది ఒకే మనిషి పాడింది అనిపించనీకుండా పాడారు…. పాట అవగానే అక్కడ సునీత “దండాలమ్మా మీకు” అన్నది. తెరపై చూసిన నాలాంటి వాళ్ళు ఎండరో మనసులోనే “దండాలు” చెప్పుకున్నారు. అన్నీ స్వీకరించి జానకమ్మ మాత్రం ఎప్పటిలాగే కల్మషం లేని తన నవ్వు….. చిన్న పిల్లల నవ్వంత స్వచ్చమైన నవ్వు… నవ్వారు. ఈ ప్రోగ్రాం ఎపిసోడ్ల వీడియో ఎక్కడన్నా దొరికితే, ఆ దండాలు సామీ పాట ఆడియో ఎక్కడన్నా ఉన్నట్లు తెలిస్తే, కాస్త ఇక్కడ ఓ కామెంటు రాయగలరు.

వారం రోజుల విరహం తరువాత నాకు నా వాచీ కి సెల్లేయించుకునే అదౄష్టం కలిగింది. దాన్ని చేతికి తొడుక్కోగానే, ఎంత వద్దనుకున్నా నా మొహం వెలిగింది.. నా నడక లో కాస్త ఉత్సాహం తొంగిచూసింది. 🙂

రాత్రి నేను ఓ జెమినీ సీరియల్ ఓ పది నిముషాలు చూసా. పదినిముషాల్లోనే దాని గురించి బ్లాగేంత శ్టఫ్ ఉంది అక్కడ. మొదటగా – ఆ సీరియల్ లో ఓ ఇల్లు చూపిస్తారు. విషయమేంటంటే…ఎప్పుడూ కిటికీలు, తలుపులు అన్నీ వేసే ఉంటాయి. ఎందుకు అంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలకు సూర్యరశ్మి పడదట! ఒక్క సూర్య కిరణం తాకినా ప్రమాదమేనట. అలాంటి రోగం నిజంగా ఉందో లేదో మరి నాకు తెలీదు కానీ, ఎంత సీరియల్లోనైనా, చూట్టం కాస్త వింతగానే ఉంది… మరో వింత ఏమిటి అంటే…. వాళ్ళింటికి ముగ్గురు పనివాళ్ళు వస్తారు… వాళ్ళ పేర్లు – రేణుమతి, ఉలూపి, హస్తి. ఈ పేర్లేంటి వింతగా ఉన్నాయి అనుకుంటూ ఉంటే చెప్పారు..అవి భారతం లో పేర్లట. రేణుమతి ఏమో నకులుడి భార్య అట. ఉలూపి ఏమో అర్జునుడి మూడో భార్యట. హస్తి అన్నవాడు..ఏదో చెప్పారు…. పెద్ద రిలేషన్….గుర్తు రాడం లేదు. 😦 వార్నాయనో! సీరియళ్ళలో ఈ పేర్లేమిటో…. అంత రిసర్చి చేసి నకులుడి భార్యా, అర్జునుడి మూడో భార్యా అనుకుంటూ ఆ పేర్లని వెదికి పెట్టడం ఏమిటో…అనుకున్నా.

సీరియళ్ళ వాళ్ళు కూడా నావెల్టీ కోసం ప్రయత్నిస్తున్నారన్నమాట! ఈ లెక్కన త్వరలో ధర్మరాజు పెదనాన్న పినతండ్రి మనవడి మేనల్లుడి తోడల్లుడి పేరు అంటూ వచ్చే ఎపిసోడ్ లో మరో కేరెక్టరొచ్చినా ఆశ్చర్యం లేదు. ఐనా, నేను చూస్తే, ఆ షాక్ తట్టుకోలేనేమో…సో, నేను చూడను. పది నిముషాలకే వింతగా అనిపించింది నాకది.

Published in: on October 1, 2007 at 5:55 am  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/10/01/jhummandi2/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

  1. జానకి గారి ఆ కార్యక్రమం నేనూ చూసాను. నాక్కూడా నచ్చింది. ఆమె భర్త గురించి అడిగి ఆమె కంట నీరు పెట్టించడం పరవాలేదనే నాకు అనిపించింది. (ఇంటర్వ్యూ ఇచ్చేవారి ఉద్వేగాన్ని చూపెట్టడం ఇంటర్వ్యూలో భాగంగా భావించాను లెండి.) మీరు గమనించే ఉంటారు.. ఇంటర్వూలోని ఆ భాగాన్ని కత్తిరించి, ముందు దాన్ని వెనకా, వెనక దాన్ని (పాట) ముందూ కలిపారు. ఆ పాట మొదలుకాగానే నేను మా పిల్లలతో “చూసారా ఈ భాగంలో ఆమె ఉద్వేగాన్ని కత్తిరించేసారు, అలా చెయ్యకుండా ఉండాల్సింది” అని అన్నాను. కాసేపటికి, ఆపాట అవగానే ఆమె ఉద్వేగాన్ని చూపెట్టారు. 🙂

  2. Sowmya,
    about that serial. I saw an English movie. It has a family of mom and 2 kids. I think 2 servants. The kids are too sensitive to sunlight. It is an interesting story. Unfortunately, I don’t remember the name of the movie.

  3. @lalitha garu :
    Yeah… even in this serial, it has Mom and 2 kids, kids sensitive to sunlight.. so… its lifted from there! I already wondered about the innovation our serial makers showed in making that serial..and now comes the revelation!!! Thanks.

  4. ఆ ఇ౦గ్లీషు సినెమా పేరు “the others”. నికోల్ కిడ్మాన్ ది తల్లిగా ప్రధాన పాత్ర, మిగతా విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు: http://www.imdb.com/title/tt0230600/

    మన సీరియళ్ళ వాళ్ళు ఎ౦త కోపీ కొట్టినా కనీస౦ ఆ పేర్ల ఎ౦పిక లోనైనా క్రియేటివిటీ చూపి౦చారు. అ౦దుకనైనా వారిని మెచ్చుకోవచ్చునని నా అభిప్రాయము.

    ఇకపోతే నేను చెప్పదల్చుకున్నది ఏమిట౦టే మీ యీ తెలుగు బ్లాగటము నాకు చాలా నచ్చి౦ద౦డి. ఈ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ కాల౦ లో కూడా మన తెలుగు భాషకు ఇ౦త విలువు ఇచ్చేవారు ఇ౦త మ౦ది (కామె౦ట్స్ రాస్తున్నవారు కూడా తెలుగు లో వ్రాయటము మరి౦త ఆశ్చర్యము గా ఉన్నది) ఉన్నారని తెలిసి అదొక రకముగా గు౦డె ని౦డి౦ది. మీ ను౦చి ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కూడా తెలుగు లో వ్రాయుటకు ప్రయత్నిస్తా. కాకపోతే నాకు పెద్దగా అ౦త తెలుగు రాకపోవటము సిగ్గుచేటు 😦 . మరి సెలవు.

  5. సౌమ్యా, నాక్కూడా జానకి గారి ఝుమ్మంది నాదం చాలా చాలా నచ్చింది.. ఇప్పటికీ ఆ కంథంలో ఏమాత్రం కూడా మాధుర్యం తగ్గలేదు!! husband ని ఎంతలా మిస్ అవుతున్నారో చెప్తూ ‘అది వెన్నెల.. ఇది చీకటి..” అన్నారు.. మనసు పట్టేసినట్లైంది!! అంతే కాకుండా తను 45 years నించీ (since she was 24) ఆయాసంతో బాధపడుతున్న సంగతి చెప్పినప్పుడు, అంతటి మధురమైన పాటల వెనక ఇంతటి కష్టం దాగుందా అనిపించింది!!

  6. సౌమ్య గారూ.. అన్నింటి కన్నా మీ ప్రజంటేషన్ స్టైల్ నన్ను ఎంతో ఆకట్టుకుంది. భావాలను అంత అలవోకగా మామూలు మాటల్లా పలికించడం చాలా బాగుంది.

    – నల్లమోతు శ్రీధర్


Leave a comment