కిల్ బిల్ సినిమాలు

కొన్నేళ్ళ క్రితం కిల్బిల్ కథని సినిమా చూసి వచ్చి మురిసిపోయి ఎవరో చెప్పగా విన్నాను. దెబ్బకి ఇంత హింస మనకి పడదులే అనుకుని సినిమా చూడకూడదని నిర్ణయించుకున్నాను. ఇదే కారణంతో నేను చాలా సినిమాలు చూడలేదు కనుక అదేం పెద్ద విషయం అనిపించలేదు. “కిల్బిల్ చూడలేదా?” అనబోయే వాళ్ళకి నేనూ “ఫలానా సినిమా చూడలేదా?” అనే తరహా ప్రశ్నలు నేనూ వేసి నవ్వగలను – ఎవళ్ళు చూసే సినిమాలు వాళ్ళగ్గొప్ప గానీ, ఇప్పుడు సంగతి అది కాదు. కిల్బిల్ రెండు సినిమాలూ నాకు నచ్చాయి. మొదటిది వేగంగా సాగి, గోళ్ళు కొరుక్కునేంత ఉత్కంఠ కలిగిస్తే, రెండోది కొంచెం నెమ్మదిగా, విభిన్నంగా సాగి, గోళ్ళు కొరుక్కునేంత ఉత్కంఠ కలిగించింది. ఏదో ఎందుకు నచ్చాయో రాసుకుందామనిపించింది. అందువల్ల, ఆర్నెల్ల తరువాత బ్లాగు వైపుకు వచ్చాను. రివ్యూ ఇలా ఉండాలి, సినిమా ఇలాగే చూడాలి అనేవాళ్ళకి: ఈ కింద రాసిందంతా అలా చదవకూడదు. ఊరికే కాలక్షేపానికి చదవాలి. చదవలేకపోతే బలవంతంలేదు. పరీక్షలేం రాయట్లేదు కదా!

రివెంజ్ డ్రామా. స్టైలైజ్డ్ వయొలెన్స్. అందరికి మల్లే నాక్కూడా అదే అనిపించింది మొదట. అయితే, నాకు సినిమా(లు) నచ్చినవి అందుక్కాదు. ఆ విషయంలో మన తెలుగు హీరోల సినిమాలకి, దీనికి నాకాట్టే తేడా కనబడలేదు, కనుక ప్రత్యేకం ఈ సినిమాలు చూడక్కర్లా. అభిమానులు నన్ను క్షమించాలి – నాకు మీకున్నంత అభిరుచి లేదు హింస, దిక్కుమాలిన ఫైట్లు అవీ చూడ్డానికి. మొన్నా ఫుల్ హైదరాబాద్ వెబ్సైటులో ఏదో సినిమాకి రివ్యూ చదువుతూండగా (సరైనోడు సినిమాకి అనుకుంటా) ఏదో రాశారు – విలనో ఎవరో ఒకమ్మాయిని చంపేసి అయినా కూడా ఆవిడ్ని అనుభవించాలి అనుకుంటాడు, దానితో జుగుప్స కలిగింది అని. ఈ కిల్బిల్ మొదటిభాగంలో నాలుగేళ్ళ బట్టి కోమాలో ఉన్న హీరోయిన్ ని మేల్ నర్సు తను రేప్ చేయడం కాకుండా, ఆవిడ్ని గంటకింత అని అద్దెకి ఇస్తూ ఉంటాడు ఇతర మగవారికి! దాన్ని గురించి ఎవ్వరూ ఎక్కడా వాపోయినట్లు నాక్కనబడలేదు. ఇది బోయపాటి వంటి తెలుగు దర్శకుల పట్ల వివక్షే. నాకైతే ఆ సీనుకీ, ఈ తెలుగు సినిమా సీనుకీ ఆట్టే తేడా కూడా కనబడలేదు. అలాగే, ఎన్ని దెబ్బలు, బుల్లెట్లు తిన్నా పైకి లేచే సూపర్ హీరోయిన్…హీరో బదులు. నాకు అంత అభిరుచి లేదు కనుక – ఇదంతా తెలుగులో బాలకృష్ణ సీమ సినిమాల్లో కనబడే సూపర్ సీన్ల లాగానే అనిపించింది. మరైతే ఇది మన సినిమాల్లాగానే ఉంటే దీనికెందుకు కల్ట్ ఫాలోయింగ్? ఏమో నాకు తెలీదు.

సినిమాలలో నన్ను బాగా ఆకట్టుకున్న అంశాలు మట్టుకు చాలా ఉన్నాయి.
అ) ఉమా తుర్మన్. ఆ పాత్ర చేసే స్టంట్లకి ఆమె శరీరభాషా, ఆహార్యం బాగా నప్పాయి. ఆ ఫైట్ సీన్లలో ఆవిడ ప్రదర్శన నోరెళ్ళబట్టి చూసేలా చేసింది. కళ్ళలో కొన్ని దృశ్యాల్లో కనబడే మృదుత్వం, చాలా దృశ్యాల్లో కనబడే తీవ్రత, కాఠిన్యం – అలా మనసులో ఉండిపోయాయి. నిజానికి రెండో పార్టు వెంటనే చూడ్డానికి కారణం ఈవిడే. రెండో పార్టులో ఆమె పాత్ర తాలుకా భావోద్రేకాల్లో వైవిధ్యం ఉంది. నవ్వూ, ఏడుపూ కూడా తరుచుగా కనబడ్డాయి పగతో రగిలిపోవడం కాకుండా. రెండు భాగాల్లోనూ ఆ పాత్రను మలిచిన విధానం చాలా స్పూర్తిని కలిగించేలా ఉంది. స్ఫూర్తంటే ఇక్కడ నేను ఏడు జన్మల వైరాలని తవ్వితీసి hattori hanzo కత్తితో ఆడ పరశురాముడిలా కొన్ని తరాలు నరుక్కొస్తా అని కాదు. ఆమె ప్రతీకారం కోసం పరిస్థితులకి ఎదురొడ్డి ముందుకు సాగడం, భయంకర పరిస్థితుల్లో కూడా ముందుకు సాగడానికి ఏం చేయాలి? అని ఆలోచించి ఆ దిశగా వెళ్ళడం – ఇలాంటివి స్ఫూర్తి కలిగించిన అంశాలు. ఈవిడ కోసం “పల్ప్ ఫిక్షన్” కూడా చూడాలి అనుకుంటున్నాను ప్రస్తుతానికి. నన్ను ఆవిడ ఎంత ఆకట్టుకుందో చెప్పేందుకు మాటలు చాలవు నాకు. ఇలా ఇంకాసేపు రాసుకుంటూ పోవచ్చు కానీ ఈ అంశం ఇక్కడికి ఆపుతాను.

ఆ) నేపథ్య సంగీతం: రెండు సినిమాల్లోనూ అద్భుతంగా ఉంది. ఉమా తుర్మన్ తర్వాత ఈ సినిమాలు నచ్చడానికి రెండో ప్రధాన కారణం నేపథ్య సంగీతం. నన్ను నేను amusical అనుకుంటాను. ముఖ్యంగా Oliver Sacks రాసిన musicophilia చదివాక, సంగీతం జోలికి వెళ్ళకుండా నామానాన నేను ఉండడమే నయమేమో అని కూడా అనుకుంటూ వచ్చా కానీ, ఈ సినిమాల సంగీతం.. రెండ్రోజులుగా తలకాయలో మోటార్ బైకులో గేర్లు మార్చుకుంటూ స్పీడుగా తిరుగుతోంది. నా మట్టుకు నాకు అద్భుతమే.

ఇ) బలమైన స్త్రీ పాత్రలు. సినిమాలో “మంచి” అనబడు పాత్ర ఏదీ లేదు. కనీసం “పాపం మంచి మనిషి” అని అనిపించే పాత్ర కూడా ఒక్కటీ లేదు, హీరోయిన్ ని గురించి మనకి సాఫ్ట్ కార్నర్ ఏర్పడకపోతే. కానీ, స్త్రీ పాత్రలు ఎక్కువగా ఉండి, అంత శక్తివంతంగా ఉండే సినిమాలు మరీ అంత తరుచుగా రావు. ఒక్కో ప్రధాన స్త్రీ పాత్రా చాలా గొప్పగా మలిచారు. వాళ్ళ మధ్య స్టంట్ సీన్లు కూడా గొప్పగా ఉన్నాయి. ఆమధ్యన హేట్ఫుల్ ఎయిట్ (ఇదే దర్శకుడిది) రిలీజ్ అయినప్పుడు క్లైమాక్స్ లో ఆ సినిమాలోని ఏకైక ప్రధాన స్త్రీ పాత్రని ఉరితీసే సన్నివేశం గురించి కొంతమంది గగ్గోలు పెట్టారట misogynistic గా ఉంది అని. మరి అదే దర్శకుడు ఈ సినిమాల్లో ఇంత బలమైన స్త్రీ పాత్రలని సృష్టించాడని ఎవరూ అనలేదేమిటి? అనిపించింది. Equality పద్ధతిలో భాగంగా, అంత భయంకరమైన క్రిమినల్ పురుషుడు అయి ఉంటే సినిమాలో ఏం చేసి ఉండేవారో స్త్రీకి కూడా అదే చేశాడు అని ఫిక్స్ అయ్యా నేను మొత్తానికి, కిల్బిల్ చూశాక.

ఈ) పదునైన డైలాగులు. రెండు భాగాల్లోనూ.

ఉ) నటీనటుల ప్రదర్శన – అందరూ ఆ పాత్రలకి సరిగ్గా సరిపోయారు. తెలుగు సినిమాల పోలిక హింసకి మాత్రమే పరిమితం. ఇలాంటి విషయాల్లో అంతా పోల్చి దర్శకుడిని కించపరచడంలేదని గమనించగలరు. ఇక్కడంతా తెలుగు సినిమాలతో పోల్చడం నక్కకీ నాగలోకానికీ పోలిక తేవడమే. ఒప్పుకుంటాను.

ఇంకా కొంచెం రాయొచ్చు కానీ, ఇక్కడికి ఆపుతాను. మొత్తానికి దర్శకుడు గొప్పాయన. ఆ విషయం ఒప్పుకోవాలి. ఇన్ని చెప్పి ఆయన గురించి చెప్పలేదేం? అనుకుంటారేమో వ్యాసం చదివేవాళ్ళు. అతగాడు తెరవెనుక ఉండి ఇవన్నీ నడిపే మనిషి (నిర్మాతతో కలిసి) కనుక ఇవన్నీ చెబితే అతన్ని తల్చుకున్నట్లే. ఇకపోతే, మూడోభాగం కూడా వస్తే నేను చూడ్డం గ్యారంటీ.

Published in: on April 25, 2016 at 3:57 am  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2016/04/25/killbill/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

  1. హర్రే ! పల్ప్ ఫిక్షన్ ఇంకా చూడలేదా సౌమ్యా ! ప్చ్ 🙂

  2. //Equality పద్ధతిలో భాగంగా, అంత భయంకరమైన క్రిమినల్ పురుషుడు అయి ఉంటే సినిమాలో ఏం చేసి ఉండేవారో స్త్రీకి కూడా అదే చేశాడు అని ఫిక్స్ అయ్యా నేను మొత్తానికి, కిల్బిల్ చూశాక.//

    ఈ చిన్న పాయింట్ చాలా మంది మిస్సవుతూ ఉంతారు. కొంత మందికి తట్టినా దాన్ని వ్యక్తపరిచే ధైర్యం చేయలేరు. మరికొంత మంది దీన్ని చెప్పడానికి కూడా అనుమతివ్వరు. దీని మీద నేను బోలెడన్ని థియరీలు చెప్పగలను. మేల్ డిస్పోజబులిటీ అని మొదలు పెట్టి, ఇంటర్నల్ మిసాండ్రీ (Internal Misandry) లాంటివి. కానీ, వాటన్నంటినీ ఇక్కడ రాసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రాయడం లేదు :-D.

    కానీ, ఈ విషయాన్ని ఇంత బ్యాలన్సుడుగా రాసినందుకు నా అభినందనలు. అదొక్కటి చెప్పాలనిపించింది 😀

    • Sounds complicated! @Internal Misandry and the other one 🙂

  3. nice feedback.I saw both movies and you are right abut characters!And mood of the movie also is great.

  4. I was five and he was six
    We rode on horses made of sticks
    He wore black and I wore white
    He would always win the fight

    Bang bang, he shot me down
    Bang bang, I hit the ground
    Bang bang, that awful sound
    Bang bang, my baby shot me down

    Seasons came and changed the time
    When I grew up, I called him mine
    He would always laugh and say
    “Remember when we used to play?”

    Bang bang, I shot you down
    Bang bang, you hit the ground
    Bang bang, that awful sound
    Bang bang, I used to shoot you down

    Music played and people sang
    Just for me the church bells rang

    Now he’s gone, I don’t know why
    And till this day, sometimes I cry
    He didn’t even say goodbye
    He didn’t take the time to lie

    Bang bang, he shot me down
    Bang bang, I hit the ground
    Bang bang, that awful sound
    Bang bang, my baby shot me down

  5. మనస్సుకి నచ్చిన విషయాన్ని భయం లేకుండా, ఆహ్లాదకరంగా వ్రాయటం కళ. మీరు సినిమా సమీక్షలు చక్కగా వ్రాస్తున్నారు. ఈ వ్రతాన్ని ఆపవద్దు. మీకేన్నో అభినందనలు.

  6. bagundi, naaku nachhindi emiti ante, mixing of genres.
    hongkong closeups, kungufu fights ni, western cowboy lanti western genres ni kalipadam.


Leave a comment