తెనుగు భాష విశ్వరూపం

శ్రీపాద వారు అష్టావధానాలు చేసేందుకు వివిధ ప్రాంతాలు పర్యటించడానికి బయలుదేరాలి అనుకుంటున్న సందర్భంలో ఆయన వివిధ ప్రాంతాల తెలుగుల గురించి అన్న మాటలివి… నాకు చాలా నచ్చింది ఆయన దృక్పథం ఇక్కడ.

********
(తూ.గో. జిల్లాలో పుట్టి పెరిగిన వాడికి తుని, ఒంగోలు, నరసరావుపేట, కొండాపల్లీ ఇలా దాటుతూ ఉంటే కొత్త ప్రపంచంలా ఉంటుందని చెబుతూ..)
…..

అక్కడిదీ, అక్కడిదీ, అక్కడిదీ, అక్కడిదీ కూడా కండగల తెనుగే. గాని, కాదేమో అనిపిస్తుందెక్కడికక్కడే. అందుకు బెదరక, మళ్ళీ మళ్ళీ వెళ్ళాడా, తెనుగు భాష తన విశ్వరూపం కనబరుస్తుంది; ఆంధ్రత్వమున్నూ సమగ్రం అవుతుంది, వెళ్ళిన వాడికి.

ఒక్కొక్క సీమలో ఒక్కొక్క జీవకణం ఉంది తెనుగు రక్తంలో, అన్నీ వొకచోటికి చేర్చగల అన్నీ వొక్క తెనుగు వాడి రక్తంలో నిక్షేపించాగల మొనగాడు పుట్టుకురావాలి అంతే.
….
…….
నా స్వప్రాంతపు పలుకుబడిలో యెంత జీవశక్తి వుందో, అక్కడక్కడి పలుకుబళ్ళలోనూ అంతంత జీవశక్తీ వుంది, వారాల్లోనూ, మాసాల్లోనూ పట్టుబడేది కాదది.

ఒక్కొక్కచోట ప్రచలితం అయ్యే కాకువూ, వొక్కొక్క చోట ప్రయుక్తం అయే యాసా పుస్తకాలు చదివితే అందవు, వొకచోట కూచున్నా దొరకవు – పల్లెలూ పట్నాలూ తిరగాలి, అష్టాదశ వర్ణాల వారిలోనూ, పరభాషా వ్యామోహం లేనివారిని కలుసుకోవాలి, ఆ పలుకుబళ్ళు చెవులారా వినాలి, ఆ ప్రయోగ వైచిత్రి సవిమర్శంగా పట్టుకోవాలి, ఆ నాదం – చిక్కని ఆ మధుర గంభీరనాదం అవగాహన చేసుకోవాలి, అన్నింటికీ ప్రధానంగా “ఇది నా సొంతభాష మొదటిమాటు, నా తల్లి, నా జీవశక్తికి జత చేసిన – నాకు వాగ్ధార ఆవిర్భవింప చేసిన సంజీవని అన్న ఆత్మీయతా, మమతా ఉద్భుద్దాలు చేసుకోవాలి, ముందు.”
అప్పుడు గాని ఏ తెనుగువాడికి నిండు ప్రాణం వుందని చెప్పడానికి వీల్లేదు. దానికోసం నా పరితాపం యిప్పటికీ.

…….
…….
నా తెనుగు భాష యుగయుగాలుగా ప్రవాహిని అయివుండినది గాని, యివాళ, ఆ భాషలోనుంచి వొక మాటా, ఈ భాషలో నుంచి వొకమాటా ఎరువు తెచ్చుకుని భారతవిద్య ప్రదర్శిస్తున్నది కాదు.
నా తెనుగు భాష సరస్వతికే తేనెచినుకు లందించింది గాని నిరుచప్పనిది కాదు.
నా తెనుగుభాష ఎక్కడ పట్టినా చక్రవర్తుల రాజ్యాంగాలు నడిపింది గాని, పరాన్న భుక్కు కాదు.
నా తెనుగుభాష స్వతంత్రంగా బతగ్గలది గాని కృత్రిమ సాధనాలతో ప్రాణవాయువు కూర్చుకోవలసిందీ కాదు, అక్రమ దోహదాలతో పోషించబడవలసిందీ కాదు.

*********************

ఏమిటో, మొత్తం చదివాక మహా గొప్పగా అనిపించింది నాకు 🙂

Published in: on April 1, 2012 at 6:06 pm  Comments (5)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/04/01/tenuguviswaroopam-sripada/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. నాకు కూడా మహా మహా గొప్పగా, గర్వంగా అనిపించిందండి చదువుతుంటే..

  2. ఆయన సాక్షాత్కరింప చేసుకున్న విశ్వరూపాన్ని కొద్ది కొద్దిగా మాకూ రుచి చూపిస్తున్నావు కదా సౌమ్యా! అన్నట్టు పుస్తకం.నెట్ లో పూర్ణిమ నువ్వు డిజిటల్ లైబ్రరీలో ఈ పుస్తకం చూపించావని చెప్పింది. ఆ లింకు ఇవ్వగలవా?

  3. super. As you’ve commented somewhere, Sripada rocks! 🙂

  4. తెలుగు భాషది, శ్రీపాద వారిదీ కూడా విశ్వరూపం చూడగలం లింకు ఇస్తే—
    మాకు తెలుసు మీరివ్వగల ‘సౌమ్యు’లని. మంచి విషయాలను సరళంగా అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
    రాజా.

  5. అత్యద్భుతం. అనన్యసామాన్యం. శ్రీపాద శ్రీపాదే. తెలుగు తెలుగే.


Leave a comment