“ఆదివాసీలు నర్తించరు – కథ, అనువాదం, అనుభవం

“The Adivasi Will Not Dance” అన్న Hansda Sowendra Sekhar ఆంగ్ల కథకి నా తెలుగు అనువాదం “ఆదివాసీలు నర్తించరు” ఈ ఆదివారం “సంచిక” వెబ్ పత్రికలో వచ్చింది. ఆ కథ/అనువాదం గురించి నా అనుభవాలు ఈ పోస్టులో రాసుకుంటున్నాను.

మొదట: ఏమిటీ కథ యొక్క కథా, కమామిషు?

ఈ కథ మొదట “The Dhauli Review” అన్న పత్రికలో వచ్చి, తరువాత 2015 లో రచయిత ఇతర కథలు తొమ్మిదింటితో కలిసి ఇదే పేరు గల కథా సంకలనంలో భాగంగా వచ్చింది. ఈ పుస్తకం జార్ఖండ్ ప్రభుత్వం మొదట నిషేధించి కొంతకాలానికి దాన్ని ఎత్తివేయడం వల్ల కొంత వివాదాస్పదం అయింది కానీ ఇప్పటివరకు హింది, బెంగాలి, తమిళ్, గుజరాతి, మరాఠీ భాషల్లోకి అనువాదం చేయగా, మలయాళం, ఆస్ట్రియన్ జర్మన్ అనువాదాలు కూడా త్వరలో రానున్నాయట. ఈ కథలో ప్రధానాంశం ఒక సంతాలీ పెద్దాయన తన ట్రూపు ఒక ముఖ్యమైన ఈవెంటులో ఆడి పాడరని ప్రకటించడం.

నా ఉద్దేశ్యంలో కథనం పరంగా అంత విశేషం ఏమీ లేదు కథలో (రచయిత కూడా అప్పటికి చెయ్యి తిరిగిన వాడు కాదు. ఇప్పటికీ కాదేమో అనే నా అభిప్రాయం). అలాగే, కథలో కొన్ని అంశాలలో ఆ ప్రధాన పాత్ర చెప్పిన కొన్ని నాకు ఏమిటో సరిగా అనిపించలేదు. ఇవే విషయాలు కొంచెం నేను ఈ కథ గురించి మాట్లాడిన ఇతరుల వద్ద కూడా చర్చకి వచ్చాయి. ఎపుడన్నా తీరిగ్గా రాస్తాను. ఇక భాష: రచయిత మామూలు standard English లో రాశాడు. నేను కూడా అలాగే పాపులర్ తెలుగు వ్యావహారికం వాడాను. కానీ, ఉదాహరణకు ఈ “నర్తించరు” అన్నపదం. ఆదివాసీ పాత్రలు కదా అని భాషా శైలి మార్చాలా? ఏ “చిందేయరూ” అనో రాయాలా? అన్న అనుమానం వచ్చింది కానీ అది నాకు సహజంగా రాని మాటతీరు, నేనేదో రాసి, అది ఇంకోలా ధ్వనించి – మొదలు చెడ్డ బేరమవుతుందేమో అని ఇక ఆ విషయం ఆలోచించలేదు.

పుస్తకంలో పది కథలుండగా ఇదే ఎందుకు?

పుస్తకం లోని పది కథలలో మూడు కథలనుకుంటా – నాకు చదవగానే మంచి కథావస్తువులు అనిపించాయి. ఈ ఒక్క కథకే అది అవగానే ఇది మనం అనువాదం చేసేయాలి అనేసి వెంటనే రచయిత ని ఎలా సంప్రదించాలని ఆన్లైన్ వెదుక్కున్నాను. ఆదివారం దాదాపు అర్థరాత్రి అవుతూండగా కథ చదివితే, పడుకునే ముందు ఆయనని వెదికేసి మెసేజి పెట్టాను. సోమవారం లేచి చూసేసరికి ఆయన అనుమతి ఇస్తూ పబ్లిషర్ అనుమతి కావాలంటూ వివరాలు ఇస్తే నేను వాళ్ళకీ ఈమెయిల్ చేశాను. మంగళవారం ఉదయానికి పబ్లిషర్ అనుమతి వచ్చింది. గురువారానికి నేను ఆల్రెడీ పది పేజీల కథ అనువాదం చేసేసి ఒక ఫ్రెండుకి సరిచూడమని పంపేశాను. మరి నేను చివరిసారి ఇలా ఒక కథని ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం చేసింది 2007 లో. ఇది 2021. ఇన్నేళ్ళలో ఎప్పుడూ ఇంత బలంగానే కాదు.. ఎంత బలంగానైనా అసలు అనిపించలేదు. అంతలా ఏముంది ఈ కథలో? అని ఎవరికన్నా అనిపించొచ్చు. లోకో భిన్నరుచిః. ఇది తప్పకుండా అందరూ చదవాల్సిన కథ అని బలంగా అనిపించింది. మనకి ఇలాంటివి తెలుగులో కూడా రావాలి అని కూడా అనిపించింది. అందుకే అనువాదం చేశాను.

మరీ పదీ‌ ఎందుకొద్దు?

ఇది రచయిత నన్ను వేసిన మొదటి ప్రశ్న. బుక్కు ఇతర భాషల్లోకి అనువాదం చేశారు కానీ తెలుగులో రాలేదు. మొత్తం బుక్కు చేయొచ్చు కదా? అని. నేను చేయనన్నాను. ఎందుకొద్దూ అంటే నాక్కొన్ని కారణాలు ఉన్నాయి: అన్నన్ని కథలు అనువాదం చేసేందుకు నేను కమిట్ అవలేను. అది నా‌‌ శక్తికి మించిన పని అని నేను అనుకుంటాను. అలాగే, కథలన్నీ నాకు నచ్చాయని కానీ, అన్నీ నేను “గొప్ప”గా అనుకున్నానని గానీ అనలేను. కొన్ని అయితే ఇలాంటి భాష/సందర్భాలని నా చేత్తో నేను అనువాదం చెయ్యలేను (అతి సంస్కారీ భాష అనమాట నాది) అనిపించడం ఒక కారణం.

కథ – చర్చ: కథ ని నేను ముగ్గురికి చదవమని ఇచ్చాను. వారే “గడ్డిపూలు” సుజాత గారు, నారాయణ స్వామి (కొత్తపాళీ) గారు, రచయిత్రి చైతన్య పింగళి గారు. ఎందుకు వీళ్ళకే ఇచ్చాను అంటే పెద్ద కారణాల్లేవు. ముగ్గురి నుండి ఏదో ఒక ఉపయోగకరమైన సూచనలు అందాయి. కథ గురించి లేదా అనువాదం ఎలా చేయాలి అన్న విషయం గురించి చిన్నవే అయినా నాకు ఆసక్తికరమైన చర్చలు నడిచాయని నాకు అనిపించింది. అందుకని ఈ ముగ్గురికీ నా ధన్యవాదాలు. అసలు కథలు చదవడం గాక మళ్ళీ వాటి మీద చర్చించడం – నాకు చాలా రోజుల/ఏళ్ళ తరువాత అనుభవం ఇది. అలాగే, కొన్ని సంతాలీ పదాలకి సరైన పలుకుబడి ఏమిటని అడిగితే విసుక్కోకుండా రికార్డు చేసి పంపిన రచయిత Hansda Sowendra Sekhar గారికి, అనువాదానికి అంగీకరించిన Speaking Tiger వారికీ కూడా ధన్యవాదాలు!

ఇక సంచికలో వచ్చిన వర్షన్: నేను సంతాలీ పదాలని ఇటాలిక్స్ లో పెట్టి చివర్లో గ్లాసరీ లాగ వివరణ ఇచ్చాను. అది సంపాదకులు కథలోకే బ్రాకెట్లలో పెట్టారు. నాకు ఇది చదవడానికి అడ్డమేమో అనిపించింది కానీ, సంపాదకుల అనుభవం ముందు మనమెంత అని వదిలేశా.

చేసింది ఒక్క అనువాదం. దానికే ఇంత పెద్ద బ్లాగు పోస్టు అవసరమా? అనిపించింది నాకే అసలు. కానీ, దాదాపు పదిహేనేళ్ళ తరువాత ఈ వైపుకి తొంగి చూశాను. నా మనోభావాలు నావి మరి!

Published in: on August 15, 2021 at 4:34 am  Comments (2)  

Petroglyphs Provincial Park – ఒక అనుభవం

(ఈ వ్యాసం మొదట కెనడా నుండి వచ్చే “తెలుగు తల్లి” వెబ్ పత్రిక సెప్టెంబర్ 2018 సంచికలో వచ్చింది. ఇవ్వాళ ఒక సోషల్ మీడియా చర్చ నాకు ఈ పర్యటనని గుర్తు చేసింది. ఈ వ్యాసం యూనికోడ్ లో లేనందువల్ల గూగుల్ లో కనబడదు కనుక ఇపుడు మళ్ళీ బ్లాగులో పెట్టుకుంటున్నాను. ఇది నేను పంపిన వర్షన్. పత్రికలో వచ్చిన దానిలో అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు ఉన్నాయని గుర్తు).

********************

ఆంటారియో పార్క్స్ వారి వెబ్సైటు చూస్తూండగా “Petroglyphs provincial park” అన్న పేరు కనబడింది. “Petroglyphs” ఎక్కడో విన్నట్లు ఉందే అని ఆ పార్కు పేజీ బ్రౌజ్ చేస్తూ ఉండగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. “Largest known concentration of Indigenous rock carvings (petroglyphs) in Canada, depicting turtles, snakes, birds, humans and more; this sacred site is known as “The Teaching Rocks””

అని ముఖ్య వర్ణన. “టీచింగ్ రాక్స్” అన్న పదం చూశాక గుర్తు వచ్చింది ఎక్కడ విన్నానో. Drew Hayden Taylor అని ఒక కెనెడియన్ రచయిత ఉన్నాడు. కెనడియన్ ఆదివాసీ తెగ ఒకదానికి చెందినవాడు (ఆయన ఈ పార్కు ప్రాంతం వాడే అని నాకు ఇక్కడికి వెళ్ళొచ్చాక తెలిసింది). మొట్టమొదటి ఆదివాసీ సైన్స్ ఫిక్షన్ కథా సంకలనాన్ని వెలువరించింది ఆయనే. ఆ పుస్తకాన్ని పోయిన ఏడాది చదివాను. ఒక కథలో ఈ పెట్రోగ్లిఫ్స్ ప్రస్తావన ఉంది. ప్రస్తావన ఏమిటి, ఒక పాత్రకి ఇవి మార్గదర్శనం చేస్తాయి. కథే వీటిగురించి!

ఇంతకీ ఏమిటవి? సమానార్థక తెలుగు పదం ఉందో లేదో తెలియదు కానీ, రాతిచిత్రాలు. రాళ్ళపైన చెక్కిన బొమ్మలు. ఒక పెద్ద రాయి మీద చెక్కిన వెయ్యికి పైగా బొమ్మలు. మనుషులు, జంతువులు, వస్తువులు, వాళ్ళ జానపదాల్లో ఉండే పాత్రలు, దేవుళ్ళు, దయ్యాలు … ఇలా ఆ సంస్కృతిలో, వారి కథల్లో భాగమైన అందరి బొమ్మలూ ఉన్నాయి. అమెరికా ఖండాలలోకి తెల్లవారు రాకముందు, 900-1100 AD మధ్య కాలంలో చెక్కినవివి. అప్పటికి ఎప్పట్నుంచో ఇక్కడి జాతుల వాళ్ళలో ఉన్న నమ్మకాలు, ఆధ్యాత్మిక సంపదను  ప్రతిబింబిస్తాయివి. అలా వందల ఏళ్ళు వాళ్ళ మధ్య ఒక పవిత్ర స్థలంగా ఉన్నా, 1950లలో బయటి ప్రపంచానికి తెలిసింది. తరువాత కెనడా ప్రభుత్వం దానిని National historic site గా గుర్తించింది. అదీ వీటి వెనుక కథ. 

ఆ మొత్తం ప్రాంతమంతా హిస్టారిక్ సైటు అన్నా, అసలు పవిత్ర స్థలం చిన్న ప్రాంతమే. చుట్టూ‌ అడవిలా ఉంటుంది. మెయిన్ రోడ్డు నుండి కొంచెం గుబురుగా అడవిలా ఉన్న చెట్ల మధ్య, ఒకే కారు పట్టే వెడల్పు ఉన్న రోడ్డులో ఓ నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి. దారిలో జింకలూ అవీ దర్శనమిస్తాయి. లోపలికెళ్ళాక విజిటర్ సెంటర్ – పార్కింగ్ ఉన్నాయి. విజిటర్ సెంటర్ లో ఒక చిన్న ప్రదర్శన లాంటిది ఉంది, ఇక్కడి సంస్కృతి గురించి అవగాహన కలిగించడానికి. అక్కడ ఉన్న ఒక పోస్టర్ ఇది:

A culture is a living thing.
It lives through the people
Who keep its tradition alive.
We have been given clan systems.
We have songs and dances.
We have our language.
All of these things are very important.
That’s our way of life.
The very core of us”

ఇదే ఈ పార్కులోకి వాళ్ళ జాతులనే కాక, బాహ్య ప్రపంచానికి కూడా అనుమతించడానికి కారణం అయ్యుండొచ్చు. 

ఈ ప్రాంతపు ఆదివాసీ జాతుల “ఆధ్యాత్మిక శిక్షణ”లో ఇక్కడికి రావడం ఒక భాగం. ఆ బొమ్మలన్నీ ఉన్న రాయి వీళ్ళకి పవిత్ర స్థలం (హిందూ గుళ్ళకి మల్లే అక్కడ రాగి గిన్నెల్లో నీళ్ళూ, అవీ ఇవీ‌ ఆకులూ వగైరాలు ఒక ప్లేటులో పెట్టి “offering on the altar” అని పరిచయం చేస్తున్నారు పర్యాటకులకు). రాతికింద ప్రవహించే‌ నీళ్ళ శబ్దమూ, ఆ బొమ్మల మధ్య ఉన్న రంధ్రాలూ, అన్నింటిలోనూ ఆత్మలు ఉన్నాయని, అవి మార్గదర్శనం కావాలని వచ్చిన భక్తులతో సంభాషిస్తాయని వాళ్ళు నమ్ముతారు. ఇప్పటికీ ఈ భక్త పరంపర, వీళ్ళకి దోవ చూపే గురువుల పరంపర అక్కడ కొనసాగుతూనే ఉంది. ఆ స్థలం మీద హక్కులు వాళ్ళవే. ప్రభుత్వానికి ఇతరులని రానిచ్చి పర్యాటక స్థలంగా చేయవచ్చని చెప్పినది ఎప్పుడన్నా వెనక్కి తీసుకోవచ్చంట. 

ఇదంతా నీకెట్ల తెలుసనుకోకండి. ఏడాదిలో నాలుగు రోజులు రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది దాక ఒక గైడుతో టూర్ ఉంటుంది (ఉచితం). ఆయనతో వెళ్తే ఇదంతా చెప్పి, పగటిపూట వెలుగులో కనబడని పెట్రోగ్లిఫ్ లను చూపి వాటి కథ కూడా చెబుతాడు. ఏమాటకామాటే, గైడు వాళ్ళ జాతుల మనిషి కాడు. మామూలు తెల్లాయన. కానీ, ఏళ్ళ తరబడి ఆ జాతుల పెద్దలకు శుశ్రూష చేసి, వాళ్ళ సంప్రదాయాలను, పురాణాలను క్షుణ్ణంగా తెలుసుకున్న వాడు. ఈయన ఇచ్చే వివరణలు సరైనవని వాళ్ళ పెద్దలే సర్టిఫై చేశారంట. వందల ఏళ్ళ తరబడి వాళ్ళకీ, తెల్లవాళ్ళకి మధ్య జరిగిన ఘర్షణలను దాటుకుని, ఇప్పుడిప్పుడే ఇక్కడి ప్రభుత్వం వాళ్ళని కలుపుకువెళ్ళే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో వాళ్ళు తనలాంటి వాళ్ళని నమ్మి ఈ బాధ్యత అప్పజెప్పడం విశేషమని అతను అన్నాడు మధ్యలో. అందువల్ల మమ్మల్ని కూడా పిచ్చివేషాలు వేయకుండా మర్యాదగా ఉండమని సభక్తికంగా చాలాసార్లు చెప్పాడతను. 

కెనడా దేశానికి 150ఏళ్ళు పూర్తైన సందర్భంగా గత ఏడాది వచ్చిన పుస్తకం – “The Promise of Canada: Building a country, one idea at a time” చదువుతున్నప్పుడు ఇక్కడి ఆదివాసీ జాతులైన వివిధ First Nations వారిపైన కొంత కుతూహలం, కొంత గౌరవం ఏర్పడింది. వాళ్ళ నాయకుల గురించి, ప్రస్తుత కాలంలో వాళ్ళ సంప్రదాయాల పునరుజ్జీవనం గురించి,  రాశారు. అలాగే, హరోల్డ్ ఇనెస్ (20వ శతాబ్దపు కెనడాకు చెందిన ఆర్థిక వేత్త. దేశ ఆర్థిక చరిత్రను, అందులో ఆదివాసీ జాతుల పాత్రను గురించి “The Fur Trade in Canada: An Introduction to Canadian Economic History “ అన్న ఉద్గ్రంథం రాశాడు) గురించిన వ్యాసంలో కూడా ఆదివాసీ జాతుల వాళ్ళ నదీ మార్గాల వల్ల తొలితరం తెల్లజాతివారు, తరువాత కూడా కెనడా దేశస్థులు ఎలా బాగుపడ్డారు అన్నది చదివి, నాకు వాళ్ళ గురించి కుతూహలం కలిగింది. నాకు వృత్తిపరంగా ఉన్న ఆసక్తి వల్ల ఇనుయిట్ జాతి వారు తమ భాషకి టెక్నాలజీని అభివృద్ధి చేయడం గురించీ, నేషనల్ రిసర్చి కౌంసిల్ వారి Indigenous Languages Technologies ప్రాజెక్టు గురించి కూడా ఇదే సమయంలో చదవడం జరిగింది- వీటన్నింటి వల్లా నాకు ఈ ఆదివాసీ జాతుల గురించి ఓ కుతూహలం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ పెట్రోగ్లిఫ్స్ చూసి, వాళ్ళ కథలన్నీ విని, భారతదేశంలో ఒకప్పటి జీవన విధానంతో పోల్చుకోవడం నాకు కొత్త అనుభవం. 

“ఆ, అన్ని పర్యాటక స్థలాల్లాగే ఇదీ ఒకటి” అని అనిపించవచ్చు. నిజమే. నేనూ వెళ్ళేముందు ఏదన్నా ప్రత్యేకంగా కనిపించే “పర్యాటక” స్థలానికే వెళ్ళాలనుకున్నాను. అయితే, భారతదేశం మొట్టమొదటిసారి దాటి ఏడున్నరేళ్ళు అవుతోంది.  ఇందులో కెనడా నేను నివసిస్తున్న (నివాసం అంటే ఉద్యోగం, పన్నులు కట్టడం వగైరాలు చేయడం) మూడో‌ దేశం. మధ్యలో ఐరోపా ఖండంలో సుమారు ఐదేళ్ళు ఉన్నాను – ఆ సమయంలో ఎక్కే గడపా, దిగే గడపా అన్న పద్ధతిలో ఆర్థిక వనరులను బట్టి తిరగగలిగినన్ని దేశాలు తిరిగాను. కనుక, ఇతర జాతుల సంప్రదాయాలను ఎప్పుడూ‌ చూడలేదు అనలేము. ఇన్ని తిరుగుళ్ళ తరువాత కూడా ఈ పెట్రోగ్లిఫ్స్ ప్రత్యేకంగా, వినూత్నంగా అనిపించాయి. అదే సమయంలో భారతదేశంలో కనబడే సంప్రదాయాలనీ, వినే జానపద, పురాణ కథలనీ గుర్తు తెచ్చినందువల్ల బాగా తెలిసిన నాగరికతలా కూడా అనిపించింది. వందల ఏళ్ళ చరిత్ర ఉన్న విశేషాలు గ్లోబులో ఇటువైపు కొంచెం తక్కువే (ఇదివరలో యూఎస్ లో ఉండే రోజుల్లో వందేళ్ళ ఇళ్ళకి మ్యూజియం కట్టడం కూడా చూశాను!). అందువల్ల, కెనడా వాసులు తాము చూసి, తమ ఇంటికి వచ్చే టొరొంటో‌ సందర్శకులను తప్పకుండా తీసుకెళ్ళాల్సిన స్థలం ఇది అని నా అభిప్రాయం. 

విజిటర్ సెంటర్ లో ఉన్న చిన్న ఎగ్జిబిషన్ పోస్టర్లలో నాకు నచ్చినవి కొన్ని రాసి ముగిస్తాను.

“If the very old remember, the very young will listen. The wisdom and eloquence of my father, I pass on to my children. So they too acquire faith, courage, generosity, understanding and knowledge in the proper way of living.”

“What we are told as children is that people,
When they walk on the land,
Leave their breath wherever they go.
So whenever we walk,
that particular spot on the Earth
never forgets us.
When we go back to these places, we know
that the people who lived there
are in some way still there,
and that we can partake
of their breath and
of their spirit. “

“Of all teachings we receive, this one is the most important. Nothing belongs to you. Of what there is, of what you take, you must share.”

All life is related
Life is the process of learning, of seeking harmony and balance of the four aspects of life, the physical, mental, emotional and spiritual. We are an integral part of the whole creation
.”

The ways of our people are ancient, but they are not rigid. They bend and turn to reflect changes in our culture. We expect out young people to have a different interpretation of their culture and different ways of expressing it. This is how the culture grows, and how we grow as people.”

Elders are keepers of knowledge and culture, and youth are seekers of knowledge.

If the legends fall silent, who will teach the children of our ways?

పార్కు వెబ్సైటు

Published in: on August 8, 2021 at 4:01 am  Leave a Comment  

జ్ఞాపకానికీ, ప్రస్తుతానికీ మధ్య: పదేళ్ళ క్రితం రాసిన కథ

ఇవ్వాళ ఒక తెలిసిన వారితో మాట్లాడుతూ ఉండగా “నీ కథ ఒకటి ఒకసారి ‘రచన’ పత్రికలో చదివాను” అన్నారు. “నా కథా?” అని ఆశ్చర్యం కలిగింది. గతంలో కథలూ అవీ రాసేయాలి అన్న తాపత్రేయం ఉండేది కానీ అది పొయ్యి కూడా పదేళ్ళు ఔతోంది. కనుక ఇదేం కథ? అదీ “రచన” లోనా? అనుకున్నా. అయితే చూచాయగా ఈ రచనకి ఏదో పంపడం గుర్తు ఉంది. దీనితో కొంచెంసేపు ఈమెయిల్స్ వెదికాను. 2011 ఏప్రిల్ లో రచన పత్రిక నడిపిన శాయి గారితో ఒక ఈమెయిల్ సంభాషణ ఉంది.

దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, నేను 2007 లోనో ఎప్పుడో ఏదో‌ కాంపిటీషన్ కి ఈ కథ పంపాను. వాళ్ళు ఏప్రిల్ 2011 సంచికలో ఆ కథని వేసుకున్నారు. ఇది నాకు ఎలాగో తెలిస్తే, ఆ పత్రిక పీడీఎఫ్ దొరుకుతుందేమో అని అడిగాను. అప్పటికే నేను జర్మనీలో ఉన్నందువల్ల నాకు పత్రిక అందుబాటులో లేదు. ఆయన సాఫ్ట్ కాపీ లేదని, పత్రిక కాపీ, అలాగే పారితోషికం మా ఇంటి అడ్రస్ కి పంపుతున్నామని జవాబు ఇచ్చారు. ఈ పత్రిక మా ఇంటిని చేరిందనుకుంటా – నాకు గుర్తు లేదు. అన్నింటికంటే వరస్ట్ విషయం ఏమిటంటే నాకు కథ ఏమిటో గుర్తు లేదు!

కాసేపు అంతర్జాలంలో వెదకగా కౌముది పత్రిక వెబ్సైటులో ఈ రచన పత్రిక సంచిక వివరాలు కనబడ్డాయి. దానితో కథ పేరు తెలిసింది. అయితే ఈ పేరుతో నా ఈమెయిల్, డ్రైవ్ ఎక్కడా ఏం లేదు. బహుశా పేపర్ కాపీ పంపానో ఏమిటో – నాకు అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది – ఏం జరుగుతోంది? అని. సరే, కాసేపు ఈ కథ దొరుకుతుందేమో అని వెదుక్కుని, చివరికి ఫేస్బుక్ లో తెలుగు సాహితీ మిత్రులని అడగడం మొదలుపెట్టాను – మీ వద్ద రచన పాత సంచికలు గానీ, స్కాన్ లు గానీ ఉన్నాయా? అని. ఈ ప్రయత్నంలో ఉండగా కౌముది నిర్వహకులు కిరణ్ ప్రభ గారు కథ పీడీఎఫ్ పంపారు. అదే ఇది:

సరే, కథ నేను చదివా ఇపుడు కొత్తగా. కాకి పిల్ల కాకికి ముద్దు అనుకోండి. అయితే, కథకి ఓ బొమ్మ కూడా ఉంది – భలే నచ్చింది నాకు. బాగా వింత విషయం ఏమిటంటే – కథ రాసేనాటికి పెళ్ళి కూడా కాలేదు (పబ్లిష్ అయేనాటికి అయింది). అయినా ఈ పిల్లల వర్ణనలు ఏంటో అని నవ్వొచ్చింది. ఇటీవలి కాలంలో నా అభిమాన రచయిత అయిన థామస్ కింగ్ “నేను నాకు తెలిసిన విషయాన్ని రాయను. నా ఊహల పరిధి లో ఉన్న విషయాలని రాస్తాను” అన్నాడు ఒక ఇంటర్వ్యూలో. నేను ఇది మొదటే వంటబట్టించుకున్నట్లు ఉన్నా. ఏదేమైనా ఇప్పుడు చదవడం బాగుంది నాకు. బహుశా ఇదే అనుకుంటా ఇలా పబ్లిష్ అయిన ఆఖరు కథ!

Published in: on July 31, 2021 at 4:19 am  Leave a Comment  

అభిమాని – అనువాద కథ


(ఇది నేను 2007 సెప్టెంబరు లో “ప్రజాకళ” తెలుగు వెబ్ పత్రికకి చేసిన అనువాదం. ఈ పత్రిక ఇప్పుడు లేదు. కనుక ఈ కథా అంతర్జాలంలో కనబడ్దం లేదు. ఆమధ్య పాతవన్నీ తవ్వుతూ ఉంటే ఇవి కూడా కనబడ్డాయి. సరే, ఎపుడైనా బ్లాగులో పెడదాం అనుకున్నాను. వీటికి అనుమతులు తీసుకోలేదు కనుక ఇపుడు కొత్తగా ఎవరికీ పంపకుండా, అప్పట్లో అలాంటి విషయాలు ఆలోచించకుండా చేసిన పనికి నేనే బాధ్యత తీసుకుంటున్నా బ్లాగులో పెట్టుకుని. నా వద్ద ఉన్న డ్రాఫ్ట్ యథాతథంగా షేర్ చేస్తున్నాను. టైపోలు కూడా సరిచెయ్యడం లేదు. వీలు చిక్కినపుడు చేస్తాను!).

“The Admirer” ఈ కథ పేరు. సత్యజిత్ రాయ్ దీన్ని బెంగాలీ భాషలో 1974లో రాయగా గోపా మజుందార్ ఆంగ్లంలోకి అనువదించారు. నేను ఆ‌ ఆంగ్ల కథని తెలుగులోకి అనువదించాను.


పదకొండేళ్ళ తరువాత అరూప్ బాబు అనబడు అరూప్ రతన్ సర్కార్ మళ్ళీ పూరీ నగరాన్ని సందర్శిస్తున్నాడు. నగరం లో ఈ పదకొండేళ్ళలో చెప్పుకోదగ్గ మార్పులే జరిగినట్లు గమనించాడు – కొన్ని కొత్త ఇళ్ళు, కొత్త రోడ్లు, కొత్త హోటెళ్ళు – చిన్నవీ, పెద్దవీనూ. కానీ, బీచ్ లోకి అడుగుపెట్టిన మరుక్షణం అతనికి అర్థమైంది ఈ నగరం లో ఎప్పటికీ మారనిది ఒకటుందని.

అరూప్ దిగిన సాగరిక హోటెల్ నుండి సముద్రం కనబడదు. కానీ, రాత్రి వేళల్లో ఆ హోటెల్ అంతా నిద్రావస్థలోకి జారుకున్నాక అలల సవ్వడి చెవిన బడ్డం చాలా తేలిక. నిన్నరాత్రి సముద్రం చేసిన ఈ శబ్దాలే అరూప్ బాబు ని హోటెల్ నుండి బయటపడి బీచ్ కి వచ్చేలా చేసాయి. అతను పూరి కి ఆరోజు ఉదయమే వచ్చాడు కానీ ఏదో షాపింగని తిరగడం తో బీచ్ కి వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు తెల్లగా నురగలు గక్కుతున్న అలలని చీకటి కమ్మిన అమావాస్య రాత్రిలో  కూడా చూడగలుగుతున్నాడు. అతనికి సముద్రపు నీటిలో ఫాస్పరస్ ఉంటుందనీ, అందువల్లే ఆ అలలు చీకట్లో కూడా కనిపిస్తాయని ఎక్కడో చదివిన విషయం గుర్తు వచ్చింది. “ఇలా ప్రకాశిస్తున్న భావగర్భితమైన ఈ అలలు ఎంత అందంగా ఉన్నాయో కదా” అనుకున్నాడు. కలకత్తా లో అతడిని సృజనాత్మకత గల మనిషంటే ఎవరూ ఒప్పుకోరేమో. పర్వాలేదు. అరూప్ బాబు కి తెలుసు – అంతర్గతంగా తనలో ఉన్న కొన్ని సున్నితమైన భావాలు సగటు మనిషి కంటే తాను వేరు అన్న విషయం చెప్తాయి అని. ఈ సున్నితత్వాన్ని రకరకాల ఒత్తిళ్ళతో కూడిన దైనందిన జీవితం పాడుచేయకుండా అతడు జాగ్రత్తపడ్డాడు, అప్పుడప్పుడూ కలకత్తాలో నది ఒడ్డుకో, ఈడెన్ ఉద్యానవనానికో వెళుతూ ఉండటం ద్వారా ఇది సాధ్యమైంది. నదీ తరంగాలు, పచ్చదనం, పూల వనం – ఇవన్నీ అతనికి ఇప్పటికి కూడా ఓ ఆనందాన్ని ఇస్తాయి. ఈ ఆలోచనల్లో అతనుండగా, ఇంతలో ఓ పక్షి కూత అతని మదిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది – అది .. కోకిలా? మరింకేదన్నానా?  ఏదేమైనా, కాసేపు ఇక్కడ ఇలా ఈ అలలను చూడటం అతనికి పదహారేళ్ళ ఉద్యోగజీవితం కలిగించిన అలసట నుండి కొంతవరకూ ఉపశమనం కలిగించింది.

ఈరోజు సాయంత్రం అతడు మళ్ళీ బీచ్ కి వచ్చాడు. అలల వెంబడి నడుస్తూ నడుస్తూ ఓ చోట ఆగాడు. ఎదురుగా కాషాయ వస్త్రధారి ఒకరు అమితమైన వేగం తో నడిచి వెళ్ళిపోతూ ఉంటే అతని వేగాన్ని అంగిపుచ్చుకోలేక అతని శిష్యగణం అతని వెనుక పరుగెడుతున్నారు. అది అరూప్ బాబు కి ఎందుకో గానీ నవ్వు తెప్పించింది. ఇంతలో అతని వెనుక నుండి ఓ చిన్న పిల్లవాడి గొంతుక వినబడ్డది.

“little boy’s dream” పుస్తకం రాసింది మీరే కదూ? – ఆ గొంతుక అరూప్ బాబు ని ప్రశ్నించింది. అరూప్ బాబు వెనక్కి తిరిగాడు. తెల్ల చొక్కా, నీలం నిక్కరూ వేసుకున్న సుమారు ఏడేళ్ళ వయసున్న బాలుడు కనిపించాడు. వాడి మోచేతుల దాకా మట్టి అంటుకుని ఉంది. ఇంతింత కళ్ళతో ఆశ్చర్యంగా తన వైపే చూస్తున్నాడు. అరూప్ బాబు జవాబిచ్చేలోపలే ఆ అబ్బాయి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు – “నేను little boy’s dream చదివాను. అది మా నాన్న నాకు పుట్టినరోజు కానుకగా ఇచ్చారు. నేను…. నేను…”

“చెప్పు, పర్వాలేదు. సిగ్గుపడకు.” – ఈసారి ఇది ఓ ఆడ గొంతుక, ఆ పిల్లాడిని ప్రోత్సహిస్తున్నట్లు అనిపించింది. వెంటనే ఆ కుర్రాడు అందుకున్నాడు..

“నాకు మీ పుస్తకం చాలా నచ్చింది.”

అరూప్ బాబు ఓ సారి ఆవిడ వైపు చూసాడు. దాదాపు ముప్ఫై ఏళ్ళు ఉంటాయేమో. అందంగానే ఉంది అనుకున్నాడు. ఆమె అరూప్ బాబు వైపు సూటిగా చూస్తూ, నవ్వుతూ నెమ్మదిగా అతన్ని సమీపించింది. అరూప్ బాబు ఆ అబ్బాయి తో –

“లేదబ్బాయ్, నేను ఏ పుస్తకమూ రాయలేదు. నువ్వు పొరబడ్డావు” అన్నాడు.

ఆవిడ ఆ పిల్లవాడి తల్లి అనడం లో సందేహం లేదు. వాళ్ళిద్దరి రూపురేఖల్లో పోలికలు కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా చబుకం దగ్గర.అరూప్ బాబు మాటలు విన్నాక కూడా ఆవిడ చిరునవ్వు చెరగలేదు. నిజానికి, చేరువయ్యేకొద్దీ ఆ చిరునవ్వు మరింత పెద్దదైంది. అతనితో –  “మీకు ఇలా జనాలను కలవడం అంటే ఇష్టం లేదని మాకు తెలుసు. మా మరిది ఓ సారి మీకు వాళ్ళ ఫంక్షనుకొకదానికి ముఖ్య అతిథిగా రమ్మని ఉత్తరం రాస్తే మీకు అలాంటి విషయాల మీద అసలు ఆసక్తి లేదు అని జవాబిచ్చారు. కానీ, ఈ సారి మీరు తప్పించుకోలేరు. మాకందరికీ మీ కథలు అంటే ఇష్టం. మీరు పిల్లలకోసం రాసిన కథల్ని పెద్దవాళ్ళం మేము కూడా బాగా ఇష్టపడతాము” అంది. అరూప్ బాబు కి ఓ పట్టాన ఆ little boy’s dream రాసిందెవరో తెలీడం లేదు కానీ, ఆ పిల్లవాడికి, వాడి తల్లికీ ఇద్దరికీ ఆ రచయిత అంటే సమానమైన అభిమానం ఉందని మాత్రం తెలుస్తూనే ఉంది. ఇలాంటి వింత పరిస్థితి తనకు కలుగుతుందని ఎవరు కలగన్నారు? వీళ్ళకి వాళ్ళు పొరబడ్డారు అని చెప్పి తీరాలి. కానీ, వాళ్ళను బాధపెట్టకుండా, వాళ్ళ మనసుకు కష్టం కలిగించకుండా చెప్పాలి.

అరూప్ బాబు కి ఉన్న సమస్య ఏమిటంటే అతను మరీ మెతక మనిషి.  ఓ సారి వాళ్ళ చాకలి గంగాచరణ్ అతని కొత్త కుర్తా పైన ఓ చిల్లు చేసాడు. మరొకరయ్యుంటే గంగాచరణ్ గూబ గుయ్యిమనిపించేవారేమో. కానీ, దీనంగా చూస్తున్న గంగాచరణ్ మొహం చూడగానే అరూప్ బాబు కరిగిపోయాడు. “చూడు, ఇక నుంచైనా కాస్త జాగ్రత్త గా ఉండు” – అని మాత్రం అనగలిగాడు. ఈ సున్నితమైన మనస్తత్వమే ఇప్పుడు అతని చేత ఆ తల్లీబిడ్డలతో మృదువుగా – “నేనే ఆ రచయిత ను అని మీరు ఎలా చెప్పగలరు?” అనిపించింది. ఈ మాటలతో ఆవిడ ఆశ్చర్యంతో కనుబొమలెగరేసి – “ఈ మధ్యనే కదా మీ ఫొటో పేపర్ లో వచ్చింది? ఓ సాయంత్రం మీకు పిల్లల సాహిత్యానికి చేసిన సేవకు గుర్తింపుగా అకాడెమీ అవార్డు వచ్చిందన్న వార్త రేడియో లో విన్నాము. తరువాతి రోజే మీ ఫొటో పేపర్ లో వచ్చింది. ఇప్పుడు అమలేశ్ మౌలిక్ అన్న పేరు తెలిసిన వాళ్ళు మేము ఇద్దరం మాత్రమే కాదు. చాలా మంది ఉన్నారు.

అమలేశ్ మౌలిక్! అరూప్ బాబు కూడా ఈ పేరు విన్నాడు, కానీ ఫొటో ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ తాను ఆ మనిషి లాగా ఉన్నాడా? కానీ, పేపర్లలో వేసే ఫొటోలు అంత స్పష్టంగా కనబడవు లే – అనుకున్నాడు.

“మీరు వస్తున్నారన్న విషయం ఇక్కడ ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది.” ఆవిడ మాట్లాడుతూనే ఉంది ఇంకా. “మేము మొన్నోరోజు సీ వ్యూ హోటెల్ కి వెళ్ళాము. నిన్నటిదాకా అక్కడ మా వారి స్నేహితులొకరు ఉండేవారు. ఆయనతో ఆ హోటెల్ మేనేజర్ చెప్పాడట మీరు గురువారం వస్తారు అని. మీరు సీ వ్యూ లో ఉంటున్నారా?”

“అ….లేదు..నేను…నేను అక్కడ ఆహారం అంత బాగుండదు అని విన్నాను.”

“అది నిజమే. మేము కూడా అనుకున్నాము – మీరెందుకు ఆ హోటెల్ ఎంచుకున్నారా? దానికంటే బాగుండేవి చాలా ఉన్నాయి. ఇంతకీ ఇప్పుడు ఏ హోటెల్ లో ఉందామని నిర్ణయించుకున్నారు?”

“నేను .. సాగరిక లో ఉంటున్నాను.”

“ఓహో…అది కొత్త హోటెల్ కదూ? ఎలా ఉంది?”

“నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది. అయినా ఇక్కడేమీ రోజులతరబడి ఉండబోవడం లేదు కదా.”

“ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడ?”

“ఓ అయిదు రోజులు”

“అయితే మీరోసారి మా హోటెల్ కి రావాలి. మేం ఉండేది పూరీ హోటెల్. మిమ్మల్ని కలవడం కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో మీరు ఊహించలేరు..ముఖ్యంగా పిల్లలు. అరే…మీ పాదాలు తడిసిపోతున్నాయి…చూసుకోండి.”

ఓ పెద్ద అల తన పాదాల వైపు కి ఉరకలేస్తూ రావడం అరూప్ బాబు గమనించలేదు. కానీ, ఒక్క కాళ్ళు మాత్రమే కాదు తడిసింది… అంత గాలిలో కూడా తన శరీరమంతా చెమటతో ముద్దౌతోంది అన్న విషయం గమనించాడు. అయినా, ఆవిడ అన్ని మాట్లాడుతూ ఉంటే అడ్డు చెప్పి అసలు విషయం చెప్పే అవకాశం ఎలా జారవిడుచుకున్నాడు తను? ఇప్పడిక చాలా ఆలస్యమైపోయింది. ప్రస్తుతానికి ఇక్కడినుండి వెళ్ళిపోయి, కాసేపు ఎక్కడన్నా ఏకాంతంగా కూర్చుని ప్రశాంతంగా ఆలోచించుకోవాలి తన ఈ చర్య కు పర్యవసానం ఏమిటో అన్న విషయాన్ని – అనుకుంటూ ఆవిడ తో ఇలా అన్నాడు :

“నేను…ఇక…బయలుదేరనా?”

“మీరు మళ్ళీ కొత్తది ఏదన్నా రాస్తున్నారు అనుకుంటా?”

“లేదు,లేదు. నేను సెలవు లో ఉన్నాను. రాయడం లేదు.”

“ఆహా! సరే అయితే. మళ్ళీ కలుద్దాం. మా వారికి మీ గురించి చెబుతాను. రేపొస్తారా ఈ వైపు మళ్ళీ?”

అరూప్ బాబు ఏదో గొణిగి బయట పడ్డాడు.

అరూప్ బాబు అక్కడికి చేరే సమయానికి సీ వ్యూ హోటెల్ మేనేజర్ వివేక్ రాయ్ అప్పుడే ఓ పెద్ద పాన్ నోట్లోకి వేసుకుంటూ ఉన్నాడు. అరూపబాబు అతనితో –

“అమలేశ్ మౌలిక్ ఇక్కడికి వస్తున్నారా?”

“ఊ”

“ఎప్పుడు…వస్తారని…అనుకుంటున్నారు?”

“మంగళవారం. ఏం?”

ఈరోజు గురువారం. అరూప్ బాబు మంగళవారం దాకా ఆ ఊరిలో ఉంటాడు. మౌలిక్ టెలిగ్రామ్ పంపాడు అంటే అతను చివరి నిముషం లో అతని రాక ను వాయిదా వేసుకున్నాడనే అర్థం. మేనేజర్ కూడా అతను అసలుకైతే ఈరోజు రావాల్సి ఉన్నదని చెప్పాడు. వివేక్ రాయ్ అడిగిన – “ఏం?” కి జవాబు గా తనకి మౌలిక్ తో ఏదో పనుందని, మంగళవారం వచ్చి కలుస్తా అని చెప్పి బయటపడ్డాడు అరూప్ బాబు.

అక్కడి నుండి సరాసరి మార్కెట్ కి వెళ్ళి ఓ పుస్తకాల షాపుని వెదుక్కున్నాడు. అక్కడ అమలేశ్ మౌలిక్ రాసిన నాలుగు పుస్తకాలను కొన్నాడు. “లిటిల్ బాయ్స్ డ్రీమ్” మాత్రం కనబడలేదు. కొన్న నాల్గింటిలో రెండు నవల్లు, మిగితా రెండు చిన్న కథల సంకలనాలు.

సాయంత్రం ఆరున్నర అవుతూ ఉండగా అరూప్ బాబు తన హోటెల్ చేరుకున్నాడు. హోటెల్ ప్రవేశ ద్వారం వద్ద ఓ హాలు ఉంది. హాలుకి ఎడమవైపు మేనేజరు కుడివైపు ఓ బెంచి, కొన్ని కుర్చీలు వేసి ఉన్నాయి. వాటిపై ఇద్దరు పెద్దవాళ్ళు, పది సంవత్సరాలు దాటని ముగ్గురు పిల్లలూ కూర్చుని ఉన్నారు. పిల్లల్లో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అరూప్ బాబు రాగానే ఆ పెద్దవాళిద్దరూ లేచి చేతులు జోడించి నమస్కారం చెప్పారు. వాళ్ళ పిల్లలని చూసి సైగ చేయగానే ఆ ముగ్గురు పిల్లలూ సిగ్గుపడుతూ అరూప్ బాబు ను సమీపించి అతను నిలువరించేలోపే అతని కాళ్ళకు నమస్కారం చేసారు.

“మేము పూరి హోటెల్ నుండి వస్తున్నాం” – ఆ పెద్దవాళ్ళలో ఒకాయన అన్నాడు. “నా పేరు సుహ్రిద్ సేన్. ఇతను గంగూలీ.” – పరిచయం చేసుకున్నాడు అతను. “మిమ్మల్ని కలిసానని, మీరిక్కడ ఉంటున్నారని మాకు మిసెస్ ఘోష్ చెప్పారు..” అన్నాడు మళ్ళీ.

“ఇంకా నయం, ఆ పుస్తకాల షాపు వాడు ఓ కవర్ లో పెట్టిచ్చాడు పుస్తకాలను. లేకుంటే తన పుస్తకాలను తానే కొనుక్కుంటున్న రచయిత గురించి వీళ్ళు ఏమనుకునేవాళ్ళో!” అనుకున్నాడు అరూప్ బాబు.

అతను వాళ్ళన్న ప్రతి మాటకీ తలూపడం మొదలుపెట్టాడు, ఇక తన పొరపాటు ని కప్పిపుచ్చే మార్గం లేదని అర్థమై.  “చూడండి, ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఆ అమలేశ్ మౌలిక్ ఫొటో నేను చూడలేదు. కానీ, బహుశా అతను కూడా కాస్త నాలాగే ఉంటాడేమో. అతనిక్కూడా సన్నని మీసాలు, రింగుల జుట్టూ ఉన్నాయేమో. అతనూ కళ్ళజోడు వాడతాడు ఏమో. అతను కూడా పూరీ కి వద్దామనుకున్న విషయం నిజమే కావొచ్చు. కానీ, నేనా మనిషి ని కాను. నేను పిల్లల కోసం కథలు రాయను…అసలు నేను రాయనే రాయను. నేను ఓ ఇన్సూరన్స్ కంపెనీ ఉద్యోగిని. ఏదో సెలవులు గడుపుదాం అని ఇక్కడికి వచ్చాను. నన్ను ఒంటరిగా వదిలెయ్యండి. ఆ అమలేశ్ మౌలిక్ మంగళవారం వస్తాడు. కావాలంటే సీ వ్యూ కి వెళ్ళి ధృవపరుచుకోండి ఈ విషయం.” – అని అరూప్ బాబు ఓ సారి చెబితే చాలు. కానీ,ఈ తరహా ఉపన్యాసం పనికొస్తుందా? వీళ్ళు తానే అమలేశ్ మౌలిక్ అన్న పూర్తి నమ్మకంతో ఉన్నారు. తాను స్వయంగా చెప్పినప్పుడే నమ్మలేదు నిన్న. ఇప్పుడు సీవ్యూ లో ఉన్న ఆ టెలిగ్రామ్ మాత్రం నమ్మించగలదా వీళ్ళని? వాళ్ళు అది కూడా వాళ్ళని పంపేయడానికి తాను ఆడిన నాటకం అనుకోవచ్చు. అసలీ సాగరిక లో తాను మారుపేరు తో దిగి వాళ్ళని దారి మళ్ళించడానికి సీవ్యూ కి టెలిగ్రామ్ పంపానని అనుకున్నా ఆశ్చర్యం లేదు. పైగా, ఈ పిల్లలు ఉన్నారు. వాళ్ళ మొహాలు ఒక్క సారి చూడగానే అరూప్ బాబు ఈ తతంగమంతా పొరపాటు అని చెప్పబోయిన వాడల్లా ఆగిపోయాడు. వాళ్ళు ముగ్గురూ ఎంతో ఆరాధనా భావం తో చూస్తున్నారు తనని. ఇప్పుడిలా చెబితే వాళ్ళ ఉత్సాహమంతా నీరుగారిపోతుంది.

“బాబున్, నువ్వు అమలేశ్ బాబు ని ఏమన్నా అడగాలనుకుంటే అడుగు” – సుహ్రిద్ సేన్ ఆ పిల్లల్లో పెద్దబ్బాయిని చూస్తూ అన్నాడు.

ఇక వెనుదిరిగే మార్గం లేదు. ఆ బాబున్ అనే కుర్రాడు తల ఒక వైపు కి ఆన్చి తన వైపే చూస్తున్నాడు చేతులు కట్టుకుని – ప్రశ్న అడగడానికి రెడీగా.

“ఆ చిన్న పిల్లవాడిని నిద్రపుచ్చిన ముసలాయన …ఆయనకి మ్యాజిక్ తెలుసా?”

ఈ కీలకమైన క్షణం లో తన బుర్ర మునుపటి కంటే బాగా పనిచేస్తోందని గ్రహించాడు అరూప్ బాబు. కాస్త వంగి బాబున్ చెవిలో – “ఊ, నువ్వేమనుకుంటున్నావ్?” అని అడిగాడు.

“అతనికి మ్యాజిక్ తెలుసు అనుకుంటున్నాను.” – ఇది విన్న తక్కిన ఇద్దరి పిల్లలూ – “అవును, అవును – అతనికి మ్యాజిక్ తెలుసు. మేమందరం తెలుసని అనుకుంటున్నాం” అన్నారు.

“నిజం” అరూప్ బాబు పైకి లేస్తూ అన్నాడు – “మీరు ఏది నిజం అనుకుంటే అదే నిజం. నేను ఏది రాయాల్సి ఉందో అదే రాసాను. దానికి అర్థమేమిటో తెలుసుకోవాల్సింది మీరు. మీరు ఏది సరి అయినది అనుకుంటున్నారో అదే నిజం. మిగితావన్నీ మనకనవసరం.” అన్నాడు. పిల్లలు ముగ్గురికీ ఈ జవాబు నచ్చినట్లు అనిపించింది. హాలు నుండి వెళ్ళిపోయేముందు సుహ్రిద్ సేన్ అరూప్ బాబు ని తరువాతి రాత్రి భోజనానికి ఆహ్వానించాడు. ఆ హోటెల్లో ఎనిమిది బెంగాలీ కుటుంబాలు ఉంటున్నాయి. ఈ గుంపు లో అమరేశ్ మౌలిక్ అభిమానులు అయిన పిల్లలు సుమారుగా ఉన్నారు. తాను తాత్కాలికంగా అయినా అమరేశ్ మౌలిక్ గా నటించక తప్పదని అర్థమైన అరూప్ బాబు దీనికి అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడిక పర్యవసానాల గురించి దిగులు పడి ప్రయోజనం లేదు. కానీ, అరూప్ బాబు ఒక్క విషయం మీద మాత్రం పట్టుదలగా ఉండాలి అనుకున్నాడు. అందుకని –

“చూడండి, నాకు ఈ హంగామా అంతగా ఇష్టం లేదు. జనం తో కలవడం నాకు అలవాటు లేదు. కనుక, దయచేసి ఈ విషయానికి ప్రచారం కల్పించవద్దని నా మనవి” అన్నాడు సేన్ తో.

రేపటి రాత్రి తర్వాత అతన్ని ఎవరూ ఇబ్బంది పెట్టరని సేన్ హామీ ఇచ్చాడు. మిగితా వారికి కూడా అతని ని(మౌలిక్ గా చెలామణి అవుతున్న అరూప్ బాబు ని) ఒంటరిగా వదిలెయ్యమని చెప్తానన్నాడు.

తరువాత, అరూప్ బాబు భోజనం త్వరగా చేసేసి హబూస్ ట్రిక్స్ అన్న మౌలిక్ పుస్తకం చేతుల్లోకి తీసుకుని నిద్రకుపక్రమించాడు. మిగితా మూడు పుస్తకాలు – తుతుల్స్ అడ్వెంచర్, చెక్‍మేట్, స్పార్క్లర్స్. ఈ చివరి రెండూ చిన్న కథల సంకలనాలు. అరూప్ బాబు సాహిత్యాన్ని మధించిన మేధావేమీ కాదు. కానీ, తన స్కూలు రోజుల్లో ఎందరో భారతీయ, విదేశీ రచయిత లు రాసిన పిల్లల సాహిత్యం బాగానే చదివాడు. అవి చదివి దాదాపు ముప్ఫై తొమ్మిదేళ్ళు అవుతున్నా కూడా తనకు ఇంకా అప్పటి కథలు గుర్తు ఉన్నాయన్న విషయం తలుచుకుని అతనికి ఆశ్చర్యం కలిగింది. అంతే కాదు, అమలేశ్ మౌలిక్ కథల్లో చాలా వాటి వస్తువుకో, కథనానికో తాను స్కూలు కుర్రాడిగా చదివిన కథలతో పోలికలు ఉన్నట్లు గమనించాడు. ఈ నాలుగు పుస్తకాలు కలిపి ప్రింటులో ఓ 125 పేజీలు ఉండి ఉండొచ్చు. అరూప్ బాబు చివరి పుస్తకం పూర్తిచేసి లైటు తీసేసే సమయానికి ఆ హోటెల్ మొత్తం నిశబ్దంగా ఉంది. కొంత దూరం లో సముద్రం చేస్తున్న శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయి. “ఇప్పుడు టైమెంతయింది?” అరూప్ బాబు వాచీ అతని దిండు పక్కన పడి ఉండింది. అతను దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అది ఒకప్పుడు తన తండ్రిది. దానికి రేడియం డయల్ ఉన్నందువల్ల ఆ చీకట్లో నురగల అల లా మెరిసింది. అప్పుడు సమయం అర్థరాత్రి పన్నెండు గంటలా నలభై అయిదు నిముషాలు.

అమలేశ్ మౌలిక్ పిల్లల సాహిత్యం లో చాలా పేరున్న రచయిత. ఆ భాష సరళంగానూ, శైలి అనూహ్యంగా నూ ఉంది అన్న విషయం ఒప్పుకోవాల్సిందే. అతని పుస్తకాలు ఏకబిగిన చదవకుండా ఆగడం కష్టం. కానీ, వాటిలో కొత్తదనం తక్కువనే చెప్పాలి. ఇలాంటి కథలు స్నేహితుల దగ్గర వినే ఉంటారు. మనుష్యులకు రకరకాల అనుభవాలు ఎదురౌతూ ఉంటాయి. వింతగా అనిపించేవి, చాలా ఆసక్తికరమైన సంఘటనలు ఇలాంటివి ఎన్నో మనకే జరగొచ్చు కూడా. రచయిత చేయాల్సిందల్లా ఇలాంటి అనుభవాలను తీసుకుని దానికి కాస్త సృజనాత్మకత జోడించడమే. ఇంకోళ్ళ ఆలోచనలను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? అరూప్ బాబు కి మౌలిక్ మీద ఉన్న గౌరవం కాస్త తగ్గింది. కానీ, అదే సమయం లో కాస్త ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు ఈ ప్రఖ్యాత రచయిత గా నటించడం కాస్త తేలిక. రాత్రి  పూరీ హోటెల్లో డిన్నర్ తరువాత మౌలిక్ పట్ల అతని అభిమానులకున్న గౌరవం మరింత ఎక్కువైంది.  అరూప్ బాబు మధ్య దొరికిన సమయం లో The little boy’s dream ప్రతి ఒకటి సంపాదించగలిగాడు, వేరే షాపు నుండి. కనుక ఆ పదమూడు పిల్లలు అడిగే సవాలక్ష ప్రశ్నలకు జవాబివ్వడం అతనికి పెద్ద కష్టంగా అనిపించలేదు. పార్టీ ముగిసే సరికి పిల్లలంతా అరూప్ బాబు ని హనీలిక్ బాబు అని పిలవడం మొదలు పెట్టాడు. అరూప్ బాబు ’మౌ’ అన్న బెంగాలీ పదానికి హనీ అన్నది ఇంగ్లీషు అర్థం అని చెప్పడం దీనికి కారణం. ఈ కొత్త నామధేయం విన్న డాక్టర్ దాస్‍గుప్తా అన్న అతిథి అరూప్ బాబు తో – “మీరు తేనె ని సృష్టించారు, ఈ పిల్లలందరూ దాని రుచి చూస్తున్నారు” అన్నాడు. దానికి ఆయన భార్య సురంగమా దేవి – “కేవలం పిల్లలు మాత్రమేనా? పెద్దలని మరిచిపోకండి” అని జోడించింది.

ఈ పార్టీ తరువాత పిల్లలు అరూప్ బాబు ని కథ చెప్పమని అడిగారు. అరూప్ బాబు జవాబు గా తనకి అలా ఉన్నపళంగా కథలు చెప్పడం రాదనీ, కానీ ఓ చిన్నప్పటి సంఘటన గురించి చెప్తాను అన్నాడు.

అరూప్ బాబు కుటుంబం చిన్నప్పుడు బంచారాం అక్రూర్ దత్తా వీథి లో ఉండేవారు. అతనికి సుమారు అయిదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళింట్లో ఓ ఖరీదైన గడియారం కనిపించకుండా పోయింది. అతడి తండ్రి ఆ ఊళ్ళోని ఓ మంత్ర విద్య తెలిసిన వాడిగా పేరుపడ్డ పండితుణ్ణి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పండితుడు “ఆ దొంగని నేను ఇట్టే పట్టేస్తాను” అన్నాడు. తరువాత ఓ పెద్ద కత్తెర తీసుకుని దాన్ని పటకారు లా పట్టుకుని, ఓ వెదురు బుట్ట తీసుకుని వచ్చాడు. ఏవో మంత్రాలు జపించి, కాస్త బియ్యాన్ని ఆ బుట్టపై చల్లి, మొత్తానికి ఆ దొంగ మరెవరో కాదు… ఇంట్లో కొత్తగా చేరిన పనివాడు నటవర్ అని తేల్ఛాడు. అరూప్ బాబు మామ ఆ నటవర్ ను జుట్టు పట్టి లాక్కొచ్చి చితకబాదుతూ ఉన్నప్పుడు గడియారం మంచం పై కప్పిన దుప్పటి లోంచి జారి నేల మీద పడ్డది.

– ఈ కథ ముగియగానే పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. అరూప్ బాబు ఇక వెళదామని బయలుదేరాడు కానీ, “వద్దొద్దు. వెళ్ళకండి. కాసేపు ఉండండి” అంటూ ఆ పిల్లలందరూ అడగడంతో ఆగాల్సి వచ్చింది. సుమారు అరడజను మంది పిల్లలు వెంటనే అక్కడి నుండి వెళ్ళి వాళ్ళు కొన్న అమలేశ్ మౌలిక్ రాసిన ఏడు పుస్తకాలతో తిరిగొచ్చారు. “ఈ పుస్తకాలపై మాకోసం సంతకం చేసి పెట్టరూ?” అని అడిగారు. అరూప్ బాబు వారితో – “నాకు ఇలా పుస్తకాల పై సంతకం చేసే అలవాటు ఎప్పుడూ లేదు. ఓ పని చేస్తా… ఇవి తీసుకెళ్ళి ఒక్కో పుస్తకం పై ఒక్కో బొమ్మ వేసి ఇస్తాను. ఎల్లుండి సాయంత్రం  నాలుగున్నరకి వచ్చి ఇవి తీసుకెళ్ళండి.” అన్నాడు. పిల్లలు మళ్ళీ చప్పట్లు కొట్టారు. “అవునవును, బొమ్మ అయితే సంతకం కంటే ఎక్కువ” అన్నారు.

అరూప్ బాబు స్కూల్లో చిత్రలేఖనం లో ఓ సారి బహుమతి గెలుచుకున్నాడు. కానీ, అప్పట్నుంచి ఎప్పుడూ మళ్ళీ బొమ్మలు గీయలేదు. అయినా కూడా ప్రయత్నిస్తే ఈ పుస్తకాల పై చిన్న చిన్న బొమ్మలు గీసి ఇవ్వడం అసాధ్యమేమీ కాదు కదా! తరువాతి రోజు శనివారం. అరూప్ బాబు ఉదయాన్నే ఈ పుస్తకాలు, పెన్నూ తీసుకుని బయలుదేరాడు. నూలియా కాలనీ వద్ద బొమ్మలు గీయడానికి బోలెడు దృశ్యాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. దాదాపు గంట పట్టింది అతని పని పూర్తయ్యే సరికి. మొదటి పుస్తకం లో ఎండ్రకాయ బొమ్మ గీసాడు. రెండో దానిలో ఇసుక పై పక్కపక్కనే పడున్న మూడు గవ్వల బొమ్మ, తరువాత ఓ కాకుల గుంపూ, ఓ చేపలు పట్టే పడవ, ఒక నూలియా గుడిసె, ఒక నూలియా పిల్లవాడు, ఇక చివరగా పదునైన చివర్లు ఉన్న ఓ టోపీ వేసుకుని ఉన్న నూలియా మనిషి చేపల వల తయారు చేస్తున్న దృశ్యం గీసాడు. ఆ ఏడుగురు పిల్లలూ చెప్పినట్లు గానే నాలుగున్నరకే వచ్చేసారు ఆదివారం నాడు. ఈ బొమ్మలు వేసిన పుస్తకాలు తీసుకుని ఆనందంగా నవ్వుతూ, తుళ్ళుతూ వెళ్ళిపోయారు. ఆరోజు రాత్రి నిద్రకుపక్రమిస్తూ అరూప్ బాబు తన మదిలో కంగారు, అందోళన వంటి భావాల స్థానం లో ఓ విధమైన ఆనందం కలగడం గమనించాడు. అతను ఇప్పటిదాకా ఎవరితోనూ “నేను అమలేశ్ మౌలిక్ ని” అని ఎవరితో చెప్పలేదన్నది నిజమే. కానీ, గత మూడు రోజులుగా అతను చేసినదంతా ఓ పెద్ద మోసం కిందే లెక్క. ఎల్లుండి మంగళవారం అసలు మౌలిక్ రాబోతున్నాడు. ఇప్పటి దాకా ఈ పిల్లల దగ్గర్నుంచీ, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర్నుంచీ తాను పొందిన అభిమానం ఆదరణ అంతా అసలుకి అతని చెందాల్సినవి. మౌలిక్ బాగా రాస్తాడా లేదా అన్నది కాదు ప్రశ్న. అతను వీళ్ళ దృష్టి లో ఓ హీరో అన్న విషయం తెలుస్తూనే ఉంది. ఒకవేళ అతను వచ్చి, సీవ్యూ మేనేజర్ అతని రాక గురించి అందరికీ చెప్పడం మొదలుపెడితే ఏమౌతుంది? ఈ ఆలోచనే అరూప్ బాబు కి చాలా ఇబ్బందిగా అనిపించింది.

మరి…ఓ రోజు ముందుగా వెళ్ళిపోతేనో? లేదంటే మంగళవారం అంతా ఏం చేయాలి? ఎక్కడ దాక్కోవాలి? జనాలకి నిజం తెలిస్తే తనను చితగ్గొట్టరూ? ఇక మౌలిక్ గారు ఏమంటారో! ఆయన కూడా చెయ్యెత్తవచ్చు. రచయితలందరూ శాంతికాముకులనీ, అహింసావాదులని ఎవరు చెప్పగలరు? ఇలాంటి పనులకి జైలుపాలు అయ్యే అవకాశం ఉందా? ఉందేమో. ఏది ఏమైనా తాను చేసింది తప్పనడం లో ఎలాంటి సందేహం లేదు. అరూప్ బాబు లేచి నిద్రలేమి భయం తో ఓ నిద్ర మాత్ర మింగాడు. చివరికి, ఏమైనా మంగళవారం రాత్రి ట్రైన్ కే వెళదాం అని నిశ్చయించుకున్నాడు. అసలు మౌలిక్ ఎలా ఉంటాడో చూడాలన్న తాపత్రేయం భయాన్ని మించిపోయింది. ఎలాగోలా మౌలిక్ ఫొటో పడ్డ పేపర్ ను సంపాదించాడు. తాను అనుకున్నట్లే మౌలిక్ కు సన్నని మీసం, రింగుల జుట్టు, సన్న ఫ్రేముల కళ్ళజోడు ఉన్నాయి. కానీ, ఇక ఎంతవరకూ ఈ పోలికలు ఉన్నాయో తెలుసుకోవాలంటే మనిషి ని చూడాల్సిందే. ఆ పేపర్ లో ఉన్న బొమ్మ స్పష్టంగా లేదు. అరూప్ బాబు స్టేషన్ కి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. కేవలం మౌలిక్ ని చూట్టానికే కాదు..వీలైతే మాట్లాడ్డానికి. “మీరు అమలేశ్ మౌలిక్ కదూ? మీ ఫొటో చూసాను పేపర్లో ఆ మధ్య. మీ కథలను చదవడం నాకు ఇష్టం…” ఇలా ఏదో మాట్లాడేసి తరవాత తన సామాన్లంతా స్టేషన్ లో వదిలి తాను ఇంత వరకు చూడని కోణార్క్ కి వెళ్ళిపోయి అక్కడ సూర్య భగవానుని ఆలయం చూసుకుని తరువాత కలకత్తా రైలు సమయానికి స్టేషన్ చేరుకుందాం అనుకున్నాడు. అంతకంటే దాక్కోడానికి మార్గం లేదు మరి!

మంగళవారం నాడు పూరీ ఎక్స్ప్రెస్ ఇరవై నిముషాలు ఆలస్యంగా వచ్చింది. అరూప్ బాబు ఓ స్థంభం వెనక నిలబడి ట్రైన్ లోని ఫస్ట్ క్లాసు బోగీల్లోంచి దిగుతున్న ప్రయాణికుల పై ఓ కన్నేసి ఉంచాడు. షార్ట్స్ వేసుకున్న ఓ విదేశీయుడు దిగాడు మొదట. పక్క వైపు తలుపు దగ్గర్నుంచి ఓ ముసలావిడ, ఆవిడకి సాయం చేస్తూ ఓ తెల్ల ప్యాంటు వేసుకున్న యువకుడూ దిగారు. వీళ్ళ తరువాత ఓ ముసలాయన, తరువాత – అవును, సందేహం లేదు… ఇతనే అమలేశ్ మౌలిక్. తామిద్దరి మధ్య పోలికలు బాగానే ఉన్నాయి. కానీ, అరూప్ బాబు వెళ్ళి అతని పక్కన నిలబడితే వీళ్ళిద్దరూ కవలలు అనుకునేంత ప్రమాదమైతే లేదు. మౌలిక్ అరూప్ బాబు కంటే పొట్టిగానూ, రంగు కూడా తక్కువగానూ ఉన్నాడు. కాస్త పెద్దవాడిలా కూడా అనిపించాడు – చెవుల వద్ద జుట్టు కాస్త తెల్లబడింది. అరూప్ బాబు ఇంకా అంత పెద్దవాడు కాలేదు. అతను తన సూట్‍కేసు ట్రైన్ నుంచి తీసుకుని కూలీ కోసం అరిచాడు. కూలీ, అరూప్ బాబు ఇద్దరూ ఒకే సారి అతని వద్దకు వెళ్ళారు.

“మిస్టర్ మౌలిక్ అనుకుంటా?”

– అతను ఆశ్చర్యంగా చూసాడు. తరువాత అరూప్ బాబు ని చూస్తూ తల ఊపాడు. “అవును” అన్నాడు పొడిగా.

కూలీ సూట్‍కేసు తీసుకుని తన తలపై పెట్టుకున్నాడు. అరూప్ బాబు వద్ద ఓ బ్యాగు, భుజానికి వ్రేళ్ళాడుతూ ఓ ఫ్లాస్కు ఉన్నాయి. ముగ్గురూ బయటకు వెళ్ళే ద్వారం వద్దకు నడవడం మొదలుపెట్టారు.

అరూప్ బాబు అతనితో – “మీ పుస్తకాలు చదివాను. మీరు అకడమీ అవార్డు గెలిచిన విషయం పేపర్లో చదివాను. మీ ఫొటో కూడా చూసాను” అన్నాడు.

“హుమ్…”

“మీరు సీవ్యూ హోటెల్ లో బుక్ చేసుకున్నారు కదూ?”

ఈ సారి అమలేశ్ మౌలిక్ అరూప్ బాబు వంక అనుమానాస్పదంగా చూసాడు. అతనేమి ఆలోచిస్తున్నాడు అన్న విషయం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.

“సీవ్యూ మేనేజర్ మీ అభిమాని. అతనే ఈ విషయం అందరికీ చెప్పాడు” – అరూప్ బాబు వివరించాడు.

“ఓహ్!”

“చాలా మంది పిల్లలు మీకోసం ఎదురుచూస్తున్నారు.”

“హుమ్”

ఈ మనిషేమిటి ఇంత తక్కువ మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నడక వేగం కూడా తగ్గింది.. ఏమాలోచిస్తున్నాడో?

ఇంతలో అమలేశ్ మౌలిక్ ఆగాడు. అరూప్ బాబు వైపు కి తిరిగి – “నేను వస్తున్నా అని చాలామందికి తెలిసిపోయిందా?” అని అడిగాడు.

“అవును. నాకర్థమయింది అదే. ఏం? మీకేమైనా ఇబ్బందా?”

“కాదు…కానీ నాకు ఒ…ఒ..ఒం…”

“ఒంటరిగా ఉండటం ఇష్టమా?”

“అవును”

ఇతనికి నత్తి ఉంది అన్న విషయం అర్థమౌతూనే ఉంది. ఇంగ్లాండు రాజు ఎనిమిదవ ఎడ్వర్డ్ గద్దె దిగాలని నిశ్చయించుకున్నాక అతని తమ్ముడు జార్జి కి దిగులు పట్టుకుంది తను రాజు కావడం గురించి. ఎందుకంటే తనకేమూ నత్తి, రాజన్నాక ఉపన్యాసాలు ఇవ్వాల్సి వస్తుంది అని! అరూప్ బాబు కి ఆ విషయం గుర్తు వచ్చింది. కూలీ సామాన్లు తీసుకుని గేటు వద్ద ఎదురుచూస్తున్నాడు. వీళ్ళిద్దరూ వడివడిగా అక్కడికి నడిచారు.

“కి..కి..కీర్తి కి ము..ము..మూల్యం ఇదే.”

అరూప్ బాబు ఇలా నత్తి తో మాట్లాడే తమ హీరో ని చూసిన ఆ పిల్లల పరిస్థితి ని ఊహించుకున్నాడు. అతని ఊహ లో కనబడ్డ విషయం అతనికి నచ్చలేదు.

“మీరు ఒక పని చేయవచ్చు” – స్టేషన్ బయటకు వస్తూ అమలేశ్ తో అన్నాడు.

“ఏమిటీ?”

“మీ సెలవంతా అభిమానుల వల్ల పాడుకావడం నాకు నచ్చలేదు.”

“నాక్కూడా”

“అప్పుడు సీవ్యూ కి వెళ్ళకండి.”

“ఎ..ఏమిటీ?”

“అక్కడ భోజనం అస్సలు బాగుండదు. నేను సాగరిక లో ఉన్నాను. నా రూమ్ ఖాళీగానే ఉంది. మీరు అక్కడికి వెళ్ళమని నా సలహా”

“ఓహ్!”

“ఇంకా..మీ అసలు పేరు ఉపయోగించకండి. మీరు ఆ మీసాలు పూర్తిగా తీసేస్తే మరీ మంచిది.”

“మీ..మీస్..”

“వెంటనే. ఇక్కడే వెయిటింగ్ రూమ్ కి వెళ్ళి రావొచ్చు దీని కోసం. ఓ పది నిముషాల కంటే పట్టదు అనుకుంటాను. ఈ పని చేసారంటే మిమ్మల్ని ఎవరూ గుర్తు పట్టరు. ఏకాంతం లో గడుపుదామని మీరు ఎంతగానో ప్లాన్ చేసుకున్న  మీ సెలవులకు ఎవరూ అంతరాయం కలిగించరు. నేను కలకత్తా నుండి కావాలంటే టెలిగ్రాం పంపుతాను సీవ్యూ వాళ్ళకి – మీరు మీ పర్యటన విరమించుకున్నారని.”

మౌలిక్ నుదుటి పై దిగులు కి చిహ్నంగా కనబడ్డ గీతలు పోవడానికి ఇరవై సెకన్లు పట్టింది. కళ్ళ దగ్గర, నోటి దగ్గరా కొత్త గీతలు ఏర్పడ్డాయి. అతను నవ్వుతున్నాడిప్పుడు.

“మీమీ..మీకు ఎలా కృ..కృ…తజ్ఞతలు చెప్పాలో..అర్ అర్థం…కావడం లేదు.”

“పర్లేదు. కానీ, దయచేసి మీరు ఈ పుస్తకాల పై సంతకాలు చేస్తారా నా కోసం? ఆ వేప చెట్టు కింద నిలబడదాం రండి, అక్కడైతే మనల్ని ఎవరూ కనిపెట్టలేరు.”

– ఆ చెట్టు వెనక నిలబడి అమలేశ్ తన ఎర్ర పార్కర్ పెన్ను ని జేబులోంచి తీస్తూ అరూప్ బాబు వైపు అభినందనాపూర్వకంగా చూసాడు. అవార్డు వచ్చిన రోజు నుండి ఎంతో సాధన చేసి తన సంతకం సరిగ్గా చేయడం నేర్చుకున్నాడు. అయిదు పుస్తకాలపై అయిదు సంతకాలు. తన నాలుక కి నత్తి అయినా కూడా తన కలానిది కాదు అని అతనికి తెలుసు.

Published in: on July 28, 2021 at 2:00 am  Leave a Comment  

ఒక కెనడియన్ ఆదివాసీ రచయిత్రి చెప్పిన మూడు కథలు

నేను ప్రస్తుతం Lee Maracle అన్న కెనడియన్ ఆదివాసీ రచయిత్రి రాసిన My Conversations with Canadians అన్న పుస్తకం చదువుతున్నాను. పుస్తకం సగంలోనే ఉన్నాను. ప్రస్తుతానికి నా అభిప్రాయం: ఎవరో వచ్చి రోజుకో లెక్చరిచ్చి లెక్చరుకో మొట్టికాయ, ఓ లెంపకాయ, పెడేల్మని ఓ చెంపదెబ్బ, ఇలా మార్చి మార్చి అంటిస్తున్నట్లు ఉంది. ఇలాంటిదొకటి మన ఆదివాసీ వాళ్ళెవరో కూడా రాసి దాన్ని భద్రలోక్ మే బాంబ్ షెల్ లాగా మన మధ్య వదలాలని నా ఆకాంక్ష. (ఇలా అన్నానని ట్రోల్ చేసేరు – చేయకండి).

ఈ పుస్తకంలో రచయిత్రి చెప్పిన రెండు మూడు నిజజీవితంలో జరిగిన కథలు నన్ను ఆకట్టుకున్నాయి. వాటిని ఈ పోస్టులో పంచుకుంటూన్నా. అన్నట్లు ఈ కథలకి ఈ తెలుగు టైటిల్స్ నా సృష్టే.

మొదటిది: తిమింగల సంగీతం

ఒకసారి ఆర్కటిక్ మహాసముద్రం ఉత్తర భాగంలో కొన్ని తిమింగలాలు మంచు గడ్డల మధ్య ఇరుక్కుపోయాయంట. సరే, శాస్త్రవేత్తలు అమెరికా, రష్యాల నుండి ఇట్లాంటి భారీ మంచుగడ్డలని పగలగొట్టే యంత్రాలకోసం అడిగారంట. కానీ అవి ఇక్కడికి చేరడానికి వారాలు, నెలలూ పట్టొచ్చు. ఇంతలోపు ఈ తిమింగలాలు బతకవేమో అని వాళ్ళ చింత. ఇది తెల్సి, ఆ ప్రాంతంలో ఉండే ఇనుయిట్ జాతి వారు మా సంప్రదాయ పద్ధతిలో తిమింగలాలతో సంభాషించగల సంగీతం ఉంది. మేము ప్రయత్నిస్తాం అన్నారంట. ఈ ఆలోచన కొంచెం విపరీతంగా అనిపించి మొదట శాస్త్రవేత్తలు ఒప్పుకోలేదు. అయితే, ఇంతలోపు ఓ తిమింగలం మరణించడంతో ఇక వీళ్ళని ప్రయత్నించనిద్దాం‌ అనుకున్నారు. ఇనుయిట్ వారు వాళ్ళ లెక్కల ప్రకారం మంచుగడ్డలకి అక్కడక్కడా రంధ్రాలు చేస్తూ వాళ్ళ సంగీతం గానం చేస్తే తిమింగలాలు వాళ్ళ గాత్రాన్ని అనుసరించి నెమ్మదిగా అలా అలా బైటకి వచ్చేశాయంట!! అసలలా ఎందుకు జరిగిందో ఎవరికీ తెలీదు కానీ ఇది వాళ్ళలో ఎప్పట్నుంచో ఉన్న పద్ధతేనట.

(ఈ సంఘటన ఏదో నాకు తెలియదు కానీ, ఇలా జంతువులతో సంభాషించే సంప్రదాయం గురించి ఒక వ్యాసం ఇక్కడ చదవొచ్చు).

రెండవది: ఫెమినిజం పుట్టిల్లు

Elizabeth Cady Stanton అన్నావిడ తొలితరం మహిళా హక్కుల ఉద్యమకారిణి. పందొమ్మిదో శతాబ్దపు అమెరికాలో ఈ విషయమై ఎంతో కృషి చేసింది. ఈవిడకి సెనెకా అన్న అమెరికన్ ఆదివాసీ తెగకి చెందిన స్నేహితురాలు ఉండేదంట. ఒకరోజు ఆ స్నేహితురాలు ఎవరో తెల్లాయన భూమి అమ్మకానికి పెడితే కొంటున్నా అని చెప్పిందంట. ఎలిజబెత్ ఆమెని “మీ ఆయన ఏమన్నాడు కొంటా అంటే?” అని అడిగితే ఆమె “ఏం అనలేదు. కొనేది నేను కదా” అన్నదట. ఆకాలంలో మహిళలు తమపాటికి తాము భూమి కొనడానికి అనర్హులు. ఎలిజబెత్ అదే అంటే ఆ స్నేహితురాలు – “అది తెల్లవాళ్ళ రాజ్యంలో రూలు. మాకు అలాంటివి లేవు” అన్నదట. అక్కడ నుంచే ఎలిజబెత్ ఆలోచనల్లోకి ఫెమినిజం, మహిళలలి ఓటు హక్కు వంటి భావనలు ప్రవేశించాయంట. (ఫెమినిజం అన్నది ఆదివాసీలకి ముందునుంచే ఉందని చెప్పడానికి ఈ కథ చెప్పింది రచయిత్రి).

(ఈ విషయం గురించి ఒక ఆసక్తికరమైన వ్యాసం ఫెమినిస్టు.కాం అన్న వెబ్సైటులో ఇక్కడ చదవొచ్చు)

మూడవది: ఎలుకతో పెట్టుకోకు

1993 లో నవాజో తెగ వారు నివసించే ప్రాంతంలో హంటావైరస్ వ్యాపించిందంట. శాస్త్రవేత్తలు ఇది ఎక్కడ్నుంచి వచ్చింది? అన్నది తెలుసుకోడానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక నవాజో యువకుడు వాళ్ళ తెగలోని ఓ పెద్దావిడని అడిగాడంట దీని గురించి. ఆమె వాళ్ళ కథల్లోంచి ఓ కథ చెప్పిందట – సారాంశం ఏమిటంటే మనిషీ, ఎలుకా ఒక ఇంట్లో ఉండకూడదు అని. శాస్త్రవేత్తలు చివరకి కనుక్కునది ఏమిటంటే ఆ వ్యాధి ఎలుకల ద్వారానే వీళ్ళ మధ్య వ్యాపించిందని.

(ఈ ఉదంతం గురించిన వికీ పేజీ ఇక్కడ)

ఇంకా ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి … పాయింటేమిటంటే ఎక్కడైనా అక్కడి ఆదివాసీల నోట్లోంచి వాళ్ళ కథలు వినాలని… నవ నాగరికులు అనుకునేంత తెలివితక్కువ వాళ్ళెవరూ లేరిక్కడ.. అని రచయిత్రి అభిప్రాయం.

ఇట్లాంటి పుస్తకం మాత్రం మనకూ ఒకటి ఒరిజినల్ ది పడాలి. పడి కొన్ని తలలు అయినా పగలగొట్టాలి అని కావాలంటే నేను సైతం ఓ వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను.

Published in: on July 24, 2021 at 5:25 am  Comments (1)  

ఆగంతకుడు -సత్యజిత్ రాయ్ కథ అనువాదం

(ఇది నేను 2007 నవంబర్ లో “ప్రజాకళ” తెలుగు వెబ్ పత్రికకి చేసిన అనువాదం. ఈ పత్రిక ఇప్పుడు లేదు. కనుక ఈ కథా అంతర్జాలంలో కనబడ్దం లేదు. ఆమధ్య పాతవన్నీ తవ్వుతూ ఉంటే ఇవి కూడా కనబడ్డాయి. సరే, ఎపుడైనా బ్లాగులో పెడదాం అనుకున్నాను. వీటికి అనుమతులు తీసుకోలేదు కనుక ఇపుడు కొత్తగా ఎవరికీ పంపకుండా, అప్పట్లో అలాంటి విషయాలు ఆలోచించకుండా చేసిన పనికి నేనే బాధ్యత తీసుకుంటున్నా బ్లాగులో పెట్టుకుని. అన్నట్లు ఇవాళ్టితో పదిహేనేళ్ళు నిండాయి ఈ బ్లాగుకి!).

“The Stranger” ఈ కథ పేరు. సత్యజిత్ రాయ్ “అతిథి” గా దీన్ని బెంగాలీ భాషలో రాయగా గోపా మజుందార్ ఆంగ్లంలోకి అనువదించారు. నేను ఆ‌ ఆంగ్ల కథని తెలుగులోకి అనువదించాను. ఈ కథనే రాయ్ Agantuk పేరిట బెంగాలీ సినిమా గా, ఉత్పల్ దత్ ప్రధాన పాత్రగా తీశారు.

*******************

మొంటూ కొన్నాళ్ళుగా తన తల్లిదండ్రులు ఒక తాతగారి రాక గురించి చర్చించుకుంటూ ఉండటం వింటూ ఉన్నాడు. చిన్న తాత అట. ఆయన అమ్మ వాళ్ళ చిన్న మామయ్య అట. అతని వద్ద నుండి ఉత్తరం వచ్చినప్పుడు మొంటూ ఇంట్లోనే ఉన్నాడు. అతని అమ్మ ఆ ఉత్తరాన్ని ఓ సారి చదివి కాస్త సున్నితంగా ఆశ్చర్యపడ్డది – “ఊహించనేలేదు!” అంటూ. తరువాత కాస్త గొంతు పెంచి నాన్నగారిని పిలిచింది. ఆయనేమో బయట వరండా లో తన బూట్లు రిపేరు చేయించుకుంటూన్నారు. తల ఎత్తకుండానే – “ఏమిటీ?” అన్నారు.

“మామయ్య ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాడట.” ఉత్తరం తో బయటకు వచ్చిన అమ్మ అన్నది.

“మావయ్యా?”

“మా చిన్న మావయ్య. గుర్తుందా?”

ఈసారి నాన్న గారు తల తిప్పి, కనుబొమలెగరేస్తూ – “నిజంగా? అంటే…ఆయనింకా బ్రతికే ఉన్నాడంటావా?” అన్నారు.

“ఇదిగో, ఆయన రాసిన ఉత్తరం. నిజానికి నాకాయనకి రాయడం వచ్చని కూడా తెలీదు.”

నాన్నగారు కుర్చీ చేతి పై పెట్టి ఉన్న కళ్ళజోడు తీసుకుని – “ఏదీ, ఇటివ్వు. ఓ సారి చూద్దాం.” అన్నారు.

ఆ పేపర్ లో రాసి ఉన్నది చదివాక ఆయన కూడా – “ఊహించనే లేదు!” అన్నారు. అమ్మ అక్కడే ఓ స్టూలు పై కూర్చుంది. ఎక్కడో ఏదో తేడాగా ఉందని అర్థమైంది మొంటు కి. నాన్నగారే మొదట మాట్లాడి, తన సందేహాలను బయటపెట్టారు. “ఆయనకి మన అడ్రస్ ఎలా తెలిసిందంటావ్? ఇంకా, ఆయన మేనకోడలు ఓ సురేశ్ బోస్ అనేవాడిని పెళ్ళిచేసుకుని ఈ మహ్మద్‍పూర్ లో ఉంటోందని ఎవరు చెప్పారు?”

అమ్మ కనుబొమలు ముడిపడ్డాయి. “శేతల్ మామ చెప్పి ఉండొచ్చు ఆయనకి.”

“శేతల్ మామ ఎవరు?”

“అయ్యో దేవుడా! అసలు మీకు ఒక్కటీ గుర్తుండదూ? శేతల్ మామ అంటే, ఆయన మా మావయ్యల పక్కింట్లో ఉండేవారు నీలకంఠపురం లో. మా కుటుంబానికి బాగా సన్నిహితుడు. మీరు ఆయన్ని చూసారు. మన పెళ్ళప్పుడు ఎవరితోనో పందెం కాశారు – యాభై ఆరు మిఠాయిలు తింటాను అని. అప్పుడు ఎంత నవ్వుకున్నాం అది తలుచుకుని!”

“ఓహ్! అవునవును! గుర్తొచ్చింది!”

“చిన్న మావయ్య కి ఆయన చాలా సన్నిహితుడు. నాకు తెలిసీ మొదట్లో చిన్న మావయ్య ఆయనకి మాత్రమే ఉత్తరాలు రాసేవాడు.”

“శేతల్ బాబు ఇక్కడికి ఓసారి వచ్చారు కదూ?”

“వచ్చారు కదా. ఎప్పుడబ్బా?..మన రానూ పెళ్ళికి వచ్చారు కదా! రాలేదూ?”

“అవునవును. సరే కానీ, మీ చిన మావయ్య ఇల్లొదలి వెళ్ళిపోయి సన్యాసుల్లో కలవలేదూ?”

“అనే నేను కూడా అనుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఉన్నట్లుండి మన ఇంటికి ఎందుకు వద్దామనుకుంటున్నాడో మరి, అర్థం కావడం లేదు.”

నాన్నగారు ఓ నిముషం ఆలోచించి – “ఇంకెవరింటికి వెళ్ళగలడు ఆయన? ఎవరూ లేరు కద. మీ అత్తలూ, మావయ్యలు ఇప్పుడు లేరు. నీకున్న ఇద్దరు బంధువులూ ఒకరు కెనడాలోనూ, ఒకరు సింగపూర్లోనూ ఉన్నారు. ఇక ఇక్కడ మిగిలిందెవరు? నువ్వు తప్ప?”

“నిజమే. కానీ, అసలు నేను సరిగా చూడనైనా చూడని వ్యక్తి ని ఎలా గుర్తుపట్టేది? ఆయన వెళ్ళిపోయినప్పుడు నాకు రెండేళ్ళు. ఆయనకి పదిహేడు.”

“నీ పాత ఆల్బం లో ఫొటో లేదా ఆయనది?”

“ఏం లాభం దాని వల్ల? ఆయనో పదిహేనేళ్ళవాడు ఆ ఫొటో లో. ఇప్పుడు సుమారు అరవై ఏళ్ళు ఉంటాయి ఆయనకి.”

“నిజమే…ఇదో సమస్య గా మారనుందనిపిస్తోంది.”

“బీనూ గది ఖాళీగానే ఉంది అనుకోండి ఆయనకివ్వడానికి…కానీ, ఆయనెలాంటి ఆహారం తింటాడో…ఎవరికి తెలుసు?”

“నాకు ఆ విషయం లో దిగుల్లేదు. మనం తినే ఆహారాన్నే తినొచ్చేమో?”

“అలా అని ఏముంది? నిజంగా సన్యాసి అయిపోయి ఉంటే ఆయన శాకాహారమే తింటాడు. అప్పుడు ఇక మనం రోజుకి అయిదు రకాల వంటలు చేయాలి.”

“ఈ ఉత్తరం లో రాసిన భాష మామూలుగానే ఉంది. అంటే నా ఉద్దేశ్యం….సాధువులు మాట్లాడే తరహా లో లేదు అని. పైగా, తేదీ వివరాలు ఇంగ్లీషు లో రాసాడు. అక్కడక్కడా ఇంగ్లీషు పదాలు వాడాడు. ఇక్కడ చూడు… ’అనవసరం’ అని ఇంగ్లీషు లోనే రాసాడు.”

“కానీ, తన చిరునామా ఇవ్వలేదు కదా?”

“నిజమే”

“సోమవారానికి ఇక్కడికి వస్తా అంటున్నాడు.”

తన తల్లిదండ్రులిద్దరూ ఈ విషయం లో కాస్త దిగులుగా ఉన్నారని మొంటూ కి అర్థమైంది. ఇది ఖచ్చితంగా ఓ వింత పరిస్థితే. ఒక పూర్తి కొత్తమనిషి ని మామయ్యగా ఎలా ఒప్పుకోగలరు ఎవరన్నా? మొంటూ ఈ తాత గురించి ఓ సారో,రెండుసార్లో విని ఉన్నాడు అంతే. స్కూలన్నా పూర్తిచేయకుండానే ఆయన ఇల్లు వదిలిపెట్టేసాడని మాత్రం తెలుసు. మొదట్లో కొంతమందికి అప్పుడప్పుడూ ఉత్తరాలు రాసేవాడు. కానీ, తరువాత అతని గురించి సమాచారం లేదు. మొంటూ అప్పుడప్పుడూ అతని గురించి ఆలోచించేవాడు. ఆయన వెనక్కొస్తే బాగుండు అని కూడా అనుకున్నాడు. కానీ, అలాంటివన్నీ కథల్లోనే జరుగుతాయని అతనికి తెలుసు. కథల్లో అయితే సాధారణంగా ఎవరో ఒకరు ఉంటారు, ఇలా వచ్చిన మనుష్యుల్ని గుర్తించేందుకు. ఇక్కడ ఎవరూ లేరు. ఎవరైనా సరే, వచ్చి “నేనే మీ తాతను” అనవచ్చు. నిర్థారించుకునే మార్గమేదీ లేదు. తాతగారు పదిరోజులకంటే ఎక్కువ ఉండరు.

తన చిన్నతనం అంతా బంగ్లాదేశ్ లోని ఓ చిన్న ఊరిలో గడిచింది. అందువల్ల ఆయనకి అలాంటి ఓ చిన్న ఊరుని ఓసారి చూడాలనిపించింది. నీలకంఠపురం లోని సొంతింటికి వెళ్ళడం లో అర్థం లేదు. ఎందుకంటే ఇప్పుడక్కడ ఎవరూ ఉండటం లేదు. అందుకని ఆయన మహ్మద్ పూర్ వద్దాం అనుకున్నారు. కనీసం ఇక్కడో మేనకోడలు ఉంటోంది. మొంటూ వాళ్ళ నాన్నగారు ఓ వకీలు. మొంటూ కి ఓ అన్న, ఓ అక్క ఉన్నారు. అక్కకి పెళ్ళి అయిపోయింది. అన్న కాన్పూర్ ఐఐటీ లో చదువుకుంటున్నాడు.

మొంటూ వాళ్ళమ్మ ఆదివారానికల్లా ఏర్పాట్లన్నీ చేసేసింది. మొదటి అంతస్థులో ఓ గది సిధ్దం అయింది. మంచం పై కొత్త దుప్పటి కప్పారు, దిండ్లకు కొత్త కవర్లు వేసారు. కొత్త సబ్బులూ,టవళ్ళూ కూడా పెట్టారు. తాతగారు తనంతట తానే స్టేషన్ నుండి ఇంటికి వస్తారు అన్నది వీళ్ళ ఆలోచన. తరువాతేం జరుగుతుందో ఇక వేచి చూడాల్సిందే. ఈరోజు ఉదయమే నాన్నగారు అన్నారు –

“అతను మీ మావయ్యో కాదో కానీ, కనీసం కాస్త నాగరికంగా ఉంటాడని, సభ్యత తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. లేకుంటే రాబోయే పదిరోజులు కాస్త కష్టకాలమే”

“నాకిదంతా నచ్చడం లేదు. అసలు ఆ మనిషెవరో మనకు తెలీదు. కానీ, అతనితో సహజీవనం చేయాలి కొన్నాళ్ళు. కనీసం తన చిరునామా కూడా పంపలేదు. పంపుంటే ఏదో ఓ కారణం చెప్పి రావద్దని చెప్పి ఉండొచ్చు…”

కానీ, మొంటూ ఆలోచనలు మరోలా ఉన్నాయి. వాళ్ళింటికి ఓ అతిథి వచ్చి చాలా రోజులైంది. తనకేమో వేసవి సెలవులు. రోజంతా ఇంట్లోనే ఉంటాడు. సిద్ధు,రమేశ్,అనీశ్,రతిన్,ఛోట్కా – ఇలా స్నేహితులెందరో ఉన్నారు కానీ, ఇంట్లోనే ఎవరన్నా ఉంటే సరదా గా ఉంటుంది. రోజంతా అమ్మా నాన్నలతోనే గడపాలని ఎవరికనిపిస్తుంది? పైగా, ఈ “అతను నిజమైన మావయ్యా కాదా?” అన్న తతంగం అంతా ఆసక్తికరంగానూ, అనుమానాస్పదంగానూ ఉంది. పొరపాట్న అతను నిజం మావయ్య కాకుండా ఎవరో ఆగంతకుడై, తాను ఆ విషయాన్ని కనిపెట్టాడంటే ఎంత అధ్భుతంగా ఉంటుంది? అతన్ని బయటపెట్టి తానో హీరో అవ్వొచ్చు.

సోమవారం ఉదయం పదిన్నర నుండీ మొంటూ ఇంటి గుమ్మం బయట తచ్చాడటం మొదలుపెట్టాడు. పదకొండుంపావు కి ఒక రిక్షా తమ ఇంటివైపు రావడం గమనించాడు. దానిలో ఉన్న వ్యక్తి దగ్గర ఓ మిఠాయిల డబ్బా, ఓ చర్మపు సూట్‍కేసు ఉన్నాయి. ఒక కాలు ఆ సూట్‍కేసు పైన పెట్టుకుని కూర్చున్నాడు అతను. అతనేమీ సాధువులా లేడు. కనీసం, ఆ దుస్తులు అలా లేవు. ప్యాంటూ,షర్టూ తొడుక్కున్నాడు. అమ్మ అరవై ఏళ్ళుండొచ్చు అన్నది కానీ, ఇతను అంతకంటే చిన్నగా అనిపించాడు. జుట్టు దాదాపు నల్లగానే ఉంది. కళ్ళజోడు ఉంది కానీ, మరీ అంత మందంగా ఏం లేదు. అతను రిక్షావాడికి డబ్బులిచ్చి, సూట్‍కేసు కింద పెట్టాడు. మొంటూ వైపు కి తిరిగి – “ఎవరు నువ్వు?” అని అడిగాడు. అతని గడ్డం నున్నగా గీయించుకున్నాడు. సూటిగా ఉన్న ముక్కు, చురుకైన కళ్ళు, వాటిలో ఓ చిన్న మెరుపు.

మొంటూ సూట్‍కేసు తీసుకుంటూ జవాబిచ్చాడు – “నా పేరు సాత్యకీ బోస్.”

“ఏ సాత్యకివి నువ్వు? కృష్ణుడి శిష్యుడివా లేక సురేశ్ బోస్ సుపుత్రుడివా? ఆ బరువైన సూట్‍కేస్ ఎత్తగలవా? దాన్నిండా పుస్తకాలు ఉన్నాయి.”

“ఎత్తగలను.”

“అయితే, లోపలికి వెళదాం పద.”

వాళ్ళు వరండా లోకి అడుగుపెట్టేసరికి అమ్మ ఎదురొచ్చి ఆయన కాళ్ళకి నమస్కరించింది. ఆయన మిఠాయిల డబ్బా ఆమెకి అందిస్తూ –

“నువ్వు సుహాసినివి అనుకుంటాను?” అన్నాడు.

“అవును.”

“మీ ఆయన వకీలు కదూ? పనికెళ్ళాడనుకుంటాను?”

“అవును.”

“నిజానికి, నేనిలా వచ్చి ఉండాల్సింది కాదేమో. నాకు కాస్త మొహమాటంగానే ఉండింది. కానీ, మళ్ళీ ఓ వృద్ధుడ్ని కొన్నాళ్ళు మీరు భరించగలరులే అనుకున్నాను. ఎంతైనా పది రోజులే కదా. పైగా శేతల్ నిన్ను ఒకటే పొగిడాడు. కానీ, మీ సమస్య నాకు తెలుసు…నేనే మీ మావయ్యనని చెప్పుకోగల సాక్షమేదీ లేదు నావద్ద. కనుక నేనేమీ ప్రత్యేకమైన ఆతిథ్యం కోసం ఎదురుచూట్టంలేదు. ఏదో, ఈ కప్పు కింద ఓ వృద్ధుడికి ఓ పదిరోజులపాటు ఆశ్రయం ఇవ్వండి. అంతే.”

అమ్మ ఆ తాతగారిని ఓరగా చూస్తూ ఉండటం మొంటూ గమనించాడు. ఇప్పుడు ఆమె –

“స్నానం చేస్తారా?” అని అడిగింది.

“మీకు ఏమీ ఇబ్బంది లేదంటేనే..”

“లేదులేదు..మాకేం ఇబ్బంది లేదు. మొంటూ, వెళ్ళి పైన స్నానాలగది చూపించు. ఇంకా.. హుమ్..మీకు… ఎటువంటి ఆహారం ఇష్టమో..నాకు పెద్దగా తెలీదు..”

“నేను ఏదైనా తింటాను. మీరు ఏది తినిపించాలనుకుంటే అది తింటాను. ఇది నిజం.”

తరువాత – “స్కూలుకెళతావా నువ్వు?” మెట్లెక్కుతూ అతను మొంటూ ని అడిగాడు.

“వెళ్తాను. సత్యభామా హైస్కూల్. ఏడవ తరగతి.”

ఈ క్షణం లో మొంటూ ఓ ప్రశ్న అడక్కుండా ఉండలేకపోయాడు.

“మీరు సాధువు కాదా?”

“సాధువా?”

“అమ్మ మీరు సాధువు అయ్యారని చెప్పింది.”

“ఓ! అదా! అది ఎప్పుడో చాలా కాలం క్రితం. నేను ఇంటినుండి సరాసరి హరిద్వార్ వెళ్ళాను. నాకు ఇంట్లో ఉండటం నచ్చలేదు..అందుకని వెళ్ళిపోయాను. కొన్నాళ్ళు నిజంగానే రిషీకేశ్ లో ఓ సాధువు వద్ద ఉన్నాను. కానీ, స్థిరంగా అక్కడ ఉండలేక మళ్ళీ కదిలాను. తరువాత నేనే సాధువు దగ్గరికీ వెళ్ళలేదు.”

మధ్యాహ్నం భోజనం అతను బాగా ఆస్వాదిస్తూ తిన్నాడు. అతనికి మాంసాహారం తినడానికి మొహమాటమేమీ లేదని అతను చేపల్ని, కోడి గుడ్లను వద్దనకపోవడంలోనే అర్థమైంది. అమ్మ ఇది చూసి ఊపిరి పీల్చుకోవడం మొంటూ గమనించాడు. కానీ, ఆవిడ ఒక్కసారి కూడా ఆయన్ను “మావయ్యా” అని పిలవలేదు. మొంటూ మాత్రం “చింతాతయ్య” అని పిలవాలని చాలా ఆరాటపడ్డాడు. అతను భోజనం ముగించి ఓ కప్పులో పెరుగు తీసుకుంటూ ఉండగా ఏదో ఒకటి మాట్లాడాలని కాబోలు, మొంటూ వాళ్ళమ్మ అతనితో – “బెంగాలీ వంట తినకుండా చాలాకాలం గడపాల్సి వచ్చిందేమో కదూ మీరు?” అన్నది.

అతను నవ్వి – “కలకత్తా లో కొంతవరకూ రుచి చూసాను, ఈ రెండు రోజుల్లో. కానీ, దానికి ముందు….మీరంతా ఎన్నాళ్ళుగా నేను దానికి దూరంగా ఉన్నానో తెలిస్తే ఆశ్చర్యపోతారు.” అన్నాడు.

ఆవిడ మరిక మాట్లాడలేదు. మొంటూ – “ఎందుకలా? అసలు మీరెక్కడుంటారు?” అని అడగలనుకున్నా కూడా తనను తాను నియంత్రించుకున్నాడు. ఒకవేళ అతను ఎవరో దొంగైతే అతనికి ఇలా కట్టు కథలు చెప్పే అవకాశం ఇవ్వకూడదు. తనంతటతానుగా ఏదన్నా చెప్పేవరకూ ఆగుదాం అనుకున్నాడు. కానీ, అతనేమీ మాట్లాడలేదు. ఆయన నిజంగా నలభై ఏళ్ళు ఇలా దేశాటనల్లోనే గడిపి ఉంటే మాట్లాడ్డానికి బోలెడు విషయాలు ఉండి ఉండాలి. కానీ, మరి ఎందుకు అతను మౌనంగా ఉన్నాడు?

తన తండ్రి కారు చప్పుడు వినవచ్చేసరికి మొంటూ పైన ఉన్నాడు. వాళ్ళ అతిథి ఒక పుస్తక సహితంగా నడుంవాల్చాడు. అంతకుముందే మొంటూ అతనితో ఓ అరగంట గడిపాడు. మొంటూ ఆ గది ముంది తచ్చాడుతుంటే ఆయన లోపలికి పిలిచాడు.

“ఓ కృష్ణుని శిష్యుడా! లోపలికి రావచ్చు. నేన్నీకోటి చూపిస్తాను.”

మొంటూ వెళ్ళి మంచం పక్కనే నిలబడ్డాడు.

“ఇదేమిటో నీకు తెలుసా?” – అడిగాడు అతను.

“రాగి నాణెం.”

“ఎక్కడిది?”

మొంటూ ఆ నాణెం మీద రాసినది ఏమిటో చదవలేకపోయాడు.

“దీన్ని లెప్టా అంటారు. ఇది గ్రీకు దేశం లో ఉపయోగిస్తారు. ఇంకా…ఇదేమిటి?”

మొంటూ దీన్ని కూడా గుర్తు పట్టలేకపోయాడు.

“ఇది ఒక కురు. టర్కీ దేశానిది. ఇది రొమేనియాది – బాని అంటారు. ఇదిగో..ఈ నాణెం ఇరాక్ ది-ఫిల్ అంటారు.”

అలా అతను దాదాపు పది దేశాల నాణేలను చూపించాడు మొంటూ కి. మొంటూ ఆ దేశాల పేర్లు విననుకూడా లేదు.

“ఇవన్నీ నీకే.”

మొంటూ ఆశ్చర్యపోయాడు. ఏమంటున్నాడు ఆయన? అనీశ్ వాళ్ళ అంకుల్ కూడా నాణేలు సేకరిస్తాడు. ఆయన ఓ సారి మొంటూ కి అలా నాణేలు సేకరించేవారికి న్యుమిస్మటిస్ట్స్ అంటారని చెప్పాడు. కానీ, ఆయన వద్ద కూడా ఇన్ని రకాల నాణేలు లేవు. మొంటూ ఈ విషయం లో చాలా నమ్మకంగా ఉన్నాడు.

“నేను వచ్చేచోట నాకో మనవడు ఉంటాడని తెలుసు. అందుకనే ఈ నాణేలు నా వెంట తేవాలని నిశ్చయించుకున్నాను.”

గొప్ప ఉత్సాహం లో మొంటూ పరుగెత్తుతూ మెట్లు దిగి ఈ నాణేలు అమ్మకి చూపడానికి వెళ్ళాడు. కానీ, నాన్న గొంతు విని ఆగిపోయాడు. ఆ తాతగారి గురించి ఏదో అంటున్నాడు నాన్న.

“…పది రోజులు! ఇది కాస్త ఎక్కువే. మనమంత తేలిగ్గా మోసపోమని ఆయనకి చెప్పాలి. ఆయనకి ప్రత్యేకమైన ఆతిథ్యం ఏం ఇవ్వనక్కరలేదు. మనం ఈ మర్యాదలూ అవీ చేయకపోతే ఆయన బహుశా తొందరగానే వెళ్ళిపోవచ్చు. మన జాగ్రత్తల్లో మనముండాలి. ఈరోజు సుధీర్ తో మాట్లాడాను ఈ విషయం. అతనో సలహా ఇచ్చాడు. అల్మారాలు, కప్‍బోర్డులూ అన్నీ తాళం వేసేయి. మొంటూ రోజంతా ఆయనకి కాపలా కాయలేడు కదా. వాడిక్కూడా స్నేహితులున్నారు, వాడు వాళ్ళతో ఆడుకోడానికి వెళ్తాడు. నేను పనికి వెళ్తాను. అంటే ఇంట్లో నువ్వూ, సదాశివ్ మాత్రమే ఉంటారు. సదాశివ్ ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు, నాకు తెలుసు. నువ్వు కూడా మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చాలనుకుంటావ్ కదూ?”

“మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను.” – మొంటూ తల్లి అన్నది.

“ఏమిటి?”

“ఈ మనిషి లో కాస్త మా అమ్మ పోలికలు ఉన్నాయి.”

“నిజమా?”

“అవును. ఆ ముక్కు, ఆ చూపు అలాగే ఉన్నాయి.”

“సరే,సరే. ఆయన మీ మామయ్య కాదు అనడం లేదు నేను. కానీ, మీ మామయ్య ఎలాంటివాడో తెలీదు కదా మనకు. పెద్దగా చదువుకోలేదు, ఓ క్రమశిక్షణా పాడూ లేకుండా వీథులవెంట తిరిగాడు… చెప్తున్నా కదా…నాకీ వ్యవహారం ఏ మాత్రం నచ్చడం లేదు.”

మొంటూ తండ్రి మాట్లాడ్డం ఆపగానే ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అతనికి తండ్రి మాటలు నచ్చలేదు. ఆ కొన్ని గంటల్లోనే అతనికి ఆ కొత్తవ్యక్తి అంటే ఆసక్తి ఏర్పడింది. బహుశా ఈ నాణేలను చూసి నాన్నగారు మనసు మార్చుకుంటారేమో, అనుకున్నాడు.

“నిజంగా ఆయనే ఇచ్చాడా నీకు ఇవన్నీ?”

మొంటూ తల ఊపాడు.

“తను ఈ దేశాలన్నింటికీ వెళ్ళానని చెప్పాడా నీతో?”

“లేదు. అతనా మాట అనలేదు.”

“అయితే సమస్య లేదు. ఇలాంటి నాణేలు కలకత్తా లో దొరుకుతాయి. అక్కడ ఇలాంటివి అమ్మేవాళ్ళు ఉన్నారు.”

నాలుగున్నర అవుతూ ఉండగా ఆ మనిషి నాన్నగారిని కలవడానికి కిందకి వచ్చాడు.

“మీ అబ్బాయి, నేను అప్పుడే స్నేహితులం అయిపోయాం.” అన్నాడు

“అవును, వాడు చెప్పాడు.”

నాన్నగారు అతన్ని ఇందాక అమ్మ చూసినట్లే కొన్ని సార్లు అతన్ని ఓరగా గమనించారు.

“నాకు పిల్లలతో స్నేహం చాలా త్వరగా కుదిరిపోతుంది. బహుశా పెద్దవాళ్ళకంటే వాళ్ళు నన్ను బాగా అర్థం చేసుకుంటారేమో.”

“మీరు జీవితాంతం ఊరూరూ తిరుగుతూనే ఉన్నారా?”

“అవును. నేను ఎప్పుడూ ఒక చోట కూడా స్థిరంగా ఉండలేదు.”

“మేము అలా కాదు. ఓ లక్ష్యం అంటూ లేకుండా అలా తిరగలేము. నాకు కొన్ని బాధ్యతలున్నాయి – కుటుంబం పట్ల, పిల్లల్ని చూసుకోవాలి, ఉద్యోగం చేయాలి. మీరు పెళ్ళి చేసుకోలేదు కదూ?”

“లేదు.”

కొన్ని నిముషాల మౌనం తరువాత అతను – “సుహాసిని కి గుర్తు లేకపోవచ్చు కానీ, తన ముత్తాతల్లో ఒకరు – అదే, మా తాత-ఆయన కూడా ఇలాగే చేసారు. పదమూడేళ్ళ వయసులో ఇల్లు వదిలి వెళ్ళారు. నేను అప్పుడప్పుడూ కొద్దిరోజుల కోసం వచ్చేవాణ్ణి. ఆయనైతే మళ్ళీ రానే లేదు.”

మొంటూ తన తండ్రి తల్లి వైపు చూట్టం గమనించాడు.

“నీకు తెలుసా ఈ విషయం?”

“ఒకప్పుడు గుర్తుండేది అనుకుంటా…కానీ, ఇప్పుడేం గుర్తురావడం లేదు.” అన్నది అమ్మ.

టీ తరువాత ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. మొంటూ స్నేహితులకి ఈ వింత బంధువు గురించి తెలిసింది. ఇతను అసలు బంధువే కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయని అర్థమయ్యాక ఆయన్ని చూడాలన్ని ఉబలాటం కొద్దీ వాళ్ళందరూ మొంటూ ఇంటికి వచ్చారు. తాతగారికి ఇంతమంది పదేళ్ళ లోపు పిల్లల్ని కలవడం ఆనందం కలిగించినట్లు అనిపించింది. తన చేతికర్రను తీసుకుని వాళ్ళందరిని బయటకు తీసుకెళ్ళాడు. అక్కడికి కాస్త దూరం లో మైదానం లో ఉన్న ఓ చెట్టుకింద ఆగారు. అక్కడ నేలపై కూర్చున్నారు, కబుర్లు చెప్పుకునేందుకు.

“తువరేగ్స్ అంటే ఏమిటో తెలుసా?”

అందరూ తల అడ్డంగా ఊపారు.

“సహారా ఎడారి లో ఒక సంచార తెగ ఉంది -తువరెగ్స్ అని. వాళ్ళు బాగా సాహసులు. దేనికీ వెనుకాడరు – దొంగతనమైనా సరే, హత్యలైనా సరే. వాళ్ళనుండి తప్పించుకున్న ఓ తెలివైన వాడి కథ చెబుతాను, వినండి.”

పిల్లలందరూ ఈ కథని అమితాసక్తితో విన్నారు. మొంటూ తన తల్లితో తరువాత చెప్పాడు –

“ఆయన కథ ఎంత బాగా చెప్పాడంటే – మాకు అదంతా నిజంగా చూస్తున్నట్లే అనిపించింది.”

అతని తండ్రి ఆ మాటలు అప్రయత్నంగా విని – “ఇతను చాలా విరివిగా చదివినట్లు అనిపిస్తోంది. నాకు ఇలాంటి కథే ఓ ఇంగ్లీషు పత్రిక లో చదివినట్లు గుర్తు.” అన్నాడు.

తాత గారి పెట్టెనిండా పుస్తకాలున్నాయని తనకి తెలుసని, కానీ అవి అన్నీ కథల పుస్తకాలో కావో తెలీదని మొంటూ తన తల్లిదండ్రులతో అన్నాడు.

మూడురోజులు గడిచాయి. ఏ దొంగతనమూ జరగలేదు, ఆ అతిథి ఎలాంటి సమస్యనూ తేలేదు. పెట్టిందేదో ఆనందంగా తిన్నాడు. ఏ కోరికలూ కోరలేదు. దేనిగురించీ పేచీ పెట్టలేదు. మొంటూ వాళ్ళ నాన్న ఆఫీసు వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు. ఇది ఎప్పుడో అరుదుగా కానీ జరగదు. మొంటూ ఆంచనా ప్రకారం వాళ్ళు అందరూ ఈ అసలో-నకిలీనో తెలీని మనిషి చూడడానికే వచ్చారు. తాతగారు అక్కడ ఉండటాన్ని మొంటూ తల్లిదండ్రులు ఒప్పుకునట్లే కనిపించారు. మొంటూ తన తండ్రి – “అతను చాలా సామాన్యంగా జీవించే వ్యక్తి అని ఒప్పుకోవాల్సిందే. పైగా, అతను మరీ అతిస్నేహంగా ఉండటానికి ప్రయత్నించడం లేదు. కానీ, ఎవరన్నా ఇలా ఎలా బ్రతుకుతారో అర్థం కావడం లేదు. అతను బాధ్యతల నుండి తప్పించుకోవడానికే ఇంటి నుండి పారిపోయాడు. ఇలాంటి వాళ్ళు ఉత్త పరాన్నజీవులు. ఇలాగే జీవితాంతం ఇంకోళ్ళ పై ఆధారపడి ఉంటాడు.” – ఇలా ఎవరితోనో చెబుతూఉండటం విన్నాడు ఓ రోజు.

మొంటూ ఓ రోజు ఆయన్ని “చిన తాతా” అని పిలిచాడు. ఆయన మొంటూ వైపు ఓ సారి తిరిగి, చిన్నగా నవ్వాడు. అంతకు మించి ఏమీ అనలేదు. మొంటూ తల్లి ఒక్క సారి కూడా “మావయ్యా” అని పిలవలేదు. మొంటూ ఈ సందేహం తల్లి ముందు వెలిబుచ్చితే, ఆమె – “ఆయన ఆ విషయం ఎక్కువ పట్టించుకుంటున్నట్లు లేడు. ఒకవేళ ఆయన ఎవరో ఆగంతకుడు అయితే? అప్పుడెంత ఇబ్బందిగా ఉంటుంది?”

నాలుగోరోజు ఆ అతిథి బయటకు వెళ్ళి వస్తానని అన్నాడు. “నీలకంఠపూర్ కి బస్సు ఉంది కదా?” – అడిగాడు.

“అవును, ఉంది. మెయిన్ మార్కెట్ నుండి ప్రతి గంటకూ ఓ బస్ వెళుతుంది అక్కడికి.” – నాన్న జవాబు.

“భోజనం ఇక్కడే చేస్తారు కదూ?” – మొంటూ తల్లి అడిగింది.

“లేదు. ఎంత త్వరగా వెళితే అంత మంచిది. నేనెక్కడ దార్లో భోంచేస్తాను. నా గురించి పెద్దగా ఆలోచించకండి.”

తొమ్మిది కాకముందే బయలుదెరాడు ఆయన. మధ్యాహ్నం మొంటూ ఇక ఉత్సుకత ఆపుకోలేక పోయాడు. తాతగారి గది ఖాళీగా ఉంది. మొంటూ కి చాలా కుతూహలంగా ఉంది ఆ సూట్‍కేస్ లో ఉన్న పుస్తకాలు ఎలాంటివో అని. నాన్న ఇంట్లో లేడు. అమ్మ కింద విశ్రాంతి తీసుకుంటోంది. దాంతో మొంటూ తాతగారి గదిలోకి వెళ్ళాడు. ఆ సూట్‍కేస్ కి తాళం లేదు. అంటే, ఆ మనిషి కి దొంగతనం గురించిన బాధ లేదల్లే ఉంది. మొంటూ ఆ సూట్‍కేసు తెరిచాడు. కానీ, లోపల పుస్తకాలు లేవు. ఉన్నవి కూడా సరైనవిగా లేవు. అవి నోటు పుస్తకాలు..సుమారు ముప్ఫై రకాలున్నాయి. వీటిలో దాదాపు పది పుస్తకాలు బైండింగ్ చేసి ఉన్నాయి. మొంటూ ఒకటి తెరిచాడు. బెంగాలీ లో రాసి ఉంది. చేతిరాత అందంగా, స్పష్టంగా ఉంది. ఒక పుస్తకం తీసుకుని మంచం పైకి ఎక్కాడు మొంటూ. కానీ, వెంటనే దిగేయాల్సి వచ్చింది. చప్పుడు చేయకుండా మొంటూ తల్లి పైకి వచ్చింది.

“ఏం చేస్తున్నావ్ మొంటూ? ఆయన వస్తువులు పాడు చేస్తున్నావా?”

మొంటూ మంచి పిల్లాడిలా ఆ పుస్తకం ఆయన పెట్టెలో పెట్టేసి బయటకి వచ్చాడు.

“నీ గదికి నువ్వు వెళ్ళు. వేరే వాళ్ళ వస్తువులతో నువ్వు అలా ఆడుకోకూడదు. వెళ్ళి నీ పుస్తకాలు నువ్వు చదువుకో.”

ఆ అతిథి సాయంత్రం ఆరు దాటాక ఇంటికి తిరిగివచ్చాడు. అదే రోజు రాత్రి భోజనాలప్పుడు అతను చెప్పిన విషయం వీళ్ళందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

“నేను రేపు వెళ్ళిపోతాననుకుంటా, బహుశా. మీ ఆతిథ్యం లో తప్పు పట్టడానికేం లేదు కానీ, నాకే ఓ చోట ఎక్కువకాలం స్థిరంగా ఉండటం చేత కాదు. “

ఈ విషయం విని తన తల్లిదండ్రులేం పెద్దగా బాధపడలేదు అని మొంటూ కి తెలుసు. కానీ, తనకే బాధగా అనిపించింది.

“ఇక్కడ నుండి మీరు కలకత్తా వెళతారా?” – నాన్న అడిగాడు.

“అవును. కానీ, ఎక్కువకాలం ఏమీ ఉండను. త్వరలోనే ఇంకెక్కడికో వెళతాను. నేనెప్పుడూ ఇంకోళ్ళకి భారం కాకూడదనే ప్రయత్నించాను. ఇల్లు వదిలి వచ్చినప్పటినుండీ నేను పూరి స్వతంత్రంగానే జీవించాను.”

ఈ సమయం లో మొంటూ తల్లి అతని మాటలకి అడ్డుకట్ట వేస్తూ-

“ఎందుకు మిమ్మల్ని మీరు భారం అనుకుంటారు? మాకే విధమైన ఇబ్బందీ కలుగలేదు.” అన్నది.

కానీ, మొంటూ కి తెలుసు, అది నిజం కాదని. ఎందుకంటే అతను ఓ రోజు తండ్రి పెరిగిపోయిన ధరల గురించీ, ఇంకో మనిషి వస్తే అతనికి పెట్టడం కూడా ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో చెప్పడం విన్నాడు.

ఆ అతిథి ని స్టేషన్ లో దిగబెట్టడానికి మొంటూ, అతని తండ్రి – ఇద్దరూ వెళ్ళారు. మొంటూ కి తన తండ్రి ఇంకా కాస్త ఇబ్బంది పడుతూనే ఉన్నట్లు తోచింది. అతనికి తెలుసు, ట్రైన్ వెళ్ళిపోయాక కూడా నాన్న గారు ఇంకా తమతో ఇన్నాళ్ళు గడిపి వెళ్ళిన మనిషి అసలు అతనన్నట్లు తమ బంధువేనా? అని ఆశ్చర్యపోతూనే ఉన్నారని.

ఓ వారం తరువాత మరో పెద్దాయన వచ్చాడు వాళ్ళ ఇంటికి. మొంటూ వాళ్ళమ్మ వాళ్ళ శేతల్ మామ. మొంటూ అతన్ని ఒకే ఒకసారి చూసాడు – తన అక్క పెళ్ళప్పుడు.

“ఓహ్! శేతల్ మామా! మీరా…ఏమిటి, ఇలా వచ్చారు?”

“బాధ్యత. నిజానికి రెండు బాధ్యతలు, ఒకటి కాదు. కాకపోతే నా వయసులో ఉన్న వృద్ధుడు పాసెంజర్ రైలెక్కి మరీ ఇలా ఎందుకు ప్రయాణం చేసి వస్తాడనుకున్నావు? నేనీరోజు మీతో భోంచేస్తున్నాను – ఇదే నా హెచ్చరిక.”

“మీరిక్కడే భోజనం చేసి తీరాలి. ఏం తింటారు? ఇక్కడ కలకత్తా లాగ కాదు. ఏదైనా దొరుకుతుంది.”

“ఆగు,ఆగు. నేనేం చేయాలని వచ్చానో నన్ను పూర్తి చేయనీ.” అంటూ ఆయన తన భుజానికున్న సంచీలోంచి ఓ పుస్తకం తీసాడు.

“మీరీ పుస్తకం గురించి విని ఉండరు కదూ?”

మొంటూ వాళ్ళమ్మ ఆ పుస్తకం తీసుకుని చూసి – “లేదు. ఏం?”

“పులిన్ మీకు చెప్పలేదని నాకు తెలుసు.”

“పులినా?”

“మీ చిన మావయ్య! మీతో ఇక్కడ ఐదు రోజులు గడిపిన మనిషి. అసలు అతని పేరు కూడా కనుక్కోవాలి అనుకోలేదు కదూ? ఈ పుస్తకం పులిన్ రాసిందే.”

“ఆయన రాసాడా?”

“మీరు పేపర్లు చదవరా? ఈమధ్యే అతని పేరు వచ్చింది. ఈ కోవకు చెందిన ఆత్మకథలు ఎన్నున్నాయి చెప్పండి మన సాహిత్యం లో?”

“కానీ..కానీ…ఈ పేరు వేరేలా ఉంది..”

“అదొక మారుపేరు. అతను ప్రపంచమంతా చుట్టి వచ్చాడు. అయినా, ఎంత నిగర్విగా ఉన్నాడు!”

“ప్రపంచమంతానా?”

“మన దేశం పులీన్ రే వంటి సంచారిని ఎప్పుడూ చూసి ఉండలేదు అని నేను నమ్ముతున్నాను. ఇదంతా అతను తన సొంత డబ్బుల్తో చేసాడు. ఓడపై పని చేశాడు, కూలీ గా, చెక్క వ్యాపారం లో కార్మికుడిగా, వార్తాపత్రికలు అమ్మేవాడిగా, చిన్న దుకాణదారుగా, లారీ డ్రైవరు గా – ఓ పని అంటూ లేకుండా అన్ని పనులూ చేసాడు. ఏ పనినీ చిన్నదిగా చూడలేదు. అతని అనుభవాలు కల్పనకన్నా వింతగా అనిపిస్తాయి. ఓ సారి పులి బారిన పడ్డాడు, ఓ సారి పాము కాటుకు గురయ్యాడు, ఓ సారి సహారా ఏడారి లోని ఓ ప్రమాదకరమైన సంచార తెగవారి నుండి తప్పించుకున్నాడు. ఓ ఓడ ప్రమాదం లో మడగాస్కర్ తీరం దాకా ఈదాడు. అతను భారతదేశాన్ని 1939 లో వదిలిపెట్టి ఆఫ్గనిస్తాన్ వెళ్ళాడు. మన ఇంటి సరిహద్దులు దాటి బయటకు వస్తే ప్రపంచమంతా మన ఇల్లే అని అతని అభిప్రాయం. అప్పుడిక తెల్లవాళ్ళు-నల్లవాళ్ళని, పెద్దా-చిన్నా అని, నాగరికులు-అనాగరికులు అన్న తేడాలేం ఉండవు.”

“కానీ..ఆయన ఇదంతా మాకు చెప్పలేదే?”

“మీ సంకుచిత మైన మనస్తత్వం తో మీరు ఆయన చెప్పేవి విని నమ్మగలిగేవారా? అసలతను అసలా? నకిలీనా? అన్నదే మీరు నిర్ణయించుకోలేకపోయారు. ఒక్కసారన్నా నువ్వు అతన్ని “మావయ్యా!” అని పిలిచావా? మళ్ళీ మీరేమో అతనే అన్నీ చెప్పాలని ఆశిస్తున్నారు!”

“ఓ! ఎంత బాధాకరం! మేము ఆయన్ని తిరిగి రమ్మని అడగలేమా?”

“లేదు. పక్షి ఎగిరి పోయింది. తను బాలి కి ఎప్పుడూ వెళ్ళలేదని చెప్పాడు. బహుశా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ పుస్తకం మీకిమ్మని..అదే మీ అబ్బాయికి ఇమ్మని ఇచ్చాడు. వాడింకా పిల్లవాడు. ఈ పుస్తకం వాడి మీద కొంత ప్రభావం చూపవచ్చు అని అన్నాడు.” అన్నాడు శేతల్ మామ.

“కానీ, వాడెంత పిచ్చిగా ప్రవర్తించాడో మీకింకా చెప్పలేదు. నేను వాణ్ణి ఇంకొణ్ణాళ్ళు ఉండమని బ్రతిమాలాను. ఆ పుస్తకానికి అకాడెమీ పురస్కారం వస్తుందని నాకు తెలుసు. ఈ మధ్య అకాడెమీ వాళ్ళు పదివేలు ఇస్తున్నారు. కానీ, వాడు నా మాట వినలేదు. ఏమన్నాడో తెలుసా? – ’ఒక వేళ ఏదన్నా నాకు డబ్బు వస్తే, మహ్మద్ పూర్ లో ఉన్న నా మేనకోడలికి ఇవ్వు. నన్ను బాగా చూసుకుంది.’ అని చెప్పి దాన్నే కాగితం పై పెట్టాడు. ఇదిగో డబ్బు – తీసుకో.”

అమ్మ శేతల్ మామ నుండి ఆ కవరు తీసుకుని కళ్ళు తుడుచుకుంటూ ఉద్వేగం నిండిన గొంతుతో అన్నది – “ఊహించనే లేదు!” అని.

Published in: on July 16, 2021 at 1:00 am  Comments (4)  

ఇద్దరు ఇంద్రజాలికులు – సత్యజిత్ రాయ్ కథ అనువాదం

(ఇది నేను 2007 నవంబర్ లో “ప్రజాకళ” తెలుగు వెబ్ పత్రికకి చేసిన అనువాదం. ఈ పత్రిక ఇప్పుడు లేదు. కనుక ఈ కథా అంతర్జాలంలో కనబడ్దం లేదు. ఆమధ్య పాతవన్నీ తవ్వుతూ ఉంటే ఇవి కూడా కనబడ్డాయి. సరే, ఎపుడైనా బ్లాగులో పెడదాం అనుకున్నాను. కానీ ఇంతలో ఒకరు ఈమెయిల్ పంపారు – నువు గతంలో సత్యజిత్ రాయ్ కథలు అనువాదం చేశావు కదా… అవెక్కడ ఉన్నాయి? ఫలానా కథ (ఇదే!) కోసం వెదికితే గూగుల్ సర్చిలో కనబడలేదు అని. నేను “ఏమిటీ, దాదాపు పదిహేనేళ్ళ క్రితం అనువాదం చేసింది కథావస్తువుతో సహా వీళ్ళకి గుర్తుండడమా?” అని ఆశ్చర్యంతో, సిగ్గుతో తలమునకలైపోయి కోలుకున్నాక, ఇక వీటిని బ్లాగులో పెడదాం అని నిర్ణయించుకున్నాను. వీటికి అనుమతులు తీసుకోలేదు కనుక ఇపుడు కొత్తగా ఎవరికీ పంపకుండా, అప్పట్లో అలాంటి విషయాలు ఆలోచించకుండా చేసిన పనికి నేనే బాధ్యత తీసుకుంటున్నా బ్లాగులో పెట్టుకుని).

“The Two Magicians” ఈ కథ పేరు. సత్యజిత్ రాయ్ బెంగాలీ భాషలో రాయగా గోపా మజుందార్ ఆంగ్లంలోకి అనువదించారు. నేను ఆ‌ ఆంగ్ల కథని తెలుగులోకి అనువదించాను.

******************

“ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు” – సురపతి పెట్టెలని లెక్కపెట్టడం ముగించి తన సహాయకుడు అనిల్ వైపుకి తిరిగాడు.

“సరిగానే ఉన్నాయి. ఇవన్నీ వ్యాన్ లోకి తరలించండి. మనకు ఇరవై ఐదు నిముషాలే ఉంది ఇంకా.” – అన్నాడు.

అనిల్ సురపతి తో – “నేను రిజర్వేషన్ సరిచూసాను సార్. మీది ఫస్ట్ క్లాస్ కూపే. రెండు బెర్తులూ మీ పేరు మీదే రిజర్వు చేయించాను. అంతా బానే ఉంటుంది” అని, కాస్త నవ్వుతూ – “గార్డు మీ అభిమాని అట. మీరు న్యూ ఎంపైర్ వద్ద ఇచ్చిన ప్రదర్శనను చూసాడట. ఇటు వైపు, ఇటు రండి సార్..”

గార్డ్ బీరేన్ బక్షి ముందుకు వచ్చి, నవ్వుతూ చేతిని ముందుకు చాచాడు. “నాకెంతో ఆనందం కలిగించిన ఆ ఇంద్రజాలమంతా ప్రదర్శించిన ఈ చేతికి కరచాలనం చేసే అదృష్టాన్ని నాకు కలిగించండి. ఇది నిజంగా నా అదృష్టం.” అన్నాడు.

సురపతి మండోల్ పదకొండు పెట్టెల్నీ చూస్తే చాలు అతనెవరన్నదీ మనకు అర్థమైపోతుంది. ప్రతి దానిపైనా – “మండోల్ మాయలు” అని పెద్ద అక్షరాలతో మూత పైనా, పక్కల్లోనూ రాసి ఉంది. ఆయన గురించి కొత్త పరిచయం అక్కర్లేదు. కలకత్తా లోని న్యూ ఎంపైర్ థియేటర్ లో ఆయన చివరి ప్రదర్శన జరిగి రెండు నెలలన్నా కాలేదు. జనం ఆయన ప్రదర్శనకి ముగ్థులై చప్పట్లతో గది అంతా హోరెత్తించారు. వార్తాపత్రికల్లో కూడా గొప్ప సమీక్షలు వచ్చాయి. వారం కోసమని మొదలైన ప్రదర్శన నాలుగు వారాల దాకా సాగింది. చివరికి మళ్ళీ క్రిస్మస్ సమయంలో వస్తానని సురపతి నిర్వాహకులకి మాట ఇవ్వాల్సి వచ్చింది.

“మీకేమన్నా సాయం కావాలంటే చెప్పండి.” సురపతి ని కూపే లోకి పంపుతూ గార్డు అన్నాడు. సురపతి ఓ సారి ఆ కూపేని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ చిన్న కంపార్ట్మెంట్ అతనికి నచ్చింది.

“సరే సార్, నేనింక సెలవు తీసుకుంటాను.”

“చాలా థాంక్స్!”

గార్డు వెళ్ళిపోయాడు. సురపతి కిటికీ దగ్గర కూర్చుని సిగరెట్ పాకెట్ బయటకి తీసాడు. తన విజయానికి ఇది ప్రారంభం మాత్రమే అని అనుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్: డిల్లీ, ఆగ్రా, అలహాబాద్, వారణాసి, లక్నో. ఇంకా ఎన్నో రాష్ట్రాలకి వెళ్ళాలి. ఎన్నో..ఎన్నేన్నో ప్రదేశాలకి వెళ్ళాలి. ఓ కొత్త ప్రపంచం అతనికోసం ఎదురుచూస్తోంది. తను విదేశాలకి వెళతాడు. ఒక బెంగాలీ యువకుడు ప్రపంచం లో ఎక్కడైనా కూడా విజయం పొందగలడు అని వాళ్ళకి చూపాలి.. ప్రఖ్యాతి చెందిన హౌడినీ పుట్టిన గడ్డ అమెరికా లో కూడా. అవును, అందరికీ తాను చూపిస్తాడు. ఇది ప్రారంభం మాత్రమే.

అనిల్ ఆయాసపడుతూ వచ్చాడు. “అంతా బానే ఉంది.” అన్నాడు.

“తాళాలు అవీ చూసావా?”

“చూసాను సర్.”

“మంచిది”

“నేను మీనుంచి మూడో భోగీలో ఉంటాను.”

“లైన్ క్లియర్ సిగ్నల్ ఇచ్చారా ట్రైన్ కి?”

“ఇవ్వబోతున్నారు. నేనిక వెళతానండి. మీకు బుర్ద్వాన్ వద్ద ఓ కప్పు టీ ఇమ్మంటారా?”

“ఇవ్వు. బాగుంటుంది.”

“సరే, అప్పుడు తీసుకొస్తాను.”

అనిల్ వెళ్ళిపోయాడు. సురపతి సిగరెట్ వెలిగించి పరధ్యానంగా కిటికీలోంచి చూడటం మొదలుపెట్టాడు. హడావుడిగా తిరుగుతున్న జనం, పరుగెడుతున్న కూలీలూ, బండివాళ్ళ కేకలు – అన్నీ క్రమంగా కరిగిపోయాయి. అతని మనసు చిన్నతనం లోకి వెళ్ళింది. ఇప్పుడు అతనికి ముప్ఫై మూడేళ్ళు. ఆ రోజు తనకి ఎనిమిదేళ్ళుంటాయేమో. తాను ఉంటున్న పల్లెటూరిలో ఓ వీథిలో ఓ ముసలామె కూర్చుని ఉండింది. ఆమె ముందు ఓ గోనె సంచి ఉండింది. చుట్టూ బోలెడంతమంది జనం. ఎంత వయసుండొచ్చు ఆమెకి? అరవయ్యా? తొంభైయ్యా? ఎంతన్నా ఉండొచ్చు. ఇక్కడ విషయం ఆమె వయసు కాదు, ఆమె చేతుల్తో చేసిన మాయాజాలం. ఆమె ఒక నాణెమో..ఒక గోళీనో, ఒక వక్క ముక్క నో లేదా ఓ జామ పండు నో తీసుకుంటుంది చేతుల్లోకి. తర్వాత అది ఆ చూస్తున్న జనం కళ్ళముందే మాయమైపోతుంది. ఆ ముసలామె ఇలాగే చేస్తూ ఉంది చివరికి ఆ మాయమైన వస్తువు ఎక్కడ్నుంచో మళ్ళీ వచ్చేవరకు. కాలూ కాకా దగ్గర్నుంచి ఓ రూపాయ తీసుకుంది. అది మాయమైపోయింది. దిగులు పడ్డ కాకా క్రమంగా సహనం కోల్పోతున్నప్పుడు ఆ ముసలామె నవ్వింది. వెంటనే, ఆ రూపాయి నాణెం అక్కడుంది, అందరి ముందూ. కాకా కళ్ళు బయటకి పొడుచుకొచ్చాయి ఆశ్చర్యం లో.

ఇక సురపతి ఆరోజు మరేమీ చేయలేకపోయాడు. ఆ ముసలామె మళ్ళీ కనబడలేదు. అలాంటి అద్భుతమైన ప్రదర్శన కూడా ఎక్కడా కనబళ్ళేదు. అతనికి పదహారేళ్ళ వయసప్పుడు పైచదువుల కోసం కలకత్తా వచ్చాడు. రాగానే చేసిన మొదటి పని ఇంద్రజాల విద్య పై దొరికినన్ని పుస్తకాలు కొనడం. తర్వాత ఆ పుస్తకాల్లో చెప్పిన చిట్కాలను అభ్యసించడం మొదలుపెట్టాడు. అలా గంటల తరబడి పేకముక్కలతో అద్దం ముందు నిలబడి, పుస్తకం లో చెప్పిన సూచనలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ, ఎన్నోసార్లు గడిపాడు. త్వరలోనే అతను అవన్నీ అర్థంచేసుకుని వాటిలో మంచి నైపుణ్యం సంపాదించాడు. తరువాతినుండి అప్పుడప్పుడూ తమ స్నేహితుల ఇళ్ళల్లో చిన్న చిన్న సందర్భాల్లో ప్రదర్శించడం మొదలుపెట్టాడు. కాలేజీ రెండో సంవత్సరం లో ఉండగా అతని స్నేహితుల్లో ఒకడైన గౌతం తన చెల్లెలి పెళ్ళికి సురపతిని ఆహ్వానించాడు. తరువాత అది ఇంద్రజాల విద్యార్థి గా అత్యంత మధురమైన సాయంత్రంగా మిగిలింది సురపతికి. ఎందుకంటే, అతను త్రిపుర బాబు ని మొదటిసారిగా కలిసింది ఆరోజే.

స్విన్హో వీథి లోని ఓ ఇంటి వెనుక ఓ పెద్ద షామియానా వేసి ఉంది. త్రిపురచరణ్ మల్లిక్ దాని కింద కూర్చుని ఉన్నాడు. కొంతమంది పెళ్ళికొచ్చిన అతిథులు ఆయన చుట్టూ గుమిగూడి ఉన్నారు. మొదటి సారి చూస్తే ఆయన చాలా సాధారణంగా అనిపించాడు. సుమారు నలభైఎనిమిదేళ్ళ వయసూ, ఉంగరాల జుట్టూ, పెదాలపై చిరునవ్వు, పాన్ రసంతో నిండిన పెదాల చివర్లూ, రోజూ వారి జీవితంలో చూసే వందలకొద్దీ మనుష్యులకంటే పెద్ద వేరు అయిన వాడేమీ కాదు. కానీ, ఓ సారి ఆ తివాచీ పైన జరుగుతున్నది చూసిన ఎవరికైనా ఈ అభిప్రాయం లో మార్పు రాక తప్పదు. సురపతి మొదట తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఒక వెండి నాణెం కాస్త దూరం లో పెట్టిన బంగారు ఉంగరం వైపు దొర్లుకుంటూ వెళ్ళింది. వెళ్ళి ఉంగరం పక్కన ఆగింది. తరువాత అవి రెండూ త్రిపుర బాబు వైపు దొర్లుతూ వచ్చాయి. సురపతి ఆ ఆశ్చర్యం నుండి తేరుకునే లోపు, గౌతం మామయ్య అగ్గిపెట్టె కిందపడింది. దానితో అందులోని పుల్లలన్నీ చెదిరి కింద పడ్డాయి.

“ఇప్పుడు అవన్నీ ఎత్తడం గురించి చింతించకండి. నేను తీసిస్తాను మీకు.” అంటూ త్రిపుర బాబు తన చేతిని ఒక్కసారి వాటిమీదుగా పోనిచ్చి ఆ పుల్లల్ని ఓ కుప్పగా పోసి తివాచీ పై పెట్టాడు. తరువాత ఖాళీ అగ్గిపెట్టెను తన చేతిలోకి తీసుకుని, ఆ పుల్లలవైపు చూస్తూ, “నా వద్దకు రా, నా వద్దకు రా…రా” అన్నాడు. దానితో ఆ అగ్గిపుల్లలన్నీ గాలిలోకి లేచి ఒకదానివెంటఒకటి ఆ అగ్గిపెట్టెలోకి వెళ్ళిపోయాయి, త్రిపుర బాబు పెంపుడు జంతువులు తమ యజమాని ఆజ్ఞ్న శిరసావహించినట్లు. సురపతి సరాసరి ఆయన వద్దకు వెళ్ళాడు భోజనం తర్వాత. అతని ఆసక్తి కి త్రిపుర బాబు కి ఆశ్చర్యం కలిగింది.

“చాలావరకు అందరూ ఓ ప్రదర్శన చూసి ఆనందించేవాళ్ళే కానీ, ఎవరూ ఇలా నేర్చుకోడానికి ఆసక్తి చూపడం నేను చూళ్ళేదు.” అన్నాడు సురపతి తో.

కొన్నాళ్ళ తరువాత సురపతి అతని ఇంటికి వెళ్ళాడు. దాన్ని ఇల్లు అనడం కష్టం. త్రిపుర బాబు ఓ పాత పాడుబడిన ఇంటిలో ఓ చిన్నగదిలో నివాసముంటున్నాడు. ప్రతి అడుగులోనూ పేదరికం తాండవమాడుతోంది. తన ఇంద్రజాల విద్యతో ఎలా డబ్బు సంపాదిస్తున్నాడో త్రిపుర బాబు సురపతి కి చెప్పాడు. తను షో కి యాభై రూపాయలు తీసుకుంటాననీ, కానీ ఈ మధ్య ఎవరూ తనని అడగడం లేదు అని చెప్పాడు. కానీ, సురపతి కి అర్థమైంది – త్రిపురబాబు కి ప్రదర్శకులు లేకపోవడానికి కారణం అతని నిరాసక్తతే అని. అంతటి మేధావిలో ఏదో సాధించాలన్న తపన లేకపోవడం సురపతి కి ఆశ్చర్యం కలిగించింది. అదే మాట త్రిపుర బాబుతో అంటే, ఆయన నిట్టూర్చి –

“ఏం లాభం ఇంకా ప్రదర్శనలు ఇవ్వడం వల్ల? ఎంత మందికి ఆసక్తి కలుగుతుంది?నిజమైన కళాకారుడి ప్రతిభ గుర్తించే వారు ఎవరు? నువ్వే చూసావు కదా, మొన్న పెళ్ళి లో నా ప్రదర్శన అవగానే భోజనాలంటే అందరూ ఎలా వెళ్ళిపోయారో! నువ్వొక్కడివి తప్ప ఎవరన్నా వచ్చి నేర్పించమని అడిగారా చెప్పు?”

సురపతి తన స్నేహితులతో మాట్లాడి త్రిపుర బాబు చేత కొన్ని ప్రదర్శనలు ఇప్పించాడు. త్రిపుర బాబు కొంత కృతజ్ఞతతోనూ, కొంత సురపతి పై కలిగిన అభిమానం తోనూ అతనికి ఇంద్రజాల విద్య నేర్పడానికి ఒప్పుకున్నాడు.

“నాకు డబ్బులేమీ ఇవ్వనక్కరలేదు.” – అతను స్థిరంగా అన్నాడు సురపతితో. “నా తదనంతరం ఈ విద్యను కొనసాగించేందుకు ఎవరో ఒకరు ఉన్నందుకు ఆనందంగా ఉంది కూడానూ. కానీ ఒక్క విషయం – నువ్వు చాలా ఓపిగ్గా ఉండాలి. హడావుడిగా ఏదీ నేర్చుకోలేము. నువ్వు ఏదన్నా సరిగా నేర్చుకుంటే నీకు దాన్ని చేయడం లో ఉన్న ఆనందం తెలుస్తుంది. ఉన్నపళంగా నీకు బోలెడంత పేరూ,కీర్తీ రావాలని ఆశించకు. అయినా, నువ్వు జీవితంలో నాకంటే మంచి స్థితి లోనే ఉంటావు. ఎందుకంటే నాలో లేనిది, నీలో ఉన్నది ఒకటుంది – గెలవాలన్న తపన.”

కాస్త భయంగా సురపతి ఆయన్ని – “మీకు తెలిసినవన్నీ నేర్పుతారా నాకు? ఆ నాణెం, ఉంగరం మాయ కూడానా?” అని అడిగాడు.

దానికి జవాబుగా త్రిపుర బాబు నవ్వి “ఏదన్నా కూడా ఒక్కో మెట్టూ ఎక్కుతూ నేర్చుకోవాలి. ఓపిక, కష్టపడి పని చేయడం – ఈ తరహా విద్యల్లో ఇవి రెండూ ఎంతో ముఖ్యం. ఈ విద్య ఎప్పుడో ప్రాచీన కాలం లో మనిషి మనసుకున్న శక్తి, ఇంకా దీక్షా ఇప్పటికంటే చాలా ఎక్కువున్న రోజుల్లో వృద్ధి చెందింది. ఆధునిక మానవుడు ఆ స్థాయికి రావడం చాలా కష్టం. నేనెంత కష్టపడ్డానో నీకు తెలీదు.” అన్నాడు.

సురపతి త్రిపుర బాబు వద్దకు తరుచుగా వెళ్ళడం మొదలుపెట్టాడు.కానీ, ఓ ఆర్నెల్ల తరువాత అతని జీవితాన్నే మార్చివేసే సంఘటన ఒకటి జరిగింది. ఒక రోజు కాలేజీ కి వెళ్ళే దారిలో ఛౌరింగీ గోడలపై రంగురంగుల పోస్టర్లు కనిపించాయి. “షెఫాలో – ది గ్రేట్” అని రాసి ఉంది వాటిపై. కాస్త పరికించి చూస్తే అర్థమైంది – షెఫాలో అంటే ఇటలీకి చెందిన ఇంద్రజాలికుడు అని. అతను తన సహాయకురాలు మేడమ్ పలెర్మో తో కలిసి కలకత్తా వస్తున్నాడని అర్థమైంది.

వాళ్ళు న్యూ ఎంపైర్ లో ప్రదర్శన ఇచ్చినప్పుడు సురపతి ఒక్క రూపాయి టికెట్ కొనుక్కుని ప్రతి దృశ్యాన్నీ రెప్పవేయకుండా చూసాడు. గతంలో అతను ఇలాంటి వాటి గురించి పుస్తకాల్లో మాత్రమే చదివి ఉన్నాడు. మనుషులు తన కళ్ళముందే పొగలోకి వెళ్ళి మాయమయ్యి, మళ్ళీ అదే పొగలోంచి అల్లాద్దీన్ అద్భుతదీపం లో భూతం లా బైటకు వచ్చారు. ఒక చెక్కపెట్టెలో ఓ అమ్మాయిని పడుకోబెట్టాడు షెఫాలో. తర్వాత ఆ డబ్బా ని రెండు ముక్కలుగా నరికాడు. కానీ, ఆ అమ్మాయేమో ఇంకో డబ్బాలోంచి నవ్వుతూ బైటకి వచ్చింది. దెబ్బలు కూడా తగల్లేదు. చప్పట్లు కొట్టి కొట్టి సురపతి చేతులు నొప్పి పుట్టాయి ఆ రోజు. అతను షెఫాలో ని జాగ్రత్తగా గమనించాడు. షెఫాలో ఎంత గొప్ప ఇంద్రజాలికుడో అంత గొప్ప నటుడని గుర్తించాడు. అతను వేసిన నల్ల కోటు మెరిసిపోతోంది. చేతిలో ఓ చిన్న కర్ర, తలపై ఓ టోపీ. అతనోసారి తన చేయి ఆ టోపీ లోకి పెట్టి ఓ కుందేలుని చెవితో లాగుతూ బైటకు తీసాడు. ఆ అల్పజీవి తన చెవుల్ని విదిలించుకునేలోపే ఒకదాని వెంట ఒకటి నాలుగు పావురాళ్ళు బయటకు వచ్చి స్టేజి వద్దే ఎగరడం మొదలుపెట్టాయి. ఇంతలోగా షెఫాలో టోపీలోంచి చాక్లెట్లు తీసి ప్రేక్షకుల వైపు విసరడం మొదలుపెట్టాడు. సురపతి మరో విషయం గమనించాడు – ఇంత జరుగుతున్నా కూడా షెఫాలో ఒక్క నిముషం కూడా మాట్లాడ్డం ఆపలేదు. తర్వాత తెలుసుకున్నాడు దాన్ని magician’s patter అంటారని. అతని వాక్ప్రవాహం లో జనం కొట్టుకుపోతున్నప్పుడు వాళ్ళు గమనించకుండా అతను తన హస్త లాఘవాన్నీ, కాస్తంత మోసాన్ని చేసి, విద్యని ప్రదర్శించేవాడు. అయితే, మేడమ పలర్మో వేరు. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ, అందర్నీ ఎలా మోసపుచ్చగలిగింది? సురపతికి కొన్నాళ్ళ తరువాత దీనికి జవాబు దొరికింది.

కొన్ని అంశాలు ఇంద్రజాలికుడి చేతికి ఎక్కువపని లేకుండానే ప్రదర్శించవచ్చు. అక్కడ మొత్తం స్టేజి ని గుప్పిట్లో పెట్టుకునేవి ఇంద్రజాలికుడి చేతులు కావు. బాగా సాంకేతికంగా బలమైన యంత్రాలు. స్టేజి పై ఉన్న నల్లటి తెర వెనుక ఉన్న మనుష్యులు వాటిని పనిచేయిస్తూ ఉంటారు. పొగలోకి మాయమయ్యే మనిషి, డబ్బా ముక్కలు చేసినా దెబ్బ తగలని అమ్మాయి – ఇలాంటివి ఆ యంత్రాలపైనే ఆధారపడి ఉంటాయి. డబ్బున్నవాళ్ళెవరైనా కూడా ఆ యంత్రాలు కొని ఇవి చేయవచ్చు. కానీ, ప్రదర్శించే కళ అందరికీ ఉండదు కదా. బోలెడంత ఆసక్తి, తగిన మోతాదు లో ప్రదర్శనా సామర్థ్యం ఉంటే కానీ సాధ్యం కాదు. ప్రతి ఒక్కరికీ అలా ప్రదర్శించడం చేత కాదు. ప్రతి ఒక్కరికి…..

సురపతి తన కలల్లోంచి ఉలిక్కిపడి లేచాడు. ట్రైన్ స్టేషన్ నుండి కాస్త వేగంగా కదలడం మొదలైంది. అప్పుడే తన కూపే తలుపు తెరుచుకుని బయటనుండి ఒక వ్యక్తి లోపలికి వస్తున్నాడు. సురపతి అడ్డు చెప్పబోయాడు కానీ అతని మొహం చూడగానే ఆశ్చర్యపోయాడు. ఓహ్! అతను త్రిపురబాబు! త్రిపుర చరణ్ మల్లిక్!

సురపతి కి ఇలా ఒకటి రెండు సార్లు అయింది…తను ఒక మనిషి గురించి తలుచుకుంటూ ఉంటే ఆ మనిషి తన ముందుకి రావడం. కానీ, ఇలా తన కూపే లోకి త్రిపుర బాబు రావడం వాటిని అన్నింటినీ మరిపించింది. సురపతి నోటమాట రానట్లు ఉండిపోయాడు. త్రిపుర బాబు తన కండువా అంచుతో నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుని, తన చేతి సంచీని ఎదురుగా ఉన్న బెంచీ మీద పెట్టి కూర్చున్నాడు. “ఆశ్చర్యంగా ఉంది కదూ?” అన్నాడు సురపతి తో, నవ్వుతూ. సురపతి కష్టపడి మాట్లాడుతూ…

“నేను…అది… నిజమే…చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు నాకు మీరు బ్రతికున్నారా లేదా అనే సందేహంగా ఉండేది.”

“నిజమా?”

“నిజం. నేను మీ నా కాలేజీ చదువు అవగానే మీ ఇంటికి వెళ్ళాను. అది తాళం వేసి ఉంది. అక్కడి మేనేజర్ మీరు కారు కింద పడి మరణించారని చెప్పాడు..”

త్రిపురబాబు నవ్వాడు. “అలా జరిగినా బాగుండేది. ఈ కష్టలనుండి, బాధలనుండీ నాకు విముక్తి లభించి ఉండేది.” అన్నాడు.

“పైగా, ఇప్పుడే నేను మీ గురించి అనుకుంటూ ఉన్నాను.”

“నిజంగా? నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? అంటే… ఇంకా నేను గుర్తు ఉన్నానా? ఆశ్చర్యంగా ఉంది.”

సురపతి ఇబ్బందిగా పెదాలు కొరుక్కున్నాడు. “అలా అనకండి త్రిపుర బాబూ! మిమ్మల్నెలా మర్చిపోతాను? మీరు నా మొదటి గురువు కదా! నేను మనం కలిసున్న రోజుల గురించి ఆలోచిస్తున్నాను. బెంగాల్ అవతల ఇవ్వబోతున్న మొదటి ప్రదర్శనకు వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఇంద్రజాలికుడిగా ప్రదర్శనలు ఇస్తున్నా. మీకు తెలుసా?”

త్రిపుర బాబు తల ఊపాడు. ” నాకు తెలుసు నీ గురించి. అందుకే నీ దగ్గరికి వచ్చాను. గత పన్నెండేళ్ళుగా నీ ఎదుగుదలని నేను గమనిస్తూనే ఉన్నాను. న్యూ ఎంపైర్ లో నువ్వు ప్రదర్శన ఇచ్చినప్పుడు నేను మొదటిరోజే వచ్చి చివరి వరుసలో కూర్చున్నాను. అందరూ నిన్ను ఎలా మెచ్చుకున్నారో చూసాను. నాకు గర్వంగా అనిపించింది..కానీ…” అంటూ ఆగిపోయాడు.

సురపతి కి ఏం చెప్పాలో తోచలేదు. అక్కడ చెప్పడానికి కూడా ఏమీ లేదు. త్రిపుర బాబు బాధపడి, తనను పట్టించుకోలేదు అనుకున్నా ఆశ్చర్యం లేదు. సురపతి కి మొదట్లో త్రిపురబాబు తారసపడకపోయి ఉంటే అతను ఈ స్థితి లో ఉండేవాడే కాదు. కానీ, బదులుగా సురపతి చేసింది ఏముంది? ఏమీ లేదు. పైగా, తన తొలి రోజులనాటి త్రిపుర బాబు జ్ఞాపకాలు అతని మది నుండి క్రమంగా తెరమరుగౌతున్నాయి… అప్పటి కృతజ్ఞతా భావం కూడా. త్రిపుర బాబు మళ్ళీ మాట్లాడ్డం మొదలుపెట్టాడు –

“అవును, ఆ రోజు నిన్ను చూసి, నీ విజయాన్ని చూసీ గర్వించాను. కానీ, నాక్కాస్త బాధ కలిగింది. ఎందుకో తెలుసా? నువ్వు వెళుతున్న దారి నిజమైన ఇంద్రజాలికుడికి సరి అయిన దారి కాదు. నీ ప్రేక్షకులకి నువ్వు బోలెడంత కాలక్షేపం కలిగించి వాళ్ళ మెప్పు పొందొచ్చు ఈ సాంకేతిక యంత్రాలని ఉపయోగించి. కానీ, ఈ విజయం నీది కాదు. నీకు నా తరహా ఇంద్రజాలం గుర్తుందా?”

సురపతి మర్చిపోలేదు. తనకి త్రిపుర బాబు కి తెలిసిన గొప్ప మాయలని చెప్పేటప్పుడు త్రిపురబాబు కొంత సంశయిస్తూ ఉండేవాడు.

“నీకు ఇంకాస్త సమయం కావాలి.” అనేవాడు. కానీ, ఆ సమయం ఎప్పటికీ రాలేదు. షెఫాలో వచ్చాడు ఇంతలో. రెండు నెల్ల తరువాత త్రిపుర బాబే మాయమైపోయాడు. సురపతి త్రిపుర బాబు అలా కనిపించకుండా వెళ్ళిపోవడం తో ఆశ్చర్యపోయాడు. దిగులు పడ్డాడు కూడా. కానీ, ఇదంతా కొంతకాలమే. అతని మనసంతా షెఫాలో, భవిష్యత్తు గురించిన కలలతో నిండి ఉంది. రకరకాల స్థలాల్లో పర్యటించాలని, ప్రతి చోటా ప్రదర్శనలు ఇవ్వాలనీ, అందరూ తనని గుర్తించాలని, ఎక్కడికెళ్ళినా చప్పట్లు, పొగడ్తలే ఎదురవ్వాలనీ…ఇలా ఉండేవి అతని ఆలోచనలు.

****************************************

త్రిపుర బాబు అన్యమనస్కంగా కిటికీ లోంచి బైటకి చూస్తున్నాడు. సురపతి అతన్ని ఓ సారి పరికించి చూసాడు. త్రిపుర బాబు కష్టాల్లో ఉన్నట్లు అనిపించింది. దాదాపు జుట్టంతా తెల్లబడింది. చర్మం ముడతలు పడింది. కళ్ళు బాగా లోతుకి వెళ్ళిపోయాయి. కానీ… వాటి లోని మెరుపు కొంతైనా తగ్గిందా? లేదు… ఆ చూపు ఎప్పటిలాగే సూటిగా ఉంది.

త్రిపుర బాబు ఓ నిట్టూర్పు విడిచి – ” నాకు తెలుసు – సాదాసీదా గా ఉంటే ఈ వృత్తి లో నిలదొక్కుకోలేమని నీ అభిప్రాయం అని… కొంతవరకు నేను కూడా దానికి కారణమేమో. స్టేజి పై ప్రదర్శన అంటే కాస్త సాంకేతికత, కాస్తంత హంగూ ఆర్భాటం ఉండాలి అనుకుంటా కదా?” అన్నాడు. సురపతి కి కాదనడానికి ఏమీ కారణాలు దొరకలేదు. షెఫాలో ప్రదర్శన ఈ విషయం లో అతని అభిప్రాయం సరైనదేనని నిరూపించింది. కాస్తంత ఆర్భాటం వల్ల చెడు ఏమీ జరగదు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఏవో పెళ్ళిళ్ళలో మామూలు ప్రదర్శనలు ఇవ్వడం వల్ల ఏం సాధించగలరు ఎవరన్నా? ఓ పక్క ఆకలితో మాడుతూ ఎవరన్నా ఎలా పేరు తెచ్చుకోగలరు? సురపతి కి ఏ విధమైన హంగులూ లేని అసలు సిసలు ఇంద్రజాల విద్య పై చాలా గౌరవం ఉంది. కానీ, ఇప్పుడు అలాంటి విద్య కి భవిష్యత్తు లేదు. సురపతి కి ఆ విషయం తెలుసు. అందుకనే ఈ దారి లో ప్రయాణం మొదలుపెట్టాడు. త్రిపురబాబు తో ఇదే అన్నాడు. కానీ, ఇది విన్నాక త్రిపుర బాబు కాస్త చిరాకు పడ్డాడు. బెంచి పై కూర్చుని అతను సురపతి తో –

” సురపతీ, అసలైన ఇంద్రజాలం అంటే ఏమిటో నీకు తెలిసుంటే ఇలా బూటకపు విద్య వైపుకి వెళ్ళవు నువ్వు. ఇంద్రజాలం అంటే కేవలం హస్త లాఘవం కాదు. దానికి కూడా కొన్నేళ్ళ సాధన అవసరం అనుకో. ఇంద్రజాలం అంటే ఇంకా చాలా ఉంది. వశీకరణం… ఒక్క సారి ఊహించు… ఊరికే ఒక మనిషి వైపు చూస్తూనే నువ్వు అతన్ని నియంత్రించవచ్చు. ఇంకా…టెలీపతీ, భవిష్యత్ దర్శనం, ఆలోచనలు చదవడం – ఇలా ఎన్నో ఉన్నాయి. నీకు కావాలనుకుంటే నువ్వు ఇంకోళ్ళ ఆలోచనల్లోకి వెళ్ళవచ్చు. ఒక మనిషి నాడి చూసి నువ్వు అతను ఏమి ఆలోచిస్తున్నాడో చెప్పొచ్చు. కాస్త సాధన చేస్తే అసలు అతని ముట్టుకోకుండానే కేవలం ఒక నిముషం పాటు అతన్ని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తేనే తెలుసుకోవచ్చు అతని మనసులో ఏముందో. ఇది అన్నింటి కంటే గొప్ప ఇంద్రజాలం. ఇందులో యంత్రాలు వగైరా ఉండవు. ఇందులో ఉండాల్సింది – అకుంఠిత దీక్షా, సాధనా ఇంకా అంకిత భావం.”

అంటూ ఊపిరి పీల్చుకోడానికి ఓ క్షణం ఆగాడు. తరువాత సురపతి కి కాస్త దగ్గరిగా జరిగి –

“నీకు ఇవన్నీ నేర్పాలనుకున్నాను. కానీ, నువ్వు ఆగలేకపోయావు. విదేశాల్నుంచి ఎవడో వస్తే నువ్వు తల అటువైపు తిప్పుకున్నావు. సరైన దారిని వదిలేసి త్వరగా డబ్బు సంపాదించడానికి మిథ్యా ప్రపంచంలోకి అడుగుపెట్టావు.”

అన్నాడు. సురపతి దేన్నీ కాదనలేకపోయాడు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

త్రిపుర బాబు కాస్త శాంతిస్తున్నట్లు కనిపించాడు. సురపతి భుజం పై చేయి వేసి కాస్త శాంతంగా – “ఈరోజు నీ దగ్గరికి ఓ కోరిక కోరడానికి వచ్చాను. నా ఆర్థిక స్థితి బాగాలేదని ఈ పాటిక్ ఊహించి ఉంటావు. నాకు ఎన్నో విద్యలు తెలుసు కానీ, డబ్బు సంపాదించడం తెలీదు. ఇందుకు నాకు కనిపించే ఒకే ఒక్క కారణం నాలో ఆ తపన లేకపోవడం. కానీ, ఈరోజు నేను చాలా అవసరం లో ఉన్నాను సురపతీ. నాలో ఇప్పుడిక సంపాదించే ఓపిక లేదు. నాకు తెలిసిన విషయం ఏమిటీ అంటే – నువ్వు కాస్త త్యాగం చేసన్నా నాకు సహాయం చేస్తావు. ఇదొక్కటి చేయి సురపతీ…ఇక నేను నిన్ను కష్టపెట్టను ఎప్పుడూ.” – అన్నాడు.

సురపతి కి అర్థం కాలేదు..త్రిపుర బాబు తననుంచి ఆశిస్తున్నదేమిటో.

“ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది కాస్త అసంధర్బంగా, అసహజంగా అనిపించొచ్చు కానీ ఇంకో మార్గం లేదు. చూడూ, నాకు కావాల్సింది డబ్బు మాత్రమే కాదు. ఈ ముసలి వయసులో నాకో వింత కోరిక కలిగింది. ఓ సారి పెద్ద సభలో, చాలా మంది ప్రేక్షకుల ముందు నా విద్యని ప్రదర్శించాలని. నా దగ్గర ఉన్న అత్యుత్తమమైన ట్రిక్ ని వాళ్ళకి చూపిద్దాం అనుకుంటున్నా. ఇదే నా మొదటి, చివరి ప్రదర్శన కావొచ్చు. కానీ, ఈ ఆలోచన నన్ను వదలడం లేదు.”

సురపతి గుండెలో కలకలం మొదలైంది. ఆఖరికి తనకు కావలసినది ఏదో చెప్పేశాడు త్రిపుర బాబు.

“నువ్వు లక్నో లో ప్రదర్శన ఇస్తున్నావ్ కదా? ఒకవేళ నువ్వు చివరి నిముషం లో అనారోగ్యం పాలయ్యావనుకో… ఎలాగైనా ప్రేక్షకులని నిరుత్సాహపరచలేవు కదా. మరి…ఎవరన్నా నీ స్థానం తీసుకుంటే?”

సురపతి అవాక్కయ్యాడు. ఏమంటున్నాడు ఇతను? నిజంగానే చాలా అవసరంలో ఉండి ఉంటాడు అతను. లేకుంటే ఇలాంటి ఆలోచనతో రాడు. సురపతి ని సూటిగా చూస్తూ త్రిపురబాబు –

“నువ్వు చేయవలసిందల్లా కొన్ని అనివార్య కారణాల వల్ల నువ్వు ఆరోజు ప్రదర్శించలేవని చెప్పడమే. కానీ, నీ స్థానాన్ని నీ గురువు తీసుకుంటాడు. జనం బాగా నిరుత్సాహపడతారా? నేను అలా అనుకోవడం లేదు. వాళ్ళకి నచ్చుతుందనే అనుకుంటున్నా. అయినా కూడా సగం షో నువ్వు నడిపించు. నాకు ఓ సగం సమయం ఇచ్చినా చాలు. ఆ తరువాత నీ ఇష్టం. నేను నీ దారికి అడ్డురాను. దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నాకు అవకాశమివ్వు సురపతీ!”

“అసంభవం!” సురపతి కోపంగా అరిచాడు. “మీరు చెప్పేది అసలు జరగడం అసంభవం. మీరు చెప్తున్నదేమిటో మీకు అర్థమవడం లేదు. బెంగాల్ అవతల మొదటిసారి ప్రదర్శన ఇస్తున్నాను నేను. ఈ లక్నో ప్రదర్శన నాకు ఎంత ముఖ్యమో తెలియడం లేదా మీకు? నా కొత్త జీవితాన్ని ఓ అబద్ధం తో మొదలుపెట్టమంటారా? అసలు అలా ఎలా ఆలోచించగలుగుతున్నారు?” – అన్నాడు.

త్రిపుర బాబు అతనివైపు నిరిప్తంగా చూసాడు. తరువాత ఆ కూపే మొత్తం వినబడేలా స్పష్టంగా –

“నీకింకా ఆ నాణెం, ఉంగరం ట్రిక్ ప్రదర్శన గురించి ఆసక్తి ఉందా?” అన్నాడు.

సురపతి ఆశ్చర్యపోయాడు. అయినా త్రిపుర బాబు చూపు మారలేదు.

“ఎందుకు?” అడిగాడు సురపతి.

త్రిపుర బాబు సన్నగా నవ్వుతూ – “నేనన్నదానికి నువ్వు ఒప్పుకుంటే నీకు అది నేర్పుతాను. లేకుంటే…”

హౌరా వైపు వెళ్ళే ట్రైన్ ఈ ట్రైన్ పక్కగా వెళూతూ చేసిన రొద లో ఆయనన్న మాటలు కలిసిపోయాయి. దాని వెలుతురు ఆయన కళ్ళల్లోని వింత మెరుపు ని పట్టిచ్చింది. ఆ శబ్దం తగ్గగానే –

“ఆ…ఒప్పుకోకపోతే?” సురపతి నెమ్మదిగా అడిగాడు.

“తరువాత బాధపడతావు. నీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. ఒక పెద్ద సభలో ప్రేక్షకుల మధ్య నేనుంటే, నాకు ఎలాంటి ఇంద్రజాలికుడినైనా అవమానపరచగల చేయగల శక్తి ఉంది. అతన్ని నేను పూర్తి నిస్సహాయుణ్ణి చేయగలను.” అంటూ త్రిపుర బాబు తన జేబు నుండి ఓ పేకముక్కల సెట్టు బయటకి తీసాడు.

“నువ్వెంత గొప్పవాడివో చూస్తాను. ఒక్క చేతి కదలికలో ఈ జాకీ ని వెనుక నుండి తీసి ఈ ఇస్పేట్ మూడు పైకి తెచ్చి పెట్టగలవా?” అన్నాడు సురపతి తో.

ఇది సురపతి నేర్చుకున్న తొలి ఎత్తుల్లో ఒకటి. పదహారేళ్ళ వయసులో అతనికి కేవలం ఏడురోజులు పట్టింది ఇది నేర్చుకుని నైపుణ్యం సాధించడానికి. కానీ ఈరోజు? సురపతికి ఆ పేకముక్కలు తీసుకున్నప్పటినుండి తన చేతుల్లో కదలిక ఆగిపోయినట్లు అనిపించడం మొదలైంది. తరువాత అదే భావన క్రమంగా మోచేతులకి, తరువాత మొత్తం ఆ చేతిమొత్తానికీ పాకి పక్షవాతం తగిలినట్లు అయిపోయింది. మైకం కమ్మినట్లై త్రిపురబాబు వైపు చూసాడు. ఆయన కళ్ళు సురపతి వైపు సూటిగా చూస్తూ ఉన్నాయి. పెదాలపై ఒక వింత నవ్వు. అతని చూపు లో కౄరత్వం ఉంది. సురపతి నుదుటిపై సన్నగా చెమటలు మొదలయైనాయి. శరీరం వణకడం మొదలైంది.

“ఇప్పుడు నమ్మకం కలిగిందా నా శక్తి పై?”

సురపతి చేతుల నుండి పేకలు కింద పడ్డాయి. త్రిపుర బాబు వాటిని పైకి తీస్తూ – “ఇప్పుడు నేను అడిగిన దానికి ఒప్పుకుంటావా?” అన్నాడు.

సురపతి మెల్లగా మామూలు వాడు అవడం మొదలుపెట్టాడు. అలసట నిండిన గొంతుక తో – “మరి నాకు ఆ ట్రిక్ నేర్పుతారా?” అన్నాడు.

త్రిపుర బాబు వేలు ఎత్తి చూపుతూ – “నీ గురువు త్రిపురచరణ్ మల్లిక్ లక్నో లో నీకు ఆరోగ్యం బాలేని కారణంగా నీ బదులు ప్రదర్శిస్తాడు – సరేనా?”

“సరే!”

“ఆ సాయంత్రం నాటి నీ రాబడి లో సగం నాది. అవునా?”

“అవును.”

“సరే, మరి అయితే..”

సురపతి తన జేబులో నుండి ఓ యాభై పైసల నాణేన్ని, తన వేలి మీది ముత్యపు ఉంగరాన్ని త్రిపుర బాబు కి అందజేసాడు.

*****************************************

ట్రైన్ బుర్ద్వాన్ లో ఆగినప్పుడు అనిల్ ఓ కప్పు టీ తీసుకుని వచ్చి తన బాస్ మంచి నిద్రలో ఉండటం గమనించాడు. కొన్ని సెకన్లు సంశయించి చివరికి –

“సార్!” అన్నాడు. సురపతి వెంటనే లేచాడు.

“ఎవరు…? ఏమిటి అది?”

“మీ టీ సార్… క్షమించండి మీకు అంతరాయం కలిగించినందుకు..”

“కానీ….” సురపతి చాలా కంగారుగా అన్నాడు.

“ఏమైంది?”

“త్రిపురబాబు…ఎక్కడున్నాడు ఆయన?”

“త్రిపురబాబు నా?” అనిల్ కి అంతా గందరగోళంగా అనిపించింది.

“ఓహ్! లేదు లేదు… ఆయన ఏదో వాహనం కింద పడ్డాడు కదా…ఎప్పుడో ’51 లో! ఇంతకీ నా ఉంగరం ఏదీ?”

“ఏది సార్? ముత్యపుటుంగరం ఐతే మీ చేతికే ఉంది.”

“అవునవును…ఇంకా…”

సురపతి తన జేబులోకి చేయి పెట్టి ఓ నాణెం బయటకు తీసాడు. తన యజమాని చేతులు వణుకుతూ ఉండటం అనిల్ గమనించాడు.

“అనిల్, లోపలికి రా..త్వరగా. కిటికీలు మూసేయ్. సరే..ఇక ఇప్పుడిది చూడు.”

సురపతి తన ఉంగరాన్ని బెంచి కి ఒక చివరలో ఉంచాడు. నాణేన్ని మరో చివర్లో ఉంచాడు. “దేవుడా! నాకు సాయం చేయి” అని మౌనంగా దేవుణ్ణి వేడుకున్నాడు. ఉన్నట్లుండి ఒక తీక్షణమైన చూపుతో ఆ నాణేన్ని చూసాడు, కొద్ది నిముషాల క్రితం తాను నేర్చుకున్నట్లే. మొదట ఆ నాణెం ఉంగరం వైపు కి దొర్లుకుంటూ వెళ్ళింది. తరువాత ఉంగరం, నాణెం రెండూ సురపతి వైపు దొర్లుకుంటూ వచ్చాయి … చెప్పినమాట వినే పిల్లల్లా. సురపతి సరైన సమయానికి చేయిచాపి గాల్లో ఆ టీకప్పుని పట్టుకోకపోయి ఉంటే అనిల్ దిగ్భ్రాంతి లో ఆ కప్పు ని జారవిడిచి ఉండేవాడే!

లక్నో లో సురపతి తన ప్రదర్శనను తన గురుదేవులైన స్వర్గీయ త్రిపురచరణ్ మల్లిక్ కు నివాళులు అర్పిస్తూ మొదలుపెట్టాడు. ఆ రోజు ప్రదర్శించిన చివరి అంశం నిజమైన భారతీయ ఇంద్రజాల విద్యకి ప్రతీక – ఆ నాణెం, ఉంగరాల మాయ!

Published in: on July 12, 2021 at 1:00 am  Leave a Comment  

ఈ సర్వర్ అందుబాటులో లేదు

గత టపాకి ఇది కొనసాగింపు టైపు అనమాట. నేను బాగా కుదురుకున్నా అనుకున్నా కానీ, ఒక విషయం లో మాత్రం నిస్సహాయత భావన పోవడం లేదు. అందుకని ఈ పోస్టు రాస్తున్నా. ఆ విషయం – “అందుబాటులో లేకపోవడం”. ఎవరికి? అంటే పిల్లకి తప్ప ఎవరికైనా. పిల్లకి ఎల్లవేళలా అందుబాటులో ఉండడం కోసం ఇంకెవరికీ అందుబాటులో ఉండకపోవడం అనమాట. ఒక్కోసారి నాక్కూడా నేను అందుబాటులో ఉండట్లేదు అని నాకనిపిస్తూ ఉంటుంది (అంటే సెల్ఫ్-కేర్ లేదు అని అనమాట). ఆ, అందరి కథా ఇంతే… అని చప్పరించేయొచ్చు. చప్పరించండి. టేస్టు రుచిగా ఉందా? లేదు కదా. చేదుగా ఉందికదా? నాక్కూడా చేదుగానే ఉంది. అందుకే రాస్తున్నది మరి!

“నాకు కావాల్సినపుడు నువ్వు అందుబాటులో లేవు” అని నేరుగా అన్నవారు ఉన్నారు ఈ రెండేళ్ళ కాలంలో. బాగా దగ్గరి వారు కూడా ఉన్నారు. అందులో ఓ పక్క నేనే ఇంకా పాప పుట్టిన మొదటి వారంలో ఆమె ఇంకా హాస్పిటల్ లో ఉంది అన్నది ఒప్పుకోడానికి సతమవుతున్నపుడు కూడా ఈ మాట అన్న వారు ఉన్నారు. కనీసం నాన్చకుండా, దాచకుండా, నేరుగా అనేశారు అన్నది ఒక తృప్తి వీళ్ళతో. ఇంకొందరు అది నేరుగా అనకుండా ఇంకోళ్ళతో అనడం, నాతోనే వెటకారంగా అనడం, సైలెంటుగా తప్పుకుపోవడం చేశారు. దీనికి ఎంత దగ్గరివారైనా, రకరకాల తీవ్రతలతో బాధపడి, మన మ్యూచ్యువల్ ఖర్మ అనుకుని వదిలేయడం తప్ప నేనేం చేయలేకపోయాను చివరకి. “అందుబాటులో లేకపోవడం” అన్నది నిజమే కదా మరి. మొదట కష్టంగా అనిపించినా నిజానికి ఇది నన్ను అంత బాధించలేదు. అదొక ఫేజ్. అందరికీ ఉండేదే… అది అర్థం చేసుకోకపోతే అవతలి వాళ్ళ సంస్కారం అంతే అనుకుని ఊరుకోడమే.. అన్న ధోరణిలో ఉన్నాను మొన్న సుక్కురారం దాకా. ఆరోజు పడింది పంచ్ నాకు.

నాతో పని చేస్తున్న ఒక విద్యార్థి -నాకు సోమవారం ఇంటర్వ్యూ ఉంది అని మెసేజి పెట్టాడు. చాలా రోజులుగా ప్రయత్నం చేస్తూంటే వచ్చిన మొదటి కాల్ అని నాకు తెలుసు. అందువల్ల – “బాబూ, నాకు వారాంతాలు కష్టము. ఇవ్వాళే సాయంత్రం లోపు నీకేమన్నా నా నుంచి కావాలంటే చేస్తాను, లేకపోతే కుదరదు” అని మెసేజి పెట్టాను. ఇది రాయడానికే నేను చాలా బాధ పడ్డాను. ఎందుకంటే ఒకళ్ళని మన శిష్యులు అనుకుంటే వాళ్ళు మనల్ని వదిలి పొయ్యేదాకా పక్కనే ఉండాలని నా ఫీలింగ్. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టడానికి కాదు – ఏం చేయాలో తోచనపుడు పక్కన ఆ దశ దాటిన గురువుగా పక్కన ఉండేందుకు. గతంలో ఇది నాకు పెద్ద సమస్యగా తోచలేదు. ఎపుడు అడిగితే అప్పుడు ఏదో ఒకటి చేసి అందుబాటులోకి వచ్చేసేదాన్ని… కొలీగ్స్, స్నేహితులు – వీళ్ళతో ఈ ముక్క అనడానికి మొదట్లో కష్టంగా అనిపించినా తర్వాత స్థిమితపడ్డాను. కానీ ఈ విషయంలో అలా అనిపించలేదు.

సరే, ఇలా అన్నాక వదిలేసి నా మానాన నేను ఇల్లూ-పిల్లా, వంటా-వార్పూ, అమర్ చిత్ర కథా-కన్మణీ, పార్కూ-గీర్కూ అని తిరుగుతూ ఉండగా మధ్యలో ఈమెయిల్ చూశాను. ఈ శిష్యుడి నుండే – నాకు కొంచెం ప్రిపరేషన్ కి గైడెన్స్ కావాలి… ఇవాళ కుదురుతుందా? అని మెసెజి. ఇది కొలీగ్ పెట్టి ఉంటే కోపగించుకుని ఉందును (నా అదృష్టం – నాకెవరూ ఇలాంటివి పెట్టేవాళ్ళు, జవాబివ్వకపోతే నొచ్చుకునేవాళ్ళూ లేరూ ఆఫీసులో!). కానీ, శిష్యుల కథ వేరే. అందునా నేనంత చెప్పాక కూడా అడిగాడంటే ఎంత అవసరమో తెలుస్తూనే ఉంది. సరే, మా పాప పడుకున్నాక రాత్రి మాట్లాడదాం అని స్పందించాను. అప్పటికే అతనూ ఫీలై, వద్దులే, ఇట్స్ ఓకే.. అనేశాడు. నేను మాట్లాడతాలే, పర్లేదు, అని పెద్ద పుడింగి లా మళ్ళీ స్పందించానే కానీ, మా యువరాణి రాత్రి పడుకోకుండా పీడించడానికి సుక్కురారం రాత్రిని ఎంచుకుంది. ఆమె పడుకునేసరికి నాకు బుర్ర పనిచేయక… మర్చిపోయి నిద్రపోయా.

పొద్దునే ఐదూ ఐదున్నర మధ్య టక్కుమని మెలుకువొచ్చి… ఓర్నీ, అతనికి అసలు జవాబే ఇవ్వలేదు కదా… అని గుర్తు వచ్చింది. అపుడు లేచేసి ఒక ఈమెయిల్ ఒకటి పంపాను…సారీ తో మొదలయి ఇంటర్వ్యూ గురించి ఏం చేయొచ్చు…ఏం ప్రిపేర్ కావాలి అంతా నా సోదంతా రంగరించిన మెగా మెయిల్ అనమాట. చివరాఖర్లో – నాతో మాట్లాడాలంటే ఇదీ నంబరు. కాల్ చేసేయి, చాట్లూ జూములూ కష్టం ఆదివారం అని రాశా. కానీ దీనిలో ఓ తిరకాసుంది – నా ఫోను వీలైనంత వరకు ఎక్కడో పెట్టేసి తిరుగుతూ ఉంటా నేను – మళ్ళీ మా పిల్ల అది కావాలి అడుకోడానికి అంటుందని. అందువల్ల నిజంగానే వారాంతాల్లో నన్ను అందుకోడం కష్టం – నేనెవర్తో అన్నా మాట్లాడాల్సిందే కానీ నాకు ఎవరూ కాల్ చేయలేరు అనమాట. అందుకని మళ్ళీ – అట్ల కాదు బాబూ, టైము చెప్పి కాల్ చేసేయి అని రాశా. ఇంతా చూసి విషయం అర్థమై అతను ఈమెయిల్ సలహాలు చాలు, కాల్ చేయననేశాడు 🙂

ఇక్కడేముంది? అనిపించొచ్చు కానీ – ఈ ఎవరికీ అందుబాటులో లేకపోవడం అన్నది నన్ను అన్నింటికన్నా బాధించిన సందర్భం ఇదే ఇప్పటిదాకా. అర్థరాత్రి ఐపోయినా ఇలా పోస్టు రాసేందుకు కూర్చున్నా అనమాటర్థ అందుకే. ఇలాగని నేనేదో పశ్చాత్తాపంతో కృంగి కృశించి, నా అమ్మ-జీవితాన్ని ద్వేషించేసి… ప్రపంచాన్ని తిట్టీ….. ఇదంతా ఏం లేదు. వారాంతం బాగా గడించింది. కానీ, ఇలా మెంటరింగ్ కమిట్మెంట్ గురించి ఆలోచనలో పడేసింది. పోనీ, మనం ఇలాంటివి వదిలేద్దాం … ఊరికే 8 టు 4 ఉద్యోగం చేసుకుని మిగితాది మర్చిపోదాం అంటే… ఈ “గురువు-గిరీ” నా ఐడెంటిటీ లో భాగం టైపులో ఫీలవుతూ ఉంటా నేను. కనుక ఐడెంటిటీ క్రైసిస్ వస్తే నన్ను పట్టించుకునే వాడెవడు? అని టెంషన్ 🙂 అసలు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలా? అంటే – మా గురువు గారు అందుకోలేని ప్రమాణాలు పెట్టేస్తే నేను గురువుగా ఆ లెవెల్ లో ఉండాలని వెంపర్లాడుతున్నా అనమాట.

కనుక ఈ సర్వర్ కొన్నాళ్ళో ఏళ్ళో ఇతరులకి అందుబాటులో ఉండదు. ఆల్రెడీ ఓవర్ లోడెడ్. కానీ శిష్యులకి వీలైనంత మినహాయింపు పెడుతుంది అని నిర్ణయించుకున్నాను.

Published in: on June 28, 2021 at 5:09 am  Leave a Comment  

ఒక ఏడాది తరువాత

ఈ జూన్ ఒకటికి నేను మాతృత్వ సెలవు ముగించుకుని తిరిగి పనిలో చేరి ఒక సంవత్సరం అవుతుంది. ఈ ఏడాది కాలం గురించి, అది నేర్పిన పాఠాల గురించి ఈ టపా. నాలుగు అంశాలుగా విభజించుకుంటున్నా.

1. పిల్ల: నేను మాట్లాడే నూటికి డెబ్భై శాతం మాటలు మా పిల్ల గురించి కంప్లైంట్లే గత ఏడాది కాలంలో. ఇవాళిలా చేసింది. ఇందాకా దాన్ని విరగ్గొట్టింది. ఆ గోడపైన కలర్ పెన్సిల్ తో గీకింది.. ఫలానాది పాడు చేసేసింది.. ఇలా సాగుతూ ఉంటాయి. కానీ, నిజానికి ఏడాది కాలంలో పరిస్థితుల మధ్య కూడా మనశ్శాంతిగానే ఉన్నానంటే దానికి కారణం మా పాపే అని చెప్పాలి. అసలు ఇంత మనశ్శాంతి ఎప్పుడూ ఎరుగను అనుకుంటా అడల్ట్ గా. ఇది శాశ్వతం అని అనుకోను కానీ, ఉన్నన్ని రోజులు ఆస్వాదిస్తాను.

ఏ విషయం గురించి ఎక్కువ సేపు బాధ పడ్డం/కోప్పడ్డం/అరవడం లాంటివి చేసే స్కోప్ లేకుండా రోజంతా నన్ను తినేస్తుంది కనుక అదొక విచిత్రమైన పద్ధతిలో మానసికారోగ్యం నిలిచిందని నా నమ్మకం. అదొక భరోసా ఐపోయింది నాకు – పాపుంటే ఏదో ఒకలా నెట్టుకొచ్చేయొచ్చు ఏ సమస్య వచ్చినా అని. కనుక మా పాపకి “ధైర్య లక్ష్మి” అన్న పేరు పెట్టాను, “రాకాసి” అన్న పేరుతో పాటు. ఎవరు నన్ను వదిలేసి వెళ్లినా కనీసం ఇప్పట్లో .. కనీసం కొన్నేళ్ళ దాకా అయితే ఈ పిల్ల వదలదు అన్నది కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుంది నాకు. మంచి అమ్మని కాగలనో లేదో కానీ, ఆ ప్రయత్నం మాత్రం అలాగే మానకుండా చేయాలనీ, ఆమె పెద్దయ్యాక ఏదో ఓరోజు నాతో – “నీ పరిమితుల్లో నువ్వు చేయగలిగినంత చేశావు” అనగలిగితే చాలు. పర్ఫెక్షన్ నాకొద్దు. అందువల్ల నాకు చేతనైనంత మంచి అమ్మని అవ్వడానికి ప్రయత్నం రాబోయే ఏడాది కూడా అలా కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే. వీలైనంత “క్వాలిటీ టైం” పాపతో గడపాలని ఆశిస్తున్నాను. 

2. కుటుంబం, స్నేహితులు: కుటుంబంతో గాఢానుబంధం ముఖ్యం, ఉంటే అదృష్టం అన్నది ముగింపన్నది కనిపించకుండా ఒకటిన్నర ఏడాది పొడిగించుకుంటూ పోయిన లాక్ డవున్ ల వల్ల నాకు కలిగిన అతి పెద్ద జ్ఞానోదయం. పెద్ద పెద్ద విషయాలేం సాధించకపోయినా, నా మానాన నేను నా కుటుంబంతో, మా ఇంట్లో, ముప్పూటలా తింటు, వీలైనంత వరకూ మేము అందరం ఆరోగ్యంతో ఉండడం, మా పరిమితుల్లో ఇతరులకి (అంటే ముక్కూ మొహం తెలీని వాళ్ళకి) ఏదన్నా చేయడం .. తెలిసిన వారికి వీలైనంతలో మాటసాయం తప్ప ఏం చేయలేకున్నా, అదన్నా చేసే స్థితిలో ఉండడం… ఎంత అదృష్టమో ఈ ఏడాది తెలిసొచ్చింది. 

నేను మామూలుగా ఫ్యామిలీ‌ డ్రామా ని వీలైనంత తప్పుకు తిరుగుతూ ఉన్న కాసిని స్నేహితులతోనే నా ప్రపంచాన్ని వెదుక్కుంటూ ఉంటాను. నా బాల్య స్నేహితురాలు ఈమధ్య ఒకటి అన్నది – స్నేహాలు తెంచుకోవాలనుకుంటే తెంచుకోడం చాలా ఈజీ. కొన్నాళ్ళు స్పందించకుండా వదిలేస్తే అవతలి వాళ్ళకి విసుగేసి మానేస్తారు. ఎవరన్నా మనతో అలా చేసినా మనం కూడా చూసినంత కాలం చూసి ఇంక మన ఖర్మనుకుని ప్రయత్నం ఎప్పుడో ఏదో ఓ సమయంలో వదిలేస్తాం. కుటుంబ సభ్యులను వదిలించుకోడం‌ అంత తేలిక కాదు. మనం వదిలితే వాళ్ళు వదలరు, వాళ్ళు వదిలితే మనం వదలం అని. ఇష్టం ఉన్నా లేకపోయినా ఉండిపోయే బంధం అది అని. అక్కడే, ఆ చాటులోనే నాకు జ్ఞానోదయం అయ్యింది. ఊరికే అమ్మ తిట్టిందనో, అత్త అరిచిందనో ఇవన్నీ మనసులో పెట్టుకుని ఏం సాధిస్తాం? ఈ గడ్డుకాలంలో మనిషికి మనిషికి తోడు మాటలేగా.. మనల్ని వద్దని వదిలేసిన వాళ్ళు పోగా…  మనం కావాలనుకున్న వాళ్ళు మనం ఓ మాటన్నా పట్టించుకోకుండా తరువాత నన్ను ఓ మాటంటే నేను కూడా పట్టూ విడుపూ చూపొద్దా? అనిపించింది.  

ఈ జ్ఞానోదయం తరువాత నాలో కొంచెం మార్పు వచ్చిందనిపించింది. అంతకు ముందు కంటే రోజూవారి మల్టిపుల్ ఫోన్ కాల్స్ ని కొంచెం గౌరవిస్తున్నాను. ఎవరన్నా నాకు మెసేజి పెడితే … వాళ్ళు ఉట్టి పరిచయస్థులు మాత్రమే అయినా సరే, జవాబిచ్చి క్షేమం అడుగుతున్నాను. చుట్టుపక్కల వారు పలకరిస్తే ఇదివరకులా హలో అనేసి మాయమవకుండా ఏదో కొంచెం లోకాభిరామాయణం మాట్లాడి వెళ్తున్నా. మా పిల్ల, పిల్ల తండ్రిని వదిలేస్తే ఇతరుల గురించి చిరాకు/కోపం తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. అలాగే నన్ను బాధించిన/కోపం తెప్పించిన వాళ్ళ గురించి కూడా ఎక్కువ ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. పని గట్టుకుని మధ్యమధ్యన బాగున్నావా? అని అడుగుతూ ఉండే మితృలందరి స్పూర్తితో నేను కూడా మనం మెసేజి పెడితే కనీసం స్పందిస్తారు అనుకున్న వాళ్ళకి మధ్య మధ్యలో మెసేజి చెయ్యడం మొదలుపెట్టాను. కొందరు స్పందించకపోయినా వాళ్ళ మీద అభిమానం చావక చేస్తూ ఉంటా అనుకోండి అప్పుడపుడు – అది వేరే విషయం. దీని వల్ల ఏవో భయంకర మార్పులు సంభవించాయని చెప్పలేను కానీ, నాకు మనశ్శాంతి పెరిగింది అనుకుంటాను. అలాగే, పలకరిస్తే పలికే స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా పంచుకోవాలనిపిస్తే నాతో పంచుకునే వారు ఉన్నారు అని ధైర్యం కలిగింది. ఇప్పటి పరిస్థితులలో ఈ ధైర్యం కూడా ముఖ్యమే అని నా అభిప్రాయం.

3. ఇల్లు-ఆఫీసు బ్యాలెన్స్: మా ఊళ్ళో దాదాపుగా సెప్టెంబర్ 2020 నుండి డే కేర్లు తెరిచే ఉన్నాయి. అవి essential service కింద లెక్కకట్టారు. అయితే అంతకు ముందు దాదాపు ఆర్నెల్ల పాటు మూతబడ్డాయి. నేను పని మొదలుపెట్టేసరికి ఇంట్లో‌ ఇద్దరం ఆఫీసు పని చేస్తూ, ఏడాది పిల్లని మేనేజ్ చేసుకోవాలి. ఈ ఇల్లెందుకు ఇంత పెద్దగా ఉంది? మనకెందుకు మూడు పూటలా ఏదో ఒకటి మెయ్యడానికి కావాలి? పాప ఎందుకు ఏ మూలలో ఏది కనబడితే దానికోసం పోతుంది? ఇప్పుడే కదా పడుకుంది – అప్పుడే లేస్తుందేం? పొద్దునంతా ఇంటిపని, పాపతో సరిపోతే నేనింక ఎప్పుడు పని చేయాలి? – ఇలా రోజంతా నా స్నేహితులతో ఏడుస్తూ ఉండేదాన్ని మొదట. ఇది కాక మధ్య మధ్య బంపర్ ఆఫర్ ఏడుపు ఏమిటంటే – కొలీగ్స్ అంతా ఏంటేంటో చాలా చేసేస్తున్నారు. నాకు అసలు కుదరడం లేదు (చిన్న పిల్లలున్న వాళ్ళు లేరు మా‌టీంలో)… ఇలా అయితే నేను వెనుకబడిపోనా? అన్నది అపుడపుడూ గుర్తొచ్చే అదనపు ఏడుపు. ఇదంతా నసలాగా అనిపించి ఉంటుంది బహుశా వీళ్ళకంతా… నాకు మాత్రం అది ఎవరికీ అర్థం కాని ఆత్మఘోష టైపు.

డేకేర్లు తీశాక నాకు ప్రపంచం పచ్చగా కనబడ్డం మొదలైంది. నెమ్మదిగా ఆఫీసులో కుదురుకుని, రిసర్చి కూడా ముందుకు సాగడం మొదలైంది. కానీ నా పనితీరు పూర్తిగా మారిపోయింది. అదివరలో ఏదన్నా ఎక్కడన్నా ఆపితే, ఆ సర్లే తర్వాతొచ్చి చేద్దాం/రాత్రి చూద్దాం/వీకెండ్ చూద్దాం -ఇలా ఉండేది. మరీ పని పిచ్చి కాకపోయినా రిసర్చి కనుక ఎపుడూ మనసులో అది మెదులుతూ ఉండేది పని చెయ్యనపుడు కూడా. ఇపుడంతా పరమ ఆప్టిమైజ్ చేసేసి అంతా ఓంలీ వీక్ డేస్, అదీ డే కేర్ పనివేళలతో సింక్ అయి ఉండాలి. వారాంతాలు, పని దినాల్లో సాయంత్రాలు –  ఇల్లే ఇలలో స్వర్గం, పిల్లలూ దేవుడూ చల్లని వారే. ఇలా పాడుకోడమే. పాడుకుంటూ పిల్లాటలు ఆడుకోడం, కన్మణి పాప పాటలు వినుకోడమే. ఇలా పనివేళలు తగ్గడం, వాటిని బ్యాలెంస్ చేసేందుకు ఇంకెప్పుడో‌చేయడం అన్నది కుదరకపోవడం వల్ల నాకు పని మీద ఫోకస్, అలాగే ఏది ఎప్పుడు/ఎంత సమయంలో చేయాలి అన్న అంచనా కూడా ఇదివరకటికంటే మెరుగైంది అనిపిస్తోంది. వీటికి తోడు, నాకు కుదరకపోతే అదేదో తప్పు చేసినట్లు కాకుండా మామూలుగా – ఇంట్లో పనుందని చెప్పేస్తున్నా. మా ఆఫీసు వాళ్ళు బగమంతులు కనుక సహకరిస్తున్నారు. ఇటాంటి అరగుండు వాలకం పనితో కూడా నా అప్రైజల్ సాఫీగా సాగిపోయింది. అలా, ముందు ఓ మూణ్ణెల్లు గిలగిలా కొట్టుకున్నా చివరికి మానవనైజం ప్రకారం అలవాటు పడి నిలదొక్కుకుంటున్నా. ఆ డే కేర్ వాళ్ళు మాత్రం నాకు ప్రత్యక్ష దైవాలే.

పని మంచి పీక్ లో‌ ఉండగా పుటుక్కుమని పాపకోసం పని ఆపాల్సి రావడం, డెడ్లైన్ దగ్గర్లో పాపకి బాలేదని సెలవు పెట్టి పిల్లకీ, పనికీ దేనికీ పూర్తి అటెంషన్ ఇవ్వలేక బాధపడ్డం, ఒక్కోసారి చేయలనుకున్న వాటికి, ఉన్న సమయానికి పొంతన కుదరక నిరాశ పడ్డం… ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి కానీ, ఇవన్నీ జీవితంలో భాగం అని అలవాటైపోయింది ఇపుడు… ఏడాదవుతోంది కనుక. అందువల్ల ఇదివరకు ఉన్నంత నిస్సహాయత ఇపుడు లేదు నాకు. ఆరోజుకి కోపం, అలసట వంటివి ఉన్నా వెంటనే మళ్ళీ మర్చిపోయి పనిలో, ఆటల్లో పడిపోతున్నా.

4. ఇతర వ్యాపకాలు: మామూలుగానే నాకు వ్యాపకాలు తక్కువ, అలాగే పని తప్ప ఇతర విషయాల్లో ఏ విధమైన అభినివేశమూ లేదు. అయితే ఏదో గొప్ప గొప్ప కళాభిరుచులు వంటివి లేకపోయినా కనీసం ప్రయాణాల వంటివి చేసేదాన్ని. కానీ పాప పుట్టాక ఓ ఏడాది ఏడాదిన్నర అసలు ఇల్లు-ఆఫీసు తప్ప ఇతర వ్యాపకాలన్నవి లేకుండా పోయాయి .. లాక్ డవున్ దీనికి తోడయ్యింది. పైకి బానే ఉన్నా ఇది నా మానసికారోగ్యం మీద ప్రభావం చూపినట్లే ఉంది. అలసట వల్ల బాగా చిరాకు/కోపం వచ్చేసేవి చాలా విషయాలు/ చూసినా/చదివినా/విన్నా.  కానీ, గత ఆరునెల్లలో ఇది చాలా మారింది. ఇలా ఈ ఇల్లు-ఆఫీసు బ్యాలెంస్ మెరుగవడం, కొంచెం మళ్ళీ నెమ్మదిగా అవీ ఇవీ తరుచుగా పుస్తకాలు చదవడం, బ్లాగు టపాలు, పుస్తకం.నెట్ వ్యాసాలు రాయడం, మళ్ళీ సైక్లింగ్ నెమ్మదిగా మొదలుపెట్టడం ఇలాంటివి మొదలుపెట్టాను. కనుక నెమ్మదిగా మళ్ళీ మానసికంగా కుదురుకుంటున్నా అనిపిస్తోంది. హం కిసీ సి కమ్ నహీ అని కూడా అనుకుంటున్నా. ఇవన్నీ అందరికీ ఉండేవే – దీనికంతా ఓ పోస్టు అవసరమా? అనిపించొచ్చు కానీ, ఎవడి బ్లాగు వాడిదండి. అందునా ఎవడి అనుభవం వాడికి కొత్త. ప్రపంచానికి కాదు. 

ఈ జ్ఞానోదయాన్ని మహమ్మారి సాక్షిగా నాకు అందించిన అందరికీ నా ధన్యవాదాలు. పిచ్చాపాటి కబుర్లు మొదలుకుని ఊరికే అంతా బాగేనా అని అడగడం  దాకా ఈ సామాజిక దూరాల దినాలలో పలకరిస్తున్న అందరికీ థాంక్స్.  భవిష్యత్తులో కూడా  నా జ్ఞాపకాల్లో మీ చోటు పదిలం. ఈ ఏడు నేను నేర్చుకున్న బతుకు పాఠాలు కొరోనా అనంతర ప్రపంచంలో కూడా మర్చిపోకూడదని కోరుకుంటున్నాను. 

Published in: on May 28, 2021 at 12:03 pm  Comments (3)  

రక్తదానం – వివిధ దేశాలలో నా అనుభవాలు

ఇవ్వాళ ఇక్కడ రక్తదానానికి వెళ్ళొచ్చాను. చివరిసారిగా రక్తం ఇచ్చి పదేళ్లు దాటింది. కానీ అప్పట్లో తరుచుగా ఇచ్చేదాన్ని. అందుకని ఓసారి గతం గుర్తు తెచ్చుకుందామని పోస్టు.

నాకు చిన్నప్పట్నుంచీ రక్తదానం అంటే చాలా గొప్ప అన్న భావన ఉండేది.  నాకు ఊహ తెలిసేనాటికి పత్రికల్లో టీవీల్లో రక్తదానం ప్రకటనలవీ చూసీ మనం కూడా ఇయ్యాలి… తగిన వయసు టక్కుమని రావాలి అని ఎదురుచూస్తూ ఉన్నా. మొదటిసారి రక్తదానం ఇంజనీరింగ్ లో ఉండగా కాలేజి లోనే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడితే అక్కడ ఇచ్చా. ఇండియా లో ఉన్నపుడు దాదాపు ప్రతి ఆర్నెల్లకూ ఇచ్చేదాన్ని – ఆఫీసులోనో, ఫ్రెండు వాళ్ళ సేవా సంస్థలోనో, ఎక్కడో ఓ చోట క్యాంపులు పెట్టేవాళ్ళు. వాటిలో ఇచ్చేదాన్ని. ఓసారి 2006 లో  అనుకుంటాను – పేపర్లో నా గ్రూపు రక్తం కావాలన్న ప్రకటన చూసి కదిలిపోయి, మా అమ్మ పర్మిషన్ తీసుకుని NIMS ఆసుపత్రికి పరిగెత్తి ఇచ్చొచ్చా. ఎవరో ఒక నా ఈడు మనిషికే ఇచ్చా, ఆ మనిషి వెంట చాలా పెద్దామె ఎవరో మాత్రమే ఉంది. వాళ్ళు జూసిచ్చారు, ఆమె దండం‌ పెట్టింది. నేను మొహమాటపడి తిరిగి దండం పెట్టి గబగబా బైటకొచ్చేశా. 

అప్పట్లో ఒక బ్లడ్ డోనర్ కార్డు (రెడ్ క్రాస్ అనుకుంటా), ఒక ఐ డోనర్ కార్డు (ఎల్ వీ ప్రసాద్ వారి దగ్గర రిజిస్టర్ అయితే ఇచ్చారు), ఒక ఆర్గన్ డోనర్ కార్డు (మోహన్ ఫౌండేషన్ అనుకుంటాను, గుర్తులేదు)  ఇన్ని పెట్టుకు తిరిగేదాన్ని పర్సులో. మనమసలే విచ్చలవిడి టూ వీలర్ డ్రైవర్లం… ఏదన్నా అయితే కనీసం ఇంకోళ్ళకి ఉపయోగపడతాం అని (ఇంట్లో వాళ్ళకి తెలుసు లెండి. ఏదీ రహస్యంగా చేయలేదు). కానీ, అదంతా అక్కడితోనే పోయిందని తెలియలేదు నాకప్పుడు. 

దేశం దాటాక అదేమిటో ఇలాంటి రక్తదాన శిబిరాలు ఇప్పటిదాకా చూడలేదు. జర్మనీ వెళ్ళిన కొత్తల్లో ఓ స్నేహితురాలిని అడిగాను – ఇక్కడ రక్తదానం చెయ్యాలంటే ఏం‌చెయ్యాలి? అని. ఆమె ఆశ్చర్యంగా చూసి ఎందుకన్నది. “ఎందుకేమిటి? మామూలుగా బ్లడ్ బ్యాంకులకి రక్తం అవసరం ఉంటుంది కదా. అందుకని ఇద్దామనుకుంటున్నా” అన్నా. “ఇక్కడ అలా ఊరికే పోతే తీసుకోరు అనుకుంటాను, మీ ఇండియాలో ఎవరి బ్లడ్డన్నా అలా తీసేసుకుంటారా?‌” అని ఆశ్చర్యపోయింది. ఊరికే తీస్కోర్లేవమ్మా, ప్రశ్నలన్నీ వేసే తీసుకుంటారని చెప్పా కానీ, జర్మనీ లో ఎలా ఇవ్వాలన్నది మాత్రం అర్థం కాలేదు మొత్తం ఐదేళ్ళలో. భాష సమస్య ఒకటి కూడా కారణం అయుండొచ్చు నాకు.

కట్ చేస్తే యూఎస్ లో అసలు ఊపిరి సలపని ఉద్యోగం. దానికి తోడు కొంత వ్యక్తిగత ఇబ్బందులు. ఎక్కడా శిబిరాలు కానీ, ఇవ్వమని పిలుస్తూ ప్రకటనలు కానీ కనబడలేదు యూనివర్సిటీలో ఉన్నా కూడా – దానితో నేనూ ఎక్కడా ప్రయత్నించలేదు. 

కెనడా వచ్చాక కూడా చాలా రోజులు ఇలాగే కొనసాగింది… పైగా రాంగానే కొన్ని నెలల్లోనే ప్రెగ్నంసీ, పాప పుట్టడం, ఆ తరువాత కొన్ని నెలలకి మాయదారి కోవిడ్ – వీటితోనే సరిపోయింది. కానీ గత ఏడాది కాలంలో ఇక్కడ తరుచుగా బ్లడ్.సీయే వెబ్సైటు వారి ప్రకటనలు రోడ్డు మీదా, ఇంటర్నెట్ ఆడ్స్ లో కూడా కనిపించేవి. “రక్తదానం నిరంతర అవసరం. ఈ మహమ్మారి కాలంలో మరింత అవసరం”  అని ముఖ్యంగా కోవిడ్ సమయంలో మీ రక్తదానం మరింత అవసరం అని వారు చేసిన కాంపైన్ నన్ను బాగా కదిలించింది (స్వేచ్ఛానువాదం లెండి!).  సరే, కొంచెం ఇక పిల్ల కొంచెం పెద్దవుతోంది కదా అని ఇంటి దగ్గర ఏవైనా శిబిరాలున్నాయా అని చూడ్డం మొదలుపెట్టా. ఇంటి అడ్రస్ బట్టి వెదుకుతూ ఉంటే ఒకటి కనబడ్డది (మళ్ళీ దూరమంటే పిల్లని ఎక్కువ సేపు వదిలి పోవడం ఇష్టం లేక!).  మా పాప రెండో‌ పుట్టిన రోజు లోపు ఇవ్వాలనుకున్నా మా ఇంటి పుట్టినరోజు వేడుకలో భాగం అని. 

అపాయింట్మెంటు తీసుకున్నాక మనసు పీకడం మొదలుపెట్టింది. రెండు మూడు వారాల ముందు నుంచే ఇండియా/యూఎస్ లో ఉన్న డాక్టర్ స్నేహితుల తల తిన్నా – కోవిడ్ పరిస్థితిలో రక్తం ఇచ్చొచ్చాక నాకేమన్నా అవుతుందా? అని. నా బాల్య స్నేహితురాలేమో టెస్ట్ చేయించుకుని వెళ్ళి ఇవ్వు. పొరపాట్న నువ్వు పాజిటివ్ అయితే అదో ఇబ్బంది కదా బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి? అన్నది (పాయింటే, నేనాలోచించలేదు). ఇంకో స్నేహితులేమో సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవ్వు – కేసులు తగ్గుముఖం పడుతూంటే వెళ్ళు అన్నారు. ఆఫీసు వాళ్ళని కూడా తిన్నా – ఈమధ్య మీరేవన్నా రక్తం ఇచ్చారా? అని. ఒకరేమో – నువ్వు డెంటిస్టు దగ్గరికెళ్ళావా ఈ ఏడాది కాలంలో?‌ డెంటిస్ట్ కంటే రక్తదానం వల్ల ఏం ఎక్స్పోజ్ అవ్వవు నువ్వు అన్నారు (ఇది కూడా నిజమే కదా… అనుకున్నా). ఇంతలో ఓ కొలీగ్ – నాకన్నా పెద్దామే – “నేనిచ్చొచ్చాను ఈమధ్యే. ఏం కాదు, చాలా జాగ్రత్తలు తీసుకుంటూన్నారు.. ఖంగారు పడకు” అని భరోసా ఇచ్చింది. దానితో ముందడుగేశా. గతంలో రక్తం ఇచ్చేటపుడు రక్తం చూస్తే భయపడే వాళ్ళని, దాని వల్ల రక్తదానం చేయలేకో, చేసాక కళ్ళు తిరిగో పడిపోయే చాలామందిని చూశాను. ఇప్పటి కాలం లో వైరస్ భయమే ఎక్కువ. 

రెండు వారాలకోసారి, వారం ముందు ఓసారి, నాలుగు రోజుల ముందో సారి రిమైండర్లు – కోవిడ్ జాగ్రత్తల గురించి, వెళ్ళాక ఏమవుతుంది?‌ (కోవిడ్ ప్రశ్నలు, డోనర్ ఆరోగ్యం గురించి ప్రశ్నల చిట్టా, రక్తంలో హిమోగ్లోబిన్ టెస్టు) ఎంతసేపు పడుతుంది? ఇలాంటివన్నీ వివరిస్తూ ఈమెయిల్స్ పంపారు. మధ్యలో ఒకరోజు మళ్ళీ కోవిడ్ anxiety వల్ల వాళ్ళ వెబ్సైటులో ప్రశ్నోత్తరాలన్నీ చదివి, ఉన్నవి చాలక చాట్ బాక్స్ లో రక్తం, ప్లాస్మా, ప్లేట్లెంట్స్ ఇన్ని రకాల దానాలలో తేడా ఏమిటి? నేనేదైనా ఇవ్వొచ్చా? ఇలాంటివన్నీ అడిగి తలకాయ తింటే ఒక రిజిస్టర్ర్డ్ నర్సు నాకు ఓపిగ్గా జవాబులు కూడా ఇచ్చింది. అంతా చూశాక సాహసించానిక – పర్లేదు, నాకేం కాదు అక్కడికి వెళ్ళొస్తే అని. ఇందాక రాసినట్లు, రక్తం గురించి కాదు నా భయం – కోవిడ్ గురించి! ఇంట్లో నాతో పాటు ఉన్న కుటుంబం గురించి!)

అయితే, అసలు వెళ్ళినప్పటి నుండి ఇల్లు చేరేదాకా ఇదే ఇప్పటి దాకా నా బెస్ట్ రక్తదానం అనుభవం. వెళ్ళగానే టెంపరేచర్ చూసి, ప్రశ్నలూ అవీ వేసీ ఇంకో గదికి పంపారు. కెనడాలో ఇదే మొదటిసారి కనుక అక్కడ వాళ్ళ డేటాబేస్ లో నానా రకాల ప్రశ్నోత్తరాలకి జవాబులు రిజిస్టర్ చేశారు. తరువాత ఒకామె వచ్చి హీమోగ్లోబిన్ లెవెల్ చూడ్డానికి ఓ చుక్క రక్తం తీసుకుంది. చివరికి మళ్ళీ ఓసారి అంతా వివరంగా చెప్పాక, రక్తదానం మొదలైంది. ఐదు నిముషాల ఒక సెకను పట్టింది అంతే సాధారణ మొత్తంలో రక్తం తీయడానికి. అంతేనా? ఇంతకుముందు ఇంకాసేపు పట్టేదే అనుకున్నా. కానీ ఆమె మొదటే అనింది – if you are hydrated, it is very quick అని. అంతే ఇంక. మరో ఐదునిముషాలు కూర్చున్నాక ఇంక పొమ్మన్నారు జ్యూసు, నీళ్ళు, బిస్కట్లు గట్రా కొన్ని వాయినం కూడా ఇచ్చి పంపారు… ఇస్తినమ్మా రక్తం, పుచ్చుకుంటినమ్మా వాయినం. 

ఇన్ని దేశాల్లో కెనడా వారి రక్తదాన శిబిరాల పద్ధతి అన్నింటికంటే సులభంగా అనిపించింది. ఆ తరువాత ఇండియా – నిజానికి ఈ వెబ్సైటులూ అవీ ఉన్నాయో లేదో నాకు తెలీదు కానీ, పది-పదిహేనేళ్ళ క్రితం ఆ శిబిరాలు తరుచుగానే కనబడేవి ఇండియాలో. అక్కడెప్పుడూ‌ నాకు రక్తం ఇవ్వడానికి ఇబ్బందులు కానీ, ఎక్కడివ్వాలి? అన్న ప్రశ్న కానీ ఎదురవలేదు. అయితే నేను అక్కడే పుట్టీ పెరిగిన దాన్ని, స్వచ్ఛంద సంస్థలలో మధ్య మధ్య వాలంటీర్ గా వెళ్ళేదాన్ని .. ఒకసారి ఇలాగే రక్తదాన శిబిరంలో కూడా వాలంటీరు గా చేశాను (అప్పట్లో ఆపనులు చేసే స్నేహితులు పట్టుకుపోయేవారు ఖాళీగా కనిపిస్తే – స్వతహాగా అంత సేవా దృక్పథం లేదు నాకు). కనుక కొంచెం ఎక్కువ తెలిసేవి ఇలాంటి శిబిరాల గురించి.  కెనడాలో అయితే కొత్త వాళ్ళకి కూడా తేలిక అనిపించింది. డ్రైవర్స్ లైసెన్స్ దగ్గరే అవయవ దానం గురించి అడిగి, కార్డు మీద డోనర్ అని వేసేశారు. ఐ/టిశ్యూ డోనర్ గా కూడా రిజిస్టర్ అవడం తేలిక ప్రభుత్వం వారి ఆరోగ్య భీమా వివరాలకి అనుసంధానం చేశారు కనుక.  ఇలా  ఒక్క అదనపు కార్డు కూడా పెట్టుకోకుండానే నేను నేత్ర/అవయవ/టిస్యూ దాతగా రిజిస్టర్ అయిపోయా కెనడాలో.  ఇపుడు బ్లడ్ డోనర్ గా కూడా రిజిస్టర్ అయిపోయా కనుక ఇంకోసారి ఇవ్వాలనుకుంటే‌ మరింత తేలిక – ఆల్రెడీ వాళ్ళ లిస్టులో ఉన్నా కనుక. బ్లడ్.సిఏ వారిది ఒక ఆప్ కూడా ఉంది. నాకు ఆప్ లు గిట్టవు కానీ దీన్ని మాత్రం దిగుమతి చేసుకున్నా భవిష్యత్ స్పూర్తి కోసం. 

మొత్తానికి  “రక్తదానం నిరంతర అవసరం. ఈ మహమ్మారి కాలంలో మరింత అవసరం” అన్నది నేనిచ్చే సందేశమనమాట. నేత్ర దానం చెయ్యండి, మరణంలో జీవించండి, మరణించీ జీవించండి అన్న ప్రకటనకి ఊగిపోయి ఆవేశపడిపోయే చిన్నపుడు ఐ డోనర్ గా సైనప్ అయ్యా. అంత క్యాచీగా రాయడం నాకు రాదు – కనుక ఇలా రాసుకుంటున్నా. మనం శ్రమలేకుండా చేయగలిగే ఏకైక గొప్ప పుణ్యకారం ఇదే అని నా అభిప్రాయం.  ఇక ఇక్కడ పద్ధతి తెలిసింది కనుక ఇకపై ఏడాదికి ఒకట్రెండు సార్లన్నా ఇవ్వాలి అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో!

మా పాప పుట్టిన రోజు లోపు చెయ్యాలనుకుని వెళ్ళా. ఈ వారంలో మా తాతయ్య మరణం తో – ఇది ఆయన జ్ఞాపకంగా కూడా నేను చేసుకుంటున్నట్లు అయ్యింది. పుట్టినరోజుకీ, చావులకీ రక్తదానం ఏమిటి? అంటారా – కేకులు కూడా కోస్తామండి తర్వాత పుట్టినరోజుకి. కన్నీళ్ళు కూడా కారుస్తాం తాతకోసం- ఒక్కోళ్ళకీ ఒక్కో పద్ధతి ఉంటుంది కష్టానికీ, సుఖానికీ స్పందించడానికి. అందువల్ల ఏమనుకోకండి నా గురించి 🙂

స్వస్తి.  

Published in: on May 16, 2021 at 2:00 am  Comments (1)