నీ ప్రశ్నలు నీవే…

ఈ టపా రాయకూడదు అని చాలా ట్రై చేసా – ఎందుకంటే చెప్పలేను. మరీ పెస్సిమిస్టిగ్గా అనిపిస్తుందని నా అనుమానం అని నేననుకుంటున్నాను. అయినా, ఆ పదాలలా ఉంటే నేనేం చేస్తాను గానీ, అది మరీ నన్నలా పడుకున్నా లేచినా నిల్చున్నా, కూర్చున్నా వెంటాడుతూ ఉంటే – ఇక రాయకుండా ఉండలేకపోతున్నా. ఆ టైటిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా, దేని గురించి మాట్లాడుతున్నానో – “కొత్త బంగారు లోకం” సినిమాలోని “నీ ప్రశ్నలు నీవే…ఎవ్వరో బదులివ్వరుగా..” పాట గురించి.

నేను సినిమా చూడలేదు కనుక ఆ పాట ఎప్పుడొస్తుందో, ఎందుకొస్తుందో నాకు తెలీదు. కానీ, ఆ పాట ఎప్పుడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా ఎంతో విలువైన మాటలు చెబుతుందని నాకు అనిపిస్తుంది. నెలరోజులుగా దాదాపు ప్రతి రోజూ ఒకసారైనా ఈ పాట వింటున్నా. విన్న ప్రతిసారీ రకరకాల భావాలు కలుగుతున్నాయి – ఒకసారి అసహాయత పై అసహ్యం, ఒకసారి ఆశ చిగురించడం, ఓ సారి నవ్వు రావడం, ఓ సారి కళ్ళలో నీరు తిరగడం, ఓ సారి కోపం – ఇలా నేను రకరకాల ఉద్వేగాలకు లోనయ్యాను వివిధ సందర్భాల్లో ఈ పాట ద్వారా.

” నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా”

ఔను నిజం ఔను నిజం నీవన్నది నిజం నిజం! నిజం నిజం! 🙂
ఈ రెండు లైన్లు మాత్రం, Ultimately, నీ తంటాలేవో నువ్వు పడాల్సిందే, అని నాకు నేను చెప్పుకున్న ప్రతిసారీ గుర్తొస్తాయి …
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

-నాకు నవ్వు వచ్చేది ఇక్కడే. ఎలా ఉంటుందంటే, బాగా అనుభవంలో తలపండిన మనిషి, కొత్తగా వచ్చినవాడికి “సూక్ష్మం గ్రహించు నాయనా!” అని చెబుతున్నట్లు ఉంటుంది నాకు. గ్రహించామా? గ్రహిస్తామా? అన్నది పక్కన పెడితే, నా కళ్ళ ముందు ఓ బ్రహ్మానందం తరహా పాత్ర ప్రత్యక్షమై, ఆ తరహా వ్యంగ్యం వినిపిస్తుంది నా చెవులకి.

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా

-ఫిలో ఫిలో…. ఇలా మొదలుపెట్టామంటే, ఇక ఐనట్లే. ప్రతీదీ ఇలాగే చెప్పుకుంటూ పోవచ్చు 😉 ఎటొచ్చీ, నేను చెబితే జనానికి అర్థం కాదు. గొప్పోళ్ళు, సామాన్యుల భాషలో రాసి పుణ్యం కట్టుకుంటారన్నమాట.
“బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా”
-అని అంటూ ఉంటే, ధైర్యం చెప్పడానికి నేపథ్యం తయారు చేసుకుంటున్నారేమో అనుకుంటే,
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా
ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

-అని ఇంకా భయపెట్టేస్తారు. ఇదంతా నాకు రాత్రి ఆఫీసు నుంచి వస్తూ, ట్రాఫిక్ జాంలలో ఇరుక్కున్న ఏడుపుగొట్టు బస్సులో ఊసురోమని కూర్చుని వింటున్నప్పుడు పరమ పెస్సిమిస్టిగ్గా అనిపిస్తుంది. అయినా రిపీట్ కొట్టీ మరీ ఈ పాటనూ, బ్యాక్ బ్యాక్ కొట్టి ఈ లైన్లనూ మళ్ళీ మళ్ళీ వింటాను. ఎందుకంటే ఏం చెప్పను? అదంతే!

“అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా”

– Hmm… అనుకుంటూ ఎన్నిసార్లు విన్నానో ఈ వాక్యాలని. కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా….. అన్నప్పుడల్లా నేను జవాబు కోసం వెదుక్కుంటూనే ఉంటాను..ఉన్నాను.

గతముందని గమనించని నడిరేయికి రేపుందా
గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా

– ఈ రెండో లైన్ కూడా… దూరం గమ్యం ..ఏదీ తెలీని దారుల్లో నడుస్తున్న ప్రతి రాత్రీ గుర్తొస్తుంది..గుర్తొచ్చి…ఆ వాక్యానికి ప్రాణమొచ్చి నా ఎదుట నిలబడి నిలదీస్తున్నట్లు అనిపిస్తుంది.

గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా”

– నిజమే… ఏది గెలుపు? ఎవరిది గెలుపు? రిలేటివ్ గా చెప్పగలమే కానీ, “ఇదే గెలుపు” అని చెప్పగలమా?

పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా

– ఒక్కసారి తప్పు చేస్తే, ఒక్కోసారి సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. ఆ తప్పుల చీకట్లో పడి మగ్గడం తప్ప. సూటిగా తగుల్తూ ఉంటుంది ఈ భాగం నన్ను. తగిలిన ప్రతిసారి చల్లగా భయపెడుతూ ఉంటుంది కూడా….

మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా

– కోల్పోతే గానీ దేని విలువా తెలీదేమో! ఒక్కోసారి కోల్పోయినవి తిరిగి పొందొచ్చు. ఒక్కోసారి, సరిదిద్దుకోలేని తప్పులు చేసినప్పుడు – ఇలాంటి వాక్యాలు చదువుకుని సాంత్వన పొందాల్సిందే ఏమో!

మొత్తానికి… జీవితంలోని చేదునిజాలని జీర్ణం చేసుకోలేకపోయినా…సగం వరకూ అయినా అంగీకరించడానికి నాకీపాట ఎంతో దోహదపడింది అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే….

Published in: on August 19, 2009 at 9:48 am  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2009/08/19/nee-prasnalu-neeve/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. మీరు ఈ పాటని విడమర్చి చెప్పిన విధానం బాగుంది.
    ఇందులో పెసిమిజం ఉందని ఎందుకనుకోవాలండీ ? ఈ వాక్యాల్లో చాలా వరకు ఆశావాదమే కనిపిస్తుంది.
    //ఒక్కసారి తప్పు చేస్తే, ఒక్కోసారి సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. ఆ తప్పుల చీకట్లో పడి మగ్గడం తప్ప
    పొరపాట్లే జరగకపొతే ఇక ఆలోచించే అవకాశం ఎక్కడినుంచి వస్తుంది ?
    //నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
    నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
    ఇవి నిజమైన ఆశావాదానికి చిహ్నాలు.

  2. Thanks for a good post.Very nice understanding.

  3. Hmm.. Quite an interesting post. Even I love this song and i think I agree to most of the points in this and somehow it tends to reinforce my belief that at the end of the day, you are alone and you fight your battles alone. But as long as you have the faith in urself to will through the hardships, I am sure that you will find some solace from within you to succeed.

    Anyway, leaving all that aside, loved the way you wrote ur perspective on the song 🙂

  4. Same here sowmya… గత కొద్ది రోజులుగా ఈ పాట పదే పదే నా మదిలో మెదులుతూ ఉంది. రోజు నన్ను తన వైపుకు లాక్కుంటొంది. ఉండబట్టలేక కంటిన్యూస్ గా లూప్ లో వింటూనే నా బ్లాగ్ లో పాట సాహిత్యం పోస్ట్ చేసుకున్నాను. [అక్కడుంటే బాగుంటుంది అనిపించింది.] కానీ మీ టపా చదివాకా నేను ఈ పాట గురించి ఇదివరకెరగని ఒక అందమైన దృక్కోణం కనిపించింది. దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు అనిపించింది చిన్నగా ఇక్కడ పంచుకుంటున్నాను.

    జీవితంలో చేదైన నిజాలను చెబుతూనే అవి మనిషిని పడదోయకుండా ఎంతో మృదువుగా నచ్చచెబుతున్నట్టుగా ఉంటుంది ఈ పాట. మనిషి ఆలోచనలో సమతుల్యం అవసరం అని వివరిస్తుంది.

    >> గతముందని గమనించని నడిరేయికి రేపుందా
    గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా

    మొదటి లైన్ లో ఆశ యొక్క ప్రాముఖ్యతని చెబుతూనే…
    రెండో లైన్ లో ఆ ఆశ గుడ్డిగా కాకుండా గమ్యం చేరాలంటే దానికి ఒక గతి ఉండాలి అని చెప్పినట్టు అనిపించింది.

    >>గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది
    సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా

    ఇది గెలుపు, ఇది గెలుపు కాదు అని చెప్పేందుకు రుజువులు ఏమీ లేవు అని ఒక పక్క చెబుతూనే…. ఇంకో పక్క.. గెలుపు సంగతి ఎలా ఉన్నా… పక్క వారి ఓటములను [అనుభవాలను] చూసి నేర్చుకోలేవా అని ప్రశ్నించటం..

    >>పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా
    ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా

    చేయి జారిన క్షణం తిరిగిరాదన్న స్పృహ ఉండాలి. ఆ స్పృహతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఒకవేళ జారితే అదొక పాఠం అనుకోగలగాలి.

    ఇలా ఎన్నో విషయాలను తక్కెడలో రెండు వైపులా సరి తూగేలా చెప్పటం వలనేనేమో, ఈ పాట విన్న ప్రతి సారీ ఒక్కో కొత్త అనుభూతి కలుగుతుంది. ఒక్కో సారి నిరాశావాదం గుప్పించినట్టు, మరోసారి ఆశను రేకెత్తించేట్టు అనిపిస్తుంది, అలరిస్తుంది.

    Thank you. 🙂

  5. adbhutamaina alochana vidhaanam meedi..


Leave a comment