విచారణ (Visaranai) – తమిళ చిత్రం

“విసారణై” అన్న తమిళ సినిమా గురించి పోయినేడాది చివర్లో మొదటిసారి విన్నాను. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏదో అవార్డు వచ్చిందని. తరువాత ఈ ఏడాది రిలీజు అయినపుడు మళ్ళీ విన్నాను. సీరియస్ సినిమాలూ అవీ చూసి తట్టుకోగలిగే మూడ్ ఉన్నప్పుడు చూద్దామని వాయిదా వేస్తూ ఇన్నాళ్ళకి ఇప్పుడు చూశాను. అంతే…సినిమా అయ్యాక కూడా అలా స్క్రీన్ వంక చూస్తూనే ఉన్నాను కాసేపు షాక్ లో. నాకు గొప్పగా అనిపించిన సినిమా కనుక ఏదో నాలుగు ముక్కలు రాసుకుందామని ఇలా వచ్చాను.

సినిమా కథ క్లుప్తంగా: తమిళనాటి నుండి వచ్చి గుంటూరులో ఓ పార్కులో ఉంటూ చిన్నా చితకా పనులు చేసుకుంటున్న నలుగురు యువకులని అనుకోకుండా ఓరోజు ఉదయాన్నే పోలీసులు పట్టుకెళ్ళడంతో కథ మొదలవుతుంది. అక్కడ వాళ్ళని ఏదో చేయని నేరం గురించి ఒప్పించాలి పోలీసులు…ఎందుకంటే ఆ కేసు మూసేయాలని పైన్నుంచి ఒత్తిడి, దొంగలు దొరకలేదు. దొంగలు తమిళులు అన్న క్లూ ఉంది కనుక వీళ్ళని వేసేసారు. భాష రానందువల్ల వీళ్ళూ ఏం అడిగేదీ అర్థం కాక ఏదో చెప్పి ఇరుక్కుపోయారు. పోలీసులు నానా హింసా పెట్టి లాస్టుకి వీళ్ళ చేత నేరం ఒప్పించి కోర్టుకి పట్టుకెళ్తారు. అయితే, కోర్టులో వీళ్ళు జరిగిందిదీ అని చెప్పేసరికి ఓ తమిళ పోలీసాయన సహాయంతో అర్థం చేసుకున్న జడ్జి వీళ్ళని విడిచిపెట్టేస్తాడు. అయితే, ఆంధ్ర పోలీసుల నుంచి అదృష్టవశాత్తూ తప్పించుకున్న వీళ్ళు తమిళనాడు పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఇరుక్కుంటారు. అక్కడ మతలబులు వేరే. చివ్వరికి వాళ్ళు పోలీసుల నుంచి బైటపడ్డారా లేదా? అన్నది మిగితా సగం సినిమా.

సినిమాలో చాలా హింస ఉంది. చాలా వేదన ఉంది. అయితే, చాలా ఇతర సినిమాల్లోలా అదేదో stylized violence కాదు. హీరోయిజం కోసమో, విలన్ కౄరత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకో, బడ్జెట్ ఉంది కదా అని చూపెట్టుకోడానికో ఉన్న హింస కాదు. దీనిలోని హింస కథలో భాగంగా , కథానుగుణంగా ఉన్నది. అసలు సాధారణంగా ఇతర సినిమాల్లో విపరీతం, అనవసరం అనిపించే తరహా హింసాత్మక సన్నివేశాలు ఈ సినిమాలోని పరిస్థితుల మధ్య out of place అనో, అనవసరం అనో అనిపించలేదు. నేపథ్య సంగీతం, ఆ పోలీస్ స్టేషన్, కోర్టు, సెట్ల డిజైన్, పోలీసుల దెబ్బలు, బాధితుల స్పందనలు, ఖైదీల సంభాషణలు – అన్నీ చాలా సహజంగా అనిపించాయి. అలాగని చూసి తట్టుకోగలమా? అంటే జవాబు చెప్పడం కష్టం. సినిమా చూసి తరువాత ప్రశాంతంగా పని చేసుకోవాలంటే కొంచెం గుండె ధైర్యం కావాలి అని నా అభిప్రాయం.

పోలీసు పాత్రలు కొన్ని, వాళ్ళ ఆలోచనావిధానం, నన్ను భయపెట్టేశాయి. పోలీసు పాత్రల్లో సముతిరఖని పాత్ర చిత్రణ గొప్పగా అనిపించింది నాకు. అయితే, అందరికంటే ఆకట్టుకున్నది ఆ నలుగురు తమిళ వర్కర్లలో పాండిగా వేసిన దినేశ్. నిజంగా అతను ఆ అరెస్టయిన మనిషే అనిపించేలా ఉండింది. సినిమాకి వీళ్ళంతా పెద్ద అసెట్. కథ చాలా ఉత్కంఠభరితంగా రాశారు. పొరలుపొరలుగా ఏదో ఒకటి కొత్త ట్విస్టు వస్తూనే ఉంటుంది చివరిదాకా. అందువల్లనే అవార్డు తరహా సినిమానే అయినప్పటికీ ఇతర కమర్షియల్ సినిమాల్లాగే థ్రిల్లర్ లా కూడా అనిపించింది నాకు. ముఖ్యంగా ఆ చివర్లో క్లైమాక్స్ సీన్లు – అసలేం చేస్తారో లాస్టుకి అని టెన్షన్తో చూశాను నేను. క్లైమాక్సు ఏ పోలీస్ స్టేషన్ లోనో, అడవిలోనో, మరే అటువంటి ప్రదేశంలో కాక, మామూలు మనుషులు తిరిగే రెసిడెన్షియల్ ఏరియాలో జరుగుతుంది. సీను అయాక చివ్వర్లో వచ్చే నేపథ్య సంభాషణ కూడా ఇంకా ఏదో కొత్త విషయం తెస్తూనే ఉండింది కథలోకి. బాధ, నిస్సహాయత, అధికారం, మోసం, అమాయకత్వం – ఇలా ఇన్ని విషయాలూ చాంతాడంత డైలాగులు లేకుండానే సినిమాలో వివరంగా చెప్పారు, చూపించారు. మొత్తానికి పోలీసుల సమక్షంలో అమాయక పేద ప్రజల (ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చినవారి) vulnerability ఈ సినిమా డాక్యుమెంటరీ లాగా కాక, సినిమాగానే ఉంటూ ఎత్తి చూపింది. ఆర్టు సినిమా మామూలు నాన్-మేధావి జనం కోసం తీయగలరా? అంటే, తీయగలరు – ఇలాగ – అనిపించింది నాకు.

ఇంతకీ సినిమా వెనుక కథ: ఇది నిజానికి కొయింబత్తూరుకు చెందిన చంద్రకుమార్ అనే ఒక ఆటోడ్రైవర్ రాసిన నవల ఆధారంగా అల్లిన కథ. చంద్రకుమార్ అంతకుముందు చాలా ఏళ్ళ క్రితం గుంటూరు జిల్లాకి ఏదో పనిచేసుకోడానికి వెళ్ళాడట. అప్పుడు ఏదో కారణం తెలియని కేసులో పోలీసులు అతన్ని, అతని స్నేహితులని ఇరికించి వేధించారట. ఆ అనుభవాల ఆధారంగా అతను రాసిన నవల అది. ఆటోడ్రైవర్ తను రాసిన నవలలని ప్రచురించగలగడం, అవి సినిమాగా రావడం – అంతా తెలుసుకుంటూంటే ఆశ్చర్యంగా అనిపించింది. చంద్రకుమార్ గురించి, అతని రచనల గురించి హిందూ పత్రిక వ్యాసం ఇక్కడ.

ఈ సినిమాని తీసిన దర్శకుడు వెట్రిమారన్, పధాన పాత్రలు ధరించిన నటీనటులు (నాకు తెలిసినది సముతిర ఖని ఒక్కడే, కానీ ప్రధాన పాత్రధారులు అందరూ), నిర్మాత ధనుష్ – అందరూ అభినందనీయులు. ఇప్పుడిక ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలన్న దుర్బుద్ధి ఎవ్వరికీ పుట్టకూడదని మనసారా (ఆందోళనతో) కోరుకుంటున్నాను.

సినిమా చూశాక అంతర్జాలంలో ఒకట్రెండు సమీక్షలు చూశాను. భరద్వాజ్ రంగన్ వ్యాసం నాకు నచ్చింది.

Advertisements
Published in: on July 4, 2016 at 1:05 am  Comments (13)  
Tags:

Unnal Mudiyum Thambi – నా వల్ల మట్టుకు కాదు బాబూ!

నిన్న అంతర్జాల విహారంలో ఉండగా, ఈ “ఉన్నాల్ ముడియుం తంబీ” అన్న సినిమా గురించి వ్యాసం కనబడ్డది. అప్పుడు తెలిసింది నాకు రుద్రవీణ సినిమాకి ఒక తమిళ రీమేక్ ఉందని. గత రెండు మూడేళ్ళలో నేను చూసిన చాలా తమిళ్ సినిమాలు నాకు నచ్చడం వల్లా, దర్శకుడు బాలచందర్ తమిళుడు కావడం వల్లా – తమిళ సినిమా తెలుగు కంటే ఇంకా బాగుంటుంది కాబోలు అనుకుని మొదలుపెట్టాను.

సినిమా తమిళ టైటిల్ కి అర్థం – “తమ్ముడూ, నువ్వు సాధించగలవు” అని… “నమ్మకు నమ్మకు ఈ రేయిని” పాట ఈ సినిమాలో “ఉన్నాల్ ముడియుం తంబీ తంబీ” అని టైటిల్ సాంగ్. అదొచ్చే వేళకి నేను తంబిని కాకపోయినా “ఎన్నాలె ముడియాదు అన్నా” ((ఈ సినిమాని భరించడం) నా వల్ల కాదు అన్నా!) అన్న స్టేజికి వస్తూ ఉన్నాను… వస్తున్నా, వచ్చేశా అనుకున్నా చివరికొచ్చేసరికి ఇంక. ఎందుకూ అంటే – సినిమా తీసిన పద్ధతి. అసలుకే అనవసర మార్పులు కొన్ని. ఆ హీరో అల్లరి చేష్టలు, వంటింట్లో పాట వగైరా అనవసరం అనిపించింది. పాట బాగుంది కానీ, చాలా అసందర్భంగా అనిపించింది. సరిగా establish చేయని సన్నివేశాలు (రమేశ్ అరవిందు ప్రేమ కథ వంటివి)… అంతా మహా చిరాగ్గా అనిపించింది నాకు తెలుగుతో పోల్చుకుంటే. తెలుగులో చూడకుండా చూసుంటే ఎలాగుండేదో! అన్నింటికంటే దారుణం – “లలిత ప్రియ కమలం” పాట తీసిన విధానం. బాబోయి..ఏమిటది? ఆ మంచులో జారుతూ డాన్సులేంది? ఆ ముద్దు మురిపాలేంది? దానితో పోలిస్తే, ఈ సినిమా మూడ్ కి అనుగుణంగా తెలుగులో పాట ఎంత బాగుందో! తెలుగులో కూడా మంచులో తీసిన దృశ్యాలున్నాయి కానీ – అవెలా తీశారు? ఇవెలా తీశారు!!

సినిమా మొత్తంలో కమల హాసన్ అక్కడక్కడా బాగున్నట్లు అనిపించగా, ప్రసాద్ బాబు, మనోరమ మట్టుకు నచ్చారు నాకు. జెమినీ గణేశన్ తెలుగులో చేసినంత గొప్పగా అనిపించలేదు నాకు – మేకప్ తో సహా. అలాగే, హీరోయిన్ నాన్నని కలవడానికి వెళ్ళిన సీను (మన తెలుగులో రండి రండి రండి పాట ఉన్న చోట) కూడా నచ్చింది నాకు, తెలుగు అంత క్రియేటివ్ గా లేకపోయినా. సీత శోభనని ఇమిటేట్ చేసినట్లు అనిపించింది కొన్ని చోట్ల.

రుద్రవీణ సినిమా నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటి. ఇపుడు పాప ప్రక్షాళనగా ఆ సినిమా మూడు గంటలైనా సరే కూర్చుని చూడాలి ఇక! దాదాపుగా ఒకే వయసు నుండి తమిళ-తెలుగు సినిమాలు రెండూ చూస్తున్నా. సాధారణంగా నాకు తమిళ పక్షపాతం ఉందనిపిస్తుంది సినిమాల విషయంలో. ఇదే మొదటిసారి అనుకుంటా పోల్చుకుని తెలుగు సినిమా వందరెట్లు నయం అనిపించిన ఉదంతం. ఇదే ముక్క ఒకరితో చెప్పుకుని వాపోతూ ఉంటే, “వాళ్ళు తెలుగు సినిమా లాగ తీయాలి అనుకుని అలా తీసుంటారులే” అన్న ఓదార్పు వాక్యం లభించింది, లలిత ప్రియ కమలం పాట గురించి.

అంత అందమైన మొహమేమిటి? ఆ పేరేమిటీ? అని చిరంజీవి తెలుగు సినిమాలో చాలాసేపు వాపోతాడు హీరోయిన్ పేరు గురించి. నేనూ సినిమా అయ్యాక 24 గంటలవుతున్నా, ఆ రుద్రవీణేమిటి…దాన్ని ఇలా తీయడమేమిటి? అని ఇంకా వాపోతూనే ఉన్నాను. ఒకే దర్శకుడు తన సినిమాని తానే రీమేక్ చేస్తూ ఇంత దారుణంగా చేయగలడా? అదెలా సాధ్యం? అన్నది నాకిప్పుడున్న భేతాళ ప్రశ్న.

….ఆ విధంగా ఎన్నో నెలల విరామం తరువాత ఈ బ్లాగు రాయాల్సి వస్తోంది నా హృదయ ఘోష వెళ్ళగక్కుకోవడానికి.

Published in: on April 4, 2015 at 7:26 pm  Comments (7)  
Tags:

రజనీకాంత్ నటించిన “శ్రీ రాఘవేంద్ర”

నాకొక రోజు ఉన్నట్లుండి రజనీకాంత్ నటించిన “శ్రీ రాఘవేంద్ర” సినిమా చూడాలనిపించింది. ఎందుకో మరి, అది మట్టుకు గుర్తులేదు. యూట్యూబులో దొరకడంతో తమిళంలో చూడ్డం మొదలుపెట్టాను. సినిమా మొదట్లో రజనీకాంత్ ఇచ్చిన ఉపన్యాసం వింటున్నప్పుడు తెలిసింది అది అతని నూరవ సినిమా అని. సినిమా బాగుంది. రాఘవేంద్ర స్వామి గురించి నాకేం తెలియదు కనుక చాలా ఆసక్తితో చూశాను చివరిదాకా. నన్ను ఆకట్టుకున్న కొన్ని అంశాల గురించి రాసుకోవాలనిపించింది. అవి ఇవి:

* రాఘవేంద్ర స్వామి చిన్నప్పుడు అతను, అతని గురువు “రామనామమొరు వేదమే” అని పాడుకుంటూ ఉండగా అతను పెద్దవాడై రజనీకాంత్ అవుతాడు. నాకా మాట “రామనామమొరు వేదనై” అని వినబడ్డది మొదట. అవాక్కయ్యా. తేరుకోడానికి ఒక రెండు సెకనులు పట్టింది – అప్పుడర్థమైంది అసలు వాళ్ళన్నది వేదమని 😉 వేదన అన్నా నాకు ఆశ్చర్యంగా అనిపించదు లెండి – ఏ భక్తుడి కథలో సుఖాలెక్కువ ఉన్నాయి కనుక!! పాట చాలా నచ్చింది నాకు.

* ముఖ్యంగా రజనీకాంత్ గురించి చెప్పాలి. ఈయనపై నా అభిమానం గత కొన్నేళ్ళలో ఏర్పడ్డది. శివాజీ గణేశన్ కి మల్లే మొదట్లో నచ్చకపోయినా కాలక్రమేణా అభిమానించిన నటుడు. గొప్పగా చేశాడు ఈ సినిమాలో. అతని స్టయిల్ కి, అతని సినిమాలకీ చాలా భిన్నమైన వేషం ఇది. రాఘవేంద్రరావు టైపు దర్శకత్వం కూడా కాదు (అయినా కూడా ఆ లక్ష్మి-మనోరమ-ఇతర స్నేహితురాళ్ళ పాట నాకు చాలా అసందర్భంగా అనిపించింది, అది వేరే విషయం). అయినా నన్ను ఆకట్టుకున్నాడు. He is a star, in all aspects of the word! రాఘవేంద్రస్వామి చూడ్డానికి ఎలా ఉండేవారో పటంలో చూడ్డం మినహా నాకు తెలియకపోవడం వల్ల రజనీకాంత్ ఆహార్యంలో నాకాట్టే ఏమీ తేడా కనబడలేదు. ధన్యోస్మి. Ignorance is bliss, really!

* రాఘవేంద్రస్వామి గృహస్థాశ్రమంలో ఆయన భార్య సరస్వతిగా లక్ష్మి కొన్ని చోట్ల గొప్పగా నటించింది. సినిమా లో ఒక గంటా, పదిహేను నిముషాల తర్వాత వచ్చే దృశ్యంలో కుటుంబ పరిస్థితుల వల్ల ఇళ్ళలో పనిచేసేందుకు వెళుతుంది ఆమె. ఆ సమయంలో ఇతర బ్రాహ్మణ పెద్దలు వచ్చి ఆవిడ చేస్తున్న పనిని ఆక్షేపిస్తే ఆమె స్పందించిన తీరు – నా కళ్ళకి గొప్పగా కనబడ్డది.

* సరస్వతి దేవి కనబడి రాఘవేంద్రస్వామితో “కృతయుగంలో నీవు ప్రహ్లాదుడివి. మరో జన్మలో వ్యాసతీర్థుడివి, కలియుగంలో రాఘవేంద్రుడివి” అంటుంది. కెవ్వ్! అనిపించింది ఆ దృశ్యం నాకైతే. నాకు రాఘవేంద్రస్వామి గురించి ప్రచారంలో ఉన్న కథలేవీ తెలియవు కనుక!

* ఆయన సన్యాసం తీసుకున్నాడన్న బాధలో ఆయన భార్య బావిలోకి దూకి మరణిస్తుంది. ఆవిడ ఆత్మ ఆ తరువాత రాఘవేంద్రస్వామిని చూట్టానికి వస్తే ఆయన ఆమెని తొందరపడ్డావంటాడు. ఏమిటో – వాళ్ళకి గల ఆ పిల్లవాడు ఏమైనాడో! లోకకళ్యాణం కోసం కుటుంబాన్ని త్యాగం చేయాలనుకునేవాళ్ళు గొప్పోళ్ళు, సంసారిగా ఉండాలనుకుని జీవితం గురించి కలలు కనేవాళ్ళు మట్టుకు తొందరపడేవాళ్ళు…. అదనమాట. మామూలు మనుషులు, మామూలు మనస్తత్వాలను తక్కువ చేసి చూపడం ద్వారా హీరోలు ఎలివేట్ అవుతారు…. పౌరాణికమా? సాంఘికమా? అన్న తేడా లేదనుకుంటా ఈ ముక్కకి మట్టుకు 🙂

* ఒకానొక సమయంలో సరస్వతి దేవి మానవరూపంలో రాఘవేంద్రస్వామిని ప్రార్థిస్తే ఆయన ఒక అగ్నిప్రమాదం నుండి ఆవిడని, ఆవిడ ఇంటిని కాపాడతాడు. ఆవిడ ఆయనకి ధన్యవాదాలు తెలిపితే, ఆయన “ఎందుకీ పరీక్ష?” అని అడుగుతాడు. “బిడ్డకి గోరు ముద్దలు తినిపించే తల్లి బిడ్డ చేత ఓ ముద్ద తినాలని ఆశించకూడదా? నేనూ అలా ఆశపడ్డాను.” అంటుంది ఆవిడ. అద్భుతంగా అనిపించింది నాకు ఆ దృశ్యం రాసిన తీరు.

* పాటలు అద్భుతంగా ఉన్నాయి. భక్తిభావం అలా పొంగి పొర్లుతోందంతే! (ఇళయరాజా సంగీతం. చాలా పాటలకి యేసుదాసు గానం)

మొత్తానికి సినిమాలో భక్తిభావం కన్నా కుటుంబ కథా చిత్రం భావం ఎక్కువగా కలిగింది నాకు. అయితే, అది నేను ఒక కంప్లైంట్ లాగా చెప్పడం లేదు. రాఘవేంద్రస్వామి జీవితం గురించి నాకు తెలియదు. ఈ సినిమాలో ఎంత నిజం ఉందో నాకు తెలీదు. అయితే, ఒక సినిమాగా ఆ కథలోని డ్రామా ఎలిమెంట్ వల్ల నాకు చాలా నచ్చింది సినిమా. అన్నట్లు ఈ టపాలో సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలని మాత్రమే ప్రస్తావించాను. ఇంకా సినిమాలో రాఘవేంద్ర స్వామి మహిమలు, ముఖ్యమైన భక్తుల ప్రొఫైల్స్ – ఇవన్నీ వస్తాయి. ఆయన మంత్రాలయం కి రావడం, సమాధి చెందడం వరకు కథ సాగుతుంది.

సినిమా చూడ్డంతో గతం గుర్తొచ్చింది. కర్నూలుకి దగ్గర కావడంతో మంత్రాలయానికి చిన్నప్పుడు రెండు మూడు సార్లు వెళ్ళినట్లు గుర్తు, వివిధ వ్యక్తులతో. ఈసారి దేశం వెళ్ళినపుడు వీలు చూసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. భక్తి కారణాలకి కాదు సుమండీ! జీవన్ముక్తికి అంతకంటే కాదూ.. ఏదో కోల్పోయినవేవైనా దొరకబుచ్చుకుందామని కావొచ్చు. కోల్పోయినవేమిటో మట్టుకు ఇంకా తెలియదు. 🙂

సినిమా తాలుకా తెలుగు అనువాదం కూడా యూట్యూబులో ఉంది. కానీ ప్రింటు అంత గొప్పగా లేదు. అందువల్ల నేను తమిళంలో చూశాను. సబ్-టైటిల్స్ లేవు తమిళ వర్షన్ కి.

Published in: on July 13, 2014 at 1:53 pm  Leave a Comment  
Tags:

పరాశక్తి (శివాజీ గణేశన్ తొలి చిత్రం)

చాలారోజుల, నెలల బట్టి “పరాశక్తి” చూడాలనుకుంటూ, “మనకెక్కడ ఇందులోని ప్రాపగాండా అంతా భరించే ఓపిక?” అనుకుని వాయిదా వేస్తూ వచ్చాను. పోయిన వారం ఫేస్బుక్ లో కప్పాలోట్టియ తమిళన్ ప్రస్తావన రావడంతో, ఒక స్నేహితునితో సంభాషణలో “పరాశక్తి” ప్రస్తావన వచ్చింది. సరే, శివాజి సినిమా ఏదన్నా చూసి కొన్ని రోజులైంది కదా (అంతకు మూడ్రోజుల ముందే తిరువిళయాడళ్ లోని కొన్ని దృశ్యాలు చూసిన విషయం లెక్కలోకి తీసుకోకూడదు) అని, ఇంటికి వెళ్ళగానే “పరాశక్తి” చూశాను. మూడు గంటల సినిమా. దాదాపు ఎనభై శాతం సినిమా దాకా నేను “అబ్బ! ఏమి సినిమా! ఏమి నటన!” అన్న వావ్! ఫీలింగ్లోనే ఉన్నాను. శివాజి అద్భుతమైన నటన, కరుణానిధి పవర్ఫుల్ డైలాగులు (నాకు వందశాతం అర్థం కాలేదు కానీ, అర్థమైనంతలో చెబుతున్నా), అనవసరమే ఐనా బాగున్న పాటలు, కథలోని విషాదం – అన్నీ అలా నన్ను కట్టిపడేశాయి.

కథ క్లుప్తంగా చెప్పాలంటే: ముగ్గురు సోదరలు రంగూన్ లో జీవిస్తూంటారు. తమిళనాట జరగబోయే తమ చెల్లెలి పెళ్ళికి చాలా ఏళ్ళ తరువాత ఇండియా వెళ్దాము అనుకుంటూ‌ ఉంటారు. అది రెండో‌ ప్రపంచ యుద్ధం జరిగే సమయం. వీళ్ళందరికీ కలిసి వెళ్ళడానికి షిప్ లో స్థలం ఉండదు. దానితో గుణశేఖరన్ అన్న పేరుగల మూడో వాడిని పంపుతారు, మిగితా వాళ్ళు తరువాత వద్దాం అని. అతను మన శివాజీ. ఈ నౌక మధ్యలో అనేక ఇబ్బందులు పడి లాస్టుకి చాలా రోజుల తరువాత దేశంలోకి వస్తుంది. ఇతను వాళ్ళూరు వెళ్ళే ముందు ఒకరోజుకని ఒక హోటెల్లో ఆగుతాడు. ఇంతలోపు ఇతన్ని మోసం చేసి డబ్బులు కాజేస్తారు ఒక ముఠా వాళ్ళు. చేతిలో‌ డబ్బు లేదు. ఆకలి. ఎలా నెట్టుకురావాలో తెలీదు. ఈ పరిస్థితుల్లో అతను నగరంలో పిచ్చివాడి వేషం వేసి తిరుగుతూ పొట్టపోసుకుంటూ ఉంటాడు. ఇలాగే ఒకరోజు చివరికి వాళ్ళ చెల్లెలి అడ్రస్ కనుక్కుని అక్కడికి చేరుకుంటాడు. అక్కడ ట్విస్ట్ ఏమిటంటే – చెల్లి పెళ్ళయ్యాక, ఒక బాబుకి జన్మనిస్తుంది. ఆ టైములోనే ఆక్సిడెంటులో ఆమె భర్త, ఆ షాక్లో ఆమె తండ్రీ మరణిస్తారు. ఆస్థి మొత్తం వేలం వేస్తారు. ఆమె ఇడ్లీ కొట్టు పెట్టుకుని బ్రతుకుతూంటుంది. మరి తన ప్రసుత్త పరిస్థితిలో చెల్లి కళ్ళబడ్డం ఇష్టంలేక అతను తానెవరో చెప్పకుండానే ఆమెకి సాయం చేస్తూంటాడు. ఇంతలోపు మనకి మిగితా ఇద్దరు సోదరులూ ఎమయ్యారో తెలుస్తుంది. ఎవళ్ళకి వాళ్ళకి తక్కిన సోదరులు, సోదరి ఏమయ్యారో తెలియదు అనమాట. ఇదిలా ఉండగా, గుణశేఖరన్ కి ఒక హీరోయిన్ ఎంట్రీ‌ (పండరీబాయి). ఒకానొక సందర్భంలో ఆకలి బాధకి తాళలేక తన పిల్లవాడిని నదిలో పడేస్తుంది చెల్లి. దానితో భ్రూణహత్య నేరమని ఆమెని, సైడ్ ట్రాక్లో ఫలానా ఒకతన్ని కొట్టాడని గుణశేఖరుడినీ కోర్టులో ప్రవేశపెడతారు. జడ్జి – పెద్దన్న! రెండో అన్న కూడా వస్తాడు సీన్ లోకి. క్లైమాక్స్ దృశ్యం లో అందరూ కలుసుకుంటారన్నమాట. (మీకు బాగా వివరంగా కథ కావాలంటే – వికీ పేజీ చూడండి, లేదా సినిమా చూడండి).

సినిమా లో చాలా‌ రాజకీయ ప్రాపగండా ఉంది కానీ, మామూలుగా సినిమాలాగ తీశారు – డాక్యుమెంటరీలాగ కాకుండా. కనుక, కావల్సినంత నాటకీయత, నవరసాలూ – ఉన్నాయి. ముఖ్యంగా శివాజీని చూడ్డానికి రెండు కళ్ళూ చాలవనే చెప్పాలి :-). ఇది తొలి సినిమానా ఇతనికి? నిండా పాతికేళ్ళైనా లేని నటుడు – ఇంత అనుభవం కలవాడిలా ఆ పాత్రలోకి ఒదిగిపోయాడా? అని ఆశ్చర్యపోయాను నేను. నిజమే, అతనికి రంగస్థల అనుభవం ఉంది. అయినా, తొలి సినిమా తొలి సినిమానే. సినిమా క్లైమాక్స్ దృశ్యంలో కోర్టులో వాదించే సీన్ ఉంది – అందరూ దాని గురించి ప్రముఖంగా చెబుతారు. కానీ, సినిమా మొత్తంలో అతను కనబడ్డ ఏ దృశ్యమైనా అదే స్థాయిలో ఉందని నా అభిప్రాయం. ఉన్న దానికి తోడు ఆ కథలోని ట్విస్టుల వల్ల, నాలాంటి hyper imaginative మనుషులు పూర్తిగా లీనమైపోయి, నవరసాలూ అనుభవిస్తారు అనమాట!‌:-)

కొన్నున్నాయి – నాకు నచ్చనివి:
౧. సినిమాలో ఆ ట్విస్టులు అవీ అటుపెడితే, పండరీబాయి పాత్ర ఎంట్రీ, హీరో-హీరోయింల మధ్య ప్రేమా, స్నేహం – ఇవన్నీ మరీ సడెన్ గా జరిగిపోయినట్లు, నాటకీయంగా, కృతకంగా అనిపించాయి నాకైతే.
౨. ఆ చివ్వరి అరగంటా ఎంత నాటకీయంగా ఉంటుందంటే…అంత నాటకీయంగా ఉంటుంది. నటీనటుల (ముఖ్యంగా గణేశన్) వ్యక్తిగత ప్రతిభావిశేషాలు కూడా ఆ భాగం “బోరు కొడుతుంది” అనకుండా ఆపలేకపోతున్నాయి నన్ను అంటే అర్థం చేసుకోవాలి మరి.
౩. మాట్లాడితే పాట. పాటలు బాగున్నాయి కానీ, అన్ని అక్కర్లేదేమో.

ఇంకెక్కువ రాయదల్చుకోలేదు కానీ – నాకైతే సినిమా మొత్తానికి నచ్చింది. ఆ చివరి అరగంటా కొంచెం విసుగు పుట్టించింది కానీ, దాని కారణంగా మొత్తం సినిమాని తీసిపారేయలేను. డైలాగుల కోసం, శివాజీ కోసం చూడవచ్చు.

Published in: on March 17, 2014 at 7:00 am  Comments (1)  
Tags: ,

సివంద మణ్ (తమిళం)

శివాజీ సిరీస్ లో భాగంగా నాకు పరిచయమైన సినిమా ఇది. ఆ కాలంలో విదేశీ షూటింగులు, వివిధ ఐరోపా దేశాల్లో తీసినందువల్ల బాగా ప్రసిద్ధి పొందిన చిత్రమని చదివాక కుతూహలం కలిగింది. అందులోనూ – హీరో హీరోయిన్లు నాకు ఇష్టమైన శివాజీ-కాంచన! వీళ్ళ జంట ఎలా ఉంటుందో? అని ఊహించుకోలేదు కాని, సినిమా థ్రిల్లర్ అని… చూడ్డం మొదలుపెట్టా.

క్లుప్తంగా కథ ఏమిటంటే – వసంతపురి అని ఒక రాజ్యం. కథాకాలం ఏమిటో నాకు అర్థం కాలేదు కానీ, ఏదో, ఆధునిక కాలమే. అందరూ ప్యాంట్లు, చొక్కాలు, మాడర్న్ దుస్తులూ వేసుకునే ఉన్నారు. మొత్తానికి పోర్టుగీసు ప్రలోభాలకి లొంగి ఈ వసంతపురి దివాను (నంబియార్) ఆ రాజ్యపు రాజుని (జావర్ సీతారామన్) కట్టడి చేసి, తానే రాజులా ప్రవర్తిస్తూ ఉంటాడు. రాజు కూతురు చిత్రలేఖ (కాంచన) స్విట్జర్లాండు లోని Zurich నగరంలో నివసిస్తూ ఉంటుంది. ఆ దేశంలోని Bern విశ్వవిద్యాలయం పరీక్షల్లో ప్రథముడిగా వచ్చాడని భారత్ (శివాజీ గణేశన్) ఫొటో పేపర్లలో పడితే చూస్తుంది. అతగాడిదీ తమ ఊరే అని, తమ రాజ్యపు inspector general కొడుకనీ తెలిసి, వెళ్ళి పరిచయం చేస్కుంటుంది. తనను తాను ఆ రాజ్యపు యువరాణిగా కాక, “వసంతి” అన్న అమ్మాయిగా పరిచయం చేసుకుంటుంది. అతగాడు రెండో/మూడో పరిచయంలోనే I love you అనేస్తాడు…వీళ్ళు గబుక్కున ప్రేమలో పడి యూరోప్ చుడుతూ ఉంటారు… మనకి మంచి లొకేషన్లలో కనిపిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా, వసంతపురిలో యువ విప్లవకారుడు ఆనంద్ (ఆర్.ముత్తురామన్) వగైరా వ్యక్తులు దివాన్ కు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. ఒకానొక సమయంలో ఆనందు మరణిస్తాడు ఈ గొడవల్లో. ఈ టైములో భారత్ ఇండియా వచ్చి ఈ విప్లవకారులతో కలిసి పోరాడాలనుకుంటాడు. తన రాజ్యం పరిస్థితి తెలియని చిత్రలేఖ భారత్ నుండి ఇదంతా తెలుసుకుని … నేనూ నీతో వస్తాను…యువరాణి నా ఫ్రెండు కనుక, తన ప్రైవేట్ ఫ్లైటులో వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చని అతన్ని ఒప్పిస్తుంది. ఆ సందర్భంలోనే ఈవిడే యువరాణి అన్న విషయం అతనికి తెలుస్తుంది. దోవలో ఫ్లైట్లో జరిగిన ఫైట్ సీక్వెన్స్ వల్ల అది కూలిపోతుంది. వీళ్ళిద్దరు చనిపోయారని తేలుస్తారు అందరూ.

హీరో-హీరోయిన్ మధ్యలోనే చనిపోతే ఇంక కథేమిటోయ్, పుల్లాయ్! అని మనం ఎవరం అడగం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో బ్రతికే ఉంటారని మన సినీ ప్రేక్షక అనుభవం వల్ల మనకి తెలుసు కనుక! అలా బ్రతికి, తిరిగి వచ్చి, రహస్య పోరాటం చేసి, తమ రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నారు? అన్నది కథ అనమాట!

(ఏడిసావులే, ఇంత కథ నువ్వే చెప్పేస్తే మేము చూట్టం దేనికి? అనుకోవచ్చు మీరు. అసలు కథంతా వాళ్ళు దేశం చేరుకుని ఆ దివాన్ని ఎదుర్కునేటప్పుడే ఉంటుంది మరి. అది ఎలా అన్నది చెప్పానా? లేదే!)

షరా మామూలుగా శివాజీ కేక. నిజానికి సినిమా చూశాక..ఇది ఎం.జీ.ఆర్. టైపు కథలా ఉందిగా…అనిపించింది. తరువాత ఎం.జీ.ఆర్. కోసమే రాసారని తెలిసింది కానీ… శివాజీ అయినా కూడా భలే చేశాడు, ఎప్పట్లాగే. మనిషి కాస్త యువకుడిగా కనబడ్డానికి చాలా కృషి చేశాడు అనుకుంటాను. సినిమా ఆద్యంతమూ body language లో చాలా తేడా ఉంది నేను చూసిన తక్కిన సినిమాలతో పోలిస్తే. పైగా, ముఖ్యంగా పాటల్లో అయితే, చాలా young and energetic గా అనిపించాడు. కాస్ట్యూంస్ కూడా తగినట్లే ఉన్నాయి. కాంచన కూడా ఆ పాత్రకి బాగా సరిపోయింది. నేను ఫ్యాన్ కనుక నాకు ఎలాగో నచ్చుతారు ఇద్దరూ, అన్నది వేరే సంగతి! పొడుగు పొడుగు డైలాగులు లేవు కానీ, శివాజీ full energy తో చేశాడు.

శివాజీ కాకుండా నన్ను ఆకట్టుకున్న నటులు – అతని తల్లి పాత్ర ధరించిన శాంతకుమారి, మెయిన్ విలన్ – నంబియార్. శాంతకుమారి కనబడేది కాసేపే అయినా కూడా, గొప్ప ప్రభావవంతంగా అనిపించింది ఆవిడ screen presence నాకు. అలాగే, శివాజీ తండ్రిగా చేసిన ఎస్.వి.ఆర్. కూడా! జావర్ సీతారామన్ నుంచి నేను ఏదో ఊహించా అందనాళ్ సినిమా చూశాక… కానీ, పాపం ఇక్కడ అతనికి అంత స్కోప్ లేదు…నిస్సహాయుడైన రాజుగా ప్రతి సీన్లోనూ దీనంగా, కోపంగా ఉండడం తప్ప.

పాటలు నాకేం అర్థం కాలేదు కానీ, ఊరికే వింటానికి, చూట్టానికి మాత్రం బాగున్నాయి. యూట్యూబులో sivandha mann songs అని వెదికితే అన్నింటికీ విడియోలు కూడా దొరుకుతాయి.

మేకప్పులు కొంచెం వెరైటీ గా ఉన్నాయి సినిమాలో. శివాజీ రకరకాల గెటప్ లలో భలే ఉన్నాడు. ముఖ్యంగా ఆ అరబ్బు అతని మేకప్ లో అయితే కేకలే!

sivaji-sivandhamann-arab

ఇతర పాత్రల గడ్డాలు, విగ్గులు (ముఖ్యంగా ముత్తురామన్) మరీ అతికించినట్లు ఉన్నాయి. కొన్ని చిత్ర విచిత్రమైన దృశ్యాలు ఉన్నాయి. అలా ఎలా ఆలోచిస్తారా? .. అసలు ముందు వచ్చిన దానికి, దీనికి ఏమిటి సంబంధం? అనిపించినవి కొన్ని అయితే, అసలు ఈ దృశ్యం ఇంత వెరైటీగా ఎలా conceptualize చేశారు? ఇలాంటి ప్రశ్నలు చాలాసార్లే ఉదయించాయి నాకు.

ఏదేమైనా, మొత్తానికి, ఒకసారికి భేషుగ్గా చూడవచ్చు. మీరు అభిమానులైతే, ఆట్టే perfectionists కాకపోతే, రెండు మూడు నాలుగైదారేడు సార్లు చూసుకున్నా ఆశ్చర్యం లేదు! సినిమా సబ్టైటిల్స్ లేకుండా, తమిళంలో యూట్యూబులో దొరుకుతుంది. Sivantha Mann అని వెదికితే. వికీపేజీ ఇదిగో.

Published in: on May 18, 2013 at 7:31 am  Comments (1)  
Tags:

లిటిల్ జాన్ (అను తమిళ చిత్రం)

నాకేమిటో పి.బి.ఎస్. ని తల్చుకుంటే సింగీతం శ్రీనివాసరావు గుర్తువస్తారు. మొన్నే ఈమాటలో పి.బి.ఎస్. వ్యాసాలు చదువుతూ ఉండగా, ఇలాగే సింగీతాన్ని తల్చుకున్నాను. అప్పుడు గుర్తు వచ్చిందీ సినిమా. ఇది రిలీజైనప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అనుకుంటా, చూసి రికమెండ్ చేశారు. కానీ, అప్పట్నుంచి ఏదో టీవీలో ఒకటీ అరా సీన్లు చూడ్డమే కానీ, ఇప్పటి దాకా చూడలేదు. మొత్తానికి నిన్న చూశా.

కథ: జాన్ మెకంజీ అనే అమెరికన్ తన స్నేహితుడి కుటుంబంతో కొన్నాళ్ళు ఉండేందుకు ఇండియా వస్తాడు. అతని ముఖ్య ఉద్దేశ్యం వాళ్ళకి దగ్గర్లోని ఒక ఆలయం గురించిన పరిశోధనలు. ఆ ఆలయానికి ఒక కథ – అక్కడి అమ్మవారి విగ్రహానికి ఉన్న ముక్కెర కి ఉన్న శక్తుల మూలాన కాలభైరవుడనే వాడు వెయ్యి సంవత్సరాలుగా దాన్ని చేజిక్కించుకోవడం కోసం కాచుకుని ఉంటాడు. ఆ ఆలయంలోని పూజారి వద్ద ఉన్న శక్తుల సాయంతో ఆ ముక్కెరని కాపాడుతూ ఉంటాడు. జాన్ వచ్చాక, కాలభైరవుడి మూలాన ఆ ముక్కెర కొట్టేయబడగా, ఆ నేరం జాన్ మీదకి వెళ్తుంది. అయితే, దేవీ మహిమ వల్ల ముక్కెర కూడా ఆలయం సరిహద్దు దాటే లోపే తనను తాను రక్షించుకుని ఒక పాముల పుట్టలో పడిపోతుంది. పోలీసులు జాన్ ని అరెస్టు చేస్తారు. జాన్ తప్పించుకుని స్వామీజీ శరణు వేడితే, ఆయన జాన్ ని invisible man చేయబోయి, lilliput చేసేస్తాడు. తక్కిన కథ – జాన్ స్వామీజీ సాయంతో కాలభైరవుడిని అంతమొందించి ముక్కెర మళ్ళీ దేవి విగ్రహం వద్దకు చేర్చి, తన సాధారణరూపం రప్పించుకుని, కోరిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం ఎలా జరిగింది? అని.

నిజానికి, ఇలాంటి కథాంశాలు బోలెడు… మన సినిమాల్లో. కానీ, ఈ సినిమాలో నాకు ప్రత్యేకం నచ్చిన అంశాలు – సంభాషణల్లోని సహజత్వం, హాస్య చతురత (జాన్ తమిళ్ మాట్లాడ్డం అసజంగానే అనిపించినప్పటికీ!). అలాగే, అనుపం ఖేర్ ను స్వామీజీ గా ఎందుకు తీసుకోవాలనుకున్నారో గానీ, విలక్షణంగా భలే ఉన్నాడు ఆ గెటప్ లో. నాజర్-ఆర్.ఎస్.శివాజీ లు కనబడ్డంతసేపు బాగా కాలక్షేపమైంది. జాన్ లిల్లిపుట్ అయే సీన్ బాగా తీసినట్లు తోచింది. కాలభైరవుడిగా ప్రకాశ్ రాజ్ కాసేపు భయపెట్టాడు కానీ, మెయిన్ విలన్ కి ఉండాల్సినంత పాత్రలేదు అసలు కాలభైరవుడికి ఈ కథలో. కానీ, సినిమా కథ నాకు మరీ సింపుల్ గా అనిపించింది. క్లైమాక్సు ఫైట్ కూడా మరీ తేలిగ్గా ముగిసిపోయినట్లు అనిపించింది. ఇంతకీ సినిమాలో హీరోయిన్ జ్యోతిక. ఆట్టే రోల్ లేదు కానీ, ఉన్నంతలో బాగానే ఉంది.

నాకాట్టే వివరంగా చర్చించే ఓపిక లేదు కానీ, మొత్తానికైతే సినిమా కాలక్షేపానికి చూడ్డానికి బాగుంది. ఆ పాటలు పెట్టకుండా ఉండి ఉంటే ఇంకా బాగుండేది (పాటలు బానే ఉన్నాయి వినడానికి. కానీ, సినిమాలో రావడమే బాలేదు). సబ్టైటిల్స్ లేకుండా, తొమ్మిది భాగాల్లో యూట్యూబులో దొరుకుతుంది సినిమా.

Published in: on May 9, 2013 at 12:13 pm  Comments (1)  
Tags:

Kappalottiya Thamizhan (1961)

కప్పలోట్టియ తమిళన్” – (The Tamilian who launched the ship) – తమిళనాడుకి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు వా.ఊ.చిదంబరం పిళ్ళై జీవితం ఆధారంగా తీసిన biopic. బి.ఆర్.పంతులు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్ వాఊచి (ఆయన్ని అలాగే పిలుస్తారట) గా నటించాడు (గణేశన్ నా ఫ్రెండు కాదు. ఊరికే డు.. అంటున్నా.. కొవ్వెక్కి అని కూడా కొందరు అనుకోవచ్చు. వాళ్ళందరికి సమాధానం చెప్పుకుంటూ పోతే ఇంక సినిమా గురించి చెప్పేదెప్పుడు?)

వాఊచి గురించి: మొదట క్లుప్తంగా చెప్పాలంటే, వా.ఊ.చిదంబరం పిళ్ళై తమిళనాడుకి చెందిన రాజకీయ నాయకుడు. మన దేశంలో మొట్టమొదటి దేశీవాళీ షిప్పింగ్ సర్వీసు స్థాపించిన వాడు. బ్రిటీషు వారి ఓడలకి పోటీగా వీళ్ళ ఓడలు నడిచాయట అప్పట్లో. ఇది ఒక పక్క, స్వతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర ఓ పక్కా, న్యాయవాద వృత్తి ఓ పక్కా, కుటుంబ వ్యాపారం ఓ పక్కా – ఇలా సాగుతూ ఉండగా, బ్రిటీషు వారు రాజద్రోహ నేరం కింద నలభై ఏళ్ళ జైలు శిక్ష వేసి, పైగా ఆయన న్యాయవాద లైసెన్సు రద్దు చేశారు. అటు పిమ్మట, నాలుగైదేళ్ళకి ప్రభుత్వం మళ్ళీ అతని విడుదల చేసింది. ఈయన జైలు నుండి వచ్చేసరికి షిప్పింగ్ కంపెనీ ని ఎత్తేయడంతో ఈయనకి షాక్. విడుదల తరువాత కొంచెం కష్టాలు పడుతూ, జీవితం, రాజకీయాలలో పాత్ర కొనసాగించి, చివరి రోజుల్లో కొన్ని పుస్తకాలు కూడా రాశారు. (మరిన్ని వివరాలకి వికీ పేజీ చూడండి). ఈయన లోకమాన్య తిలక్, భారతీయార్ (సుబ్రహ్మణ్య భారతి), విప్లవ యోధుడు సుబ్రహ్మణ్య శివ వంటి వారికి సన్నిహితుడు.

సినిమా గురించి:
సినిమా పూర్తిగా ఈయన జీవితాన్ని మొత్తంగా చూపిందనలేము కానీ, ముఖ్య ఘట్టాలు చూపింది. సినిమా మొదట్లో మనకి వాఊచి సక్సెస్ఫుల్ లాయర్, న్యాయం పక్షాన నిలబడతాడని, కలిగిన కుటుంబం నుంచి వచ్చాడని, చాలా దేశభక్తి కలవాడని అర్థమవుతుంది. అతని కుటుంబజీవితం కొంతా, అతని స్నేహితులైన భారతీయార్, సుబ్రహ్మణ్య శివల జీవితాలు కొంతా (ఇందులో భారతి వ్యక్తిత్వం, అతని కుటుంబం గురించి మరింత వివరంగా ఉంటుంది), వాఊచి శిష్యుడు మాడసామి కథా (ఇదే ఎక్కువ అన్నింటికంటే) – వస్తాయి తరువాత. వాఊచి బ్రిటీషు వారికి పోటీగా ఓడల కంపెనీ నెలకొల్పడం, వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇతన్ని జైలుకి పంపడం జరిగాక – ఈ మధ్యకాలం లో మళ్ళీ మాడసామి పాత్ర డామినేట్ చేస్తుంది కథని. చాలా కొద్దిసేపు వాఊచి జైలు జీవితం కూడా చూపిస్తారు. కొన్నాళ్ళకి వాఊచి వెనక్కొచ్చి, శేష జీవితం మరీ అంత active politics లో లేకుండా, రచయితగా గడిపి, కాలం చేయడం – ఇదీ ఈ సినిమా కథ.

నన్ను బాగా ఆకట్టుకున్న దృశ్యాలు/పాత్రలు:

సుబ్రమణ్య శివ కి కుష్ఠు వ్యాధి సోకి, ఆపై అతను జైలు నుండి బయటపడ్డాక, జైలు నుండి విడుదలైన వాఊచి కోసం అతను ఎదురుచూస్తూంటే వాఊచి అతన్ని చటుక్కున గుర్తించడు (కుష్ఠు వల్ల రూపురేఖలు అంత మారిపోతాయి శివకి!) – .ఈ దృశ్యం, ఇక్కడి సంభాషణ చాలా కదిలించాయి. సుబ్రహ్మణ్య శివ పాత్ర వేసిన నటుడు (టి.కె.షణ్ముగం) కూడా ఆ పాత్రకి సరిగ్గా సరిపోయాడు. వికీలో సుబ్రమణ్య శివ గురించి చదివాక మనసులో ఒక ఇమేజి ఏర్పడ్డది. ఈయన చూట్టానికి, వినడానికి కూడా ఆయన లాగే అనిపించాడు 🙂

సుబ్రహ్మణ్య భారతి పాత్ర: సుబ్రహ్మణ్య భారతి కి, చెల్లమ్మ కీ మధ్య జరిగే ఒక సంభాషణ (పిల్లలకి వండడం కోసమని చెల్లమ్మ పక్కింటి నుండి అప్పిచ్చి తెచ్చిన బియ్యపు గింజల్ని భారతి కవితావేశంలో పక్షులకి వేసేయడం…వగైరా)… చిన్నప్పుడు కథలో చదివాను. ఈ సినిమాలో అది చూడ్డం బాగుంది. భారతి పాత్ర చిత్రీకరణ, వేషభాషలు, మాట-నడకా… అంతా భారతి బొమ్మ చూసి ఎలా ఊహించుకున్నానో అలాగే ఉంది. ఆ నటుడు (ఎస్.వి.సుబ్బయ్య) గొప్పగా సరిపోయాడు ఆ పాత్రకి! భారతి ఇంటి బయట అద్దె ఇవ్వలేదని ఇంటాయనా, వెచ్చాలకి డబ్బులని ఇంకొకకరు, పాల డబ్బులని ఒకరు…ఒక పక్క వీళ్ళంతా వచ్చి అడుగుతూ ఉండగా, ఆయన మాత్రం సరస్వతి దేవి విగ్రహం ముందు నిలబడి ఆవిడ తన ఎదుటే ఉన్నదా అన్నట్లు ఆవిడతో వాదనకి దిగడం- ఆ దృశ్యం భారతి వ్యక్తిత్వాన్ని సరిగ్గా పట్టుకుందనిపించింది. ఇక్కడ భారతి అంటే నా ఊహల్లోని భారతీయార్ మాత్రమే! నాకు ఆయన గురించి కానీ, ఆయన రచనల గురించి కానీ ఆట్టే తెలియదు. కానీ, ఫొటోలు చూసి ఒక విధంగా ఊహించుకున్నా!.

(ఇంతకీ, ప్రతీదీ ఈ ఊహించుకోవడమేమిటి మహప్రభో! అనుకోకండి. కొంతమందికి hyper imagination ఉంటుంది పాపం… ఎంత కష్టమనుకున్నారూ దానితో???)

భారతీయార్ జీవితమే కథాంశంగా సయాజీ షిండే భారతీయార్ గా ఒక తమిళ సినిమా వచ్చిందట. అది కూడా చూడాలి ఎప్పుడైనా దొరికితే. బాగుంటుందని చెప్పారు చూసిన వారు! (అన్నట్లు సినిమాలో వాఊచి ఇంట్లో భారతీయార్ పటం, భారతీయార్ ఇంట్లో వాఊచి పటం ఉంటాయి… భలే ఉండింది చూడ్డానికి.)

వాంచినాథన్ ఉదంతం కూడా ఆసక్తికరంగా అనిపించింది. ఆ సాహసుల జీవితాలను ఊహించుకుంటే ఒళ్ళు జలదరించింది. తమిళనాడు లోని తూతుకొడి (Tuticorin) సమీపంలోని మణియాచి స్టేషన్ కు ఇతని గుర్తుగా “వాంచీ మణియాచి” అని పేరు పెట్టారట. (వివరాలకి ఆ వికీ లంకె చూడండి)

విదేశీ కలెక్టర్ మిస్టర్ వించ్ గా ఎస్వీఆర్ కాసేపు కనబడ్డం ఈ సినిమాలో నాకు సర్ప్రైజ్ ఎలిమెంట్. భలే ఉన్నారు ఆ గెటప్లో.

కొడుకు పుట్టినరోజని వాఊచి భార్య ఆ పిల్లాడికి కొత్త దుస్తులు తొడిగితే – అది విదేశీ బట్ట అనేసి, ఆవేశంగా, పుట్టినరోజని కూడా పట్టించుకోకుండా దాన్ని చింపేసి తగలబెట్టేస్తాడు వాఊచి! సినిమాలో కెవ్వుమనుకున్న దృశ్యాల్లో ఇదీ ఒకటి.

ఒక పాటలో – విదేశీ వస్త్రాలని తగలబెడుతూ ఉండే బ్యాచిలో జెమినీ గణేశన్ ఒకడు. అతను అందరి నుండీ బట్టలు పోగు చేసుకుంటూ ఉండగా, జనంలో ఒకామె వస్తుంది. ఆమె బట్టల సంచీ తో ఉన్న సావిత్రి. ఆమె ఇతన్ని, ఇతని కళ్ళలోని తేజాన్ని చూసి మైమరిచిపోతూ ఉండగా, అతను తన ధోరణిలో తానొచ్చి ఆ బట్టలు మంటల్లో పడేసి ముందుకు సాగిపోతాడు. – నాకా దృశ్యం గొప్ప సింబాలిగ్గా అనిపించిందసలు. సావిత్రి కళ్ళలోని పారవశ్యం ఎంత నిజంగా అనిపించిందో.. అతగాడు అలా మనసు దోచేసి చక్కా పోవడం కూడా అంతే నిజంగా అనిపించింది మరి!! ఏమాటకామాటే, సావిత్రి కొన్ని దృశ్యాల్లో హాస్యం గొప్పగా ప్రదర్శించింది…అమాయకమైన మొహంతో!

శివాజీ ఎప్పట్లాగే గొప్పగా నటించాడు. ఈ సినిమాలో అతని మార్చు ఆవేశకావేశాలు ఎక్కువగా కనబడలేదు…పాత్రోచితంగా! జెమినీ వేసిన మాడసామి రోల్ ని పనిగట్టుకుని పొడిగించి, మళ్ళీ ఆయనకి జంట కోసం సావిత్రిని కణ్ణమ్మగా పెట్టి…వాళ్ళ ప్రేమకథని సృష్టించి, వాళ్ళకి పాటలు పెట్టి, బాగా కష్టపడ్డారు కథకులు :-). అలాగే, సినిమాలో వాఊచి కనబడ్డంత సేపు కనబడకపోయినా, భారతీయార్ ది కూడా ప్రధాన పాత్రే. ఇలాగ, ఈ సినిమా పేరుకి వాఊచి కథే కానీ, ఇందులో ఆయనంత పాత్ర ఈ తక్కిన వారందరికీ కూడా ఉంది. అందుకే కాబోలు, కనీసం వికీ లో రాసినంత వివరంగా కూడా వాఊచి కథ లేదీ సినిమాలో.

పాటలు వినసొంపుగా ఉన్నాయి. నన్ను అన్నింటికంటే బాగా ఆకట్టుకున్నవి – శివాజీగణేశన్ పిల్లలని ఆడిస్తూ పాడిన “ఓడి విళయాడు పాపా” అన్న పాట, వందేమాతరం పాట తరువాత భారతీయార్ ఇంట్రో పాట :-). (అన్నట్లు పాటలన్నీ భారతీయార్ రాసినవే అని రాగా.కాం లో గమనించాను)

మొత్తానికైతే, ఆసక్తికరమైన సినిమా. superlatives లోకి వెళ్ళని సంభాషణలు, పాత్రలకి అతికినట్లు సరిపోయిన నటులు-నటన, ఎక్కడా బోరు కొట్టించకుండా పకడ్బందీగా సాగిన కథనం – ఈ కారణాల వల్ల, ఏకాస్త బయోపిక్స్ మీద ఆసక్తి ఉన్నవారినైనా ఈ సినిమా చూడమనే చెబుతాను. మామూలుగా నవరసాలూ కావాలంటే మాత్రం కొంచెం కష్టం. అంత even distribution లేదు ఈ సినిమాలో!

సినిమా ఎక్కడ చూడవచ్చు? ఇక్కడ.
సబ్టైటిల్స్ ఉన్నాయా? – ఉన్నాయి.

Published in: on March 23, 2013 at 7:01 pm  Comments (3)  
Tags:

అంద నాళ్ (ఆ రోజు) అను ఒక 1954 నాటి తమిళ చిత్రం

శివాజీ గణేశన్ తొలిరోజుల నాటి సినిమాలేవన్నా చూడాలని వెదుకుతూ ఉంటే ఈ సినిమా కనబడ్డది. ఆంగ్ల వికీ పేజీలో-“It is arguably the first film-noir in Tamil cinema and is the first Tamil film to be made without songs.” అన్న వాక్యం నన్ను ఆకట్టుకుంది. తరువాతి వాక్యం – “The film was inspired by the 1950 Akira Kurosawa film Rashômon. However, in contrast to Rashômon, the film’s climax provides a solution to the murder using an Indian proverb as a vital clue.” మరింత ఆకట్టుకుంది. ఆ కారణాల వల్ల యూట్యూబులో ఈ సినిమాని దొరకబుచ్చుకుని చూశాను.

కథ చాలా వివరంగా ఆ వికీ పేజీలోనే ఉంది కానీ, సినిమా చూడాలనుకునే వాళ్ళు దయచేసి మొదటి పేరా దాటి వెళ్ళి చదవకండి. 🙂

కథ చెప్పకుండా, సంక్షిప్తంగా సినిమా గురించి చెప్పాలంటే: కథ 1943లో..రెండో ప్రపంచ యుద్ధ కాలంలో…జపాను వారు చెన్నై నగరంపై బాంబులు వేసిన అక్టోబర్ 11 నాటి నుండి మొదలవుతుంది. ఆ రోజున రేడియో ఇంజినీరు రాజన్ (శివాజీ గణేశన్) హత్య చేయబడతాడు. పోలీసు-సీఐడీ వారు మొత్తం ఐదుగురిని అనుమానితులుగా తీర్మానిస్తారు – పక్కింటాయన చిన్నయ్యన్, రాజన్ తమ్ముడు పట్టాభి, పట్టాభి భార్య హేమ, రాజన్ ప్రేయసి అంబుజం, రాజన్ భార్య ఉష (పండరీ బాయి!).విచిత్రంగా, వీళ్ళలో ఒక్కోరికీ ఒక్కో వర్షన్ ఉంటుంది – “ఏం జరిగింది?” అన్న దానికి. చెయిన్ రియాక్షన్ లాగా, ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని అనుమానిస్తారు. అసలు జరిగిందేమిటి? అసలు హంతకులు ఎలా దొరికిపోయారు? అన్నది తెల్సుకోవాలంటే సినిమా చూడాలి.

ఈ సినిమా రషొమన్ సినిమా, The Woman in question అన్న ఆంగ్ల సినిమాల నుండి “స్పూర్తి” పొందింది. స్పూర్తి మాత్రమే పొందింది. దేనికీ కాపీ కాదు. వాటి నుండి ఆలోచనలు తీసుకుని, చక్కటి కథ, స్క్రీన్ ప్లే తో తీసిన నిఖార్సైన తమిళ సినిమా ఇది.

నన్ను ఆకట్టుకున్న అంశాలు/నటులు:
* సినిమాలో ఒక పాట, ఒక ఫైటు ఇలాంటి అంశాలేవీ లేకుండా, మొత్తం సినిమాని థ్రిల్లర్ నవల తరహాలో తీయడం. (అఫ్కోర్సు, దీనివల్లో, మరి దేనివల్లో సినిమా వ్యాపారపరంగా అంతగా ఆడలేదంట!)
* కథాంశం కూడా, నాకు కొత్తగా అనిపించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో చెన్నై పై జపాను వాళ్ళ దాడుల గురించి మా తాతయ్య (వాళ్ళు చెన్నైలో ఉండేవారు అప్పట్లో) చెబుతూ ఉంటే వినడమే కానీ, ఆ నేపథ్యంలో ఇలా ఒక థ్రిల్లర్ సినిమా చూడ్డం బాగుంది. ఆ కాలపు సినిమాలకి, ఈ కాలపు సినిమాలకీ కూడా మన సినిమాలలో (నేను చూసిన వాటిలో) ఇది విభిన్నమైన కథాంశం అనే నా అభిప్రాయం. ఇక ఒక్కొక్కరి దృక్కోణం ఒక్కోలా ఉండటాన్ని చూపే తరహా కథలు నాకెప్పుడూ ఇష్టమైన అంశం కనుక, కథనం కూడా నన్ను ఆకట్టుకుంది.
* సి.ఐ.డీ గా వేసిన జావర్ సీతారామన్ నాకు ఈ సినిమాలో అందరికంటే నచ్చిన నటుడు. ఈయనే ఈ సినిమాకి రచయిత కూడా.
* డైలాగులు కూడా చాలా ఆసక్తికరంగా, ఒక్కోచోట చక్కటి హాస్యంతో ఉండి, ఆకట్టుకున్నాయి నన్ను.
* పండరీ బాయి ని చూడగానే గుర్తించలేకపోయాను కానీ, గొంతు వినగానే గుర్తుపట్టేశా. ఆ తరహా softness అనాలో, మరేమనాలో కానీ…అది ఆమె ట్రేడ్ మార్క్ కాబోలు! 🙂
* నిజానికి శివాజీ గణేశన్ ఈ సినిమాలో ఇంకోళ్ళు కథ చెబుతున్నప్పుడు మాత్రమే కనబడతాడు ..సినిమా మొదట్లో హత్య చేయబడతాడు కదా మరి! కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. తెరపై కనబడ్డంత సేపూ నన్ను ఆకట్టుకున్నాడు.
* తక్కిన నటీనటులందరూ కూడా తమ తమ పాత్రలకి న్యాయం చేశారు.

ఈకలేరడం

తక్కిన విషయాలు ఎలా ఉన్నా, రాజన్ రేడియో సామగ్రిని మొత్తం పోలీసులు ఎలా మిస్సయ్యారు? అన్నది నాకు అర్థం కాలేదు. ఎంత ఆ హత్య చేసిన వ్యక్తి మొత్తానికి ఎలాగో మొత్తం మాయం చేసేసి ఉండొచ్చు అని సమాధానపరుచుకుందాం అన్నా కూడా, అలాంటి ఒక అవకాశం ఉందా అక్కడ? అన్నది నా ఊహకు అందడం లేదు.

ఇలాంటిదే ఇంకొకటి – ఆ పక్కింటాయన తూపాకీ పేలిన శబ్దం వినగానే రోడ్లమ్మట పరిగెత్త్కుంటూ వచ్చేసి పోలీసుల్ని పిలవడం… కొంచెం వింతగా అనిపించింది నాకైతే. (ఏమాటకామాటే… ఈ నటుడు భలే గొప్ప కామెడీ చేశాడు!)

మొత్తానికి మాత్రం, నాకు చాలా ఆసక్తికరంగా అనిపించిన సినిమా. రిలీజైన అరవై ఏళ్ళ తరువాత కూడా తాజాగా అనిపించిన సినిమా. సబ్టైటిల్స్ లేవు కానీ – ఇదిగో ఇక్కడ నుండి పధ్నాలుగు భాగాల్లో చూడవచ్చు యూట్యూబులో.

Published in: on March 16, 2013 at 10:54 am  Comments (1)  
Tags:

అగతియార్ (అనబడు అగస్త్య ముని కథ – 1972)

ఈ తమిళ పౌరాణికాలు మొదలయ్యిన మొదటి వారంలో యూట్యూబు వారు కుడిపక్కన చూపించే జాబితాలో ఈ సినిమా కనబడ్డది. వావ్! అగస్త్యుడి మీద ప్రత్యేకంగా సినిమానా? ఎందుకలాగ ఈ తమిళులు సినిమా తీశారు? అనుకుని వికీ చదివితే అర్థమైంది – అగస్త్యుడిని తమిళ సాహిత్యానికి ఆదిపురుషుడని భావిస్తారని, తమిళ భాషలో మొదటి వ్యాకరణ గ్రంథం రాశాడని ప్రతీతనీ!

ఈసరికి ఈ బ్లాగు చదువరులు ఊహించే ఉంటారు – ఇది ఎ.పి.నాగరాజన్ చిత్రమని 🙂 అయితే, ఇందులో శివాజీ గణేశన్ లేడు 😦 నిజానికి ఇందులో నాకు తెలిసిన నటులు చాలా తక్కువ. అగస్త్యుడిగా వేసినది సిర్కాళి గోవిందరాజన్ అన్న సంగీత విద్వాంసుడు. ఈయన ఫొటో ఒక్కటి మాత్రం మా (స్వర్గీయ) తాతయ్య తాలూకా ఫొటోల్లో చూశాను కనుక, అలాంటి మనిషొకాయన ఉన్నాడని తెలుసు. మరి ఏ ధైర్యం పెట్టుకు చూస్తాము సినిమాని? అని ఒక పక్క వాయిదా వేసినా, మనసు పీకడం మొదలుపెట్టింది. అగస్త్యుడి పైన సినిమా అన్న కుతూహలం కూడా లేదా? అని 🙂 అవ్విధముగా, ఈ సినిమా చూసి …ఆనందించాను.

సినిమా ప్రధానంగా తమిళ నాట అగస్త్యుడి గురించి ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా తీశారు. మొదట కథలేమిటో చెప్పాలి … అటు పిమ్మట నాకేమనిపించిందో చెబుతా. ఒకదానికొకటి సంబంధం లేనట్లు కనిపించే ఈ కథలే ఈ సినిమా. అవి తీసేస్తే అక్కడేం లేదన్నమాట. నా ప్రకారం మొత్తం పది ముఖ్య కథలు –

కథ 1: అగస్త్యుడు భూమిని balance చేయడం కోసం దక్షిణ దిశగా వచ్చిన కథ.
శివ పార్వతుల వివాహ సందర్భంగా సకల మానవేతరులూ హిమాలయ పర్వతాలను చేరేసరికి, భూమి ఆవైపుకి వంగిపోవడం మొదలుపెట్టిందట. దానితో అందరూ ఖంగారు పడగా, శివుడు అగస్త్యుడిని పిలిపించి దక్షిణ దిశలో వెళ్ళి భూమిని బలంచె చేయమని చెప్పాడు. మరి నేనూ మీ పెళ్ళి చూడొద్దా? అంటే, నువ్వెప్పుడు తల్చుకుంటే అప్పుడు మేమిద్దరం ప్రత్యక్షమౌతాం అని నచ్చజెప్పి పంపించాడన్నమాట శివుడు. ఆ విధంగా పొట్టి వాడైనా మహా గట్టివాడైన అగస్త్యుడు దక్షిణానికి మరలాడు. ఇక్కడే అగస్త్యుడికీ నారదుడికీ (T.R.Mahalingam) ఒక విధమైన స్పర్థ మొదలవుతుంది. దాదాపు సినిమా ముగిసేదాకా కొనసాగుతుంది.

ఒక (వినసొంపైన) పాట తరువాత శివపార్వతుల మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. తదుపరి ఒక ఆసక్తికరమైన సంఘటన. నీతి: పుట్టింటి గురించి పొగడ్డం ఆదర్శ గృహిణి కాదు అని అగస్త్యుడు పార్వతికి గృహిణి ధర్మం గురించి చెబుతాడు. ఈ విషయమై ఇదే ముక్క శివుడిక్కూడా వర్తిస్తుందని నా అభిప్రాయం కానీ, దానితో సంబంధంలేకుండా, ఈ సన్నివేశం తీసిన విధానం నాకు బాగా నచ్చింది.

ఆ తరువాత తల్లిదండ్రుల సేవ ని మించినదేదీ లేదు అన్న మెసేజ్ తో ఒక పాట – ఆ పాడిన పిల్లవాడు, అతని కుటుంబంతో అగస్త్యుడి మాటామంతీ నాకర్థమైనంతలో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడే గంగా, యమున, సరస్వతి – పాపాలన్నీ తమకి చుట్టుకున్నాయని అగస్త్యుడి వద్దకి వస్తే, ఈ పిల్లవాడి వద్దకు వెళ్ళమని సూచిస్తాడు. వాళ్ళూ వెళ్ళి అతనితో మాట్లాడగానే వాళ్ళు మళ్ళీ మెరుపులు మెరుపుల బట్టల్లోకి, నగల్లోకి మారిపోతారు… ఈ దృశ్యం కూడా నాకు నచ్చింది. (ఇంతలో నారదుడొచ్చి ఇంకో పాట పాడేస్తాడు …అలా పాడుటూ ఎంచక్కా మెట్లు దిగుతూ భూమికొచ్చేస్తాడు, భలే!)

కథ 2: వింధ్య పర్వతం గర్వమణచిన కథ… కొద్ది మార్పులతో.
మాములుగా ప్రచారంలో ఉన్న కథ: నారదుడు అగ్గి అంటించడంతో వింధ్య పర్వతం గర్వంతో విర్రవీగి పెరిగిపోతూ ఉంటే, అగస్త్యుడు తన కుటుంబంతో సహా దక్షిణానికి మరలుతున్నప్పుడు వింధ్య పర్వతం నమస్కారం చెప్పడానికి వంగితే, అగస్త్యుడు నేను మళ్ళీ తిరిగొచ్చేదాకా ఆ హైటు తగ్గించుకుని ఉంటే నాకు మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు సౌకర్యంగా ఉంటుందని అడిగి, ఒప్పించి, చివరికి దక్షిణానే స్థిరపడిపోయి, వింధ్య పర్వతాన్ని ఆ విధంగా కంట్రోల్ చేసాడని.

ఈ సినిమాలో కథ ఏమిటంటే – ఇక్కడా నారదుడే ఇంకో కారణానికి అగ్గిరాజేస్తాడు కానీ, అగస్త్యుడు తన కోపంతో శపించి మరీ వింధ్యుడిని భయపెట్టేసి అదుపులో ఉంచుతాడు అనమాట. 🙂 అలాగే, సినిమాలో అగస్త్యుడి కుటుంబం అంటూ ఎవరూ ఉండరు. సంభాషణ మాత్రం బాగా సరదాగా ఉంది ఇక్కడ.

కథ 3: కావేరి నది గర్వమణచడం
కావేరి మీద ఫోకస్ చేస్తూ ఐదు తమిళ నదులూ (కావేరి/పొణ్ణి, భవాని, వైగై, పొరుణై, పెణ్ణై) చెంగు చెంగుమని ఆనందంగా పాడుకుంటూ డాన్సు చేసుకుంటూ ఉండగా, దూరంగా అగస్త్యుడు రావడం కనిపిస్తుంది. కావేరి గర్వం కొద్దీ అగస్త్యుడితో అవమానకరంగా మాట్లాడి చాలెంజ్ చేస్తే, ఆయనకి కోపమొచ్చి, కావేరి ని మొత్తం తన కమండలంలోకి వంపేస్కుని చక్కాపోతాడు. అది చూసి మిగితా నదులు నారదుణ్ణి మొరపెట్టుకుంటే, నారదుడు వినాయకుడికి చెప్పుకుంటాడు. వినాయకుడు కాకిరూపంలో వచ్చి అగస్త్యుడి కమండలాన్ని కిందకి తోసేస్తాడు..దానితో గలగలా పారుతూ పొణ్ణి మళ్ళీ జీవిస్తుంది …ఈ కొత్త నదికి అగస్త్యుడు కావేరి అని పేరు పెడతాడు.(ఇది జరిగిన ప్రాంతమే తలకావేరి అంటారు…) తరువాత అగస్త్యుడికి, వినాయకుడికి మధ్య జరిగే సంభాషణ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి అగస్త్యుడు ఒక పాటతో కావేరిని ఆశీర్వదించి ముందుకు సాగుతాడు.

కథ 4: వాతాపి జీర్ణం : వాతాపి, ఇల్వాలుడు ఇద్దరు రాక్షసులు దారినపోయే రుషులని చాలా తెలివిగా గుటకాయ స్వాహా చేస్తూ ఉంటారు. అగస్త్యుడు తెలివిగా పండు రూపంలోని వాతాపిని తినేసి జీర్ణం చేసుకునేసి వీళ్ళిద్దరిని శిక్షించడం ఇక్కడ కథ. వాళ్ళిదరిగా వేసినవాళ్ళెవరో కానీ, భలే కామెడీ గా ఉన్నారు. వాతాపి జీర్ణం కావడం చూపిస్తారూ…కెవ్వు!

కథ 5: అగత్తియం
ఇలా రకరకాల లోకోద్ధారణ చేస్తూ ముందుకు సాగుతూ ఉండగా, మధ్యలో శివపార్వతులు దర్శనమిస్తారు. శీవుడు అగస్త్యుడిని తమిళానికి వ్యాకరణం రాయమనీ, త్ద్వారా తమిళ సంస్కృతికి తొలి గ్రంథాన్ని ఇవ్వమనీ అడుగుతాడు. అగస్త్యుడు ఒప్పుకుని, దాని ఆవిష్కరణ శివుడి సమక్షంలో జరగాలి అంటాడు. మరి తమిళ దేవుడు మురుగన్ కదా! ఆ పాయింటు పట్టుకుని ఇదంతా చాటుగా విన్న నారదుడు అటు వెళ్ళి మురుగన్ (అనబడు చక్కగా ఉన్న శ్రీదేవి) తో ఒక పాట పాడి మరీ చెబుతాడు ఈ ముక్క. అలా ఈ ఆరంగేట్రం ఆపేసి అగస్త్యుడి మీద రివెంజి తీసుకోవచ్చని ఈయన ఆలోచన కానీ, మురుగన్ దీనికి లొంగకపోగా అగస్త్యుడిని పరీక్షించి మెచ్చుకుంటాడు అక్కడికెళ్ళి 🙂
(ఈ భాగంలో సంభాషణలు నాకు కొంచెం కష్టమైంది కానీ, సారాంశం ఇదీ! శ్రీదేవి కేకలు పుట్టించింది ఆ హేమాహేమీలు అందరినీ మించి..ఈ దృశ్యంలో.)

కథ 6: నారదుడితో ఎవరు ఉత్తమ భక్తుడు? అన్న చర్చ
ఆ తరువాత అగస్త్యుడు, నారదుడు కలిసి పాట పాడుకుంటూ – ప్రపంచంలో ఎవరు గొప్ప భక్తుడు? అన్న చర్చలోకి వస్తారు. రోజులో అనేకానేక పనుల మధ్య కూడా వీలైనప్పుడు దైవధ్యానం చేసే వారు నిజమైన భక్తులని చెప్పడం నీతి అనమాట ఇక్కడ. మాస్ కాలక్షేపం కోసమో, దేనికోసమో కానీ, ఇక్కడి కథ చాలా విపరీతంగా సాగదీసినట్లు అనిపించింది నాకు.

కథ 7: రావణుడితో వీణావాద్యంలో పోటీ
పై కథలో అగస్త్యుడితో వాదనలో ఓడిపోయిన నారదుడు వెళ్ళి రావణుడి దగ్గరికెళ్ళి నెమ్మదిగా అతనికి అగస్త్యుడితో వాదన పెట్టుకునే విధంగా నిప్పు రాజేస్తాడు. దానితో, వీళ్ళిద్దరి మధ్యా ఇప్పుడు వీణావాద్యంలో పోటీ జరుగుతుంది. అక్కడున్న ఒక కొండ ఎవరి వీణావాద్యానికి కరిగితే వాళ్ళు గెలిచినట్లు అట!! మొత్తానికి చివర్లో తన ఓటమి అంగీకరిస్తాడు రావణుడు. (ఇది వినడంకంటే విడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది. ఇదిగో లంకె). పైగా, మీరున్న చోటుని నేనేం చేయను అని కూడా హామీ ఇస్తాడు. అగస్త్యుడేమో ఆ కొండకి పొదిగై మళై అని పేరు పెట్టి అక్కడ స్థిరపడతాడు. (తమిళుల విశ్వాసం ప్రకారం అగస్త్యుడు ఇంకా అక్కడెక్కడో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు!)

కథ 8: ఊర్వశి కి ఇచ్చిన శాపం
తరువాత, దేవతల ఆహ్వానం మేరకు ఇంద్రలోకానికి వెళతాడు అగస్త్యుడు. అక్కడ ఊర్వశి ఒక పక్క డాన్సు చేస్తూ, మరో పక్క జయంతుడివైపు చూస్తూండటంతో చిరాకేసిన అగస్త్యుడు వాళ్ళని భూలోకంలో పుట్టమని శపిస్తాడు. ఊర్వశి మానవరూపంలో పుట్టిన వంశంలోనే మాధవి అన్న నర్తకి జన్మిస్తుందని, తమిళ క్లాసిక్ శిలప్పదిగారం రచనలో ముఖ్య పాత్ర వహిస్తుందని జోస్యం చెబుతాడు.

కథ 9: తొల్కాప్పియన్…ఇతర శిష్యుల రాక… తొల్కాప్పియం రచన.
మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చేసిన అగస్త్యుడికి కొంతమంది శిష్యులు ఏర్పడతారు. అందులో తొల్కాప్పియన్ ఒకడు. అతను తరువాత తొల్కాప్పియం పేరుతో తమిళ వ్యాకరణం రాయడం మొదలుపెడతాడు. ఒకపక్క అగస్త్యుడు రాస్తూండగా శిష్యుడై ఉండి, గురువుతో పోటీ ఏమిటి? అని వాదోపవాదాలు జరిగినప్పటికీ, ఇప్పుడేదో జరిగిపోతుందని నారదుడు ఊహించినప్పటికీ, అగస్త్యుడు ఉదార హృదయంతో అతన్ని, ఆ గ్రంథాన్నీ ఆశీర్వదిస్తాడు.

కథ 10: మురుగన్ అనాథ అనడం
అందర్నీ ఆశీర్వదించి షరా మామూలుగా సంచారం చేస్తూ ఉండగా, చివ్వర్లో మురుగన్ పశువుల కాపరి వేషంలో వచ్చి మాటల సందర్భంలో నువ్వు అనాథవి అనడంతో ఇంతటి అగస్త్యుడూ భోరున ఏడవడం మొదలుపెట్టేస్తాడు! అప్పుడు శివుడు-పార్వతి వచ్చి మేమే నీ అమ్మా-నాన్నా అని చెప్పి అతన్ని ఓదారుస్తారు. తరువాత వినాయకుడు, మళ్ళీ మురుగన్ కూడా వస్తారు. వినాయకుడు – అమ్మా, నాన్న, ఇద్దరు సోదరులు ఉన్న పెద్దింటి బిడ్డవి నువ్వు …అనాథవి కావు అని చెప్పి అగస్త్యుడిని సంతోషింపజేస్తాడు. తరువాత నారదుడు, అగస్త్యుడు కలిసి తమిళ భాషని, శివుడి ఫ్యామిలీని పొగుడుతూ, వినసొంపుగా ఉన్న ఓ పాట పాడటంతో కథ ముగుస్తుంది.

గోవిందరాజన్ గారు భలే సరిపోయారు అగస్త్య ముని పాత్రకి. భలే ఉన్నారు చూసేందుకు. అగస్త్యుడు ఇంత balanced గా ఉంటాడని అనుకోలా! అవును మరి, ప్రపంచాన్ని balance చేసిన మనిషి కదా! ఇందులో అగస్త్యుడిని – కోపిష్టి అయినా కూడా అది విచక్షణ పోగొట్టకుండా కంట్రోల్ ఉన్న మనిషిలా, మంచి ఎవరు చెప్పినా విని వారిని ఎక్కువ-తక్కువ భేదం లేకుండా గౌరవించే మనిషిలా, అలాగే – ఉదార హృదయంతో తన competitors తో స్నేహంగా ఉండే మనిషిలాగానూ చూపారు. ఈ విధమైన complex పాత్ర చిత్రణకు గోవిందరాజన్ ప్రాణం పోశారని అనిపించింది.

సెట్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా, సినిమా మొదట్లో వచ్చే కైలాసం సెట్ నాకు అద్భుతం అనిపించింది. ఇదిగో…ఇలా ఉందది.
Screenshot from 2013-02-24 19:51:15
-ఆ ముఖ ద్వారం తమిళ ఓంకారం రూపంలో ఉంది. నాకు శివుడి ఇంటికి ప్రవేశం ఓంకారం లోపల నుండి..అన్న ఆలోచన గొప్పగా అనిపించింది.

అలాగే, మరీ ఇంతలా కాకపోయినా, ఇలాంటివి మరికొన్ని సెట్స్ ఉన్నాయి ఇందులో. ఇందులో, మురుగన్ (ముద్దుగా మాట్లాడుతున్న శ్రీదేవి!) ఇంటి సెట్ ఒకటి. అది ఇదిగో:
Screenshot from 2013-02-24 21:01:19

విడ్డూరంగా అనిపించినవి:
1) సినిమాలో అసలుకి లోపాముద్ర పాత్రే లేదు!
2) కావేరి నదిని అగస్త్యుడి కమండలం నుండి వినాయకుడు బయటకి రప్పించాక గలగలా పారుతున్న నీటిని చూపిస్తారు. అవెందుకు బురద నీళ్ళలా బ్రౌన్ కలర్ లో ఉన్నాయి? అన్నది నాకర్థం కాలేదు.

మొత్తానికి: అగస్త్యుడి గురించి ప్రచారంలో ఉన్న కథలని చాలా ఆసక్తి కరంగా తెరకెక్కించారు. పాటలూ అవీ కూడా వినసొంపుగా ఉన్నాయి (సంగీతం: కున్నకుడి వైద్యనాథన్ ట!). సెట్స్ చూడ్డానికి అందంగా ఉన్నాయి. సినిమా చూడాలన్న ఆసక్తి ఉన్న వారు యూట్యూబులో ఇక్కడ చూడండి. షరా మామూలుగా సబ్టైటిల్స్ లేవు. ప్రింటు మరీ అంత గొప్పగా ఏం లేదు. కానీ, తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదికూడా!

కొసమెరుపు: Agastya in Tamil Land అని ఒక పుస్తకం చదివా ఈ సినిమా చూశాక (అంత లోతుగా అధ్యయనం చేయలేదు. పైపైన చదివా). ఈ కథలన్నీ కల్లలెలాగవుతాయో ఆధారాలతో సహా చూపిస్తారు అందులో 😉

Published in: on March 4, 2013 at 8:00 am  Comments (2)  
Tags: ,

తిరువరుట్చెల్వర్ (1967)

తిరువరుట్చెల్వర్ (Thiruvarutchelvar) కూడా ఏ.పి.నాగరాజన్ తీసిన, శివాజీ గణేశన్ ప్రధాన పాత్ర ధరించిన, తమిళ పౌరాణిక చిత్రం. మొదట దేవుళ్ళు (తిరువిళయాడల్, సరస్వతీ శపథం, కందన్ కరుణై) అయ్యాక భక్తుల వద్దకు వచ్చాను. ఇందులో భాగంగా “తిరుమాళ్ పెరుమై” లో ఆళ్వార్ల కథలు చూశాను. ఇప్పుడీ సినిమా శివ భక్తులైన నాయనార్ల కథల్లో కొన్నింటిని ఎంచుకుని అల్లిన కథ. సినిమా చూసే ముందైతే మట్టుకు నాకీ సంగతి తెలియదు. ట్రైలర్ లాగా కాసేపు ఓ దృశ్యం చూసి, శివాజి రకరకాల పాత్రల్లో తన నటనా పటిమను చూపిస్తాడని అర్థమై చూడ్డం మొదలుపెట్టేసా అన్నమాట 🙂

కథ ఏమిటంటే – రాజైన శివాజీ గణేశన్….అద్భుతంగా డాన్సు చేస్తున్న పద్మిని ని (ఆ డాన్సుకు జత చేయబడ్డ కే.వి.మహదేవన్, పి.సుశీలల కాంబోని) చూసి పరవశించిపోయి, తనకు మట్టుకే సాధ్యమైన తీరులో ఠీవిగా నడుస్తూ వచ్చి ఆమె పట్ల తన ఆకర్షణని తెలియజేస్తాడు. ఆమె కర్తవ్య బోధతో, “ఛా, ఏమిట్నేను ఇలా చేసాను” అనుకుని, దైవ చింతనపైకి మనస్సు మళ్ళి, మళ్ళీ అజ్ఞానంలో “దేవుడెక్కడ ఉన్నాడు? ఏ దిక్కులో నివసిస్తాడు? ఏం చేస్తూ ఉంటాడు” అని అడుగుతాడు రాజగురువైన (స్వామీజీ లా ఉన్న) నాగయ్య ని. మరీ ఇలాంటి ప్రశ్నలకి ఖచ్చితమైన సమాధానాలు ఏం ఇవ్వగలం? అని దిగాలుగా కూర్చున్న నాగయ్యని చూసి ఆయన మనవరాలు కుట్టి పద్మిని “తాతా, నేను చూస్కుంటా కదా!” అని భరోసా ఇచ్చి … సభకి వెళ్ళి, శివాజీ అంత శివాజీ ముందు జంకూ, గొంకూ లేకుండా అద్భుతంగా మాట్లాడి, అతనికి జవాబులు చెబుతుంది. దానితో, ఈసారి నిజంగా కళ్ళు తెరుచుకున్న రాజుకి రాజగురువు పెరియపురాణం ఇచ్చి, అందులోని నాయనార్ భక్తుల కథలు చదివి తరించమని చెబుతాడు.

అక్కడ మొదలవుతాయి వరుస కథలు. మరి, తెలుగు కథల్లో ఇవి కనబడవు కనుక, నాబోటి అమాయకులు ఇంకొందరు ఉంటారు కనుక, క్లుప్తంగా ఒక్కో కథా చెప్పి ముందుకు సాగుతాను …అనగా స్పాయిలర్లు కలవని భావము.

పైన జరిగిన సంఘటన తరువాత సీను చోళ రాజు కొలువుకి మారుతుంది. అక్కడ సెక్కియార్ (శివాజీ గణేశన్) అన్న కవి నాయనార్ల కథలతో పెరియపురాణం గ్రంథం రాస్తూంటాడు. ఈక్రమంలో తన రాజసభలో ముగ్గురు (నలుగురు) నాయనార్ల కథలు చెబుతాడు. సినిమా అలా కొనసాగుతుంది.

మొదటి కథ: తిరుకురిప్పు తొండర్ (శివాజీ గణేశన్) అన్న నాయనార్ కథ. వృత్తిరిత్యా చాకలి అయిన ఈయన రోజూ ఒక శివభక్తుడి బట్టలని ఉతకడం ద్వారా వారికి సేవ చేయడం తన జీవన విధానంలో భాగంగా పెట్టుకుంటాడు. ఇందులో భాగంగా, శివుడు ఈయన్ని పరీక్షించడానికి ఒక శివ భక్తుడి రూపంలో వస్తాడు (జెమినీ గణేశన్). ఆయన తాలూకా పైపంచె ని ఉతికి ఇస్తానని ఈయన అడుగుతాడు. ఆయన, నాకున్నది ఇదొక్కటే, జాగ్రత్త అని ఇస్తాడు. మనం ఊహించుకున్నట్లే, ఆ పంచె చిరిగిపోతుంది ఈ ప్రక్రియలో. కాసేపు ఇరుపక్షాల మధ్యా కొంచెం సంభాషణ అయ్యాక, శివుడు సాక్షాత్కరించి తిరుకురిప్పు తొండర్ ని కరుణిస్తాడు.

తరువాతి కథ: సుందరార్ అనబడే నాయనార్ కథ ఇది. సుందరార్ (శివాజీ గణేశన్) పెళ్ళి చేస్కోబోతుండగా (కె.ఆర్.విజయ ను) మధ్యలో ఒక గడ్డపాయన (ఆ వేషంలో జెమినీ గణేశన్) వచ్చి అతని తీస్కెళ్ళి పోవడం…తరువాత సుందరార్ పాట పాడ్డం వరకూ ఉంది. తిరువిలయాడల్ లో “నేనెవర్నో తెలీదా?” అనేసి, తనకే సొంతమైన టీజింగ్ నవ్వు విసిరి గుళ్ళోకి శివాజీ రూపంలోని శివుడు మాయమైపోయే సన్నివేశం (శివుడు రూపంలోని శివాజీ కూడా) ఉంది. “ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్రా?” అని అని తానే ఇంతేసి కన్నులతో శివాజీనే అడిగి మాయమైపోయిన జెమినీని చూస్తే ఆ దృశ్యం గుర్తొచ్చింది.

మూడోకథ: తిరునవుక్కరసర్ (శివాజీ గణేశన్) అన్న నాయనార్ కథ. ఎనభైఏళ్ళ తిరునవుక్కరసర్ “అప్పర్” గా ప్రసిద్ధుడు (దీనికి గల కథ, ఈ పేరును తెచ్చిన సంబందార్ అన్న మరొక “బాల” నాయనార్ కథా – సినిమాలో చూడొచ్చు, లేదంటే వికీలో కూడా చదువుకోవచ్చు). శివాజీ గణేశన్ పూర్తిగా అప్పర్లా మారిపోతాడన్నమాట ఇక్కడ. 🙂 … ఈ భాగంలో నాకు అన్నింటికంటే నచ్చినది క్లైమాక్సు దృశ్యం. అప్పర్ కైలాసానికి వెళ్ళి శివ పార్వతుల నృత్యాన్ని కనులారా చూసే దృశ్యం గొప్ప పరవశం కలిగించే దృశ్యమని నా అభిప్రాయం.

పాటలు చాలా బాగున్నాయి. మొదట్లో పద్మిని డాన్సు ఉన్న పాట, చివర్లో శివపార్వతుల డాన్సు – రెండు చూడ్డానికి చాలా బాగున్నాయి. మధ్యలో చాకలి వాళ్ళ పాట భావం మొత్తంగా అర్థం కాలేదు కానీ, వినసొంపుగా ఉంది. చూడ్డానికి కూడా బాగుంది. ఈ సినిమాలో తిరుమాళ్ పెరుమై తరహాలో అనవసరంగా జొప్పించారు అనిపించిన సన్నివేశాలు చాలా తక్కువ.

సావిత్రి చాలా కొద్దిసేపు కనిపిస్తుంది. కనుక, నాకేమో వ్యాఖ్యల్లేవు ఆవిడ గురించి! ఆర్.ముత్తురామన్ ఆ గెటప్లో చాలా బాగున్నాడు నాకు చూడ్డానికి. జెమినీ గణేశన్ కూడా బాగున్నాడు.

మరి శివాజీ గణేశన్ సినిమాలో భక్తుడైనా కూడా నాకిక్కడ తెరవేల్పు కదా. కనుక, ఆయన గురించే ఎక్కువ తల్చుకుంటాను. అప్పర్ అనబడు తిరునవుక్కరసర్ పాత్రలో ఎనభై ఏళ్ళవాడి గెటప్ లో శివాజీని చూసి వర్ణించడానికి మాటల్లేవు. అది శివాజీ మార్కు నటన. నచ్చిన వాళ్ళవి కెవ్వు మార్కు కేకలు. నచ్చని వాళ్ళవి హాహాకారాలు. ఇదే సినిమాలో అంతక్రితమే సుందరార్, సినిమా మొదట్లోని రాజు, సెక్కియార్ పాత్రల్లో రకరకాల “ఠీవి” కనబడే గెటప్పులలో చూశాక, ఇలా చూసి తరించేసరికి మైండు బ్లాకై పోయింది. పూర్తిగా బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఇంకో మనిషిలా ఉన్నాడు! ఇన్ని పాత్రలేసినా, ఒకదానితో ఒకటి పోల్చలేనంత వైవిధ్యం శివాజీ నటనలో! ఒక్క శివాజీ కోసమే నేనీ సినిమా మళ్ళీ మళ్ళీ చూడగలను అనిపించింది.

కొన్ని సందేహాలు:
1) దేవుళ్ళంతా తమిళ భక్తుల భాషకోసం ఎందుకంత పడిచస్తారు ఈ సినిమాల్లో? తెలుగు సినిమాల్లో దేవుళ్ళెందుకు తెలుగు కవుల భాషలోని తియ్యదనాన్ని పొగడరు? దేవుళ్ళకి భాషా పక్షపాతం ఎందుకుండాలి యువరానర్?
2) దేవుళ్ళని వదిలేసి, ఇలా కథలు కథలుగా భక్తుల కథలు వచ్చిన తెలుగు సినిమాలు ఉన్నాయా? (భక్త తుకారాం, రామదాసు..ఇలా సింగిల్ భక్తుల మీద ఫోకస్ చేసినవి కాకుండా!)
3) ఒక నన్నయ్య గురించో, ఒక తిక్కన గురించో, ఒక ఎర్రన గురించో – ఫిక్షన్ ఏదీ లేదా..దానితో సినిమాలెందుకు తీయరు? (విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు వంటిది కాదు. నోరి నరసింహశాస్త్రి రాసిన “కవి సార్వభౌముడు” వంటిది).

– ఈ కథలు ఆట్టే ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు కొంతమందికి. కానీ, “దేవుడు భక్తుల్ని పరీక్షిస్తాడు, వాళ్ళు ఆ పరీక్షలకి తట్టుకుని నిలబడతారు. ఏ దేవుడన్నదాన్ని బట్టి ఆయన లేదా ఆమె తుదకు భక్తుల్ని కరుణిస్తారు” అన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ఇన్ని విభిన్నమైన కథలు ఉండడం అంత అనాసక్తి కలిగించే విషయమే కాదు నా మట్టుకు నాకు. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా నా దృష్టిలో. అలాగే, ఈ కథలన్నీ చాలా ఆసక్తికరంగా తెరకెక్కించినందుకు కూడా!

అయితే, మొదలైన చోటికి మళ్ళీ వెనక్కి వచ్చుంటే ఇంకా ఆసక్తికరంగా ఉండేది ..అని మాత్రం అనిపించింది నాకు. కథ, కథలో కథ. కథలో కథలో కథ. ఇలా సాగాక… మళ్ళీ లాజిక్ ప్రకారం…వెనక్కి మరలుతూ, మొదటి కథలోకి రావాలి కదా! 🙂

ఈ సినిమాపై అంతర్జాలంలో కనబడ్డ ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ.

మొత్తం పదిహేడు వీడియోలతో ఈ సినిమా యూట్యూబులో లభ్యం. సబ్టైటిల్స్ లేవు.

Published in: on February 25, 2013 at 7:00 am  Comments (15)  
Tags: ,