శ్రీరామరాజ్యం ఆడియో – నా అభిప్రాయాలు

నాకు రాముడంటే ఏ భావమూ లేదు కానీ, రాముడిపై రాసిన పాటలంటే ఇష్టం. బాపు గారంటే ఇష్టం. రాజా అంటే ఇష్టం. ఆ ఇష్టంలో భాగంగా, నిన్న ఆడియో రిలీజ్ వీడియోలు చూసి -“అయ్యో! ఏమిటీ పరిస్థితి” అని నిట్టూర్చాక, పొద్దున్న ఆఫీసుకి వస్తే, రాగా లంకె తో ఒక మెసేజ్…రామరాజ్యం పాటలు మొత్తం రాగా.కాం లో పెట్టేసారు విను అని. విన్నాను. నాకు దాదాపు అన్నీ నచ్చాయి. అయితే, సంగీతానికి, కథకి మధ్య ఏదో గ్యాప్ ఉన్నట్లు అనిపించింది. ఆ సంగీతం చూస్తే “అమ్మ రాజీనామా” మొదలుకుని “ఆవకాయ బిర్యాని” దాక రకరకాల తరహా చిత్రాలకు సూట్ అయ్యేలా ఉంది కానీ, పౌరాణికంలో ఊహించుకోలేకపోతున్నాను. ఆ అయోమయావేశంలోనే ఈ టపా.

(మీకీ టపా మరీ పట్టపగ్గాల్లేకుండా అనిపిస్తే క్షమించండి. ఎవ్వరినీ అగౌరవ పరచడం నా ఉద్దేశ్యం కాదు. పై ఇద్దరూ నా లోకపు దేవుళ్ళు. కనుక, వాళ్ళని ఒక్క మాట అనే ఆలోచన నాకు కల్లో కూడా రాదు!)

జగదానంద కారకా : పాటలో భక్తి పారవశ్యం లేదు కానీ, “ఊపు” ఉంది. నామట్టుకు నాకు వినేందుకు బాగుంది.

శ్రీరామ లేరా: ఏమిటో, బొత్తిగా ఇప్పటి సినిమాల తరహా సంగీతం. “శివమణి” సినిమాలో “రామా..రామా..రామా..” అంటూ పాట పెడితే బాగుంటుంది కానీ, ఒక పౌరాణిక చిత్రంలో ఈ సంగీతం ఏమిటి? అనిపించింది. కానీ, సినిమాలో మిగితా పాటలు కూడా అలాగే అనిపించడంతో, బహుశా మరో తరహాకి అలవాటు పడిపోయి, ఇది కొత్తదనం వల్ల ఇలా అనిపిస్తుందేమో అనిపించింది వినేకొద్దీ!!

ఎవడున్నాడు: వాల్మీకి చెప్పే కథగా వస్తుంది పాట (లవకుశులతో కాబోలు!). రాముడి పొగడ్త. బాగుంది. 🙂

సీతారామ చరితం: బాగుంది. ఇప్పటి పిల్లలకి రాముడి కథ క్లుప్తంగా, చక్కటి తెలుగులో, విజువల్ గా చెప్పేందుకు పనికొస్తుందనుకుంటాను.

దేవుళ్ళే మెచ్చింది : మళ్ళీ, ఈకాలం పాటలా ఉంది.అద్భుతంగా పాడారు అనిపించింది. సినిమాలో లవకుశుల కథని కొంచెం ఆధునికంగా చెప్పబోతున్నారని అనిపిస్తోంది, ఈ పాటల ధోరణి చూస్తూ ఉంటే. (వినుడి వినుడి రామాయణ గాథా..పాట బదులు ఈ పాటేమో ఈ సినిమాలో..)

గాలీ, నింగీ నీరు..భూమీ నిప్పూ మీరు..రామా వద్దనలేరా ఒకరూ : “ఏ నిముషానికి ఏమి జరుగునో” సందర్భం అనుకుంటా. సాహిత్యం నాకు బాగా నచ్చింది, పౌరాణికాలకి వెరైటీ సాహిత్యమే…నేను విన్నంతలో. పాట సంగీతం కూడా… గాయం-2 సినిమాలో “కలగనే కన్నుల్లో…” అన్నట్లు, మాడర్న్ విషాద గీతంలా ఉంది 🙂

రామాయణము : మళ్ళీ రామ గాథ. నాకు పౌరాణికం ఫీలింగ్ రాలేదు కానీ, పాట బాగుంది. దృశ్యం కళ్ళకు కట్టించింది.

దండకం: హమ్మయ్య, ఒక్కటి పౌరాణికంలా అనిపించిందోచ్!!

సీతా సీమంతం: “మావయ్య అన్న పిలుపు” అన్న ఒకప్పటి బాలకృష్ణ పాట మాడరన్ వర్షన్ లా ఉంది :). మైథలాజికల్ లా లేదు. వినడానికి బానే ఉంది కానీ, రామాయణం సెటప్ లో ఊహించడం కష్టంగా ఉంది!! సాహిత్యం బాగుంది.

రామ రామ రామ అనే రాజమందిరం: జానపదం లా ఉంది. బహుసా సినిమాలో కూడా అదే సీన్ లో వస్తుందేమో. నాకు చాలా నచ్చిన పాటల్లో ఇదొకటి, ఈ ఆల్బంలో. ఇందులో ఆ “పారవశ్యం” ఎలిమెంట్ ఇందులో అనుభవించాను, ఇది జానపదం తరహాలో ఉన్నప్పటికీ.

ఇది పట్టాభి రాముని ఏనుగురా, శంకు చక్రాల..: ఊపు ఉంది పాట(ల)లో. నాకు నచ్చింది. సినిమాలో ఎక్కడ వస్తుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది ఇంపాక్ట్. కానీ, నాకు ఈ పాట చాలా నచ్చింది. అర్జెంటుగా ఈ పాట మాత్రం కోనేస్కుని లూప్ లో పెట్టుకుని వినాలి అనిపించింది.

ఇవి కాక, ఒకట్రెండు బిట్ సాంగ్స్ ఉన్నాయి.

ఈ సినిమా సంగీతానికి నేను “కన్ఫ్యూజ్ద్ మ్యూజిక్” అని పేరు పెట్టదలుచుకున్నా. పాటలు నాకు చాలా నచ్చాయి కానీ, అవన్నీ ఒక పౌరాణిక చిత్రంలో ఊహించలేకపోతున్నాను. మన పౌరాణిక సంగీతం ఒక విధమైన పారవశ్యం కలుగజేస్తుందే… అలాంటి పారవశ్యం నాకు కలగలేదు. కానీ, పాటలుగా వినడానికి బానే ఉన్నాయ్. నా స్నేహితుడితో అంటూ ఉంటే అతను ఇలా అన్నాడు – “ట్యూన్స్ బాగున్నాయి కానీ, సౌండ్స్ డల్ అనిపించట్లేదూ?” అని. ఇక్కడ నేనూ ఏకీభవించాను. “సౌండ్స్ డల్” అనడంలో మా భావం – ఆ పారవశ్య భావనే. ఒక “నాన్ కడవుళ్”లో “ఓం శివోహం” లాగా పూనకం పుట్టించడం కానీ, ఒక “షిర్డీ సాయిబాబా మహత్యం”లో “మా పాపలు తొలగించి…”పాటలో లాగ (రెంటికీ ఇళయరాజానే), భక్తీ పారవశ్యం కలిగించడం గానీ, ఈ పాటలు చేయలేదు. కానీ, ప్రతి పాటా వింటూంటే లవకుశులు కథ చెప్పడం, మామూలు జనం తల ఊపుతూ విని ఆనందించడం మాత్రం కనబడ్డది నా మనోఫలకమ్లో. అందుకే జానపదం అన్నది.

నాకు చివరిగా చెప్పాలి అనిపిస్తున్నది ఏమిటి అంటే – నేను ఈ పాటలు చాలా మట్టుకు, పల్లెల్లో పాడుకునే జానపద పదాల్లా ఊహించుకుంటున్నాను. ఈ పిల్లలు – అదే లవకుశులు ఒక ఎనభైల నాటి మాములు పల్లె జనాలకి రాముడి కథ చెప్తున్నట్లు ఊహించుకుంటే, అంతా కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. అలా కాకుండా రామాయణకాలంలో రామకథ గానం లా ఊహించుకుంటే, కాస్త కొత్తగా (కొండకచో వింతగా) అనిపిస్తే అది మీ తప్పు కాదు. ఆపై మరో మాట – ప్రతిసారి ఇళయరాజా తన బెస్ట్ ఇవ్వాలి అని ఆశించకూడదు. ఆయన కూడా మనిషి అన్న విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

నేనూ సాహిత్యం పై ఎక్కువ ధ్యాస పెట్టలేదు కానీ, పట్టించుకున్నంతలో నాకు చక్కగా అనిపించాయి కొన్ని భావనలు. బహూశా కొన్నాళ్ళాగాక మళ్ళీ రాస్తానేమో.

Published in: on August 16, 2011 at 3:34 pm  Comments (30)  
Tags:

శ్రవణానందం-4: గజేంద్ర మోక్షం (పాలగుమ్మి రాజగోపాల్)

రంజని గారి పుణ్యమా అని ఈ ఆడియో లంకె దొరికింది. అయితే, అప్పుడు వినడం కుదరక, ఇప్పుడు తీరిగ్గా విన్నాను. నాకు ఆ పద్యాల భాష అర్థం కానీ, కాకపోనీ. కానీ, రాజగోపాల్ గారి గొంతులో, గజేంద్ర మోక్షం వింటూ ఉంటే, ఎంథ ప్రశాంతంగా ఉందో! నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా కుదిరింది. నాలాంటి మిగితా తెలుగు రాని పిల్లకాయలూ, అర్థం అవడం మాట అటుంచి, రాగయుక్తంగా పద్యాలు పాడడంలో ఉన్న సొగసు కోసం రాజగోపాల్ గారి ఆడియో వినండి!

సంఘటనలోని “మూడ్” ని చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు,సారీ పాడారు.

మధ్య మధ్య వచ్చిన వ్యాఖ్యానం కూడా క్లుప్తంగా బాగుంది.

అయితే, బహుశా వివరంగా తాత్పర్యం తెలుసుకునేందుకు ఉద్దేశించింది కాదనుకుంటాను ఈ ఆడియో. ఏదో, సారాంశం తెలుసుకుంటూనే, కనీసం వినికిడి ద్వారా కొంచెం అవగాహన కలిగించుకోడానికి పనికొస్తుంది. అన్నట్లు, పిల్లలకి తెలుగు నేర్పేటప్పుడు ఉచ్ఛారణ నేర్పేటపుడు ఇలాంటిది కూడా చేరిస్తే బాగుంటుందేమో. చూడబోతే, కొంచెం కష్టపడితే, ఏదో కాస్త అర్థం చేసుకోగలనేమో అనిపిస్తోంది, మళ్ళీ!

రాజగోపాల్ గారి గళంలో గజేంద్ర మోక్షాన్ని ప్రవచనం సైటులో ఇక్కడ వినండి.

రాజగోపాల్ గారి గురించి ఈనాడు సైటులో ఉన్న వ్యాసం ఇక్కడ చూడండి.

లంకెల కర్టెసీ – రంజని గారే!

ఈ బ్లాగులో ఇదే ట్యాగు తగిలించిన తక్కిన వ్యాసాలు ఇక్కడ చూడండి.

Published in: on February 3, 2011 at 7:00 am  Comments (1)  
Tags:

శ్రవణానందం – 3: ఈ ఇల్లు అమ్మబడును

ఈ ఇల్లు అమ్మబడును -డి.వి.నరసరాజు

కథ… ఒక వృద్ధుడు తన ఇంటిని అమ్మకానికి పెట్టి ఉంటాడు. అది దయ్యాల కొంప అన్న పేరు పడ్డంతో ఎవ్వరూ రారు. అలాంటిది ఓరోజు రావికొండల్రావు, రాధాకుమారి (భార్యాభర్తలన్నమాట) వస్తారు. అటుపై, అక్కడ నడిచిన తతంగం ఈ నాటకం‌కథ!

నా మాటలు:
* రావికొండల్రావు-రాధాకుమారి కాంబో రాక్స్.
* ఏమాటకామాటే చెప్పుకోవాలి – సంభాషణలు బాగా నవ్వు పుట్టించాయి.
* సుత్తివేలు-రావికొండల్రావు సంభాషణ అదిరింది.
* నాటకం జరుగుతూ ఉంటే, ఎదురుగ్గా ఈ మూడు పేర్లు పరిచితమైనవి కనుక, మొహాలు కదలాడుతూ‌ఉన్నాయి.
* నాటకం అరగంటే కావడం – కడు శోచనీయం, మహా నేరం, మహా ఘోరం!
* ఎప్పుడో‌యాభైల్లో రాసిన నాటకమట… కావున కొన్ని పదాలు అవీ కొత్తగా అనిపించాయి, ఆ నాటకానికి ముందు అనౌన్సర్ చెప్పినట్లే!
* మాగంటి వారు ఇంకొన్ని నరసరాజు గారి నాటకాలు సంపాదిస్తే బాగుణ్ణు!‌:)

నాటకాన్ని ఇక్కడ వినవచ్చు.

Published in: on October 19, 2010 at 8:00 am  Leave a Comment  
Tags:

శ్రవణానందం 2 – భాగ్యనగరం

ఆమధ్య హైదరాబాదెళ్లినపుడు – ఇంట్లో నార్లచిరంజీవి – ‘భాగ్యనగరం’నాటకం చదివాను. బాగుండింది. మరీ మళ్ళీ‌మళ్ళీ చదవాలి అనిపించలేదు కానీ, ఒక్కసారికి బాగుండింది. ఎక్కడికక్కడ సంభాషణలు చాలా బాగా నచ్చాయి, అలాగే బాపూ బొమ్మలు అంతకంటే నచ్చాయి. పుస్తకానికి నాలుగైదారేడు ముందుమాటలున్నాయి 😉 బహుశా, చిరంజీవి గారి మరణానంతరం వేసిన ముద్రణ అనుకుంటాను. ఈ పుస్తకంపై పాజిటివ్ అభిప్రాయమే ఉండటంతో‌మాగంటి.ఆర్గ్ సైటులో ఆడియో నాటకం‌కనబడగానే, వినడం మొదలుపెట్టాను. చాలా చాలా నచ్చింది నాకు.ఆ అనుభవం ఇదీ!

కథ: అందరికీ తెలిసిందే! భాగమతి-కుతుబ్ ప్రేమకథ.

నా వ్యాఖ్యానం:
* మొదట వచ్చిన పాట నాకు తెగ నచ్చింది (ఈ పాట పుసకంలో ఉందా? చూసినట్లు గుర్తు లేదే… చూసి పాట అని తిప్పేసానేమో…సినిమాల్లో పాటలొస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్లు!)
* ఒక్కొక్క గాత్రధారీ అద్భుతంగా చెప్పారు డైలాగులు! వీళ్ళూ‌అని ఎన్నలేనంత నచ్చారు నాకు అందరూ. భాగమతి అక్క , అమీర్ – ఇద్దరూ‌ బాగా గుర్తుండిపోయారు… చదివినప్పుడూ, విన్నప్పుడూ.
* డైలాగులు చాలా బాగున్నాయ్!
* కథ చదువుతున్నప్పుడు హీరో కి చంద్రహారంలో రామారావు, హీరోయిన్ కి అనార్కలి లో అంజలీదేవీ గుర్తొచ్చారు. కానీ, నాటకం‌వింటున్నప్పుడు ఆ గొంతులు ఆ ఇమేజ్ కి మ్యాచ్ కాలేదు 🙂
* అమీర్ పాత్ర డైలాగులు సరదాగా ఉన్నాయి.
* గంట నాటకంలో ఒక్క క్షణం కూడా బోరు కొట్టదు!
* సంగీతం‌ అదీ, చాలా బాగా అమరింది. కరెక్టుగా పుస్తకం చదువుతున్నప్పుడు కదలాడే భావాలే, నాటకం వింటున్నప్పుడూ‌కదలాడాయ్!‌:-)

మొత్తానికి, రేడియో రాకింగు. ఇప్పుడైతే మనకి రేడియో అంటే‌ డీజే లాగా పాటలు మారుస్తూ, ప్లే చేస్తూ ఉండిపోతోంది కానీ, ఒకప్పుడలా కాదన్నమాట!
మాగంటి.ఆర్గ్ వారికి నా ధన్యవాదాలు!

ఈ నాటకాన్ని ఇక్కడ వినండి.

Published in: on October 17, 2010 at 8:00 am  Comments (4)  
Tags:

శ్రవణానందం – ప్రతాపరుద్రీయం

ఈ మధ్య నాకు పాత రేడియో నాటకాలపై మోజు పెరిగింది. సురస, మాగంటి, ఈమాట – ఇలా పలు సైట్లలో వెదుకుతూ, వీలు చిక్కినప్పుడు వినడం మొదలుపెట్టేను. ఒక్కోదాని గురించి చిన్న చిన్న పరిచయాలు రాయడం ఈ శీర్షిక ఉద్దేశ్యం. ఇవాళ – ప్రతాపరుద్రీయం తో మొదలుపెడుతున్నాను.

కథ సంగతికొస్తే : ప్రతాపరుద్ర మహారాజుని మొఘలుల చెరనుండి అతని మంత్రి యుగంధరుడు కాపాడ్డం ఇందులో ప్రధాన కథ.

నా కామెంట్లు:
* ఒకసారి వినేందుకు నాటకం బాగుంది.
* ఏమిటీ…ఇది వేదం వెంకట్రాయశాస్త్రి రాసారా?? నమ్మలేకపోతున్నాను. భాష చూస్తే, మామూలుగానే ఉంది. ఇదివరలో ఇంట్లో ప్రతాపరుద్రీయం పుస్తకం చూసి, చదవబోయి, భయపడి, భంగపడి వదిలేసిన జ్ఞాపకమే! బహుశా, రేడియో అనుసరణలో తేడా ఉందేమో. అయినా, శాస్త్రి గారు శుద్ధ గ్రాంథికం రాస్తారనుకున్నానే!!
* గాత్రధారులు అందరూ చాలా బాగా ‘వినిపించారు’
* పేర్లు పరమ వెరైటీగా ఉన్నాయి: భేతాళరావు, యమధర్మరాజుశాస్త్రులు, విశ్వాసరావు, చెకుముకిశాస్త్రి అంటూ భలే పేర్లున్నాయి. అసలుకి నాకు, ఆ కాలం కథకి యుగంధరమంత్రి అన్న పేరు కూడా కాస్త వింతగానే అనిపించింది.
* కథ గురించి ఐడియా లేకుండా ఈ నాటకం‌ఫాలో కావడం కష్టం. కొంచెం అయోమయంగా అనిపించింది మధ్య మధ్యలో..ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాలేదు.
* కథ ఎందుకోగానీ నాకు పెద్ద నచ్చలేదు. ఇన్నేళ్ళైనా ఎందుకు ఈ నాటకం వినాలో అర్థం కావట్లేదు. కొత్తగా నాటకాలు రావట్లేదా?
* ఈసారి ప్రతాపరుద్రీయం‌ టెక్స్ట్ చూడాలి – ఈ నాటకానికీ, ఆ అసలు నాటకానికీ ఎంత తేడా ఉందో, ఎంత పోలికుందో!
* అయితే, నాటకంలో ఒక వాయిస్ ఓవర్ ఉంటే బాగుండేది అనిపించింది. దృశ్యాలూ, నేపథ్యాలు మారినప్పుడు వాళ్ళ డైలాగుల బట్టి తెల్సుకోవాలే కానీ, వేరే మార్గాంతరం లేదు. I think its poor direction!

వినేందుకు ఇక్కడ, చదివేందుకు ఇక్కడా క్లిక్కండి.

Published in: on October 15, 2010 at 4:23 pm  Comments (3)  
Tags: