మహిళావరణం-3

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********

21) దామెర్ల సత్యవాణి (1907-1992): ప్రముఖ చిత్రకారిణి. ఆంధ్రపత్రికలో చాలారోజులు బొమ్మలు గీసేవారు. రాజమండ్రిలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేసి, ఆపై ఆర్ట్ స్కూలు ప్రారంభించారు. ఈవిడ మరో చిత్రకారుడు దామెర్ల రామారావు సతీమణి.

22) సురభి కమలాబాయి (1908-1971): రంగస్థలంపైనే పుట్టిన “సురభి” కమలాబాయి ప్రముఖ నటి. తెలుగులో వచ్చిన తొలి మూడు టాకీలలో ఈవిడే కథానాయిక. రంగస్థలం పైనా, సినిమా రంగంలోనూ ఎంతో పేరు సంపాదించుకున్నారు.

23) దుర్గాభాయ్ దేశ్ముఖ్ (1909-1981): జాతీయ నాయకురాలు, సంఘ సేవకురాలు, అద్భుత వ్యక్తి. (ఈవిడ జీవిత చరిత్ర గురించి పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి పుస్తకం.నెట్లో పరిచయ వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు)

24) ప్రేమ మాసిలామణి నాయుడు (1909-1995): వృత్తిరీత్యా డాక్టర్ అయిన ప్రేమ హైదరబాదు విక్టోరియా జెనానా ఆసుపత్రి అభివృద్ధికి విశేశ కృషి చేశారు. ఉద్యోగుల దృష్టిలో “నిప్పులు కక్కే రాక్షసి” అయిన ప్రేమ మంచి సర్జన్ గా, ఉపాధ్యాయురాలిగా పేరు పొందారు. అరవై ఏళ్ళ వయసులో కంటి జబ్బు వల్ల చూపు పోతే, లండన్ వెళ్ళి వైద్యం చేయించుకుని, పాక్షికంగానే చూపు వచ్చినా, ఆపై పదిహేను సంవత్సరాలు పని చేసారు కూడానూ.

25) సరిదె మాణిక్యమ్మ (1910-20?) : దేవదాసీ కుటుంబంలో పూట్టి, కులవృత్తిలో కొనసాగుతూ ఉన్న మాణిక్యమ్మ జీవితంలో దేవాదాయ చట్టం కారణంగా కల్లోలం ఏర్పడ్డది. వృత్తీ, భూమీ మొత్తం కోల్పోయాక, ఉన్నవి అమ్ముకుంటూ చాలా ఏళ్ళు గడిచాక, ఒకసారి అరవై ఏళ్ళ వయసులో అభినయ సదస్సులో ఆవిడ అభినయం చూశారు – నటరాజ రామకృష్ణ, అన్నాబత్తుల బులి వెంకటరత్నమ్మ గార్లు. ఆపై, మాణిక్యమ్మ అభినయ తరగతులు నిర్వహించడం, జడ్చర్లలోని నృత్యకళానికేతన్ ను నిర్వహించడం, నృత్య అకాడమీ సిలబస్ కమిటీలో పాలుపంచుకోవడం ఇలా జీవితాంతం నృత్య శిక్షణలోనే గడిపారు. 1990లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.
(ఈ పుస్తకం వెలువడేనాటికి వీరు జీవించే ఉన్నారు కానీ, ఇప్పుడు లేరు. సరిగ్గా మరణ సంవత్సరం తెలిసిన వారు ఒక వ్యాఖ్య వదలండి. సరి చేస్తాను)

26) సంగం లక్ష్మీబాయి (1910-1979) : ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్థాపించింది శారదానికేతన్ లో చదువుకుని సాంఘిక, రాజకీయ రంగాల్లో పేరు తెచ్చుకున్న స్త్రీలలో సంగం లక్ష్మీబాయి గారు ముఖ్యులు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో సత్యాగ్రహంలో పాల్గొన్నారు, జైలు జీవితం కూడా అనుభవించారు. స్వతంత్ర్యానంతరం హైదరాబాదు శాసన సభ్యురాలిగా, విద్యా శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. “ఇందిరా సేవాసదనం” స్థాపించారు. (ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థల గురించి ఒక పరిచయం ఇక్కడ చదవవచ్చు)
(ఈవిడ గురించి స్కూల్లో పాఠం ఉండేది గుర్తుందా?)

27) జనంపల్లి కుముదినీదేవి (1911 – 2009) : జమిందారీ వంశీయులైన కుముదినీ దేవి శివానంద స్వామి ప్రభావంలో కుకట్పల్లి లో శివానంద ఆశ్రమం స్థాపించారు. కుష్టు వ్యాధి గలవారి చికిత్స, పునరావాసం వంటి విషయాలలో ఈ సంస్థ నేటికీ ఎంతో కృషి చేస్తోంది. అంతేకాక, 1958లో కుముదిని వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరుగా ఉంటూ నెలకొల్పబడిన “సేవాసమాజ బాలికా నిలయం” ఇప్పటికీ విజయవంతంగా నడుస్తూ, ఎందరో ఆడపిల్లలకి ఉపాధి, ఆశ్రయం కల్పిస్తోంది. ఇవి కాక, కుముదినీ దేవి హైదరాబాదు నగర పాలనలో కూడా చురుగ్గా పని చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ గా, హైద్రాబాదుకి మొదటి మహిళా మేయర్గా, శాసన సభ్యురాలిగా పనిచేశారు. లేకాషి హస్తకళల కేంద్రానికి, మాతా శిసు సంఘానికి, సేవా సమాజనికి బాలికా నిలయానికీ అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. (ఇవిడ గురించి హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం ఇదిగో)

28) పసుపులేటి కన్నాంబ (1912-1964) : ప్రముఖ నటి, గాయని. రాజరాజేశ్వరీ నాట్య మండలి స్థాపించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆపై రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపించి దాదాపు ముప్ఫై చిత్రాలను నిర్మించారు.

29) సరస్వతి గోరా (1912-2006) : సాంఘిక దురాచారలను ప్రతిఘటిస్తూ, అనేక ఉద్యమాలలో పాల్గొంటూ, నేతృత్వం వహిస్తూ, నాస్తికత్వ ప్రచారం చేస్తూ జీవితం అంతా గడిపారు. వీరి గురించిన వికీ పేజీ ఇక్కడ చూడవచ్చు. అలాగే, వీరి ఆత్మకథ “గోరా తో నా జీవితం” గురించిన పరిచయాన్ని ఇక్కడ చూడవచ్చు.

30) జమాలున్నిసా బాజి (1913-2012) : విప్లవ నాయకురాలు. 1946లో రైతు మహాసభలు, విద్యార్థి మహాసభలు నిర్వహించడంలో పాల్గొన్నారు. పూర్తిస్థాయిలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా పని చేసారు. కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు.”ధైర్యంతో, అంకిత భావంతో ఇపటికీ తను నమ్మిన విలువల కోసం నిలబడి, సంప్రదాయాన్నీ, సాంఘిక అడ్డంకులనూ దాటి, స్త్రీలను రాజకీయాలలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న బాజీ ఆదర్శప్రయంగా నిలుస్తారు” అంటూ ముగిసింది ఈ పుస్తకంలో ని చిన్ని పరిచయం!

…తరువాయి భాగాలు వచ్చే టపాలలో!

Advertisements
Published in: on July 3, 2012 at 7:00 am  Comments (3)  
Tags: ,

మహిళావరణం-2

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********

11) కనుపర్తి వరలక్ష్మమ్మ (1896-1960): రచయిత్రి. స్త్రీ అభ్యుదయాన్ని, స్వతంత్ర్యోద్యమాన్నీ ప్తోత్సహిస్తూ రచనలు చేశారు. హిందీ భాషనూ ప్రచారం చేయడంలో కూడా కృషి చేశారు. ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి మహిళ. (వరలక్ష్మమ్మ గారి గురించి నిడదవోలు మాలతి గారు రాసిన పరిచయ వ్యాసం ఇక్కడ చదవచ్చు)

12) డాక్టర్ రంగనాయకమ్మ (1898-1940): డాక్టర్ ఐన రంగనాయకమ్మ గారు – సంఘసేవకురాలిగా, జాతీయోద్యమ కార్యకర్తగా పనిచేశారు. అలాగే, స్త్రీల సమస్యల గురించి కృషి చేసి, “రక్షణ మందిరం” స్థాపించి ఎందరో స్త్రీలకి బ్రతుకు తెరువు చూపించారు.

13) మెల్లీ సోలింగర్ (1898-1965): స్విట్జర్లాండులో జన్మించిన మెల్లీ సోలింగర్ అక్కడ మహిళల ఓటుహక్కు ఉద్యమంలోనూ, కార్మికోద్యమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆపై, 1929లో భారత దేశం వచ్చాక జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు. సబర్మతీ ఆశ్రమంలోనూ, శ్రీకాకుళం లోనూ కొన్నాళ్ళు గడిపి అక్కడ కూడా సాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. కృష్ణా జిల్లా మహిళా సంఘానికి ఉపాధ్యక్షురాలిగా, విజయవాడ మహిళా సంఘానికి అధ్యక్షురాలిగా కొన్నాళ్ళు పనిచేశారు. “కృష్ణాజిల్లా బాల నేరస్థుల పునరావాస కేంద్రం” స్థాపన, నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించారు. ఆటలు, పర్వతారోహణ, ఈత అంటే ఆసక్తి గల మెల్లీ ఉప్పల లక్ష్మణరావు గారి సతీమణి.

14) మార్సెలిన్ లిమా (1899-1984) : సికిందరాబాదు ప్రాంతాల్లోని తొలి మహిళా డాక్టర్లలో ఒకరు. ముప్ఫై-నలభై దశాబ్దాలలో ప్రజల డాక్టరుగా ఎంతో పేరు సంపాదించారు. (నిజం చెప్పొద్దూ; పేరు చూస్తే ఫారిన్ పేరులా ఉంది కానీ, ఆవిడ బొమ్మ మాత్రం చాలా భారతీయంగా ఉంది!)

15) కాన్స్టన్స్ గిబ్స్ (1900-1984): హైదరాబాదు ప్రాంతంలో స్త్రీ విద్యా వ్యాప్తి కోసం జీవితాంతం విస్తృత కృషి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.

16) పద్మజ నాయుడు (1900-1975): జాతీయోద్యమంలోనూ, సాంఘిక సేవలోనూ కృషి చేశారు. హైదరాబాదులో భారతీయ జాతీయ కాంగ్రెసు శాఖ స్థాపకుల్లో ఒకరు. అలాగే, సాంఘిక సేవా సదస్సు హైదరాబాదు శఖ కూడా ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేశారు. ఈవిడ సరోజినీ నాయుడు గారి కుమార్తె.

17) శాంతాబాయ్ కిర్లోస్కర్ (1901-1986): హైదరాబాదు ప్రాంతంలోని తొలితరం మహిళా డాక్టర్లలో ఒకరు. ఈ ప్రాంతంలో తొలి ప్రసూతి ఆస్పత్రి నిర్మించింది కూడా ఈవిడే. ఇండీయన్ మెడికల్ అసోసియేషన్, జైలు నుండీ విడుదలైన ఖైదీల సహాయ సంస్త, శ్రీ శిశు సంక్షేమ సంఘం, మహారాష్ట్ర మండలి మొదలైన సంస్థల్లో సభ్యులుగా పని చేశారు. మంచి క్రీడాకారిణి. డెబ్భై ఏళ్ళ వయసులో కూడా ఈత కొట్టేవారట!

18) మాసుమా బేగం (1901-1990): బహుభాషా ప్రవీణురాలైన మాసుమా బేగం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. హైదరాబాదు నుండి మంత్రి పదవి పొందిన మొదటి మహిళ. ఉస్మానియా యూనివసిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్, భారత ప్రభుత్వ శాంఘిక సంక్షేమ బోర్డు వంటి సంస్థల్లో పనిచేశారు. తన తల్ల్, నైజాం రాజ్యంలో గ్రాడ్యుయేట్ అయిన తొలి మహిళా అయిన తయ్యబా బేగం బిల్గ్రామి స్థాపించిన అంజుమన్ బాలికా ప్రైమరీ పాఠశాలను సమర్థంగా నడిపి, పిల్లలకి ఉచిత విద్య అందజేశారు.

19) దాసరి రామతిలకం (1905-1952): సంగీత, నృత్య కళాకారిణి. ప్రముఖ రంగస్థల నటి. తొలినాటి సినిమాల్లో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ నటి గిరిజ వీరి కుమార్తె.

20) కొమర్రాజు అచ్చమాంబ (1906-1964): విద్యార్థి దశ నుంచీ అనేక జాతీయోద్యమాలలో పాలు పంచుకున్న కొమర్రాజు అచ్చమాంబ గారు వృత్తి రిత్యా వైద్యులు. కృష్ణాజిల్లాలో స్త్రీల ఆరోగ్యం గురించి విశేష కృషి చేశారు. ప్రసూతి-శిశుపోషణ గురించి ఒక పుస్తకం కూడా రాసారు. వివిధ మహిలా సంఘాల్లో కూడా పని చేశారు. ఈవిడ కొమర్రాజు లక్ష్మణరావు గారి కుమార్తె. తను నివసించే ఇంటికి “తిరుగుబాటు” అన్న పేరు పెట్టుకున్నారట!

…. మిగితా వారి గురించి వచ్చే టపాలలో!

Published in: on July 2, 2012 at 6:00 am  Leave a Comment  
Tags: ,

మహిళావరణం – 1

చాన్నాళ్ళ క్రితం బాపు గారి లైబ్రరీలో ఈ పుస్తకం గురించి తెలుసుకున్నాను. ఆపై ఒక స్నేహితురాలు మళ్ళీ ఈ పుస్తకం గురించి ఇటీవలే ప్రస్తావించింది.. అనుకోకుండా, ఈ పుస్తకం మా లైబ్రరీలో కనిపించింది (అదేమిటో, పేరుకి జర్మన్ యూనివర్సిటీ కానీ, నాకు ఇక్కడే హైదరాబాదులో కనబడని తెలుగు పుస్తకాలు ఎక్కువగా కనబడుతున్నాయి!). అలా, మొదలుపెట్టాను.

వోల్గా, వసంతా కన్నభిరాన్, కల్పన కన్నాభిరాన్ ల ఆధ్వ్యర్యంలో వచ్చిన ఈ పుస్తకం గత శతాబ్దంలో ఆంధ్రదేశ ప్రాంతాల్లో తిరిగిన, మనం గుర్తుపెట్టుకోవలసిన స్త్రీల చరిత్ర చిత్రణల సంకలనం. ప్రతి మనిషిదీ ఒక చక్కటి చిత్రం, ఆపై, తెలుగులోనూ, ఆంగ్లంలోనూ పరిచయాలూ. “రేపటి చరిత్రను నిర్మించే స్త్రీలకి” అని రాసారు మొదటి పేజీలో. అందరూ తప్పకుండా చదవదగ్గ పుస్తకం – ఆసక్తికరమైన ఎందరి గురించో తెలుస్తోంది నాకు. కనుక ఇపుడు ఇక్కడ తెలుసుకుంటున్న అందరి గురించీ, వన్లైనర్లు అన్నా రాసి పెట్టుకోవడానికి ఈ బ్లాగు టపాలు అనమాట… నా వాక్యాల్లో నేను రాసుకుంటున్నా కనుక కాపీరైట్లు గట్రా ఉల్లంఘించబడవు అనే అనుకుంటూన్నా. ఈ పుస్తకం మార్కెట్లో దొరకట్లేదేమో అని నా అనుమానం కనుక, ఇక్కడ ప్రస్తావించిన వారిపై ఎవరికన్నా ఆసక్తి కలిగితే, ఇంటర్నెట్లో వెదుక్కోవచ్చు.

1) కందుకూరి రాజ్యలక్ష్మి (1851-1910) : స్త్రీ విద్య, వితంతు వివాహం, సంఘసంస్కరణ కోసం కృషి చేసిన స్త్రీలలో మొదటివారు అని చెప్పవచ్చు. మైండులో కనెక్ట్ చేయడానికి మరొక్క విషయం : కందుకూరి వీరేశలింగం గారి ధర్మపత్ని.

2) సరోజినీ నాయుడు (1873-1949) : పరిచయం అక్కర్లేదేమో 🙂 “భారతకోకిల”, ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు.

3) భండారు అచ్చమాంబ (1874-1905) : తెలుగులో తొలి కథ, తొలిసారిగా స్త్రీల చరిత్రా రాసిన వారు. (అచ్చమాంబ గారి కథల గురించి అంతర్జాలంలో కొన్ని వ్యాసాలు ఉన్నవి. కథల పుస్తకం ఈ బ్లాగుటపా ద్వారా దిగుమతి చేసుకోవచ్చు. ఈ కథల గురించిన పరిచయం నిడదవోలు మాలతి గారి బ్లాగులో ఇక్కడ చదవొచ్చు. అచ్చమాంబ గారిపై కొండవీటి సత్యవతి గారు ప్రజాకళ.ఆర్గ్ పత్రికలో రాసిన వ్యాసం ఇక్కడ చదవవచ్చు.)

4) బెంగళూరు నాగరత్నము (1878-1952): కర్ణాటక సంగీతంలో పేరెన్నిక గన్న గాయని. 1905-34 మధ్య కాలంలో 1235 కచేరీలు చేశారట! తిరువాయూరులో త్యాగరాజు సామాధిని నిర్మించి, ఆయన కీర్తనల ప్రచారం కోసం ఒక గురుకులం కులం నిర్మించడానికి తన ఆస్తి యావత్తూ దానం చేశారు. ఆవిడ రచయిత్రి కూడానూ. (నాగరత్నమ్మ గారిపై ఈమాటలో వచ్చిన జెజ్జాల కృష్ణమోహనరావు గారి పరిచయ వ్యాసం ఇక్కడా, దానికి వచ్చిన వ్యాసానుబంధము ఇక్కడా చదవవచ్చు. “The Devadasi and the saint” పేరిట వచ్చిన ఆవిడ జీవిత చరిత్ర గురించి ఒక పరిచయం పుస్తకం.నెట్లో ఇక్కడ చదవవచ్చు.)

5) మార్గరెట్ కజిన్స్ (1878-1954) : ఈ ఐర్లండు వనిత కలిసి భారతదేశం వచ్చాక స్వాతంత్ర్యోద్యమంలో, మహిళోద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరం స్త్రీ శిశు సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించారు. కొన్ని పుస్తకాలు కూడా రాశారు.

6) దువ్వూరి సుబ్బమ్మ (1880-1964) : స్వాతంత్ర్య సమరయోధురాలు. ఖాదీ ప్రచారం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి పోరాటాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖాదీ ఉద్యమంలో భాగంగా ఖద్దరు బట్టల మూటను నెత్తిన పెట్టుకుని ఊరూరా తిరిగి అమ్మేవారట! ఆమెని చూసి పోలీసులు కూడా భయపడేవారట! (తె.వికీ పేజీ ఇక్కడ)

7) ఉన్నవ లక్ష్మీబాయి (1882-1956) : సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు. శారదానికేతన్ అన్న గురుకుల పాఠశాలను ప్రారంభించి బాలికల ఉన్నతి కోసం కృషి చేశారు. గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీత. మ్యాపింగ్: ఉన్నవ లక్ష్మీనారాయణ గారి భార్య.

8) సుగ్రా హుమయూన్ మీర్జా (1882-1958): కవయిత్రి, రచయిత్రి, పత్రికా సంపాదకురాలూ కూడా అయిన సుగ్రా హైదరాబాదు ప్రాంతంలో ముస్లిం స్త్రీల అభ్యున్నతికి విశేష కృషి చేశారు. అలాగే, తన రచనల్లో హిందూ-ముస్లిం ఐక్యతనూ, జాతీయ భావాలను, స్త్రీ అభ్యున్నతినీ ప్రచారం చేశారు. మదర్సా-ఎ-సఫాదారియా అన్న ఉర్దూ పాఠశాలను కూడా స్థాపించారు.

9) వింజమూరి వెంకటరత్నమ్మ (1888-1951) : తెలుగులో తొలినాటి మహిళా సంపాదకుల్లో ఒకరు. “అనసూయ” పత్రికను దాదాపు ముప్పై ఏళ్ళ పాటు నడిపారు. పత్రిక ద్వారా స్త్రీ జనోద్ధరణకు కృషి చేశారు. స్వాతంత్ర్యోద్యమం పట్ల కూడా ఆకర్షితులయ్యారు. 20,30 దశాబ్దాలలో ఏర్పడ్డ నవ్యసాహితీ సమితిలో ఏకైక మహిళా సభ్యురాలు వెంకటరత్నమ్మ గారేనట! జానపద సంగీతం ప్రచారానికి కూడా విశేష కృషి చేశారు.

10) అచంట రుక్మిణి (1891-1951): జాతీయోద్యమంలోనూ, పరిపాలన రంగంలోనూ, దేశీ వైద్య విద్యను అభివృద్ధి చేయడంలోనూ కృషి చేసారు. వీణ వాయించడంలో నేర్పరి కూడా!

… ఇవ్వాళ్టికి ఇక్కడ ఆపుతున్నా. నెమ్మదిగా అలా మిగితా వారి గురించి కూడా రెండు ముక్కలు రాసి పెట్టుకోవాలని నా కోరిక… చూడాలి కొనసాగితానో లేదో! అన్నట్లు, లాంకెలు – నాకు దొరికినవి, తెలిసినవి మాత్రం ఇచ్చాను. ఎవరెవరి ఆసక్తినీ, ఓపికనీ బట్టి తక్కిన లంకెలు వెదుక్కోగలరు! 🙂

Published in: on July 1, 2012 at 8:59 am  Comments (4)  
Tags: ,