నిజమైనా, కలయైనా….

సంగీత దర్శకులు ఆర్.గోవర్థనం గారి గురించి ఎస్వీ రామారావు గారు రాసిన వ్యాసం చదువుతున్నాను (బెడ్ టైం రీడింగ్!). మూగనోము సినిమాలో “నిజమైనా, కలయైనా..” గురించి రాసేసరికి, పాట లీలగా మదిలో కదిలి, లేచి, కంప్యూటర్ ఆన్ చేసాను వినేందుకు. వింటూ ఉండగా, ఇక నిద్ర ఎగిరిపోయింది. పాట వెంటాడ్డం మొదలుపెట్టింది. అది గోవర్థనం గారి సంగీతమా? ఘంటసాల గారి గానమా? దాశరథి గారి కలమా? అన్న మీమాంసలు అటు పెడితే, పాట మాత్రం నిద్రని గెంటేసింది గదిలోంచి!!

పాట రాగా.కాంలో ఇక్కడ వినవచ్చు.

నిజమైనా, కలయైనా నిరాశలో..ఒకటేలే
పగలైనా, రేయైనా..ఎడారిలో…ఒకటేలే

పదే పదే ఎవరినో, పరాకుగా పిలిచేను
నా నీడే నా తోడై జగమంతా తిరిగేను..

గులాబినై నీ జడలో ..మురిసానే ఆనాడు
బికారినై నీకోసం…వెదికానే ఈనాడు

చెలీ చెలీ, నా మదిలో చితులెన్నో రగిలేను
చెలి లేని నాకేమో, విషాదమే మిగిలేను

Published in: on July 26, 2011 at 1:01 am  Comments (3)  

నిన్నటి రెండు పాటలు

నిన్న ఒక ఇళయరాజా తమిళ పాట పరిచయమై వదలకుండా వెంటాడింది. ఇప్పుడు కూడా ఇది రాస్తూ ఆ పాటే వింటున్నా. అవినేని భాస్కర్ గారి పుణ్యమా అని, పాట అర్థం కూడా తెలిసింది. అర్థం బాగా అర్థమయ్యాక, పాట ఇంకా నచ్చడం మొదలుపెట్టింది. విచిత్రం ఏమిటో గానీ, ఈ పాట వింటున్నంతసేపూ నాకో ఒక తెలుగు పాట కూడా గుర్తొస్తూ ఉండింది ఎందుకో గానీ! ఆ రెంటి గురించే ఈ టపా!

ఇంతకీ, తమిళ పాట: “సెంగాత్తు భూమియిలే” అన్న సినిమాలోది. ఇళయరాజా సంగీతం. గానం: రీటా అని రాసి ఉంది రాగా.కాం లో. పాటని ఇక్కడ వినొచ్చు.

భాస్కర్ గారి అనువాదం…

ఎన్ ఉసురు ఎన్న విట్టుప్ పోనాలుం – ఉన్న విట్టుప్ పోగాదు
నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళినా – నిన్ను వదిలి వెళ్ళదు
తీయిలదాన్ ఎన్ ఉడంబు వెందాలుం – ఉన్ నెనప్పు వేగాదు
అగ్గిలో నా తనవు కాలినా – నీ తలపు కాలదు.
ఎన్నోడ నెంజుక్కుళ్ళ ఎన్న ఇరుందదున్ను ఇప్పో పురింజాలే పోదుం.
నా ఎదలో ఏముండేదో అని ఇప్పుడు అర్థమైతే చాలు.

చరణం:

పూముడిక్క కాత్తిరుందేన్ – పళి(zhi)ముడిక్క పోనాయే
వరించుదామని వేచియుంటిని – నువ్వు పగతీర్చుకోడానికి వెళ్ళావు.
వాళ్వు(zh) తర కేట్టిరుందేన్ – సాగడిచ్చు పార్తాయే
బ్రతుకునిమ్మని కోరియుంటిని – చావునిచ్చావు
నమ్మోడ ఊర్గోలం పార్కామ నాన్ పోనేన్; ఎన్నోడ ఊర్గోలం నీ పార్పియా?
మన (పెళ్ళి) ఊరేగింపు చూడకుండ నేను పోయాను నా (మరణ) ఊరేగింపు నువ్వు చూస్తావా?
ఊర్మాల ఎన్నెన్న పారు – ఉన్ మాల ఎన్మేల పోడు
ఊరిదండ ఏమిటో చూడు – నీ దండ నామీద వెయ్యి
(ఈ చివ్వరి వాక్యం ఏమిటో, నాకర్థం కాలేదు. పైగా, సినిమా చూడలేదు కనుక, అసలర్థం కాలేదు!)

-ఇంత వివరంగా ఇక్కడ రాసాక, పాట నన్ను వెంటాడుతూ ఉందో అర్థమైందనుకుంటాను. ఒక పక్క లయరాజు సంగీతం నన్ను ఆ మూడ్ లోకి లాగేసింది. గాయని గొంతుక కూడా బాగుందనిపించింది. చాలా గాఢమైన భావాలు ఉన్నట్లు అనిపించింది.

అగ్గిలో నా తనవు కాలినా – నీ తలపు కాలదు.
నా ఎదలో ఏముండేదో అని ఇప్పుడు అర్థమైతే చాలు.

-నాకసలు ఆ సినిమా ఏమిటో, దాని కథేమిటో తెలీదు కానీ, ఈ రెండు లైన్లు మాత్రం వేధించడం మొదలుపెట్టాయి నన్ను 😦

పొద్దున్న మొదలై, రాత్రి పడుకునేటప్పుడు కూడా వింటూ పడుకుని, లేవగానే మళ్ళీ వింటున్నానూ అంటే….ఏం చెప్పేది నా అవస్థ!

ఇక రెండో పాట – “గాయం 2” సినిమాలో “కలగనే కన్నుల్లో, కరగకే కన్నీరా” పాట. ఇదీ ఇళయరాజా పాటే. ఎందుకోగానీ మొదటి పాట వింటున్నంతసేపూ ఇదే గుర్తొచ్చింది.
“కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా
కలసిన గుండెల్లో కలతలే కన్నారా”
– అంటూ సాగే ఈ పాట ఇళయరాజా గారే పాడారు కూడానూ. ఇక్కడ సాహిత్యం చదవొచ్చు, పాట వినొచ్చు.

ఆ పాట వింటూంటే ఎందుకు ఈ పాట గుర్తొచ్చిందంటే చెప్పలేను మరి! “మూడ్” అలాంటిది అయినందుకు కాబోలు, రెండింటిలోనూ!

అసలిదంతా రాయడం మొదలుపెట్టాక, మూడో పాట గుర్తొచ్చింది. అది “సూరీడు పువ్వా…”, అంతఃపురం సినిమా నుండి.

మొత్తానికి అన్నీ ఇళయరాజా స్వరపరచిన పాటలే కావడం ఇక్కడ విశేషం 🙂

Published in: on July 12, 2011 at 1:19 pm  Comments (2)  

శ్రవణానందం-4: గజేంద్ర మోక్షం (పాలగుమ్మి రాజగోపాల్)

రంజని గారి పుణ్యమా అని ఈ ఆడియో లంకె దొరికింది. అయితే, అప్పుడు వినడం కుదరక, ఇప్పుడు తీరిగ్గా విన్నాను. నాకు ఆ పద్యాల భాష అర్థం కానీ, కాకపోనీ. కానీ, రాజగోపాల్ గారి గొంతులో, గజేంద్ర మోక్షం వింటూ ఉంటే, ఎంథ ప్రశాంతంగా ఉందో! నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా కుదిరింది. నాలాంటి మిగితా తెలుగు రాని పిల్లకాయలూ, అర్థం అవడం మాట అటుంచి, రాగయుక్తంగా పద్యాలు పాడడంలో ఉన్న సొగసు కోసం రాజగోపాల్ గారి ఆడియో వినండి!

సంఘటనలోని “మూడ్” ని చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు,సారీ పాడారు.

మధ్య మధ్య వచ్చిన వ్యాఖ్యానం కూడా క్లుప్తంగా బాగుంది.

అయితే, బహుశా వివరంగా తాత్పర్యం తెలుసుకునేందుకు ఉద్దేశించింది కాదనుకుంటాను ఈ ఆడియో. ఏదో, సారాంశం తెలుసుకుంటూనే, కనీసం వినికిడి ద్వారా కొంచెం అవగాహన కలిగించుకోడానికి పనికొస్తుంది. అన్నట్లు, పిల్లలకి తెలుగు నేర్పేటప్పుడు ఉచ్ఛారణ నేర్పేటపుడు ఇలాంటిది కూడా చేరిస్తే బాగుంటుందేమో. చూడబోతే, కొంచెం కష్టపడితే, ఏదో కాస్త అర్థం చేసుకోగలనేమో అనిపిస్తోంది, మళ్ళీ!

రాజగోపాల్ గారి గళంలో గజేంద్ర మోక్షాన్ని ప్రవచనం సైటులో ఇక్కడ వినండి.

రాజగోపాల్ గారి గురించి ఈనాడు సైటులో ఉన్న వ్యాసం ఇక్కడ చూడండి.

లంకెల కర్టెసీ – రంజని గారే!

ఈ బ్లాగులో ఇదే ట్యాగు తగిలించిన తక్కిన వ్యాసాలు ఇక్కడ చూడండి.

Published in: on February 3, 2011 at 7:00 am  Comments (1)  
Tags:

ఏప్రిల్ 23 – ఎస్.జానకి పాటల లూప్

ఏప్రిల్ ఇరవై మూడు – ఎస్.జానకి పుట్టినరోజు అని నాకు తట్టేసరికి సగం రోజు గడిచిపోయింది. ఆపై, గూగుల్ బజ్ లో బెజవాడ ఫణీంద్ర గారు ఆవిడ్ని తల్చుకున్నారు – అది చదువుతూ ఉంటే – ఇటీవలి బిజీ జీవితం పుణ్యమా అని తీరిగ్గా దుప్పటి కప్పుకుని నిద్దరోతున్న నా పాత అభిమానం ఉలిక్కిపడి లేచింది – ఎవరో తలపై కుండ నీళ్ళు కుమ్మరించినట్లు. అప్పుడే రెండు గంటల బస్సు ప్రయాణం, ఆపై మరి కొద్ది గంటల తేడాలో పన్నెండు గంటల బస్సు ప్రయాణం వెంట వెంటే ఉన్నాయి కదా – జానకమ్మ గొంతు వింటూ బడలిక లేకుండా చూస్కుందాం అనుకుంటూ – కొన్నాళ్ళుగా తెరవని ఎస్.జానకి తెలుగు సీడీలు రెండూ, ల్యాప్టాప్ లోనే ఉన్న త్యాగరాజ కీర్తనలూ -హడావుడిగా ఎంపీత్రీ ప్లేయర్ లోకి కాపీ చేస్కుని బైట పడ్డాను.

నేను అంత రాండంగా పెట్టుకున్నానా, వరుసగా వింటూంటే – వావ్! అనుకోకుండా ఉండలేకపోయాను. అంత వైవిధ్యం విన్న కొద్ది పాటల్లో! ఇప్పుడు నేను విన్న వరుస లోనే కొన్ని పాటల్ని మళ్ళీ తల్చుకుంటూ ఈ టపా.

(గమనిక: ఫొటోల కర్టసీ – బెజవాడ ఫణీంద్ర గారు. వారికి అనేకానేక ధన్యవాదాలు!)

సిరిమల్లెపూవా – నాకు ఇది మొదట తమిళంలో పరిచయమైంది కానీ…. ఇప్పుడు తెలుగులోనే వింటున్నా..ఇదైతే మనకి బాగా అర్థమౌతాయి కదా పదాలు 🙂

కళ్ళలో ఉన్నదేదో – నేనీ సినిమా ఎప్పుడూ పూర్తిగా చూడలేదు. ఈపాట కూడా ఎప్పుడూ పూర్తిగా వినలేదు. ఇప్పుడు మొదటిసారి పూర్తిగా విన్నాను. బాగుంది.


తొలికూడి కూసిందిరా మావా తెల్లారిపోతుందిరా…
– అదనమాట – పై రెండూ విన్నాక, మధ్యలో ఇది విని, కింద ఉన్న మరో రెండింటికి చేరాను.

ఎవరేమన్ననూ
-“ఎవరేమన్ననూ..తోడు రాకున్ననూ..ఒంటరిగానే సాగిపోరా…నీ గమ్యం చేరుకోరా..” – అని ముందు ఎంకరేజ్ చేసి పంపేశాక,

నీకేలా ఇంత నిరాశ
“నీకేల ఇంత నిరాశ…నీ కన్నులలో కన్నీరేల…అంతా దేవుని లీల..అంతా దేవుని లీల ….ఆశనిరాశలు దాగుడుమూతల ఆటేలే…చీకటి కొంత వెలుతురు కొంత, ఇంతే జీవితమంతా….నీమదిలోని వేదనలన్నీ నిలువవులే కలకాలం….” – అని కన్సోలేషన్. బాగుంది 🙂 ఎవరో హమ్ చేస్తూంటే వినడమే కానీ, ఈ రెండు పాటల అసలు వర్షన్ వినడం ఇదే మొదటిసారి.

సూరీడు పువ్వా – అంతఃపురం సినిమాపాట. నాకు ఈపాటంటే చాలా ఇష్టం. కానీ, మంచి మూడ్లో ఉన్నప్పుడు మాత్రం వినను – అంత విషాదంగా ఉంటుంది మరి! “ఆకాశమే మిగిలున్నదీ…ఏకాకి పయనానికి…” ఇటువంటి వాక్యాలు ఆపాటలో, ఆ గొంతుకలో వచ్చినప్పుడు మాత్రం – ఎంత మంచి మూడ్లో ఉన్నా కూడా, విషాదం ఆవరిస్తుంది నన్ను. అందుకే మామూలుగా మూడ్ బాలేనప్పుడు తప్ప ఈ పాట విననన్నమాట.

-ఏదో అనుకున్నాను కానీ, పై పాటల్ని ఇప్పుడు చూస్తూ ఉంటే, భలే ఉన్నాయ్! నెమ్మదిగా మూడ్ డౌన్ ఔతూ వచ్చినట్లు లేదూ!!

శివదీక్షాపరురాలనురా – ఇదండీ అసలు ఈ లిస్టు మొత్తంలో నన్ను ఒక ఇరవై నాలుగ్గంటలు వెంటాడిన పాట. ఈ లిస్టులో, మొదటిసారి విన్న పాట ఇదే అనుకుంటాను. ఎందుకో చెప్పలేకపోతున్నాను కానీ – తెగ నచ్చేసింది నాకీ పాట. ఆ నేపథ్య సంగీతం, దాని ట్యూన్లో సాగే జానకి గాత్రం, ఆ స్లో ఫ్లో – వెరసి పిక్ ఆఫ్ ది డే చేసేసాయి ఈ పాటని. ఈపాట గురించిన కథ గూగుల్ చేస్తే తెలిసింది – ’ఘనం సీనయ్య’ – గురించి.

“1704-31 మధ్యకాలంలో వున్న ఘనం శీనయ్య అసలు పేరు వంగల శీనయ్య. ఇతడు మధుర రాజైన విజయరంగ చొక్కనాథుని మంత్రులలో ఒకడు. ఇతని రచన “శివదీక్షాపరురాలనురా” సంగీతసభల్లో బాగా వ్యాప్తిపొందింది. ఇందులో వ్యాజస్తుతి వుండటం వల్ల ఇటు శైవుల అటు వైష్ణవుల మెప్పునూ పొందింది. “సీతాకళ్యాణం” (1934) చిత్రంలో ఈ గీతాన్ని ఉపయోగించగా, “పూజాఫలం”లో మొదటి చరణం వరకూ “ప్రేమ” సినిమాలో హాస్యగీతంలో పల్లవి వరకూ ఉపయోగించారు. “సీతాకళ్యాణం”లో రావణుని కొలువులో రంభచేత అభినయం పట్టించిన ఈ గీతం రావణుడు వైష్టవద్వేషి కావడం వల్ల సందర్భోచితంగా రాణించిందని మల్లాది రామకృష్ణశాస్త్రి అభిప్రాయం.” (లంకె ఇక్కడ)

ఆ పై పరుచూరి శ్రీనివాస్ గారు చెప్పిన కథ:

“The song was recorded by quite a few number of artists. The earliest recording I have is from 1920s, sung by “Miss Adilachmu” (sic)”of Mysore”. Though she sings it elaborately – its a 6 min recording – she also skips the aforementioned stanzas. My favourite is Shanmuga Vadivu’s (mother of M.S. Subbulakshmi), singing the song while playing Veena.Divine!! There are a couple of Naagaswaram recordings by stalwarts like T.N. Rajaratnam Pillai et al. That 20 sec bit of R. Balasaraswati in “prEma” (1952) is also a great delight to hear.”

Here are the three stanzas that are never sung:
1. పంచాక్షరి జప సీలనురా! కూకిపలుకులను వినజాలనురా!
కొంచెపు వగలు నేనెంచనురా! మ్రొక్కుదు రుద్రాక్ష సరులు త్రెంచకురా

2. అజ్జు చూచి చన్ను లదమకురా! నా సెజ్జ గొలుసు బట్టీ గదియకురా
బుజ్జగించను పసికోలనురా! కెమ్మావి నొక్క భక్తురాలనురా!

3. మోము మోమును బట్టి జేర్చకురా! నీ నామము తోడ బూతి గూర్చకురా!
వేమరు తోడ బిక్ష వేడకురా! బోపరా మన్నారు రంగ మల్లాడకురా!


సద్దుమణగనీయవోయ్
– పైపాట వినగానే, ఈపాట వింటే ఎలా ఉంటుందంటారు?? 🙂 బస్సులో ఉన్నా కనుక సరిపోయింది కానీ, పెద్దగా నవ్వేసి ఉందును. ఈపాట సంగీతం రమేశ్ నాయుడు గారని ఈనెల ఈమాటలో ఆయనపై పరుచూరి శ్రీనివాస్ గారు రాసిన వ్యాసం చూస్తే తెలిసింది.

నీలీలపాడెద దేవా – ’సద్దుమణగనీయవోయ్…’ తరువాత ఈపాట!! నిజం చెప్పొద్దూ – భక్తి పాటల్లో అదేదో అపీల్ ఉంటుంది. అభక్తశిఖామణులైన నాలాంటి వారికి కూడా నచ్చేస్తాయి ….

సెప్టెంబర్ మాసం – ’నీలీల పాడెద….దే…వా…’ అని అది ఆగగానే…’సెప్టెంబర్ మాసమ్…..’ అని డించక్..డించక్ డాన్సు కళ్ళ ముందు కదలాడితే??

-ఇవి సైన్ కర్వ్ లాగా… పైన సా..కింద రీ అన్నట్లు….. extremes!

(ఇక్కడి నుండి కొన్ని త్యాగరాజ కీర్తనలు వచ్చాయి- నాకు శాస్త్రీయ/అశాస్త్రీయ – ఏ సంగీతంతోనూ పరిచయం లేదు. విని ఆనందించడానికి, కనీసం – ఇవి విని ఆనందించడానికి ఆ అజ్ఞానం అడ్డురాలేదు.)

బాలా కనకమయ –
రారా మా ఇంటి దాక –
నిన్నే నెర నమ్మినాను రా –
ఎందుకు దయరాదురా –
దయరానినీ దాశరథీ –
తలచినంతనే నా తనువేమో –
– వరుసగా త్యాగరాయ కీర్తనలు వచ్చాయి. త్యాగరాయ కీర్తనలను రెండర్థాలతో అన్వయించుకోగల సౌలభ్యం నాకున్నది కనుక, ఇలాంటి పాటలంటే ప్రత్యేకాభిమానం నాకు. ’తలచినంతనే నా తనువేమో ఝల్లుఝల్లనేరా…’’దయరానీ…’ పాటలో ’కనుగొనానందమై కన్నీరు నిండెనే రామా..’ అన్న వాక్యాన్ని నాలుగుసార్లు నాలుగురకాలుగా పాడే విధానం అంటే నాకు చాలా ఇష్టం. మొదటి సారి విన్ననాటి నుంచి గత వారాంతం వరకూ ఒక వందసార్లన్నా విని ఉంటానీపాటను. ఇన్నిసార్లలోనూ – ’కనుగొనానందమై’ నిస్సందేహంగా ఈపాటలో నా అభిమాన భాగం.

నగుమోము గనలేని
– త్యాగరాయ కీర్తనె కానీ, నా కథ కాస్త చెప్పాలి. ’నగుమోము..’ మొదటిసారి విన్నది ’అల్లుడుగారు’ సినిమాలో యేసుదాసు గొంతుకలో. మొదటిసారి బాగా ఇష్టపడ్డది భానుమతి గారి గొంతుకలో. ఆపై మధ్యలో – ఇద్దరు ముగ్గురు పూర్తి ’శాస్త్రీయ’ గొంతుకల్లో విన్నాను. అంటే – నా ఉద్దేశ్యం – సినిమేతర పాటలని మాత్రమే!

సినిమాల్లో వచ్చే శాస్త్రీయం తప్ప, నాకు ’ప్రైవేట్ ఆల్బమ్స్’ నచ్చవని నిర్ధారించుకుంటున్న సమయంలో, నా చిన్నప్పటి ఫేవరెట్ – ఈ క్యాసెట్ (ఈ త్యాగరాయ కృతులన్నీ జానకి గారి గొంతులో ఒకే క్యాసెట్లో విన్నాను మొదటిసారి – బహుశా ఒక పదిహేను పదహారేళ్ళప్పుడు కాబోలు) – కి ఎంపీ౩ వర్షన్ కనబడ్డది ఆన్లైన్ లో. దానితో, అప్పటికి ’నగుమోము’ మోజులో ఉన్న నేను, జానకి గారి గొంతులో ’నగుమోము’ విన్నాక, అద్దంలో నా నగుమోముగన్నాను. 🙂 అలా వంద సార్లు రీప్లే చేసినా వింటూ ఉండిపోగలను – అనిపించే పాటల్లో ఇదొకటి.

అలా మిగితా పాటలు కూడా విన్నాను. మొత్తం జాబితా విప్పడం దేనికని ఇక్కడికి ఆపేస్తున్నా 🙂

Published in: on May 10, 2010 at 9:22 am  Comments (8)  

మూడు పాటలూ, నేనూ

ఇదెక్కడి గోలండీ బాబూ – పగలంతా నా తలలో తిరిగి తిరిగి, దాన్ని తినేసి, ఆఖరుకి నన్నొదిలేసి వెళ్ళిపోయింది – ఏదా? అదే…గోల. నేను గోల చేయలేదు…గోలే నన్నేదో చేసి వెళ్ళిపోయిందంటున్నాను. మనిషి గోల చేస్తాడు కానీ, గోల మనిషినేం చేస్తుంది అంటారేంటి మళ్ళీ? నన్ను ఏదో చేసిందంటే నమ్మరేం? మీదెక్కడి గోలండీ బాబూ!

మీకంటే నేనే నయం ప్రశ్నలేసి చంపుకోకుండా విషయం కనుక్కునే ప్రయత్నం చేశాను. ఇంతకీ ఈ గోలెక్కడిదో అర్థం అయింది చివరకి…కానీ, ఏమిటో, ఎందుకో, అర్థం కాలేదు. లేదంటే – అసలదేమిటో అర్థమైంది కానీ, ఎక్కడిదో, నా దగ్గరికెలా వచ్చిందో అర్థం కావడంలేదా? ఏమిటో – నాకేమర్థం కావడంలేదో కూడా నాకర్థం కావడం లేదు 😦

మొన్నామధ్య ఓరోజు లేవడం లేవడం – “ఆంఖోంకీ…గుస్తాకియా…” పాటతో లేచాను. పాట మ్రోగుతోంది తల్లో. తల్లో ఏం ఆన్ చేస్కున్నానో లేస్తూ లేస్తూ – అది నాకు తెలీదు. సరే, పాట వస్తోందా, మధ్యలో మ్యూజిక్ వినబడ్డాక నాకేదో తేడాగా అనిపిస్తోంది. తేడా ఏంటో అర్థం కాదు. పాట మధ్యలో మ్యూజిక్ రాదా ఏంటి? అని మళ్ళీ నన్ను నేనే వెటకరించుకుంటున్నా (అద్దంలో మిటకరించుకుని చూశా కూడా) (ఆర్యా! ఈ రెండు పదాలు మదీయ పైత్య ప్రేలాపనలని గమనించగలరు). ఇలా ఇది ఓ పదిసార్లు ఐంది. ఆ పాట మొదలవడం, “ఆంఖోకీ ……” వరకు మళ్ళీ వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఆ మ్యూజిక్ వినబడ్డం. ఇలా ఇలా అయ్యాక, కాసేపటికి, అ మ్యూజిక్ తర్వాత భాగం వినబడ్డం మొదలైంది.

“పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు… రంగరిస్తివో, ఇలా బొమ్మ చేస్తివో…”
“ఒహొ హొ హొ..ఒహొ ఒహొ ఒహొ…”
అబ్బబ్బా! ఏమిటీ మ్యూజిక్ మళ్ళీ మళ్ళీ. ఇంతసేపటికి ఏదో లైను వినబడ్డది అనుకుంటూ ఉంటే, మళ్ళీ అదే సంగీతం. ఎక్కడిదీ పాట “ఆంఖోంకీ….” మధ్యలో?
అనుకుంటూ తడబడుతూ ఉండగానే – “అమ్మ బ్రహ్మదేవుడో!” అంటూ ఈ పాట కొనసాగింది.
“ఓహో!” ఇలా వచ్చారా తల్లీ!” అనుకున్నాను మన ఆత్మాసీత గురించి.

అవి రెండూ అలా మైండులో తిరుగుతూ ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటే, ఏదో ఓలా పని కానిచ్చుకుని, ఆఫీసుకని బయలుదేరాను. బెల్ సర్కిల్ దగ్గర పెద్ద జాం. సరే, అలా ఆకుపచ్చ విప్లవం కోసం ఎదురుచూస్తూ ఉంటే, ఓ పక్క ఉన్న గందరగోళంతోనే గజిబిజిగా ఉంటే, ఇక్కడ కొత్త గందరగోళం! “ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది!” అట. నాకెక్కడ తీరికా ఇప్పుడు ఏం తెలిసిందో తెలుసుకునేందుకు, గ్రీన్ లైటొచ్చేస్తేనూ!

ఆఫీసుకొచ్చేసాక – మళ్ళీ, “లాలాలాలా లాలల లాలా…”
“మోహాలే… దాహాలై… సరసాలే… సరదాలై… ”
“ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది!”
ఏంటి తెలిసేది? నాకు గందరగోళం వల్ల చిరాకెక్కువై కూడా ఆవేశం కలుగుతోంది. అయినా, గందరగోళం దేనికో తెలియట్లేదు. మరి ఏమిటది తెలిసేది ఆవేశం వల్ల? ఆకాశం ఏనాటిదో తెలుస్తుందా? అనురాగం ఏనాటిదో తెలుస్తుందా?

“ఏం మాట్లాడుతున్నావసలు? తల్లో హెడ్డుందా? మోకాళ్ళలో ఏమన్నా నొప్పులా?”
“ఏయ్! ఎవర్రా అది? నాతోనే వెటకారమా?”
“నీతో ఏమిటి? నువ్వేమన్నా పెద్ద ఇదా? అసలు నీకూ, నాకూ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది.”
(ఎందుకన్నా మంచిదని, ఎందుకొచ్చిన గోలని) “నేనే నక్కని” అనేశాను.
“హహహహ”
“అద్సరే, నవ్వులు ఆపి, తమరెవరో సెలవిస్తారా?”
“నేనా? నీ మనసులో తిరుగుతున్న పాటలన్నింటిలో ఉన్నదాన్ని.”
“అన్నింటిలో ఉన్నదేమిటి? సంగీతం, సాహిత్యం. రెండింటిలో మీరెవరండీ?” ఈసారి నేను నిజంగా నక్కనే అని అర్థమైపోయి, వినయంగా అడిగాను. అలాగే, అలా మాటల్లో పెట్టి సదరు ఆకాశవాణి డిటైల్స్ మొత్తం తెలుసుకుందామని నక్కజిత్తుల వేషాలు కూడా వేయడానికి రెడీగా ఉన్నాను.
“రెండూ కాను”
“మరి?”
“వాటి కలయికను”
“ఓహో! మరైతే, ఇలా గలగలమంటూ బిలబిలమంటూ పాడుకుంటూ వచ్చేసి నన్ను ముంచేస్తే, నా గతేం కాను?”
“చూడు, నా బతుకునిండా రాళ్ళు. పాడకుంటే ఎలా ?” – అన్నది ఆ గొంతుక, ఇస్మాయిల్ గారు అన్నట్లే!
“రాళ్ళా?” అన్నా నేను నోరెళ్ళబట్టి.
“గలగలమన్న శబ్దం ఎక్కడిదనుకున్నావ్?”
“అది తెలీయకే కదా ఈ గోలంతానూ!” విసుగ్గా అన్నాను.
“ఎక్కడిదంటే…”
“భూల్ జా…. ఇన్ యాదోంకో తూ భూల్ జా…” ఫోను!
పగటిపూట, ఆఫీసులో, కలా! ఏమిటి చేసేది ఇప్పుడు?”
“కాలాన్నే నిలదీసి కలలకి ఇవ్వాలి వెలలేని విలువను.”
-అబ్బా! మళ్ళీ మొదలు!!!

(నా తల్లో జరిగే కథ నాకర్థం కాదు. అసలు నేనేం మాట్లాడుతున్నానో ఈ ఆకాశవాణికర్థం కాదు. ఆ ఆకాశవాణి కథేంటో నాకర్థం కాదు. నాకెందుకు ఏదీ సరిగా అర్థం కాదో కూడా నాకే అర్థం కాదు. నేనెందుకిలా రాసి రాసి చంపుకుతింటానో మీకర్థం కాదు. మనసెందుకు నాకు సర్రియలిజం ఎక్కువైందేమో అనుకుంటోందో… మీరెందుకు నా బ్లాగును అదోలా చూస్తున్నారో…ఈ రాతేమిటో… ఏవిటో! ఏవీ అర్థం కావట్లేదు. 😦 )

Published in: on October 21, 2009 at 9:34 pm  Comments (7)  
Tags:

సువ్వీ సువ్వీ సువ్వీ!

ఎందుకో గానీ, ఇవాళ పొద్దున్న ఆఫీసు చేరే దారి పొడుగుతా ఇదే పాట … ఇందులోని వాక్యాలూ పదే పదే గుర్తొచ్చాయి. మధ్య మధ్య –“నువ్వక్కడుండీ నేనిక్కడుంటే…ప్రాణం విలవిలా…నువ్వెక్కడుంటే నేనక్కడుంటే..మౌనం గలగలా…” అని గోపీ గోపిక గోదావరి పాట గుర్తొచ్చింది కానీ, వెంటనే… “ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ” అన్న లైను క్షణానికోమాటు గుర్తొచ్చి మనసు పాడుచేస్తూ ఉండింది. “చి! పాడు పాట… ఇలా వెంటాడుతూ ఉందేంటి” అని విసుక్కున్నా కూడా, మళ్ళీ ఈ పాట వినడం మొదలుపెట్టాను. ఓ పక్క మనసు పిండేసింది కానీ, దీని గురించి రాయకుండా ఉండలేకపోతున్నా.

పాట యూట్యూబ్ వీడియో ఇక్కడ.

“గువ్వ మువ్వ సవ్వాడల్లె నవ్వాలమ్మ”
– అలా నవ్వడమెలాగో…నాకు తెలీలేదు కానీ, వాక్యం వినగానే పెదాలపై చిన్న చిర్నవ్వు. ఈ పార్టంతా ఇలా సాగిందా, ఇక అసలు కథ మొదలు…

“అండ దండ ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిన్ను కొండ కోనల కొదిలేసాడా”

– ఈ వాక్యం విన్నప్పుడు మాత్రం, చాలా చలనం కలిగింది నాలో. అందులోనూ…రెండోసారి జానకి గారు పాడుతున్నప్పుడు – “గుండేలేని మనిషల్లే…” అని ఓ క్షణం ఆగినప్పుడైతే… మరీనూ. ఆ వాక్యాల్లోనే బాధ తెలుస్తోంది. ఇక అలా సగం చెప్పి ఆగడంలో … ఆ బాధ intensity ఇంకా బాగా చెప్పినట్లు అనిపించింది. అలా అలా ఈ పాటలో నన్ను వెంటాడిన మూడు లైన్లలో ఇదొకటి. అంటే, అక్కడి సందర్భంలో అతనేదో ఆలోచించక అది అనేస్తే, ఆ మాట ఆమెనెంత లోతుగా తాకిందో, అక్కడ ఆ బాధ చాలా బాగా తెలుస్తుంది ఆ దృశ్యంలో.

“అగ్గిలోన దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒక నాడు నింగి నేల నీ తోడూ”

– “నెగ్గేవమ్మా ఒకనాడు..” అని జానకి గారు పలికిన తీరు ఆ పాత్ర అనుభవిస్తున్న బాధను ఎంత బాగా చెప్పిందో అనిపిస్తుంది నాకు. అంటే, రాధిక మొహంలోని దీనత్వం కూడాననుకోండి… “నింగీనేలా నీ తోడు”…. ఒంటరితనాన్ని ఎంత బాగా వర్ణించారో!

“చుట్టూ వున్న చెట్టు చేమ తోబుట్టువులింక నీకమ్మా”
– ఒంటరితనాన్ని చూపుతూనే, ప్రపంచంలో ఏ ఒక్కరూ ఒంటరి కారు అని చెప్పడమేమిటో! అసలీ వాక్యం మొదటిసారి పలికినప్పుడేమో ఒంటరి తనం నీది…అని జాలి చూపుతున్నట్లూ, రెండోసారి పలికినప్పుడు ధైర్యం చెబుతున్నట్లూ అనిపించింది..ఎందుకోగానీ.
“ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ”
అబ్బా! ఆగక పొంగే కన్నీళ్ళే! – పాడిన పాత్ర మానసిక స్థితి వేరే రకానిదే కానీ, ఎంతైనా, అలా మొహం మీదే నీదో దురదృష్టపు బ్రతుకు… అంటూ ఉంటే, ఎలా ఉంటుందో వినడానికి నిజంగా కష్టాన్ని అనుభవించేవారికి!!

“పట్టిన గ్రహణం విడిచి
నీ బ్రతుకున పున్నమి పండే గడియ
వస్తుందమ్మా ఒకనాడు
చూస్తున్నాడు పైవాడు”

– లాస్ట్ కి మళ్ళీ ఓ ఓదార్పు! అతని లాంటి తెలిసీ తెలియని మనిషి మాట్లాడితే, ఇలాంటి వాక్యాల్లో ఎంత అమాయకత్వం కనిపిస్తుందో,
“వస్తుందా ఆ నాడు
చూస్తాడా ఆ పైవాడు”

– అని ఆమె నిరాశగా అన్నప్పుడు ఆమె నిస్సహాయతా, ఆమె పడుతున్న వేదనా అంత స్పష్టంగా తెలుస్తోంది…

అమ్మో! ఈ పాట నా గుండే పిండేస్తోంది ఇవాళ. అవే వాక్యాలు మళ్ళీ మళ్ళీ ఆ గొంతుకల్లో మ్రోగుతూనే ఉన్నాయి… నా చెవులకి ఎక్కడికెళ్ళినా వినిపిస్తూనే ఉన్నాయి…

పాట వివరాలు:
స్వాతి ముత్యం లో SPB, S.Janaki పాడిన పాట.
రచన: సినారె.
సంగీతం: ఇళయరాజా.

Published in: on June 8, 2009 at 10:35 am  Comments (9)  

పాటల సందడి : జాబిల్లి కోసం ఆకాశమల్లే

టైటిల్ చెబుతున్నట్లు నేను ఎంచుకున్న పాట “మంచి మనసులు” సినిమాలో ఆత్రేయగారు రాయగా ఇళయరాజా స్వరపరచి ఎస్పీబీ, జానకి గార్లు విడివిడిగా పాడిన “జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై” పాట రెండు వర్షన్లు. ఇది నా అన్నింటికంటే ఫేవరెట్ కాదని ముందే విన్నవించుకుంటున్నాను. ఈ టపా రాయాలన్న తీర్మానం జరిగినప్పుడు ఈ పాట నన్ను తనలోకి స్వాహా చేసేస్కుంటూ ఉండింది. అందుకని నేను ఈ పాటనే ఎంచుకున్నాను. మనసు కవి అని ఆత్రేయను ఎందుకంటారో ఎన్నో పాటలు మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి అని నాకు బాగా నమ్మకం. ఒకటి విఫల ప్రేమ గీతంలా, ఒకటి కలల విహారం లా ఉన్నా కూడా రెంటినీ గురించీ ఒకే టైటిల్ కింద రాస్తున్న నన్నేమనాలో మీరే డిసైడ్ చేస్కోండి. 🙂 అయినా, ఈ పాటలు సినిమాలో ఏ సందర్భంలో వచ్చాయి అన్న విషయాన్ని పక్కన పెట్టి రాస్తున్నాను ఈ టపా.

మొదటగా male version – ఆన్లైన్ లో ఇదే ఎక్కువ ప్రచారంలో ఉంది, ఎందుకో గానీ. పాట సాహిత్యం ఇక్కడ చూడవచ్చు.
“నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైన” – వింటూ ఉంటేనే ఆ విరహం అనుభవిస్తున్న భావన కలుగుతుంది. అది ఆ పదాలవల్లని చెప్పి సంగీతాన్ని తక్కువ చేయనా? సంగీతమని చెప్పి పాడిన విధానాన్ని మరువనా? అందుకే ఏమీ చెప్పను.
అలాగే – “నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా” – అన్న వాక్యం కూడానూ.
“ఈ పువ్వులనే, నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ ఉర్రూతలూగీ మేఘాలతోటీ రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి”

-నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా – అన్న వర్ణన భలే ఉందసలు.
“ఉండీ లేకా ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే”

– ఒక్కో మూడ్ లో ఒక్కో అర్థం తోస్తోంది నాకు ఈ వాక్యాన్ని చూస్తూ ఉంటే. అందులో ఎంత ప్రేమా, విరహమూ ఉన్నాయో, అంత కోపం కూడా కనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఆ నేపథ్య సంగీతం కూడా ఇలా రెండు రకాలుగా అనిపిస్తుంది, ఎందుకోగానీ.
“నా రేపటి అడియాసల రూపం నువ్వే!”
-నిఖార్సైన తిట్టు. ఎటొచ్చీ, ఈ పాట సినిమాలో ఎలా ఉందో తెలీని పక్షంలో దీన్ని ఎలా అర్థం చేసుకోను? అన్నది నా సందేహం. నా interpretation ఇదీ : రేపు ఒకవేళ కలిసుంటే ఈ మనిషితో ఎలా వేగాలో అన్న అనుమానం కావొచ్చు 😉 లేదా, ప్రేమ విఫలమౌతోందన్న భయం కావొచ్చు. కానీ, ఆ వాక్యం మాత్రం అసలు ఎన్నెన్ని సార్లు నన్ను ఎన్నెన్ని సమయాల్లో వెంటాడిందో! నా నిన్నటి ఆశల రూపం నువ్వే అని కూడా పెట్టి ఉండాల్సింది. 😉

రెండో వర్షన్ – జానకి గారు పాడినది. వెల్, ఇది female version కనుక అని అన్నా కూడా, నాకు ఇదే చాలా చాలా ఇష్టం పై దాని కంటే. ఇదైతే పైదాన్లోని చివరి రెండు లైన్ల లా వెంటాడుతూనే ఉంది, ఉంటుంది. మొదటిసారి ఈ పాట పూర్తిగా విన్నది ఈ రెండేళ్ళలోనే. కానీ, ఈ పాటతో జీవిత కాలం అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక వయసులో ఉన్న అమ్మాయి తన ప్రియుడి కోసం ఎదురుచూస్తూ, కలలు కనడం – అనే మూడ్ ని ఈ పాట పట్టుకున్నంత బాగా ఏదీ పట్టుకోలేదేమో బహుశా.
“రామయ్య మెడలో, రాగాల మాలై పాడాను నేను పాటనై” (నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనై – అన్నది అతని భావన)
“నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైన” అని అతనంటే “నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా” – అన్నది ఆమె మాట. అంతే మరి, ఈవిడ మనసేమో ఆయన దగ్గరుంది. బహూశా ఆయనది ఈవిడకిస్తే, ఈమె తన మనసుతో కలిపి ఆయనకే పంపేసి తరువాత ఆయనే వస్తాడని ఎదురుచూస్తూ కూర్చున్నదేమో. ఆయన మనసులు కలిసాయి అని లైట్ తీస్కున్నాడో ఏంటో. నాకు మహా జాలేస్తుంది ఈ లైన్ విన్న ప్రతిసారీ హీరోయిన్ పై.. ఇంతకీ సినిమా నేనెప్పుడూ పావు భాగం కూడా పూర్తి చేయలేదు.
-ఈ రెండు లైన్లు అతనికి, ఆమెకీ రాసిన విధానం అసలు అద్భుతం.

నాకు ఈ వర్షన్ పాటలో పై వర్షన్ కంటే కూడా emotional bonding ఎక్కువగా తోస్తుంది. అలాగే, ఈ పాటలో ఊహాలోక విహారం కూడా పై వర్షన్ కంటే ఎక్కువలా తోస్తుంది. బహుశా రెండు పాటల మూడ్ వేరు కావడం వల్ల కావొచ్చు, లేదా మనిషే వేరు కావడం వల్లనేమో 🙂
“నీ ఊసులనే నా ఆశలుగా
నా ఊహలనే నీ బాసలుగా
అనుకుంటిని కలగంటిని నీ ఎదుటగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్ననాడు నేనే లేను”

– The typical Indian woman! కరెక్ట్ గా నాడి పట్టేసిన ఆ మనిషి మాత్రం ఆత్రేయగారు. ఈ వాక్యాల్ని జానకి గారి గొంతులో వింటూ ఉంటే, ప్రతి అమ్మాయికీ తన మనసులో మాటే పాటైంది అని అనిపించకపోతే ఇక నో కామెంట్స్.

“నా వయసొక వాగయినది
నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో”
– కంప్లైంటని కాదు కానీ, ఇదే ఇంకోళ్ళు రాసుంటే ఈజీగా అది ఎబ్బెట్టుగా అనిపించి ఉండేది.

“ఈ వెల్లువలో ఏమవుతానో
ఈ వేగంలో ఎటు పోతానో”

– The typical Indian woman again! ఎన్ని కలలు కంటూ ఉన్నా, మధ్యలో మళ్ళీ వాస్తవంలోకి వచ్చే ప్రయత్నం. O pakka

“ఈ నావకు నీ చేరువ తావున్నదో”
-అన్న భయం ఉంది. మరో పక్క
“తెరచాప నువ్వై నడిపించుతావో
దరి చేరి నన్ను ఒడి చేర్చుతావో
నట్టేట ముంచి నవ్వేస్తావో”
– అన్న భయమూ ఉంది.
ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా అనుకున్నానో ఈ పాట గురించి – ఒక అమ్మాయి మనసు ఇంత అందంగా ఎంత బాగా తెలిపారు ఆత్రేయ గారు అని.

ఈ పాటలు నిజానికి నా “వావ్” కాంబో పాటల్లో రెండు. ఇళయరాజా-ఎస్పీబీ,జానకి కాంబో. కానీ, ఈ టపాలో నేను వాళ్ళనొదిలేసి ఆత్రేయ గారి సాహిత్యాన్ని గురించే మాట్లాడుకున్నా అనుకోండి. అది ఎందుకంటే, ఈ పాటలు సాహిత్యం వల్లే నన్నిలా వెంటాడాయని నా నమ్మకం.

సరే, పాట తమిళ వర్షన్ సాహిత్యం వేరుగా ఉందనుకుంటా. అంత తమిళం నాకు రాదు కనుక వాటిపై రాయను 🙂
ఒక version ఇక్కడ.

Published in: on April 10, 2009 at 11:45 am  Comments (21)  
Tags:

త్యాగయ్య జీవిత సంగ్రహం – కొన్ని కథలు

మొన్నటి టపా లో చెప్పిన – “త్యాగరాజు భక్తి సుధార్ణవము” పుస్తకము లోనే ఇది ఒక భాగం. చదువుతూ ఉంటే, ఏ సందర్భాల్లో త్యాగయ్య కొన్ని కీర్తనల్ని రాసాడో చెప్తూ వచ్చారు రచయిత ఆ వ్యాసం లో. ఆ సంఘటనల గురించీ అందరితోనూ పంచుకోవాలనిపించి… ఈ టపా…

1.” అన్న తమ్ముని రాజాశ్రయం పొందమన్నాడు; తమ్ముడు నిరాకరించాడు. ఇక ఇంటిలోని పోరు ఇంతింతగాకపోతుందా? ‘నా పూర్వజు బాధ తీర్వలేవా?’ అని ఒక కృతి లో ఆరాటపడినాడు.” (రచయిత వాక్యాన్ని యధాతథంగా పెడుతున్నాను)

2. తంజావూరు రాజు త్యాగయ్యని తన ఆస్థానం లో పాడమని ఆహ్వానించినప్పుడు పుట్టిన పాట – “నిధిచాల సుఖమో రాముని సన్నిధి చాల సుఖమో.

3. త్యాగయ్య మీద అసూయ కొద్దీ అతను పూజించే శ్రీరాముడి విగ్రహాన్ని అతని అన్న దొంగిలించి కావేరి ఇసుకలో పూడ్చిపెట్టాడట. అప్పుడు త్యాగయ్య ఆ విగ్రహం లేకపోవడం తెలుసుకున్నాక బాధలో పుట్టిన పాట – “ఎందు దాగినాడో ఈడకురానెన్నడు దయవచ్చునో ఓ మనసా…

4. తరువాత, విగ్రహము కనబడిందని త్యాగయ్యకి తెలిసి, ఆనందంలో వెలువడ్డ పాట – “కనుగొంటిని శ్రీరాముని నేడు…”

5. ఆ విగ్రహాన్ని తిరిగి ఊరేగింపుగా ఇంటికి తెస్తూ పాడిన పాట – “రారా మా ఇంటి దాకా రఘువీరా సుకుమారా, మ్రొక్కేరా..”

6. ఒకానొక సందర్భం లో బిలహరి రాగం లో “నా జీవనాధార, నా నోము ఫలమా, రాజీవలోచన రాజరాజ శిరోమణీ…” అని ఆలపించి పుత్తూరు లో ఓ గృహస్థుకు మళ్ళీ ప్రాణం పోసాడని ఓ కథ ఉంది. బిలహరి రాగం మృతసంజీవని రాగమట.

7. గోపీనాథ భట్టాచార్య అన్న వారాణాసి కి చెందిన హిందుస్తానీ విద్వాంసుడు త్యాగయ్య సంగీతానికి మురిసిపోయి దక్షిణానికి వచ్చి త్యాగయ్యని కలిసి, అంజలి ఘటించాడు. ఆ మితృనికి కృతజ్ఞత తెలుపుతూ “దాశరథీ, నీ ఋణము తీర్ప నా తరమా, పరమపావననామ. ఆశదీర దూరదేశములకు ప్రకాశింపజేసిన రసిక శిరోమణి..” అన్న కృతిని పాడాడట.

8. మరో సందర్భం లో ఓసారి శిష్యసమేతంగా వెళుతున్నప్పుడు దొంగలు దాడి చేస్తేనూ – “ముందువెనుక ఇరుపక్కల తోడై మురఖరహర రారా” అని పాడగానే విల్లంబులు ధరించిన ఇద్దరు యువకులొచ్చి దొంగల్ని తరిమి కోట్టారట. (చిన్నప్పుడు ఇలాంటి కథే తులసీదాసు గురించి చదివాను.)

– అదన్నమాట ఇప్పటిదాకా నాకు ఆ పుస్తకం లో కనబడ్డ విషయాల సారాంశం.

Published in: on February 28, 2008 at 4:18 am  Comments (6)  

త్యాగయ్య ఆనంద భైరవి – రుద్రవీణ బిలహరి

ఆ టైటిల్ చూసి నేనేదో రాసేస్తున్నా అని ఊహించకండి. నాకేం సంబంధం లేదు మీ అంచనాలతో. నేను పొద్దున్నే లేచి ఏమీ తోచక – “త్యాగరాజు భక్త సుధార్ణవము-నామజప రూపక కృతులు” అన్న మరువూరు కోదండరామిరెడ్డి గారి సంకలనాన్ని తెరిచాను. పుస్తకం మొదటి కొన్ని పేజీలూ త్యాగయ్య చరిత్ర ఉంటేనూ… కాసేపు చదివాను. అక్కడ చదివిన ఓ ఆసక్తి కరమైన సంఘటననూ, ఆ సంఘటన నాకు గుర్తు తెచ్చిన ఓ సినిమా సీనునూ ఇక్కడ పంచుకోడం ఈ టపా ఉద్దేశ్యం…అంతే…మరింకేం ఖాదు. టైటిల్ చూసి కొందరు విషయమేమిటో కూడ కనిపెట్టేసి ఉండొచ్చు. 🙂

ఇంతకీ… 203 రాగాలు పాడారట త్యాగయ్య…అందులో ఆనంద భైరవి మాత్రం లేదట. ఎందుకో? అంటే… ఇదీ కథ… త్రిభువనం స్వామినాథ అయ్యరు అని కుంభకోణం లో పెద్ద విద్వాంసుడు ఉండేవాడట. ఆనందభైరవి రాగం ఆలపించడం లో ఆయన్ని మించిన వాడు లేడు అని పేరు పొందాడట. ఓసారి అతని జట్టు తిరువయ్యూరు వచ్చిందట. త్యాగయ్య అతని ప్రఖ్యాతి విని అతని ప్రదర్శన కి వచ్చాడట. అప్పుడు అతను ఆనందభైరవిలో “మధురానగరిలో…” అన్న పాట పాడగా విని పరవశుడై అందరిముందూ స్వామినాథయ్యర్ భుజం తట్టి కౌగిలించుకున్నాడట. ఇది చూసి సంతోషించాల్సిన విషయమే అయినా, అప్పుడు అతను త్యాగయ్య ని – ఇకపై ఆనందభైరవి పాడవద్దనీ, తన పేరు నిలుపమనీ అర్థించాడట!!! ఈ కారణంగా త్యాగయ్య ఎప్పుడూ ఆనందభైరవి లో పాడలేదట!

ఇదంతా చదువుతూ ఉంటే నాకు రుద్రవీణ సినిమాలో ఓ సీను గుర్తొచ్చింది…. రమేష్ అరవింద్ కి, జెమినీ గణేశన్ కూతురికి పెళ్ళి జరుగుతున్నప్పుడు పాత కోపాన్ని దృష్టిలో పెట్టుకుని అరవింద్ “బిలహరి” గణపతి శాస్త్రి గా ప్రసిద్ధి చెందిన గణపతి శాస్త్రి పాత్ర వేసిన గణేశన్ ని – ఆ బిలహరి రాగాన్ని కట్నంగా ఇవ్వమని అడుగుతాడు. అంటే, ఇంకెప్పుడూ, ఎక్కడా ఆయన ఆ రాగం పాడరాదన్నమాట. తర్వాత చిరంజీవొచ్చి “నీతోనే ఆగేనా ..” అంటూ పాడి ఆయన గౌరవం నిలబెడతాడు అనుకోండి… అది వేరే విషయం.

పై రెండూ చూసాక ఒక సందేహం వచ్చింది. ఈ సినిమా సంఘటన ఆ నిజ జీవితపు సంఘటన నుండి స్పూర్తి పొందిందా అని…  అంటే…అదేమీ పెద్ద విషయం కాదు కానీ…. త్యాగయ్యకి అలా జరిగింది అన్న విషయం మాత్రం కొత్తగా ఉంది నాకు వినడానికి.

Published in: on February 26, 2008 at 4:57 am  Comments (19)  

మూడు సినిమాల పాటలు

            గత నాలుగైదు రోజుల్లో మూడు కొత్త సినిమా ఆల్బం లు వినడం జరిగింది. రెండు ఆల్బం లో ఏమో రెండు రకాల షాకులు ఇచ్చాయి. ఒకటి pleasant shock, ఇంకోటి… hmm…. 😦 dissappointing. మూడోది… నాకేమీ expectations లేకుండా మామూలుగా ఓ పాట విని మొత్తం పాటలు వింటున్నది. కాబట్టి no pain, no gain టైప్ 🙂

మొదటిది “చందమామ” – కే.ఎం. రాధాకృష్ణన్ అనగానే … ఇంక నేను ఊహల్లో తేలి ఇంకో ఆలోచన లేకుండా కాపీ చేసేసుకున్నా ఎవరో షేర్ లో పెడితే. వినడం మొదలుపెట్టాక నాక్కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు…. ఏమిటి… రాధాకృష్ణనేనా ఈ పాటలకు స్వరకల్పన చేసింది? అని. ఒక్క పాట తప్ప మరేదీ రెండో సారి వినబుద్ధి కాలేదు 😦 ఆ ఒక్క పాట కూడా తరువాతి ఆల్బం విన్నాక వినాలనిపించడం మానేసింది! ఆ మధ్య ఎప్పుడో ఓ సారి ఈ బ్లాగులోనే ఓ టపా రాసాను ఇక్కడ.  అప్పుడు అక్కడ రాసిన మాటలు  గుర్తు వచ్చాయి – “..ఇప్పుడీ పాటలు మూడో సినిమా కాబట్టే నచ్చాయేమో అని నా అనుమానం….” అని.  మొత్తానికి దీని తో నా అనుభవం అదీ.

రెండవది శేఖర్ కమ్ముల సినిమా – Happy Days. బాగున్నాయి దాదాపు పాటలన్నీనూ. ఈ సినిమా సంగీత దర్శకుడు కూడా రాధాకృష్ణన్ అయి ఉంటాడు అనుకున్నా. కానీ, దీని సంగీత దర్శకుడు ఓ పాతికేళ్ళ హైదరాబాది కుర్రాడు Mickey J Meyer అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఇతను ఇదివరలో 10th class, Note Book సినిమాల కు పనిచేసాడట. అవి నేను పాటలెప్పుడూ వినలేదు కనుక నాకు పేరు వినడం ఇదే మొదలు. దాదాపు శనివారం మొత్తం ఈ పాటలే వింటూ ఉన్నాను నేను.  పాటలు వనమాలి, వేటూరి రాసారు. లిరిక్స్ కూడా బానే అనిపించాయి. Its a pleasant album. మనసుకు హాయిగా ఉంటుంది… వింటూ అలా పనులు చేసుకోవచ్చు మనం 🙂 ఇప్పుడిక ఈ సినిమా కోసం waiting నేను.  మిక్కీ అనబడు త్వరలో గొప్ప సంగీత దర్శకుడు గా పేరొందబోయే అబ్బాయి ఇంటర్వ్యూ ఇక్కడ. ఈ సినిమా ఆడియో రీవ్యూ idle brain లోనే ఇక్కడ.

మూడవది “హలో ప్రేమిస్తారా?” పూరి జగన్నాథ్ తమ్ముడు హీరో గా నటిస్తున్న సినిమా.  చక్రి సంగీత దర్శకుడు.  ఈ సినిమా పాటలు … ఇవి కూడా “వినబుల్” గానే ఉన్నాయి. మూడు పాటలు అయితే మూడో సారి  వింటున్నా ఇప్పుడు…ఇది రాస్తూ.  “ఎప్పుడూ లేని… “, “లైఫ్ అంటే ట్రావెల్…” మరియు “నిన్నా మొన్నా..”  – మిగితావి లైట్ అన్నమాట.  మొత్తానికి ఈ సినిమా పాటలు కూడా బానే ఉన్నాయనే చెప్పొచ్చు. అయినా, చందమామ కలిగించిన నిరాశ కు మించి మిగితావి పెద్దగా కలిగించవు అనుకుంటా ప్రస్తుతం!

Published in: on September 10, 2007 at 6:48 am  Comments (3)