The Anil Kumble days

కొద్ది నిముషాల క్రితం హిందూ పేపరు చూస్తూ ఉంటే కనిపించింది ఈ న్యూసు – “Anil Kumble announces retirement from ODIs” అని. నాకు క్రికెట్ గురించి తెలిసిన రోజు నుండి కుంబ్లే ని చూస్తూ ఉన్నా. Cricketer గానూ, మనిషి గానూ. ఈ Gentleman game లో ఉన్న కొద్ది మంది gentle men లో కుంబ్లే పేరు తొలి స్థానాల్లోనే ఉంటుంది. ఇంజినీరింగ్ పట్టభద్రుడైన కుంబ్లే క్రికెట్ లో ఆ తెలివి ని కూడా ఉపయోగించుకున్నాడు అంటూ ఈ మధ్యే ఎవరో రాసారు కుంబ్లే గురించి. నిజమే కావొచ్చు. ప్రస్తుతానికి భారత్ కు అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్, match winner, 17 ఏళ్ళు గా భారత క్రికెట్ లో భాగము, అరుదైన 10 వికెట్ల రికార్డు హోల్డరు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి – ఇలాంటి కుంబ్లే కి నా తరపు నుంచి… ఈ టపా. kumble.jpg

ఏ మ్యాచ్ లో కుంబ్లే బౌలింగ్ కు వచ్చినా వచ్చినప్పుడు stats చూపించినప్పుడు best bowling అని 6-12 అని ఉంటుంది. చాలా రోజులు ఇదే Best-bowling figures by an Indian in an ODI గా ఉండింది. ఇప్పుడు కూడా ఉందేమో. తెలీదు. వెస్టిండీస్ జట్టు పై సాధించాడు ఈ గణాంకాలను. ప్రపంచం లోని మేటి స్పిన్నర్లలో ఒకడైన కుంబ్లే మీడియం పేసర్ గా తన కెరీర్ మొదలుపెట్టాడు అంటే ఆశ్చర్యాంగా ఉండొచ్చు. కానీ, అది నిజం. బహుశా పైన చెప్పిన వెస్టిండీస్ మ్యాచ్ తో కుంబ్లే కి జట్టు లో శాశ్వత స్థానానికి పునాదులు బాగా లోతు కి పడ్డాయి అనుకుంటా. ఇంకా చెప్పుకోవాల్సింది 1999 లో డిల్లీ లో పాక్ జట్టు తో జరిగిన టెస్టు గురించి. ఇందులో ఒక ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లూ తీసాడు కుంబ్లే. చరిత్ర లో ఎప్పుడో 50ల లో Jim Laker మాత్రమే చేయగలిగిన పనిని చాన్నాళ్ళకి కుంబ్లే చేసాడు. Ofcourse, JimLaker రికార్డు ను అధిగమించడం కష్టం అనుకోండి. ఎందుకంటే అతను ఆ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ కలిపి ఉన్న 20 వికెట్లకు గాను 19 వికెట్లు తానే తీసేసుకున్నాడు!! ఈ పాక్ మ్యాచ్ లో కుంబ్లే 9 వికెట్లు తీసాక 10వ వికెట్ అతనికే ఇవ్వాలని సహచర బౌలర్ జవగళ్ శ్రీనాథ్ కావాలనే వికెట్ తన బౌలింగ్ లో వికెట్లు తీసే ప్రయత్నం చేయలేదు అంటారు. అతనింకో gentleman!

ఎన్నని చెప్పుకోవాలి కుంబ్లే క్రికెట్ విజయాలు? 2004 లో 400+ వికెట్లు తీసిన మూడో స్పిన్నర్ అయ్యాడు. త్వరగానే కపిల్ వికెట్ల రికార్డు ని దాటి భారత్ కి అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన బౌలర్ అయ్యాడు. కుంబ్లే అంటే caught and bowled గుర్తు వస్తుంది నాకు. నేనే బౌలర్ నీ ఇన్ని caught and bowleds చేయగా చూడలేదు. టెస్టుల్లో ప్రపంచ రికార్డు కూడా కుంబ్లే పేరిటే ఉంది ఈ విషయం లో. బ్యాటింగ్ లో కూడా చాలా సార్లు మెరిసిన కుంబ్లే all-rounder కావాల్సిన వాడు .. కాలేకపోయాడు 😦

వ్యక్తి గా కుంబ్లే గురించి నేను చెప్పదలుచుకున్నవి రెండు అనుభవాలు – 1. ఓ సారి వెస్టిండీస్ తో మ్యాచ్ లో గాయం బారిన పడినా కూడా జట్టు ప్రయోజనాల కోసం తలపై కట్టు తో ఆడటం. ఆరోజు ఆ మ్యాచ్ TV లో చూస్తున్నప్పుడు ఎక్కడో దూరాన ఉన్న నేనే కుంబ్లే ని చూసి ఉద్వేగానికి లోనయ్యాను. ఇక ప్రత్యక్షంగా చూసిన వారు ఏమనుకుని ఉంటారో. రెండో విషయం కుంబ్లే వివాహం. చేతన తో వివాహం జరిగాక ఆమె కి మొదటి భర్త ద్వారా పుట్టిన బిడ్డ custody విషయం లో legal issues వచ్చినప్పుడు ఆమేకు అండగా నిలబడ్డ కుంబ్లే గురించి అప్పట్లో పత్రికలు మరో సారి రాసాయి – “gentleman” అంటూ. ఇంకా ఏమి చెప్పాలో తెలీడం లేదు కానీ, కుంబ్లే ని తలుచుకుంటే ఎందుకో గొప్ప గా అనిపిస్తుంది. మన దేశపు ఆటగాడు అని. మన మనిషి అని.

కుంబ్లే అండ లేని జట్టు ను ఊహించుకోవడం కష్టమే అయినా – change is the way of life. అయినా భారత క్రికెట్ లో కుంబ్లే ఒక్కడే. భారత్ క్రికెట్ కో ఏక్ సూరజ్, ఏక్ చాంద్, ఏక్ కుంబ్లే అన్నమాట … ఏక్ సూరజ్, ఏక్ చాంద్, ఏక్ లతా అని ఎవరో Lata Mangeshkar గురించి అన్నట్లు.

Published in: on March 31, 2007 at 4:00 am  Comments (5)  

Is it England’s misfortune in Worldcup?

నిన్న దక్షిణాఫ్రికా జట్టు దురదృష్టం గురించి రాసిన టపా లో వీవెన్ గారు రాసిన కామెంట్ చదివాక ఈ టపా రాస్తున్నా. ఇంగ్లాండు ది దురదృష్టమా? స్వయం కృతమా? అని. ఒక వేళ ఇది దురదృష్టం అనుకున్నా కూడా అది దక్షిణాఫ్రికా తరహా దురదృష్టం కాదేమో అనిపిస్తుంది. ఈ టపా లో దీనితో పాటు క్రికెట్ అభిమానులకు ఓ మంచి సైటు ను పరిచయం చేస్తున్నా.

ఇంగ్లాండ్ జట్టు మూడు ప్రపంచ కప్ ల ఫైనల్స్ ఆడింది. కానీ, ఒక్క దానిలోనూ గెలవలేదు. 1979 లో విండీస్ తోనూ, 1987 లో ఆసీస్ తో నూ, 1992 లో పాకిస్తాన్ తోనూ ఫైనల్స్ ఆడి ఓడింది. ఈ మ్యాచ్ లు ఏవీ నేను చూడలేదు కనుక విశ్లేషించలేను కానీ … స్కోర్ కార్డుల గురించి చెబుతా. అప్పుడు దక్షిణాఫ్రికా దురదృష్టానికి, ఇంగ్లాండు దురదృష్టానికి తేడా తెలుస్తుంది. 🙂

1979 కప్ ఫైనల్ : నేను తెలుసుకున్నంత వరకు ఈ ఫైనల్ గురించిన విశేషాలు – వీవ్ రిచర్డ్స్ వీర విహారం తో 138 పరుగులు చేసాడు. తరువాత కాలిస్ కింగ్ 66 బంతుల్లోనే 86 పరుగులు చేయడం తో విండీస్ జట్టు నిర్ణీత 60 ఓవర్లలో 286 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు స్కోరు బోర్డు నత్త నడకన సాగింది. టాప్ ఆర్డర్ ఆటగాళ్ళు మెల్లిగా పరుగులు తీసి లోయర్ ఆర్డర్ పై ఒత్తిడి పెంచారు. దానితో చివరికి వచ్చే సరికి వికెట్లు టప టపా రాలి ఇంగ్లండ్ జట్టు 194 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ల స్కోరు చూస్తే తెలుస్తుంది ఎంత నెమ్మదిగా ఆడారో – బ్రియర్లీ – 130 బంతుల్లో 64 పరుగులు; జెఫ్ బాయ్కాట్ 137 బంతుల్లో 57 పరుగులు!!! Gower, Botham సహా 5 డకౌట్లు! ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళ స్కోర్లు – 64,57,15,32,0,4,0,5,0,0,0 ! – ఇదీ ఇంగ్లాండు ఆ మ్యాచ్ లో ఆడిన తీరు.

1987 కప్ – ఇది కాస్త హోరా హోరీ గా సాగిన మ్యాచ్ అనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 253/5. జవాబు గా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ మొదటి ఓవర్లోనే ఓ వికెట్ కోల్ఫొయినా నెమ్మది గా పుంజుకుంది. అయితే ఆసిస్ కెప్టెన్ బోర్డర్ బౌలింగ్ కు దిగాక పరిస్థితి మారింది. వేసిన తొలి బంతికే రివర్స్ స్వీప్ కు ప్రయత్నించిన ఇంగ్లాండ్ కెప్టెన్ Mike Gatting ఔట్ అయ్యాడు. అక్కడ నుండి ఇంగ్లాండ్ జట్టు పరుగుల వేగం మందగించి 50 ఓవర్లు ముగిసే సమయానికి విజయానికి తొమ్మిది పరుగుల దూరం లో నిలిచింది. బోర్డర్ జట్టు కప్పు పైకెత్తింది 🙂

1992 కప్ – పాకిస్తాన్ తో ఫైనల్. పాక్ జట్టు లో ఇమ్రాన్ ఖాన్, మియాందాద్, ఇంజీ వంటి వారు పరుగులు తీయడం తో, చివర్లో వసీం అక్రం మెరుపులు మెరిపించడం తో – 50 ఓవర్లలో 249 పరుగులు చేసింది ఆ జట్టు. తరువాత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఏ దశ లోనూ పాక్ ధాటి కి … ముఖ్యంగా వసీం అక్రం ధాటికి నిలువలేక పోయింది అనే చెప్పాలి. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే బోథం ను డకౌట్ చేస్తూ మొదలుపెట్టాడు Akram. మిగితా బౌలర్లు కూడా ఎక్కడా ఇంగ్లాండ్ జట్టు ను కోలుకోనివ్వలేదు. Neil Fairbrother ఒక్కడు కాస్త నిలదొక్కుకుని 62 పరుగులు చేసాడు. చివరాఖరికి ఇంగ్లాండ్ జట్టు మూడో ఫైనల్ కూడా ఒటమి తోనే ముగించింది. 22 పరుగుల తేడా తో పాక్ జట్టు గెలిచింది.

– ఇప్పుడు చెప్పండి … ఇంగ్లాండ్ ది స్వయం కృతం అంటారా? దక్షిణాఫ్రికా తరహా దురదృష్టం అంటారా?

అన్నట్లు సైటు పరిచయం చేస్తా అన్నా కదూ – ఆ site – http://cricket.deepthi.com . మంచి సైటు. చాలా వ్యాసాలు, గణాంకాలు ఉన్నాయి ఈ సైటు లో. ఇప్పటి దాకా నాకు 1975,1979 ప్రపంచ కప్ ల గురించి ఎక్కడా సరైన వ్యాసాలు దొరకలేదు. కానీ ఈ సైటు ద్వారా చాలా విషయాలు తెలిసాయి. ఈరోజే, కొద్ది నిముషాల క్రితమే చూసా ఈ సైటు ని. ఇంకా ఏమేం ఉన్నాయో తెలీదు. కానీ, చాలా బాగుంది సైట్ మాత్రం. క్రికెట్ చదువరులకు ఇంక పండగే ఈ సైటు చూస్తే 🙂

Published in: on March 30, 2007 at 4:50 am  Comments (2)  

The misfortune of South African team in cricket worldcup

ఆలోచిస్తూ ఉంటే ప్రపంచ కప్ పరంగా చూస్తే దక్షిణాఫ్రికా అంత దురదృష్టపు జట్టు లేదేమో అనిపిస్తుంది. నేను చూసిన 3 కప్ లలోనూ (2007 కప్ ని వదిలేసి) – పాపం ఈ దురదృష్టం వెంటాడింది ఆ జట్టును. ఈ context లో నాకు తెలిసిన కొన్ని విషయాలను పంచుకుందామని ఈ టపా.

1992 ప్రపంచ కప్ ఈ జట్టుకి తొలి ప్రపంచ కప్. Apartheid గొడవల్లో ప్రపంచ క్రికెట్ నుంచి ఉద్వాసన కు గురై, ఎట్టకేలకు 1992 ప్రపంచ కప్ తో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది. అడుగు పెట్టిన మొదటి ప్రపంచ కప్ లోనే తానేమిటో చూపి సెమీస్ చేరింది. ఈ ప్రస్థానం లో డిఫెండింగ్ చాంపియన్లైన ఆసీస్, చివరికి ఆ కప్పు గెలిచిన పాకిస్తాన్ లను కూడా ఓడించింది. అయితే ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ లో ఓ వివాదాస్పద, దురదృష్ట కరమైన నిర్ణయం వల్ల కప్ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్ లో వర్షం పడటం తో లక్షాన్ని కుదించాల్సి వచ్చింది. అప్పటి రూలు వారి లక్షాన్ని “22 runs from 13 balls నుంచి “21 runs from 1 ball గా నిర్ణయించింది!!!! ఎంత గొప్ప జట్టైనా ఇది చేయడం సాధ్యమా?? ఆ విధంగా దక్షిణాఫ్రికా జట్టు టోర్నీ నుండి బయటకు వెళ్ళింది.

1996 ప్రపంచ కప్ – గత కప్ లో ఈ జట్టు ప్రదర్శన చూసాక ఎవరైనా ఈ జట్టు ని ఫేవరెట్ గానే భావించి ఉంటారు. దానికి తోడు లీగ్ దశ లో అన్ని మ్యాచ్ ల లోనూ నెగ్గింది. కిర్స్టెన్ 188 పరుగులు చేసిన మ్యాచ్ ఈ కప్ లోనే. ఆటగాళ్ళందరూ మంచి ఫాం లో ఉన్నారు. ఈ కప్ జట్టు నా ఉద్దేశ్యం లో చాలా మంచి జట్టు. అంతా అయ్యాక క్వార్టర్ ఫైనల్ లో అనూహ్యంగా వెస్టిండీస్ జట్టు చేతిలో పరాజయం! ఇది మ్యాచ్ కి ముందు ఎవరూ ఊహించి ఉండరు బహుశా. ఎందుకంటే ఈ కప్ లో వెస్టిండీస్ ఆట కూడా అంత బాలేదు. లీగ్ దశలో ఆడిన 5 మ్యాచ్ లలో 2 మాత్రమే నెగ్గింది. అయినప్పటికి దక్షిణాఫ్రికా ఓడిపోయింది….. ఇల్లు చేరింది.

1999 కప్ – ఇందులో జట్టు ప్రదర్శన బానే ఉండింది. లీగ్ దశ లో ఇండియా, శ్రీలంక, ఇంగ్లండ్, కెన్యా ల పై నెగ్గి, విచిత్రంగా జింబాబ్వే చేతిలో ఓటమి. సూపర్ సిక్స్ దశలో పాక్, న్యూజీల్యాండ్ జట్ల పై నెగ్గి ఆసీస్ చేతిలో ఓడింది. ఎలాగోలా సెమీస్ కి చేరింది. ఆసీస్ తో మ్యాచ్ మళ్ళీ. ఈ జట్టు ను మళ్ళీ దురదృష్టం వెన్నాడింది. సెమీస్ టై అయింది. సూపర్ సిక్స్ లో ఈ దక్షిణాఫ్రికా పై గెలిచిన కారణాన ఆసీస్ ఫైనల్ కి వెళ్ళి, తరువాత కప్పు కూదా గెలిచింది.  ఈ మ్యాచ్ లోనే Gibbs  Steve Waugh ఇచ్చిన క్యాచ్ ను వదిలి పెట్టాడు. అప్పుడు వా అతనితో – “నువ్వు జారవిడిచింది క్యాచ్ కాదు.ప్రపంచ కప్” – అన్నాడని అంటారు. వా తానలా అనలేదని తరువాత వివరణ ఇచ్చాడు అనుకోండి.

2003 కప్ – శ్రీలంక తో లీగ్ మ్యాచ్.  ఈ మ్యాచ్ వర్షం వల్ల ఆలస్యంగా మొదలైంది. వర్షం భయం మ్యాచ్ పొడుగుతా ఉండింది. దానితో దక్షిణాఫ్రికా జట్టు తన ఆటగాళ్ళకు ఓ చిన్న పట్టిక తయారు చేసింది. “తరువాతి బంతి కి మ్యాచ్ ఆగిపోతుంది అన్న పరిస్థితి లో  ఎక్కడ వరకు మ్యాచ్ సాగితే ఎన్ని పరుగులు చేస్తే లంక స్కోరు తో సమం ఔతుంది?” అన్న పట్టిక అది. ఆట ఆగిపోడానికి ఒక బంతి ముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు పట్టిక లో ఉన్నన్ని పరుగులు చేసారు. చివరి బంతి కి పరుగు చేసే అవకాశం ఉన్నా risk ఎందుకు అనిచేయలేదు … అప్పటికే సాధించేశాం అన్న భ్రమ లో. కాని తరువాత తెలిసింది వారికి – ఆ పట్టి శ్రీ లంక స్కోరు కి సమం చేయడానికి. మ్యాచ్ గెలవడానికి కాదు అని!!!!! తద్వారా ఈ టోర్నీ లో super six దశ కు కూడా చేరుకోలేకపోయింది. మరో సారి దురదృష్టానికి తాను ప్రియమైన జట్టని అనిపించుకుంది.

ఇక  2007 కప్ వచ్చేసింది. లీగ్ దశ లో రికార్డుల మోత మోగించి, లీగ్ దశ చివరి మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓడి, మళ్ళీ సూపర్ 8 మ్యాచ్ లో శ్రీలంక పై గెలిచి … మున్ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది దక్షిణాఫ్రికా. చూద్దాం, ఈ సారైనా కాలం కలిసొస్తుందో, ఒక వేళ వస్తే వీళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటారో, లేదో!  మొత్తానికైతే ఇంతకంటే దురదృష్టపు జట్టు ఏదీ కనబడదు అనుకుంటా ప్రపంచ కప్ చరిత్ర లో.

Published in: on March 29, 2007 at 3:36 pm  Comments (3)  

Goodluck to Bangladesh!

                    ఈ విధమైన Title పెట్టినందుకు భారత క్రికెట్ అభిమానులు నా మీద దండెత్తుతారో ఏమో! అయినప్పటికి, నిన్న కపిల్ దేవ్ అన్నట్లు – బంగ్లా జట్టు కు రెండో రౌండు కు వెళ్ళే అర్హత ఉంది. ఇప్పుడు అది వెళ్ళాలి. అక్కడ ఎలా ఆడుతుంది అన్నది పక్కన పెడితే – ఈ ప్రపంచ కప్ లో తన మొదటి మ్యాచ్ ఆడిన రోజు చూపిన spirit దానికి ఆ అర్హత ను ఇచ్చింది అని నా అభిప్రాయం.  భారత జట్టు పై ఉన్న అభిమానాన్ని అటు పక్కన బెట్టి ఈ జట్టునూ, ఆ జట్టునూ తటస్థంగా చూస్తే అర్థం ఔతుంది ఈ విషయం.

అయితే, ఒకటి ఉంది – ఈ తరహా system లో ఏ జట్టుకైనా మొదట దెబ్బ తగిలిందంటే కోలుకునే అవకాశాలు తక్కువ. 1996 ప్రపంచ కప్ లో ప్రతి జట్టూ లీగ్ దశలో 5 మ్యాచ్ లు ఆడింది. 1999 కప్ లో కూడా ప్రతి జట్టూ 5 మ్యాచ్లు ఆడింది. ఆ రెంటిలోనూ 12 జట్లు ఉన్నాయి. రెండు గుంపులుగా విభజించారు. ఒక్కో  గుంపు లో 6 జట్లు. ప్రతి జట్టూ తన గుంపు లో అన్నింటితోనూ ఆడుతుంది.  2003 ప్రపంచ కప్ లో 14 జట్లు ఉన్నాయి. 7 జట్లను ఒక గుంపు లో వేసారు. దీని తో ప్రతి జట్టూ ఆరు మ్యాచ్ లు ఆడింది లీగ్ దశలో.  దీని వల్ల ఒకటి అరా ఓడినా కూడా కోలుకునే అవకాశం ఉండింది. ఈ ప్రపంచ కప్ లో 4 జట్లను ఒక గుంపు గా చేసి పొరపాటు చేసారేమో అనిపిస్తుంది. అలాగని 8 ఒక గుంపు గా పెట్టి ఉంటే మరీ ఎక్కువ అయ్యేవేమో మ్యాచ్లు. టీముల సంఖ్య తగ్గించడం ఒక మార్గం కావొచ్చు.  లేకుంటే పెంచడం ఒక మార్గం.

భారత జట్టు నిష్క్రమణ కు కర్ణుడి చావుకి లక్ష కారణాలన్నట్లు  బోలెడు కారణాలుండొచ్చు. అందులో బంగ్లా ఒకటి. ఈ schedule ఒకటి. ఆటతీరు మరోటి. ఏదేమైనా బంగ్లా జట్టు super-8 లోకి వెళ్ళడం భారత జట్టు పక్షం తీసుకోకుండా తటస్థంగా ఆలోచిస్తే మంచి సూచన. బంగ్లా క్రికెట్ పరంగా ఆలోచిస్తే మరీ మంచి సూచన. ఈ ఒక్క విషయం అక్కడి క్రికెట్ లోకం లో ఎంతో ప్రభావం చూపగలదు.  భారత జట్టు 1983 లో కప్ గెలిచినప్పుడు ఇక్కడి అభిమానుల్లో ఎలాంటి ఉత్సాహం పెల్లుబికిందో – ఇంచుమించి అలాంటిదే ఉండిఉంటుంది బంగ్లా లో పరిస్థితి ఇప్పుడు. బంగ్లా కప్పు గెలవడం వరకు వెళ్ళదు అని నా ఊహ. కానీ, కచ్చితంగా, its a better team than what it was.  బంగ్లా ఆటగాళ్ళకు కూడా ఈ సూపర్-8 లోకి అడుగుపెట్టడం ఎంతో స్పూర్తి ని ఇచ్చి ఉంటుంది.

మనం కూడా ఓ చిన్న జట్టు చూపిస్తున్న “పెద్ద” పటిమ ను అభినందిద్దాం. భేషజాలను పక్కనబెట్టి మనసారా బంగ్లా జట్టు ఇలాగే దిన దిన ప్రవర్థమానమవ్వాలని కోరుకుందాం. వేయి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలుపెడతాం. ఈ బంగ్లా తొలి అడుగులను పదేళ్ళ తరువాత అది ఏ ప్రపంచ కప్పో గెలుస్తూ ఉంటే తలుచుకుంటామేమో. ఎవరికి తెలుసు? ఏమంటారు? Good luck Bangladesh!!

Published in: on March 26, 2007 at 6:09 am  Comments (1)  

1996 worldcup memories

        ఈరోజు అలా కూర్చుని Cric Info సైటు చూస్తూ ఉంటే ఎందుకో గానీ, 1996 ప్రపంచకప్ గుర్తు వచ్చింది. ఈ సీరియల్ టపాల మొదటిలో చెప్పినట్లు – అది నేను కాస్త follow అయిన మొదటి కప్. ఈ టపా ఆ కప్ జ్ఞాపకాల గురించే. అప్పుడు కప్ భారత ఉపఖండం లోనే జరిగింది. మన పేపర్లు మామూలుకంటే ఎక్కువగానే రాసారు. అందువల్లే అనుకుంటా చాలా విషయాలు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి.

తలుచుకోగానే మొదట నాకు సెమీ-ఫైనల్ లో ప్రేక్షకుల ప్రవర్తన వల్ల రెఫరీ క్లైవ్ లాయిడ్ శ్రీలంక ను విజేత గా ప్రకటించడం గుర్తు వస్తుంది. ఆ రోజు వినోద్ కాంబ్లి మైదానం లోనే కన్నీరు కార్చడం టీవీ లో చూపారు అప్పట్లో. అది వెంటనే గుర్తు వస్తుంది నాకు ఈ 1996 ప్రపంచకప్ ను తలుచుకోగానే. ఈ కప్ ఓ వ్యక్తి కి ప్రత్యేకం. ఆ వ్యక్తి జావెద్ మియాందాద్. అతనికి అది 6వ ప్రపంచకప్. క్రికెట్ ప్రపంచానికి కూడా అది ఆరో ప్రపంచ కప్పే.  ఇంత సుదీర్ఘమైన కెరీరా అని అప్పట్లో చాలా ఆశ్చర్యమేసింది నాకు. ఇమ్రాన్ ఖాన్ కూడా 1975 నుంచి 1992 దాక జరిగిన మొత్తం 5 కప్పుల్లోనూ ఆడాడట. మన జట్టు లో అప్పటికి- ఇప్పటికీ ఉన్నవారు అంటే – సచిన్, కుంబ్లే నే అనుకుంటా, నాకు గుర్తు ఉన్నంత వరకు.  ఈ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మరో గుర్తు ఉండిపోయే మ్యాచ్.  ఆ మ్యాచ్ తరువాత కొన్నాళ్ళ పాటు నాకు అజయ్ జడేజా అంటే ఇష్టం ఏర్పడింది. నిజానికి ఆ మ్యాచ్ top scorer సిద్ధూ అట – వికీ ఉవాచ. అయినప్పటికి, నాకు జడేజా ఆడిన తీరే నచ్చింది.

ఈ కప్ లోనే గ్యారీ కిర్స్టెన్ 188 పరుగులు చేసాడు. ఇప్పుడంటే అది “ఆ….చేసాడు లే..పేద్ద” – అన్నట్లు అయిపోయింది కానీ, అప్పటికి రెకార్డే. తరువాత తరువాత 180 లు సహజమై, 190 ల కు కూడా చేరింది అనుకోండి బ్యాటింగ్ విన్యాసాల జోరు ….. ఈ కప్ లో నమోదైన సంచలనం అంటే అది కెన్యాది. మొదటి సారి ప్రపంచకప్ లో ఆడుతూ కెన్యా ఒకప్పటి చాంపియన్ వెస్టిండీస్ జట్టు ను ఓడించడం కెన్యన్లకు హీరో ఇమేజ్ ని ఇచ్చింది అంటే అతిశయోక్తి కాదు.  తమిళ టైగర్ల భయం తో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తమ మ్యాచ్ లను వదులుకున్నాయి ఈ కప్ లో. అయితే దీని వల్ల అవి పెద్దగా నష్టపోలేదు అనుకోండి ….

ఈ కప్ లో బోలడంత మంది అన్నదమ్ముళ్ళ జోడీలు ఉన్నారు. నాకు గుర్తున్న కొందరు – ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్; పాల్ స్ట్రాంగ్, బ్రియాన్ స్ట్రాంగ్; మార్క్ వా, స్టీవ్ వా;  స్టీవ్ టికోలో, డేవిడ్ టికోలో;  మారిస్ ఒడుంబే, టీటో ఒడుంబే;  – ఇంకా ఉన్నారేమో … గుర్తు రావడం లేదు…   ఇంకా ఈ కప్ గురించి ఏమేం గుర్తు వస్తున్నాయి …. పేర్లు ….. నాకు తెలిసిన మొదటి క్రికెటింగ్ ముఖాలు (అనగా అప్పటికి ఇంకా ఆడుతున్న ముఖాలు అని అర్థం… కపిల్ దేవో, హాడ్లీ నో కాదు)…. మార్క్ తేలర్, రిచీ రిచర్డ్సన్, ఆంబ్రోస్, వాల్ష్, హాన్సీ క్రోనే, గ్రేమీ హిక్, అరవింద డి సిల్వా, ఆడం పరోరే, స్టీవ్ వా,  లీ జర్మన్, అలాన్ దొనాల్డ్, అలిస్టర్ క్యాంప్ బెల్ …. ఇలా చెబుతూ పోతే ఎన్ని పేర్లో. వీళ్ళళ్ళో 5% మందన్నా ఇప్పటికి ఆడుతున్నారో లేదో. ఎందుకో 11 ఏళ్ళ తరువాత అప్పటి విషయాలు తలుచుకుంటూ ఉంటే…అదో మంచి అనుభూతి . అంటే పనిలో పనిగా నా జ్ఞాపక శక్తి ని కూడా పరీక్షించుకుంటున్నా అనుకోండి…. 🙂

Published in: on March 21, 2007 at 7:54 pm  Leave a Comment  

The Ireland team

        మొన్నా మధ్య ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగిన రోజు పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్ కూడా జరిగింది. అది నేను చూడలేదు కానీ, మధ్య మధ్యలో స్కోరు తెలుసుకుంటూ ఉన్నాను. చివరికి పాకిస్తాన్ 132 పరుగులకే ఆలౌట్ అయింది అని ఏదో న్యూస్ చానెల్ స్క్రోల్ బార్లో చూడగానే కాస్త ఎక్కువ ఆశ్చర్యమే కలిగింది. మొట్టమొదటి సారి వరల్డ్ కప్ ఆడుతున్న ఓ జట్టు, అదీ గొప్ప ఆటగాళ్ళంటూ ఎవరూ లేని టీము – పాకిస్తాన్ వంటి జట్టు ను చిత్తుగా ఓడించడం ఆశ్చర్యం కలిగించదా మరి? 

      అంతకు ముందు రోజు పేపర్లోనే జింబాబ్వే తో మ్యాచ్ ని టై చేసిన ఆనందం లో మునిగిన ఐర్లాండ్ వాళ్ళ ఫోటో ని పేపర్లో చూసి – “టై చేసినందుకే ఆనందపడిపోతున్నారా!” అనుకున్నా. దాన్ని బట్టి ఈ గెలుపు తరువాత ఐర్లాండ్ డ్రెస్సింగ్ రూము ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ జట్టు తన మొదటి first-class మ్యాచ్ ను 1902 లో ఆడిందనీ, అది కూడా Sir W.G.Grace ఉన్న జట్టుతో ఆడి 238 పరుగుల తేడా తో గెలిచింది అని చదివి మరోసారి ఆస్ఛర్యపడ్డాను. ఐర్లాండ్ ఇంగ్లాండు కి దగ్గరి దేశం కనుక క్రికెట్ ఆట ఆడడం మామూలే అయి ఉండొచ్చు. కానీ, ప్రపంచకప్ లో ఆడడానికి, మొదటి మ్యాచ్ ఆడిన కాలానికి మధ్య ఓ శతాబ్దం తేడా ఉండడమే ఆ ఆశ్చర్యానికి కారణం.

         ఈ గెలుపులో ఐర్లాండ్ వికెట్ కీపర్ Niall O’Brien ముందుండి నడిపించాడు. 72 పరుగులు చేసి గెలిపించాడు. విచిత్రం ఏమిటి అంటే ఇదే Niall O’Brien ను 2006 లో కెంట్ కౌంటీ జట్టు ఇతనికంటే బాగా ఆడే ఆటగాళ్ళు ఉన్నారు అని తొలగించిందట – BBC వ్యాసం లో చూసాను. ఐర్లాండర్ల బౌలింగ్ ఫిగర్లు చూస్తూ ఉంటే ముచ్చటేసింది.  బోథా అన్న ఆటగాడి గణాంకాలు – 8-4-5-2 !

    ఈ చిన్న దేశాల హవా బానే నడుస్తున్నట్లు ఉంది ఈ ప్రపంచ కప్ లో. బంగ్లాదేష్ “పసికూన” image నుంచి ఈ కప్ ఆఖరునాటికల్లా బయట పడుతుంది అని నా ఊహ. ఐర్లాండు వాలకం చూస్తూ ఉంటే అది కూడా త్వరలోనే బయటపడుతుంది ఏమో అనిపిస్తుంది. మొత్తానికైతె నన్ను ఆకర్షించిన రెండో జట్టు ఐర్లాండ్. మొదటిది బంగ్లాదేశ్ అని మొన్నటి టపా ని చూసి ఉంటే అర్థం అయిపోయి ఉంటుంది.

    

     

Published in: on March 20, 2007 at 8:57 am  Comments (1)  

CricketWorldCup : India Vs Bangladesh

       నా బ్లాగు లో ఓ కొత్త శీర్షిక ఈరోజు నుండి కొన్ని రోజుల దాకా. ప్రపంచ కప్ జ్వరం నన్నూ తాకుతుందని ఊహించలేదు కానీ, తాకింది. ఫలితమే – ఈ టపా. క్రికెట్ అంటే ఇష్టమే …కానీ, పూర్తి మ్యాచ్ చూడడం కంటే అనాలసిస్ లనే ఎక్కూవగా చదువుతూ ఉంటా …పేపర్లలో. highlights చూసేదాన్ని ఒకప్పుడు. ఈ మధ్య కాలం లో అసలు ఎవరు ఆడుతున్నారు, ఎవరు లేదో కూడా పట్టించుకోవడం లేదు నేను అసలు. అయితే నిన్న ఎందుకో గానీ, భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ చూడాలని అనిపించింది. చాన్నాళ్ళకు ఒక మ్యాచ్ చూసాను. పూర్తిగా చూడక పోయినా కూడా బాగానే చూసాను. పొద్దున్న post-mortem reports చూస్తూ ఉంటే నా బ్లాగు లో ప్రపంచకప్ గురించి రాద్దాం అనిపించింది.

      నిన్న బంగ్లాదేశ్ చాలా బాగా ఆడింది అని చెప్పగలను. పేపర్లో మ్యాచ్ ముందు రాసిన వ్యాసాలు చూసి బంగ్లా ఒకప్పటి బంగ్లా కాదు, డేవ్ వాట్మోర్ శిక్షణ లో ఆరితేరింది అని విన్నాను. కానీ, ఇంతలా అనుకోలేదు. కళ్ళు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు. ఇంకా తొలి ఓవెర్లు బౌలింగ్ చేసిన బౌలర్లు ఇద్దరూ చాలా బాగా చేసారు.  వికెట్లు తీయకపోయినా కూడా నాకు రసేల్ బౌలింగ్ చాలా నచ్చింది. తరువాత ముస్తఫా ది. నేనింకా బంగ్లాదేశ్ అంటే “పిల్ల టీం” అన్న భావన లోనే ఉన్నా నిన్నటి దాకా.  ఇంక ఉండను.

      నాకు అష్రఫుల్ మినహా ఇంకెవరిమీదా పెద్దగా నమ్మకం లేదు ఇదివరలో. ఇక్కడ నుంచీ ఈ టీం బౌలింగ్ మీదా, ఫీల్డింగ్ మీద చాలా నమ్మకం ఉంటుంది అనుకుంటా నాకు :)బంగ్లా ధోని మీద కూడానూ. మొత్తానికైతే నాకు బంగ్లా జట్టు చాలా నచ్చింది నిన్నటి ఆట తో.  నేను మళ్ళీ సెలవు వచ్చి ఇంటికి వస్తే తప్ప ఇంకో ప్రపంచకప్ మ్యాచ్ చూడను. కానీ,  బంగ్లా ఆట ఉంటే మాత్రం ఓ సారి TV Lounge లోకి తొంగి చూసి వెళతానేమో. అంతలా ఆకర్షించింది ఈ జట్టు నన్ను.

       అటు పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్ తో దీనికంటే గొప్ప అనుభవం రుచి చూసింది. నేనా మ్యాచ్ చూడలేదు 😦 కానీ, ఐర్లాండ్ కి hats-off. ఈ ప్రపంచకప్ జరిగినన్ని రోజులు నాకు తెలిసిన ప్రపంచకప్ విషయాల గురించి బ్లాగుతాను. 🙂 నేను follow అయిన మొదటి కప్ 1996 wills world cup.  అంతకు ముందు వాటి గురించి నేను చదివిన ఆసక్తి కరమైన విషయాలు కూడా పంచుకుంటాను. 

కొసమెరుపు: భారత్ మొదటిసారి ప్రపంచకప్ గెలిచే నాటికి నేను పుట్టనే లేదు. ఈ సారి కప్ గెలుస్తుందేమో అనుకున్నా కానీ,రెండో రౌండు కే దిక్కు లేదేమో అని అనుమానం గా ఉంది!

Published in: on March 18, 2007 at 4:28 am  Comments (1)