“టిహిలికి పెళ్లి” – కథ అనువాదం, నా అనుభవం
మల్లిపురం జగదీశ్ గారి “టిహిలికి పెళ్లి” (“శిలకోల” కథల సంకలనం లో ఉంది ఈ కథ) కి నా ఆంగ్లానువాదం గత వారాంతం లో “కితాబ్” అన్న ఆంగ్ల పత్రికలో వచ్చింది. ఈ అనుభవం గురించి పోస్ట్ ఇది. కొంత సుత్తి ఉంది మధ్యలో ఆ అనువాదం పంపడం, ఎదురుచూపుల గురించి. కొత్తగా ఆంగ్లానువాదాలు మొదలుపెట్టేవాళ్ళు అయితే మట్టుకు అది మిస్సవకండి.
కథని నేను 2021 జులై ప్రాంతం లో మొదటిసారి చదివాను. అప్పటికి నేను ఏదన్నా “అనువాదం” అన్న ఆలోచన చేసి కొంతకాలం (అంటే ఒక ఏడెనిమిది సంవత్సరాలు) అయింది. కొన్ని రోజుల ముందరే Hansda Sowendra Sekhar రాసిన “Adivasi will not dance” కథలు చదివి దానిలో టైటిల్ కథను తెలుగు అనువాదం చేయడానికి అనుమతి తీసుకున్నా. అయితే, “శిలకోల” చదువుతున్నపుడు ఎప్పుడు వేరే వాళ్ళ కథలు మనం అనువాదం చేసి తెలుగులో చదూకోవడమే నా? ఇలా మామూలు కథాంశం తో వచ్చినా భిన్నమైన సంస్కృతి, ఆచారాల్ని చూపెట్టే మన కథలు ఎందుకు అంత ప్రముఖంగా కనబడవు? అనిపించింది.
అంతకు ముందు “నిర్జన వారధి” ఆంగ్లానువాదం చేసినా కూడా నేను ఆ అనువాదం అన్న దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. అందునా తెలుగు నుండి ఆంగ్లం అంటే అంతకంటే అసలు నేను చేయగలను అని నమ్మలేదు. అదేదో ఆలా జరిగిపోయింది, ఇంకోసారి జరిగే ప్రసక్తి లేదు అనే అనుకునేదాన్ని. కానీ, ఈ పుస్తకం చదువుతూ ఉండగా “ఈ కథలు ఎవరన్నా ఇంగిలీషు లో అనువాదం చేస్తే బాగుంటుంది” అనుకుంటూ, ఈ కథకి వచ్చేసరికి “ఇది ఎలా అన్నా నేను అనువాదానికి ప్రయత్నించి చూడాలి” అనిపించే దాకా వచ్చా. కథలో సవర జాతి వాళ్ళ పెళ్లి సంప్రదాయాలు, మధ్యలో ఆ కుయి, కొందు భాషల పాటలు కూడా రావడం నాకు నచ్చిన అంశాలు. అనువాదం లో ఈ కథ బాగుంటుంది అనిపించడానికి కారణం అయినా అంశాలు.
అనువాదం చేసి దాన్ని ఎక్కడో యాక్సెప్ట్ అయేలా చూసిన కథ: అనువాదం అయ్యాక ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులకి చూపించి కొంత సలహాలు తీసుకుని ఒక పత్రికకి పంపా. దాని పేరు మ్యూజ్ ఇండియా. అప్పటికి 15 సంవత్సరాలుగా నడుస్తోంది, కొంచెం పేరు ఉన్న పత్రికే. విచిత్రంగా వారానికే స్పందన వచ్చింది. నేను ఆగస్టు చివర్లో పంపిస్తే, సెప్టెంబర్ మొదట్లో స్పందించి, మే/జూన్ సంచిక లో వేసుకుంటాం అన్నారు. వావ్, పంపింది భలే యాక్సెప్ట్ అయింది – అయితే అనువాదం సుమారుగా ఉంది ఏమో, అని ఆ ఉత్సాహం లో నేను ఇంకొన్ని కథలు అనువాదం చేసాను. మధ్యలో ఒకసారి వాళ్ళు కథకి ఎడిట్స్ చేసాము చూడమంటూ ఈమెయిల్ చేశారు. సరే, నేను ఆ ఎడిట్స్ ఒకసారి పరిశీలించి బానే ఉన్నాయండి, అని పంపేసా కానీ మే లో కథ రాలేదు. అసలు జనవరి సంచిక కూడా అప్పటి దాకా రాలేదు – నేను వారం పది రోజులకి ఒకసారి ఆ వెబ్సైట్ చూస్తూనే ఉన్నా. టెక్నీకల్ ప్రాబ్లమ్ అన్నారు. సరే అనుకున్నా.
మధ్యలో ఒకసారి ఒక బ్రిటీషు పత్రిక కొత్త అనువాదకులు చేసిన కథలని పంపండి అని ప్రకటించింది. ఆల్రెడీ ఇంకో చోట స్వీకరించిన కథ అయినా సరే అన్నారు. సరే, ఇది ప్రయత్నిద్దాం అనుకుని ఒకసారి ఆ కథని మళ్ళీ చదువుదాం అని కూర్చుంటే… అప్పటికి ఓ ఏడెనిమిది కథలు అనువాదం చేసి, సాహిత్య పత్రికల ఎడిటింగ్ ప్రక్రియల ద్వారా కొంత అవగాహన వచ్చినందువల్ల నా మొదటి అనువాదం పేలవంగా అనిపించింది. చాలాసేపు కూర్చుని నాకు అర్థమైనంతలో ఎడిటింగ్ చేసుకుని, ఈ బ్రిటీష్ పత్రిక్కి పంపాను. వాళ్ళు స్వీకరించలేదు. సరే, వందల కొద్దీ వస్తాయి, ఇందులోంచి ఏ పదో ఏరుతారు అనుకుని ఎలాగో ఎడిట్ చేశా కదా అని మళ్ళీ మ్యూస్ ఇండియా వారికి ఈమెయిల్ చేసాను – మీరెలాగూ ఇంకా కథ వెయ్యలేదు కదా. మీరు దగ్గర ఉన్న అనువాదం కంటే కొంచెం నేనే మళ్ళీ ఎడిటింగ్ చేసుకున్నాక ఇది కొంచెం మెరుగ్గా ఉంది… దాని బదులు ఇది పరిశీలించండి అని. వాళ్ళు లేదు, రేపో మాపో వచ్చేస్తుంది పత్రిక, మేము ఆల్రెడీ అన్నీ పంపేసాము పబ్లిషింగ్ కి అన్నారు. సరే, భవిష్యత్తులో పుస్తకం వస్తే అపుడు చూద్దాం లే అని ఊరుకున్నా.
ఇది బహుశా ఏ అక్టోబర్ లోనూ అయి ఉంటుంది. డిసెంబర్ చివరలో ఆ సదరు మే/జూన్ 2022 సంచిక చివరికి వచ్చింది. కానీ అందులో ఇది లేదు. అదేమిటి? అని అడిగితె – అరెరే, గల్తీ సే మిస్టేక్ హోగయా… అన్నారు. అలా అని ఏదో వచ్చే నెల వస్తుందనో, ఇంకేదో అనో కూడా కమిట్ కాలేదు. ఈ పాటికి ఒక డజను అనువాదాలు వివిధ వెబ్జీన్లలో వచ్చిన అనుభవం ఉంది కనుక ప్రపంచం లో వేరే చోట్ల సబ్మిట్ చేస్కోవచ్చు అన్న అవగాహన వచ్చింది నాకు. దానితో మీరు ఆ కథ ఇంక వేస్కోవద్దు. నేను ఎలాగో కొంచెం రీవర్క్ చేసి అనువాదాన్ని మెరుగు పరుచుకున్నా అని ఫీల్ అవుతున్నా – కనుక నా వద్ద ఉన్న దాన్ని ఇంకోచోట కి పంపుకుంటా అని ఇంకా విత్ డ్రా చేసుకున్నా (1.5 సంవత్సరాల తరువాత). షరా మామూలుగా “సారీ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ మాకు పంపుతారని ఆశిస్తున్నాము” అన్నారు. నేనైతే పంపను అని అనుకుని, కితాబ్ వారికి పంపాను. గత ఏడాది లో వీళ్ళు రెండు అనువాదాలు వేసుకున్నారు నేను చేసినవి. అందువల్ల వీళ్ళ పద్ధతుల గురించి అవగాహన ఉంది. వేస్కోకపోతే చెప్పేస్తారు, వేస్కుంటాము అన్నారు అంటే ఒక రెండు నెలల్లో వేసుకుంటారు అన్న నమ్మకం ఉంది. అలా, లాస్టుకి కితాబ్ లో వచ్చింది. సుఖాంతం. అలాగే ఒక పాఠం కూడా నేర్చుకున్నాను. ఆ మ్యూజ్ ఇండియా కి రెండు కారణాలకి నేను కృతజ్ఞురాలిని.
- వాళ్ళు అలా వారంలో స్పందించకపోతే నేను అనువాదాలు కొనసాగించపోదును.
- ఆ మొదటి వర్షన్ అనువాదం వెయ్యకుండా నాన్చి నాన్చి నాకు మేలు చేశారు. ఎడిట్ చేసుకున్న వర్షన్ చాలా మెరుగ్గా ఉందని నా అభిప్రాయం. చదివే వాళ్లకి రెండో వర్షన్ నయం. ఇంకా కూడా ఎడిట్ చేయొచ్చు, ప్రొఫెషనల్ ఎడిటర్ అయితే. మరి నేను కాదు కదా.
కానీ, ఆ పత్రిక మీద చదువరిగా ఉన్న సదభిప్రాయం తుడిచిపెట్టుకోపోయి నిరాశగా మారింది. ఎందుకు రచయితలో, అనువాదకులో అంటే అంత చులకన? అందరూ వాళ్ళ ఖాళీ సమయం వెచ్చించి ఉచితంగా చేస్తున్న మనుషులే కదా? వాళ్ళకి మాత్రం తెలియకనా? వాళ్ళూ అలాంటి వారే కదా – ఆ మాత్రం మర్యాదకి కూడా ఇవ్వడానికి అర్హులం కామా? అనిపించింది.
ఇక్కడ పాయింటు 1.5 సంవత్సారాల నిరీక్షణ కాదు. అంతర్జాతీయ పత్రికలు కొన్ని గైడ్లైన్స్ లోనే రాస్తాయి మినిమమ్ ఏడాది పడుతుంది అని. మనం అంత వెయిట్ చేయలేము అనుకుంటే పంపము అంతే. వారం లో మే లో వేసుకుంటాం అని చెప్పాక ఇంకా నేను దానిని ఇంకో చోటికి పంపలేదు. మే సంచిక డిసెంబర్ లో వచ్చింది. అందులో మళ్ళీ నా అనువాదం లేదు. ప్రో-ఆక్టివ్ గా మాకు ఎదో ఇబ్బంది, అందుకే సంచిక రాలేదు అని వాళ్ళు చెప్పలేదు. జనాంతికంగా గ్రూప్ ఈమెయిల్ చేస్తే పోయే విషయం అది. ప్రతి సారీ నేను అడగాలి, వాళ్ళు చెప్పాలి. మళ్ళీ మే సంచిక డిసెంబర్ లో వచ్చింది, మరి నాది లేదేం? అంటే ఒక సరైన జవాబు లేదు. సరే, మధ్యలో వెబ్జీన్లతో మంచి అనుభవాలు కూడా ఉన్నాయి కనుక, నాకూ కొంత అనుభవం వచ్చింది కనుక విత్ డ్రా చేసుకుని ఇంకో పత్రిక్కి పంపుకున్న. అదీ కథ.
ఇంతకీ అప్పుడప్పుడు ఇట్లా ఒక కథ అనువాదం గురించి పోస్టులు రాస్తూ ఉంటాను – అసలు బోడి ఒక కథకి ఈ నేపథ్యం, వివరణ, ఇవన్నీ అవసరమా? అనిపించవచ్చు. అనువాదకులు అంటే అదృశ్యంగా అట్లా ఉండాలి అంతే – అసలు అనువాదానికి అనువాదకులకి గుర్తింపు రావాలి అనుకోడం కూడా అదొక ఆధునిక పోకడ – అని కూడా ఒక వాదన ఉంది. మరేందుకు? అంటే – ప్రతి దానికి ఒక కథ ఉంటుంది. కథకి, నవలకి, ఇంక దేనికో, అన్నింటికీ ఉన్నట్లే అనువాదానికి కూడా ఒక కథ ఉంటుంది. ఎందుకు చేసాము? చేసాక, అది బైటకి వచ్చేలోపు ఏమైంది? – అనువాదకులకి కూడా మనోభావాలు ఉంటాయి, అవి వ్యక్తం చేసుకోడానికి వాళ్ళ బ్లాగులో అన్నా వాళ్ళు రాసుకుంటారు అని చెప్పడానికి అనమాట ఇలాంటి పోస్టులు.
Leave a Reply