రక్తదానం తెలుసు, ఈ రక్తరసం ఏమిటో?
ప్లాస్మా. టీవీ కాదు. బ్లడ్ ప్లాస్మా.
ఇవ్వాళ నేను కెనడియన్ బ్లడ్ సర్వీసెస్ వారి సెంటర్ ఒకదానిలో (మొదటిసారి) ప్లాస్మా దానం చేసొచ్చాక ఆ అనుభవం రాసి, ప్లాస్మా దానం అవసరం గురించి కూడా చెబుదామనుకున్నాను. అందుకే ఈ బ్లాగు పోస్టు.
తెలుగులో ప్లాస్మా ని ఏమంటారో? అని వెదికితే రక్తరసం, రక్తజీవద్రవ్యం, నెత్తురు సొన అన్న పదాలు కనబడ్డాయి. రక్తదానం మనలో చాలా మందికి పరిచయం ఉన్న పదమే. తరుచుగా బ్లడ్ డొనేషన్ కాంపులు అవీ చూస్తూ ఉంటాము, కొంచెం పరిసరాలు గమనించే అలవాటు ఉంటే. నేను నాకు ఇరవై ఏళ్ళ వయసప్పటి నుండి సగటున ఏడాదికీ, రెండేళ్ళకీ ఒకసారి రక్తదానం చేశాను (దీని గురించి గతంలో రాశాను). ఇన్నిసార్లలో ఎప్పుడూ నాకు ఇలా ప్లాస్మా సపరేటుగా తీసుకుని మళ్ళీ మన రక్తం మనకి తిరిగి ఎక్కించేసే పద్ధతి ఒకటుందని తెలియదు (ఇలాంటిది బాలకృష్ణ సినిమాలో జరుగుతుందని చెబితే నమ్మి ఉందును). ప్లాస్మా, ప్లేట్లెట్ డొనేషన్ సపరేటు అని విన్నా కానీ వివరాలు తెలుసుకోలేదు. ఒక ఆర్నెల్ల క్రితం అనుకుంటా, మా ఇంటి నుండి ఒక కిలోమీటరు దూరంలో కొత్త ప్లాస్మా సెంటర్ తెరిచారు. అప్పట్నుంచి వాళ్ళ రక్తదాతల డేటాబేస్ లో ఈ ఏరియాలో ఉన్న అందరికీ వరసగా మెసేజిలు, ఫోన్ లు వీటిద్వారా కాంపైన్ మొదలుపెట్టారు. అప్పుడే నాకు మొదట ఎందుకు ఇంతలా చెబుతున్నారు? అన్న ప్రశ్న కలిగింది.
అసలేమిటీ ప్లాస్మా డొనేషన్?
మన రక్తం లో 55% ఉంటుందంట ఈ ప్లాస్మా అనబడు పాలిపోయిన పసుపు రంగులో ఉండే పదార్థం. మామూలుగా రక్తదానం చేస్తే అందులో ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ – ఈ మూడు సెపరేట్ చేసి వాడొచ్చంట (అంతా అలాగే కలిపి ఉంచేసి కూడా వాడతారు అనుకుంటా). ప్లాస్మా డొనేషన్ అంటే రక్తంలోంచి ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు అనమాట. తీసుకుని మిగితా రక్తం తిరిగిచ్చేస్తారు (ఇదే నాకు బాలకృష్ణ సినిమాలా అనిపించిన అంశం). ఈ ప్లాస్మా ని ప్రాణాలు కాపాడేంత ప్రభావం గల వివిధ రకాల మందుల్లో వాడతారంట. అలాగే, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో నేరుగా పేషంట్లకి కూడా ఇస్తారంట రక్తం ఇచ్చినట్లు (ఈ పేజిలో ప్లాస్మా తో ఏంచేస్తారన్న విషయం క్లుప్తంగా తెలియజేస్తూ రెండు చిన్న విడియోలు ఉన్నాయి). మరి నేను కెనడాలో చేశాను కనుక ఇక్కడి విషయం తెలుసు – ప్లాస్మా డొనేషన్ ద్వారా వచ్చే దానితో పోలిస్తే దాని అవసరం ఇంకా ఎక్కువ ఉందంట. అందువల్ల యూఎస్ నుంచి కొంటూ ఉంటారంట ఇక్కడ. కొన్ని ప్రాంతాల్లో ప్లాస్మా ఇచ్చిన వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారంట (నేను వెళ్ళింది మామూలు రక్తదానం/ప్లాస్మాదానం చేసే ప్రదేశం. నీళ్ళు, జూస్ లాంటివి ఇస్తారు దాతలకి).
ఎందుకీ ప్లాస్మా డొనేషన్? రక్తదానం చాలదా? ప్లాస్మా అవసరం విపరీతంగా ఉంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా. కోవిడ్ కొంత కారణం సప్లై తగ్గిపోడానికి అని ఇక్కడ అన్నారు. పూర్తి రక్తదానం తో పోలిస్తే ప్లాస్మా ఎక్కువసార్లు ఇవ్వొచ్చంట. పైగా పైన రాసినట్లు ప్రాణాంతకమైన వ్యాధులు కొన్నింటి ట్రీట్మెంట్లో ప్లాస్మా చాలా విలువైనది. కోవిడ్ పేషంట్లకి కూడా ప్లాస్మా ఉపయోగం ఉంది. కనుక పూర్తి రక్తదానం ఎంత ముఖ్యమో, ప్లాస్మా దానం కూడా అంతే విలువైనది అని వీళ్ళ కాంపైన్ లో చెబుతున్నారు ఇక్కడ.
ఇదంతా కొంచెం తెలుసుకున్నాక కూడా నేను వెంటనే ఈ కాల్ కి స్పందించలేదు. మార్చి చివర్లో ఒకసారి రక్తదానానికి పోతే అక్కడ హిమోగ్లోబిన్ లెవెల్ చూసి, చాలా తక్కువుంది, తీసుకోము అన్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. మూడు నెలలక్రితం చాలా మైల్డ్ గా కోవిడ్ పలకరించి పోయింది. దాని ప్రభావమో ఏమిటో? అంటే కావొచ్చు అన్నారు. కానీ, మరీ తక్కువగా ఉంది. ఒకసారి డాక్టర్ తో మాట్లాడు. ఫలానా ఫలానా బాగా తిను. ఐరన్ సప్లిమెంట్ తీసుకో, ఇలా జాగ్రత్తలు చెప్పి పంపేశారు. అసలు నా జీవితంలో ఇలా హిమోగ్లోబిన్ తక్కువ అవడం ఇదే మొదటిసారి. ఖంగారుతో కూడిన డిప్రెషన్ కొంతా, ఇలా ఇంట్లో వాళ్ళని చూస్కోడంకాదు, మనల్ని మనం కూడా చూసుకోవాలి అన్న జ్ఞానం వల్ల కొంతా… ఇక కొన్నాళ్ళు నేను ధైర్యం చేయలేదు. తరవాత జులై లోనో ఎప్పుడో మళ్ళీ వెళ్ళా, ఈ సారి ప్లాస్మా దానం ప్రయత్నిద్దాం అని.
అప్పటికి రక్తం మళ్ళీ సర్దుకున్నట్లు ఉంది. కానీ, సరిగ్గా వాళ్ళకి ఒక కటాఫ్ ఉంటుంది దాతల నుండి ప్లాస్మా తీసుకోవడానికి. అంతే ఉంది. అందుకని కొన్నాళ్ళాగమన్నారు. కానీ, ఫోనులు, ఈమెయిల్ కాంపైన్ మాత్రం ఆగలేదు. సరే, ఈమధ్య ఆరోగ్యం బానే ఉంది కదా, ఈ వారం కాస్త పని తక్కువగా ఉందని మళ్ళీ ధైర్యం చేసి చూశా. లాస్టుకి ఇవ్వాళ ఈ ప్రొసీజర్ అయింది. వాళ్ళకి ఏవో కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని మందులు వాడే వాళ్ళవి తీసుకోరు. రక్తహీనత ఉంటే ఎలాగో తీసుకోరు. ఇంకా పెద్ద లిస్టు ఉంది. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వారు ఒకసారి వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే మనం వాళ్ళకి సరిపోతామో లేదో చెబుతారు. సీనియర్ సిటిజెంస్ కూడా కనిపిస్తూ ఉంటారు వెళ్ళిన ప్రతిసారీ. వీలు/అర్హత ఉన్న అందరం భయపడకుండా, అపోహలు పెట్టుకోకుండా, చేయాల్సిన పని ఇది అనిపించింది వెళ్ళొచ్చాక.
విధానం: మన బరువు, ఎత్తు బట్టి ఎంత తీసుకోవాలో నిర్ణయిస్తారంట. అది అయాక ఒక అరగంట-ముప్పావు గంట పడుతుంది అన్నారు. మామూలు రక్త దానం లాగే సూది గుచ్చి తీసుకున్నారు గానీ, మళ్ళీ ప్లాస్మా తీసుకుని రక్తం వెనక్కి పంపించేస్తారంట. ఆ కాస్త దానిలో అంతా ఎర్రగా ఉంటుంది కనుక పోతోందో వస్తుందో కనబడదు అనుకోండి, స్క్రీన్ మీద మాత్రం ఎప్పుడు ఏం జరుగుతోందో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకున్న కోడ్ ప్రకారం (ఒక సింబల్ కి రక్తం బైటకి పోతుందని, ఒక సింబల్ కి లోపలికొస్తోందని అర్థం). నాకు ఈ ప్రొసీజర్ ఇరవై నిముషాలకే ముగిసింది. నేను ఇలాంటివి చేసే ముందు నీళ్ళు బాగా తాగుతా, కాఫీ ఒక నాలుగైదారు గంటల ముందే మానేస్తా (అందుకే మధ్యాహ్నం అపాయింట్మెంట్లు తీసుకుంటా) – రెండూ మంచి ప్రాక్టీస్ అని, తొందరగా ఐపోవడానికి దోహదం చేసేవే అని అక్కడున్న నర్సు చెప్పింది ఒకసారి బ్లడ్ డొనేషన్ లో. ఆరోజు రక్తదానం కూడా ఆరు నిముషాలలో ముగిసింది.
ఆ సొంత సుత్తి అటు పెడితే, మొత్తానికి నేను చెప్పేది – నాకు అర్థమైనది ఏమిటంటే:
- ప్లాస్మా అవసరం పూర్తి రక్తం కంటే కూడా ఒకోసారి ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ వల్ల డిమాండు ఇంకా ఎక్కువైంది (ఇది వేరే దేశాల్లో కూడా జరిగింది)
- కొన్ని రోగాల ట్రీట్మెంట్ కి ప్లాస్మా తోనే పని
- ప్లాస్మా ఉపయోగించి కొన్ని మందులు కూడా తయారుచేస్తారు
- ప్లాస్మా దానం ప్రతి పదిహేనురోజులకోసారి చేసినా కూడా మామూలుగా ఆరోగ్యవంతులుగా ఉండేవారికి వచ్చే నష్టం లేదు.
- మామూలుగా రక్తదానం చేశాక నీరసం లాంటివి అనుభవించకపోతే ప్లాస్మా దానం తర్వాత కూడా ఏం అవ్వదు.
వెరసి మామూలు మనుషులు అతి సులభంగా, అదీ మళ్ళీ మళ్ళీ తరుచుగా చేయగలిగే గొప్ప పని ప్లాస్మా దానం. వాళ్ళన్నారని రెండు వారాలకోసారి వెళ్ళిపోయే ఉద్దేశ్యం, టైము నాకు లేవు. అయితే, రక్తదానం ఏడాదికోమాటు చేస్తే చాలు అనుకునేదాన్ని నేను (వాళ్ళు మూణ్ణెల్లు, ఆర్నెల్లు అంటారు కానీ, ఆడమనిషిగా, తల్లిగా, ఉద్యోగినిగా, గృహిణిగా అంత తరుచుగా చేసి నిభాయించుకోలేను అనుకుంటున్నా). ప్లాస్మా కి వీలు ఉండి, రక్తహీనత లాంటివి, ఇతరత్రా అనారోగ్యాలేవీ పట్టుకోకపోతే మూడు, నాలుగు నెలలకొకసారైనా చేయాలి అనుకుంటున్నా. పైగా, అట్లా ఓ ఐదునిముషాలు పోతే ఆ సెంటర్ వచ్చేస్తుంది. చేయననడానికి నాకు కారణాల్లేవు. నా స్నేహితురాలు ఒకామె బిడ్డకి జన్మనిచ్చి ఆర్నెల్లు కూడా కాకుండానే వెళ్ళి ప్లాస్మా ఇచ్చొచ్చింది ఈమధ్యనే. ఆమే నాకు స్పూర్తి ప్రస్తుతానికి.
ఇకపోతే, ఈ పోస్టు రాయబోతూ రక్తం బదులు ప్లాస్మా ఎందుకు దానం చేయాలి? అన్న సందేహం కలిగి కాసేపు అవీ ఇవీ చదివా. కొన్ని బ్లడ్ బాంక్ వెబ్సైట్లలో ఫలానా బ్లడ్ గ్రూపు వారు ప్లాస్మా, ఫలానా వాళ్ళు ప్లేట్లెట్, ఫలానా వాళ్ళు రక్తం/ప్లాస్మా/ప్లేట్లెట్ చేస్తే అందరికీ మోస్ట్ బెనెఫిట్ కలుగుతుంది అని రాశారు. ఇది మరి ఆయా దేశాలలో ఉన్న జనాల బ్లడ్ గ్రూపుల డిస్ట్రిబ్యూషన్ బట్టి ఉంటుందో ఏమో అర్థం కాలేదు. ఒక డాక్టర్ మిత్రుడిని వాకబు చేస్తే ఇదే వినడం ఈ మాట, చదివి చెబుతానన్నారు. ఆ విషయం ఆయన చెప్పేది నాకు అర్థమైతే తర్వాత రాస్తా.
Nice