రమేశ్ కార్తిక్ నాయక్ “పురుడు” కథకి నేను చేసిన ఆంగ్లానువాదం “Exchanges: Journal of Literary Translation” అన్న అమెరికన్ వెబ్ పత్రిక తాజా సంచికలో రాబోతోంది వచ్చే వారం. గత కొన్ని నెలలుగా ఐదారు కథల అనువాదాలు వివిధ ఆంగ్ల వెబ్ పత్రికల్లో వచ్చాయి. వాళ్ళ పద్ధతులు మన తెలుగు వెబ్ పత్రికల పద్ధతులతో పోలిస్తే వేరుగా ఉన్నాయి. వీరితో చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలు నేను కొంచెం “గొప్ప కథ” అంటే ఏమిటి? ఏ తెలుగు కథలు ఆంగ్లానికి సెట్ అవుతాయి అన్న విషయం ఆలోచించేలా చేశాయి. ఈ విషయాల గురించి కొన్ని ఆలోచనలు అనుభవాలు పంచుకుందామని ఈ పోస్టు రాసుకుంటున్నాను.
“మంచి కథ అంటే ఏమిటి?” అంటే ఒక నిర్వచనం అందరినీ మెప్పించడం కష్టం. కొందరికి శిల్పమో, క్రాఫ్టో ఏది పేరు పెట్టుకుంటే అదే సమస్తం. కొందరికి కథనం. కొందరికి వస్తువులో విలువుండాలి. ఇక ఈ విషయమై వాదోపవాదాలు గొప్పగొప్ప సాహితీవేత్తల నుండి సాధారణ పాఠకుల దాకా, సాహిత్య పత్రికల నుండి ఫేస్బుక్ చర్చల దాకా చూస్తూనే ఉన్నాము. అలాగే విదేశీ సాహిత్యమో ఇతర భాషలదో శోధించి మధించి, తెలుగులో అలాంటి కథల్లేవు అని చప్పరించేసే వాళ్ళూ చాలా మందే ఉన్నారు నా సోషల్ మీడియా ఫీడ్ లో. వ్యక్తిగతంగా “కదిలించేది కథ” అన్నది నా అభిప్రాయం. కానీ, నేను చదివిన సాహితీ చర్చలు, వ్యాసాలు వంటివి చూసి “మంచి కథ” అని పలువురి నోట అనిపించుకోవాలంటే నేననుకునే మంచి కథ నిర్వచనం చాలదని అనిపించింది. మంచి తెలుగు కథ అని నేననుకున్నది తెలుగు వారికే ఆనకపోతే ఇంక ఇతర భాషల చదువరులు..అంతర్జాతీయ పాఠకులకి నచ్చుతుందా?
“పురుడు” కథ చదివినపుడు నాకు ఏదో ఇంకో కొత్త ప్రపంచంలోకి తొంగి చూస్తున్న భావన కలిగింది. మన చుట్టు ఉండే వాళ్ళలోనే ఎన్ని రకాల జీవితాలో? అనిపించింది. గత కొన్ని నెలలుగా తెలుగు కథలని ఆంగ్లంలోకి అనువాదం చేయడం గురించి ఆసక్తిగా ఉన్నాను కనుక దీన్ని అనువదిద్దాం అనిపించింది. రచయిత, పబ్లిషరు వెంటనే అంగీకారం తెలిపారు, అక్కడిదాకా బానే ఉంది. నేను కూడా అనుకున్నదానికంటే తొందరగానే అనువాదం చేశాను. రచయిత కి బానే ఉంది. ఆయన ఇచ్చిన సూచనలూ బాగున్నాయి. నాకు బానే ఉంది. ఒక సాహితీ నేస్తం చీమలమర్రి సాంత్వన కూడా మూలం, అనువాదం రెండూ చదివి బానే వచ్చింది అన్నది. దానితో ఇంక ఏదన్నా వెబ్ పత్రిక్కి పంపుదాం అనుకుంటూ ఉండగా ఈ పత్రిక వారి ప్రకటన కనబడ్డది. ఇదీ బానే ఉంది.
అయితే, ఈ కథ మరి విమర్శకుల దృష్టిలో “గొప్ప” అనదగ్గదా? నాకు గొప్పదే. నేనేమన్నా ఈ సాహితీ పత్రికల ఎడిటర్నా? పేరెన్నిక గన్న సాహితీ విమర్శకురాలినా? నా మాట ఎవడిక్కావాలి? తెలుగు వారి సాహితీ చర్చల బట్టి నాకర్థమైంది ఏమిటంటే ఈ కథ బహుశా విమర్శకులు “ఆ, బంజారా కథలు మనకి కొత్త కనుక కథ బాగుందంటున్నావు అంతే” అని చప్పరించేసి ఉండేవారేమో అని. కొత్త సంస్కృతుల గురించి చదువుతున్నపుడు అది ఒక ముఖ్యమైన కారణమే నచ్చడానికి. కనుక, అదే కారణంతో ఇతరులకి కూడా నచ్చొచ్చు కానీ… మరి తెలుగులోనే నాకీ అనుమానం ఉంటే.. Exchanges పత్రిక్కి ముప్పై ఏళ్ళ చరిత్ర ఉంది. ముందే అమెరికన్ ఎడిటర్లు. మనది మామూలు ఆంగ్లం. స్పెల్లింగ్ గ్రామర్ తప్పులుండవు కానీ సాహిత్యానికి నప్పే శైలి కాదు. పైగా రోజూ వారి జీవితంలో కంప్యూటర్ సైన్సు రిసర్చి పేపర్లు రాస్తూ ఉంటా. ఇంజనీరు రాసే భాష అనువాదానికి…అమెరికన్ల స్థాయికి నప్పుతుందా? అన్నది మరొక సందేహం.
అయినా ఏదోలే, ఓ రాయేసి చూద్దాము, అసలంటూ పంపితే కదా అంగీకరిస్తారో లేదో తెలిసేది? అని పంపించాను. మూడు వారాలకే స్పందన వచ్చింది (ఆంగ్ల పత్రికలకి పంపిస్తే నెల నుండి ఆర్నెల్ల దాకా పడుతుందని నా అనుభవం) – ఈ కథ బాగుంది. మేము వేసుకుంటాము. ఇంకో రెండు వారాల్లో కాంట్రాక్టు, ఎడిటింగ్ సజెషన్లు పంపిస్తాము అని.
ఉచితంగా రాసి, ఉచితంగా వేసుకునే కథకి కాంట్రాక్టు ఏమిటా? అనుకోకండి. రైట్స్ విషయం మొదటే స్పష్టం చేస్తున్నారు. మొదటి ప్రచురణకి మాత్రమే మా హక్కు. తరువాత మీరు ఎక్కడికన్నా పంపుకోవచ్చు (అలా వేసుకునేవారుంటే), అన్ని హక్కులు మీవి అని స్పష్టం చేసి సంతకాలు పెట్టుకోవడం… ఫ్యూసులు ఎగిరిపోయాయి నాకు. మరో పత్రిక వారి నియమాలు చూస్తూ ఉంటే కూడా ఇది కనబడింది. వీళ్ళైతే రచయితలకి పారితొషికం ఇస్తారు. పత్రిక కూడా డబ్బులిచ్చి కొనుక్కు చదవాలి.. అయినా సరే, హక్కులు మీవి అని ముందే స్పష్టం చేశారు. ఈ రకం క్లారిటీ తెలుగు పత్రికలకి, పబ్లిషర్లకి ఉంటే అందరికీ గౌరవంగా ఉంటుంది కదా అనిపించింది. “నువ్వు రాయి, నీకేం పారితోషికం లేదు కానీ, హక్కులు మాత్రం నావి. నా ద్వారా నీకు పేరొస్తోంది, అది గుర్తుంచుకో” అన్న ఆటిట్యూడ్ కూడా తెలుగులో ఉందని ఈమధ్య తెలిసింది.
ఏనీవే, అదటుపెట్టి పాయింటుకొస్తే, ఈ పత్రికతో ఈ కథ కోసం పనిచేయడంలో నాకు నచ్చినవి చాలా ఉన్నాయి.
- నిర్ణయం తొందరగా తీసుకోవడం
- హక్కుల విషయం ముందే స్పష్టంగా చెప్పడం
- చాలా లోతుగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం. నాలుగు పేజీల కథ. ఎంతైనా ఎంతిస్తారు ఫీడ్బ్యాక్? అనుకున్నాను. అదే అనువాదం కొంచెం కొత్తగా కనబడింది చివరికి వచ్చేసరికి.
- రచయితలకి ఇచ్చిన మర్యాద. వాళ్ళు సూచించిన అనేక సవరణల గురించి నేను చూసి ఒప్పుకున్నవి ఒప్పుకుని, వద్దన్నవి స్వీకరించి, భిన్నాభిప్రాయాలు ఉన్న చోట్ల చర్చించి – ఇదంతా “నేన్నీకేదో సేవ చేస్తున్నా” అన్న భావనతోనో, లేకపోతే “ఏమిటీ చెత్త రాతా? ఇన్నిన్ని మార్పులు నేను చేయాలా?” అన్న భావనతోనో కాక “నువ్వు రాసావు. నీ పని అది. నేను ఎడిటర్నే. నా పని ఇదే” అన్నట్లు ఉంది. నేన్నీకేదో ఫేవర్ చేస్తున్నా అన్న ఆటిట్యూడ్ నాకు కనబడలేదు. (నిజానికి ఫేవరే, ఎందుకంటే నేనెప్పుడూ అమెరికన్ సాహిత్య పత్రికలకి ఏమీ పంపలేదు. నా ఆంగ్లం మామూలు వ్యావహారికంగా ఉంటుంది. సాహిత్యపు భాష కాదు. రిచ్ వకాబులరీ లేదు).
తెలుగు ఎడిటింగ్ అనుభవాలంటే – పదికి ఒకటో రెండో సార్లు మాత్రమే ఇలాంటి “ఎడిటింగ్” అనుభవం కలిగింది. కొన్నిసందర్భాల్లో వాళ్ళ మటుకు వాళ్ళు ఎడిటింగ్ చేసేసి ఏం చేసారో నాకు చెప్పలేదు కూడా. ఒకసారి ఎడిట్ చేసి వేసిన వర్షన్లో టైపోలు కనబడ్డాయి. మన ఎడిటర్లది తప్పనో, ఎడిటర్లన్న వాళ్ళు తెలుగులో లేరనో..ఇలాంటివన్నీ నేననను కానీ, మన పద్ధతులు వేరు. ఆంగ్ల పత్రికల పద్ధతులు వేరు. అంతే. ఇలాంటివి ఏం చేయలేము కానీ, బహుశా మన వాళ్ళు కూడా అర్జెంటు టర్న్ అరవుండ్ అనుకోకుండా ఇలా కొన్ని నెలలకి ఒకసారి వేయాలేమో. ఏదేమైనా, ఎడిటింగ్ అన్నది పరమ థాంక్ లెస్ జాబ్ అని నా అభిప్రాయం. కనుక ఈ సందర్భంగా అన్ని భాషల ఎడిటర్లకి ఒక నమస్కారం.
ఒకటీ అరా నాకు అంత ఆమోదయోగ్యం కానీ అంశాలు ఉన్నాయి – ఉదాహరణకి ట్రాన్స్లేటర్స్ నోట్ రాయమన్నారు నేపథ్యం వివరిస్తూ. కానీ మళ్ళీ చాలా వరకు అదంతా తీసేద్దామన్నారు. నాకే కొన్నింటికి వివరణ కావాల్సి వచ్చింది, నోట్ లేకపోతే విదేశీ చదువరులకి అయోమయంగా ఉండదా? అన్నది నా అనుమానం. అయితే, వాళ్ళ పత్రిక, వాళ్ళ అనుభవం వీటిని నమ్మి నేను అది వదిలేశాను. వాళ్ళు నన్ను గౌరవించారు. నేనూ తిరిగి గౌరవించాలి కదా?
సారాంశం ఏమిటంటే – తెలుగు కథకి అంతర్జాతీయ స్థాయి ఉంది. అంతర్జాతీయ పత్రికల్లో కనబడే సత్తా ఉంది. అని. ఇదొక కథ ఆధారంగా చెప్పడం లేదు. ఈమధ్య కాలంలో ఒక పది కథలు అనువాదం చేశాను. ఆ అనుభవంతో చెబుతున్నాను. కొంచెం కథలలో కొత్త సంస్కృతుల పరిచయం అన్నది బహుశా బైటి వారిని ఆకట్టుకుంటోందేమో. ఈ కథలో, నేను ఎంచుకున్న ఇతర కథల్లో నాకు ముఖ్యమైన ఆకర్షణ అదే. కొన్ని ఆంగ్ల సాహితీ పత్రికల్లో కూడా రకరకాల కథలని ఆహ్వానిస్తారు. క్లిష్టమైన వస్తువులు, వినూత్నమైన శైలి, ఓ ప్రేమ, ఓ హింస, ఓ ట్రబుల్డ్ కేరెక్టర్, ఇలాంటివన్నీ లేకపోయినా కథలని అంగీకరిస్తున్నారు అని అర్థమైంది.
మామూలుగా తెలుగు వెబ్ లో ఇతర భాషల లేదా విదేశీ సాహిత్యం విరివిగా చదివే సాహితీ ప్రేమికుల మధ్య తరుచుగా వినబడే వ్యాఖ్య “మనతెలుగులో ఇలాంటివి రావేం?” అని. సాహిత్యం విషయంలో నాకు మొదట్నుంచి దేనికదే ప్రత్యేకం అనే అనిపించేది కానీ సినిమాల విషయంలో ఇలా నేనూ చాలాసార్లు అనుకున్నాను. సినిమాల విషయం నాకింకా జవాబు తెలియదు కానీ, సాహిత్యం విషయం మాత్రం-ఇంకోళ్ళలా తెలుగు సాహిత్యం ఎందుకుండాలి? తెలుగు వాళ్ళకే ప్రత్యేకమైన జీవిత విశేషాలు కథల్లో ప్రతిబింబిస్తే చాలదా? అనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయి మన కాళ్ళు నేల మీద ఉన్నప్పుడే, మన వేర్లు మన సంస్కృతిలో ఉన్నపుడే వస్తుంది కానీ, నేల విడిచి సాము చేసి ఇంకెవరో రైటర్ల లాగ మన వాళ్ళు రాయాలి అనుకోడం పాయింట్ లెస్ అనిపిస్తోంది నాకు ఇప్పుడు.
ఈ వ్యాసం చదివినవారికి ఓపికుంటే, ఆసక్తి ఉంటే తెలుగు నుండి ఇతర భాషల్లోకి అనువాదం ప్రయత్నించండి. మన పిల్లల తరానికి మన వాళ్ళే కొంతైనా తెలుగు కథలు ఆంగ్లంలో చదువుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు (ఇప్పటికే నా వయసు వారిలోనే ఇలాంటివారిని కలిశాను.). మనం తెలుగుకి ఏం చేయగలం? అని ప్రశ్నించుకుంటే ఇది కూడా ఒక ముఖ్యమైన సమాధానం అని ప్రస్తుతానికి నా అభిప్రాయం.
చాలా స్ఫూర్తిదాయకమైన వ్యాసం.వీలు కుదిరితే నేనూ ఇటువంటి ప్రయత్నం చేయాలని ఉంది. కాని నాకు ప్రచురణకు ఎలాపంపాలి వంటి విషయాలమీద అవగాహన లేదు. ఐనా రంగంలోనికి దిగాక ఆలోచిద్దాం ఆవిషయం.
మీకు రాయాలన్న సంకల్పం ఉంటే ఎక్కడికి పంపోచ్చో అదే తెలుస్తుంది లెండి. 🙂 https://www.himalayanwritingretreat.com/indias-top-literary-magazines-to-submit-short-stories-non-fiction-and-poetry/ – ఇక్కడ కొన్ని వెబ్ పత్రికల వివరాలు ఉన్నాయి.
తెలుగు నుండి ఇతర భాషల్లోకి అనువాదం ప్రయత్నించండి…మనం తెలుగుకి ఏం చేయగలం? అని ప్రశ్నించుకుంటే ఇది కూడా ఒక ముఖ్యమైన సమాధానం అని ప్రస్తుతానికి నా అభిప్రాయం.
ఈ వాక్యం బాగుంది. మిగతా అంశాల మీద మరో సారి మాట్లాడుకుందాం!
ఆంగ్లం నుండి, తదితరాల నుండి అనువాదాలు దొరికితే సంబరంగా చదివి కొన్నిటిని ఆనందించే అలవాటు. అసలు ఆంగ్లాలే చదవని/ చదవలేని నాలాటి వాళ్ళ సంగతి పక్కన పెడితే, తెలుగు కథను విశ్వవ్యాప్తం చెయ్యడం గొప్ప సంగతే. పాశ్చాత్యులు కొందరు ఇదే ఇప్పటి భారతదేశ స్థితి అని పొరబడే, దాన్నే ఖాయం చేసుకునే అవకాశం లేకపోలేదు. పూర్తిగా తెరిపిన పడ్డామని ఘంటాపదంగా చెప్పలేకపోయినా ఇలాంటి దుస్థితులు ఇంకా కొద్దిపాటి ఉన్నాయన్నది మాత్రం చేదు నిజం. ఈ వ్యాసం నాకు చేసిన గొప్ప ఉపకారం ‘పురుడు’ కధ చదివాను. తద్వారా ‘నెచ్చెలి’ని చేరుకున్నాను.
ఇది ఆంగ్లానువాదం చదవాలనే కుతూహలాన్ని పెంచింది. ప్రచురణ వచ్చాక సౌమ్య గారు కబురిస్తే ఆంగ్ల పత్రిక కొనుక్కొని చదువుకుంటాను.
ప్రత్యేక అభినందనలతో..
రాజా.