తెలుగు రచయిత మల్లిపురం జగదీశ్ గారి కథ “నా పేరు సొంబరా” కి నేను చేసిన ఆంగ్లానువాదం “అవుటాఫ్ ప్రింట్” ఆంగ్ల వెబ్ పత్రికలో ఇవ్వాళ వచ్చింది (ఉగాది కానుక లా భావిస్తున్నా!). రచయిత రాసిన కథలు ఒక ఇరవై చదివి ఉంటాను నేను. అన్నింటిలోకి ఇది నాకు నచ్చిన కథ. ఇట్లా కథ చదవగానే ఇది అందరూ అర్జెంటుగా చదవాలి అని అనిపించింది. ఒరిజినల్ కథ “గురి” కథాసంకలనంలో ఉంది. హర్షణీయం వెబ్సైటులో కూడా ఉంది. కథానేపథ్యం రచయిత మాటల్లో అదే వెబ్సైటులో వినవచ్చు.
సరే, నేను ఏదో కాస్త కసరత్తు చేసి అనువాదం చేశాను. ముగ్గురు స్నేహితులు – “గడ్డిపూలు” సుజాత గారు, చీమలమర్రి సాంత్వన, నాకు కాలేజి రోజుల నుండి పరిచయం ఉన్న గంగా భవాని – చదివి సూచనలు ఇచ్చారు. జగదీశ్ గారు కూడా లోతుగా చదివారు అనువాదాన్ని. ఒక పత్రిక్కి పంపాను. దానిని తిరిగి పంపేసారు – వాక్యాలన్నీ ఒక్క మాదిరే ఉన్నాయన్న ఫీడ్బ్యాక్ ఇచ్చి. అదేం ఫీడ్బ్యాక్? అనుకుని మళ్ళీ సలహా కోసం నిడదవోలు మాలతి గారికి చూపెట్టా. కొంత చర్చ అయ్యాక ధైర్యం చేసి మరోసారి ఒక కొత్త పత్రిక్కి పంపుదామనుకున్నా.
నాలుగు నెలలేమో పట్టింది అవుటాఫ్ ప్రింటు వారు ఓ నిర్ణయం తీసుకోవడానికి. కానీ ఎంత మంచి సలహాలు, సూచనలూ ఇచ్చారో అసలు. అవే భవిష్యత్తు లో చేసే అనువాదాలకి నోట్సు లా పనికొస్తాయి. అలా ఇచ్చే ఎడిటర్లు ఉంటే నాలుగు నెలలు వెయిట్ చేయడం ఓ లెక్కా?
ఇకపోతే సాధారణంగా నాకు కథల గురించి చర్చలు పెట్టడం చేతకాదు. ఈ కథ నేను చూపెట్టగానే “రైట్ వింగ్ ప్రాపగాండా” అని ఎవరూ అనలేదా? అని అడిగారొకరు. “ఇలాంటి కథలు ఇంగ్లీషు వాళ్ళకి నచ్చవు. నీ అనువాదం అందుకే మొదట రిజెక్ట్ అయిందేమో” అన్నారు మరొకరు. ఇపుడు అనువాదం చదివాక నాకు తెల్సిన ఒక ఆంగ్ల ఆదివాసీ రచయిత “ఈ టాపిక్ నిజంగా జరిగే విషయమే అయినా మా వాళ్ళలోనే దీన్ని ప్రాపగాండా అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ అంశం పైన కథలు రావాలి. ఆయన రాయడం, నువ్వు అనువాదం చేయడం, రెండూ సాహసోపేతమైన చర్యలే” అని తేల్చారు.
నాకంత అజెండాలూ, ఐడియాలజీలు సీను లేదు మాస్టారూ. ఓపిగ్గూడా లేదు వాటిని ఆలోచించడానికి. కథ మనసుని తాకింది. ఆ టాపిక్ మీద నేనేం చదవలేదు అనిపించింది. అందుకని అనువాదం చేశాను. అంతే. బలమైన కథ. అట్టాంటివి మన వాళ్ళవి మనం చదవాలి, బైటివాళ్ళూ చదవాలి. అంటే మతంమార్పిడి కథలని కాదు. వివిధ జాతుల ప్రజల జీవితాల్లో పెద్ద మార్పులని కలిగించిన అంశాల గురించి రాసే కథలు అని నా భావం.
కథలో కొన్ని మూల పదాలు అలాగే ఉంచేశాను. అయితే పత్రిక వారు మేము గ్లాసరీలు అవీ పెట్టము, కాంటెక్స్ట్ బట్టీ అర్థమవుతుంది లే అన్నారు. అట్ల గాదండీ, కొందరుంటారు నా బోంట్లు, వాళ్ళకి వివరాలు కావాలి. అందుకని నా బ్లాగులో పెడతా, లంకె ఇవ్వండి అంటే ఒప్పుకున్నారు, ధర్మ ప్రభువులు.
కథ రాసినందుకు, నాకు అనువాదం చేయడానికి అనుమతించినందుకు, జగదీశ్ గారికి ధన్యవాదాలు.
ఓపిగ్గా చదివి సూచనలు ఇచ్చినందుకు: సుజాత, సాంత్వన, మాలతి గార్లకి, గంగ కి ధన్యవాదాలు.
వాళ్ళ పత్రికలో వేసుకుని, నాకు ఓపిగ్గా సూచనలు ఇచ్చి, మళ్ళీ వాళ్ళ ఎడిట్లకి నా ఎడిట్ల గురించి పలు చర్చలు పెట్టి, ఇరు పక్షాలు సంతృప్తి చెందేదాకా ఓపిగ్గా ఈమెయిల్స్ నడిపినందుకు, మొత్తానికి ఈ తెలుగు కథ ని ఆంగ్ల పాఠకులకి అందేలా చేసినందుకు అవుటాఫ్ప్రింటు వారికి కూడా ధన్యవాదాలు.
Leave a Reply