జాల ప్రలాపం, దాని ప్రయోజనం

ఆన్లైన్ రాంటింగ్ కి జాలప్రలాపం అని తెలుగు పేరు పెట్టాను. ఇది తుచుగా చూస్తూనే ఉంటాము. జాలప్రలాపం పలురకాలు. ఇందులోనూ మర్యాద తప్పని వారు కొందరు. కోపంలో లక్ష అంటాం – ఎవరైనా, మీకు ఆ గొడవకి సంబంధం ఉన్నా, లేకపోయినా పడాల్సిందే అన్నట్లు రాసే/కూసే వారు కొందరు. మనం (నేనూ చేస్తూ ఉంటా బైదవే..అప్పుడపుడు) ఎందుకిలా ప్రవర్తిస్తాము? అసలు ఇలా ముక్కూమొహం తెలీని వాళ్ళమీద విరుచుకుపడి అదేదో ఈ మానవపురుగలకంటే నేన్నయం అనుకోడం వల్ల ప్రయోజనం ఏమిటి?భారీగా టైటిల్, ఉపోద్ఘాతం పెట్టాను. సందర్భం ఏమిటో? అనిపించవచ్చు. “Relax: A Guide to Everyday Health Decisions with More Facts and Less Worry” (by Timothy Caulfield) అని ఒక పుస్తకం చదివాను గత వారం. ఈ విషయం మీద ఒక అధ్యాయం ఉంది. అందులోంచి నాకు ముఖ్యమైన విషయాలు అనిపించిన దానిని ఇక్కడ రాస్కుంటున్నా.

రాంట్ అన్నది మన జీవితంలో ఒక భాగం. ఏదన్నా బాధ/కోపం వంటివి బలంగా కలిగినపుడు అది అలా బైటకి కక్కేస్తే మనకు తెరిపి కలుగుతుందని మనం అనుకుంటాం, అంతా చెబుతూంటారు కూడా. అలా వెళ్ళగక్కకుండా మనసులోనే ఉంచేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని కూడా అంటారు. సినిమాల్లో, నవల్లో ఇలాగ ప్రధాన పాత్రలు గట్టిగా అరుస్తూ విరుచుకుపడే సందర్భాలు కోకొల్లలు. అయితే, సోషల్మీడియా లో ఇదొక వేరే లెవెల్ కి పోయిందనిపిస్తుంది. ముక్కూమొహం తెలీని అందరితోనూ గోడు వెళ్ళబోసుకోవచ్చు. ఏ బ్యాంకో, ఇన్స్యూరన్స్ కంపనీ నో, సినిమానో, పుస్తకమో, ప్రభుత్వమో, సిద్ధాంతమో – ఒకటని లేదు. అన్నింటి గురించీ నోటికొచ్చింది కూసుకోవచ్చు మనం. మరి మన సోషల్ మీడియా కుటుంబాన్ని బట్టి ఇవన్నీ నచ్చి ప్రోత్సహించేవారూ ఉండొచ్చును. “Anger is more influential than joy” అని ఏదో పరిశోధనలో తేలిందట. ఎంత నెగటివ్ పోస్టులు పెడితే అంత తొందరగా పేరొస్తుందనమాట. అందువల్లనే కాబోలు అందరినీ తిడుతూ ఉండే మీడియా పర్సనాలిటీలకి ఫాలోయింగ్ ఎక్కువ. పాజిటివ్ గా రాస్తే అబ్బే, ఎవరు చదువుతారండీ? ఎవడిక్కావాలి?

ఇపుడు ప్రశ్న ఏమిటంటే -మరి అందరూ అన్నట్లు నిజంగానే ఇట్లాంటి జాలప్రేలాపన మన మానసికారోగ్యానికి మంచిదా? ఇలా పబ్లీకున అరిచాక మనశ్శాంతి లభిస్తుందా? ఈ రచయిత లేదంటాడు.

ఇట్లా గట్టిగా అరవడమో, లేకపోతే మనసులో ఉన్నదంతా తిట్టుకుంటూ వెళ్ళగక్కడం (ఈకాలంలోనైతే ఫేస్బుక్/ట్విట్టర్ వంటి చోట్ల పోస్టులు పెట్టడమో) మానసిక ఆరోగ్యానికి మంచిదన్న వాదన సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గర మొదలయిందంట. ఇలా ఈ లోపలున్న ఉద్వేగాలు బైటికి కక్కకపోతే మన మానసికారోగ్యానికి మంచిది కాదన్న సిద్ధాంతాలు అన్నీ దాదాపు ఈయన పరిశీలనపై ఆధారపడినవే. ఈయన పరిశీలనకి అంత పరిశోధనాత్మక్ ఆధారాలు లేవంటారు. అయినా మరి ఈయన రచనల ప్రభావం నేటికీ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంతకీ నిజంగా మన కోపాన్నో, బాధనో అంతా గట్టిగా పైకి వెళ్ళగక్కడం మన శారీరక/మానసికారోగ్యానికి మంచిదేనా? అంటే అలా అని నిరూపించడానికి ఆధారాల్లేవంటాడు ఈయన. పైపెచ్చు దీని వల్ల మనం మరింత కోపం, ద్వేషం వంటివి పెంచుకుంటూ పోతామంట.

“Venting anger is like using gasoline to put out a fire. It only feeds the fame by keeping aggressive thoughts active in memory and by keeping angry feelings alive” అంటాడొక ప్రొఫెసర్. జాలప్రలాపం గురించి చేసిన పరిశోధనల్లో తేలినది ఏమిటంటే – ఇది తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది కానీ దీర్ఘకాలంలో మనకి చేసే మేలుకన్నా హానే ఎక్కువ (జంక్ ఫుడ్ లాగా అనమాట). కోపం అన్నది సరిగ్గా ఉపయోగిస్తే ఆరోగ్యకరమైనదే కానీ జాలప్రలాపం సరైన పద్ధతి కాదన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. జాలప్రలాపం మన మానసికారోగ్యానికి మేలు చేయకపోగా కీడు తలపెట్టే అవకాశం ఉందంట. ఆ యొక్క కోపద్వేషాలు పతాకస్థాయిలో ఉండగా సోషల్ మీడియా చర్చల్లో హోరాహోరీ అరుచుకోడం వంటివి గుండెనొప్పి వచ్చే అవకాశాలు కూడా పెంచుతాయంట. ఇవన్నీ కాక వేరే సాంఘిక పరిణామాలు ఉంటాయి కదా – మనం జాబ్ ఇంటర్యూలకి వెళ్ళెవేళల ఇలాంటి పబ్లిక్ ప్రొఫైల్స్ కూడా చూస్తున్నారంట కొందరు. రేపొద్దున ఏదన్నా సందర్భంలో ఐదేళ్ళ క్రితం మీరు కూసిన కూతలు అంటూ ఏవో స్క్రీన్ షాట్ ఎవరో తీసినా ఆశ్చర్యం లేదు. కనుక, జాలప్రలాపం డేంజెరస్ అన్నది సారాంశం.

మరట్లైతే ఎట్లాగండి? ఏదో ఒకటి చేయాలి కదా నిజంగా మనకి ఆ స్థాయిలో “నెగటివ్ ఎమోషన్” ఉన్నపుడు? అలాగే ఈ ఉద్వేగాలని లోపలే ఉంచి కుమిలిపోడమో, రగిలిపోడమో, లేదంటే ఇట్లా సోషల్ మీడియా లో కక్కేయడం – ఈ రెండూ కాకుండా వేరే ఏదన్నా మార్గం ఉందా? అని అన్వేషించాలి. కీబోర్డుకి కాసేపు దూరంగా జరగడం … కొంచెం మన హాబీల వైపుకి కాసేపు పోయిరావడం. ఇవన్నీ కాకపోతే … మర్యాదకరంగా మన వాదన బలంగా చెప్పడం (polite assertion), ఏదన్నా పత్రిక్కి వ్యాసం రాసి పంపడం- ఇలాంటివి ఉత్తమం అంటాడు రచయిత. ప్రైవేటుగా ఓపికగల, దయగల ఏ స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో చర్చించవచ్చు అదో పద్ధతి నాకు తట్టినది.. మరివి తత్కాల ఉపశమనాన్ని ఇవ్వవు గదా? అంటే దీర్ఘకాలంలో ఈ పద్ధతే మంచిదని తేల్చాడు ఈయన.

“The notion that we are these human pressure cookers that walk around building up steam until we blow – unless we let a little out – sounds like it would make some sense. In the end, though, it just isn’t true” – పుస్తకంలోని ఒక కోట్. హమ్మయ్యా, అది చదివాక నా మనసు శాంతించింది. ఎంత వాదించుకున్నా సమాజ మర్యాదని దాటి జాలప్రలాపాలు చేసి ముక్కూమొహం తెలీని వారిని నోటికొచ్చింది కూసిన అనుభవం నాకు లేదు. బహుశా అట్లా కూస్తేనే మన గొంతుక వినిపడుతుందేమో? లేకపోతే ఎవరూ పట్టించుకోరేమో అన్న సందేహం కలిగిన రోజులు లేకపోలేదు. అందువల్ల, పుస్తకంలో ఇది ఉపయోగకరమైన చాఫ్టర్ అనిపించి ఇలా సారాంశం రాసుకున్నా. చివరి ఛాప్టర్ కూడా చాలా ఉపయోగకరం. అది మరో రోజు.

Published in: on January 9, 2022 at 1:20 pm  Leave a Comment  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2022/01/09/onlineranting/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: