అభిమాని – అనువాద కథ


(ఇది నేను 2007 సెప్టెంబరు లో “ప్రజాకళ” తెలుగు వెబ్ పత్రికకి చేసిన అనువాదం. ఈ పత్రిక ఇప్పుడు లేదు. కనుక ఈ కథా అంతర్జాలంలో కనబడ్దం లేదు. ఆమధ్య పాతవన్నీ తవ్వుతూ ఉంటే ఇవి కూడా కనబడ్డాయి. సరే, ఎపుడైనా బ్లాగులో పెడదాం అనుకున్నాను. వీటికి అనుమతులు తీసుకోలేదు కనుక ఇపుడు కొత్తగా ఎవరికీ పంపకుండా, అప్పట్లో అలాంటి విషయాలు ఆలోచించకుండా చేసిన పనికి నేనే బాధ్యత తీసుకుంటున్నా బ్లాగులో పెట్టుకుని. నా వద్ద ఉన్న డ్రాఫ్ట్ యథాతథంగా షేర్ చేస్తున్నాను. టైపోలు కూడా సరిచెయ్యడం లేదు. వీలు చిక్కినపుడు చేస్తాను!).

“The Admirer” ఈ కథ పేరు. సత్యజిత్ రాయ్ దీన్ని బెంగాలీ భాషలో 1974లో రాయగా గోపా మజుందార్ ఆంగ్లంలోకి అనువదించారు. నేను ఆ‌ ఆంగ్ల కథని తెలుగులోకి అనువదించాను.


పదకొండేళ్ళ తరువాత అరూప్ బాబు అనబడు అరూప్ రతన్ సర్కార్ మళ్ళీ పూరీ నగరాన్ని సందర్శిస్తున్నాడు. నగరం లో ఈ పదకొండేళ్ళలో చెప్పుకోదగ్గ మార్పులే జరిగినట్లు గమనించాడు – కొన్ని కొత్త ఇళ్ళు, కొత్త రోడ్లు, కొత్త హోటెళ్ళు – చిన్నవీ, పెద్దవీనూ. కానీ, బీచ్ లోకి అడుగుపెట్టిన మరుక్షణం అతనికి అర్థమైంది ఈ నగరం లో ఎప్పటికీ మారనిది ఒకటుందని.

అరూప్ దిగిన సాగరిక హోటెల్ నుండి సముద్రం కనబడదు. కానీ, రాత్రి వేళల్లో ఆ హోటెల్ అంతా నిద్రావస్థలోకి జారుకున్నాక అలల సవ్వడి చెవిన బడ్డం చాలా తేలిక. నిన్నరాత్రి సముద్రం చేసిన ఈ శబ్దాలే అరూప్ బాబు ని హోటెల్ నుండి బయటపడి బీచ్ కి వచ్చేలా చేసాయి. అతను పూరి కి ఆరోజు ఉదయమే వచ్చాడు కానీ ఏదో షాపింగని తిరగడం తో బీచ్ కి వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు తెల్లగా నురగలు గక్కుతున్న అలలని చీకటి కమ్మిన అమావాస్య రాత్రిలో  కూడా చూడగలుగుతున్నాడు. అతనికి సముద్రపు నీటిలో ఫాస్పరస్ ఉంటుందనీ, అందువల్లే ఆ అలలు చీకట్లో కూడా కనిపిస్తాయని ఎక్కడో చదివిన విషయం గుర్తు వచ్చింది. “ఇలా ప్రకాశిస్తున్న భావగర్భితమైన ఈ అలలు ఎంత అందంగా ఉన్నాయో కదా” అనుకున్నాడు. కలకత్తా లో అతడిని సృజనాత్మకత గల మనిషంటే ఎవరూ ఒప్పుకోరేమో. పర్వాలేదు. అరూప్ బాబు కి తెలుసు – అంతర్గతంగా తనలో ఉన్న కొన్ని సున్నితమైన భావాలు సగటు మనిషి కంటే తాను వేరు అన్న విషయం చెప్తాయి అని. ఈ సున్నితత్వాన్ని రకరకాల ఒత్తిళ్ళతో కూడిన దైనందిన జీవితం పాడుచేయకుండా అతడు జాగ్రత్తపడ్డాడు, అప్పుడప్పుడూ కలకత్తాలో నది ఒడ్డుకో, ఈడెన్ ఉద్యానవనానికో వెళుతూ ఉండటం ద్వారా ఇది సాధ్యమైంది. నదీ తరంగాలు, పచ్చదనం, పూల వనం – ఇవన్నీ అతనికి ఇప్పటికి కూడా ఓ ఆనందాన్ని ఇస్తాయి. ఈ ఆలోచనల్లో అతనుండగా, ఇంతలో ఓ పక్షి కూత అతని మదిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది – అది .. కోకిలా? మరింకేదన్నానా?  ఏదేమైనా, కాసేపు ఇక్కడ ఇలా ఈ అలలను చూడటం అతనికి పదహారేళ్ళ ఉద్యోగజీవితం కలిగించిన అలసట నుండి కొంతవరకూ ఉపశమనం కలిగించింది.

ఈరోజు సాయంత్రం అతడు మళ్ళీ బీచ్ కి వచ్చాడు. అలల వెంబడి నడుస్తూ నడుస్తూ ఓ చోట ఆగాడు. ఎదురుగా కాషాయ వస్త్రధారి ఒకరు అమితమైన వేగం తో నడిచి వెళ్ళిపోతూ ఉంటే అతని వేగాన్ని అంగిపుచ్చుకోలేక అతని శిష్యగణం అతని వెనుక పరుగెడుతున్నారు. అది అరూప్ బాబు కి ఎందుకో గానీ నవ్వు తెప్పించింది. ఇంతలో అతని వెనుక నుండి ఓ చిన్న పిల్లవాడి గొంతుక వినబడ్డది.

“little boy’s dream” పుస్తకం రాసింది మీరే కదూ? – ఆ గొంతుక అరూప్ బాబు ని ప్రశ్నించింది. అరూప్ బాబు వెనక్కి తిరిగాడు. తెల్ల చొక్కా, నీలం నిక్కరూ వేసుకున్న సుమారు ఏడేళ్ళ వయసున్న బాలుడు కనిపించాడు. వాడి మోచేతుల దాకా మట్టి అంటుకుని ఉంది. ఇంతింత కళ్ళతో ఆశ్చర్యంగా తన వైపే చూస్తున్నాడు. అరూప్ బాబు జవాబిచ్చేలోపలే ఆ అబ్బాయి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు – “నేను little boy’s dream చదివాను. అది మా నాన్న నాకు పుట్టినరోజు కానుకగా ఇచ్చారు. నేను…. నేను…”

“చెప్పు, పర్వాలేదు. సిగ్గుపడకు.” – ఈసారి ఇది ఓ ఆడ గొంతుక, ఆ పిల్లాడిని ప్రోత్సహిస్తున్నట్లు అనిపించింది. వెంటనే ఆ కుర్రాడు అందుకున్నాడు..

“నాకు మీ పుస్తకం చాలా నచ్చింది.”

అరూప్ బాబు ఓ సారి ఆవిడ వైపు చూసాడు. దాదాపు ముప్ఫై ఏళ్ళు ఉంటాయేమో. అందంగానే ఉంది అనుకున్నాడు. ఆమె అరూప్ బాబు వైపు సూటిగా చూస్తూ, నవ్వుతూ నెమ్మదిగా అతన్ని సమీపించింది. అరూప్ బాబు ఆ అబ్బాయి తో –

“లేదబ్బాయ్, నేను ఏ పుస్తకమూ రాయలేదు. నువ్వు పొరబడ్డావు” అన్నాడు.

ఆవిడ ఆ పిల్లవాడి తల్లి అనడం లో సందేహం లేదు. వాళ్ళిద్దరి రూపురేఖల్లో పోలికలు కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా చబుకం దగ్గర.అరూప్ బాబు మాటలు విన్నాక కూడా ఆవిడ చిరునవ్వు చెరగలేదు. నిజానికి, చేరువయ్యేకొద్దీ ఆ చిరునవ్వు మరింత పెద్దదైంది. అతనితో –  “మీకు ఇలా జనాలను కలవడం అంటే ఇష్టం లేదని మాకు తెలుసు. మా మరిది ఓ సారి మీకు వాళ్ళ ఫంక్షనుకొకదానికి ముఖ్య అతిథిగా రమ్మని ఉత్తరం రాస్తే మీకు అలాంటి విషయాల మీద అసలు ఆసక్తి లేదు అని జవాబిచ్చారు. కానీ, ఈ సారి మీరు తప్పించుకోలేరు. మాకందరికీ మీ కథలు అంటే ఇష్టం. మీరు పిల్లలకోసం రాసిన కథల్ని పెద్దవాళ్ళం మేము కూడా బాగా ఇష్టపడతాము” అంది. అరూప్ బాబు కి ఓ పట్టాన ఆ little boy’s dream రాసిందెవరో తెలీడం లేదు కానీ, ఆ పిల్లవాడికి, వాడి తల్లికీ ఇద్దరికీ ఆ రచయిత అంటే సమానమైన అభిమానం ఉందని మాత్రం తెలుస్తూనే ఉంది. ఇలాంటి వింత పరిస్థితి తనకు కలుగుతుందని ఎవరు కలగన్నారు? వీళ్ళకి వాళ్ళు పొరబడ్డారు అని చెప్పి తీరాలి. కానీ, వాళ్ళను బాధపెట్టకుండా, వాళ్ళ మనసుకు కష్టం కలిగించకుండా చెప్పాలి.

అరూప్ బాబు కి ఉన్న సమస్య ఏమిటంటే అతను మరీ మెతక మనిషి.  ఓ సారి వాళ్ళ చాకలి గంగాచరణ్ అతని కొత్త కుర్తా పైన ఓ చిల్లు చేసాడు. మరొకరయ్యుంటే గంగాచరణ్ గూబ గుయ్యిమనిపించేవారేమో. కానీ, దీనంగా చూస్తున్న గంగాచరణ్ మొహం చూడగానే అరూప్ బాబు కరిగిపోయాడు. “చూడు, ఇక నుంచైనా కాస్త జాగ్రత్త గా ఉండు” – అని మాత్రం అనగలిగాడు. ఈ సున్నితమైన మనస్తత్వమే ఇప్పుడు అతని చేత ఆ తల్లీబిడ్డలతో మృదువుగా – “నేనే ఆ రచయిత ను అని మీరు ఎలా చెప్పగలరు?” అనిపించింది. ఈ మాటలతో ఆవిడ ఆశ్చర్యంతో కనుబొమలెగరేసి – “ఈ మధ్యనే కదా మీ ఫొటో పేపర్ లో వచ్చింది? ఓ సాయంత్రం మీకు పిల్లల సాహిత్యానికి చేసిన సేవకు గుర్తింపుగా అకాడెమీ అవార్డు వచ్చిందన్న వార్త రేడియో లో విన్నాము. తరువాతి రోజే మీ ఫొటో పేపర్ లో వచ్చింది. ఇప్పుడు అమలేశ్ మౌలిక్ అన్న పేరు తెలిసిన వాళ్ళు మేము ఇద్దరం మాత్రమే కాదు. చాలా మంది ఉన్నారు.

అమలేశ్ మౌలిక్! అరూప్ బాబు కూడా ఈ పేరు విన్నాడు, కానీ ఫొటో ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ తాను ఆ మనిషి లాగా ఉన్నాడా? కానీ, పేపర్లలో వేసే ఫొటోలు అంత స్పష్టంగా కనబడవు లే – అనుకున్నాడు.

“మీరు వస్తున్నారన్న విషయం ఇక్కడ ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది.” ఆవిడ మాట్లాడుతూనే ఉంది ఇంకా. “మేము మొన్నోరోజు సీ వ్యూ హోటెల్ కి వెళ్ళాము. నిన్నటిదాకా అక్కడ మా వారి స్నేహితులొకరు ఉండేవారు. ఆయనతో ఆ హోటెల్ మేనేజర్ చెప్పాడట మీరు గురువారం వస్తారు అని. మీరు సీ వ్యూ లో ఉంటున్నారా?”

“అ….లేదు..నేను…నేను అక్కడ ఆహారం అంత బాగుండదు అని విన్నాను.”

“అది నిజమే. మేము కూడా అనుకున్నాము – మీరెందుకు ఆ హోటెల్ ఎంచుకున్నారా? దానికంటే బాగుండేవి చాలా ఉన్నాయి. ఇంతకీ ఇప్పుడు ఏ హోటెల్ లో ఉందామని నిర్ణయించుకున్నారు?”

“నేను .. సాగరిక లో ఉంటున్నాను.”

“ఓహో…అది కొత్త హోటెల్ కదూ? ఎలా ఉంది?”

“నాకైతే పర్వాలేదు అనిపిస్తుంది. అయినా ఇక్కడేమీ రోజులతరబడి ఉండబోవడం లేదు కదా.”

“ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడ?”

“ఓ అయిదు రోజులు”

“అయితే మీరోసారి మా హోటెల్ కి రావాలి. మేం ఉండేది పూరీ హోటెల్. మిమ్మల్ని కలవడం కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో మీరు ఊహించలేరు..ముఖ్యంగా పిల్లలు. అరే…మీ పాదాలు తడిసిపోతున్నాయి…చూసుకోండి.”

ఓ పెద్ద అల తన పాదాల వైపు కి ఉరకలేస్తూ రావడం అరూప్ బాబు గమనించలేదు. కానీ, ఒక్క కాళ్ళు మాత్రమే కాదు తడిసింది… అంత గాలిలో కూడా తన శరీరమంతా చెమటతో ముద్దౌతోంది అన్న విషయం గమనించాడు. అయినా, ఆవిడ అన్ని మాట్లాడుతూ ఉంటే అడ్డు చెప్పి అసలు విషయం చెప్పే అవకాశం ఎలా జారవిడుచుకున్నాడు తను? ఇప్పడిక చాలా ఆలస్యమైపోయింది. ప్రస్తుతానికి ఇక్కడినుండి వెళ్ళిపోయి, కాసేపు ఎక్కడన్నా ఏకాంతంగా కూర్చుని ప్రశాంతంగా ఆలోచించుకోవాలి తన ఈ చర్య కు పర్యవసానం ఏమిటో అన్న విషయాన్ని – అనుకుంటూ ఆవిడ తో ఇలా అన్నాడు :

“నేను…ఇక…బయలుదేరనా?”

“మీరు మళ్ళీ కొత్తది ఏదన్నా రాస్తున్నారు అనుకుంటా?”

“లేదు,లేదు. నేను సెలవు లో ఉన్నాను. రాయడం లేదు.”

“ఆహా! సరే అయితే. మళ్ళీ కలుద్దాం. మా వారికి మీ గురించి చెబుతాను. రేపొస్తారా ఈ వైపు మళ్ళీ?”

అరూప్ బాబు ఏదో గొణిగి బయట పడ్డాడు.

అరూప్ బాబు అక్కడికి చేరే సమయానికి సీ వ్యూ హోటెల్ మేనేజర్ వివేక్ రాయ్ అప్పుడే ఓ పెద్ద పాన్ నోట్లోకి వేసుకుంటూ ఉన్నాడు. అరూపబాబు అతనితో –

“అమలేశ్ మౌలిక్ ఇక్కడికి వస్తున్నారా?”

“ఊ”

“ఎప్పుడు…వస్తారని…అనుకుంటున్నారు?”

“మంగళవారం. ఏం?”

ఈరోజు గురువారం. అరూప్ బాబు మంగళవారం దాకా ఆ ఊరిలో ఉంటాడు. మౌలిక్ టెలిగ్రామ్ పంపాడు అంటే అతను చివరి నిముషం లో అతని రాక ను వాయిదా వేసుకున్నాడనే అర్థం. మేనేజర్ కూడా అతను అసలుకైతే ఈరోజు రావాల్సి ఉన్నదని చెప్పాడు. వివేక్ రాయ్ అడిగిన – “ఏం?” కి జవాబు గా తనకి మౌలిక్ తో ఏదో పనుందని, మంగళవారం వచ్చి కలుస్తా అని చెప్పి బయటపడ్డాడు అరూప్ బాబు.

అక్కడి నుండి సరాసరి మార్కెట్ కి వెళ్ళి ఓ పుస్తకాల షాపుని వెదుక్కున్నాడు. అక్కడ అమలేశ్ మౌలిక్ రాసిన నాలుగు పుస్తకాలను కొన్నాడు. “లిటిల్ బాయ్స్ డ్రీమ్” మాత్రం కనబడలేదు. కొన్న నాల్గింటిలో రెండు నవల్లు, మిగితా రెండు చిన్న కథల సంకలనాలు.

సాయంత్రం ఆరున్నర అవుతూ ఉండగా అరూప్ బాబు తన హోటెల్ చేరుకున్నాడు. హోటెల్ ప్రవేశ ద్వారం వద్ద ఓ హాలు ఉంది. హాలుకి ఎడమవైపు మేనేజరు కుడివైపు ఓ బెంచి, కొన్ని కుర్చీలు వేసి ఉన్నాయి. వాటిపై ఇద్దరు పెద్దవాళ్ళు, పది సంవత్సరాలు దాటని ముగ్గురు పిల్లలూ కూర్చుని ఉన్నారు. పిల్లల్లో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అరూప్ బాబు రాగానే ఆ పెద్దవాళిద్దరూ లేచి చేతులు జోడించి నమస్కారం చెప్పారు. వాళ్ళ పిల్లలని చూసి సైగ చేయగానే ఆ ముగ్గురు పిల్లలూ సిగ్గుపడుతూ అరూప్ బాబు ను సమీపించి అతను నిలువరించేలోపే అతని కాళ్ళకు నమస్కారం చేసారు.

“మేము పూరి హోటెల్ నుండి వస్తున్నాం” – ఆ పెద్దవాళ్ళలో ఒకాయన అన్నాడు. “నా పేరు సుహ్రిద్ సేన్. ఇతను గంగూలీ.” – పరిచయం చేసుకున్నాడు అతను. “మిమ్మల్ని కలిసానని, మీరిక్కడ ఉంటున్నారని మాకు మిసెస్ ఘోష్ చెప్పారు..” అన్నాడు మళ్ళీ.

“ఇంకా నయం, ఆ పుస్తకాల షాపు వాడు ఓ కవర్ లో పెట్టిచ్చాడు పుస్తకాలను. లేకుంటే తన పుస్తకాలను తానే కొనుక్కుంటున్న రచయిత గురించి వీళ్ళు ఏమనుకునేవాళ్ళో!” అనుకున్నాడు అరూప్ బాబు.

అతను వాళ్ళన్న ప్రతి మాటకీ తలూపడం మొదలుపెట్టాడు, ఇక తన పొరపాటు ని కప్పిపుచ్చే మార్గం లేదని అర్థమై.  “చూడండి, ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఆ అమలేశ్ మౌలిక్ ఫొటో నేను చూడలేదు. కానీ, బహుశా అతను కూడా కాస్త నాలాగే ఉంటాడేమో. అతనిక్కూడా సన్నని మీసాలు, రింగుల జుట్టూ ఉన్నాయేమో. అతనూ కళ్ళజోడు వాడతాడు ఏమో. అతను కూడా పూరీ కి వద్దామనుకున్న విషయం నిజమే కావొచ్చు. కానీ, నేనా మనిషి ని కాను. నేను పిల్లల కోసం కథలు రాయను…అసలు నేను రాయనే రాయను. నేను ఓ ఇన్సూరన్స్ కంపెనీ ఉద్యోగిని. ఏదో సెలవులు గడుపుదాం అని ఇక్కడికి వచ్చాను. నన్ను ఒంటరిగా వదిలెయ్యండి. ఆ అమలేశ్ మౌలిక్ మంగళవారం వస్తాడు. కావాలంటే సీ వ్యూ కి వెళ్ళి ధృవపరుచుకోండి ఈ విషయం.” – అని అరూప్ బాబు ఓ సారి చెబితే చాలు. కానీ,ఈ తరహా ఉపన్యాసం పనికొస్తుందా? వీళ్ళు తానే అమలేశ్ మౌలిక్ అన్న పూర్తి నమ్మకంతో ఉన్నారు. తాను స్వయంగా చెప్పినప్పుడే నమ్మలేదు నిన్న. ఇప్పుడు సీవ్యూ లో ఉన్న ఆ టెలిగ్రామ్ మాత్రం నమ్మించగలదా వీళ్ళని? వాళ్ళు అది కూడా వాళ్ళని పంపేయడానికి తాను ఆడిన నాటకం అనుకోవచ్చు. అసలీ సాగరిక లో తాను మారుపేరు తో దిగి వాళ్ళని దారి మళ్ళించడానికి సీవ్యూ కి టెలిగ్రామ్ పంపానని అనుకున్నా ఆశ్చర్యం లేదు. పైగా, ఈ పిల్లలు ఉన్నారు. వాళ్ళ మొహాలు ఒక్క సారి చూడగానే అరూప్ బాబు ఈ తతంగమంతా పొరపాటు అని చెప్పబోయిన వాడల్లా ఆగిపోయాడు. వాళ్ళు ముగ్గురూ ఎంతో ఆరాధనా భావం తో చూస్తున్నారు తనని. ఇప్పుడిలా చెబితే వాళ్ళ ఉత్సాహమంతా నీరుగారిపోతుంది.

“బాబున్, నువ్వు అమలేశ్ బాబు ని ఏమన్నా అడగాలనుకుంటే అడుగు” – సుహ్రిద్ సేన్ ఆ పిల్లల్లో పెద్దబ్బాయిని చూస్తూ అన్నాడు.

ఇక వెనుదిరిగే మార్గం లేదు. ఆ బాబున్ అనే కుర్రాడు తల ఒక వైపు కి ఆన్చి తన వైపే చూస్తున్నాడు చేతులు కట్టుకుని – ప్రశ్న అడగడానికి రెడీగా.

“ఆ చిన్న పిల్లవాడిని నిద్రపుచ్చిన ముసలాయన …ఆయనకి మ్యాజిక్ తెలుసా?”

ఈ కీలకమైన క్షణం లో తన బుర్ర మునుపటి కంటే బాగా పనిచేస్తోందని గ్రహించాడు అరూప్ బాబు. కాస్త వంగి బాబున్ చెవిలో – “ఊ, నువ్వేమనుకుంటున్నావ్?” అని అడిగాడు.

“అతనికి మ్యాజిక్ తెలుసు అనుకుంటున్నాను.” – ఇది విన్న తక్కిన ఇద్దరి పిల్లలూ – “అవును, అవును – అతనికి మ్యాజిక్ తెలుసు. మేమందరం తెలుసని అనుకుంటున్నాం” అన్నారు.

“నిజం” అరూప్ బాబు పైకి లేస్తూ అన్నాడు – “మీరు ఏది నిజం అనుకుంటే అదే నిజం. నేను ఏది రాయాల్సి ఉందో అదే రాసాను. దానికి అర్థమేమిటో తెలుసుకోవాల్సింది మీరు. మీరు ఏది సరి అయినది అనుకుంటున్నారో అదే నిజం. మిగితావన్నీ మనకనవసరం.” అన్నాడు. పిల్లలు ముగ్గురికీ ఈ జవాబు నచ్చినట్లు అనిపించింది. హాలు నుండి వెళ్ళిపోయేముందు సుహ్రిద్ సేన్ అరూప్ బాబు ని తరువాతి రాత్రి భోజనానికి ఆహ్వానించాడు. ఆ హోటెల్లో ఎనిమిది బెంగాలీ కుటుంబాలు ఉంటున్నాయి. ఈ గుంపు లో అమరేశ్ మౌలిక్ అభిమానులు అయిన పిల్లలు సుమారుగా ఉన్నారు. తాను తాత్కాలికంగా అయినా అమరేశ్ మౌలిక్ గా నటించక తప్పదని అర్థమైన అరూప్ బాబు దీనికి అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడిక పర్యవసానాల గురించి దిగులు పడి ప్రయోజనం లేదు. కానీ, అరూప్ బాబు ఒక్క విషయం మీద మాత్రం పట్టుదలగా ఉండాలి అనుకున్నాడు. అందుకని –

“చూడండి, నాకు ఈ హంగామా అంతగా ఇష్టం లేదు. జనం తో కలవడం నాకు అలవాటు లేదు. కనుక, దయచేసి ఈ విషయానికి ప్రచారం కల్పించవద్దని నా మనవి” అన్నాడు సేన్ తో.

రేపటి రాత్రి తర్వాత అతన్ని ఎవరూ ఇబ్బంది పెట్టరని సేన్ హామీ ఇచ్చాడు. మిగితా వారికి కూడా అతని ని(మౌలిక్ గా చెలామణి అవుతున్న అరూప్ బాబు ని) ఒంటరిగా వదిలెయ్యమని చెప్తానన్నాడు.

తరువాత, అరూప్ బాబు భోజనం త్వరగా చేసేసి హబూస్ ట్రిక్స్ అన్న మౌలిక్ పుస్తకం చేతుల్లోకి తీసుకుని నిద్రకుపక్రమించాడు. మిగితా మూడు పుస్తకాలు – తుతుల్స్ అడ్వెంచర్, చెక్‍మేట్, స్పార్క్లర్స్. ఈ చివరి రెండూ చిన్న కథల సంకలనాలు. అరూప్ బాబు సాహిత్యాన్ని మధించిన మేధావేమీ కాదు. కానీ, తన స్కూలు రోజుల్లో ఎందరో భారతీయ, విదేశీ రచయిత లు రాసిన పిల్లల సాహిత్యం బాగానే చదివాడు. అవి చదివి దాదాపు ముప్ఫై తొమ్మిదేళ్ళు అవుతున్నా కూడా తనకు ఇంకా అప్పటి కథలు గుర్తు ఉన్నాయన్న విషయం తలుచుకుని అతనికి ఆశ్చర్యం కలిగింది. అంతే కాదు, అమలేశ్ మౌలిక్ కథల్లో చాలా వాటి వస్తువుకో, కథనానికో తాను స్కూలు కుర్రాడిగా చదివిన కథలతో పోలికలు ఉన్నట్లు గమనించాడు. ఈ నాలుగు పుస్తకాలు కలిపి ప్రింటులో ఓ 125 పేజీలు ఉండి ఉండొచ్చు. అరూప్ బాబు చివరి పుస్తకం పూర్తిచేసి లైటు తీసేసే సమయానికి ఆ హోటెల్ మొత్తం నిశబ్దంగా ఉంది. కొంత దూరం లో సముద్రం చేస్తున్న శబ్దాలు మాత్రం వినిపిస్తున్నాయి. “ఇప్పుడు టైమెంతయింది?” అరూప్ బాబు వాచీ అతని దిండు పక్కన పడి ఉండింది. అతను దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అది ఒకప్పుడు తన తండ్రిది. దానికి రేడియం డయల్ ఉన్నందువల్ల ఆ చీకట్లో నురగల అల లా మెరిసింది. అప్పుడు సమయం అర్థరాత్రి పన్నెండు గంటలా నలభై అయిదు నిముషాలు.

అమలేశ్ మౌలిక్ పిల్లల సాహిత్యం లో చాలా పేరున్న రచయిత. ఆ భాష సరళంగానూ, శైలి అనూహ్యంగా నూ ఉంది అన్న విషయం ఒప్పుకోవాల్సిందే. అతని పుస్తకాలు ఏకబిగిన చదవకుండా ఆగడం కష్టం. కానీ, వాటిలో కొత్తదనం తక్కువనే చెప్పాలి. ఇలాంటి కథలు స్నేహితుల దగ్గర వినే ఉంటారు. మనుష్యులకు రకరకాల అనుభవాలు ఎదురౌతూ ఉంటాయి. వింతగా అనిపించేవి, చాలా ఆసక్తికరమైన సంఘటనలు ఇలాంటివి ఎన్నో మనకే జరగొచ్చు కూడా. రచయిత చేయాల్సిందల్లా ఇలాంటి అనుభవాలను తీసుకుని దానికి కాస్త సృజనాత్మకత జోడించడమే. ఇంకోళ్ళ ఆలోచనలను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? అరూప్ బాబు కి మౌలిక్ మీద ఉన్న గౌరవం కాస్త తగ్గింది. కానీ, అదే సమయం లో కాస్త ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు ఈ ప్రఖ్యాత రచయిత గా నటించడం కాస్త తేలిక. రాత్రి  పూరీ హోటెల్లో డిన్నర్ తరువాత మౌలిక్ పట్ల అతని అభిమానులకున్న గౌరవం మరింత ఎక్కువైంది.  అరూప్ బాబు మధ్య దొరికిన సమయం లో The little boy’s dream ప్రతి ఒకటి సంపాదించగలిగాడు, వేరే షాపు నుండి. కనుక ఆ పదమూడు పిల్లలు అడిగే సవాలక్ష ప్రశ్నలకు జవాబివ్వడం అతనికి పెద్ద కష్టంగా అనిపించలేదు. పార్టీ ముగిసే సరికి పిల్లలంతా అరూప్ బాబు ని హనీలిక్ బాబు అని పిలవడం మొదలు పెట్టాడు. అరూప్ బాబు ’మౌ’ అన్న బెంగాలీ పదానికి హనీ అన్నది ఇంగ్లీషు అర్థం అని చెప్పడం దీనికి కారణం. ఈ కొత్త నామధేయం విన్న డాక్టర్ దాస్‍గుప్తా అన్న అతిథి అరూప్ బాబు తో – “మీరు తేనె ని సృష్టించారు, ఈ పిల్లలందరూ దాని రుచి చూస్తున్నారు” అన్నాడు. దానికి ఆయన భార్య సురంగమా దేవి – “కేవలం పిల్లలు మాత్రమేనా? పెద్దలని మరిచిపోకండి” అని జోడించింది.

ఈ పార్టీ తరువాత పిల్లలు అరూప్ బాబు ని కథ చెప్పమని అడిగారు. అరూప్ బాబు జవాబు గా తనకి అలా ఉన్నపళంగా కథలు చెప్పడం రాదనీ, కానీ ఓ చిన్నప్పటి సంఘటన గురించి చెప్తాను అన్నాడు.

అరూప్ బాబు కుటుంబం చిన్నప్పుడు బంచారాం అక్రూర్ దత్తా వీథి లో ఉండేవారు. అతనికి సుమారు అయిదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళింట్లో ఓ ఖరీదైన గడియారం కనిపించకుండా పోయింది. అతడి తండ్రి ఆ ఊళ్ళోని ఓ మంత్ర విద్య తెలిసిన వాడిగా పేరుపడ్డ పండితుణ్ణి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పండితుడు “ఆ దొంగని నేను ఇట్టే పట్టేస్తాను” అన్నాడు. తరువాత ఓ పెద్ద కత్తెర తీసుకుని దాన్ని పటకారు లా పట్టుకుని, ఓ వెదురు బుట్ట తీసుకుని వచ్చాడు. ఏవో మంత్రాలు జపించి, కాస్త బియ్యాన్ని ఆ బుట్టపై చల్లి, మొత్తానికి ఆ దొంగ మరెవరో కాదు… ఇంట్లో కొత్తగా చేరిన పనివాడు నటవర్ అని తేల్ఛాడు. అరూప్ బాబు మామ ఆ నటవర్ ను జుట్టు పట్టి లాక్కొచ్చి చితకబాదుతూ ఉన్నప్పుడు గడియారం మంచం పై కప్పిన దుప్పటి లోంచి జారి నేల మీద పడ్డది.

– ఈ కథ ముగియగానే పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. అరూప్ బాబు ఇక వెళదామని బయలుదేరాడు కానీ, “వద్దొద్దు. వెళ్ళకండి. కాసేపు ఉండండి” అంటూ ఆ పిల్లలందరూ అడగడంతో ఆగాల్సి వచ్చింది. సుమారు అరడజను మంది పిల్లలు వెంటనే అక్కడి నుండి వెళ్ళి వాళ్ళు కొన్న అమలేశ్ మౌలిక్ రాసిన ఏడు పుస్తకాలతో తిరిగొచ్చారు. “ఈ పుస్తకాలపై మాకోసం సంతకం చేసి పెట్టరూ?” అని అడిగారు. అరూప్ బాబు వారితో – “నాకు ఇలా పుస్తకాల పై సంతకం చేసే అలవాటు ఎప్పుడూ లేదు. ఓ పని చేస్తా… ఇవి తీసుకెళ్ళి ఒక్కో పుస్తకం పై ఒక్కో బొమ్మ వేసి ఇస్తాను. ఎల్లుండి సాయంత్రం  నాలుగున్నరకి వచ్చి ఇవి తీసుకెళ్ళండి.” అన్నాడు. పిల్లలు మళ్ళీ చప్పట్లు కొట్టారు. “అవునవును, బొమ్మ అయితే సంతకం కంటే ఎక్కువ” అన్నారు.

అరూప్ బాబు స్కూల్లో చిత్రలేఖనం లో ఓ సారి బహుమతి గెలుచుకున్నాడు. కానీ, అప్పట్నుంచి ఎప్పుడూ మళ్ళీ బొమ్మలు గీయలేదు. అయినా కూడా ప్రయత్నిస్తే ఈ పుస్తకాల పై చిన్న చిన్న బొమ్మలు గీసి ఇవ్వడం అసాధ్యమేమీ కాదు కదా! తరువాతి రోజు శనివారం. అరూప్ బాబు ఉదయాన్నే ఈ పుస్తకాలు, పెన్నూ తీసుకుని బయలుదేరాడు. నూలియా కాలనీ వద్ద బొమ్మలు గీయడానికి బోలెడు దృశ్యాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. దాదాపు గంట పట్టింది అతని పని పూర్తయ్యే సరికి. మొదటి పుస్తకం లో ఎండ్రకాయ బొమ్మ గీసాడు. రెండో దానిలో ఇసుక పై పక్కపక్కనే పడున్న మూడు గవ్వల బొమ్మ, తరువాత ఓ కాకుల గుంపూ, ఓ చేపలు పట్టే పడవ, ఒక నూలియా గుడిసె, ఒక నూలియా పిల్లవాడు, ఇక చివరగా పదునైన చివర్లు ఉన్న ఓ టోపీ వేసుకుని ఉన్న నూలియా మనిషి చేపల వల తయారు చేస్తున్న దృశ్యం గీసాడు. ఆ ఏడుగురు పిల్లలూ చెప్పినట్లు గానే నాలుగున్నరకే వచ్చేసారు ఆదివారం నాడు. ఈ బొమ్మలు వేసిన పుస్తకాలు తీసుకుని ఆనందంగా నవ్వుతూ, తుళ్ళుతూ వెళ్ళిపోయారు. ఆరోజు రాత్రి నిద్రకుపక్రమిస్తూ అరూప్ బాబు తన మదిలో కంగారు, అందోళన వంటి భావాల స్థానం లో ఓ విధమైన ఆనందం కలగడం గమనించాడు. అతను ఇప్పటిదాకా ఎవరితోనూ “నేను అమలేశ్ మౌలిక్ ని” అని ఎవరితో చెప్పలేదన్నది నిజమే. కానీ, గత మూడు రోజులుగా అతను చేసినదంతా ఓ పెద్ద మోసం కిందే లెక్క. ఎల్లుండి మంగళవారం అసలు మౌలిక్ రాబోతున్నాడు. ఇప్పటి దాకా ఈ పిల్లల దగ్గర్నుంచీ, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర్నుంచీ తాను పొందిన అభిమానం ఆదరణ అంతా అసలుకి అతని చెందాల్సినవి. మౌలిక్ బాగా రాస్తాడా లేదా అన్నది కాదు ప్రశ్న. అతను వీళ్ళ దృష్టి లో ఓ హీరో అన్న విషయం తెలుస్తూనే ఉంది. ఒకవేళ అతను వచ్చి, సీవ్యూ మేనేజర్ అతని రాక గురించి అందరికీ చెప్పడం మొదలుపెడితే ఏమౌతుంది? ఈ ఆలోచనే అరూప్ బాబు కి చాలా ఇబ్బందిగా అనిపించింది.

మరి…ఓ రోజు ముందుగా వెళ్ళిపోతేనో? లేదంటే మంగళవారం అంతా ఏం చేయాలి? ఎక్కడ దాక్కోవాలి? జనాలకి నిజం తెలిస్తే తనను చితగ్గొట్టరూ? ఇక మౌలిక్ గారు ఏమంటారో! ఆయన కూడా చెయ్యెత్తవచ్చు. రచయితలందరూ శాంతికాముకులనీ, అహింసావాదులని ఎవరు చెప్పగలరు? ఇలాంటి పనులకి జైలుపాలు అయ్యే అవకాశం ఉందా? ఉందేమో. ఏది ఏమైనా తాను చేసింది తప్పనడం లో ఎలాంటి సందేహం లేదు. అరూప్ బాబు లేచి నిద్రలేమి భయం తో ఓ నిద్ర మాత్ర మింగాడు. చివరికి, ఏమైనా మంగళవారం రాత్రి ట్రైన్ కే వెళదాం అని నిశ్చయించుకున్నాడు. అసలు మౌలిక్ ఎలా ఉంటాడో చూడాలన్న తాపత్రేయం భయాన్ని మించిపోయింది. ఎలాగోలా మౌలిక్ ఫొటో పడ్డ పేపర్ ను సంపాదించాడు. తాను అనుకున్నట్లే మౌలిక్ కు సన్నని మీసం, రింగుల జుట్టు, సన్న ఫ్రేముల కళ్ళజోడు ఉన్నాయి. కానీ, ఇక ఎంతవరకూ ఈ పోలికలు ఉన్నాయో తెలుసుకోవాలంటే మనిషి ని చూడాల్సిందే. ఆ పేపర్ లో ఉన్న బొమ్మ స్పష్టంగా లేదు. అరూప్ బాబు స్టేషన్ కి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. కేవలం మౌలిక్ ని చూట్టానికే కాదు..వీలైతే మాట్లాడ్డానికి. “మీరు అమలేశ్ మౌలిక్ కదూ? మీ ఫొటో చూసాను పేపర్లో ఆ మధ్య. మీ కథలను చదవడం నాకు ఇష్టం…” ఇలా ఏదో మాట్లాడేసి తరవాత తన సామాన్లంతా స్టేషన్ లో వదిలి తాను ఇంత వరకు చూడని కోణార్క్ కి వెళ్ళిపోయి అక్కడ సూర్య భగవానుని ఆలయం చూసుకుని తరువాత కలకత్తా రైలు సమయానికి స్టేషన్ చేరుకుందాం అనుకున్నాడు. అంతకంటే దాక్కోడానికి మార్గం లేదు మరి!

మంగళవారం నాడు పూరీ ఎక్స్ప్రెస్ ఇరవై నిముషాలు ఆలస్యంగా వచ్చింది. అరూప్ బాబు ఓ స్థంభం వెనక నిలబడి ట్రైన్ లోని ఫస్ట్ క్లాసు బోగీల్లోంచి దిగుతున్న ప్రయాణికుల పై ఓ కన్నేసి ఉంచాడు. షార్ట్స్ వేసుకున్న ఓ విదేశీయుడు దిగాడు మొదట. పక్క వైపు తలుపు దగ్గర్నుంచి ఓ ముసలావిడ, ఆవిడకి సాయం చేస్తూ ఓ తెల్ల ప్యాంటు వేసుకున్న యువకుడూ దిగారు. వీళ్ళ తరువాత ఓ ముసలాయన, తరువాత – అవును, సందేహం లేదు… ఇతనే అమలేశ్ మౌలిక్. తామిద్దరి మధ్య పోలికలు బాగానే ఉన్నాయి. కానీ, అరూప్ బాబు వెళ్ళి అతని పక్కన నిలబడితే వీళ్ళిద్దరూ కవలలు అనుకునేంత ప్రమాదమైతే లేదు. మౌలిక్ అరూప్ బాబు కంటే పొట్టిగానూ, రంగు కూడా తక్కువగానూ ఉన్నాడు. కాస్త పెద్దవాడిలా కూడా అనిపించాడు – చెవుల వద్ద జుట్టు కాస్త తెల్లబడింది. అరూప్ బాబు ఇంకా అంత పెద్దవాడు కాలేదు. అతను తన సూట్‍కేసు ట్రైన్ నుంచి తీసుకుని కూలీ కోసం అరిచాడు. కూలీ, అరూప్ బాబు ఇద్దరూ ఒకే సారి అతని వద్దకు వెళ్ళారు.

“మిస్టర్ మౌలిక్ అనుకుంటా?”

– అతను ఆశ్చర్యంగా చూసాడు. తరువాత అరూప్ బాబు ని చూస్తూ తల ఊపాడు. “అవును” అన్నాడు పొడిగా.

కూలీ సూట్‍కేసు తీసుకుని తన తలపై పెట్టుకున్నాడు. అరూప్ బాబు వద్ద ఓ బ్యాగు, భుజానికి వ్రేళ్ళాడుతూ ఓ ఫ్లాస్కు ఉన్నాయి. ముగ్గురూ బయటకు వెళ్ళే ద్వారం వద్దకు నడవడం మొదలుపెట్టారు.

అరూప్ బాబు అతనితో – “మీ పుస్తకాలు చదివాను. మీరు అకడమీ అవార్డు గెలిచిన విషయం పేపర్లో చదివాను. మీ ఫొటో కూడా చూసాను” అన్నాడు.

“హుమ్…”

“మీరు సీవ్యూ హోటెల్ లో బుక్ చేసుకున్నారు కదూ?”

ఈ సారి అమలేశ్ మౌలిక్ అరూప్ బాబు వంక అనుమానాస్పదంగా చూసాడు. అతనేమి ఆలోచిస్తున్నాడు అన్న విషయం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.

“సీవ్యూ మేనేజర్ మీ అభిమాని. అతనే ఈ విషయం అందరికీ చెప్పాడు” – అరూప్ బాబు వివరించాడు.

“ఓహ్!”

“చాలా మంది పిల్లలు మీకోసం ఎదురుచూస్తున్నారు.”

“హుమ్”

ఈ మనిషేమిటి ఇంత తక్కువ మాట్లాడుతున్నాడు? ఇప్పుడు నడక వేగం కూడా తగ్గింది.. ఏమాలోచిస్తున్నాడో?

ఇంతలో అమలేశ్ మౌలిక్ ఆగాడు. అరూప్ బాబు వైపు కి తిరిగి – “నేను వస్తున్నా అని చాలామందికి తెలిసిపోయిందా?” అని అడిగాడు.

“అవును. నాకర్థమయింది అదే. ఏం? మీకేమైనా ఇబ్బందా?”

“కాదు…కానీ నాకు ఒ…ఒ..ఒం…”

“ఒంటరిగా ఉండటం ఇష్టమా?”

“అవును”

ఇతనికి నత్తి ఉంది అన్న విషయం అర్థమౌతూనే ఉంది. ఇంగ్లాండు రాజు ఎనిమిదవ ఎడ్వర్డ్ గద్దె దిగాలని నిశ్చయించుకున్నాక అతని తమ్ముడు జార్జి కి దిగులు పట్టుకుంది తను రాజు కావడం గురించి. ఎందుకంటే తనకేమూ నత్తి, రాజన్నాక ఉపన్యాసాలు ఇవ్వాల్సి వస్తుంది అని! అరూప్ బాబు కి ఆ విషయం గుర్తు వచ్చింది. కూలీ సామాన్లు తీసుకుని గేటు వద్ద ఎదురుచూస్తున్నాడు. వీళ్ళిద్దరూ వడివడిగా అక్కడికి నడిచారు.

“కి..కి..కీర్తి కి ము..ము..మూల్యం ఇదే.”

అరూప్ బాబు ఇలా నత్తి తో మాట్లాడే తమ హీరో ని చూసిన ఆ పిల్లల పరిస్థితి ని ఊహించుకున్నాడు. అతని ఊహ లో కనబడ్డ విషయం అతనికి నచ్చలేదు.

“మీరు ఒక పని చేయవచ్చు” – స్టేషన్ బయటకు వస్తూ అమలేశ్ తో అన్నాడు.

“ఏమిటీ?”

“మీ సెలవంతా అభిమానుల వల్ల పాడుకావడం నాకు నచ్చలేదు.”

“నాక్కూడా”

“అప్పుడు సీవ్యూ కి వెళ్ళకండి.”

“ఎ..ఏమిటీ?”

“అక్కడ భోజనం అస్సలు బాగుండదు. నేను సాగరిక లో ఉన్నాను. నా రూమ్ ఖాళీగానే ఉంది. మీరు అక్కడికి వెళ్ళమని నా సలహా”

“ఓహ్!”

“ఇంకా..మీ అసలు పేరు ఉపయోగించకండి. మీరు ఆ మీసాలు పూర్తిగా తీసేస్తే మరీ మంచిది.”

“మీ..మీస్..”

“వెంటనే. ఇక్కడే వెయిటింగ్ రూమ్ కి వెళ్ళి రావొచ్చు దీని కోసం. ఓ పది నిముషాల కంటే పట్టదు అనుకుంటాను. ఈ పని చేసారంటే మిమ్మల్ని ఎవరూ గుర్తు పట్టరు. ఏకాంతం లో గడుపుదామని మీరు ఎంతగానో ప్లాన్ చేసుకున్న  మీ సెలవులకు ఎవరూ అంతరాయం కలిగించరు. నేను కలకత్తా నుండి కావాలంటే టెలిగ్రాం పంపుతాను సీవ్యూ వాళ్ళకి – మీరు మీ పర్యటన విరమించుకున్నారని.”

మౌలిక్ నుదుటి పై దిగులు కి చిహ్నంగా కనబడ్డ గీతలు పోవడానికి ఇరవై సెకన్లు పట్టింది. కళ్ళ దగ్గర, నోటి దగ్గరా కొత్త గీతలు ఏర్పడ్డాయి. అతను నవ్వుతున్నాడిప్పుడు.

“మీమీ..మీకు ఎలా కృ..కృ…తజ్ఞతలు చెప్పాలో..అర్ అర్థం…కావడం లేదు.”

“పర్లేదు. కానీ, దయచేసి మీరు ఈ పుస్తకాల పై సంతకాలు చేస్తారా నా కోసం? ఆ వేప చెట్టు కింద నిలబడదాం రండి, అక్కడైతే మనల్ని ఎవరూ కనిపెట్టలేరు.”

– ఆ చెట్టు వెనక నిలబడి అమలేశ్ తన ఎర్ర పార్కర్ పెన్ను ని జేబులోంచి తీస్తూ అరూప్ బాబు వైపు అభినందనాపూర్వకంగా చూసాడు. అవార్డు వచ్చిన రోజు నుండి ఎంతో సాధన చేసి తన సంతకం సరిగ్గా చేయడం నేర్చుకున్నాడు. అయిదు పుస్తకాలపై అయిదు సంతకాలు. తన నాలుక కి నత్తి అయినా కూడా తన కలానిది కాదు అని అతనికి తెలుసు.

Published in: on July 28, 2021 at 2:00 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2021/07/28/raystory-abhimani/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: