ఒక ఏడాది తరువాత

ఈ జూన్ ఒకటికి నేను మాతృత్వ సెలవు ముగించుకుని తిరిగి పనిలో చేరి ఒక సంవత్సరం అవుతుంది. ఈ ఏడాది కాలం గురించి, అది నేర్పిన పాఠాల గురించి ఈ టపా. నాలుగు అంశాలుగా విభజించుకుంటున్నా.

1. పిల్ల: నేను మాట్లాడే నూటికి డెబ్భై శాతం మాటలు మా పిల్ల గురించి కంప్లైంట్లే గత ఏడాది కాలంలో. ఇవాళిలా చేసింది. ఇందాకా దాన్ని విరగ్గొట్టింది. ఆ గోడపైన కలర్ పెన్సిల్ తో గీకింది.. ఫలానాది పాడు చేసేసింది.. ఇలా సాగుతూ ఉంటాయి. కానీ, నిజానికి ఏడాది కాలంలో పరిస్థితుల మధ్య కూడా మనశ్శాంతిగానే ఉన్నానంటే దానికి కారణం మా పాపే అని చెప్పాలి. అసలు ఇంత మనశ్శాంతి ఎప్పుడూ ఎరుగను అనుకుంటా అడల్ట్ గా. ఇది శాశ్వతం అని అనుకోను కానీ, ఉన్నన్ని రోజులు ఆస్వాదిస్తాను.

ఏ విషయం గురించి ఎక్కువ సేపు బాధ పడ్డం/కోప్పడ్డం/అరవడం లాంటివి చేసే స్కోప్ లేకుండా రోజంతా నన్ను తినేస్తుంది కనుక అదొక విచిత్రమైన పద్ధతిలో మానసికారోగ్యం నిలిచిందని నా నమ్మకం. అదొక భరోసా ఐపోయింది నాకు – పాపుంటే ఏదో ఒకలా నెట్టుకొచ్చేయొచ్చు ఏ సమస్య వచ్చినా అని. కనుక మా పాపకి “ధైర్య లక్ష్మి” అన్న పేరు పెట్టాను, “రాకాసి” అన్న పేరుతో పాటు. ఎవరు నన్ను వదిలేసి వెళ్లినా కనీసం ఇప్పట్లో .. కనీసం కొన్నేళ్ళ దాకా అయితే ఈ పిల్ల వదలదు అన్నది కూడా ఒక ధైర్యాన్ని ఇస్తుంది నాకు. మంచి అమ్మని కాగలనో లేదో కానీ, ఆ ప్రయత్నం మాత్రం అలాగే మానకుండా చేయాలనీ, ఆమె పెద్దయ్యాక ఏదో ఓరోజు నాతో – “నీ పరిమితుల్లో నువ్వు చేయగలిగినంత చేశావు” అనగలిగితే చాలు. పర్ఫెక్షన్ నాకొద్దు. అందువల్ల నాకు చేతనైనంత మంచి అమ్మని అవ్వడానికి ప్రయత్నం రాబోయే ఏడాది కూడా అలా కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే. వీలైనంత “క్వాలిటీ టైం” పాపతో గడపాలని ఆశిస్తున్నాను. 

2. కుటుంబం, స్నేహితులు: కుటుంబంతో గాఢానుబంధం ముఖ్యం, ఉంటే అదృష్టం అన్నది ముగింపన్నది కనిపించకుండా ఒకటిన్నర ఏడాది పొడిగించుకుంటూ పోయిన లాక్ డవున్ ల వల్ల నాకు కలిగిన అతి పెద్ద జ్ఞానోదయం. పెద్ద పెద్ద విషయాలేం సాధించకపోయినా, నా మానాన నేను నా కుటుంబంతో, మా ఇంట్లో, ముప్పూటలా తింటు, వీలైనంత వరకూ మేము అందరం ఆరోగ్యంతో ఉండడం, మా పరిమితుల్లో ఇతరులకి (అంటే ముక్కూ మొహం తెలీని వాళ్ళకి) ఏదన్నా చేయడం .. తెలిసిన వారికి వీలైనంతలో మాటసాయం తప్ప ఏం చేయలేకున్నా, అదన్నా చేసే స్థితిలో ఉండడం… ఎంత అదృష్టమో ఈ ఏడాది తెలిసొచ్చింది. 

నేను మామూలుగా ఫ్యామిలీ‌ డ్రామా ని వీలైనంత తప్పుకు తిరుగుతూ ఉన్న కాసిని స్నేహితులతోనే నా ప్రపంచాన్ని వెదుక్కుంటూ ఉంటాను. నా బాల్య స్నేహితురాలు ఈమధ్య ఒకటి అన్నది – స్నేహాలు తెంచుకోవాలనుకుంటే తెంచుకోడం చాలా ఈజీ. కొన్నాళ్ళు స్పందించకుండా వదిలేస్తే అవతలి వాళ్ళకి విసుగేసి మానేస్తారు. ఎవరన్నా మనతో అలా చేసినా మనం కూడా చూసినంత కాలం చూసి ఇంక మన ఖర్మనుకుని ప్రయత్నం ఎప్పుడో ఏదో ఓ సమయంలో వదిలేస్తాం. కుటుంబ సభ్యులను వదిలించుకోడం‌ అంత తేలిక కాదు. మనం వదిలితే వాళ్ళు వదలరు, వాళ్ళు వదిలితే మనం వదలం అని. ఇష్టం ఉన్నా లేకపోయినా ఉండిపోయే బంధం అది అని. అక్కడే, ఆ చాటులోనే నాకు జ్ఞానోదయం అయ్యింది. ఊరికే అమ్మ తిట్టిందనో, అత్త అరిచిందనో ఇవన్నీ మనసులో పెట్టుకుని ఏం సాధిస్తాం? ఈ గడ్డుకాలంలో మనిషికి మనిషికి తోడు మాటలేగా.. మనల్ని వద్దని వదిలేసిన వాళ్ళు పోగా…  మనం కావాలనుకున్న వాళ్ళు మనం ఓ మాటన్నా పట్టించుకోకుండా తరువాత నన్ను ఓ మాటంటే నేను కూడా పట్టూ విడుపూ చూపొద్దా? అనిపించింది.  

ఈ జ్ఞానోదయం తరువాత నాలో కొంచెం మార్పు వచ్చిందనిపించింది. అంతకు ముందు కంటే రోజూవారి మల్టిపుల్ ఫోన్ కాల్స్ ని కొంచెం గౌరవిస్తున్నాను. ఎవరన్నా నాకు మెసేజి పెడితే … వాళ్ళు ఉట్టి పరిచయస్థులు మాత్రమే అయినా సరే, జవాబిచ్చి క్షేమం అడుగుతున్నాను. చుట్టుపక్కల వారు పలకరిస్తే ఇదివరకులా హలో అనేసి మాయమవకుండా ఏదో కొంచెం లోకాభిరామాయణం మాట్లాడి వెళ్తున్నా. మా పిల్ల, పిల్ల తండ్రిని వదిలేస్తే ఇతరుల గురించి చిరాకు/కోపం తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. అలాగే నన్ను బాధించిన/కోపం తెప్పించిన వాళ్ళ గురించి కూడా ఎక్కువ ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. పని గట్టుకుని మధ్యమధ్యన బాగున్నావా? అని అడుగుతూ ఉండే మితృలందరి స్పూర్తితో నేను కూడా మనం మెసేజి పెడితే కనీసం స్పందిస్తారు అనుకున్న వాళ్ళకి మధ్య మధ్యలో మెసేజి చెయ్యడం మొదలుపెట్టాను. కొందరు స్పందించకపోయినా వాళ్ళ మీద అభిమానం చావక చేస్తూ ఉంటా అనుకోండి అప్పుడపుడు – అది వేరే విషయం. దీని వల్ల ఏవో భయంకర మార్పులు సంభవించాయని చెప్పలేను కానీ, నాకు మనశ్శాంతి పెరిగింది అనుకుంటాను. అలాగే, పలకరిస్తే పలికే స్నేహితులు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా పంచుకోవాలనిపిస్తే నాతో పంచుకునే వారు ఉన్నారు అని ధైర్యం కలిగింది. ఇప్పటి పరిస్థితులలో ఈ ధైర్యం కూడా ముఖ్యమే అని నా అభిప్రాయం.

3. ఇల్లు-ఆఫీసు బ్యాలెన్స్: మా ఊళ్ళో దాదాపుగా సెప్టెంబర్ 2020 నుండి డే కేర్లు తెరిచే ఉన్నాయి. అవి essential service కింద లెక్కకట్టారు. అయితే అంతకు ముందు దాదాపు ఆర్నెల్ల పాటు మూతబడ్డాయి. నేను పని మొదలుపెట్టేసరికి ఇంట్లో‌ ఇద్దరం ఆఫీసు పని చేస్తూ, ఏడాది పిల్లని మేనేజ్ చేసుకోవాలి. ఈ ఇల్లెందుకు ఇంత పెద్దగా ఉంది? మనకెందుకు మూడు పూటలా ఏదో ఒకటి మెయ్యడానికి కావాలి? పాప ఎందుకు ఏ మూలలో ఏది కనబడితే దానికోసం పోతుంది? ఇప్పుడే కదా పడుకుంది – అప్పుడే లేస్తుందేం? పొద్దునంతా ఇంటిపని, పాపతో సరిపోతే నేనింక ఎప్పుడు పని చేయాలి? – ఇలా రోజంతా నా స్నేహితులతో ఏడుస్తూ ఉండేదాన్ని మొదట. ఇది కాక మధ్య మధ్య బంపర్ ఆఫర్ ఏడుపు ఏమిటంటే – కొలీగ్స్ అంతా ఏంటేంటో చాలా చేసేస్తున్నారు. నాకు అసలు కుదరడం లేదు (చిన్న పిల్లలున్న వాళ్ళు లేరు మా‌టీంలో)… ఇలా అయితే నేను వెనుకబడిపోనా? అన్నది అపుడపుడూ గుర్తొచ్చే అదనపు ఏడుపు. ఇదంతా నసలాగా అనిపించి ఉంటుంది బహుశా వీళ్ళకంతా… నాకు మాత్రం అది ఎవరికీ అర్థం కాని ఆత్మఘోష టైపు.

డేకేర్లు తీశాక నాకు ప్రపంచం పచ్చగా కనబడ్డం మొదలైంది. నెమ్మదిగా ఆఫీసులో కుదురుకుని, రిసర్చి కూడా ముందుకు సాగడం మొదలైంది. కానీ నా పనితీరు పూర్తిగా మారిపోయింది. అదివరలో ఏదన్నా ఎక్కడన్నా ఆపితే, ఆ సర్లే తర్వాతొచ్చి చేద్దాం/రాత్రి చూద్దాం/వీకెండ్ చూద్దాం -ఇలా ఉండేది. మరీ పని పిచ్చి కాకపోయినా రిసర్చి కనుక ఎపుడూ మనసులో అది మెదులుతూ ఉండేది పని చెయ్యనపుడు కూడా. ఇపుడంతా పరమ ఆప్టిమైజ్ చేసేసి అంతా ఓంలీ వీక్ డేస్, అదీ డే కేర్ పనివేళలతో సింక్ అయి ఉండాలి. వారాంతాలు, పని దినాల్లో సాయంత్రాలు –  ఇల్లే ఇలలో స్వర్గం, పిల్లలూ దేవుడూ చల్లని వారే. ఇలా పాడుకోడమే. పాడుకుంటూ పిల్లాటలు ఆడుకోడం, కన్మణి పాప పాటలు వినుకోడమే. ఇలా పనివేళలు తగ్గడం, వాటిని బ్యాలెంస్ చేసేందుకు ఇంకెప్పుడో‌చేయడం అన్నది కుదరకపోవడం వల్ల నాకు పని మీద ఫోకస్, అలాగే ఏది ఎప్పుడు/ఎంత సమయంలో చేయాలి అన్న అంచనా కూడా ఇదివరకటికంటే మెరుగైంది అనిపిస్తోంది. వీటికి తోడు, నాకు కుదరకపోతే అదేదో తప్పు చేసినట్లు కాకుండా మామూలుగా – ఇంట్లో పనుందని చెప్పేస్తున్నా. మా ఆఫీసు వాళ్ళు బగమంతులు కనుక సహకరిస్తున్నారు. ఇటాంటి అరగుండు వాలకం పనితో కూడా నా అప్రైజల్ సాఫీగా సాగిపోయింది. అలా, ముందు ఓ మూణ్ణెల్లు గిలగిలా కొట్టుకున్నా చివరికి మానవనైజం ప్రకారం అలవాటు పడి నిలదొక్కుకుంటున్నా. ఆ డే కేర్ వాళ్ళు మాత్రం నాకు ప్రత్యక్ష దైవాలే.

పని మంచి పీక్ లో‌ ఉండగా పుటుక్కుమని పాపకోసం పని ఆపాల్సి రావడం, డెడ్లైన్ దగ్గర్లో పాపకి బాలేదని సెలవు పెట్టి పిల్లకీ, పనికీ దేనికీ పూర్తి అటెంషన్ ఇవ్వలేక బాధపడ్డం, ఒక్కోసారి చేయలనుకున్న వాటికి, ఉన్న సమయానికి పొంతన కుదరక నిరాశ పడ్డం… ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి కానీ, ఇవన్నీ జీవితంలో భాగం అని అలవాటైపోయింది ఇపుడు… ఏడాదవుతోంది కనుక. అందువల్ల ఇదివరకు ఉన్నంత నిస్సహాయత ఇపుడు లేదు నాకు. ఆరోజుకి కోపం, అలసట వంటివి ఉన్నా వెంటనే మళ్ళీ మర్చిపోయి పనిలో, ఆటల్లో పడిపోతున్నా.

4. ఇతర వ్యాపకాలు: మామూలుగానే నాకు వ్యాపకాలు తక్కువ, అలాగే పని తప్ప ఇతర విషయాల్లో ఏ విధమైన అభినివేశమూ లేదు. అయితే ఏదో గొప్ప గొప్ప కళాభిరుచులు వంటివి లేకపోయినా కనీసం ప్రయాణాల వంటివి చేసేదాన్ని. కానీ పాప పుట్టాక ఓ ఏడాది ఏడాదిన్నర అసలు ఇల్లు-ఆఫీసు తప్ప ఇతర వ్యాపకాలన్నవి లేకుండా పోయాయి .. లాక్ డవున్ దీనికి తోడయ్యింది. పైకి బానే ఉన్నా ఇది నా మానసికారోగ్యం మీద ప్రభావం చూపినట్లే ఉంది. అలసట వల్ల బాగా చిరాకు/కోపం వచ్చేసేవి చాలా విషయాలు/ చూసినా/చదివినా/విన్నా.  కానీ, గత ఆరునెల్లలో ఇది చాలా మారింది. ఇలా ఈ ఇల్లు-ఆఫీసు బ్యాలెంస్ మెరుగవడం, కొంచెం మళ్ళీ నెమ్మదిగా అవీ ఇవీ తరుచుగా పుస్తకాలు చదవడం, బ్లాగు టపాలు, పుస్తకం.నెట్ వ్యాసాలు రాయడం, మళ్ళీ సైక్లింగ్ నెమ్మదిగా మొదలుపెట్టడం ఇలాంటివి మొదలుపెట్టాను. కనుక నెమ్మదిగా మళ్ళీ మానసికంగా కుదురుకుంటున్నా అనిపిస్తోంది. హం కిసీ సి కమ్ నహీ అని కూడా అనుకుంటున్నా. ఇవన్నీ అందరికీ ఉండేవే – దీనికంతా ఓ పోస్టు అవసరమా? అనిపించొచ్చు కానీ, ఎవడి బ్లాగు వాడిదండి. అందునా ఎవడి అనుభవం వాడికి కొత్త. ప్రపంచానికి కాదు. 

ఈ జ్ఞానోదయాన్ని మహమ్మారి సాక్షిగా నాకు అందించిన అందరికీ నా ధన్యవాదాలు. పిచ్చాపాటి కబుర్లు మొదలుకుని ఊరికే అంతా బాగేనా అని అడగడం  దాకా ఈ సామాజిక దూరాల దినాలలో పలకరిస్తున్న అందరికీ థాంక్స్.  భవిష్యత్తులో కూడా  నా జ్ఞాపకాల్లో మీ చోటు పదిలం. ఈ ఏడు నేను నేర్చుకున్న బతుకు పాఠాలు కొరోనా అనంతర ప్రపంచంలో కూడా మర్చిపోకూడదని కోరుకుంటున్నాను. 

Published in: on May 28, 2021 at 12:03 pm  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2021/05/28/%e0%b0%92%e0%b0%95-%e0%b0%8f%e0%b0%a1%e0%b0%be%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%a4%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b0%be%e0%b0%a4/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. మీ పుస్తక, సినిమా సమీక్షలు, ఇంకా అనేక విషయాలతో ఉండే మీ పోస్టులు చాలా ఆసక్తిగా చదువుతుంటాను. ఈ పోస్టు మాత్రం మా డైరీనే చాలాకాలం తర్వాత మేం చదువుకున్నట్టు ఉంది. కరోనా కష్టాలు వగైరా కాస్సేపు పక్కన పెడితే పిల్లలతో గడపడం, ఆ పసివాళ్లకు అన్ని అవసరాలు తీరుస్తూ ఆయా సందర్భాల్లో వాళ్ళ సంబరాలను పంచుకుంటూ అనుభవించే ఆనందాలు చెప్పనలవి కావు. అవి పంచుకొని మాలాంటి వాళ్ళందరికీ మంచి అనుభూతుల్ని జ్ఞప్తికి తెచ్చినందుకు ధన్యవాదాలు. ఇట్లాంటివి సొంత సోది అనిపించుకోవు. కొంతమంది గొప్ప గొప్ప వారి ఆత్మకథలు అనే ఘోషలకంటే ఇవే ఆనందాన్ని పంచుతాయి.
    ఇక మీరు ప్రస్తావించిన జ్నానోదయాలు, ప్రయత్నాల దగ్గరే కొన్ని ఆగిపోతున్నాయి. కాస్త అహం పక్కకు పెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే బావుంటుంది కదా, అనిపించకలిగిన మీ పోస్టుకుఅభినందనలు.
    మేం రెండో ఇన్నింగ్సులో ఈ పసిపాపలతో ఆటల పర్వం బ్రహ్మాండంగా పొందుతున్నాం. ఈ కరోనాతో ఓ ఏడాదిన్నర కాస్త గాప్ వచ్చినా మళ్ళీ త్వరలోనే వాళ్ళతో బువ్వాలాటలాడేసుకుంటాం. ఇదేమో మా సొంత సోది అంటే! అదీ పబ్లీకున.

    • మీ అనుభవం పంచుకున్నందుకు ధన్యవాదాలు రాజా గారూ. అంతా బాగున్నరని తలుస్తాను.

  2. […] గత టపాకి ఇది కొనసాగింపు టైపు అనమాట. నేను బాగా కుదురుకున్నా అనుకున్నా కానీ, ఒక విషయం లో మాత్రం నిస్సహాయత భావన పోవడం లేదు. అందుకని ఈ పోస్టు రాస్తున్నా. ఆ విషయం – “అందుబాటులో లేకపోవడం”. ఎవరికి? అంటే పిల్లకి తప్ప ఎవరికైనా. పిల్లకి ఎల్లవేళలా అందుబాటులో ఉండడం కోసం ఇంకెవరికీ అందుబాటులో ఉండకపోవడం అనమాట. ఒక్కోసారి నాక్కూడా నేను అందుబాటులో ఉండట్లేదు అని నాకనిపిస్తూ ఉంటుంది (అంటే సెల్ఫ్-కేర్ లేదు అని అనమాట). ఆ, అందరి కథా ఇంతే… అని చప్పరించేయొచ్చు. చప్పరించండి. టేస్టు రుచిగా ఉందా? లేదు కదా. చేదుగా ఉందికదా? నాక్కూడా చేదుగానే ఉంది. అందుకే రాస్తున్నది మరి! […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: