ఇవ్వాళ ఇక్కడ రక్తదానానికి వెళ్ళొచ్చాను. చివరిసారిగా రక్తం ఇచ్చి పదేళ్లు దాటింది. కానీ అప్పట్లో తరుచుగా ఇచ్చేదాన్ని. అందుకని ఓసారి గతం గుర్తు తెచ్చుకుందామని పోస్టు.
నాకు చిన్నప్పట్నుంచీ రక్తదానం అంటే చాలా గొప్ప అన్న భావన ఉండేది. నాకు ఊహ తెలిసేనాటికి పత్రికల్లో టీవీల్లో రక్తదానం ప్రకటనలవీ చూసీ మనం కూడా ఇయ్యాలి… తగిన వయసు టక్కుమని రావాలి అని ఎదురుచూస్తూ ఉన్నా. మొదటిసారి రక్తదానం ఇంజనీరింగ్ లో ఉండగా కాలేజి లోనే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడితే అక్కడ ఇచ్చా. ఇండియా లో ఉన్నపుడు దాదాపు ప్రతి ఆర్నెల్లకూ ఇచ్చేదాన్ని – ఆఫీసులోనో, ఫ్రెండు వాళ్ళ సేవా సంస్థలోనో, ఎక్కడో ఓ చోట క్యాంపులు పెట్టేవాళ్ళు. వాటిలో ఇచ్చేదాన్ని. ఓసారి 2006 లో అనుకుంటాను – పేపర్లో నా గ్రూపు రక్తం కావాలన్న ప్రకటన చూసి కదిలిపోయి, మా అమ్మ పర్మిషన్ తీసుకుని NIMS ఆసుపత్రికి పరిగెత్తి ఇచ్చొచ్చా. ఎవరో ఒక నా ఈడు మనిషికే ఇచ్చా, ఆ మనిషి వెంట చాలా పెద్దామె ఎవరో మాత్రమే ఉంది. వాళ్ళు జూసిచ్చారు, ఆమె దండం పెట్టింది. నేను మొహమాటపడి తిరిగి దండం పెట్టి గబగబా బైటకొచ్చేశా.
అప్పట్లో ఒక బ్లడ్ డోనర్ కార్డు (రెడ్ క్రాస్ అనుకుంటా), ఒక ఐ డోనర్ కార్డు (ఎల్ వీ ప్రసాద్ వారి దగ్గర రిజిస్టర్ అయితే ఇచ్చారు), ఒక ఆర్గన్ డోనర్ కార్డు (మోహన్ ఫౌండేషన్ అనుకుంటాను, గుర్తులేదు) ఇన్ని పెట్టుకు తిరిగేదాన్ని పర్సులో. మనమసలే విచ్చలవిడి టూ వీలర్ డ్రైవర్లం… ఏదన్నా అయితే కనీసం ఇంకోళ్ళకి ఉపయోగపడతాం అని (ఇంట్లో వాళ్ళకి తెలుసు లెండి. ఏదీ రహస్యంగా చేయలేదు). కానీ, అదంతా అక్కడితోనే పోయిందని తెలియలేదు నాకప్పుడు.
దేశం దాటాక అదేమిటో ఇలాంటి రక్తదాన శిబిరాలు ఇప్పటిదాకా చూడలేదు. జర్మనీ వెళ్ళిన కొత్తల్లో ఓ స్నేహితురాలిని అడిగాను – ఇక్కడ రక్తదానం చెయ్యాలంటే ఏంచెయ్యాలి? అని. ఆమె ఆశ్చర్యంగా చూసి ఎందుకన్నది. “ఎందుకేమిటి? మామూలుగా బ్లడ్ బ్యాంకులకి రక్తం అవసరం ఉంటుంది కదా. అందుకని ఇద్దామనుకుంటున్నా” అన్నా. “ఇక్కడ అలా ఊరికే పోతే తీసుకోరు అనుకుంటాను, మీ ఇండియాలో ఎవరి బ్లడ్డన్నా అలా తీసేసుకుంటారా?” అని ఆశ్చర్యపోయింది. ఊరికే తీస్కోర్లేవమ్మా, ప్రశ్నలన్నీ వేసే తీసుకుంటారని చెప్పా కానీ, జర్మనీ లో ఎలా ఇవ్వాలన్నది మాత్రం అర్థం కాలేదు మొత్తం ఐదేళ్ళలో. భాష సమస్య ఒకటి కూడా కారణం అయుండొచ్చు నాకు.
కట్ చేస్తే యూఎస్ లో అసలు ఊపిరి సలపని ఉద్యోగం. దానికి తోడు కొంత వ్యక్తిగత ఇబ్బందులు. ఎక్కడా శిబిరాలు కానీ, ఇవ్వమని పిలుస్తూ ప్రకటనలు కానీ కనబడలేదు యూనివర్సిటీలో ఉన్నా కూడా – దానితో నేనూ ఎక్కడా ప్రయత్నించలేదు.
కెనడా వచ్చాక కూడా చాలా రోజులు ఇలాగే కొనసాగింది… పైగా రాంగానే కొన్ని నెలల్లోనే ప్రెగ్నంసీ, పాప పుట్టడం, ఆ తరువాత కొన్ని నెలలకి మాయదారి కోవిడ్ – వీటితోనే సరిపోయింది. కానీ గత ఏడాది కాలంలో ఇక్కడ తరుచుగా బ్లడ్.సీయే వెబ్సైటు వారి ప్రకటనలు రోడ్డు మీదా, ఇంటర్నెట్ ఆడ్స్ లో కూడా కనిపించేవి. “రక్తదానం నిరంతర అవసరం. ఈ మహమ్మారి కాలంలో మరింత అవసరం” అని ముఖ్యంగా కోవిడ్ సమయంలో మీ రక్తదానం మరింత అవసరం అని వారు చేసిన కాంపైన్ నన్ను బాగా కదిలించింది (స్వేచ్ఛానువాదం లెండి!). సరే, కొంచెం ఇక పిల్ల కొంచెం పెద్దవుతోంది కదా అని ఇంటి దగ్గర ఏవైనా శిబిరాలున్నాయా అని చూడ్డం మొదలుపెట్టా. ఇంటి అడ్రస్ బట్టి వెదుకుతూ ఉంటే ఒకటి కనబడ్డది (మళ్ళీ దూరమంటే పిల్లని ఎక్కువ సేపు వదిలి పోవడం ఇష్టం లేక!). మా పాప రెండో పుట్టిన రోజు లోపు ఇవ్వాలనుకున్నా మా ఇంటి పుట్టినరోజు వేడుకలో భాగం అని.
అపాయింట్మెంటు తీసుకున్నాక మనసు పీకడం మొదలుపెట్టింది. రెండు మూడు వారాల ముందు నుంచే ఇండియా/యూఎస్ లో ఉన్న డాక్టర్ స్నేహితుల తల తిన్నా – కోవిడ్ పరిస్థితిలో రక్తం ఇచ్చొచ్చాక నాకేమన్నా అవుతుందా? అని. నా బాల్య స్నేహితురాలేమో టెస్ట్ చేయించుకుని వెళ్ళి ఇవ్వు. పొరపాట్న నువ్వు పాజిటివ్ అయితే అదో ఇబ్బంది కదా బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి? అన్నది (పాయింటే, నేనాలోచించలేదు). ఇంకో స్నేహితులేమో సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవ్వు – కేసులు తగ్గుముఖం పడుతూంటే వెళ్ళు అన్నారు. ఆఫీసు వాళ్ళని కూడా తిన్నా – ఈమధ్య మీరేవన్నా రక్తం ఇచ్చారా? అని. ఒకరేమో – నువ్వు డెంటిస్టు దగ్గరికెళ్ళావా ఈ ఏడాది కాలంలో? డెంటిస్ట్ కంటే రక్తదానం వల్ల ఏం ఎక్స్పోజ్ అవ్వవు నువ్వు అన్నారు (ఇది కూడా నిజమే కదా… అనుకున్నా). ఇంతలో ఓ కొలీగ్ – నాకన్నా పెద్దామే – “నేనిచ్చొచ్చాను ఈమధ్యే. ఏం కాదు, చాలా జాగ్రత్తలు తీసుకుంటూన్నారు.. ఖంగారు పడకు” అని భరోసా ఇచ్చింది. దానితో ముందడుగేశా. గతంలో రక్తం ఇచ్చేటపుడు రక్తం చూస్తే భయపడే వాళ్ళని, దాని వల్ల రక్తదానం చేయలేకో, చేసాక కళ్ళు తిరిగో పడిపోయే చాలామందిని చూశాను. ఇప్పటి కాలం లో వైరస్ భయమే ఎక్కువ.
రెండు వారాలకోసారి, వారం ముందు ఓసారి, నాలుగు రోజుల ముందో సారి రిమైండర్లు – కోవిడ్ జాగ్రత్తల గురించి, వెళ్ళాక ఏమవుతుంది? (కోవిడ్ ప్రశ్నలు, డోనర్ ఆరోగ్యం గురించి ప్రశ్నల చిట్టా, రక్తంలో హిమోగ్లోబిన్ టెస్టు) ఎంతసేపు పడుతుంది? ఇలాంటివన్నీ వివరిస్తూ ఈమెయిల్స్ పంపారు. మధ్యలో ఒకరోజు మళ్ళీ కోవిడ్ anxiety వల్ల వాళ్ళ వెబ్సైటులో ప్రశ్నోత్తరాలన్నీ చదివి, ఉన్నవి చాలక చాట్ బాక్స్ లో రక్తం, ప్లాస్మా, ప్లేట్లెంట్స్ ఇన్ని రకాల దానాలలో తేడా ఏమిటి? నేనేదైనా ఇవ్వొచ్చా? ఇలాంటివన్నీ అడిగి తలకాయ తింటే ఒక రిజిస్టర్ర్డ్ నర్సు నాకు ఓపిగ్గా జవాబులు కూడా ఇచ్చింది. అంతా చూశాక సాహసించానిక – పర్లేదు, నాకేం కాదు అక్కడికి వెళ్ళొస్తే అని. ఇందాక రాసినట్లు, రక్తం గురించి కాదు నా భయం – కోవిడ్ గురించి! ఇంట్లో నాతో పాటు ఉన్న కుటుంబం గురించి!)
అయితే, అసలు వెళ్ళినప్పటి నుండి ఇల్లు చేరేదాకా ఇదే ఇప్పటి దాకా నా బెస్ట్ రక్తదానం అనుభవం. వెళ్ళగానే టెంపరేచర్ చూసి, ప్రశ్నలూ అవీ వేసీ ఇంకో గదికి పంపారు. కెనడాలో ఇదే మొదటిసారి కనుక అక్కడ వాళ్ళ డేటాబేస్ లో నానా రకాల ప్రశ్నోత్తరాలకి జవాబులు రిజిస్టర్ చేశారు. తరువాత ఒకామె వచ్చి హీమోగ్లోబిన్ లెవెల్ చూడ్డానికి ఓ చుక్క రక్తం తీసుకుంది. చివరికి మళ్ళీ ఓసారి అంతా వివరంగా చెప్పాక, రక్తదానం మొదలైంది. ఐదు నిముషాల ఒక సెకను పట్టింది అంతే సాధారణ మొత్తంలో రక్తం తీయడానికి. అంతేనా? ఇంతకుముందు ఇంకాసేపు పట్టేదే అనుకున్నా. కానీ ఆమె మొదటే అనింది – if you are hydrated, it is very quick అని. అంతే ఇంక. మరో ఐదునిముషాలు కూర్చున్నాక ఇంక పొమ్మన్నారు జ్యూసు, నీళ్ళు, బిస్కట్లు గట్రా కొన్ని వాయినం కూడా ఇచ్చి పంపారు… ఇస్తినమ్మా రక్తం, పుచ్చుకుంటినమ్మా వాయినం.
ఇన్ని దేశాల్లో కెనడా వారి రక్తదాన శిబిరాల పద్ధతి అన్నింటికంటే సులభంగా అనిపించింది. ఆ తరువాత ఇండియా – నిజానికి ఈ వెబ్సైటులూ అవీ ఉన్నాయో లేదో నాకు తెలీదు కానీ, పది-పదిహేనేళ్ళ క్రితం ఆ శిబిరాలు తరుచుగానే కనబడేవి ఇండియాలో. అక్కడెప్పుడూ నాకు రక్తం ఇవ్వడానికి ఇబ్బందులు కానీ, ఎక్కడివ్వాలి? అన్న ప్రశ్న కానీ ఎదురవలేదు. అయితే నేను అక్కడే పుట్టీ పెరిగిన దాన్ని, స్వచ్ఛంద సంస్థలలో మధ్య మధ్య వాలంటీర్ గా వెళ్ళేదాన్ని .. ఒకసారి ఇలాగే రక్తదాన శిబిరంలో కూడా వాలంటీరు గా చేశాను (అప్పట్లో ఆపనులు చేసే స్నేహితులు పట్టుకుపోయేవారు ఖాళీగా కనిపిస్తే – స్వతహాగా అంత సేవా దృక్పథం లేదు నాకు). కనుక కొంచెం ఎక్కువ తెలిసేవి ఇలాంటి శిబిరాల గురించి. కెనడాలో అయితే కొత్త వాళ్ళకి కూడా తేలిక అనిపించింది. డ్రైవర్స్ లైసెన్స్ దగ్గరే అవయవ దానం గురించి అడిగి, కార్డు మీద డోనర్ అని వేసేశారు. ఐ/టిశ్యూ డోనర్ గా కూడా రిజిస్టర్ అవడం తేలిక ప్రభుత్వం వారి ఆరోగ్య భీమా వివరాలకి అనుసంధానం చేశారు కనుక. ఇలా ఒక్క అదనపు కార్డు కూడా పెట్టుకోకుండానే నేను నేత్ర/అవయవ/టిస్యూ దాతగా రిజిస్టర్ అయిపోయా కెనడాలో. ఇపుడు బ్లడ్ డోనర్ గా కూడా రిజిస్టర్ అయిపోయా కనుక ఇంకోసారి ఇవ్వాలనుకుంటే మరింత తేలిక – ఆల్రెడీ వాళ్ళ లిస్టులో ఉన్నా కనుక. బ్లడ్.సిఏ వారిది ఒక ఆప్ కూడా ఉంది. నాకు ఆప్ లు గిట్టవు కానీ దీన్ని మాత్రం దిగుమతి చేసుకున్నా భవిష్యత్ స్పూర్తి కోసం.
మొత్తానికి “రక్తదానం నిరంతర అవసరం. ఈ మహమ్మారి కాలంలో మరింత అవసరం” అన్నది నేనిచ్చే సందేశమనమాట. నేత్ర దానం చెయ్యండి, మరణంలో జీవించండి, మరణించీ జీవించండి అన్న ప్రకటనకి ఊగిపోయి ఆవేశపడిపోయే చిన్నపుడు ఐ డోనర్ గా సైనప్ అయ్యా. అంత క్యాచీగా రాయడం నాకు రాదు – కనుక ఇలా రాసుకుంటున్నా. మనం శ్రమలేకుండా చేయగలిగే ఏకైక గొప్ప పుణ్యకారం ఇదే అని నా అభిప్రాయం. ఇక ఇక్కడ పద్ధతి తెలిసింది కనుక ఇకపై ఏడాదికి ఒకట్రెండు సార్లన్నా ఇవ్వాలి అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో!
మా పాప పుట్టిన రోజు లోపు చెయ్యాలనుకుని వెళ్ళా. ఈ వారంలో మా తాతయ్య మరణం తో – ఇది ఆయన జ్ఞాపకంగా కూడా నేను చేసుకుంటున్నట్లు అయ్యింది. పుట్టినరోజుకీ, చావులకీ రక్తదానం ఏమిటి? అంటారా – కేకులు కూడా కోస్తామండి తర్వాత పుట్టినరోజుకి. కన్నీళ్ళు కూడా కారుస్తాం తాతకోసం- ఒక్కోళ్ళకీ ఒక్కో పద్ధతి ఉంటుంది కష్టానికీ, సుఖానికీ స్పందించడానికి. అందువల్ల ఏమనుకోకండి నా గురించి 🙂
స్వస్తి.
Very nice Sowmya. chakkani experience and baagaa wraasaavu.
[…] ఒకసారి రక్తదానం చేశాను (దీని గురించి గతంలో రాశాను). ఇన్నిసార్లలో ఎప్పుడూ నాకు ఇలా […]