Tommy Douglas (20 October 1904 – 24 February 1986)


టామీ‌ డగ్లస్ గురించి నేను మొదటిసారి విన్నది గత ఏడాది The Promise of Canada అన్న పుస్తకంలో. కెనడాలో పబ్లిక్ హెల్త్ కేర్ పద్ధతికి నాంది పలికిన నాయకుడు ఆయనే అని అప్పుడే తెలిసింది. తరువాత అది కాక ఈ దేశంలోని ఇతరత్రా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి కూడా అతను కెనడాలోని ఒక రాష్ట్రంలో మొదలుపెట్టిన పథకాలు స్పూర్తినిచ్చాయని చదివాను. ౨౦౦౪ లో కెనడాలో జరిగిన ఓ టీవీ ప్రోగ్రాంలో ప్రజలు ఈయనని గ్రేటెస్ట్ కెనెడియన్ గా కూడా ఎంపిక చేశారు. ఇవన్నీ తెలిశాక ఈయన మీద నాకొక గౌరవం ఏర్పడ్డది.

సాధారణంగా నాకు ప్రజల సంరక్షణ ప్రభుత్వం బాధ్యత అని ఆలోచించే విధానం మీద కొంచెం గౌరవం ఉంది. ప్రజలు కట్టే పన్నులలో కొంతభాగం వారికి అందరికీ ఉచిత వైద్యం అందించడానికి వాడతారంటే అది మంచి విషయం అనే అనుకుంటాను. నేను జర్మనీలో ఉన్నపుడు ఇలాగే పబ్లిక్ హెల్త్ ఖర్చులకి నెలజీతంలో చాలా (అప్పటికి నాకు చాలా అనే అనిపించేది) పోయేది. నేను మొత్తం ఐదేళ్ళలో కనీసం మందుల షాపుకు కూడా పోలేదు. నాలా ఉన్న మరొక స్నేహితుడితో ఈ విషయమై ఒకట్రెండు సార్లు చర్చ జరిగింది – అలా మనమెందుకు ధారపోయాలి ఎవరో జబ్బులకి? అని అతనూ… ప్రజలు కట్టే పన్నులకి వ్యక్తిగత లెక్కలేమిటని నేనూ. అక్కడ నుంచి యూఎస్ వెళ్ళాక ఒకసారి సైకిల్ లో పోతూ ఉండగా కిందపడి తలకి దెబ్బ తగిలింది. స్పృహ తప్పడంతో అప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. మొత్తం ఆరోజు అక్కడ నేను కట్టింది పది డాలర్లు. ఎందుకంటే మిగితాది ఆఫీసు ఇన్సూరంసులో వెళ్ళిపోయింది. ఆరోజు మొదటిసారి అనిపించింది అంటే ఉద్యోగం ఉంటేనే వైద్యసేవలని ఉపయోగించుకోగలమా? అని. అయితే, సాధారణంగా (నా అదృష్టం కొద్దీ) ఏ ఆర్నెల్లకో ఏడాదికో తప్ప కనీసం మామూలు డాక్టర్ దగ్గరికైనా నేను వెళ్ళను కనుక, ఈ విషయం పెద్దగా ఆలోచించలేదు.

ఈ ఏడాదిలో ఒకరోజు – నాకు ఏడో నెలలో పాప పుట్టింది. ఆరోజు నేను ఎమర్జెంసీ ఆంబులెంసులో వచ్చాను హాస్పిటల్ కి ఉన్నట్లుండి నొప్పులు రావడంతో‌. తరువాత మా పాపని ఉంచిన హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వంటిది. ఆ వాతావరణం, ఆ ట్రీట్మెంటు పద్ధతులు, అంతా అదొక స్థాయిలో ఉన్నట్లు అనిపించాయి. అంతా బానే ఉంది కానీ ఇదంతా మనం పెట్టుకోగలమా? అని నాకు అనుమానం, భయం. అప్పటికి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టం అని తెలిసినా కూడా ఎంతైనా ఇలా ఇన్నాళ్ళు ఇంత లెవెల్ సౌకర్యాలున్న చోట ఉంటే ఎంతో కొంత కట్టుకోవాలి కదా? అని నా అనుమానం. ఆల్రెడీ నా డిస్చార్జి దగ్గర నర్సుని అడిగా ఎవ్వరూ నా క్రెడిట్ కార్డు వివరాలైనా అడగలేదేంటి? అని (ఆవిడ పెద్దగా నవ్వింది కానీ ఆంబులెంసు బిల్లు పోస్టులో వస్తుందేమో అని నేను రెండు నెలలు చూశా). పాప హాస్పిటల్లో కూడా అంతే. ఎక్కడా ఎవరూ డబ్బు కట్టాలి అని చెప్పలేదు. మేమూ కట్టలేదు. రెండు నెలలు ఇలాగే సాగింది. ఇదే సమయంలో ఇలాగే ప్రీమెచ్యూర్ బేబీ ట్రీట్మెంట్ అని రెండు go fund me campaigns చూశాను – ఒకటి యూఎస్ లో, ఒకటి ఇండియాలో. వాళ్ళు ఫండ్ అడుగుతున్న మొత్తం చూసి గుండె ఆగినంత పనైంది. ఈ లెక్కన ఇలాంటి ఒక పెద్ద ఆరోగ్య సమస్య వస్తే చాలు ఓ కుటుంబం దివాళా ఎత్తడానికి అనిపించింది. మంచి హాస్పిటల్లో గొప్ప ట్రీట్మెంట్ అయ్యాక కూడా మాకేం బిల్లు రాకపోయేసరికి ఆశ్చర్యం, డగ్లస్ తాత మీద భక్తిభావం ఒకేసారి కలిగాయి నాకు. ఈ విధమైన పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టం ఎందుకు అవసరమో, ఎంత అవసరమో అప్పుడు అర్థమైంది.

దాదాపు అరవై ఏళ్ళ నాడు డగ్లస్ ప్రతిపాదించి, పట్టుబట్టి, అనేక వ్యతిరేకతలని (ముఖ్యంగా డాక్టర్ల నుండి వచ్చిన వ్యతిరేకతని కూడా) తట్టుకుని, ఈ universal health care అన్న ఆదర్శాన్ని స్థాపించడాన్ని తన ప్రధాన లక్ష్యంగా ఎన్నుకున్నాడు. చివరికి అతని తరువాతి ప్రీమియర్ (ముఖ్యమంత్రి లాగా) Saskatchewan రాష్ట్రంలో ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నడిచే హెల్త్ కేర్ పద్ధతిని మొదలుపెట్టారు. డగ్లస్ చిన్నతనంలో అతని కాలుకి ఏదో ప్రమాదం జరిగి కాలు తీసేసే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరా అంత డబ్బుల్లేవు. ఈ సమయంలో ఓ డాక్టరు ఈ ట్రీట్మెంటు ఉచితంగా చేస్తా కానీ మా క్లాసు విద్యార్థులకి చూపించడానికి వాడుకుంటా, మీరు ఒప్పుకోవాలి అని అడిగాడంట. ఆ విధంగా డగ్లస్ కాళ్ళు నిలబడ్డాయి. ఈ అనుభవం అతను ప్రజారోగ్యం ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి కానీ ఎవరి దగ్గర డబ్బులెక్కువున్నాయి అన్న దానిమీద ఆధారపడకూడదు అనుకునేలా చేసిందని అంటారు. ఇంతకీ ఆ ఒక్క రాష్ట్రంలో ఆయన మొదలుపెట్టిన పద్ధతి తరువాత వేరే పార్టీ వాళ్ళు జాతీయ స్థాయికి తెచ్చి, కెనడాలో ఆ పద్ధతి స్థిరపడింది. ఎంతగా అంటే ఏ పార్టి అయినా దాన్ని తీసేయాలంటే ఇంక వాళ్ళకి ఓట్లు పడవు అనుకునేంతగా. అంటే ఈయనొక్కడే చేశాడు, మిగితా ఎవ్వరు చేయలేదని కాదు కానీ, ఈయన్నే ‘father of medicare’ గా తల్చుకుంటారు కెనడాలో.

పోస్టు మొదట్లో ప్రస్తావించిన పుస్తకంలో ఈయన గురించి రాసిన క్రింది వాక్యాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

అప్పట్నుంచే ఆయనంటే ఉన్న ఓ గౌరవం ఈ‌ఏడు హాస్పిటల్ అనుభవాల దెబ్బకి భక్తిగా మారిపోయింది. మాకు కృతజ్ఞతాభావం ఎక్కువైపోయి ఆయన పోస్టర్ ఒకటి (పోస్టు మొదట్లో ఉన్న బొమ్మ) కూడా ఇంట్లో పెట్టుకున్నాము 🙂 నేను చేయగలిగిన వాలంటీర్ పనులు చేసి ఈ హెల్త్ కేర్ సిస్టంకి తిరిగి ఇచ్చుకోడం కూడా ప్రారంభించాను (గత పోస్టులో కొంత ప్రస్తావించాను). నా మట్టుకు నాకు డగ్లస్ ప్రాతఃస్మరణీయుడు అయిపోయాడు. అక్టోబర్ 20 ఆయన జయంతి. ఆ సందర్భంగా ఈ పోస్టు రాసి నా గోడు వెళ్ళబోసుకోడం, ఆయనకి నివాళి అర్పించడం రెండూ ఒక్క దెబ్బకి చేస్తున్నాను.

ఈయన గురించిన విమర్శలు నేను చదవలేదు. వ్యాసాలూ అవీ చదివినంత మట్టుకు – దేశానికి ప్రతి తరానికీ ఇలాంటి గొప్ప నాయకుడొక్కడు ఉండాలని అనిపించింది. డగ్లస్ గురించి కెనడా లో వివిధ సందర్భాల్లో వచ్చిన వార్తలు, రేడియో/టీవీ క్లిప్పింగ్స్ వంటివి కొన్ని ఇక్కడ చూడవచ్చు. ఏదో గంభీరంగా ఉంటాడు అనుకున్నా కానీ మంచి హాస్య చతురత ఉన్న మనిషి కూడానూ!

డగ్లస్ గారూ మీరు ఏ లోకాన ఉన్నా ఇక్కడ నాబోటి వాళ్ళ మనసులో ఉన్నంత గొప్పగా అక్కడా ఉండిపోండంతే.

 

Published in: on October 20, 2019 at 3:38 am  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2019/10/20/tommy-douglas-20-october-1904-24-february-1986/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. ఇవాళ కెనడా కి సంభందిత ఇతిహాసం కాస్త తెలుసుకున్నాను,
    డగ్లస్ గారికి నివాళి అందించినందుకు ధన్యవాదాలు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: