సందర్భాన్ని బట్టి అర్థం – పూర్వపు భాషావేత్తల ఆలోచనలు

గత టపాలో ప్రస్తావించిన “Indian Theories of Meaning” పుస్తకాన్ని బట్టి ఒక పదానికి ఒక సందర్భంలో సరైన అర్థం తెలుసుకోవడం ఎలా? అన్న దానిగురించి అప్పటి భాషావేత్తల్లో, తత్వవేత్తల్లో చాలా చర్చ జరిగినట్లు తోస్తుంది. సందర్భాన్ని బట్టి అర్థం తెలుస్కోడానికి చూడవలసిన లక్షణాల గురించి రాశారు. వాటి గురించి క్లుప్తంగా నేను తెలుగులో రాసుకుంటున్న నోట్సు ఇది.

అ) సంసర్గ/సంయోగ – ప్రస్తుత వాక్యంలో ఒక పదం తాలూకా అర్థం అది దానికి వాక్యంలో గల మరో పదంతో ఉన్న సంయోగాన్ని (association) ని బట్టి నిర్థారించడం. “గురువు” అన్న పదానికి ఆంధ్రభారతిలో చూస్తే ఉపాధ్యాయుడు, బృహస్పతి, కాపాడువాడు, లఘువు కానిది, కులపెద్ద ఇలా పదిహేను దాకా అర్థాలున్నాయి. మన వాక్యంలో “దేవ గురువు” అని ఉంటే బృహస్పతి అని, “రెండు గురువులు” అంటే “లఘువు కానిది” అని అర్థం చేసుకోవడం అనిపించింది.

ఆ) విప్రయోగ: “కలం” అన్న పదానికి – లేఖిని, ఓడ, ఇరవై నాలుగు శేర్లు, పాత్ర, గండి, రేతస్సు అంటూ ఇన్ని అర్థాలున్నాయి ఇప్పుడే ఆంధ్రభారతి నిఘంటువు వల్ల తెలిసింది నాకు. కానీ మనబోటి ఆధునికులు వచ్చి “సిరా లేని కలం” అంటే “సిరా” అన్నది వీటిల్లో పెన్నుకి మాత్రమే సరిపోయే పదం కనుక, అది లేని కలం అంటే లేఖిని కావాలి అని నిర్థారించుకోవడం.

ఇ) సాహచర్య: పరస్పర సంయోగాన్ని బట్టి అర్థం చేసుకోవడం. రాముడంటే శ్రీరాముడు, బలరాముడు, పరశురాముడు – ఎవరైనా కావొచ్చు కానీ, సీతా రాములనో, రామ లక్ష్మణులనో రాసినపుడు శ్రీరాముడనే కదా! అయితే ఇది కూడా ఒకవిధమైన సంయోగమే కదా అనుకోవచ్చు కానీ, జగన్నాథుడనే పండితుడు ఈ విధంగా ద్వంద్వ సమాసం లాగా ఉంటే అది సాహచర్యమని భేదం చెప్పాడంట. (ఈయన తెలుగాయనంట. ఇప్పుడే వికీ ద్వారా తెలుసుకున్నా!)

ఈ) విరోధిత: కర్ణార్జునులు అంటే ఇక్కడ కర్ణుడికి అర్జునికి ఉన్న విరోధం అన్న సంబంధం కారణంగా ఇది కర్ణుడి విరోధి, పాండవ మధ్యముడైన అర్జునుడు కానీ, కృతవీర్యుడి కొడుకు కార్తవీర్యార్జునుడు కాదని అర్థం చేసుకోవచ్చు. దీనికి సాహచర్యానికి తేడా ఏమిటన్నది వాళ్ళు రాయలేదు కానీ, ఈ “విరోధం” అన్నదే అని నేను అనుకుంటున్నా. సంయోగం-విప్రయోగం మధ్య తేడా లాగానే.

పై నాల్గింటినీ “సహసంబంధం” (collocation) అన్న గుంపు కింద చేర్చవచ్చు.

ఉ) అర్థ: Purpose served అని రాశారు ఆంగ్లంలో. దీనికి నాకు సరైన ఉదాహరణ తట్టడం లేదు కనుక వాళ్ళదే వాడతా. “అంజలినా జుహోతి” అని (oblation with folded hands), అంజలినా సూర్యం ఉపతిష్ఠతే (worship sun with folded hands) అని రెండు వాక్యాలుంటే, రెంటిలో “అంజలి” అన్న పదానికి గల అర్థ భేదాన్ని వాళ్ళు చేస్తున్న పనిని బట్టి నిర్థారించడం.

ఊ) ప్రకరణ: ఆ పదం వచ్చిన వాక్యం ఏ సందర్భం లో ఉంది అన్నదాన్ని బట్టి. గాంధీ గురించి వాక్యం ఉంటే అది ఏ గాంధీ? అన్నది తెలియాలంటే అది ఏ వాక్యంలో, ఏ సందర్భంలో వచ్చిందో తెలియాలి కదా.

ఋ) లింగ: “indication from another place” అని రాశారు వివరణగా. నాకైతే ప్రకరణ లాగానే అనిపించింది. ఇప్పటిదాకా మొదటి ఐదూ వాక్యం పరిధిలో అర్థాన్ని గురించి చర్చిస్తూంటే ఈ రెండూ వాక్యం పరిధి దాటి చుట్టుపక్కల వాక్యాల్లోని సమాచారాన్ని బట్టి పదార్థాన్ని నిర్ణయించడాన్ని గురించి చెబుతున్నట్లు అనిపించింది (anaphora resolution గురించి రాసినట్లు తోచింది)

ౠ) శబ్దస్యానస్య సన్నిధి: “vicinity of another word” అన్నారు. collocation లాగానే అనిపించింది. చుట్టుపక్కల ఉన్న ఏదో పదం మూలాన ప్రస్తుత పదం తాలూకా నానార్థాలలో కొన్ని illogical అనిపించడం. అక్కడ ఇచ్చిన ఒక్క ఉదాహరణ మాత్రం కొంచెం తేడా ఉందని చెప్పింది. “కరేన రజతే నాగాః” అని వాక్యం. కర (చేయి, తొండం), నాగ (ఏనుగు, పాము) అని రెండు పదాలకీ నానార్థాలున్నా, ప్రతి పదం రెండో పదం తాలూకా అర్థాన్ని నియంత్రిస్తుంది అంటారు.

ఎ) సామర్థ్య: “కోకిల మధువు మత్తులో ఉంది” అన్న వాక్యంలో మధువు కి అర్థం కావాలంటే, ఆంధ్ర భారతి ప్రకారం పాలకూర మొదలుకుని పూదేనె దాకా నానార్థాలు ఉన్నాయి కానీ, కోకిలని మత్తుకు గురిచేయగలిన సామర్థం కలది వసంత ఋతువు కనుక ఇక్కడ అదే సరైన అర్థం అని నిర్థారించడం.

ఏ) ఔచితి: ఒక సందర్భానికి సరిగ్గా తోచే అర్థం. పైవన్నీ కూడా దానికోసమే కదా అనిపించింది కానీ అలంకార ప్రయోగాలు చేస్తున్నప్పటి వాక్యాల గురించి అనుకుంటున్నాను ప్రస్తుతానికి.

ఐ) దేశ: సంఘటన జరుగుతున్న స్థలాన్ని బట్టి అర్థం నిర్థారించడం.

ఒ) కాల: అలాగే, కాలాన్ని బట్టి.

ఓ) వ్యక్తి: లింగ భేదాన్ని బట్టి అర్థం గ్రహించడం.

ఔ) స్వర: ఉచ్ఛారణ బట్టి అర్థంలో తేడాలు గ్రహించడం.

మొత్తానికైతే నేను ఇదంతా చదివి వీటిని మూడు భాగాలుగా వర్గీకరించుకున్నా:
– వాక్యంలోని ఇతర పదాలతో సహసంబంధం (అ, ఆ, ఇ, ఈ, ౠ, ఎ, ఏ)
– పదం వాడిన broader context (ఉ, ఊ, ఋ, ఐ, ఒ)
– ఇతర పదాలతో సంబంధం లేకుండా పదం లోనే inflection వల్లనో, ఉచ్ఛారణ వల్లనో తెలుసుకోవడం (ఓ, ఔ)

పుస్తకంలో ఆయన కూడా మూడు వర్గాలు చేశాడు.
– grammatical means such as gender, part of speech, flectional endings
– verbal context
– non-verbal, situational context
(నేను వెర్బల్-నాన్ వెర్బల్ అని కాక ఒక వాక్యం, పలు వాక్యాలు అని విభజించుకుని, వెర్బల్-నాన్ వెర్బల్ కలిపేశానన్నమాట).

మొత్తానికి పెద్ద లిస్టే.

మతిలాల్ గారి పుస్తకంలో వీటి గురించి ఇదివరలో చదివా కానీ, ఐదేళ్ళ నాటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఈ అంశాల మీద ఎక్కువ అవగాహన ఉన్నందువల్ల కొంచెం స్పష్టత వచ్చింది ఆలోచన. మళ్ళీ ఓసారి ఆ పుస్తకం చదవాలి.

Advertisements
Published in: on July 28, 2017 at 12:08 am  Comments (3)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2017/07/28/contextual-factors/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

 1. మంచి పరిశీలన.

 2. సంసర్గ/సంయోగ – రెండు వస్తువుల మధ్య, లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య, లేదా వస్తువు వక్తి మధ్యనుండే ప్రసిద్ధమైన సంబంధం. ఇక్కడ “దేవ గురువు” అనడంలో ఇద్దరు వ్యక్తులు లేరు. దీని అర్థం “దేవతల యొక్క గురువు” అని కాబట్టి ఇది “అన్యశబ్ద సంనిధి”/”శబ్దస్యానస్య సన్నిధి” అవుతుంది. అలాగే “రెండు గురువులు” అనేది “వ్యక్తి”కి ఉదాహరణ అవుతుంది. “రెండు” అనే పదం అప్రాణి వాచకం కాబట్టి అది ఛందస్సులో గురువుని సూచిస్తుంది (ఇద్దరు గురువులు అనప్పుడు ఉపాధ్యాయులు).
  “గురు లఘువులు” అనేది సంసర్గకి ఉదాహరణ – రెండు వస్తువుల మధ్య ప్రసిద్ధమైన సంబంధం.

  అర్థం – అర్థం అంటే ప్రయోజనం. “మోక్షం కోసం స్థాణువును సేవించు”. ఇక్కడ స్థాణువు అంటే శివుడు, రాయి, మోడైన చెట్టు అన్న అర్థాలలో, మోక్షమనే ప్రయోజనం శివుని సేవ వల్లనే కలుగుతుంది కనక స్థాణువు అంటే శివుడని అర్థం వస్తుంది.

  లింగం – ఒక వస్తువుని వేరే వస్తువులనుండి వేరు చేస్తూ ఆ వస్తువులో ఉండే ఒక ధర్మం (characteristic). “చెట్టు కొమ్మన హరి కూర్చుని ఉంది”. హరి అంటే సింహం, కోతి అని రెండర్థాలున్నాయి (విష్ణువు కాకుండా). ఇక్కడ చెట్టుకొమ్మన కూర్చొనే characteristic కోతికి మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ దాని అర్థం కోతి అనే వస్తుంది.

  శబ్దస్యానస్య సన్నిధి – కరేన రాజతే నాగాః. రెండు పదాలకీ నానార్థాలున్నా పరస్పర సంబంధం వలన ఇక్కడ “నాగ” అంటే ఏనుగని “కర” శబ్దం నియంత్రిస్తోంది, “కర” అంటే “తొండం” అని “నాగ” శబ్దం నియంత్రిస్తోంది. మొత్తానికి దీని అర్థం తొండంతో ప్రకాశిస్తున్న ఏనుగు అనే అర్థం ఇస్తోంది. అయితే రెండు పదాలకూ రెండర్థాలు ఎప్పుడూ ఉండాలని లేదు. “సూర్యవంశపు రాజు” అన్నప్పుడు “సూర్యవంశ” పదం, రాజు అంటే చంద్రుడు కాక పరిపాలించేవాడు అనే అర్థాన్ని నియంత్రిస్తోంది.

  ఔచితి – దీనికీ తక్కినవాటికీ బహుశా తేడా ఏమిటంటే, తక్కినవి కచ్చితంగా illogical అర్థాన్ని కొట్టేస్తాయి. రెండర్థాల్లో ఏ ఒక్కటీ illogical కాకపోయినా, రెండిట్లో ఒకటి ఎక్కువ appropriate అయినదాన్ని తీసుకోవడం ఔచితి అవుతుంది.

  స్వరం అర్థాన్ని నిర్ణయించే సందర్భాలు బహుశా తెలుగులో ఉండవేమో. ఉచ్చారణ బట్టి అనుకొన్నా “మా, రేడు” (మా రాజు) “మారేడు” (మారేడు ఆకు) వంటివి వేర్వేరు పదాలు అయిపోతాయి, ఒకే పదానికి వేర్వేరు అర్థాలు కాకూండా. అంచేత అలాంటివి ఈ కేటగిరీకి చెందవు. కాకువు (వెటకారం కోసం దీర్ఘం తియ్యడం లాంటిది) ఈ కేటగిరీలోకి వస్తుందా లేదా అనేదాని గురించి వాదాలు జరిగాయి. అది వాచ్యార్థం కిందకి రాదనీ చాలామంది అన్నారు.

  ఇవి కాక అభినయించి చూపడం వల్ల తెలిసే అర్థం. “ఇంతింతై వటు డింతయై” అనే పద్యంలో “ఇంత”, “ఇంత” అని ఎత్తు చూపిస్తే కానీ అది ఎంత ఎత్తు అని నిర్ణయించలేం.

  • Thanks for the detailed comment Kameswara Rao garu!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: