విచారణ (Visaranai) – తమిళ చిత్రం

“విసారణై” అన్న తమిళ సినిమా గురించి పోయినేడాది చివర్లో మొదటిసారి విన్నాను. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏదో అవార్డు వచ్చిందని. తరువాత ఈ ఏడాది రిలీజు అయినపుడు మళ్ళీ విన్నాను. సీరియస్ సినిమాలూ అవీ చూసి తట్టుకోగలిగే మూడ్ ఉన్నప్పుడు చూద్దామని వాయిదా వేస్తూ ఇన్నాళ్ళకి ఇప్పుడు చూశాను. అంతే…సినిమా అయ్యాక కూడా అలా స్క్రీన్ వంక చూస్తూనే ఉన్నాను కాసేపు షాక్ లో. నాకు గొప్పగా అనిపించిన సినిమా కనుక ఏదో నాలుగు ముక్కలు రాసుకుందామని ఇలా వచ్చాను.

సినిమా కథ క్లుప్తంగా: తమిళనాటి నుండి వచ్చి గుంటూరులో ఓ పార్కులో ఉంటూ చిన్నా చితకా పనులు చేసుకుంటున్న నలుగురు యువకులని అనుకోకుండా ఓరోజు ఉదయాన్నే పోలీసులు పట్టుకెళ్ళడంతో కథ మొదలవుతుంది. అక్కడ వాళ్ళని ఏదో చేయని నేరం గురించి ఒప్పించాలి పోలీసులు…ఎందుకంటే ఆ కేసు మూసేయాలని పైన్నుంచి ఒత్తిడి, దొంగలు దొరకలేదు. దొంగలు తమిళులు అన్న క్లూ ఉంది కనుక వీళ్ళని వేసేసారు. భాష రానందువల్ల వీళ్ళూ ఏం అడిగేదీ అర్థం కాక ఏదో చెప్పి ఇరుక్కుపోయారు. పోలీసులు నానా హింసా పెట్టి లాస్టుకి వీళ్ళ చేత నేరం ఒప్పించి కోర్టుకి పట్టుకెళ్తారు. అయితే, కోర్టులో వీళ్ళు జరిగిందిదీ అని చెప్పేసరికి ఓ తమిళ పోలీసాయన సహాయంతో అర్థం చేసుకున్న జడ్జి వీళ్ళని విడిచిపెట్టేస్తాడు. అయితే, ఆంధ్ర పోలీసుల నుంచి అదృష్టవశాత్తూ తప్పించుకున్న వీళ్ళు తమిళనాడు పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఇరుక్కుంటారు. అక్కడ మతలబులు వేరే. చివ్వరికి వాళ్ళు పోలీసుల నుంచి బైటపడ్డారా లేదా? అన్నది మిగితా సగం సినిమా.

సినిమాలో చాలా హింస ఉంది. చాలా వేదన ఉంది. అయితే, చాలా ఇతర సినిమాల్లోలా అదేదో stylized violence కాదు. హీరోయిజం కోసమో, విలన్ కౄరత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకో, బడ్జెట్ ఉంది కదా అని చూపెట్టుకోడానికో ఉన్న హింస కాదు. దీనిలోని హింస కథలో భాగంగా , కథానుగుణంగా ఉన్నది. అసలు సాధారణంగా ఇతర సినిమాల్లో విపరీతం, అనవసరం అనిపించే తరహా హింసాత్మక సన్నివేశాలు ఈ సినిమాలోని పరిస్థితుల మధ్య out of place అనో, అనవసరం అనో అనిపించలేదు. నేపథ్య సంగీతం, ఆ పోలీస్ స్టేషన్, కోర్టు, సెట్ల డిజైన్, పోలీసుల దెబ్బలు, బాధితుల స్పందనలు, ఖైదీల సంభాషణలు – అన్నీ చాలా సహజంగా అనిపించాయి. అలాగని చూసి తట్టుకోగలమా? అంటే జవాబు చెప్పడం కష్టం. సినిమా చూసి తరువాత ప్రశాంతంగా పని చేసుకోవాలంటే కొంచెం గుండె ధైర్యం కావాలి అని నా అభిప్రాయం.

పోలీసు పాత్రలు కొన్ని, వాళ్ళ ఆలోచనావిధానం, నన్ను భయపెట్టేశాయి. పోలీసు పాత్రల్లో సముతిరఖని పాత్ర చిత్రణ గొప్పగా అనిపించింది నాకు. అయితే, అందరికంటే ఆకట్టుకున్నది ఆ నలుగురు తమిళ వర్కర్లలో పాండిగా వేసిన దినేశ్. నిజంగా అతను ఆ అరెస్టయిన మనిషే అనిపించేలా ఉండింది. సినిమాకి వీళ్ళంతా పెద్ద అసెట్. కథ చాలా ఉత్కంఠభరితంగా రాశారు. పొరలుపొరలుగా ఏదో ఒకటి కొత్త ట్విస్టు వస్తూనే ఉంటుంది చివరిదాకా. అందువల్లనే అవార్డు తరహా సినిమానే అయినప్పటికీ ఇతర కమర్షియల్ సినిమాల్లాగే థ్రిల్లర్ లా కూడా అనిపించింది నాకు. ముఖ్యంగా ఆ చివర్లో క్లైమాక్స్ సీన్లు – అసలేం చేస్తారో లాస్టుకి అని టెన్షన్తో చూశాను నేను. క్లైమాక్సు ఏ పోలీస్ స్టేషన్ లోనో, అడవిలోనో, మరే అటువంటి ప్రదేశంలో కాక, మామూలు మనుషులు తిరిగే రెసిడెన్షియల్ ఏరియాలో జరుగుతుంది. సీను అయాక చివ్వర్లో వచ్చే నేపథ్య సంభాషణ కూడా ఇంకా ఏదో కొత్త విషయం తెస్తూనే ఉండింది కథలోకి. బాధ, నిస్సహాయత, అధికారం, మోసం, అమాయకత్వం – ఇలా ఇన్ని విషయాలూ చాంతాడంత డైలాగులు లేకుండానే సినిమాలో వివరంగా చెప్పారు, చూపించారు. మొత్తానికి పోలీసుల సమక్షంలో అమాయక పేద ప్రజల (ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చినవారి) vulnerability ఈ సినిమా డాక్యుమెంటరీ లాగా కాక, సినిమాగానే ఉంటూ ఎత్తి చూపింది. ఆర్టు సినిమా మామూలు నాన్-మేధావి జనం కోసం తీయగలరా? అంటే, తీయగలరు – ఇలాగ – అనిపించింది నాకు.

ఇంతకీ సినిమా వెనుక కథ: ఇది నిజానికి కొయింబత్తూరుకు చెందిన చంద్రకుమార్ అనే ఒక ఆటోడ్రైవర్ రాసిన నవల ఆధారంగా అల్లిన కథ. చంద్రకుమార్ అంతకుముందు చాలా ఏళ్ళ క్రితం గుంటూరు జిల్లాకి ఏదో పనిచేసుకోడానికి వెళ్ళాడట. అప్పుడు ఏదో కారణం తెలియని కేసులో పోలీసులు అతన్ని, అతని స్నేహితులని ఇరికించి వేధించారట. ఆ అనుభవాల ఆధారంగా అతను రాసిన నవల అది. ఆటోడ్రైవర్ తను రాసిన నవలలని ప్రచురించగలగడం, అవి సినిమాగా రావడం – అంతా తెలుసుకుంటూంటే ఆశ్చర్యంగా అనిపించింది. చంద్రకుమార్ గురించి, అతని రచనల గురించి హిందూ పత్రిక వ్యాసం ఇక్కడ.

ఈ సినిమాని తీసిన దర్శకుడు వెట్రిమారన్, పధాన పాత్రలు ధరించిన నటీనటులు (నాకు తెలిసినది సముతిర ఖని ఒక్కడే, కానీ ప్రధాన పాత్రధారులు అందరూ), నిర్మాత ధనుష్ – అందరూ అభినందనీయులు. ఇప్పుడిక ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలన్న దుర్బుద్ధి ఎవ్వరికీ పుట్టకూడదని మనసారా (ఆందోళనతో) కోరుకుంటున్నాను.

సినిమా చూశాక అంతర్జాలంలో ఒకట్రెండు సమీక్షలు చూశాను. భరద్వాజ్ రంగన్ వ్యాసం నాకు నచ్చింది.

Advertisements
Published in: on July 4, 2016 at 1:05 am  Comments (13)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2016/07/04/visaranai/trackback/

RSS feed for comments on this post.

13 CommentsLeave a comment

 1. సౌమ్య గారూ,
  నమస్తే,
  చాలా కాలం తర్వాత మీ బ్లాగు చూస్తున్నాను. నా చందమామలు బ్లాగ్ లోకి వెళ్లి దాంట్లోంచి మీ బ్లాగ్ కు వచ్చాను. విశారణై అనే ఆ తమిళ సినిమా గురించి మొన్ననే అంటే ఆదివారం రోజున నేను, శోభా గుర్తు చేసుకున్నాము. కాకతాళీయంగా మీరు రాసిన పరిచయాన్ని ఇప్పుడే చూస్తున్నాను.

  “ఇప్పుడిక ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలన్న దుర్బుద్ధి ఎవ్వరికీ పుట్టకూడదని మనసారా (ఆందోళనతో) కోరుకుంటున్నాను.”

  మీ పరిచయ వ్యాసం మొత్తంమీద ఆణిముత్యం లాంటి వాక్యం ఇది.మీరు ఆందోళన పడవద్దు లెండి. తెలుగులో ఇలాంటి సినిమాలు ఎవరూ తీయరు. క్షణం లాంటి సినిమాల వరకు మాత్రమే మనవాళ్లు సమీపించగలిగారు.

  ప్రపంచంలోని ఏ భాషా సినిమాల్లోనూ లేనంతటి నీచ, నికృష్ట, దుర్మార్గ హీరోయిజం మన తెలుగు సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి మీరు ఆ విషయంలో ఏమాత్రం ఆందోళన పెట్టుకోవలసిన అవసరం లేదు.

  మీకు నాచురల్ లాంగ్వేజెస్ గురించి నాలుగేళ్ల క్రితం మీ బ్లాగులోనే రాసినవి చదివాను. వాటిని కంటిన్యూ చేస్తున్నారా? ఎందుకంటే నేను కూడా ఎస్వీ యూనివర్శిటీలో ముప్పై ఏళ్ల క్రితం మోడ్రన్ లింగ్విస్టిక్స్ లో డిప్లొమా చేశాను. ఎంఏ తెలుగులో సెకండియర్ లింగ్విస్టిక్స్ పై స్పెషల్ సబ్బెక్ట్ ఉండేది. ఆ తర్వాత భాషపై వచ్చే ఏ రచనపై అయినా సరే ఆసక్తి కలగడానికి అదే పునాది అయింది.

  యూనివర్సిటీ అనంతర జీవితంలో శ్రీకాకుళం అడవుల్లో పనిమీద తిరిగినప్పుడు అక్కడి సవర గిరిజనులు మూలద్రావిడ భాషలోని మూల పదాలను వాడుతుంటడం చూసి ఆశ్చర్య పోయాను. భాషా శాస్త్రమే తెలియకపోతే గిరిజనుల్లో నిక్షిప్తమై ఉన్న మూలద్రావిడ పదాల గురించి ఆ సందర్భంలో తెలిసేదే కాదు.

  ఏదేమైనా మీ బ్లాగు మళ్లీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది..

  నేను మూడేళ్ల క్రితం చందమామనుంచి తప్పుకుని ప్రస్తుతం హైదరాబాద్‌లో సాక్షి వార్తాపత్రికలో పనిచేస్తున్నాను. మీరు ఢిల్లీలోనే ఉన్నారా లేక స్థలం మారారా?

  నా ఈమెయిల్ ఐడీ ఇది
  krajasekhara@gmail.com

  మంచి విషయాలు, మంచి రచనలు, సినిమాలు మీ దృష్టికి వచ్చినప్పుడు వీలైతే నాకు ఆ లింక్ పంపగలరు.

  ధన్యవాదాలతో
  రాజశేఖర రాజు

 2. సౌమ్య గారూ,
  నమస్తే,
  చాలా కాలం తర్వాత మీ బ్లాగు చూస్తున్నాను. నా చందమామలు బ్లాగ్ లోకి వెళ్లి దాంట్లోంచి మీ బ్లాగ్ కు వచ్చాను. విశారణై అనే ఆ తమిళ సినిమా గురించి మొన్ననే

  అంటే ఆదివారం రోజున నేను, శోభా గుర్తు చేసుకున్నాము. కాకతాళీయంగా మీరు రాసిన పరిచయాన్ని ఇప్పుడే చూస్తున్నాను.

  “ఇప్పుడిక ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలన్న దుర్బుద్ధి ఎవ్వరికీ పుట్టకూడదని మనసారా (ఆందోళనతో) కోరుకుంటున్నాను.”

  మీ పరిచయ వ్యాసం మొత్తంమీద ఆణిముత్యం లాంటి వాక్యం ఇది.మీరు ఆందోళన పడవద్దు లెండి. తెలుగులో ఇలాంటి సినిమాలు ఎవరూ తీయరు. క్షణం లాంటి

  సినిమాల వరకు మాత్రమే మనవాళ్లు సమీపించగలిగారు.

  ప్రపంచంలోని ఏ భాషా సినిమాల్లోనూ లేనంతటి నీచ, నికృష్ట, దుర్మార్గ హీరోయిజం మన తెలుగు సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి మీరు ఆ విషయంలో

  ఏమాత్రం ఆందోళన పెట్టుకోవలసిన అవసరం లేదు.

  మీకు నాచురల్ లాంగ్వేజెస్ గురించి నాలుగేళ్ల క్రితం మీ బ్లాగులోనే రాసినవి చదివాను. వాటిని కంటిన్యూ చేస్తున్నారా? ఎందుకంటే నేను కూడా ఎస్వీ

  యూనివర్శిటీలో ముప్పై ఏళ్ల క్రితం మోడ్రన్ లింగ్విస్టిక్స్ లో డిప్లొమా చేశాను. ఎంఏ తెలుగులో సెకండియర్ లింగ్విస్టిక్స్ పై స్పెషల్ సబ్బెక్ట్ ఉండేది. ఆ తర్వాత భాషపై

  వచ్చే ఏ రచనపై అయినా సరే ఆసక్తి కలగడానికి అదే పునాది అయింది.

  యూనివర్సిటీ అనంతర జీవితంలో శ్రీకాకుళం అడవుల్లో పనిమీద తిరిగినప్పుడు అక్కడి సవర గిరిజనులు మూలద్రావిడ భాషలోని మూల పదాలను వాడుతుంటడం

  చూసి ఆశ్చర్య పోయాను. భాషా శాస్త్రమే తెలియకపోతే గిరిజనుల్లో నిక్షిప్తమై ఉన్న మూలద్రావిడ పదాల గురించి ఆ సందర్భంలో తెలిసేదే కాదు.

  ఏదేమైనా మీ బ్లాగు మళ్లీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది..

  నేను మూడేళ్ల క్రితం చందమామనుంచి తప్పుకుని ప్రస్తుతం హైదరాబాద్‌లో సాక్షి వార్తాపత్రికలో పనిచేస్తున్నాను. మీరు ఢిల్లీలోనే ఉన్నారా లేక స్థలం మారారా?

  నా ఈమెయిల్ ఐడీ ఇది
  krajasekhara@gmail.com

  మంచి విషయాలు, మంచి రచనలు, సినిమాలు మీ దృష్టికి వచ్చినప్పుడు వీలైతే నాకు ఆ లింక్ పంపగలరు.

  ధన్యవాదాలతో
  రాజశేఖర రాజు

  • రాజశేఖరరాజు గారికి,
   వ్యాసం చదివి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. చాలారోజులైంది మీ చందమామ బ్లాగు చూసి.. అయితే సాక్షిలోకి మారాక బ్లాగు రాస్తున్నట్లు లేరు? నేచురల్ లాంగ్వేజెస్ – అవునండి, ఇంకా ఆ ఫీల్డ్ లోనే ఉన్నాను. ఢిల్లీ విషయం – నేనసలెప్పుడూ ఆ ఊళ్ళో లేను. మీరు మరొక సౌమ్య గారితో కన్ఫ్యూజ్ అయినట్లు ఉన్నారు 🙂

 3. మీరన్నట్లు అర్ధంపర్ధం లేని హీరోయిజం, ఫిజిక్స్ సూత్రాలకి కూడా బోధపడని సాహసాలతో ఫైట్లతో హీరోయిజం చూపించడంలో మన సినిమాలు చెయ్యితిరిగిన వారు. దీనికి భాషాబేధం కూడా లేదండి. ఈ కాలంలో చాలా భారతీయ భాషల సినిమాలు ఇదే మూస. కానీ పోలీస్ జులుం మీద అడపా దడపా మంచి సినిమాలు వచ్చాయండి. ఉదాహరణకి రేవతి నటించిన “అంకురం” సినిమా. డబ్బింగులకొస్తే 1990 దశకపు “కాలాపాని” సినిమా (మొదట మలయాళంలో తీశారు, తర్వాత చాలా భాషల్లోకి – రీమేక్ కాదుగాని – డబ్బింగ్ చేశారు) police brutality మీద ఫోకస్ చేసినవే. అలాగే “విశారణై” కూడా డబ్బింగ్ చేస్తే ఫరవాలేదు; రీమేక్ చేస్తాం అంటేనే మీరన్నట్లు భయపడాల్సొస్తుందేమో.

  • అవునండి, హీరోయిజానికి భాషా భేదం ఏముంది? తెలుగు-తమిళ-హిందీ-ఇంగ్లీషు : నేను ఎక్కువగా చూసేవి ఈ భాషల సినిమాలు (ఆ ఆర్డర్ లో).. అన్నింటిలోనూ ఏ భౌతిక సూత్రాలకీ అందని హీరోయిజం ఉంది. ఎటొచ్చీ, ఇతరుల సినిమా రంగంలో ఆ ఫార్ములాలో లేని సినిమాలు కూడా తరుచుగా వస్తూంటాయి. తెలుగులో ఎప్పుడో కాని రావు. నాక్కూడా డబ్బింగ్ పరవాలేదు. రీమేకే సమస్య. కానీ, డబ్బింగ్ చేస్తే మళ్ళీ రివ్యూల వాళ్ళు తమిళ వాసనలు ఉన్నాయి, బెంగాలీ వాసనలు ఉన్నాయి అని రాస్తారు. తమిళ సినిమా డబ్ చేస్తే తమిళ వాసనలు ఉండక కోస్తా సంప్రదాయాలు కనిపిస్తాయా ఏమిటి? 🙂

 4. 😀 కనిపించవు.

 5. రాజ శేఖర రాజు గారికి,

  మీ భాషా వ్యవసాయం కుతూహలం రేకెత్తిస్తోంది !

  ముఖ్యం గా మూల ద్రావిడ లోని మూల పదాలు అన్న మాటలు

  మీ కేమైనా మీ ప్రయాణాలలో దేముడు అన్న పదం తటస్థించిందా ? గమనించా రా ?

  మీ అభిప్రాయాలు తెలియ జేయ గలరు .

  జిలేబి

  • జిలేబి గారికి,
   మళ్లీ బ్లాగులో కలుకుకున్నందుకు సంతోషం. మూల పదాలు అంటే ఒరిజినల్ పదాలు అనే అర్థం. ఆ పదం మరో అర్థాన్ని ఇవ్వలేదు కదా..భాషా శాస్త్రంలో ఇది వాడుకలో ఉన్న పదమే.

   నా ప్రయాణాల్లో గత పాతికేళ్లుగా దేముడు పదం తగులుతూనే ఉంది. ఇందుగలడందులేడని సందేహము వలదు అంటూ దైవ పాదాక్రాంతమైన దేశం కదా మనది. ఆ పదం తగలకపోవడమా?

   కాకపోతే దేముడు పదం కనిపించింది కాని దేముడు మాత్రం సినిమాల్లా రాముడు, కృష్ణుడులా మనుషుల్లా తప్ప భౌౌతికంగా నాకు ఎన్నడూ కనిపించలేదు.

   అలా ఇకముందు కూడా కనిపించడని నా భావన.

   మీ బ్లాగు కూడా ఇప్పుడే చూశాను. జనవరిలో కొత్త బ్లాగ్ అగ్రిగేటర్ వస్తోందని ప్రకటించారు. ఎప్పుడొస్తుందో చెబుతారా? వచ్చినా మనిషి తప్ప దేవుడు లేడు అనే మాలాంటి వారికి దాంట్లో చోటు కల్పిస్తారా?

 6. సౌమ్య గారికి,
  గత ముూడు రోజులుగా పర్వత భారం పని మోయడంతో ఇటు రాలేకపోయాను. మీ వ్యాఖ్య చూశాను కానీి స్పందించలేకపోయాను. ఇవ్వాళ్టికి కుదిరింది.

  ముందుగా మీరన్న నా కన్ఫ్యూజన్ గురించి.

  మీ పేరుతోటే గతంలో ఢిల్లీలో ఉంటూ భూకంపం అనుభూతికి గురైన సౌమ్యగారి స్పందనను ఆ రోజుల్లోనే టపా రూపంలోనే చూశానండీ. మీరేననుకున్నాను. నవతరంగం సౌమ్య మీరని తెలుసు. మహానటి సావిత్రికి వీరతాడు వేస్తూ, ఆమె నటనపై ఒక ఉద్వేగపూరితమైన టపా కూడా మీపేరుతోటే వచ్చిన మరో బ్లాగులో చదివాను. అది మీదో మరొక సౌమ్యగారిదో అంత స్పష్టత రావడం లేదు.

  2012 చివర్లో హైదరాబాద్ షిప్ట్ అయ్యాక ప్రింట్ మీడియాలో పని కావడంతో బ్లాగ్ రాయడం బాగా తగ్గిందండి. అప్పుడప్పుడు బ్లాగ్ లను చూడటం తప్పితే రాయడం లేదు. కానీ నా మరొక బ్లాగులో 2015 నుంచి వీలు కుదిరినప్పుడల్లా రాస్తున్నాను.

  నా మరో బ్లాగ్ ‘నెలవంక’
  http://kanthisena.blogspot.in/

  ఇది కూడా గత మూడునెలలుగా నిద్రపోతోంది లెండి.

  ఇది చందమామ బ్లాగుకు పూర్తి భిన్నమైన రెబెల్ బ్లాగ్ లెండి. నా ఈ బ్లాగు చూస్తే చాలామంది భయపడతారు లేదా బండబూతులకు దిగుతారు. అయినా ఎన్టీ రామారావు ఊతపదాన్ని గుర్తు తెచ్చుకుని ‘ఏం ఫర్వాలేదు’ అంటూ దులుపేసుకుని నాకు నచ్చింది రాసుకుంటూ పోవడమే.

  ఇకపోతే.. హీరోయిజానికి భాషాభేదం లేదన్నది నిజమే. మరోక వ్యాఖ్యాత ప్రస్తావించిన అంకురం, కాలాపానీ వంటి సినిమాలు కానీ విశారణై వంటివి కాని పూర్తిగా దర్శకుల సినిమాలే కదా. వాటిలో హీరోలు కనపడరు. పాత్రలు మాత్రమే చూస్తుంటాం. దౌర్భాగ్యపు హీరోలు కనిపించకుండా పాత్ర మాత్రమే కనబడిందంటే అలాంటి సినిమా హీరో… దర్శకుడు లేదా కథే అయి ఉండాలి.

  సిినిమా అనే ఒక మహత్తరమైన సాంకేతిక ఆవిష్కరణ తెలుగులో ఇప్పటికీ ఫ్యూడల్ వాసనలతో నడుస్తోంది కాబట్టే భౌతిక సూత్రాలకు భిన్నంగా మన హీరోలు నేల విడిచి గాల్లో ఎగుర్తుంటారు. (రోబో సినిమాలో రజనీకాంత్ అలా రైలుకు అడ్డంగా కరుచుకుని పరిగెత్తుతుంటే నవ్వయినా వస్తుంది. కానీ మన వాళ్ల ఫైటింగులు, వారి వికారాలు చూస్తే ఢోకు మాత్రమే వస్తుంది). హరి పురుషోత్తమరావు గారు, సురాగారు (ఇద్దరూ ఇప్పుడు లేరు) తెలుగు సినిమాల్లోని ఈ ఫ్యూడల్ వాసనలను 30 ఏళ్ల క్రితమే అంటకాగిన విషయం మీకు తెలుసనుకుంటాను.

  ‘కాకా ముట్టై’ అనే మరో తమిళ సినిమా కూడా మీరు చూశారనుకుంటాను. జీవితంలో ఒక్కసారయినా పిజ్జా తినాలంటూ ఇద్దరు పేద పిల్లలు పడ్డ తపన ఎంత చక్కగా చూపించారో.. ఆ సినిమాలోనూ బోలెడు సినిమాటిక్ దృశ్యాలు ఉన్నా, నాటకీయత పాలు ఎక్కువగానే ఉన్నా.. మన దేశంలో దారిద్ర్యం ఇంత భయానకంగా ఉంటోందా అనే చేదు వాస్తవాన్ని ఆద్యంతం ఆ సినిమా చూపించింది కదా.

  ప్రేక్షకులను నవ్విస్తూనే ప్రపంచాన్ని ఏడ్పించే పంథా చార్లీ చాప్లిన్ పంథా. కాకా ముట్టై సినిమా కూడా అలాంటి ఉద్వేగాన్నే కలిగిస్తుంది.

  మీ ఈ టపాలో నా ఒకే రకం వ్యాఖ్య పునరుక్తి అయింది. వీలయింతే రెండోదాన్ని తొలగించండి.

 7. రాజ శేఖర రాజు గారికి,

  నెనర్లు ; మీ మూల పదాలు సరియైన అర్థాన్నే ఇచ్చింది !

  దేముడు పదం మీకు తటస్థ పడినందుకు ఆనందం !

  ఈ దేముడు అన్న పదం ఎట్లా వచ్చి ఉంటుందో మీకు ఏమైనా ఎప్పుడైనా అనిపించిం దా ?

  వీలైతే నా బ్లాగు టపా లో దేముడు బాబాయ్ అన్న టపా చూడ గలరు (కాంటెక్స్ట్) కోసం ; మీ పూర్తీ నిడివి కామింట్ దేముడు అన్న పదం ఎట్లా వచ్చి ఉండ వచ్చో అన్న దాని మీద ఇవ్వవచ్చు ;

  ౨- అగ్రిగేటర్ జిలేబి వదన (ఇది తూచ్ అగ్రిగేటర్ 🙂 ఒక పెర్సనల్ లిస్టింగ్ మాత్రమే ; ఎప్పుడై నా అగ్రిగేటర్ లు మొరాయిస్తే దాని ద్వారా బ్లాగుల్ని సందర్శించ వచ్చు 🙂 (నాకు తెలిసిన లింకు లు అందులో ఉన్నాయి )

  ఈ జిలేబి వదన అగ్రిగేటర్ లింక్ కూడా నా బ్లాగు వరూధిని లో ఉంది

  చీర్స్
  జిలేబి

 8. రాజ శేఖర రాజు గారికి,

  మీ బ్లాగు కాంతిసేన (నెలవంక) జిలేబి వదన అగ్రిగేటర్ లో కలుపు బడింది . జిలేబి వదన సెక్యులార్ నాన్ థీయిస్ట్ నాన్ ఎథీయిస్ట్ లిస్టింగ్ 🙂 జేకే !

  Aggregator link

  http://www.zilebivadana.blogspot.com

  మీరు కొత్త టపా వేస్తే కనిపిస్తుంది

  చీర్స్
  జిలేబి

  • ;చాలా సంతోషమండీ.. తప్పకుండా కొత్త టపా రాస్తాను. ఇంత త్వరగా స్పందించి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.

 9. టపాకు సంబందం లేని విషయం…
  మీ బ్లాగులో బోలెడు పోస్టులు ఉన్నాయి కదా అవన్నీ వెతకాలంటే కష్టం … ఆ టపాలన్నీ ఒక చోట లిస్టుగా ఉంటే బావుంటుంది కదా …

  మీకు తెలిసే ఉంటుంది…
  [archives] షార్ట్ కోడ్ గురించి. దాన్న్ని మీరు text విడ్జెటులో పెట్టి సైడ్ బారులో పడేసారంటే మీ బ్లాగు చూసే వాల్లకి ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా ఇది మీలా ఎప్పటినుండో బోలెడు పోస్టులు రాస్తున్న వారికి ఉపయోగపడుతుంది.. చదివే పాఠకులకు ఉపయోగ్పడుతుంది.. ఈజీగా నావిగేషన్ కోసం…

  మరింత సమాచారం కోసం …
  https://en.support.wordpress.com/archives-shortcode/

  మీరు ఇది వరకే దీన్ని ట్రై చేసి.. వద్దనుకుని ఉంటే సరే.. లేకపోతే ఒక సారి ట్రై చేయండి. నా బ్లాగులో నేను ఆల్రెడీ పెట్టాను. అది ఎలా ఉంటుందో చూడాలనుకుంటే చూడొచ్చు…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: